పాఠకుల ప్రశ్నలు
క్రైస్తవ బాప్తిస్మములందు ఎలాంటి దృక్పథం చూపించబడాలి?
మన పాఠకులలో అనేకులు ఇప్పటికే బాప్తిస్మం తీసుకున్నవారైనప్పటికీ, బాప్తిస్మం తీసుకొనబోయేవారి వలె వారు కూడా చేరివున్నారు గనుక, అది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మొదట మనం బాప్తిస్మం తీసుకొనబోయేవారి గురించి అంటే పూర్తిగా ముంచబడే వారిపై వ్యాఖ్యానిద్దాము. వారి దృక్పథం ఏమైవుండాలి?
మత్తయి 28:19, 20 నందు, ప్రజలకు బోధించి, వారికి బాప్తిస్మమిచ్చి, వారిని శిష్యులనుగా చేయమని యేసు తన అనుచరులకు చెప్పాడు. బాప్తిస్మం అంటే ఎంతో భావోద్రేకంతో కూడిన అనుభవంగా, క్షణికమైన ఉద్రేకం నుండి ఉద్భవించే చర్యగా ఆయన చెప్పలేదు. యేసు మాదిరి నుండి మనం గ్రహించునట్లుగా అది గంభీరమైన చర్య. లూకా 3:21 ఇలా తెలియజేస్తుంది: “యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడెను.” అవును, మన మాదిరికర్త బాప్తిస్మమును గంభీరమైనదిగా, ప్రార్థనాపూర్వకమైనదిగా ఎంచాడు. ఆయన నీళ్లలో నుండి పైకి వచ్చిన తర్వాత విజయాన్ని సూచించే చర్య చేయడం, కేకలు వేయడం, లేక తన చేతుల్ని గాలిలో ఊపడం వంటివి చేయడాన్ని మనం ఊహించలేము కాని ఇటీవల కొంతమంది అలాంటి పనులన్నీ చేశారు. లేదు, కేవలం బాప్తిస్మమిచ్చు యోహాను అక్కడ ఉండగా, యేసు తన తండ్రికి ప్రార్థించాడు.
అయితే బాప్తిస్మమనేది, నేడు క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు కొన్ని చేస్తున్నట్లుగా, ప్రత్యేకమైన క్రియ చేయడం లేక గీతాలు ఆలాపించడం వంటివి అవసరమైన ఒక గంభీరమైన లేక భయంకరమైన సంఘటనగా ఉండాలని బైబిలు సలహా ఇవ్వడంలేదు. అంతెందుకు, వేలకొలదిమంది యూదులు మరియు యూదా మతప్రవిష్టులు క్రైస్తవ బాప్తిస్మం తీసుకున్న పెంతెకొస్తు దినాన్ని గూర్చి తలంచండి. వారు అప్పటికే దేవుని ధర్మశాస్త్రాన్ని పఠించి ఆయనతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి వారు కేవలం మెస్సీయా అయిన యేసు గురించి తెలుసుకుని, ఆయనను అంగీకరించవలసి ఉంది. వారు ఒకసారి అలా చేస్తే, వారు బాప్తిస్మం పొందవచ్చు.
అపొస్తలుల కార్యములు 2:41 ఇలా నివేదిస్తుంది: “అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి.” వెహమోత్ బైబిలు వర్షన్ ఇలా చదువబడుతుంది: “గనుక, ఆయన వాక్యాన్ని ఆనందంగా ఆహ్వానించినవారు బాప్తిస్మం పొందారు.” మెస్సీయాను గూర్చిన ఉత్తేజకరమైన వార్తలలో వారు ఆనందాన్ని కనుగొన్నారు, ఆ హృదయపూర్వక ఆనందం వందల కొలది ఆనందభరిత ప్రేక్షకుల యెదుట బాప్తిస్మం తీసుకొనేంతవరకు వ్యాపించింది. చివరికి పరలోకంలోని దూతలు కూడా గమనించి, ఆనందించారు. యేసు యొక్క ఈ మాటలను జ్ఞాపకం చేసుకోండి: “మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను.”—లూకా 15:10.
బాప్తిస్మం యొక్క గంభీరతను, ఆనందాన్ని మనలో ప్రతి ఒక్కరం వ్యక్తపర్చగల అనేక రీతులు ఉన్నాయి. కొన్ని చర్చీల్లో బాప్తిస్మం తీసుకొనబోయే వారు తెల్లని లేక నల్లని వస్త్రాలు ధరిస్తారు. అలాంటి అవసరత ఉన్నట్లు లేఖనాధార మద్దతు ఏమీ లేదు. అయినప్పటికీ, స్త్రీలైనా, పురుషులైనా చాలా బిగుతైన లేక పలుచని స్నానపు వస్త్రాలు ధరించడం సముచితంగా ఉండదు. ముందు చెప్పబడినట్లుగా, నీళ్లలో నుండి బయటికి వచ్చాక, క్రొత్త క్రైస్తవుడు ప్రత్యేకమైన సూచనలు చేయకూడదు లేక ఆయన ఏదో గొప్ప విజయం సాధించినట్లు చేయకూడదు. క్రొత్త వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నందుకు మిగతా క్రైస్తవ సహోదర బృందమంతా సంతోషంగా ఉంటారు. విశ్వాసాన్ని ప్రదర్శించే ఈ బాప్తిస్మం, దేవుని అంగీకారం పొందేందుకు యథార్థత చూపించవలసిన సుదీర్ఘమైన పనిలో కేవలం తొలి అడుగు మాత్రమేనని అతడు గుర్తించాలి.—మత్తయి 16:24.
ఒక బహిరంగ బాప్తిస్మం వద్ద ప్రేక్షకులుగా మనం, ప్రాముఖ్యంగా బాప్తిస్మం పొందుతున్న వ్యక్తి మన బంధువు లేక మనం వారితో బైబిలు పఠనం చేసినవారో అయితే, ఆ సందర్భం యొక్క ఆనందాన్ని మనం పంచుకుంటాము. అయితే దాన్ని పూర్తిగా పంచుకోవడానికి, మనం అభ్యర్థులతో కలిసి పూర్తి ప్రసంగాన్ని వినాలి, వారికి వేయబడిన ప్రశ్నలకు వారు బహిరంగంగా సమాధానమివ్వడం వినాలి, ప్రార్థనలో వారితో కలిసి భాగం వహించాలి. అలా చేయడం, బాప్తిస్మాన్ని గూర్చిన సరైన దృక్పథాన్ని కలిగి ఉండడానికి మనకు సహాయం చేస్తుంది; మనం దాన్ని గూర్చి దేవుని దృక్పథాన్నే కలిగివుంటాము. బాప్తిస్మం యొక్క చర్య ముగిసిన తర్వాత, మన ఆనందాన్ని ఒక వేడుకలా చేయడం, పువ్వుల గుచ్చాలు ఇవ్వడం, బాప్తిస్మం పొందిన వ్యక్తిని గౌరవించడానికి పార్టీ ఏర్పాటు చేయడం వంటివి అవసరం లేదు. కాని మనం ఆ క్రొత్త సహోదరున్ని లేక సహోదరిని సమీపించి, తీసుకొనబడిన అద్భుతమైన చర్య గురించి ఆనందాన్ని వ్యక్తం చేసి, మన క్రైస్తవ సహోదరత్వంలోకి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందజేయడానికి వారిని సమీపించవచ్చు.
అయితే సంక్షిప్తంగా, నీటి బాప్తిస్మం తీసుకొనేవారితో సహా మన మందరం బాప్తిస్మాన్ని తగినంత గంభీరతతో చూడాలి. పెద్దగా భావోద్రేకంతో కేకలు అలాంటివి చేయడానికి, పార్టీ చేసుకోవడానికి, లేక ఉత్సవం చేసుకోవడానికి అది సమయం కాదు. కాని అది గంభీరమైన లేక భయంకరమైన సమయం కూడా కాదు. నిత్యజీవాన్ని పొందే మార్గంలో క్రొత్తవారు మనతో వచ్చి కలిశారని మనం సరైన విధంగా ఆనందంగా ఉండగలము. మనం క్రొత్త సహోదరులను, సహోదరీలను ఆనందంగా ఆహ్వానించవచ్చు.
[31వ పేజీలో పూర్తిపేజీ చిత్రం ఉంది]