అనుబంధం
తీర్పుదినం—అంటే ఏమిటి?
తీర్పుదినం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రజలు వందల కోట్ల సంఖ్యలో ఒక్కొక్కరుగా దేవుని సింహాసనం ఎదుటకు తీసుకు రాబడతారని చాలామంది అనుకుంటారు. అక్కడ, ప్రతీ ఒక్కరికి తీర్పు జరుగుతుంది. కొందరికి పరలోక సుఖాలు లభిస్తే, ఇతరులు నిత్యయాతన శిక్షకు లోనవుతారు. అయితే, ఈ కాలాన్ని గురించి బైబిలు పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని ఇస్తోంది. దేవుని వాక్యం దానిని ఒక భయానకమైన సమయంలా కాదుగానీ, నిరీక్షణ, పునఃస్థాపనల సమయంలా వర్ణిస్తోంది.
తీర్పుదినం గురించి అపొస్తలుడైన యోహాను ఇచ్చిన వర్ణనను మనం ప్రకటన 20:11, 12 లో ఇలా చదువుతాం: “ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పుపొందిరి.” ఇక్కడ వర్ణించబడిన న్యాయాధిపతి ఎవరు?
యెహోవా దేవుడే మానవాళి సర్వోన్నత న్యాయాధిపతి. అయితే ఆయన తీర్పు తీర్చే అసలు పనిని ఇంకొకరికి అప్పగిస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 17:31 ప్రకారం దేవుడు “తాను నియమించిన మనుష్యునిచేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు” అని అపొస్తలుడైన పౌలు వివరించాడు. ఈ నియమిత న్యాయాధిపతి పునరుత్థానం పొందిన యేసుక్రీస్తు. (యోహాను 5:22-23) అయితే ఆ తీర్పుదినం ఎప్పుడు ఆరంభమవుతుంది? అది ఎంతకాలం ఉంటుంది?
అర్మగిద్దోను యుద్ధం తర్వాత, ఈ భూమ్మీది సాతాను విధానం నాశనం చేయబడిన తర్వాత ఆ తీర్పుదినం ఆరంభమవుతుందని ప్రకటన పుస్తకం వివరిస్తోంది.a (ప్రకటన 16:14, 16; 19:19-20:3) అర్మగిద్దోను తర్వాత సాతాను, అతని దయ్యాలు వెయ్యి సంవత్సరాలపాటు అగాధంలో బంధించబడతారు. ఆ కాలంలో పరలోక సహపరిపాలకులైన 1,44,000 మంది న్యాయాధిపతులుగా ఉంటూ, “వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము” చేస్తారు. (ప్రకటన 14:1-3; 20:1-4; రోమీయులు 8:17) ఆ తీర్పుదినం కేవలం 24 గంటల్లోనే త్వరత్వరగా ముగిసిపోయేది కాదు. అది వెయ్యి సంవత్సరాలపాటు ఉంటుంది.
ఆ వెయ్యేండ్ల కాలంలో యేసుక్రీస్తు “సజీవులకును మృతులకును తీర్పు” తీరుస్తాడు. (2 తిమోతి 4:1) ఆ “సజీవులు” అర్మగిద్దోనును తప్పించుకునే “గొప్పసమూహ[పు]” సభ్యులై ఉంటారు. (ప్రకటన 7:9-17) “మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడి” ఉండడాన్ని కూడా అపొస్తలుడైన యోహాను చూశాడు. యేసు వాగ్దానం చేసినట్లుగా “సమాధులలో నున్నవారందరు ఆయన [క్రీస్తు] శబ్దము విని” పునరుత్థానం ద్వారా “బయటికి వచ్చెదరు.” (యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:14, 15) అయితే వారందరూ దేని ఆధారంగా తీర్పు పొందుతారు?
అపొస్తలుడైన యోహాను దర్శనం ప్రకారం “గ్రంథములు విప్పబడెను . . . ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పుపొందిరి.” (ప్రకటన 20:12) ఈ గ్రంథాల్లో ప్రజల గత క్రియలు వ్రాయబడి ఉన్నాయా? లేదు, ప్రజలు చనిపోకముందు తాము చేసిన క్రియల ఆధారంగా తీర్పు పొందరు. అలాగని మనకెలా తెలుసు? బైబిలు ఇలా చెబుతోంది: “చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పు పొంది యున్నాడు.” (రోమీయులు 6:7) కాబట్టి పునరుత్థానం చేయబడేవారు, ఒకవిధంగా చెప్పాలంటే, పాపవిముక్తులుగా ఉంటారు. అందువల్ల ఆ గ్రంథాలు దేవుని అదనపు నియమాలకు ప్రతీకగా ఉండవచ్చు. నిత్యజీవం పొందాలంటే ఇటు అర్మగిద్దోను తప్పించుకున్నవారు, అటు పునరుత్థానమైనవారు వెయ్యేండ్ల కాలంలో యెహోవా వెల్లడిచేసే కొత్త నియమాలతోపాటు దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండాలి. కాబట్టి, ఆయా వ్యక్తులు తీర్పుదిన కాలంలో తాము చేసే క్రియలనుబట్టి తీర్పు పొందుతారు.
వందల కోట్లమంది తీర్పుదినంలో దేవుని చిత్తమేమిటో తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించే అవకాశాన్ని మొట్టమొదటిసారిగా పొందుతారు. అంటే విస్తృత స్థాయిలో విద్యా పని జరుగుతుందని దానర్థం. అవును “లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.” (యెషయా 26:9) అయితే అందరూ దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడానికి ఇష్టపడరు. యెషయా 26:10 ఇలా చెబుతోంది: “దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.” ఇలాంటి దుష్టులు తీర్పుదినంలో శాశ్వత మరణానికి గురవుతారు.—యెషయా 65:20.
తీర్పుదిన ముగింపులో మిగిలిన మానవులు పరిపూర్ణ మానవులుగా ‘బ్రతికిన’ వారవుతారు. (ప్రకటన 20:5) ఆ విధంగా తీర్పుదినంలో మానవాళి తిరిగి పరిపూర్ణ స్థితికి తీసుకురాబడుతుంది. (1 కొరింథీయులు 15:24-28) అప్పుడు కడవరి పరీక్ష ఉంటుంది. అప్పుడు సాతాను అగాధంలో నుండి విడిపించబడి, చిట్టచివరిసారిగా మానవాళిని మోసగించేందుకు ప్రయత్నించడానికి అనుమతించబడతాడు. (ప్రకటన 20:3, 7-10) అతణ్ణి విజయవంతంగా ఎదిరించేవారు, ఈ బైబిలు వాగ్దానపు సంపూర్ణ నెరవేర్పును అనుభవిస్తారు: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) అవును, తీర్పుదినం నమ్మకమైన మానవులందరికీ ఒక ఆశీర్వాదంగా ఉంటుంది.
a అర్మగిద్దోను గురించిన సమాచారం కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) 1వ సంపుటి, 594-595, 1037-1038 పేజీలను, అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి పుస్తకంలో 20వ అధ్యాయం చూడండి.