యేసుయొక్క జీవితము పరిచర్య
యెరూషలేముకు ఒక రహస్య పర్యటన
అది సా.శ 33 శరత్కాలము, పర్ణశాలల పండుగ సమీపించినది. యూదులు ఆయనను చంపుటకు ప్రయత్నించినప్పుడు, సా.శ. 31 నుండి యేసు తన పరిచర్యలో అధికభాగమును గలిలయ ప్రాంతమునకు పరిమితము చేసెను. అప్పటినుండి, బహుశ యేసు యూదుల వార్షిక పండుగలకు హాజరగుటకు మాత్రమే యెరూషలేమును సందర్శించెను.
యేసు సహోదరులు ఆయననుచూచి, “ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుమని” బలవంతపెట్టిరి. యెరూషలేము యూదయయొక్క ముఖ్యమైన పట్టణము మరియు ఆ దేశమంతటికి మత కేంద్రమై యున్నది. ఆయన సహోదరులు ఆయనతో, “బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తనపని రహస్యమున జరిగింపడని” తర్కించిరి.
యాకోబు, సీమోను, యోసేపు మరియు యూదా తమ పెద్దన్నయగు యేసు, మెస్సీయయని నమ్మకపోయినను, పండుగనాడు అక్కడకు చేరు వారందరికి ఆయన తన అద్భుత శక్తులను చూపించవలెనని వారు కోరిరి. అయితే, యేసు ప్రమాదమును ఎరిగినవాడై యున్నాడు. “లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నదని” ఆయన చెప్పెను. కావున యేసు తన సహోదరులతో, “మీరు పండుగకు వెళ్లుడి; . . . నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని” చెప్పెను.
పర్ణశాలల పండుగ ఏడుదినములుండును. ఎనిమిదవ దినమున పవిత్రకార్యములతో అది ముగియును. ఈ పండుగ వ్యవసాయక సంవత్సర ముగింపును గుర్తించును, కావున అది బహుగా ఆనందించు మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమయమై యుండును. ఇతర ప్రయాణికులందరితో కలిసి యేసు సహోదరులు వెళ్లిన అనేక దినముల తర్వాత, యేసు మరియు ఆయన శిష్యులు ఇతరుల కంటబడకుండ రహస్యముగా వెళ్లుదురు. అనేకులు ప్రయాణమైవెళ్లు యోర్దాను నది సమీపమునగల దారికి బదులు, వారు తమ ప్రయాణమును సమరయగుండా సాగించిరి.
యేసుకు ఆయన సహవాసులకు సమరయ గ్రామములో వసతులు కావలసిన అవసరము కలదుగనుక, వాటిని సిద్ధపరచుటకు ఆయన తమకంటె ముందుగా దూతలను అక్కడికి పంపెను. అయితే ఆయన యెరూషలేముకు వెళ్లుచున్నాడని తెలిసికొని ప్రజలెవరును ఆయనను చేర్చుకొనుటకు అంగీకరించలేదు. దానికి కోపగించిన యాకోబు, మరియు యోహాను, “ప్రభువా, ఆకాశమునుండి అగ్నిదిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా?” అని అడిగిరి. అటువంటి దానిని సూచించినందుకు యేసు వారిని గద్దించెను, కాగా వారు మరొక గ్రామమునకు ప్రయాణించిరి.
వారు దారినపోవుచుండగా, శాస్త్రి ఒకడు యేసుతో, “బోధకుడా నీవెక్కడికి వెళ్లినను నీ వెంటవచ్చెదనని” అనెను.
దానికి ప్రత్యుత్తరముగా యేసు, “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.” శాస్త్రి తన అనుచరుడైనట్లయిన అతడు కష్టము ననుభవించునని యేసు అతనికి వివరించుచున్నాడు. మరియు అటువంటి జీవితమును అంగీకరించుటకు శాస్త్రి వెరసెనని అంతర్నిహితముగా కన్పించుచున్నది.
మరొక మనుష్యునికి యేసు, “నా వెంటరమ్మని చెప్పెను.”
దానికి అతడు, “నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని” జవాబిచ్చెను.
అందుకు యేసు, “మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని” వానితో చెప్పెను. నిదర్శనాధారముగా, ఆ మనుష్యుని తండ్రి ఇంకను చనిపోలేదు, అలా జరిగియున్నట్లయిన అతడు యేసును వినుటకు ఇక్కడ ఉండేవాడుకాదు. ఆ కుమారుడు తనతండ్రి చనిపోవువరకు తనకు సమయమిమ్మని అడుగుచున్నాడు. దేవుని రాజ్యమును తన జీవితములో ముందుంచుటకు అతడు సిద్ధపడలేదు.
వారు యెరూషలేముకు వెళ్లుచుండగా, మరొక మనుష్యుడు యేసునొద్దకువచ్చి, “ప్రభువా, నీవెంట వచ్చెదను గాని నా యింటనున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని” అడిగెను.
దానికి జవాబుగా యేసు, “నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను.” యేసు శిష్యులుగా ఉండువారు తప్పక తమదృష్టిని రాజ్యసేవపై కేంద్రీకరించవలెను. దున్నువాడు తిన్నగా ముందుకు చూడకపోయినట్లయిన, చాళ్లు వంకరటింకరగా వచ్చునట్లే, ఈ పాతవిధానమువైపు వెనుకకు తిరిగిచూచు ఎవరైనను నిత్యజీవమునకు నడుపు దారిలో తప్పిపడిపోవుదురు. యోహాను 7:2-10; లూకా 9:51-62; మత్తయి 8:19-22.
◆ యేసు సహోదరులు ఎవరు, మరియు వారు ఆయననుగూర్చి ఎట్లు భావించిరి?
◆ సమరయులు ఎందుకు అంత అనాగరికముగా ప్రవర్తించిరి, కాగా యాకోబు, యోహాను ఏమిచేయగోరిరి.
◆ దారిలో యేసు ఏ మూడు విధములైన సంభాషణలను కలిగియుండెను, మరియు ఆయన ఎట్లు స్వయం-త్యాగ సేవయొక్క అవసరతను నొక్కితెలియజేసెను? (w88 3/15)