“సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము”
చరిత్రంతటిలో, యథార్థపరులైన దేవుని సేవకులు తీవ్రమైన మానసిక వేదనగల సమయాలను ఎదుర్కొన్నారు. మనం ‘అపాయకరమైన కాలములలో’ జీవిస్తున్నాము గనుక, నేడు యిది మరెంత నిజమో కదా! (2 తిమోతి 3:1) ప్రార్థన ద్వారా తమ చింతలను యెహోవాపై వేయమని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఉపదేశించాడు. ఏ ఫలితంతో? “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.”—ఫిలిప్పీయులు 4:7.
ఈ “దేవుని సమాధానము” ఏమిటి? అది సృష్టికర్తతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండడం ద్వారా వచ్చే ప్రశాంతత. అలాంటి సన్నిహితత్వం, మనకు బాధలు ఉన్నప్పటికీ, యెహోవా “తన ప్రజలను ఎడబాయడు తన స్వాస్థ్యమును విడిచిపెట్టడు” అనే ధైర్యాన్ని యిస్తుంది.—కీర్తన 94:14, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్.
మనం విపత్తుకు అతీతులమని దీని భావం కాదు. “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు,” అని కీర్తనల గ్రంథకర్త వ్రాశాడు. (కీర్తన 34:19) కాని దేవుని సమాధానం ఉపశమనాన్ని కలిగించగలదు. ఎలా?
దేవుని సమాధానము ‘సమస్త జ్ఞానమునకు మించినది’ అని పౌలు వ్రాశాడు—లేక కాన్కార్డంట్ వర్షన్ నందు చెప్పబడినట్లుగా, అది “ప్రతి మానసిక స్థితికంటే ఉన్నతమైనది.” చింత మనం వివిధ రకాలైన వేదనకరమైన భావాలను అనుభవించేలా చేస్తుంది. (ప్రసంగి 7:7) అయినా, దేవుని సమాధానము మనల్ని బలపర్చగలదు, ప్రాముఖ్యంగా మనకు “బలాధిక్యము” అవసరమైనప్పుడు.—2 కొరింథీయులు 4:7; 2 తిమోతి 1:7.
అంతేకాకుండా, దేవుని సమాధానము ఒక రక్షణ వంటిది. పౌలు ఫిలిప్పీయులకు వ్రాసినట్లుగా, అది “మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” “కావలి” అని అనువదించబడిన గ్రీకు పదం బహుశా, కావలివారు రాత్రిపగలు కావలి వుండుటను గూర్చిన ఒక మానసిక చిత్రాన్ని కలుగజేసే ఒక సైనిక పదము. అదే విధంగా, దేవుని సమాధానం మన హృదయాలపై, మన మానసిక శక్తులపై 24 గంటల కావలి వలే వుండగలదు.—1 కొరింథీయులు 10:13; ఎఫెసీయులు 4:26 పోల్చండి.
నేడు మనం ఎదుర్కొనే ఒత్తిడితో కూడిన సవాళ్లను పరిగణలోకి తీసుకుంటే, దేవుని సమాధానాన్ని కలిగివుండడం మనం కృతజ్ఞులమై వుండవలసిన ఒక విషయం కాదా?—కీర్తన 18:2; నిర్గమకాండము 40:38 పోల్చండి.