కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lr అధ్యా. 39 పేజీలు 202-206
  • దేవుడు తన కుమారుణ్ణి పునరుత్థానం చేశాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు తన కుమారుణ్ణి పునరుత్థానం చేశాడు
  • గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు సజీవుడవడం
    నా బైబిలు కథల పుస్తకము
  • యేసు మళ్లీ బ్రతికాడు
    నా బైబిలు పుస్తకం
  • యేసు బ్రతికాడు!
    యేసే మార్గం, సత్యం, జీవం
  • యేసు సజీవుడాయెను!
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
మరిన్ని
గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
lr అధ్యా. 39 పేజీలు 202-206

39వ అధ్యాయం

దేవుడు తన కుమారుణ్ణి పునరుత్థానం చేశాడు

యేసు తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. మరి యేసు హింసించబడి, చనిపోయినప్పుడు యెహోవా బాధపడివుంటాడా?— దేవుడు ‘దుఃఖపడతాడు,’ అంతేకాదు జరిగేవాటిని బట్టి ‘సంతాపపడతాడు’ లేదా క్షోభపడతాడు అని బైబిలు చెప్తోంది.—కీర్తన 78:40, 41; యోహాను 11:35.

యెహోవా తన ప్రియమైన కుమారుడు చనిపోవడం చూసి ఎంత బాధపడివుంటాడో మీరు ఊహించగలరా?— దేవుడు తనను మర్చిపోడని యేసుకు ఖచ్చితంగా తెలుసు. అందుకే ఆయన చనిపోయే ముందు చివరిగా, ‘తండ్రీ, నా ప్రాణాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను’ అన్నాడు.—లూకా 23:46.

తాను పునరుత్థానం చేయబడతానని, ‘పాతాళంలో’ లేదా సమాధిలో విడిచిపెట్టబడనని యేసుకు ఖచ్చితంగా తెలుసు. యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత అపొస్తలుడైన పేతురు, ‘క్రీస్తు పాతాళంలో విడువబడలేదు, ఆయన శరీరం కుళ్లిపోలేదు’ అని చెప్తూ, యేసు గురించి బైబిల్లో ముందే రాయబడివున్నదాన్ని మళ్లీ రాశాడు. (అపొస్తలుల కార్యములు 2:31; కీర్తన 16:10) యేసు శరీరం కుళ్లిపోయి, కంపుకొట్టేంతవరకు సమాధిలో ఉంచబడలేదు.

యేసు భూమ్మీద ఉన్నప్పుడు, తాను చనిపోయాక సమాధిలో ఎక్కువకాలం ఉండనని కూడా తన శిష్యులకు చెప్పాడు. తాను ‘చంపబడి, మూడవ రోజున లేపబడడం’ గురించి ఆయన వాళ్లకు వివరించాడు. (లూకా 9:22) కాబట్టి, యేసు పునరుత్థానం చేయబడినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, వాళ్లు అలా ఆశ్చర్యపోకుండా ఉన్నారా?— దాని గురించి తెలుసుకుందాం.

శుక్రవారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటలకు, మన గొప్ప బోధకుడైన యేసు హింసాకొయ్య మీద చనిపోయాడు. యూదుల మహాసభ సభ్యుడైన యోసేపు అనే ఒక ధనవంతుడు వేరేవాళ్లకు తెలీకుండా యేసు మీద విశ్వాసం ఉంచాడు. ఆయన యేసు చనిపోయాడని విని రోమా అధిపతియైన పిలాతు దగ్గరకు వెళ్లాడు. హింసాకొయ్య మీద ఉన్న యేసు శరీరాన్ని సమాధి చేసేందుకు కిందకు దింపడానికి ఆయన అనుమతి తీసుకున్నాడు. ఆ తర్వాత, యోసేపు యేసు శరీరాన్ని ఒక తోటలోవున్న సమాధిలో పెట్టాడు.

యేసు శరీరాన్ని సమాధిలో పెట్టిన తర్వాత, ఒక పెద్ద రాయిని పొర్లించి దానికి అడ్డం పెట్టారు. దాంతో సమాధి మూసుకుపోయింది. అది జరిగిన మూడవరోజు అంటే ఆదివారం సూర్యోదయానికి ముందు, ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అప్పుడు సైనికులు సమాధి దగ్గర కాపలా కాస్తున్నారు. వాళ్లను ప్రధానయాజకులు పంపించారు. ఎందుకో తెలుసా?—

తాను పునరుత్థానం చేయబడతానని యేసు చెప్పినట్లు యాజకులు కూడా విన్నారు. అందుకే వాళ్లు, యేసు శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని ఎత్తుకుపోయి, ఆయన తిరిగి లేపబడ్డాడని చెప్పకుండా సైనికులను కాపలాపెట్టారు. ఉన్నట్టుండి భూమి కంపించింది. ఆ చీకట్లో వెలుగు ప్రకాశించింది. ఎందుకంటే అక్కడకు ఒక యెహోవా దూత వచ్చాడు! అప్పుడు సైనికులు భయంతో బిగుసుకుపోయారు. ఆ దేవదూత సమాధి దగ్గరకు వచ్చి ఆ రాయిని పక్కకు పొర్లించాడు. సమాధి ఖాళీగా ఉంది!

