26వ అధ్యాయం
మంచి చేయడం ఎందుకు కష్టం?
సౌలు చెడ్డ పనులు చేసినప్పుడు ఎవరు సంతోషించారు?— అపవాదియైన సాతాను సంతోషించాడు. అంతేకాదు, యూదా మతనాయకులు కూడా సంతోషించారు. సౌలు గొప్ప బోధకుని శిష్యుడై, పౌలుగా మారినప్పుడు ఆ మతనాయకులు ఆయనను ద్వేషించడం మొదలుపెట్టారు. కాబట్టి, మంచి చేయడం యేసు శిష్యులకు ఎందుకు కష్టమౌతుందో ఇప్పుడు మీకు అర్థమైందా?—
పౌలు మంచి చేసినప్పుడు ఆయనకు ఎలాంటి కష్టాలొచ్చాయి?
ఒకసారి, అననీయ అనే ప్రధాన యాజకుడు పౌలును ముఖం మీద కొట్టమని తన దగ్గర్లోవున్న వాళ్లకు ఆజ్ఞాపించాడు. పౌలును చెరసాలలో వేయించడానికి కూడా అననీయ ప్రయత్నించాడు. యేసు శిష్యునిగా మారిన తర్వాత పౌలు ఎన్నో కష్టాలుపడ్డాడు. ఉదాహరణకు, చెడ్డవాళ్లు పౌలును పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి, చంపాలని కూడా చూశారు.—అపొస్తలుల కార్యములు 23:1, 2; 2 కొరింథీయులు 11:24, 25.
దేవునికి ఇష్టంలేని పనులు మనతో చేయించాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఒకసారి వీటి గురించి ఆలోచించండి, మంచి అంటే మీకు ఎంత ఇష్టం? మంచి చేస్తున్నందుకు వేరేవాళ్లు మిమ్మల్ని ద్వేషించినా అలా చేస్తూనే ఉండేంతగా మీరు మంచిని ఇష్టపడతారా? అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి, అవునా?—
‘మనం మంచి చేస్తే ప్రజలు ఎందుకు మనల్ని ద్వేషిస్తారు? వాళ్లు సంతోషించాలి కదా?’ అని మీరు అనుకోవచ్చు. అలా అనుకోవడం సబబే. యేసు చేసిన మంచి పనులు చూసి ప్రజలు ఆయనను ఇష్టపడ్డారు. ఒకరోజు, ఆయన ఉంటున్న ఇంటి దగ్గరకు ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ వచ్చారు. యేసు అక్కడ అనారోగ్యంతో ఉన్నవాళ్లను బాగుచేస్తున్నాడు కాబట్టి వాళ్లు అక్కడకు వచ్చారు.—మార్కు 1:33.
కానీ కొన్నిసార్లు యేసు బోధించేవి ప్రజలకు నచ్చలేదు. ఆయన ఎప్పుడూ సత్యమే బోధించినా ఆయన సత్యం మాట్లాడుతున్నందుకు కొంతమందికి ఆయన మీద చాలా కోపం వచ్చింది. యేసు పెరిగిన నజరేతు అనే పట్టణంలో ఒకసారి ఇలాంటిదే జరిగింది. ఒకరోజు ఆయన సమాజ మందిరానికి వెళ్లాడు, యూదులు అక్కడే దేవుణ్ణి ఆరాధిస్తారు.
అక్కడ యేసు లేఖనాలు చూపిస్తూ చక్కని ప్రసంగం ఇచ్చాడు. మొదట్లో అది ప్రజలకు నచ్చింది. ఆయన చెప్తున్న చక్కని మాటలకు అక్కడున్నవాళ్లు చాలా ఆశ్చర్యపోయారు. ఈ యువకుడు తమ పట్టణంలోనే పెరిగినవాడని వాళ్లు నమ్మలేకపోయారు.
కానీ అప్పుడు యేసు మరో విషయాన్ని గురించి మాట్లాడాడు. యూదులు కానివాళ్లను దేవుడు ప్రత్యేకంగా చూసిన సందర్భాల గురించి ఆయన మాట్లాడాడు. యేసు ఇది చెప్పినప్పుడు సమాజమందిరంలో ఉన్నవాళ్లకు కోపం వచ్చింది. ఎందుకో మీకు తెలుసా?— ఎందుకంటే తమను మాత్రమే దేవుడు ప్రత్యేకంగా చూస్తాడని వాళ్లు అనుకున్నారు. మిగతా ప్రజలకన్నా తాము గొప్పవాళ్లమని వాళ్లు అనుకున్నారు. అందుకే యేసు అలా చెప్పినప్పుడు వాళ్లకు కోపం వచ్చింది. వాళ్లు ఆయనను ఏమి చేయాలని చూశారో తెలుసా?—
‘వాళ్లు యేసును పట్టుకుని పట్టణం బయటకు తీసుకువెళ్లారు. వాళ్లు ఆయనను తలక్రిందులుగా పడద్రోసి, చంపేయాలని కొండ అంచు వరకు తీసికొని వెళ్లారు. అయితే ఆయన వాళ్ల మధ్యలో నుండి తప్పించుకుని వెళ్లిపోయాడు’ అని బైబిలు చెప్తోంది.—లూకా 4:16-30.
వీళ్లు యేసును చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు?
మీకే అలా జరిగితే, దేవుని గురించి మాట్లాడడానికి మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్తారా?— అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి కదా?— అయితే, దాదాపు ఒక సంవత్సరం తర్వాత యేసు నజరేతుకు మళ్లీ వెళ్లాడు. ‘సమాజ మందిరంలో వాళ్లకు బోధించడం మొదలుపెట్టాడు’ అని బైబిలు చెప్తోంది. దేవుణ్ణి ప్రేమించని ప్రజలకు యేసు భయపడలేదు, అందుకే ఆయన సత్యం గురించి మాట్లాడడం ఆపలేదు.—మత్తయి 13:53.
ఒకరోజు యేసు ఒక సమాజమందిరానికి వెళ్లాడు. ఆ రోజు విశ్రాంతి దినం. అక్కడ ఊచ చెయ్యి లేదా అవిటి చెయ్యి ఉన్న మనిషి ఉన్నాడు. దేవుడిచ్చిన శక్తితో యేసు అతనిని బాగుచేయగలడు. కానీ అక్కడున్న కొంతమంది యేసును ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. అప్పుడు గొప్ప బోధకుడు ఏంచేశాడు?— వాళ్లను ముందుగా ఇలా అడిగాడు, ‘మీ దగ్గరున్న ఒక గొఱ్ఱె విశ్రాంతిదినాన గుంటలో పడితే దాన్ని పైకి తీయరా?’
అవును, విశ్రాంతిదినాన విశ్రాంతి తీసుకోవాల్సివున్నా ఒకవేళ వాళ్ల గొఱ్ఱె గుంటలో పడిపోతే దాన్ని పైకి తీస్తారు. అందుకే యేసు, ‘గొఱ్ఱె కంటే మనిషి ఎంతో శ్రేష్ఠమైనవాడు; కాబట్టి విశ్రాంతిదినాన ఒక మనిషికి సహాయం చేయడం ఇంకా మంచిది!’ అని చెప్పాడు. ఆ మనిషి చేతిని బాగుచేసి, ఆయనకు సహాయం చేయాలని యేసు ఎంత స్పష్టంగా చెప్పాడో కదా!
యేసు అతనిని చేయి చాపమన్నాడు. వెంటనే అది బాగైపోయింది! అతను ఎంతో సంతోషపడివుంటాడు. కానీ మిగతావాళ్లు ఏమనుకున్నారు? వాళ్లు సంతోషించారా?— లేదు. వాళ్లకు యేసుమీద ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. వాళ్లు బయటకు వెళ్లి ఆయనను చంపడానికి పన్నాగం పన్నారు!—మత్తయి 12:9-14.
ఈరోజుల్లో కూడా అలాగే జరుగుతుంది. మనం ఏంచేసినా, ప్రతీ ఒక్కరినీ సంతోషపెట్టలేం. కాబట్టి, మనం నిజంగా ఎవరిని సంతోషపెట్టాలని అనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి. యెహోవా దేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును సంతోషపెట్టాలని అనుకుంటే, మనం ఎప్పుడూ వాళ్లు బోధించేవాటిని చేయాలి. కానీ మనం అలా చేస్తే మనల్ని ఎవరు ద్వేషిస్తారు? మంచి చేయడం మనకు కష్టమయ్యేలా ఎవరు చేస్తారు?—
అపవాదియైన సాతాను. ఇంకా ఎవరు అలా చేస్తారు?— తప్పుడు విషయాల్ని నమ్మేలా సాతాను చేతుల్లో మోసపోయిన వాళ్లు కూడా అలాగే చేస్తారు. యేసు అప్పుడున్న మతనాయకులతో, ‘మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు; మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చాలని కోరుకుంటున్నారు’ అన్నాడు.—యోహాను 8:44.
సాతానుకు నచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు. యేసు వాళ్లనే “లోకము” అని అన్నాడు. యేసు, “లోకము” అని దేని గురించి మాట్లాడాడో మీకు తెలుసా?— అది తెలుసుకోవడానికి యోహాను 15వ అధ్యాయం, 19వ వచనం చూద్దాం. అక్కడ యేసు ఇలా చెప్పాడని చదువుతాం, ‘మీరు లోకసంబంధులైతే, లోకం తన వారిని ఇష్టపడుతుంది; అయితే మీరు లోకసంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలోనుండి ఏర్పర్చుకున్నాను, అందుకే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.’
కాబట్టి, యేసు శిష్యులను ద్వేషించే లోకం అంటే ఆయన అనుచరులుకాని ప్రజలందరూ అని చెప్పవచ్చు. యేసు శిష్యులను లోకం ఎందుకు ద్వేషిస్తుంది?— దాని గురించి ఆలోచించండి. లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు?— ‘లోకమంతా దుష్టుని చేతుల్లో ఉంది’ అని బైబిలు చెప్తోంది. ఆ దుష్టుడే అపవాదియైన సాతాను.—1 యోహాను 5:19.
మంచి చేయడం ఎందుకంత కష్టమో ఇప్పుడు మీకు అర్థమైందా?— సాతాను, అతని లోకం వల్ల మంచి చేయడం కష్టమవుతోంది. కానీ దానికి మరో కారణం కూడా ఉంది. అదేమిటో మీకు గుర్తుందా?— మనందరం పాపంతో పుడతామని 23వ అధ్యాయంలో నేర్చుకున్నాం. పాపము, సాతాను, అతని లోకం లేకుండా పోయినప్పుడు ఎంత బావుంటుందో కదా?—
ఈ లోకం గతించిపోయినప్పుడు, మంచి చేసేవాళ్లకు ఏమి జరుగుతుంది?
‘లోకం గతించిపోతుంది’ అని బైబిలు మాట ఇస్తోంది. అంటే మన గొప్ప బోధకుని అనుచరులు కానివాళ్లంతా లేకుండా పోతారని అర్థం. వాళ్లకు నిత్యం జీవించే అవకాశం దొరకదు. మరి ఎవరు నిత్యం జీవిస్తారు?— ‘దేవుని చిత్తం చేసేవాళ్లు నిత్యం జీవిస్తారు’ అని బైబిలు చెప్తోంది. (1 యోహాను 2:17) అవును, మంచి చేసేవాళ్లు మాత్రమే అంటే ‘దేవుని చిత్తం’ చేసేవాళ్లు మాత్రమే దేవుని కొత్త లోకంలో నిత్యం జీవిస్తారు. కాబట్టి, మంచి చేయడం కష్టమైనా మనం మంచే చేయాలనుకుంటాం, అవునా?—
మంచి చేయడం ఎందుకు సులభం కాదో తెలుసుకోవడానికి, మత్తయి 7:13, 14; లూకా 13:23, 24; అపొస్తలుల కార్యములు 14:21, 22 వచనాలు కలిసి చదువుదాం.