“ఆకాశమునుండి ఒక సూచకక్రియ”
పాతకాలం నాటి ఒక ప్రాస యిలావుంది: “సంధ్యాకాల ఎర్రని ఆకాశం, నావికులకెంతో సంతోషం, ఉదయకాల ఎర్రని ఆకాశం, నావికులంతా అప్రమత్తం.”
నేడు వాతావరణ సూచన చెప్పడానికి ఉపగ్రహాలను, కంప్యూటర్ ఉష్ణోగ్రతా అధ్యయనాలను, డోప్లర్ రాడార్‌ను, ఇంకా యితర విజ్ఞానశాస్త్ర పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ముంగుర్తులు తరచు మనం ముందు చెప్పుకున్న ప్రాసతో పొందిక కల్గివుంటాయి.
తాను మెస్సీయనని నిరూపించడానికి ఒక అసాధారణ ప్రక్రియను “ఆకాశమునుండి ఒక సూచకక్రియను” చూపుమని తన మతవ్యతిరేకులు అడిగినప్పుడు యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “సాయంకాలమున మీరు—ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున—ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనాను గూర్చిన సూచకక్రియయేగాని మరి ఏ సూచకక్రియయైనను వారి కనుగ్రహింపబడదు.”—మత్తయి 16:2-4.
యేసు వ్యతిరేకులు వాతావరణ సూచన చెప్పగలరుగాని ఆత్మీయ సంగతులను వివేచింపలేక పోయారు. ఉదాహరణకు, “యోనాను గూర్చిన సూచకక్రియ” సంగతేమి? చేప కడుపులో మూడు దినములు గడిపిన తర్వాత, దేవుని ప్రవక్తయగు యోనా నీనెవెలో ప్రకటించి ఆ విధంగా అష్షూరీయుల ఆ ముఖ్య పట్టణానికి ఒక సూచన అయ్యాడు. క్రీస్తు దాదాపు మూడుదినములు సమాధిలోవుండి, ఆ తర్వాత పునరుత్థానమైనప్పుడు, యేసు తరము వారికి “యోనాను గూర్చిన సూచకక్రియ” చూపబడింది. ఆ సంఘటనా రుజువుల్ని ఆయన శిష్యులు ప్రకటించారు, ఆ విధంగా యేసు ఆ తరానికి ఒక సూచన అయ్యాడు.—మత్తయి 12:39-41.
మరో సందర్భంలో, భవిష్యత్తులో తన “ప్రత్యక్షతకు” ఒక “సూచన” యిమ్మని యేసు శిష్యులు ఆయన్ని అడిగారు. జవాబుగా ఆయన అసమాంతర యుద్ధాలు, గొప్ప భూకంపాలు, కరవులు, పరలోకంలో స్థాపించబడిన దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రపంచవ్యాప్తంగా ప్రకటింపబడుటతో సహా అనేక సంఘటనలు ఇమిడియుండే ఒక సంయుక్త సూచనను యిచ్చాడు.—మత్తయి 24:3-14.
అదృశ్య పరలోక రాజుగా క్రీస్తు ప్రత్యక్షతా సూచనను మీరు గుర్తించారా? ఆ సూచన ఈ తరంలో నెరవేరుతున్నది. (మత్తయి 24:34) మరి భవిష్యత్తు విషయమేమి? బైబిలు ఈ విధానాంతము అతి సమీపంగా ఉందని వెల్లడిచేయుటే కాదు దేవుడు వాగ్దానంచేసిన నూతన దినం త్వరలోనే మానవజాతి కొరకు ఉజ్వలంగా ఉదయించనై యుందని కూడ ప్రవచిస్తున్నది.—2 పేతురు 3:13.