42వ అధ్యాయం
మనం ఎందుకు పనిచేయాలి?
మీకు పనిచేయడం ఎక్కువ ఇష్టమా, ఆడుకోవడం ఎక్కువ ఇష్టమా?— నిజం చెప్పాలంటే, ఆడుకోవడంలో తప్పేమీ లేదు. యెరూషలేము ‘వీధులు, ఆటలాడే మగపిల్లలతో, ఆడపిల్లలతో నిండివుండడం’ గురించి బైబిలు చెప్తోంది.—జెకర్యా 8:5.
చిన్నపిల్లలు ఆడుకోవడం చూసి మన గొప్ప బోధకుడు సంతోషించేవాడు. ‘నేను దేవుని ప్రక్కనే నైపుణ్యంగల పనివానిగా ఉన్నాను. ఆయన ముందు నేను ఎప్పుడూ సంతోషంగా ఉన్నాను’ అని ఆయన భూమ్మీదకు రాకముందు అన్నాడు. యేసు పరలోకంలో యెహోవా దేవునితోపాటు పనిచేశాడని గమనించండి. ఆయన అక్కడ ఉన్నప్పుడు, ‘మనుషులంటే నాకు ఇష్టం’ అన్నాడు. అవును, మనం ముందు నేర్చుకున్నట్లు, చిన్నపిల్లలతో సహా మనలో ప్రతీ ఒక్కరి మీద మన గొప్ప బోధకుడికి నిజంగా ఆసక్తి ఉంది.—సామెతలు 8:30, 31, NW.
భూమ్మీదకు రాకముందు మన గొప్ప బోధకుడు ఏమి చూసి సంతోషించేవాడు?
యేసు చిన్నప్పుడు ఆడుకునేవాడా?— బహుశా ఆయన ఆడుకునివుండవచ్చు. కానీ ఆయన పరలోకంలో ‘నైపుణ్యంగల పనివానిగా’ ఉన్నాడు కాబట్టి భూమ్మీద ఉన్నప్పుడు కూడా పనిచేశాడా?— యేసును ‘వడ్రంగి కుమారుడు’ అని పిలిచేవాళ్లు. అంతేకాదు, ఆయనను ‘వడ్రంగి’ అని కూడా పిలిచేవాళ్లు. దీన్నిబట్టి ఏమి తెలుస్తుంది?— యేసును తన కుమారునిగా పెంచిన యోసేపు ఆయనకు ఆ పని నేర్పించివుంటాడు. అందుకే, యేసు కూడా వడ్రంగి అయ్యాడు.—మత్తయి 13:55; మార్కు 6:3.
యేసు ఎలాంటి వడ్రంగి?— ఆయన పరలోకంలో నైపుణ్యంగల పనివానిగా ఉండేవాడు కాబట్టి, ఆయన భూమ్మీద కూడా నైపుణ్యంగల వడ్రంగి అయ్యుండడా?— ఆ రోజుల్లో వడ్రంగి ఎంత కష్టపడి పనిచేయాల్సి ఉండేదో ఒకసారి ఆలోచించండి. యేసు బహుశా బయటకు వెళ్లి ఒక చెట్టును కొట్టి, దాన్ని ముక్కలు చేసి, వాటిని ఇంటికి తీసుకొచ్చి, వాటితో బల్లలు, బెంచీలు, ఇతర సామాగ్రి చేసివుంటాడు.
యేసు ఈ పని సంతోషంగా చేసేవాడా?— నలుగురికీ ఉపయోగపడేలా చక్కని బల్లలు, కుర్చీలు, ఇతర సామాగ్రి మీరు చేయగలిగితే మీకు సంతోషం అనిపిస్తుందా?— ‘తమ పనులనుబట్టి సంతోషించడం’ మంచిదని బైబిలు చెప్తోంది. పని చేసినప్పుడు వచ్చేలాంటి సంతోషం ఆడుకున్నప్పుడు రాదు.—ప్రసంగి 3:22.
