37వ అధ్యాయం
యెహోవాను, ఆయన కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి
ఎవరైనా మీకు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారనుకోండి. అప్పుడు మీరు ఏంచేస్తారు?— మీరు ఒకసారి థాంక్స్ చెప్పేసి ఆ తర్వాత దాన్ని ఇచ్చినవాళ్లను పూర్తిగా మర్చిపోతారా? లేదా ఇచ్చిన వాళ్లను, వాళ్లు ఇచ్చిన బహుమతిని గుర్తుపెట్టుకుంటారా?—
యెహోవా దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చాడు. ఆయన, మన కోసం చనిపోవడానికి తన కుమారుణ్ణి పంపించాడు. యేసు మనకోసం ఎందుకు చనిపోవాల్సివచ్చిందో తెలుసా?— ఇది మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం.
మనం 23వ అధ్యాయంలో నేర్చుకున్నట్లు, ఆదాము దేవుని పరిపూర్ణమైన చట్టాన్ని మీరి పాపం చేశాడు. మనందరికీ తండ్రి అయిన ఆదాము నుండి మనకు పాపం వారసత్వంగా వచ్చింది. కాబట్టి, మనకు ఏమి అవసరం?— ఒకరకంగా చెప్పాలంటే, భూమ్మీద పరిపూర్ణ జీవితం జీవించిన ఒక కొత్త తండ్రి మనకు అవసరం. ఎవరు మనకు అలాంటి తండ్రిగా ఉండగలరు?— యేసు ఉండగలడు.
ఆదాము బదులు యేసు మన తండ్రిగా ఉండడానికి యెహోవా ఆయనను భూమ్మీదకు పంపించాడు. ‘ఆదాము అనే మొదటి మనిషి జీవించే ప్రాణి అయ్యాడు. చివరి ఆదాము జీవింపచేసే ఆత్మ అయ్యాడు’ అని బైబిలు చెప్తోంది. మొదటి ఆదాము ఎవరు?— అవును, నేల మట్టితో దేవుడు చేసిన మనిషే మొదటి ఆదాము. రెండవ ఆదాము ఎవరు?— యేసు. ‘మొదటి మనిషి [ఆదాము] భూసంబంధి, మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనిషి [యేసు] పరలోకం నుండి వచ్చినవాడు’ అని అంటున్నప్పుడు బైబిలు ఆ విషయాన్నే తెలియజేస్తోంది.—1 కొరింథీయులు 15:45, 47; ఆదికాండము 2:7.
దేవుడు యేసు ప్రాణాన్ని పరలోకం నుండి మరియ అనే స్త్రీ గర్భంలోకి మార్చాడు కాబట్టి, యేసుకు ఆదాము నుండి ఎలాంటి పాపం వారసత్వంగా రాలేదు. అందుకే, యేసు పరిపూర్ణమైన మానవుడయ్యాడు. (లూకా 1:30-35) యేసులో పాపం లేదు కాబట్టే ఆయన పుట్టినప్పుడు ఒక దేవదూత గొర్రెల కాపరులతో, ‘నేడు రక్షకుడు మీ కోసం పుట్టాడు’ అని చెప్పాడు. (లూకా 2:11) కానీ మనల్ని రక్షించాలంటే, పసిపిల్లవాడిగా ఉన్న యేసు ముందుగా ఏంచేయాలి?— ఆయన పెరిగి పెద్దవాడై, ఆదాములా ఉండాలి. అప్పుడు యేసు ‘రెండవ ఆదాము’ అవ్వగలుగుతాడు.
మన రక్షకుడైన యేసు మనకు ‘నిత్యుడైన తండ్రి’ కూడా అవుతాడు. అలా అని బైబిలు ఆయనను పిలుస్తుంది. (యెషయా 9:6, 7) పాపం చేసి, అపరిపూర్ణుడిగా మారిన ఆదాము బదులుగా పరిపూర్ణుడైన యేసు మనకు తండ్రి కాగలడు. అందుకే మనం, ‘రెండవ ఆదామును’ మన తండ్రిగా చేసుకోవచ్చు. అయితే, యేసు మాత్రం యెహోవా దేవునికి కుమారుడే.
ఆదాము, యేసు ఏ విషయంలో సమానంగా ఉన్నారు, వాళ్లు అలా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
యేసు గురించి తెలుసుకోవడం ద్వారా మనం ఆయనను మన రక్షకుడిగా అంగీకరించవచ్చు. మనం దేని నుండి కాపాడబడాలో మీకు గుర్తుందా?— అవును, ఆదాము ద్వారా మనకు వారసత్వంగా వచ్చిన పాపమరణాల నుండి మనం కాపాడబడాలి. యేసు పెరిగి, పెద్దవాడై, మన కోసం అర్పించిన పరిపూర్ణ జీవాన్ని విమోచనా క్రయధనం అంటాం. మన పాపాలు క్షమించబడేలా యెహోవా విమోచనా క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు.—మత్తయి 20:28; రోమీయులు 5:8; 6:23.
దేవుడు, ఆయన కుమారుడు మనకోసం చేసినదాన్ని మర్చిపోవాలని ఎప్పుడూ అనుకోము, అవునా?— యేసు తను చేసింది మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేసే ఒక ప్రత్యేకమైన పద్ధతిని తన అనుచరులకు చూపించాడు. దాని గురించి మనం మాట్లాడుకుందాం.
మీరు యెరూషలేములోని ఒక మేడ మీద గదిలో ఉన్నారని ఊహించుకోండి. అది రాత్రి సమయం. యేసు, ఆయన అపొస్తలులు ఒక బల్ల దగ్గర కూర్చునివున్నారు. ఆ బల్లమీద కాల్చిన గొర్రెపిల్ల మాంసం, కొన్ని రొట్టెలు, ఎర్రని ద్రాక్షారసం ఉన్నాయి. వాళ్లు ఒక ప్రత్యేకమైన భోజనం చేస్తున్నారు. ఎందుకో తెలుసా?—
ఆ భోజనం, యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు చేసినదాన్ని వాళ్లకు గుర్తుచేస్తుంది. అప్పుడు యెహోవా తన ప్రజలతో, ‘ప్రతి కుటుంబం ఒక గొఱ్ఱెపిల్లను చంపి, దాని రక్తాన్ని ఇంటి ద్వారబంధం మీద పూయాలి’ అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన, ‘మీ ఇంట్లోకి వెళ్లి గొర్రెపిల్ల మాంసాన్ని తినండి’ అని చెప్పాడు.
గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలీయులను ఎలా కాపాడింది?
ఇశ్రాయేలీయులు అలాగే చేశారు. ఆ రాత్రే దేవుని దూత ఐగుప్తు దేశమంతా తిరిగాడు. ఆ దూత చాలా ఇళ్లలో మొదటి బిడ్డను చంపేశాడు. కానీ, ద్వారబంధం మీద గొర్రెపిల్ల రక్తం పూసివున్న ఇళ్లను ఆయన దాటి వెళ్లిపోయాడు. ఆ ఇళ్లలో పిల్లలు ఎవ్వరూ చనిపోలేదు. యెహోవా దూత చేసిన దానికి ఐగుప్తు రాజైన ఫరో భయపడిపోయాడు. అందుకే ఫరో ఇశ్రాయేలీయులతో, ‘మీరు వెళ్లిపోవచ్చు. ఐగుప్తులో నుండి వెళ్లిపోండి!’ అని చెప్పాడు. వెంటనే వాళ్లు తమ సామాను ఒంటెలమీద, గాడిదలమీద పెట్టుకొని బయలుదేరారు.
యెహోవా, తాను తన ప్రజలను ఎలా విడిపించాడో వాళ్లు మర్చిపోకూడదని అనుకున్నాడు. అందుకే ఆయన, ‘సంవత్సరానికి ఒకసారి ఈ రాత్రి తిన్నలాంటి భోజనం మీరు తినాలి’ అని చెప్పాడు. ఈ ప్రత్యేకమైన భోజనాన్ని పస్కా అంటారు.—నిర్గమకాండము 12:1-13, 24-27, 31.
యేసు, ఆయన అపొస్తలులు పస్కా భోజనం చేస్తూ దీని గురించి ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత యేసు, చాలా ప్రాముఖ్యమైన పని ఒకటి చేశాడు. దానికన్నా ముందు ఆయన, నమ్మకద్రోహం చేసిన అపొస్తలుడైన యూదాను అక్కడ నుండి పంపించేశాడు. ఆ తర్వాత యేసు, మిగిలిన వాటిలో ఒక రొట్టెను తీసుకుని, దాని గురించి ప్రార్థన చేసి, దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, ‘దీన్ని తీసికొని తినండి’ అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన, ‘ఈ రొట్టె అంటే, మీ కోసం నేను చనిపోయినప్పుడు నేనిచ్చే నా శరీరం’ అని వాళ్లకు చెప్పాడు.
తర్వాత యేసు ఎర్రని ద్రాక్షారసం ఉన్న పాత్రను తీసుకున్నాడు. దీని గురించి కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థన చేసి, వాళ్లకిచ్చి, ‘ఇందులోది మీరంతా తాగండి’ అని చెప్పాడు. ఆయన వాళ్లతో, ‘ఈ ద్రాక్షరసం అంటే నా రక్తం. మిమ్మల్ని మీ పాపాల నుండి విడిపించడానికి త్వరలోనే నేను నా రక్తాన్ని చిందిస్తాను. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి’ అని కూడా చెప్పాడు.—మత్తయి 26:26-28; 1 కొరింథీయులు 11:23-26.
యేసు, ద్రాక్షరసంతో పోల్చిన ఆయన రక్తం మన కోసం ఏమి చేయగలదు?
యేసు శిష్యులు ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండాలని ఆయన చెప్పాడు, మీరు అది గమనించారా?— వాళ్లు ఇకమీదట పస్కా భోజనం చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులు, సంవత్సరానికి ఒకసారి వాళ్లు యేసును, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ప్రత్యేకమైన భోజనం చేయాలి. ఈ భోజనాన్ని ప్రభురాత్రి భోజనం అంటారు. ఈ రోజుల్లో దీన్ని మనం సాధారణంగా జ్ఞాపకార్థ ఆచరణ అంటాం. ఎందుకు?— ఎందుకంటే, ఇది యేసు, ఆయన తండ్రియైన యెహోవా దేవుడు మనకోసం చేసినదాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది.
రొట్టె మనకు యేసు శరీరం గురించి జ్ఞాపకం చేయాలి. మనం ఎప్పటికీ జీవించగలిగేలా ఆయన ఆ శరీరాన్ని బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎర్రని ద్రాక్షరసం విషయమేమిటి?— అది మనకు యేసు రక్తానికున్న విలువను జ్ఞాపకం చేయాలి. ఐగుప్తులో పస్కా గొర్రెపిల్ల రక్తంకన్నా ఇది ఎంతో విలువైనది. ఎందుకో తెలుసా?— యేసు రక్తం మన పాపాలకు క్షమాపణ దొరికేలా చేస్తుందని బైబిలు చెప్తోంది. మన పాపాలన్నీ తీసివేయబడినప్పుడు, మనం ఇక ఎప్పటికీ జబ్బుపడము, ముసలివాళ్లమైపోము, చనిపోము. జ్ఞాపకార్థ ఆచరణకు వెళ్లినప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి.
జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చిన వాళ్లంతా ఆ రొట్టె తిని, ఆ ద్రాక్షరసాన్ని తాగాలా?— దాన్ని తిని, తాగేవాళ్ల గురించి యేసు, ‘మీరు నా రాజ్యంలో నాతోపాటు పరలోకంలో సింహాసనాల మీద కూర్చుని పరిపాలిస్తారు’ అని చెప్పాడు. (లూకా 22:19, 20, 29, 30) అంటే వాళ్లు యేసుతోపాటు రాజులుగా పరిపాలించడానికి పరలోకానికి వెళ్తారని అర్థం. కాబట్టి, పరలోకంలో యేసుతోపాటు పరిపాలించడానికి ఎంచుకోబడినవాళ్లు మాత్రమే ఆ రొట్టె, ద్రాక్షరసం తీసుకోవాలి.
కానీ రొట్టె, ద్రాక్షరసం తీసుకోని వాళ్లు కూడా జ్ఞాపకార్థ ఆచరణకు వెళ్లాలి. ఎందుకో తెలుసా?— ఎందుకంటే యేసు తన ప్రాణాన్ని మన కోసం కూడా ఇచ్చాడు. జ్ఞాపకార్థ ఆచరణకు వెళ్లినప్పుడు మనం ఆ విషయాన్ని మర్చిపోలేదని చూపిస్తాం. దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన ఆ బహుమానాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటాం.
యేసు విమోచన క్రయధనానికున్న ప్రాముఖ్యతను, 1 కొరింథీయులు 5:7; ఎఫెసీయులు 1:7; 1 తిమోతి 2:5, 6; 1 పేతురు 1:18, 19 వచనాలు కూడా తెలియజేస్తున్నాయి.