“నిజమైన క్రైస్తవులు ప్రవర్తించవలసిన విధము అదే”
ఆర్బెయిట్ మాక్ట్ టాట్—ఐనే యూగెండ్ యిన్ ఆష్విట్స్ (వర్క్ కిల్స్ యూ—యంగ్ మాన్హుడ్ యిన్ ఆష్విట్స్) అనే తన 1990 నాటి పుస్తకమందు ఆష్విట్స్ను తప్పించుకుని జీవించిన టీబోర్ ఓల్ తాను విన్న యిద్దరు తోటి ఖైదీల మధ్య జరిగిన సంభాషణను గూర్చి వ్రాశాడు. ఒకరు ఆస్ట్రియా దేశస్థుడు, “అవిశ్వాసి” నని చెప్పుకునేవాడు. అయినా, క్యాంపులో యెహోవా సాక్షులు పిలువబడిన రీతిగా అంటే బైబిలు విద్యార్థులు అని, దానికి చిహ్నమైన ఊదా రంగు త్రికోణం ధరించే ఖైదీలను అతడు పొగిడాడు.
ఆస్ట్రియా దేశస్థుడు తన సహచరునికి యిలా చెప్పాడు: “వారు యుద్ధం చేయరు, వారు ఎవరినైనా చంపడానికి బదులు వారు చనిపోతారు. నా దృష్టిలో నిజమైన క్రైస్తవులు ప్రవర్తించవలసిన విధము అదే. వారితో నాకు సంభవించిన ఎంతో ఆనందకరమైన సంఘటన గురించి మీకు చెప్పాలి. మేము యూదులు, బైబిలు విద్యార్థులతో కలిసి ష్టట్హాఫ్ క్యాంపులో ఒకే భవనంలో వున్నాము. ఆ రోజుల్లో బైబిలు విద్యార్థులు తీవ్రమైన చలిలో బయట చాలా కష్టపడి పనిచేయవలసి వచ్చేది. వాళ్లు ఎలా జీవించారో మాకు అర్థమయ్యేది కాదు. యెహోవా తమకు శక్తి యిచ్చాడని వారు చెప్పేవారు. వారు పస్తులుండేవారు గనుక వారికి బ్రెడ్ ఎంతో అవసరం ఉండేది. కాని వారు ఏం చేసేవారు? వారు తమ వద్ద వున్న బ్రెడ్ అంతా జమచేసి సగం తీసుకుని, మిగతా సగం యితర క్యాంపుల నుండి వచ్చిన, చాలా ఆకలితో వున్న తమ సహోదరులకు, తమ ఆత్మీయ సహోదరులకు యిచ్చేవారు. వారు వారిని ఆహ్వానించి, వారిని ముద్దుపెట్టుకునేవారు. వారు తినేముందు ప్రార్థించేవారు, తరువాత వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయేవి. యింక ఎవరూ ఆకలిగొని లేమని వారు చెప్పేవారు. కాబట్టి, చూడండి, నాకు నేను యిలా అనుకున్నాను ‘నిజమైన క్రైస్తవులు వీరే.’ వారు అలాగే వుండాలని నేను ఎప్పుడూ అనుకునేవాణ్ణి. ఇక్కడ ఆష్విట్స్లో ఆకలితోనున్న తోటివారికి అలాంటి ఆహ్వానాన్నిస్తే ఎంత బాగుంటుంది!”