[202వ పేజీలోని చిత్రం]

సమాధి ఎందుకు ఖాళీగా ఉంది? ఏమి జరిగింది?

ఎందుకంటే, ‘ఈ యేసును దేవుడు లేపాడు.’ ఆ విషయాన్నే అపొస్తలుడైన పేతురు ఆ తర్వాత రాశాడు. (అపొస్తలుల కార్యములు 2:32) యేసు భూమ్మీదకు రాకముందు ఆయనకు ఉన్నలాంటి శరీరంతో దేవుడు ఆయనను తిరిగి బ్రతికించాడు. ఆయన దేవదూతలకు ఉండేలాంటి ఆత్మశరీరంతో పునరుత్థానం చేయబడ్డాడు. (1 పేతురు 3:18) కాబట్టి ప్రజలు యేసును చూడాలంటే ఆయన తనకోసం రక్తమాంసాలున్న ఒక శరీరాన్ని చేసుకోవాలి. ఆయన అదే చేశాడా?— చూద్దాం.

సూర్యోదయం అయినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. సైనికులు సమాధి దగ్గర నుండి వెళ్లిపోయారు. మగ్దలేనే మరియ, యేసు శిష్యులైన మరి కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరకు వస్తూ, ‘మన కోసం ఆ రాయి ఎవరు పొర్లిస్తారు?’ అని వాళ్లలోవాళ్లు మాట్లాడుకున్నారు. (మార్కు 16:3) కానీ వాళ్లు సమాధి దగ్గరకు వచ్చేసరికి అప్పటికే రాయి పక్కకు పొర్లించబడి ఉండడం చూశారు. సమాధి ఖాళీగా ఉంది! యేసు శరీరం సమాధిలో లేదు! వెంటనే మగ్దలేనే మరియ యేసు అపొస్తలుల్లో కొంతమందిని కలవడానికి పరుగెత్తింది.

మిగిలిన స్త్రీలు సమాధి దగ్గరే ఉన్నారు. ‘యేసు శరీరం ఏమైపోయింది?’ అని వాళ్లు ఆశ్చర్యపోయారు. ధగ ధగ మెరిసే బట్టలు వేసుకున్న ఇద్దరు మనుషులు అకస్మాత్తుగా కనిపించారు. వాళ్లు దేవదూతలు! వాళ్లు ఆ స్త్రీలతో, ‘యేసు కోసం మీరు ఇక్కడ ఎందుకు చూస్తున్నారు? ఆయన లేపబడ్డాడు. త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు చెప్పండి’ అని చెప్పారు. ఆ స్త్రీలు ఎంత త్వరగా పరుగెత్తుకుని వెళ్లివుంటారో మీరు ఊహించుకోవచ్చు! దారిలో వాళ్లను ఒక వ్యక్తి కలిశాడు. ఆయన ఎవరో తెలుసా?—

ఆయన రక్తమాంసాలతో ఉన్న శరీరాన్ని ధరించిన యేసు! ఆయన కూడా ఆ స్త్రీలతో, ‘మీరు వెళ్లి, నా శిష్యులకు తెలియజేయండి’ అని చెప్పాడు. ఆ స్త్రీలు ఎంతో సంతోషపడ్డారు. వాళ్లు శిష్యులను కలుసుకుని, ‘యేసు తిరిగి బ్రతికాడు! మేము ఆయన్ని చూశాం!’ అని వాళ్లతో చెప్పారు. మరియ అప్పటికే సమాధి ఖాళీగా ఉందని పేతురుకు, యోహానుకు చెప్పింది. మీకు ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు, అప్పుడు వాళ్లు అక్కడికి వెళ్లి చూశారు. యేసుకు చుట్టిన నారబట్టలు అక్కడ వాళ్లకు కనిపించాయి కానీ ఏంజరిగిందని అనుకోవాలో వాళ్లకు తెలీలేదు. యేసు సజీవుడయ్యాడని నమ్మాలన్నదే వాళ్ల కోరిక. కానీ అది నమ్మలేనంత అద్భుతంలా ఉంది.

[205వ పేజీలోని చిత్రం]

పేతురు, యోహాను ఏమి అనుకుని ఉంటారు?

