కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jy అధ్యా. 73 పేజీ 172-పేజీ 173 పేరా 2
  • పొరుగువాడైన సమరయుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పొరుగువాడైన సమరయుడు
  • యేసే మార్గం, సత్యం, జీవం
  • ఇలాంటి మరితర సమాచారం
  • పొరుగువాడైన సమరయుడు
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • ఎందుకు ప్రేమ చూపించాలి?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • ఒక సమరయుడు మంచి పొరుగువాడిగా నిరూపించుకుంటాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యేసు బోధించే విధానం
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
యేసే మార్గం, సత్యం, జీవం
jy అధ్యా. 73 పేజీ 172-పేజీ 173 పేరా 2
గాయపడిన ఒక వ్యక్తిని ఆ దారిలో వెళ్తున్న యాజకుడు, లేవీయుడు పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే, ఒక సమరయుడు మాత్రం ఆగాడు

73వ అధ్యాయం

పొరుగువాడైన సమరయుడు

లూకా 10:25-37

  • శాశ్వత జీవితం పొందాలంటే ఏం చేయాలి?

  • నిజమైన పొరుగువాడిగా ఉన్న సమరయుడు

యేసు ఇంకా యెరూషలేము చుట్టుపక్కలే ఉన్నాడు. కొంతమంది యూదులు ఆయన నుండి నేర్చుకోవాలని, ఇంకొంతమంది ఆయన్ని పరీక్షించాలని ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్లలో ధర్మశాస్త్రంలో ఆరితేరిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అతను యేసును ఇలా అడిగాడు: “బోధకుడా, శాశ్వత జీవితం పొందడానికి నేను ఏంచేయాలి?”—లూకా 10:25.

అతను కేవలం జవాబు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడగట్లేదని యేసుకు అర్థమైంది. బహుశా, యూదులకు కోపం తెప్పించే జవాబును యేసు నోటి నుండి రప్పించాలని అతను అనుకుంటుండవచ్చు. అతనికి ముందే ఒక అభిప్రాయం ఉందని యేసు గ్రహించాడు. కాబట్టి యేసు తెలివిగా మాట్లాడి, అతని ఆలోచనను అతనితోనే చెప్పించాడు.

యేసు అతన్ని, “ధర్మశాస్త్రంలో ఏం రాసివుంది? నీకేం అర్థమైంది?” అని అడిగాడు. అతను ధర్మశాస్త్రాన్ని చదివిన వ్యక్తి కాబట్టి దాని ఆధారంగానే జవాబిచ్చాడు. అతను ద్వితీయోపదేశకాండం 6:5, లేవీయకాండం 19:18 ఆధారంగా ఇలా చెప్పాడు: “‘నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ పూర్తి బలంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.’ అలాగే ‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.’” (లూకా 10:26, 27) ఆ జవాబు సరైనదేనా?

యేసు అతనితో, “సరిగ్గా జవాబిచ్చావు; అలా చేస్తూ ఉండు, అప్పుడు నువ్వు శాశ్వత జీవితం పొందుతావు” అన్నాడు. అయితే ఆ చర్చ అంతటితో అయిపోలేదు. అతను కేవలం జవాబు తెలుసుకోవాలని కాదుగానీ, “తాను నీతిమంతుణ్ణి అని” చూపించుకోవడానికే అలా అడిగాడు. తన అభిప్రాయాలు సరైనవని, తాను ఇతరులతో ప్రవర్తించే విధానం సరైనదని అతను యేసుతో చెప్పించాలనుకున్నాడు. కాబట్టి అతను ఇలా అడిగాడు: “ఇంతకీ నా పొరుగువాడు ఎవరు?” (లూకా 10:28, 29) అది చూడడానికి చాలా చిన్న ప్రశ్నలా అనిపించినా, దాంట్లో లోతైన అర్థం ఉంది. ఎలా?

“పొరుగువాడు” లేదా “సాటిమనిషి” అనే మాట యూదా ఆచారాల్ని పాటించేవాళ్లకు మాత్రమే వర్తిస్తుందని యూదులు నమ్మేవాళ్లు. లేవీయకాండం 19:18 కూడా దాన్ని సమర్థిస్తున్నట్లుగా అనిపించవచ్చు. నిజానికి, యూదులుకాని వాళ్లతో సహవసించడం “తప్పు” అని కూడా వాళ్లు అనుకుని ఉండవచ్చు. (అపొస్తలుల కార్యాలు 10:28) కాబట్టి తోటి యూదులతో దయగా ప్రవర్తిస్తే నీతిగా ప్రవర్తించినట్లేనని అతను, అలాగే యేసు శిష్యుల్లో కొంతమంది అనుకుంటుండవచ్చు. వాళ్లు యూదులుకాని వ్యక్తితో దయగా ప్రవర్తించేవాళ్లు కాదు; వాళ్ల దృష్టిలో ఆ వ్యక్తి “పొరుగువాడు” కానేకాదు.

మరి అతనికి, మిగతా యూదులకు ఇబ్బంది కలిగించకుండా యేసు ఆ అభిప్రాయాన్ని ఎలా సరిదిద్దగలడు? ఆయన ఒక కథ చెప్పాడు: “ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్తుండగా దొంగల చేతికి చిక్కాడు. వాళ్లు అతన్ని నిలువునా దోచుకొని, కొట్టి, కొనప్రాణంతో వదిలేసి వెళ్లిపోయారు. అనుకోకుండా ఒక యాజకుడు అదే దారిలో వెళ్తూ ఉన్నాడు. అతను ఆ వ్యక్తిని చూసి, పక్క నుండి వెళ్లిపోయాడు. అలాగే, ఒక లేవీయుడు ఆ చోటికి వచ్చినప్పుడు అతన్ని చూసి, మరో వైపు నుండి వెళ్లిపోయాడు. అయితే ఒక సమరయుడు ఆ దారిలో వెళ్తూ అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు అతనికి జాలేసింది.”—లూకా 10:30-33.

చాలామంది యాజకులు, ఆలయంలో సేవచేసే లేవీయులు యెరికోలో నివసిస్తారని ఆ ప్రశ్న అడిగిన వ్యక్తికి తెలిసేవుంటుంది. ఆలయం నుండి ఇంటికి తిరిగిరావడానికి వాళ్లు దాదాపు 23 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆ దారి చాలా ప్రమాదకరంగా ఉండేది, దారిలో దొంగలు మాటువేసేవాళ్లు. తోటి యూదుడు దారిలో నిస్సహాయ స్థితిలో కనబడితే యాజకుడు, లేవీయుడు సహాయం చేయాలి కదా? కానీ ఈ కథలో, వాళ్లు అలా చేయలేదని యేసు చెప్పాడు. యూదులు అసహ్యించుకునే ఒక సమరయుడు అతనికి సహాయం చేశాడు.—యోహాను 8:48.

గాయపడిన ఆ యూదునికి సమరయుడు ఎలా సహాయం చేశాడు? యేసు ఇలా చెప్పాడు: “ఆ సమరయుడు అతని దగ్గరికి వచ్చి, అతని గాయాల మీద నూనె, ద్రాక్షారసం పోసి కట్టు కట్టాడు. తర్వాత అతన్ని తన గాడిద మీదికి ఎక్కించి, ఒక సత్రానికి తీసుకొచ్చి, అతని బాగోగులు చూసుకున్నాడు. తర్వాతి రోజు ఆ సమరయుడు రెండు దేనారాలు తీసి, ఆ సత్రం యజమానికి ఇచ్చి, ‘ఇతని బాగోగులు చూసుకో. ఇంతకన్నా ఎక్కువ ఖర్చయితే నేను తిరిగొచ్చినప్పుడు ఇస్తాను’ అని చెప్పాడు.”—లూకా 10:34, 35.

ఆ కథ చెప్పిన తర్వాత, గొప్ప బోధకుడైన యేసు అతన్ని ఆలోచింపజేసే ఈ ప్రశ్న అడిగాడు: “ఇప్పుడు చెప్పు, దొంగల చేతుల్లో పడిన వ్యక్తికి ఆ ముగ్గురిలో ఎవరు పొరుగువాడు అయ్యాడని నీకు అనిపిస్తుంది?” “సమరయుడు” అని చెప్పడానికి ఆ వ్యక్తి బహుశా ఇబ్బందిపడి, “అతని మీద కరుణ చూపించిన వ్యక్తే” అని జవాబిచ్చాడు. అప్పుడు యేసు తన కథలోని పాఠాన్ని స్పష్టం చేస్తూ ఇలా అన్నాడు: “నువ్వు కూడా వెళ్లి అలా చేయి.”—లూకా 10:36, 37.

యేసు ఎంత అద్భుతంగా బోధించాడో కదా! యూదులుకాని వాళ్లు కూడా పొరుగువాళ్లే అని యేసు సూటిగా చెప్పివుంటే ఆ వ్యక్తి, మిగతా యూదులు ఒప్పుకునేవాళ్లు కాదేమో. అందుకే, వాళ్లకు తెలిసిన విషయాలతోనే ఒక చిన్నకథ చెప్పడం ద్వారా “ఇంతకీ నా పొరుగువాడు ఎవరు?” అనే ప్రశ్నకు స్పష్టమైన జవాబిచ్చాడు. లేఖనాలు ఆజ్ఞాపిస్తున్నట్లు ప్రేమను, దయను చూపించేవాడే నిజమైన పొరుగువాడు.

  • శాశ్వత జీవితం పొందాలంటే ఏం చేయాలని ఒక వ్యక్తి యేసును ఎందుకు అడిగివుంటాడు?

  • పొరుగువాడు ఎవరని యూదులు అనుకునేవాళ్లు? ఎందుకు?

  • పొరుగువాడు ఎవరనే విషయంలో సరైన అభిప్రాయానికి వచ్చేలా యేసు ఎలా సహాయం చేశాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి