అద్దం ఏమి వెల్లడిస్తుంది?
అద్దంలో చూడండి. మీరేం చూస్తారు? అద్దంలో చూడటం కొన్నిసార్లు మీ రూపంలో కలవరపర్చే దోషాన్ని వెల్లడిచేస్తుంది, మీరు దానిని ఇతరులు చూడకముందే సరిదిద్దుకోవడానికి ఇష్టపడతారు.
బైబిలు చాలామట్టుకు అద్దంవంటిదే. మనల్నిమనం యథార్థంగా చూసుకోవడానికది మనకు సహాయం చేయగలదు, ఇది దేవుని దృష్టిలో మన విలువనుగూర్చి మరీ ఉన్నతంగా—లేదా మరీ హీనంగా—తలంచకుండా అడ్డుకుంటుంది. (మత్తయి 10:29-31; రోమీయులు 12:3) అదనంగా, బైబిలు మనం సరిదిద్దుకోవల్సిన మన మాటల్లోని, క్రియల్లోని లేదా దృక్పథంలోని దోషాలను వెల్లడించగలదు. ఇదే జరిగినప్పుడు, ఆ అద్దం వెల్లడిచేసే వాటిని మీరు పెడచెవినబెడతారా?
బైబిలు రచయిత యాకోబు ఇలా వ్రాస్తున్నాడు: “ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా.”—యాకోబు 1:23, 24.
దీనికి భిన్నముగా, యాకోబు “స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండు” మరోవ్యక్తిని వర్ణిస్తున్నాడు. (యాకోబు 1:25) “తేరిచూచు” అని తర్జుమా చేయబడిన గ్రీకు పదానికి చూచేందుకు ప్రక్కకు వంగుట లేదా ముందుకు వంగుట అని అర్థము. “దీనిలో అలావెళుతూ చూడటంకంటే మరెంతో ఇమిడివుందని” థియోలాజికల్ డిక్షనరీ ఆఫ్ ది న్యూ టెస్ట్‌మెంట్ చెబుతోంది. దాచిపెట్టబడిన దానికై జాగ్రత్తగా అన్వేషించుట అనే భావం ఈ పదానికుంది. “చూచేవ్యక్తి చూసినవెంటనే దానిభావం గ్రహించుటకు కష్టమైనా, అతడు చూడాలని కోరుకొనే ప్రాముఖ్యమైనదేదో అక్కడవుందని” బైబిలు వ్యాఖ్యాత ఆర్. వి. జి. టాస్కర్ వ్రాస్తున్నాడు.
అలా దేవుని వాక్యమనే అద్దంలో మిమ్మల్నిమీరు సూక్ష్మంగా పరీక్షించుకుని, ఆ పిమ్మట అదికోరే వాటికనుగుణ్యంగా మార్చుకుంటారా? యాకోబు ఇంకనూ ఇట్లంటున్నాడు: “వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.”—యాకోబు 1:25.