జీవము దేవుడు అనుగ్రహించిన వరము
దినములో ఇరవైనాలుగు గంటలూ, మన గుండె శరీరమంతటికి అమూల్యమైన రక్తాన్ని ప్రసరింపజేస్తుంది. మనం నిద్రపోతాం, మన ఊపిరితిత్తులు పనిచేస్తునే ఉంటాయి. మనం భోజనం చేస్తాం, అట్టి ఆహారము యాంత్రికంగా జీర్ణమైపోతుంది. మన ప్రయత్నం ఉండి లేకుండానే, ఇది ప్రతినిత్యం జరిగే పనే. అంతుచిక్కని, అద్భుతకరమైన ఈ ప్రక్రియలు అతి తేలికగా తీసుకొనబడుచున్నను, అవి మనము జీవమని పిలిచే వరమందు భాగమై యున్నవి. చెప్పాలంటే దీనిని అద్భుతకరమైన బహుమానమని పిలువవచ్చును.
మానవుల గర్భధారణ, పుట్టుకయొక్క ప్రక్రియను ఆలోచించండి. సాధారణంగా మానవ శరీరం అన్య కణజాలాలను విసర్జిస్తుంది, కానీ ఫలదీకరణం చెందిన అండం విషయంలో గర్భకోశం ఇందుకు భిన్నంగా పనిచేస్తుంది. అన్య కణజాలంగా పెరుగుతున్న పిండాన్ని విసర్జించడానికి బదులుగా అది శిశువుగా తయారగు పర్యంతం దానిని పోషించి కాపాడుతుంది. అన్య కణజాలాన్ని విసర్జించు నియమానికి విరుద్ధంగా గర్భకోశం ఈ నిర్ణయాత్మక ప్రక్రియ జరపకపోతే మానవ జన్మం అసాధ్యం.
అయినప్పటికిని, పిండము కేవలం నాలుగు నెలల ప్రాయముండగా గర్భకోశమందు అది అభివృద్ధి చెందకపోతే, క్రొత్తగా జన్మించు శిశువు జీవితకాలం కొద్దిపాటిదై ఉంటుంది. ఆ సమయంలో అది తన బొటనవ్రేలు చీకడం ప్రారంభిస్తుంది, అందుమూలంగా దాని కండరాలు బలపడి, పిదప తల్లిపాలు త్రాగడానికి వీలుకల్గించును. శిశు జన్మానికి ముందే గర్భమందు తీర్మానించబడు అనేక జీవన్మరణ విషయాలలో ఇదొకటి మాత్రమే.
పిండము ఇంకనూ గర్భకోశములో ఉండగానే, దాని గుండె కండరానికి ఒక రంధ్రం ఉంటుంది. బిడ్డ జన్మించినప్పుడు ఈ రంధ్రం దానంతటదే మూసుకుపోతుంది. అంతేకాకుండ, పిండము గర్భకోశమందున్నప్పుడు ఊపిరితిత్తులనుండి ఒక ఉపమార్గంద్వారా వెళ్లు ఒకపెద్ద రక్తనాళం బిడ్డ పుట్టినప్పుడు దానంతటదే మూసుకుపోతుంది; ఆ తర్వాత రక్తం ఊపిరితిత్తులకు వెళ్లి, బిడ్డ ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించడంతో అక్కడ ప్రాణవాయువుతో సంతులినం చెందుతుంది.
ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. జీవితకాలమంతటిలో బహు అద్భుతకరముగా నిర్మించబడిన (శ్వాసనిశ్వాసలు, రక్తప్రసరణ, నాడీమండలము, నిర్నాళ ప్రసరణ వ్యవస్థల వంటి) ప్రక్రియలు జరుగుచునే ఉండును, ఆలాగే అవి—యావత్ జీవితకాలము—మానవ పరిజ్ఞానానికి అంతుబట్టని నైపుణ్యముతో తమ పనులను సమన్వయ పరచుకొనును. దేవునిగూర్చి ప్రాచీనకాల రచయిత ఒకరు ఇలా వ్రాశాడనుటలో ఆశ్చర్యమేమి లేదు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. . . . నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.”—కీర్తన 139:14.
ఎంతోరమ్యమైన ఆ మాటలు పలికిన రచయిత, జీవము అనుకోనిరీతిలో లేదా ప్రమాదవశాత్తు గ్రుడ్డిగా, పరిణామము ద్వారా పుట్టినదని నమ్మలేదు. ఒకవేళ అలా జరిగివుంటే, మన జీవితాలను ఎలా ఉపయోగించాలనే విషయంలో మనము నిజముగా ఎలాంటి బాధ్యతలను లేదా విధులను కలిగివుండము. అయితే, జీవముయొక్క యాంత్రిక విశేషాలు స్పష్టముగా ఒక నమూనాను ప్రతిబింబిస్తున్నవి, ఆ నమూనాకు ఓ నిర్మాణకుడు ఉండాలి. బైబిలు ఒక సూత్రము చెప్పుచున్నది. అదేదనగా, “ప్రతి యిల్లును ఎవడైనా ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే.” (హెబ్రీయులు 3:4) కావున, “యెహోవాయే దేవుడని, . . . ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారమని” తెలుసుకొనుట ఆవశ్యకము. (కీర్తన 100:3) అవును, జీవము కేవలమొక అనుకూల సంఘటన కంటె ఎక్కువైనది; అది దేవుడు అనుగ్రహించిన వరమే.—కీర్తన 36:9.
గనుక, జీవదాతయెడల మనమే బాధ్యతలను కలిగియున్నాము? మనమెలా జీవించవలెనని ఆయన అపేక్షిస్తున్నాడు? ఇవి, వీటికి సంబంధించిన ప్రశ్నలు తర్వాతి శీర్షికలో పరిశీలించబడతాయి. (w92 8/1)