88వ అధ్యాయం
ధనవంతుడు, లాజరు
ధనవంతుడు, లాజరు ఉదాహరణ
ఆస్తిపాస్తుల్ని ఉపయోగించే విషయంలో యేసు తన శిష్యులకు చక్కని సలహా ఇస్తున్నాడు. అయితే, ఆయన చెప్తున్న మాటల్ని అక్కడున్న పరిసయ్యులు కూడా వింటున్నారు. “డబ్బును ప్రేమించే పరిసయ్యులు” యేసు ఇస్తున్న సలహా విని, దాని గురించి ఆలోచించడం మంచిది. కానీ వాళ్లు ఆయన్ని “ఎగతాళి చేయడం మొదలుపెట్టారు.”—లూకా 15:2; 16:13, 14.
అయినా యేసు వాళ్లకు భయపడకుండా ఇలా అన్నాడు: “మీరు మనుషుల ముందు మిమ్మల్ని మీరు నీతిమంతులని ప్రకటించుకుంటారు, కానీ దేవునికి మీ హృదయాలు తెలుసు. మనుషులు గొప్పదని అనుకునేది దేవుని దృష్టిలో నీచమైనది.”—లూకా 16:15.
పరిసయ్యులు చాలాకాలం నుండి మనుషుల దృష్టిలో ‘గొప్పవాళ్లుగా’ ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారు కాబోతుంది. డబ్బు, రాజకీయపరమైన అధికారం, మతపరమైన పలుకుబడి గల పరిసయ్యులు పైస్థాయిలో ఉన్నారు. వాళ్లు ఇప్పుడు కింది స్థాయికి పడిపోబోతున్నారు. దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించే సామాన్య ప్రజలు పైస్థాయికి రాబోతున్నారు. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ యేసు ఇలా అన్నాడు:
“యోహాను వచ్చేవరకు ధర్మశాస్త్రం, ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. అప్పటినుండి దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించబడుతోంది. అన్నిరకాల ప్రజలు దానిలోకి ప్రవేశించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. నిజానికి ఆకాశం, భూమి నాశనమైనా, ధర్మశాస్త్రమంతా నెరవేరేవరకు దానిలోని ఒక చిన్న పొల్లు కూడా తప్పిపోదు.” (లూకా 3:18; 16:16, 17) ఒక పెద్ద మార్పు రాబోతుందని యేసు మాటలు ఎలా తెలియజేస్తున్నాయి?
మోషే ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటిస్తున్నామని యూదా మతనాయకులు గర్వంగా చెప్పుకునేవాళ్లు. యెరూషలేములో యేసు ఒక గుడ్డివాడికి చూపు తెప్పించినప్పుడు, పరిసయ్యులు గర్వంగా ఏమన్నారో గుర్తుతెచ్చుకోండి: “మేము మోషే శిష్యులం. దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు.” (యోహాను 9:13, 28, 29) దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ఒక కారణం, వినయస్థుల్ని మెస్సీయ దగ్గరికి అంటే యేసు దగ్గరికి నడిపించడం. బాప్తిస్మమిచ్చే యోహాను కూడా యేసే దేవుని గొర్రెపిల్ల అని తెలియజేశాడు. (యోహాను 1:29-34) యోహాను పరిచర్య మొదలైనప్పటి నుండి వినయస్థులైన యూదులు, ముఖ్యంగా పేదవాళ్లు “దేవుని రాజ్యం” గురించి వింటున్నారు. అవును, దేవుని రాజ్యంలో ఉండాలని, దాని నుండి ప్రయోజనం పొందాలని కోరుకునే వాళ్లందరికి “మంచివార్త” ప్రకటించబడుతోంది.
మోషే ధర్మశాస్త్రం దాని పనిని నెరవేర్చింది; అది ప్రజల్ని మెస్సీయ దగ్గరికి నడిపించింది. కాబట్టి, ధర్మశాస్త్రాన్ని ఇక పాటించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, కొన్ని కారణాల్ని బట్టి విడాకులు తీసుకోవడాన్ని ధర్మశాస్త్రం అనుమతించింది. అయితే యేసు ఇప్పుడు ఇలా చెప్పాడు: “భార్యకు విడాకులు ఇచ్చి వేరే ఆమెను పెళ్లి చేసుకునే ప్రతీ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు. విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్లిచేసుకునే వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు.” (లూకా 16:18) నియమాలు పట్టుకువేలాడే పరిసయ్యులకు ఆ మాటలు ఎంత కోపం తెప్పించి ఉంటాయో కదా!
త్వరలో జరగనున్న మార్పు ఎంత పెద్దదో స్పష్టం చేయడానికి యేసు ఒక ఉదాహరణ చెప్పాడు. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ల పరిస్థితులు పూర్తిగా తారుమారు అవుతాయి. ఆ ఉదాహరణ వింటున్నవాళ్లలో, మనుషుల చేత గొప్పగా ఎంచబడుతున్న, డబ్బును ప్రేమిస్తున్న పరిసయ్యులు కూడా ఉన్నారని గుర్తుంచుకోండి.
యేసు ఇలా చెప్పాడు: “ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను ఊదారంగు వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు వేసుకునేవాడు. రోజూ సుఖభోగాలు అనుభవిస్తూ విలాసవంతంగా బ్రతికేవాడు. లాజరు అనే ఒక అడుక్కునేవాడు కూడా ఉండేవాడు, అతని ఒళ్లంతా కురుపులే. కొంతమంది అతన్ని మోసుకొచ్చి ఆ ధనవంతుడి గుమ్మం దగ్గర పెట్టేవాళ్లు. అతను ఆ ధనవంతుడి భోజనం బల్ల నుండి కింద పడేవాటితో తన పొట్ట నింపుకోవాలని ఆశపడేవాడు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి.”—లూకా 16:19-21.
పరిసయ్యులు డబ్బును ప్రేమిస్తారు కాబట్టి, ఆ ఉదాహరణలోని “ధనవంతుడు” పరిసయ్యుల్నే సూచిస్తున్నాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాదు ఈ యూదా మతనాయకులు ఖరీదైన, ఆడంబరమైన బట్టలు వేసుకోవడానికి ఇష్టపడేవాళ్లు. వాళ్లకు కేవలం డబ్బే కాదు, సేవావకాశాలు కూడా ఎక్కువగానే ఉండేవి. కాబట్టి మిగతా ప్రజల కన్నా వాళ్లమీదే దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉన్నట్లు అనిపించేది. ఆ ఉదాహరణలోని ధనవంతుడు ఖరీదైన ఊదారంగు వస్త్రం వేసుకోవడం, పరిసయ్యులు ఉన్నత స్థానంలో ఉన్నారని, వాళ్లు స్వనీతిపరులని తెలియజేస్తుంది.—దానియేలు 5:7.
ధనవంతులైన, గర్విష్ఠులైన ఈ నాయకులు పేదవాళ్లను, సామాన్య ప్రజల్ని చిన్నచూపు చూసేవాళ్లు. వాళ్లను ధర్మశాస్త్రం తెలియనివాళ్లలా, దాని గురించి నేర్చుకునే అర్హత లేని మట్టి మనుషుల్లా (ఆమ్‌హారెట్స్) చూసేవాళ్లు. (యోహాను 7:49) ఆ ప్రజల పరిస్థితి, “ధనవంతుడి భోజనం బల్ల నుండి కింద పడేవాటితో” ఆకలి తీర్చుకోవాలని ఆశపడే లాజరు పరిస్థితిలాగే ఉంది. లాజరుకు ఒళ్లంతా కురుపులు ఉన్నట్లే సామాన్య ప్రజలకు కూడా ఆధ్యాత్మిక రోగం ఉన్నట్లు పరిసయ్యులు చూసేవాళ్లు. అంటే, వాళ్లమీద దేవుని అనుగ్రహం లేదని భావించేవాళ్లు.
ఈ దయనీయ పరిస్థితి చాలాకాలంగా ఉంది. అయితే ఒక పెద్ద మార్పు జరిగే సమయం వచ్చేసిందని యేసుకు తెలుసు. పరిసయ్యుల్ని సూచిస్తున్న ధనవంతుడి పరిస్థితి, సామాన్య ప్రజల్ని సూచిస్తున్న లాజరు పరిస్థితి తారుమారు కాబోతున్నాయి.
ధనవంతుడు, లాజరు పరిస్థితుల్లో మార్పు
వాళ్ల పరిస్థితుల్లో వచ్చిన మార్పును యేసు ఇలా వివరించాడు: “కొంతకాలానికి ఆ అడుక్కునేవాడు చనిపోయాడు. దేవదూతలు అతన్ని తీసుకెళ్లి అబ్రాహాము పక్కన కూర్చోబెట్టారు. తర్వాత ఆ ధనవంతుడు కూడా చనిపోయి, సమాధి చేయబడ్డాడు. అతను సమాధిలో వేదన పడుతూ తల ఎత్తి చూశాడు. అప్పుడు అతనికి దూరంగా అబ్రాహాము, అబ్రాహాము పక్కన ఉన్న లాజరు కనిపించారు.”—లూకా 16:22, 23.
అబ్రాహాము చనిపోయి చాలాకాలం అయిందని, ఇప్పుడు అతను సమాధిలో ఉన్నాడని యేసు మాటల్ని వింటున్నవాళ్లకు తెలుసు. అబ్రాహామే కాదు, సమాధిలో లేదా షియోల్‌లో ఉన్న ఎవ్వరూ చూడలేరని, మాట్లాడలేరని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. (ప్రసంగి 9:5, 10) మరి ఈ ఉదాహరణ ద్వారా యేసు ఏం చెప్తున్నాడని మతనాయకులు అనుకుని ఉంటారు? సామాన్య ప్రజల గురించి, డబ్బును ప్రేమించే పరిసయ్యుల గురించి యేసు ఏం చెప్తుండవచ్చు?
ఒక మార్పు వస్తుందని తెలియజేస్తూ యేసు ఇంతకుముందే ఇలా అన్నాడు: “యోహాను వచ్చేవరకు ధర్మశాస్త్రం, ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. అప్పటినుండి దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించబడుతోంది.” అవును యోహాను, యేసుక్రీస్తు చేసిన ప్రకటనా పని వల్ల ధనవంతుడు, లాజరు పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
ముఖ్యంగా వినయస్థులు, పేదవాళ్లు చాలాకాలంగా ఆధ్యాత్మిక ఆకలితో అలమటిస్తున్నారు. అయితే మొదటిగా బాప్తిస్మమిచ్చే యోహాను, ఆ తర్వాత యేసు దేవుని రాజ్యం గురించి ప్రకటించడంతో ప్రజలకు సహాయం దొరికింది, వాళ్లు ఆ సందేశానికి చక్కగా స్పందించారు. ఇదివరకు వాళ్లు కేవలం మతనాయకుల ‘ఆధ్యాత్మిక బల్ల నుండి కింద పడేవాటితోనే’ తృప్తిపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాళ్లు ప్రాథమిక లేఖన సత్యాలతో, ప్రత్యేకించి యేసు వివరిస్తున్న అద్భుతమైన విషయాలతో పోషించబడుతున్నారు. అలా చివరికి వాళ్లు యెహోవా దేవుని అనుగ్రహం పొందినట్లు అయింది.
డబ్బు, పలుకుబడి ఉన్న మతనాయకులు మాత్రం యోహాను ప్రకటించిన రాజ్య సందేశాన్ని, దేశమంతటా యేసు ప్రకటిస్తున్న రాజ్య సందేశాన్ని వినడానికి ఇష్టపడలేదు. (మత్తయి 3:1, 2; 4:17) నిజానికి ఆ సందేశం వాళ్లకు కోపం తెప్పించింది, బాధించింది. ఎందుకంటే ఆ సందేశం, దేవుడు తీసుకురాబోయే భయంకరమైన తీర్పును తెలియజేసింది. (మత్తయి 3:7-12) ఒకవేళ యేసు, ఆయన శిష్యులు దేవుని సందేశాన్ని ప్రకటించడం ఆపేసివుంటే డబ్బును ప్రేమించే ఆ మతనాయకులకు ఊరట దొరికేది. ఒకవిధంగా, “తండ్రివైన అబ్రాహామూ, నా మీద కరుణ చూపించు. నేను ఈ మంటల్లో ఎంతో వేదన పడుతున్నాను. కాబట్టి లాజరును పంపించి, తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లబర్చమని చెప్పు” అన్న ధనవంతుడిలాగే వాళ్లు ఉన్నారు.—లూకా 16:24.
కానీ వాళ్లు కోరుకున్న ఉపశమనం దొరకదు. చాలామంది మతనాయకులు మారలేదు. ఎందుకంటే, యేసును దేవుడు పంపిన మెస్సీయగా, రాజుగా అంగీకరించడానికి సహాయం చేసే ‘మోషే మాటను, ప్రవక్తల మాటను’ వాళ్లు పెడచెవిన పెట్టారు. (లూకా 16:29, 31; గలతీయులు 3:24) వాళ్లు తమను తాము తగ్గించుకునే బదులు, పేదవాళ్లు మాకు ప్రకటించడమేంటి అని అనుకున్నారు. కానీ ఆ పేదవాళ్లు యేసును అంగీకరించి దేవుని అనుగ్రహం పొందారు. యేసు శిష్యులు మతనాయకుల్ని సంతోషపెట్టడానికో, వాళ్లకు ఊరటనివ్వడానికో తమ సందేశాన్ని నీరుగార్చలేరు లేదా రాజీపడలేరు. ఉదాహరణలోని ‘తండ్రియైన అబ్రాహాము’ ధనవంతుడితో అన్న ఈ మాటల్ని బట్టి అది అర్థమౌతుంది:
“బాబూ, నీకు గుర్తు లేదా? నువ్వు బ్రతికున్నప్పుడు ఎన్నో మంచివాటిని అనుభవించావు, కానీ లాజరు ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయితే ఇప్పుడతను ఇక్కడ ఊరట పొందుతున్నాడు, నువ్వేమో వేదన పడుతున్నావు. పైగా, మీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఉంది. కాబట్టి ఇక్కడి నుండి మీ దగ్గరికి వెళ్లాలనుకునేవాళ్లు వెళ్లలేరు. అలాగే, అక్కడి నుండి ప్రజలు మా దగ్గరికి రాలేరు.”—లూకా 16:25, 26.
అలా వాళ్ల పరిస్థితుల్లో పెద్ద మార్పు రావడం న్యాయమే, సరైనదే! గర్విష్ఠులైన మతనాయకుల పరిస్థితి, వినయస్థుల పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యాయి. వినయస్థులు ఇప్పుడు యేసు కాడి కిందికి వచ్చి సేదదీర్పు పొందుతున్నారు, ఆధ్యాత్మికంగా పోషించబడుతున్నారు. (మత్తయి 11:28-30) ఇంకొన్ని నెలల్లో ధర్మశాస్త్ర ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం వచ్చినప్పుడు, ఆ మార్పు మరింత స్పష్టమౌతుంది. (యిర్మీయా 31:31-33; కొలొస్సయులు 2:14; హెబ్రీయులు 8:7-13) సా.శ. 33 పెంతెకొస్తు రోజున పవిత్రశక్తి కుమ్మరించబడినప్పుడు, దేవుని అనుగ్రహం పరిసయ్యుల మీద, వాళ్ల సహచరుల మీద లేదుగానీ యేసు శిష్యుల మీదే ఉందని స్పష్టమైంది.