పనిచేయడం నిజంగా మన మనస్సుకు, శరీరానికి మంచిది. చాలామంది పిల్లలు టీవీ చూస్తూ లేదా వీడియో గేములు ఆడుకుంటూ కూర్చుంటారు. వాళ్లు బాగా బరువు పెరిగిపోతారు, నీరసించిపోతారు, అంతేకాదు వాళ్లు నిజంగా సంతోషంగా ఉండరు. వాళ్లు వేరేవాళ్లను కూడా సంతోషపెట్టరు. మనం సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి?—
మనం 17వ అధ్యాయంలో నేర్చుకున్నట్లు, వేరేవాళ్లకు సహాయం చేయడానికి వాళ్లకు ఏమైనా ఇచ్చినప్పుడు, వాళ్ల కోసం ఏదైనా చేసినప్పుడు సంతోషం కలుగుతుంది. (అపొస్తలుల కార్యములు 20:35) యెహోవా సంతోషంగా ఉండే దేవుడు. మనం సామెతల్లో చదివినట్లు యేసు, ‘ఆయన ముందు ఎప్పుడూ సంతోషంగా ఉన్నాడు.’ యేసు ఎందుకు సంతోషంగా ఉన్నాడు?— ఆయన సంతోషంగా ఉండడానికి ఒక కారణమేమిటో చెప్తూ, ‘నా తండ్రి ఇంతవరకు పనిచేస్తున్నాడు, నేనూ పని చేస్తున్నాను’ అన్నాడు.—యోహాను 5:17.
యేసు భూమ్మీద ఉన్నప్పుడు, వడ్రంగి పనే చేస్తూ ఉండిపోలేదు. యెహోవా దేవుడు భూమ్మీద యేసుకు ఒక ప్రత్యేకమైన పని అప్పగించాడు. అదేంటో తెలుసా?— ‘నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి; దీనికోసమే నేను పంపబడ్డాను’ అని ఆయన అన్నాడు. (లూకా 4:43) కొన్నిసార్లు యేసు ప్రజలకు ప్రకటించినప్పుడు వాళ్లు ఆయనను నమ్మి, ఆయన చెప్పిన వాటిని వేరేవాళ్లకు చెప్పారు. ఈ చిత్రంలో ఉన్న సమరయ స్త్రీ కూడా అలాగే చేసింది.—యోహాను 4:7-15, 27-30.
యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఏ రెండు రకాల పనులు చేశాడు?
ఈ పనిచేయడం యేసుకు ఎలా అనిపించేది? ఆయన దాన్ని చేయడానికి ఇష్టపడేవాడా?— ‘నన్ను పంపినవాని చిత్తం నెరవేర్చడం, ఆయన నాకు అప్పగించిన పని పూర్తిచేయడం నాకు ఆహారం’ అని ఆయన అన్నాడు. (యోహాను 4:34) మీకు ఇష్టమైన ఆహారాన్ని మీరు ఎంత ఇష్టంగా తింటారు?— అలా ఆలోచిస్తే, దేవుడు అప్పగించిన పని చేయడానికి యేసు ఎంత ఇష్టపడేవాడో కొంతవరకు అర్థమవుతుంది.
మనం పనిచేయడం నేర్చుకున్నప్పుడు మనకు సంతోషం అనిపించేలా దేవుడు మనల్ని చేశాడు. ‘కష్టపడి పనిచేసి సంతోషాన్ని పొందడం’ తాను మనిషికి ఇచ్చిన బహుమానమని దేవుడు అన్నాడు. కాబట్టి, మీరు ఈ వయసులోనే పనిచేయడం నేర్చుకుంటే, మీ జీవితమంతా ఇంకా సంతోషంగా గడపవచ్చు.—ప్రసంగి 5:19, NW.
అలాగని పెద్దవాళ్లు చేసినంత పని చిన్నపిల్లలు చేయలేరు, కానీ మనందరం ఏదో ఒక పని చేయగలం. మీ ఇంట్లో అందరికీ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కావాలంటే డబ్బులు అవసరం కాబట్టి, మీ అమ్మానాన్నలు ప్రతిరోజూ బయటకు వెళ్లి పనిచేస్తుండవచ్చు. అయితే, మీ ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఎన్నో పనులు చేయాల్సివుంటుంది.
మీ ఇంట్లో అందరికీ ఉపయోగపడే ఎలాంటి పనులు మీరు చేయవచ్చు?— భోజనానికి ముందు ప్లేట్లు గ్లాసులు తెచ్చిపెట్టవచ్చు, గిన్నెలు కడిగిపెట్టవచ్చు, చెత్త తీసుకువెళ్లి పడేయవచ్చు, పక్క సర్దవచ్చు, ఆడుకున్న తర్వాత మీ ఆట వస్తువులను తీసి జాగ్రత్త చేయవచ్చు. మీరు ఇప్పటికే వీటిల్లో కొన్ని పనులు చేస్తుండవచ్చు. అలాచేయడం మీ ఇంట్లో వాళ్లందరికీ నిజంగా ఉపయోగపడుతుంది.
మీరు ఆడుకున్న తర్వాత ఆట వస్తువులను తీసి ఎందుకు జాగ్రత్త చేయాలి?
మీరు అలాంటి పనులు చేయడం మీ ఇంట్లో వాళ్లకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మీరు ఆడుకున్న తర్వాత ఆట వస్తువులను తీసి జాగ్రత్తచేయాలి. అలా ఎందుకు చేయాలి?— అలా చేయడంవల్ల మీ ఇల్లు శుభ్రంగా ఉంటుంది, ప్రమాదాలు జరగవు. ఒకవేళ మీరు మీ ఆట వస్తువులను తీసి జాగ్రత్త చేయకపోతే, మీ అమ్మ ఎప్పుడైనా చేతుల నిండా సామాను తీసుకుని వస్తూ వాటిపైన కాలు వేయవచ్చు. అప్పుడామె కాలుజారి కిందపడి, దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. అప్పుడామెను ఆస్పత్రికి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అలా జరిగితే ఎంత ఘోరంగా ఉంటుందో కదా?— కాబట్టి, మీరు ఆడుకున్న తర్వాత ఆట వస్తువులను తీసి జాగ్రత్తచేస్తే అది అందరికీ మంచిది.
పిల్లలు చేయాల్సింది మరొకటి కూడా ఉంది. అదేమిటంటే, బడికి వెళ్లి చదువుకోవడం. బడిలో ఎలా చదవాలో నేర్చుకుంటాం. కొంతమంది పిల్లలకు చదువుకోవడమంటే ఇష్టం, కానీ ఇంకొంతమందికి అది చాలా కష్టం. మొదట్లో అది మీకు కష్టమనిపించినా బాగా చదవడం నేర్చుకున్నప్పుడు అది మీకు చాలా సరదాగా ఉంటుంది. మీకు చదవడం వస్తే ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవచ్చు. దేవుడు ఇచ్చిన పుస్తకమైన బైబిలును కూడా మీరు చదవగలుగుతారు. మీరు బడికి వెళ్లి బాగా చదువుకుంటే, అది చాలా ఉపయోగపడుతుంది, అవునా?—
కొంతమంది పని చేయకుండా తప్పించుకోవాలని చూస్తారు. అలా చేసేవాళ్లు ఎవరైనా మీకు తెలిసి ఉండవచ్చు. కానీ, దేవుడు మనల్ని పనిచేసేలా సృష్టించాడు కాబట్టి, మనం సంతోషంగా పనిచేయడం నేర్చుకోవాలి. పనిచేయడమంటే మన గొప్ప బోధకునికి ఎంత ఇష్టం ఉండేది?— అది ఆయనకు ఇష్టమైన ఆహారంలా ఉండేది. ఏ పనిని ఆయన ఆహారంతో పోలుస్తున్నాడు?— యెహోవా దేవుని గురించి, ఎప్పటికీ జీవించాలంటే ఏంచేయాలనే దాని గురించి వేరేవాళ్లకు చెప్పడాన్ని ఆహారంతో పోలుస్తున్నాడు.
ఇక్కడ ఇవ్వబడిన సలహాలు పాటిస్తే సంతోషంగా పనిచేయవచ్చు. ఏదైనా ఒక పనిచేసే ముందు, ‘ఈ పని ఎందుకు చేయాలి?’ అని ఆలోచించండి. ఏదైనా పని ఎందుకు ప్రాముఖ్యమో తెలుసుకుంటే, దాన్ని ఇంకా సులువుగా చేయవచ్చు. ఆ పని చిన్నదైనా, పెద్దదైనా చక్కగా చేయండి. అలా చేసినప్పుడు మీరు కూడా మన గొప్ప బోధకునిలా కష్టపడి పనిచేసి సంతోషాన్ని పొందవచ్చు.
మనం మంచి పనిమంతులం అవ్వడానికి బైబిలు సహాయం చేస్తుంది. సామెతలు 10:4; 22:29; ప్రసంగి 3:12, 13; కొలొస్సయులు 3:23 వచనాల్లో ఏముందో చదవండి.