నూతన లోక అనువాదం ఒక వేదాంతిని ముగ్ధుని చేసింది
డా. రెకెల్ టెన్ కాటా అనే పురాతన గ్రీకు వేదాంతి ప్రకారం, డచ్ బైబిలు అనువాదాలు కొన్ని పదాలను ప్రామాణికతతో అనువదించడంలో విఫలమైంది. ఉదాహరణకు, లూకా 2వ అధ్యాయంలో యేసు పెరుగుదలకు సంబంధించిన స్థాయిలను వర్ణించేందుకు మూడు గ్రీకు పదాలు (బ్రిఫోస్, పెయిడియన్, మరియు పయిస్) ఉపయోగించబడినట్లు మనం కనుగొంటాము. వీటిలో ప్రతి దానికీ వేరు వేరు అర్థాలున్నాయి. అయినప్పటికీ, అనేక బైబిళ్లలో, రెండు లేక మొత్తం మూడు పదాలనూ అస్పష్టంగా “పిల్లవాడు” అని వాడారు. ఏది సరైన అనువాదం?
పన్నెండవ వచనంలోని గ్రీకు పదమైన బ్రిఫోస్ అర్థం “నవజాత శిశువు, లేక చంటి బిడ్డ” అని డా. టెన్ కాటా వివరిస్తున్నాడు. పెయిడియన్ అని 27వ వచనంలో ఉపయోగించబడిన దాని భావం “పసి బాలుడు లేక పిల్లవాడు,” మరియు పయిస్ అని 43వ వచనంలో కనిపించేదాన్ని “బాలుడు” అని అనువదించాలి. “నాకు తెలిసినంతమట్టుకు, ఒక్క డచ్ అనువాదంకూడా దీనిని సరిగ్గా అనువదించలేదు, మరో మాటలో చెప్పాలంటే అసలు గ్రంథంతో సమన్వయం లేకుండా ఉంది” అని డా. టెన్ కాటా, బేబాల్ ఎన్ వేటాన్షాప్ (బైబిలు మరియు విజ్ఞానశాస్త్రం) అనే పత్రిక యొక్క 1993 మార్చి సంచికలో వ్రాశాడు.
తర్వాత, డా .టెన్ కాటాకు డచ్తో సహా 12 భాషల్లో ఉన్న పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదాన్ని చూపించడం జరిగింది. ఆయన ప్రతిస్పందన ఎలా ఉంది? “బ్రిఫోస్, పెయిడియన్, మరియు పయిస్ అని వేరువేరుగా ఉపయోగించబడిన గ్రీకు పదాలకు సరైన అవధానాన్ని ఇచ్చిన ఒక్క డచ్ బైబిలు ఉందికదా అని నాకు ఆశ్చర్యమనిపించిది” అని ఆయన అన్నాడు. నూతన లోక అనువాదం (ఆంగ్లం) ఈ వచనాలను అసలు గ్రీకు గ్రంథంతో సమన్వయంగానే అనువదించడం జరిగిందా? “పూర్తిగా దానితో సమన్వయం కల్గివుంది,” అని డా.టెన్ కాటె ప్రతిస్పందిస్తున్నాడు.