సూచన నీవు దానిని చూచితివా?
“సముద్ర ఉపరితలమునకు చాలా లోతునందు పొడవుగా, గుండ్రని మూతిగల జలాంతర్గామి, సముద్ర తరంగములకు ఆతీతంగా కదల్చబడక స్థిరంగా నిలిచియున్నది. ఆ జలాంతర్గామిపైన గల మూతి తెరచుకొని 30 అడుగుల కన్నా పొడవు 4 1/2 అడుగుల మందముగల రాకెట్ ఉపరితలానికి చొచ్చుకొని వస్తున్నది. సముద్రంపైకి వచ్చిన తరువాత దాని యంత్రం పని చేయుట ప్రారంభించి నీటి పైనుండి పెద్ద శబ్దంతో ప్రేలి దూసుకొని పోవును.”
మార్టిన్ కీన్ వ్రాసిన రాకెట్స్. మిస్సైల్స్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ అను పుస్తకములో జలాంతర్గామినుండి ప్రయోగించు అణ్వస్త్రములను గూర్చిన ఆ వర్ణన “సముద్రతరంగముల ఘోషవలన” కల్గు కలవర కాలమును గూర్చిన ప్రాచీన ప్రవచనానికి ఆర్ధానిస్తున్నది. (లూకా 21:25) జలాంతర్గాముల నుండి ప్రయోగించు అణ్వస్త్రములు ఎంత ఆపాయకరములు?
జీన్ ఫైటింగ్ 1986-87 అను పుస్తకము ప్రకారము బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ వీరందరియొద్ద చురుకుగా పని చేయగల 131 అణ్వస్త్ర జలాంతర్గాములున్నవి. అవి సమీపించలేని నగరమంటూ లేదు. సామాన్యంగా యుద్ధాయుధాలు మైలు దూరానికి ఒకటి చొప్పున గురి చేయబడతాయి. “5,000 మైళ్ల దూరంలో నున్న ఏదేశమునైనా సమూలంగా నాశనము చేయుటకు” కావలసినన్ని యుద్ధాయుధాలను కొన్ని జలాంతర్గాములు తీసికొని పోగలవని ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెల్పుచున్నది. అంతకన్నా భయంకరముగా ఒక్క జలాంతర్గామిలోనున్న యుద్ధాయుధాలు భూమిమీదనున్న జీవరాశులను తుడిచిపెట్టగల వరమాణు శీతలాన్ని సృష్టించగలదని కొందరు చెప్పుచున్నారు. దూరంగానున్న జలాంతర్గామిని అదుపుచేయడంకూడ ఒక సమస్యే. ఒక్క జలాంతర్గామి ఉద్రేకముతో ఏదైనా చర్య చేస్తే నాశనకరమగా పరమాణు యుద్ధమునకు నడుపునని భయపడుచున్నారు.
అట్టి భయానక సంభవాలను అనేకులు యేసు ప్రవచనాత్మక సూచనకు ముడిపెట్టారు. ఆ సూచన యొక్క నెరవేర్పును మన తరము అనుభవిస్తున్నదని చెప్పవచ్చునా? వాస్తవాలు అవునని చెప్పుచున్నవి. అంటే పరమాణు యుద్ధభయమునుండి విముక్తి సమీపంగా ఉన్నదని దీని భావము. (లూకా 21:28, 32) మేలును ఆశించే అట్టి దృష్టితో, ఆ సూచన నెరవేర్పు యొక్క నిదర్శనమును గమనించుమని మేము నిన్ను ఆహ్వానించుచున్నాము. ఆ తదుపరి వివరించబడిన సూచనలోని కొన్ని ముఖ్య సంఘటనలు వాటి ఆధునిక నెరవేర్పులతో యిచ్చట యివ్వబడినవి.
“జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.” (లూకా 21:10)
యుద్ధములమూలంగా 1914 నుండి 10,00,00,000 కంటే ఎక్కువ మంది చనిపోయిరి. మొదటి ప్రపంచ యుద్ధము 1914లో ప్రారంభమైంది, 28 దేశాలు అందులో పాల్గొన్నాయి, అప్పుడున్న అనేక యూరప్ కాలనీలను లెక్కించలేదు. కొన్ని దేశాలు తటస్థంగా ఉండిపోయినవి. దాని వలన 1,30,00,000 మంది సైనికులు చనిపోయిరి, 2,10,00,000 మంది గాయపడిరి. ఆ తదుపరి అంతకన్నా నాశనకరమైన రెండవప్రపంచయుద్ధం వచ్చింది. మరి అప్పటి నుండి? దక్షిణాఫ్రికా వార్తాపత్రిక ది స్టార్ ‘వార్స్ ఆఫ్ ది వర్‌ల్డ్’ అను శీర్షికలో లండను ఆదివారపు టైమ్స్ పత్రిక వార్తను తెల్పుచు యిట్లన్నది. “ప్రపంచదేశాల్లో నాల్గవవంతు యిప్పుడు పోరాటములందు మునిగియున్నది.”
“మరియు గొప్ప భూకంపములు కలుగును.” (లూకా 21:11)
స్టాండ్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు జెరి మరియు షా తమ పుస్తకమైన టెర్రానాన్ ఫిర్మా నందు గత మూడు వేల సంవత్సరాలనుండి సంభవించిన 164 “ముఖ్యమైన భూకంపములను” గూర్చిన వివరములు వ్రాసారు. వీటన్నింటిలో 89 భూకంపాలు 1914 నుండి సంభవించి 10,47,944 ప్రాణాలను బలిగొన్నట్లు అంచనా. దీనిలో పెద్ద పెద్ద భూకంపములు మాత్రమే చేర్చబడినవి, మరియు టెర్రానాన్ ఫిర్మా అను ప్రచురణ 1984లో ముద్రించబడెను, గనుక అటు పిమ్మట వేలాది మందిని బలిగొన్న నాశనకరమగు భూకంపాలు చిలీ, సోవియట్‌యూనియన్, మెక్సికోలలో సంభవించాయి.
“తెగుళ్లు సంభవించును” (లూకా 21:11)
మరణకరమగు తెగులు 1918లో సంభవించింది. దీని పేరు స్పానిష్ ఫ్లూ, సెయింట్ హెలీనా ద్వీపమునకు తప్ప భూమి యంతా వ్యాపించి నాలుగు సంవత్సరాల యుద్ధములో చనిపోయిన వారి కంటే ఎక్కువ మందిని అది చంపివేసింది. అప్పటినుండి వైద్యశాస్త్రము ఎంతో ప్రగతిని సాధించింది అయినా విపరీతమైనవి సంభవిస్తున్నవి. ది లేన్‌సెట్ ఇలా వివరిస్తున్నది: “లైంగిక సంబంధమువలన వ్యాప్తి చెందుచున్న రోగము బహుగా వృద్ధియై ఆధునిక వైద్యానికి అంతుపట్టని అంటురోగములలో ఒకటై పోయింది. . . . లైంగిక సంపర్కమువలన వ్యాప్తి చెందు రోగములు ఒకనాడు మా అదుపులో ఉన్నవి కాని ఇటీవల సంవత్సరాలలో చేయిజారిపోయినవి.”
