‘ఇతరులవలె దుఃఖపడకండి’
పెద్ద పెనుతుపాను వీచి ఆగిపోయిన తర్వాత ఒక పువ్వు ఎలా వంగిపోయి ఉంటుందో మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక విధంగా అది ఎంతో హృదయ విదారకమైన దృశ్యంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఆ కుంభవృష్ఠి—ఒక పువ్వుకంటే ఎంతో పటిష్ఠంగా ఉండే జీవులైన—లెక్కలేనన్ని జంతువులు, ప్రజలు దాపు కొరకు వెదికేలా చేసింది. అయినప్పటికీ, ఆ పువ్వు ప్రకృతి యొక్క విలయ తాండవాన్ని ఎదుర్కొంటూ అక్కడే దృఢంగా వేళ్లూని, నిలిచి ఉంది. యిప్పుడు అది వంగిపోయి ఉన్నా, విరగకుండా ఉండి దాని సున్నితమైన ఆకృతికి భిన్నమైన శక్తిని ప్రదర్శిస్తుంది. దాన్ని మెచ్చుకుంటూ, మీరిలా ఆలోచించవచ్చు, ఒకవేళ అది దాని పూర్వపు బలాన్ని పొంది మళ్లీ తన అందమైన తలను ఆకాశం వైపు పైకెత్తితే ఎంత బాగుంటుంది.
మనుషుల విషయం కూడా అంతే. ఈ కష్టతరమైన కాలాల్లో, మనం అన్ని రకాలైన తుపాన్లను ఎదుర్కొంటాము. ఆర్థిక యిబ్బందులు, కృంగుదల, క్షీణిస్తున్న ఆరోగ్యం, మన ప్రియమైన వారిని మరణమందు కోల్పోవడం—అలాంటి ఉప్పెనలు ఒకసారి కాకపోతే మరోసారి మనందరిపైకి ముంచుకు వస్తాయి, మరి కొన్నిసార్లు, ఆ పువ్వు తనను తాను పెకిలించుకుని దాపు కొరకు ఎలా పరుగెత్తలేదో, అదే విధంగా మనం కూడా వాటిని నివారించలేము. ఎంతో బలహీనంగా కనిపించే వ్యక్తులు, ఆశ్చర్యాన్ని కలిగించేంతటి శక్తిని కనపర్చి అటువంటి దాడులను ఎదుర్కోవడాన్ని చూడటం చలింపజేస్తుంది. వారలా ఎలా చేస్తారు? తరచుగా దానికి కీలకం విశ్వాసమే. యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబు యిలా వ్రాశాడు: “మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని మీకు తెలుసు.”—యాకోబు 1:3, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్.
మరొక కీలకం నిరీక్షణ. ఉదాహరణకు ప్రియమైన వారిని మరణం ముట్టడించినప్పుడు, జీవించి ఉన్న వారికి నిరీక్షణ ఎంతో గొప్ప వ్యత్యాసాన్ని కల్గించగలదు. థెస్సలొనికలోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.” (1 థెస్సలొనీకయులు 4:13) మరణాన్ని గురించి క్రైస్తవులు తప్పనిసరిగా దుఃఖించినప్పటికీ, ఎంతో వ్యత్యాసముంది. మృతుల పరిస్థితిని, పునరుత్థాన నిరీక్షణను గూర్చిన కచ్చితమైన జ్ఞానం వారికుంది.—యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15.
ఈ జ్ఞానం వారికి నిరీక్షణనిస్తుంది. మరి ఆ నిరీక్షణ, క్రమేణ వారి దుఃఖాన్ని తగ్గిస్తుంది. అది వారు సహించడానికి మరింకా ఎక్కువే చేయడానికి సహాయం చేస్తుంది. కొద్ది సమయానికి, తుపాను తర్వాతి పువ్వులా, వారు దుఃఖంనుండి తేరుకుని, జీవితంలో మరోసారి ఆనందాన్ని, సంతృప్తిని కనుగొనగలరు.