3వ పాఠం
బైబిలు సత్యం మళ్లీ ఎలా వెలుగులోకి వచ్చింది?
1870 లలో బైబిలు విద్యార్థులు
1879 లో మొదటి కావలికోట సంచిక
ఇప్పటి కావలికోట
క్రీస్తు చనిపోయిన తర్వాత తొలి క్రైస్తవుల్లో నుండి అబద్ధ బోధకులు పుట్టుకొస్తారని, వాళ్లు బైబిలు సత్యాన్ని కలుషితం చేస్తారని బైబిలు ముందే చెప్పింది. (అపొస్తలుల కార్యాలు 20:29, 30) సరిగ్గా అదే జరిగింది. అబద్ధ బోధకులు యేసు బోధల్ని వేరే మత సిద్ధాంతాలతో కలిపేశారు, అలా అబద్ధ క్రైస్తవత్వం మొదలైంది. (2 తిమోతి 4:3, 4) మరి బైబిలు నిజంగా బోధించేవాటిని మేము సరిగ్గా అర్థం చేసుకున్నామని ఎలా చెప్పవచ్చు?
యెహోవా దేవుడు సత్యాన్ని వెల్లడిచేసే సమయం వచ్చింది. ‘అంత్యకాలంలో నిజమైన జ్ఞానం ఎక్కువౌతుంది’ అని ఆయన ముందే చెప్పాడు. (దానియేలు 12:4) 1870 లో సత్యాన్ని వెతికే కొంతమంది, చర్చీలు బోధిస్తున్న చాలా సిద్ధాంతాలు బైబిలు ప్రకారం లేవని గ్రహించారు. దాంతో వాళ్లు బైబిలు నిజంగా ఏం బోధిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ విషయంలో యెహోవా వాళ్లకు సహాయం చేశాడు.
దేవున్ని సంతోషపెట్టాలని కోరుకునేవాళ్లు బైబిల్ని జాగ్రత్తగా పరిశోధించారు. ఆ బైబిలు విద్యార్థులు (లేదా, యెహోవాసాక్షులు) శ్రద్ధగా బైబిల్ని అధ్యయనం చేయడానికి ఒక పద్ధతిని ఉపయోగించారు. అదే పద్ధతిని ఇప్పుడు మేము పాటిస్తున్నాం. వాళ్లు ఒక్కో అంశం గురించి చర్చిస్తూ బైబిల్ని పరిశోధించేవాళ్లు. ఏదైనా కష్టమైన లేఖనం కనిపించినప్పుడు, దాన్ని అర్థం చేసుకోవడానికి వేరే లేఖనాలు పరిశీలించేవాళ్లు. సరైన అవగాహనకు వచ్చాక దాన్ని రాసిపెట్టేవాళ్లు. అలా బైబిల్లోని విషయాల్ని బైబిలు సహాయంతోనే గ్రహిస్తూ, దేవుని పేరు, ఆయన రాజ్యం, మనుషుల విషయంలో అలాగే భూమి విషయంలో ఆయన సంకల్పం, చనిపోయినవాళ్ల స్థితి, పునరుత్థానం వంటివాటి గురించిన సత్యాన్ని వెలికితీశారు. అలా ఎన్నో తప్పుడు నమ్మకాలు, ఆచారాలు, పద్ధతుల నుండి వాళ్లు విడుదల పొందారు.—యోహాను 8:31, 32.
సత్యాన్ని అందరికీ చాటిచెప్పే సమయం వచ్చిందని 1879కల్లా బైబిలు విద్యార్థులు అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్లు అదే సంవత్సరంలో, కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది అనే పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికను ఇప్పటికీ మేము ప్రచురిస్తున్నాం. నేడు 240 దేశాల్లో, 900 కన్నా ఎక్కువ భాషల్లో మేము బైబిలు సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం. అవును, ముందెప్పటికన్నా ఇప్పుడు నిజమైన జ్ఞానం ఎక్కువైంది!
క్రీస్తు చనిపోయిన తర్వాత బైబిలు సత్యానికి ఏమైంది?
మేము బైబిలు సత్యాన్ని మళ్లీ ఎలా వెలుగులోకి తీసుకురాగలిగాం?