ఆధునిక వైద్యము అదుపుచేయలేని యితర తెగుళ్లును కేన్సర్, హృద్రోగము. ఈ రెండవది “ఒక క్రొత్త గోచరము . . . మొదటి ప్రపంచ యుద్ధానంతర సమాజము ఎదుర్కొన్న పరిణామము” అని దక్షిణాఫ్రికా ఫామిలీ ప్రాక్టీస్ తెల్పుచున్నది. కార్డియొవాస్‌క్యులర్ అప్‌డేట్-ఇన్‌సైట్ యిన్‌టు హార్ట్‌డిసిసెస్ అను పుస్తకము ప్రకారం “బ్రిటన్‌లో” మరణాలకు ముఖ్యకారణం” హృద్రోగము మరియు రక్తపోటు. అది చెప్పేదేమంటే, “వాటిని అదుపు చేయడానికి యిప్పటి వరకు చాలా తక్కువ పురోభివృద్ధి సాధించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో లక్షలాది మంది మలేరియా, అతి నిద్రారోగము, కాలేయరోగము మరి యితర రోగములకు గురియగుచున్నారు. ప్రపంచములో మరణకరమగు రోగములలో అతివిరేచన వ్యాధి ఒకటి. మెడిసిన్ ఇంటర్నేషనల్ పత్రిక యిలా వివరిస్తున్నది: “ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశములలో ప్రతి ఏట 50 కోట్ల మంది పసిపిల్లలు. చిన్న పిల్లలు అతివిరేచన వ్యాధికి గురు అగుచున్నారని వారిలో 50 లక్షల నుండి 1 కోటి 80 లక్షల మంది చనిపోవుచున్నారని అంచనా వేయబడింది.”
“కరవులు తటస్థించును.” (లూకా 21:11)
సామాన్యంగా యుద్ధము తరువాత కరవు సంభవించును. మొదటి ప్రపంచయుద్ధము తరువాత అదే జరిగింది. దాని తరువాత భయంకరమైన క్షామము తటస్థించింది. మరి అప్పటినుండి? ది ఛాలెంజ్ ఆఫ్ ఇంటర్నేష్నలిజమ్-ఫోర్టి యియర్స్ ఆఫ్‌ది యునైటెడ్ నేషన్స్ (1945-1985) అను ప్రత్యేకపత్రిక నివేదిక “1950లో పోషకాహారము లభించని వారు 165 కోట్ల మంది ఉండగా, 1983లో 225 కోట్లమంది ఉన్నారు; అంటే 60 కోట్లమంది లేక 36 శాతం అధికమయ్యారు.” ఆఫ్రికాలో యిటీవల సంభవించిన అనావృష్టి వలన భయంకరమైన క్షామం సంభవించింది. “ఒక్క సంవత్సరంలోనే 10 లక్షలమంది ఇతియోపియా వ్యవసాయకులు, 5 లక్షల సూడాన్ దేశ పిల్లలు చనిపోయారు” అని న్యూస్ వీక్ పత్రిక తెల్పుచున్నది. ఇతర దేశములలోని వేలాదిమందికూడా నశించిరి.
“ఆకాశమునుండి మహాభయోత్పాములును గొప్ప సూచనలును పుట్టును. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీది సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడికూలుదురు.” (లూకా 21:11, 25, 26)
మొదటి ప్రపంచయుద్ధం భయంకరమైన క్రొత్త ఆయుధాలను ప్రవేశ పెట్టింది. ఆకాశమునుండి విమానములు బాంబులను బుల్లెట్‌లను కురిపించినవి. రెండవ ప్రపంచ యుద్ధంలో నిస్సహాయులైన పౌరులపై మరీ భయంకరమైన నాశనము కుమ్మరింపబడెను, వాటిలో రెండు అణుబాంబులు కూడ ఉన్నవి.
సముద్రముకూడా కొన్ని క్రొత్త భయానక దృశ్యాలకు నిలయమైనది. మొదటి ప్రపంచయుద్ధము ప్రారంభమైనప్పుడు జలాంతర్గాములు అంత ప్రాముఖ్యమైనవిగా పరిగణించబడలేదు. కాని రెండవ ప్రపంచ యుద్ధాంతమునకు అవి పదివేలకంటె ఎక్కువ ఓడలను ముంచివేసినవి. “వర్తక ఓడలు, ప్రయాణీకుల ఓడలు ఏ హెచ్చరిక చేయక ముంచి వేయబడుట, పూర్తి యుద్ధం యొక్క క్రొత్త మరియు భయంకరమైన చర్యలో భాగంగా కన్పించుచున్నది” అని నార్మన్ ఫ్రెడ్‌మేన్ తన పుస్తకమగు సబ్‌మెరీన్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ నందు చెప్పుచున్నాడు.
అణ్వస్త్రములను ప్రయోగించు జలాంతర్గాములు ప్రపంచములో అత్యంత ప్రాధాన్యత కల్గినవని నేడు అనేకులు భావించుచున్నారు. మారణాయుధములను కూడా చేరవేసే జలాంతర్గాములు, విమానములను చేరవేసే ఓడలు. మరియితర యుద్ధనౌకలు కూడా ఉన్నవి. జేన్స్ ఫైటింగ్ షిష్స్ 1986-87 అను పుస్తకము ప్రకారం, ఇప్పుడు 929 జలాంతర్గాములు, 30 మహానౌకలు, 84 యుద్ధనౌకలు 367 నాశనము చేయునౌకలు, 675 యుద్ధ నావలు, 276 సహాయకనౌకలు . . . 2,024. అతివేగంగా దాడిచేయు విమానములు, మరియితర వేలాది మిలటరీ సాయుధ నౌకలు 52 దేశాలలో చురుకుగా పనిచేసేవిగా ఉన్నవి. దీనికి తోడు ప్రాణాంతకమగు మందు పాతరలు కొన్ని ఉన్నవి. మానవునిచే సముద్రముపై జరుగుచున్న యిట్టి భయంకర పోరాటము ముందెన్నడూ లేదు.
“సూర్య చంద్ర నక్షత్రముల” పరిధిలోనికి కూడా మానవుడు చేరుకున్నాడు. పరమాణు ఆయుధాలు తాము గురిపెట్టబడిన వాటిని ధ్వంసము చేయకముందు అంతరిక్షములోనికి దూసుకొని పోవుచున్నవి. అంతరిక్ష నౌకలు సౌరకుటుంబమును, కూడా దాటి పోవుచున్నవి. ఉపగ్రహాలపై దేశములు ఎక్కువాధారపడుచున్నవి. నేవిగేషనల్ మరియు మీట్యరోలాజికల్ ఉపగ్రహాలు మారణాయుధాలను గురిపెట్టడంలో సహాయపడుచున్నవి. సమాచారమునందించునట్లు అవి తయారు చేయబడినవి. “అగ్రరాజ్యాల సాయుధ దళాలకు ఉపగ్రహాలు కళ్లు. చెవులు మరియు కంఠస్వరాలై యున్నవి,” అని మైఖల్ షీహాన్. ది ఆర్మ్‌రేస్ అను తన పుస్తకములో తెల్పుచున్నాడు.
ఇటీవల సాదృశ్యము లిబియాపై విమానదాడులు. ఏవియేషన్ వీక్ & స్పేస్ టెక్నాలజీ నివేదిక: “దాడి జరుపుటకు సిద్ధపడుటలోను, దాడి జరిపిన పిదప పరిస్థితిని గమనించుటకు ఉపగ్రహాల ఫోటోలను అమెరికా ఉపయోగించినది. ఢిఫెన్స్‌మీట్యరో లాజికల్ సెటిలైట్ ప్రోగాం వాతావరణ నివేదికను అందించగా మిలటరీ అంతరిక్షనౌక ఆజ్ఞజారీ చేయుటకు, నియంత్రణ చేయుటకు ఉపయోగపడును.” మిలటరీ ఉపగ్రహాలచే నిర్వహించబడుచున్న ప్రముఖపాత్ర దృష్ట్యా రెండు అగ్రరాజ్యాలు ఉపగ్రహాలకు అంతుచిక్కని ఆయుధాలను సమకూర్చుకొనుచున్నవి. స్టార్ వార్స్ అని పిలువబడు కార్యక్రమములో అంతరిక్షమునందు ఆయుధాలను సమకూర్చి ఉంచుట ఒక అగ్రరాజ్యము యొక్క దృక్పధము. అంతరిక్ష యుద్ధములో అగ్రరాజ్యాలు అసలు పాల్గొంటాయా లేదా అనేది కాలము మాత్రమే చెప్పగలదు.
అంతవరకు, ప్రవచింపబడిన రీతిగా “లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడికూలుదురు.” నేరము, ఉగ్రవాదము, ఆర్థిక దుర్గతి, రసాయనిక కలుషితం, అణువిద్యుత్ కేంద్రములనుండి వెలువడు విషపూరిత అణుధార్మికశక్తి, వీటన్నిటితో పాటు పరమాణు యుద్ధ బెదరింపు యివన్నియూ “భయమునకు” కారణాలైనవి. న్యూస్టేట్స్‌మేన్ అను బ్రిటీషు పత్రిక నివేదిక ఏమంటే” దేశములో యౌవనస్థులలో “సగంకంటే ఎక్కువమంది, మన జీవితకాలములో పరమాణు యుద్ధము సంభవించునని భయపడుచున్నారు. మరియు ఏదో ఒక దినమున అది తప్పక వచ్చునని 70 శాతం మంది నమ్ముచున్నారు.”
[7వ పేజీలోని బాక్సు]
సూచ—దాని భావమేమిటి?
ఈ 20వ శతాబ్ద చరిత్ర యొక్క వెలుగులో ఆ సూచనను పరిశీలించిన పిదప లక్షలాది మంది దాని నెరవేర్పును గూర్చి ఒప్పుకున్నారు. (మత్తయి 24 అధ్యాయము, మార్కు 13 అధ్యాయముకూడా చూడుము.) నిశ్చయంగా 1914 తరము గుర్తించదగినది. యేసుమాటలలో రెండవ నెరవేర్పును కల్గియున్న దానిలో అది యిమిడియున్నది. “అవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదు.” (లూకా 21:32) “అవన్నియు” అనగా దానిలో మానవులను కలత పర్చువాటినుండి విడుదల కూడా యిమిడియున్నది.
యేసు తన అనుచరులకు యిచ్చిన అభయము: “ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. మీ విడుదల సమీపించుచున్నది. . . . మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసి కొనుడి.” మానవేతర ప్రపంచ ప్రభుత్వమైన దేవుని రాజ్యము ఈ భూమిని భూపరదైసుగా మార్చి వేయును. అందుచేత, సూచన ఎంత ఖచ్చితంగా నెరవేరినదో విడుదలకూడ అంత ఖచ్చితంగా నెరవేరును.—లూకా 21:28, 31; కీర్తన 72:1-8.
ఈ ప్రవచనాత్మక సూచనను బహుశ యింతకుముందు నీవు పరిశీలించియుండక పోవచ్చును. దేవుని వాక్యమును పరిశీలించుటలో కొనసాగుమని మేము నిన్ను ప్రోత్సహించుచున్నాము. అలా చేయుట మూలంగా మానవుల యెడల దేవుని సంకల్పములను గ్రహించుటకు అది నీకు తోడ్పడును. ఆ విధంగా రానైయున్న భూపరదైసులోనికి తప్పించువారిని యెహోవాదేవుడు ఏమి చేయుమని కోరుచున్నాడో నీవు నేర్చుకొందువు.—కీర్తన 37:10, 11; జెఫన్యా 2:2, 3; ప్రకటన 21:3-5.
[5వ పేజీలోని చిత్రసౌజన్యం]
Courtesy of German Railroads Information Office, New York
Eric Schwab/WHO
[6వ పేజీలోని చిత్రసౌజన్యం]
Jerry Frank/United Nations
U.S. Air Force photo