అదే ఆదివారం కాసేపయ్యాక, యేసు తన శిష్యుల్లో ఇద్దరికి ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్లే దారిలో కనిపించాడు. యేసు వాళ్లతోపాటు నడిచాడు, మాట్లాడాడు కానీ ఆయన అంతకుముందున్న శరీరంతో లేడు కాబట్టి వాళ్లు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. ఆయన వాళ్లతోపాటు భోజనానికి కూర్చుని ప్రార్థన చేసినప్పుడే వాళ్లు ఆయనను గుర్తుపట్టారు. ఆ శిష్యులు ఆనందం పట్టలేక ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న యెరూషలేముకు త్వరత్వరగా వెళ్లారు! బహుశా ఆ తర్వాత కొంత సమయానికే కావచ్చు, యేసు తాను తిరిగి బ్రతికానని చూపించడానికి పేతురుకు కనిపించాడు.

ఆ ఆదివారం సాయంత్రం చాలామంది శిష్యులు ఒక గదిలో కలుసుకున్నారు. తలుపు గడియ వేసివుంది. హఠాత్తుగా యేసు ఆ గదిలో వాళ్ల మధ్య కనిపించాడు! గొప్ప బోధకుడు నిజంగా మళ్లీ బ్రతికాడని అప్పుడు వాళ్లకు అర్థమైంది. వాళ్లెంత ఆనందపడివుంటారో ఒక్కసారి ఆలోచించండి!—మత్తయి 28:1-15; లూకా 24:1-49; యోహాను 19:38–20:21.

అప్పటినుండి యేసు నలభై రోజులపాటు వేర్వేరు శరీరాలతో తన శిష్యులకు కనిపించి తాను తిరిగి బ్రతికానని చూపించాడు. తర్వాత ఆయన భూమ్మీద నుండి పరలోకంలోవున్న తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. (అపొస్తలుల కార్యములు 1:9-11) వెంటనే శిష్యులు, దేవుడు యేసును తిరిగి బ్రతికించాడని అందరికీ చెప్పడం మొదలుపెట్టారు. యాజకులు వాళ్లను కొట్టినా, వాళ్లలో కొంతమందిని చంపినా వాళ్లు ప్రకటిస్తూనేవున్నారు. ఒకవేళ వాళ్లు చనిపోయినా దేవుడు తన కుమారుణ్ణి పునరుత్థానం చేసినట్లే తమను కూడా పునరుత్థానం చేస్తాడని వాళ్లకు తెలుసు.

[206వ పేజీలోని చిత్రం]

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు, యేసు పునరుత్థానం చేయబడిన రోజున వేటి గురించి ఆలోచిస్తారు? అయితే, మీరు దేని గురించి ఆలోచిస్తారు?

యేసు తొలి శిష్యులకు, ఇప్పుడున్న చాలామందికి ఎంత తేడా! ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు, యేసు పునరుత్థానం చేయబడిన రోజున ఈస్టర్‌ కుందేళ్ల గురించి, రంగు రంగుల ఈస్టర్‌ గుడ్ల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ, బైబిలు ఈస్టర్‌ కుందేళ్ల గురించి, ఈస్టర్‌ గుడ్ల గురించి ఏమీ చెప్పడం లేదు. అది దేవుణ్ణి సేవించడం గురించి మాట్లాడుతుంది.

యేసు శిష్యుల్లా మనం కూడా, దేవుడు తన కుమారుణ్ణి పునరుత్థానం చేసి ఎంతో అద్భుతమైన పని చేశాడని ప్రజలకు చెప్పాలి. ప్రజలు మనల్ని చంపుతామని బెదిరించినా, మనం ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు. మనం ఒకవేళ చనిపోవాల్సి వచ్చినా యేసును పునరుత్థానం చేసినట్లే, యెహోవా మనల్ని కూడా పునరుత్థానం చేస్తాడు.

తన సేవ చేసేవాళ్లను దేవుడు మర్చిపోడని, వాళ్లు చనిపోయినా పునరుత్థానం చేస్తాడని తెలుసుకున్నందుకు మీకు సంతోషం అనిపించడంలేదా?— మనం ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టవచ్చు అనేది కూడా తెలుసుకోవాలని కోరుకోవాలి. మనం ఆయనను నిజంగా సంతోషపెట్టవచ్చని మీకు తెలుసా?— దీని గురించి తర్వాతి అధ్యాయంలో మాట్లాడుకుందాం.

యేసు పునరుత్థానంమీద నమ్మకముంచితే మన నిరీక్షణ, విశ్వాసం పెరుగుతాయి. దయచేసి, అపొస్తలుల కార్యములు 2:22-36; 4:18-20; 1 కొరింథీయులు 15:3-8, 20-23 వచనాలు చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి