34వ అధ్యాయం
మనం చనిపోతే మనకు ఏమౌతుంది?
ప్రజలు ముసలివాళ్లయి, జబ్బుపడి, చనిపోతారని మీకు తెలిసేవుంటుంది. కొంతమంది చిన్నపిల్లలు కూడా చనిపోతుంటారు. మీరు చావంటే లేదా చనిపోయినవాళ్లంటే భయపడాలా?— మనం చనిపోతే మనకు ఏమౌతుందో తెలుసా?—
ఇప్పుడున్న వాళ్లలో ఎవరూ చనిపోయి తిరిగి బ్రతికినవాళ్లు కాదు కాబట్టి దాని గురించి చెప్పగలిగిన వాళ్లు ఎవరూ లేరు. కానీ, మన గొప్ప బోధకుడైన యేసు భూమ్మీద ఉన్నప్పుడు అలాంటి ఒకాయన ఉన్నాడు. ఆయన గురించి చదివి తెలుసుకోవడం ద్వారా, చనిపోయినవాళ్లకు ఏమౌతుందో తెలుసుకోవచ్చు. ఆయన యేసు స్నేహితుడు. ఆయన యెరూషలేము దగ్గరలోని బేతనియ అనే చిన్న పట్టణంలో ఉండేవాడు. ఆయన పేరు లాజరు, ఆయనకు ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్ల పేర్లు మార్త, మరియ. జరిగినదాని గురించి బైబిలు ఏంచెప్తుందో తెలుసుకుందాం.
ఒకసారి లాజరుకు బాగా జబ్బుచేసింది. అప్పుడు యేసు అక్కడికి చాలా దూరంలో ఉన్నాడు. అందుకే మార్త, మరియ తమ తమ్ముడైన లాజరుకు జబ్బుచేసిందని యేసుకు చెప్పడానికి ఒక మనిషిని పంపించారు. వాళ్లు ఎందుకు అలా పంపించారంటే, యేసు వచ్చి తమ తమ్ముణ్ణి బాగుచేయగలడని వాళ్లకు తెలుసు. యేసు వైద్యుడు కాదు, కానీ అన్నిరకాల వ్యాధుల్ని నయం చేయగల శక్తి దేవుడు ఆయనకు ఇచ్చాడు.—మత్తయి 15:30, 31.
యేసు అక్కడికి వెళ్లకముందే లాజరు ఆరోగ్యం బాగా పాడైపోవడంవల్ల ఆయన చనిపోయాడు. కానీ లాజరు నిద్రపోతున్నాడని, తాను వెళ్లి ఆయనను లేపుతానని యేసు తన శిష్యులతో అన్నాడు. యేసు ఏమి అంటున్నాడో శిష్యులకు అర్థంకాలేదు. కాబట్టి, ‘లాజరు చనిపోయాడు’ అని యేసు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాడు. దీన్నిబట్టి చావు గురించి మనకు ఏమి అర్థమౌతుంది?— అవును, అది గాఢనిద్రలాంటిది. అది ఎంత గాఢమైన నిద్ర అంటే ఆ నిద్రలో కలలు కూడా రావు.
అప్పుడు యేసు, మార్త మరియల దగ్గరకు వచ్చాడు. వాళ్ల స్నేహితులు చాలామంది అప్పటికే వచ్చేశారు. వాళ్ల తమ్ముడు చనిపోయాడు కాబట్టి, వాళ్లిద్దర్నీ ఓదార్చడానికి వాళ్లు వచ్చారు. యేసు వస్తున్నాడని మార్తకు తెలిసినప్పుడు ఆమె ఆయనకు ఎదురువెళ్లింది. మరియ కూడా కొంతసేపటికి యేసును కలవడానికి వెళ్లింది. ఆమె చాలా బాధతో ఏడుస్తూ యేసు కాళ్లదగ్గర పడిపోయింది. మరియతో వచ్చిన స్నేహితులు కూడా ఏడ్చారు.
లాజరును ఎక్కడ పెట్టారని గొప్ప బోధకుడు అడిగాడు. అప్పుడు, లాజరును పెట్టిన గుహ దగ్గరకు యేసును తీసుకువెళ్లారు. అక్కడున్నవాళ్లందరూ ఏడవడం చూసి యేసు కూడా ఏడ్చాడు. ఇష్టమైనవాళ్లు ఎవరైనా చనిపోతే ఎంత బాధగా ఉంటుందో ఆయనకు తెలుసు.
ఆ గుహను ఒక రాయితో మూసేశారు, అందుకే యేసు, ‘రాయిని పక్కకు జరపండి’ అన్నాడు. వాళ్లు అలా చేయాలా?— అలా చేయడం అంత మంచిది కాదని మార్త అనుకుంది. ‘ప్రభువా, అతను చనిపోయి నాలుగు రోజులైంది కాబట్టి ఇప్పటికి వాసనకొడుతుంది’ అని ఆమె అంది.
కానీ యేసు ఆమెను, ‘నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నీతో చెప్పలేదా?’ అని అడిగాడు. దేవునికి మహిమ తీసుకొచ్చే ఒక సంఘటన మార్త చూడబోతుందని యేసు మాటలకు అర్థం. యేసు ఏమి చేయబోతున్నాడు? రాయిని అక్కడనుండి పక్కకు జరిపిన తర్వాత యేసు గట్టిగా యెహోవాకు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత, ‘లాజరూ, బయటికి రా!’ అని యేసు బిగ్గరగా పిలిచాడు. ఆయన బయటికి వస్తాడా? అసలు రాగలడా?—
నిద్రపోతున్నవాళ్లను మీరు లేపగలరా?— అవును, మీరు గట్టిగా పిలిస్తే వాళ్లు లేస్తారు. కానీ చనిపోయిన వాళ్లను మీరు లేపగలరా?— లేదు. మీరు ఎంత గట్టిగా పిలిచినా చనిపోయిన వాళ్లకు వినిపించదు. మీరుగానీ, నేనుగానీ, ఈ భూమ్మీద ఇప్పుడున్న ఇంకెవరైనాగానీ ఏంచేసినా చనిపోయిన వాళ్లను లేపడం సాధ్యంకాదు.
యేసు లాజరును ఏం చేశాడు?
కానీ యేసుకు సాధ్యమే. దేవుడు ఆయనకు ప్రత్యేకమైన శక్తినిచ్చాడు. కాబట్టి, యేసు లాజరును పిలిచినప్పుడు ఒక అద్భుతం జరిగింది. నాలుగు రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి గుహలో నుండి బయటకు వచ్చాడు! ఆయన తిరిగి బ్రతికాడు! ఆయన మళ్లీ ఊపిరి పీల్చగలిగాడు, నడవగలిగాడు, మాట్లాడగలిగాడు! అవును, యేసు చనిపోయిన లాజరును తిరిగి బ్రతికించాడు.—యోహాను 11:1-44.
ఒకసారి ఆలోచించండి: లాజరు చనిపోయినప్పుడు ఆయనకు ఏమైంది? ఆయనలో నుండి ఏదైనా ఒక భాగం ఆయన శరీరాన్ని విడిచి ఇంకెక్కడైనా జీవించడానికి వెళ్లిందా? అప్పుడు లాజరు పరలోకానికి వెళ్లాడా? ఆయన అక్కడ నాలుగురోజులపాటు దేవునితో, ఆయన దూతలతో ఉన్నాడా?—
లేదు, ఆయన అక్కడ లేడు. మీకు గుర్తుందా, లాజరు నిద్రపోతున్నాడని యేసు చెప్పాడు. మీరు నిద్రపోతున్నప్పుడు ఎలావుంటుంది? మీరు బాగా గాఢనిద్రలో ఉన్నప్పుడు మీ చుట్టూ ఏమి జరుగుతుందో మీకు తెలీదు, అవునా?— మీరు లేచిన తర్వాత గడియారాన్ని చూసేంతవరకు మీరెంతసేపు నిద్రపోయారో కూడా మీకు తెలీదు.
చనిపోయిన వాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. వాళ్లకు ఏమీ తెలీదు. వాళ్లకు బాధ, సంతోషం లాంటివి ఉండవు. వాళ్లు ఏమీ చేయలేరు. లాజరు చనిపోయినప్పుడు ఆయనకు కూడా అలాగే అయింది. చావు అంటే ఒక వ్యక్తి ఏమీ గుర్తుంచుకోలేని గాఢ నిద్రలాంటిది. ‘చనిపోయిన వాళ్లకు ఏమీ తెలీదు’ అని బైబిలు చెప్తోంది.—ప్రసంగి 9:5, 10.
లాజరు చనిపోయివున్న నాలుగు రోజులు ఏ స్థితిలో ఉన్నాడు?
ఒకసారి దీని గురించి కూడా ఆలోచించండి: లాజరు ఒకవేళ ఆ నాలుగు రోజులు పరలోకంలో ఉండివుంటే దాని గురించి ఆయన ఏదైనా చెప్పివుండేవాడు కదా?— లాజరు ఒకవేళ పరలోకానికి వెళ్లివుంటే, ఆ అద్భుతమైన చోటునుండి యేసు ఆయనను తిరిగి భూమ్మీదికి తీసుకొని వచ్చివుండేవాడా?— ఆయన అలా చేసివుండేవాడు కాదు!
అయితే, మనలో ఒక ఆత్మ ఉందని చాలామంది అంటారు. శరీరం చనిపోయిన తర్వాత కూడా ఆ ఆత్మ బ్రతికేవుంటుందని వాళ్లు అంటారు. లాజరు ఆత్మ అప్పుడు ఎక్కడో బ్రతికేవుందని వాళ్లు చెప్తారు. కానీ బైబిలు అలా చెప్పడంలేదు. దేవుడు మొదటి మనిషైన ఆదామును “జీవాత్మగా” సృష్టించాడని బైబిలు చెప్తోంది. కాబట్టి, ఆదాము ఒక ఆత్మ అని చెప్పవచ్చు. ఆదాము పాపం చేసినప్పుడు ఆయన చనిపోయాడని కూడా బైబిలు చెప్తోంది. అంటే ఆదాము అనే ఆత్మ చనిపోయి, తను ఏ మట్టితో చేయబడ్డాడో, ఆ మట్టిలోనే కలిసిపోయాడు. ఆదాము పిల్లలందరికీ పాపం, మరణం వారసత్వంగా వచ్చాయని కూడా బైబిలు చెప్తోంది.—ఆదికాండము 2:7; 3:17-19; రోమీయులు 5:12.
కాబట్టి, శరీరాన్ని విడిచిపోయే ఆత్మ అంటూ ఏదీ లేదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రతీ మనిషి ఒక ఆత్మ అని చెప్పవచ్చు. మొదటి మనిషైన ఆదాము నుండి మనుష్యులకు పాపం వారసత్వంగా వచ్చింది కాబట్టి, ‘పాపము చేయువాడెవడో వాడే మరణిస్తాడు’ అని బైబిలు చెప్తోంది.—యెహెజ్కేలు 18:4.
చనిపోయినవాళ్లంటే ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు?
కొంతమంది చనిపోయినవాళ్లకు భయపడతారు. వాళ్లు శ్మశానాల దగ్గరకు వెళ్లరు. ఎందుకంటే, చనిపోయిన వాళ్ల ఆత్మలు శరీరం నుండి వేరై బ్రతికున్నవాళ్లకు హానిచేస్తాయని వాళ్లు అనుకుంటారు. కానీ, చనిపోయినవాళ్లు బ్రతికున్నవాళ్లకు హానిచేయగలరా?— చేయలేరు.
చనిపోయినవాళ్లు దయ్యాలై బ్రతికున్న వాళ్ల దగ్గరకు రాగలవని కూడా కొంతమంది నమ్ముతారు. అందుకే వాళ్లు, చనిపోయిన వాళ్ల కోసం పిండం పెడతారు. కానీ అలా చేసేవాళ్లు, చనిపోయినవాళ్ల గురించి దేవుడు చెప్తున్నదాన్ని నిజంగా నమ్మడంలేదు. దేవుడు చెప్తున్నదాన్ని మనం నమ్మితే చనిపోయిన వాళ్లకు భయపడం. అయితే, మనకు జీవాన్ని ఇచ్చినందుకు దేవునిపట్ల కృతజ్ఞత ఉంటే ఆయనకు ఇష్టమైన వాటిని చేస్తాం.
కానీ ‘చనిపోయిన పిల్లలను దేవుడు తిరిగి బ్రతికిస్తాడా? అలా చేయాలని ఆయన నిజంగా కోరుకుంటున్నాడా?’ అని కొన్నిసార్లు మీకు అనిపించవచ్చు. దీని గురించి తర్వాతి అధ్యాయంలో తెలుసుకుందాం.
చనిపోయినవాళ్ల పరిస్థితి గురించి బైబిలు చెప్పే మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి, కీర్తన 115:17; 146:3, 4 వచనాలు చదువుదాం.