కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 135 పేజీ 306-పేజీ 307 పేరా 4
  • పునరుత్థానమైన యేసు చాలామందికి కనిపించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పునరుత్థానమైన యేసు చాలామందికి కనిపించాడు
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • పలుమార్లు ప్రత్యక్షమగుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • గడియ వేసివున్న గదిలోకి ప్రవేశించడం
    నా బైబిలు కథల పుస్తకము
  • యేసు పునరుత్థానమయ్యాడు!
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
  • దేవుడు తన కుమారుణ్ణి పునరుత్థానం చేశాడు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 135 పేజీ 306-పేజీ 307 పేరా 4
పునరుత్థానమైన యేసు తోమాకు కనిపించాడు

135వ అధ్యాయం

పునరుత్థానమైన యేసు చాలామందికి కనిపించాడు

లూకా 24:13-49 యోహాను 20:19-29

  • ఎమ్మాయుకు వెళ్లే దారిలో యేసు కనిపించాడు

  • యేసు తన శిష్యులకు పదేపదే లేఖనాల్ని వివరించాడు

  • తోమా సందేహించాడు

అది నీసాను 16, ఆదివారం. శిష్యులు చాలా దిగులుగా ఉన్నారు. యేసు పునరుత్థానం అవ్వడం వల్లే సమాధి ఖాళీగా ఉందని వాళ్లు అర్థంచేసుకోలేదు. (మత్తయి 28:9, 10; లూకా 24:11) ఆ తర్వాత అదే రోజు క్లెయొపా, ఇంకో శిష్యుడు యెరూషలేము నుండి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయుకు బయల్దేరారు.

వాళ్లు జరిగిన విషయాల గురించి దారిపొడవునా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒక వ్యక్తి వాళ్లతోపాటు నడుస్తూ, “మీరు దేని గురించి వాదించుకుంటున్నారు?” అని అడిగాడు. దానికి క్లెయొపా, “ఈమధ్యే యెరూషలేములో జరిగిన విషయాల గురించి తెలియకపోవడానికి నువ్వేమైనా విదేశీయుడివా? అక్కడ ఒంటరిగా జీవిస్తున్నావా?” అన్నాడు. అప్పుడు ఆయన, “ఏ విషయాలు?” అని అడిగాడు.—లూకా 24:17-19.

“నజరేయుడైన యేసు గురించిన విషయాలు” అని వాళ్లు జవాబిచ్చారు. తర్వాత ఇలా అన్నారు: “ఇశ్రాయేలుకు విడుదల తీసుకురాబోయే వ్యక్తి ఆయనే అని మేము ఆశతో ఎదురుచూశాం.”—లూకా 24:19-21.

క్లెయొపా, అతనితో ఉన్న శిష్యుడు ఆ రోజు జరిగినవాటిని చెప్పడం మొదలుపెట్టారు. కొంతమంది స్త్రీలు యేసు సమాధి దగ్గరికి వెళ్లేసరికి అది ఖాళీగా ఉందనీ, అక్కడ వాళ్లకు దేవదూతలు కనిపించి యేసు తిరిగి బ్రతికిన సంగతి చెప్పారనీ, వేరేవాళ్లు కూడా సమాధి దగ్గరికి వెళ్లి “అక్కడంతా ఆ స్త్రీలు చెప్పినట్టే” ఉండడం చూశారనీ ఆ వ్యక్తికి చెప్పారు.—లూకా 24:24.

కానీ జరుగుతున్న వాటి అర్థాన్ని, యేసు పునరుత్థానం అయ్యాడనే విషయాన్ని ఆ ఇద్దరు శిష్యులు గ్రహించలేకపోయారు. అందుకే వాళ్లతోపాటు నడుస్తున్న వ్యక్తి వాళ్ల ఆలోచనను సరిదిద్దుతూ ఇలా అన్నాడు: “తెలివితక్కువ మనుషులారా, ప్రవక్తలు చెప్పిన విషయాల్ని మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? క్రీస్తు తన మహిమలో ప్రవేశించాలంటే, వీటిని అనుభవించడం తప్పనిసరి కదా?” (లూకా 24:25, 26) తర్వాత, క్రీస్తు గురించిన ఎన్నో లేఖనాల్ని ఆయన వాళ్లకు వివరించడం మొదలుపెట్టాడు.

చివరికి, ఆ ముగ్గురు ఎమ్మాయు దగ్గరికి చేరుకున్నారు. ఆయన చెప్పే విషయాలు ఇంకా వినాలనే ఉద్దేశంతో, “సాయంత్రం కావస్తోంది కాబట్టి మాతోనే ఉండిపో” అని ఆ శిష్యులు అన్నారు. దానికి ఆయన ఒప్పుకున్నాడు. అప్పుడు వాళ్లు కలిసి భోజనం చేశారు. ఆయన ప్రార్థన చేసి, రొట్టె విరిచి వాళ్లకు ఇవ్వగానే, ఆయనెవరో వాళ్లు గుర్తుపట్టారు. కానీ అంతలోనే ఆయన మాయమయ్యాడు. (లూకా 24:29-31) యేసు నిజంగా లేచాడని ఇప్పుడు వాళ్లకు నమ్మకం కుదిరింది!

వాళ్లు జరిగినదాని గురించి సంతోషంగా ఇలా మాట్లాడుకున్నారు: “దారిలో ఆయన మనతో మాట్లాడుతూ, లేఖనాల అర్థాన్ని విడమర్చి చెప్తున్నప్పుడు లోలోపల మన హృదయాలు మండుతున్నట్టు మనకు అనిపించలేదా?” (లూకా 24:32) వెంటనే వాళ్లు తిరిగి యెరూషలేముకు బయల్దేరి అపొస్తలులు, ఇతరులు ఉన్న చోటికి వెళ్లారు. క్లెయొపా, అతనితో ఉన్న శిష్యుడు ఇంకా ఏమీ చెప్పకముందే, అక్కడున్న వాళ్లు “నిజంగానే ప్రభువు మళ్లీ బ్రతికించబడ్డాడు, ఆయన సీమోనుకు కనిపించాడు!” అన్నారు. (లూకా 24:34) యేసు తమకు కూడా కనిపించాడని ఆ ఇద్దరు శిష్యులు చెప్పారు.

ఇప్పుడు యేసు వాళ్లున్న గదిలో ప్రత్యక్షమవ్వడంతో అందరూ అవాక్కయ్యారు. యూదులకు భయపడి వాళ్లు తలుపులు గట్టిగా బిగించుకున్నారు. అయినా యేసు వాళ్ల మధ్యకు వచ్చి నిలబడడంతో వాళ్ల కళ్లను వాళ్లే నమ్మలేకపోయారు. యేసు మృదువుగా, “మీకు శాంతి కలగాలి” అన్నాడు. కానీ వాళ్లు అంతకుముందులాగే ఇప్పుడు కూడా ఆయన ఒక దేవదూత అనుకుని భయపడ్డారు.—లూకా 24:36, 37; మత్తయి 14:25-27.

తాను ఒక దేవదూతో, వాళ్ల భ్రమో కాదని ఒప్పించడానికి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరెందుకు కంగారుపడుతున్నారు? మీ హృదయాల్లో సందేహాలు ఎందుకు వస్తున్నాయి? నా చేతులు, పాదాలు చూసి నేనే అని తెలుసుకోండి. నన్ను ముట్టుకొని చూడండి. మీరు చూస్తున్నారు కదా, నాకు ఉన్నట్టుగా దేవదూతకు మాంసం, ఎముకలు ఉండవు.” (లూకా 24:36-39) వాళ్లు ఆనందంలో, ఆశ్చర్యంలో మునిగితేలారు. కానీ ఆయన యేసేనా అని ఎక్కడో చిన్న సందేహం.

తాను దేవదూత కాదని వాళ్లను ఒప్పించడానికి, యేసు “మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా?” అని అడిగాడు. వాళ్లు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చారు, ఆయన దాన్ని తిన్నాడు. తర్వాత ఆయన ఇలా అన్నాడు: “నేను ఇంకా మీతోనే ఉన్నప్పుడు, నా గురించి మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల పుస్తకాల్లో, కీర్తనల పుస్తకంలో రాసినవన్నీ నెరవేరాలని మీతో చెప్పాను కదా.”—లూకా 24:41-44.

క్లెయొపాకు, అతనితో ఉన్న శిష్యునికి లేఖనాల్ని విడమర్చి చెప్పినట్లే, యేసు అక్కడున్న వాళ్లందరికీ లేఖనాల్ని విడమర్చి చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “లేఖనాలు ఇలా చెప్తున్నాయి: క్రీస్తు బాధలుపడి, మూడో రోజున మృతుల్లో నుండి మళ్లీ బ్రతుకుతాడు; ప్రజలు పశ్చాత్తాపపడి పాపక్షమాపణ పొందాలనే సందేశం, యెరూషలేముతో మొదలుపెట్టి అన్ని దేశాలకు ఆయన పేరున ప్రకటించబడుతుంది. మీరు వీటికి సాక్షులుగా ఉండాలి.”—లూకా 24:46-48.

ఎందుకోగానీ అపొస్తలుడైన తోమా ఆ రోజు అక్కడ లేడు. ఆ తర్వాత ఇతర శిష్యులు, “మేము ప్రభువును చూశాం!” అని సంతోషంగా అతనికి చెప్పారు. కానీ తోమా ఇలా అన్నాడు: “నేను ఆయన చేతుల్లోని మేకుల గాయాల్ని చూసి, వాటిని నా వేలితో ముట్టుకుని, ఆయన పక్కభాగంలో నా చేతిని ఉంచితేనేగానీ నమ్మను.”—యోహాను 20:25.

ఎనిమిది రోజుల తర్వాత శిష్యులు మళ్లీ ఒక చోట సమకూడి, తలుపులు గట్టిగా బిగించుకున్నారు. ఈసారి తోమా కూడా వాళ్లతో ఉన్నాడు. అప్పుడు యేసు మానవ శరీరంతో వాళ్లకు కనిపించి, “మీకు శాంతి కలగాలి” అన్నాడు. తర్వాత తోమాతో ఇలా అన్నాడు: “నీ వేలితో నా చేతుల్ని ముట్టుకో. నీ చేతిని నా పక్కభాగంలో ఉంచు. ఇక సందేహపడడం మాని, నమ్ము.” అప్పుడు తోమా, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు. (యోహాను 20:26-28) అవును, యెహోవా దేవుని ప్రతినిధిగా, యేసు ఒక శక్తిమంతమైన ఆత్మప్రాణిగా తిరిగి లేచాడని ఇప్పుడు తోమా నిస్సందేహంగా నమ్మాడు.

యేసు అతనితో, “నువ్వు నన్ను చూశావు కాబట్టి నమ్ముతున్నావా? చూడకుండానే నమ్మేవాళ్లు సంతోషంగా ఉంటారు” అన్నాడు.—యోహాను 20:29.

  • ఎమ్మాయుకు వెళ్తున్న ఇద్దరు శిష్యుల్ని ఒక వ్యక్తి ఏం అడిగాడు?

  • తమ హృదయాలు మండుతున్నట్టు శిష్యులకు ఎందుకు అనిపించింది?

  • క్లెయొపా, అతనితో ఉన్న శిష్యుడు యెరూషలేముకు తిరిగెళ్లినప్పుడు ఏ సంతోషకరమైన వార్త విన్నారు? తర్వాత ఏం జరిగింది?

  • యేసు తిరిగి బ్రతికాడని తోమాకు ఎలా నమ్మకం కుదిరింది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి