పరిపాలక సభ నుండి ఉత్తరం
ప్రియమైన సహోదరసహోదరీలకు,
జనవరి - మార్చి 2008, కావలికోట సార్వజనిక ప్రతి మొట్టమొదటి సంచిక, “వారి విశ్వాసాన్ని అనుసరించండి” అనే ఆసక్తిదాయకమైన ఆర్టికల్స్ పరంపరను పరిచయం చేసింది. ఇప్పటివరకు ఆ పేరు కింద చాలా ఆర్టికల్స్ వచ్చాయి. నిజంగా అవి మన మనసులను కట్టిపడేశాయి!
వాటి గురించి పాఠకులు ఏమంటున్నారు? మార్త గురించి వచ్చిన ఆర్టికల్ చదివాక ఒకావిడ ఇలా రాసింది: “అది చదివినప్పుడు నాకు నవ్వాగలేదు. మార్తకూ, నాకూ చాలా పోలికలున్నాయి. ఎప్పుడూ అందరికి వండిపెట్టడమంటే నాకూ చాలా ఇష్టం. అస్తమానం ఏదోక పనిలో నిమగ్నమైపోతాను. అప్పుడప్పుడు కాస్త విరామం తీసుకోవాలి, స్నేహితులతో సరదాగా సమయం గడపాలి అన్న విషయమే కొన్నిసార్లు మర్చిపోతుంటాను.” ఎస్తేరు కథ చదివిన పదిహేనేళ్ల అమ్మాయి ఆసక్తికరమైన ఈ వ్యాఖ్యానం చేసింది: “మన మనసు దుస్తుల చుట్టూ, కొత్తకొత్త ఫ్యాషన్ల చుట్టే తిరిగే అవకాశముందన్న మాట వాస్తవమే. మనం చక్కగా తయారవ్వాలి, కానీ అది శృతిమించకూడదు . . . యెహోవా చూసేది మన హృదయాన్నే.” అపొస్తలుడైన పేతురు గురించి వచ్చిన ఒక ఆర్టికల్ చదివాక ఓ క్రైస్తవ సహోదరి ఉత్సాహంగా ఇలా అంది: “నిజంగా అది చదువుతున్నప్పుడు అందులో పూర్తిగా లీనమైపోయాను. చదువుతున్నంతసేపూ నేను ఆ కాలానికి వెళ్లిపోయినట్టు, వాళ్ల మధ్యవుండి అంతా నా కళ్లతో చూస్తున్నట్టు, వింటున్నట్టు అనిపించింది.”
వీళ్లు, అలాగే ఇప్పటివరకు వచ్చిన ఈ ఆర్టికల్స్ మీద తమ మెప్పును వ్యక్తం చేసిన ఎంతోమంది ఇతర పాఠకులు, చాలా ఏళ్ల క్రితం అపొస్తలుడైన పౌలు రాసిన ఈ మాటలు నిజమని ఒప్పుకుంటారు: “పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.” (రోమా. 15:4) అవును, యెహోవా మనకు విలువైన పాఠాలు నేర్పించాలనే ఉద్దేశంతోనే ఈ గాథలను బైబిల్లో రాయించాడు. మనం సత్యం తెలుసుకొని ఎన్ని సంవత్సరాలైనా, ఆ గాథల నుండి మనమందరం ఎంతో నేర్చుకోవచ్చు.
వీలైనంత త్వరగా ఈ పుస్తకం చదవమని మిమ్మల్ని ప్రేమతో ప్రోత్సహిస్తున్నాం. మీ కుటుంబ ఆరాధనలో కూడా దీన్ని ఉపయోగించండి, పిల్లలకు ఇదెంతో నచ్చుతుంది! సంఘ బైబిలు అధ్యయనంలో ఈ పుస్తకాన్ని చర్చిస్తున్నప్పుడు, ఒక్క వారం కూడా తప్పకుండా చూసుకోండి! తగినంత సమయం కేటాయించండి, నిదానంగా చదవండి. మీ ఊహాశక్తికి పదునుపెట్టండి. పుస్తకంలోని పాత్రలకు ఎలా అనిపించిందో మీకూ అలాగే అనిపించాలి, వాళ్లు ఏవి చూశారో మీరూ అవే చూడాలి, అంతలా అందులో లీనమవ్వండి. ఆయా పరిస్థితుల్లో వాళ్లు ఎలా స్పందించారో, వాళ్ల స్థానంలో మీరు ఉంటే ఎలా స్పందించివుండేవాళ్లో ఆలోచించండి.
ఈ పుస్తకాన్ని మీతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మీకూ, మీ కుటుంబానికీ ఒక బహుమానం కావాలని ఆశిస్తున్నాం. మీ శ్రేయస్సు కోరుకుంటూ, నిండైన ప్రేమతో . . .
యెహోవాసాక్షుల పరిపాలక సభ