“మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నాడు”
మొదటి మానవుడు భూమిపై కాలుమోపడానికి ఎంతోకాలం పూర్వమే, రాత్రిపూట ఆకాశంలో చంద్రుడు వెన్నెల వెదజల్లాడు. ఒకప్పుడు అనేకమంది చంద్రున్ని దేవతగా పూజించారు. మరణం తర్వాత స్వచ్ఛమైన ఆత్మలకు చంద్రుడు చివరి గమ్యమని గ్రీకు గ్రంథ రచయితయైన ప్లూటార్చ్ చెప్పాడు. బాల్టిక్ పురాణాల ప్రకారం చంద్రుడొక మనిషి, సూర్యునికి భర్త. వారికి జరిగిన దాంపత్య వివాదంతో చంద్రుడు తన భార్య దగ్గరనుండి పారిపోయాడు, అందుకే అతడు ఆకాశంలో ఆమెతో కలిసి కనిపించడు!
ఈనాడు, యువ ప్రేమికులు చంద్రున్ని చూసి ఊహాలోకాల్లో తేలిపోతారు. మానవున్ని చంద్రుని పైకి పంపి అక్కడినుండి కొన్ని పౌండ్ల రాళ్ల పొడిని తీసుకు రావడానికి 1960వ దశాబ్దంలో శాస్త్రజ్ఞులు భారీయెత్తున డబ్బు ఖర్చుచేశారు. అయితే, చంద్రుని విషయంలో ఒకటి మాత్రం నిశ్చయం. ప్రతిరోజు, చంద్రుడు సరియైన నిర్ణయ కాలానికే ఉదయించి, అస్తమిస్తాడు. నియమిత పరిభ్రమణమందు చంద్రుడు ఎంత కచ్చితమంటే, వేలాది సంవత్సరాల క్రితం దాని స్వరూపాలను, గ్రహణాలను మనం లెక్కించవచ్చును.
ఇశ్రాయేలీయులు చంద్రున్ని చూసినప్పుడల్లా, వారికి అద్భుతమైనదేదో జ్ఞాపకం చేయబడేది. రాజైన దావీదు రాచరికం గతించిపోదని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనిట్లన్నాడు: ‘చంద్రుడున్నంత కాలము అది [దావీదు సంతానము] నిలుచును, మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడును.’ (కీర్తన 89:35-37) ఈ ప్రవచనము “దావీదు కుమారుడైన” యేసునందు నెరవేరెను. (లూకా 18:38) తన మరణము తర్వాత యేసు అమర్త్యమైన ఆత్మగా పునరుత్థానుడై పరలోకానికి ఎక్కిపోయాడు. (అపొస్తలుల కార్యములు 2:34-36) యుక్తకాలమున ఆయన దేవుని పరలోక రాజ్యానికి రాజుగా నియమించబడ్డాడు. (ప్రకటన 12:10) ఆ రాజ్యము ఇప్పుడు పరిపాలిస్తున్నది, అది “యుగముల వరకు నిలుచును.” (దానియేలు 2:44) ఈ విధంగా దావీదు రాచరికానికి అమర్త్యమైన ప్రతినిధిగా యేసు, ‘మింటనుండు నమ్మకమైన సాక్షియగు’ చంద్రుడున్నంత కాలము నిలిచియుండును.
కాబట్టి, ఆకాశంలో వెన్నెల వెదజల్లే చంద్రున్ని మీరు చూసినపుడల్లా, దావీదుకు దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవుని మహిమపరచి నమ్మకమైన మానవజాతి నిత్యాశీర్వాదం కొరకు ప్రస్తుతం పరిపాలిస్తూ, యుగయుగములు పరిపాలించే దేవుని రాజ్యం కొరకు కృతజ్ఞత చెల్లించుము.—ప్రకటన 11:15. (w93 1/1)