లెసన్ 85
యేసు విశ్రాంతి రోజున జబ్బుల్ని తగ్గించాడు
పరిసయ్యులకు యేసు అంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్లు ఆయన్ని బంధించడానికి కారణాలు వెతుకుతున్నారు. సబ్బాతు రోజున యేసు ప్రజలను బాగు చేయకూడదు అని వాళ్లు చెప్పారు. ఎందుకంటే సబ్బాతు అంటే అందరూ విశ్రాంతి తీసుకునే రోజు. ఒక సబ్బాతు లేదా విశ్రాంతి రోజున ఒక గుడ్డివాడు రోడ్డు మీద అడుక్కోవడం యేసు చూశాడు. ఆయన శిష్యులతో ‘దేవుని శక్తి ఇతనికి ఎలా సహాయం చేస్తుందో చూడండి’ అన్నాడు. యేసు ఉమ్ముతో మట్టిని కలిపి బురద చేసి దాన్ని ఆ గుడ్డివాడి కళ్ల మీద రాశాడు. యేసు అతనితో ‘సిలోయము అనే కొలను దగ్గరకు వెళ్లి నీ కళ్లు కడుక్కో’ అన్నాడు. అతను అలా చేశాడు, అప్పుడు జీవితంలో మొదటిసారి ఆయన చూడగలిగాడు.
ప్రజలు ఆశ్చర్యపోయారు. వాళ్లు ఇలా అన్నారు: ‘ఇతను రోడ్డు మీద కూర్చుని అడుక్కునే వాడేనా లేదా అతనిలా ఉండే వేరేవాడా?’ అప్పుడు ఆ గుడ్డివాడు ఇలా అన్నాడు: ‘నేనే ఆ గుడ్డివాడిని.’ ప్రజలు అతన్ని ఇలా అడిగారు: ‘మరి ఇప్పుడు నీకు కళ్లు ఎలా కనిపిస్తున్నాయి?’ అతను వాళ్లకు జరిగింది చెప్పాక వాళ్లు అతన్ని పరిసయ్యుల దగ్గరికి తీసుకెళ్లారు.
అతను పరిసయ్యులతో ఇలా అన్నాడు: ‘యేసు నా కళ్ల మీద బురద రాసి వెళ్లి కడుక్కోమన్నాడు. నేను కడుక్కున్నాను. ఇప్పుడు చూడగలుగుతున్నాను.’ అప్పుడు పరిసయ్యులు ‘యేసు సబ్బాతు రోజున బాగు చేస్తే, ఆయన శక్తి దేవుని నుండి వచ్చింది కాదు’ అన్నారు. కానీ వేరేవాళ్లు ‘అతనికి శక్తి దేవుని నుండి రాకపోతే అతను అసలు బాగు చేయగలిగే వాడే కాదు’ అన్నారు.
పరిసయ్యులు ఆ గుడ్డివాడి అమ్మానాన్నని పిలిచి, ‘మీ కొడుకు ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడు?’ అని అడిగారు. అతని అమ్మానాన్న భయపడ్డారు. ఎందుకంటే ఎవరైనా యేసు మీద నమ్మకం ఉంచితే, వాళ్లను సమాజమందిరం నుండి బయటకు తరిమేస్తామని పరిసయ్యులు చెప్పారు. కాబట్టి అతని అమ్మానాన్న ‘మాకు తెలియదు, అతన్నే అడగండి’ అని చెప్పారు. పరిసయ్యులు అతన్ని చాలా ప్రశ్నలు అడిగారు, చివరికి అతను ‘నాకు తెలిసినదంతా నేను మీకు చెప్పాను. మీరు మళ్లీమళ్లీ ఎందుకు అడుగుతున్నారు?’ అని అన్నాడు. పరిసయ్యులకు కోపం వచ్చి అతన్ని బయట పడేశారు.
యేసు అతని కోసం వెదికి ఇలా అడిగాడు, ‘నీకు మెస్సీయ మీద నమ్మకం ఉందా?’ చూపు వచ్చిన ఆ గుడ్డివాడు ‘ఆయన ఎవరో తెలిస్తే నేను నమ్ముతాను’ అన్నాడు. యేసు ‘నేనే మెస్సీయ’ అని చెప్తాడు. నిజంగా యేసుకు ఎంత దయ ఉందో కదా? ఆయన ఆ గుడ్డి వాడిని బాగుచేయడమే కాదు అతనికి విశ్వాసం కలగడానికి కూడా సహాయం చేశాడు.
“మీకు లేఖనాలూ తెలియవు, దేవుని శక్తీ తెలీదు. అందుకే మీరు పొరబడుతున్నారు.”—మత్తయి 22:29