21వ అధ్యాయం
మనం దేని గురించైనా గొప్పలు చెప్పుకోవచ్చా?
గొప్పలు చెప్పుకోవడం అంటే ఏమిటో మీకు తెలుసా?— ఒక ఉదాహరణ చూద్దాం. మీకు అంతగా తెలియనిది ఏదైనా చేయడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? ఫుట్‌బాల్‌ను తన్నడానికి ప్రయత్నించివుంటారు. లేదా తాడాట అంటే స్కిప్పింగ్ ఆడడానికి ప్రయత్నించి ఉంటారు. అప్పుడు ఎవరైనా ఎగతాళిగా నవ్వి, “నేనైతే నీకన్నా బాగా ఆడగలను” అన్నారా?— అలా అన్నవాళ్లు గొప్పలు చెప్పుకుంటున్నారు.
ఎవరైనా అలా గొప్పలు చెప్పుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అలా చెప్తుంటే వినాలనిపిస్తుందా?— ఒకవేళ మీరే గొప్పలు చెప్పుకుంటున్నారనుకోండి, వేరేవాళ్లకు ఎలా అనిపిస్తుంది?— “నేనైతే నీకన్నా బాగా చేయగలను” అంటూ వేరేవాళ్లను బాధపెట్టడం మంచిదేనా?— అలా బాధపెట్టేవాళ్లను యెహోవా ఇష్టపడతాడా?—
వేరేవాళ్లకన్నా తామే మెరుగైన వాళ్లమని అనుకునేవాళ్ల గురించి గొప్ప బోధకునికి తెలుసు. అలాంటి వాళ్లు తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటారు, మిగతా వాళ్లందరినీ పనికిరాని వాళ్లలా చూస్తారు. తమ గురించి తాము గొప్పలు చెప్పుకోవడం ఎంత తప్పో చూపించడానికి యేసు వాళ్లకు ఒక కథ చెప్పాడు. ఇప్పుడు అది విందాం.
ఈ కథలో ఆయన ఒక పరిసయ్యుడి గురించి, ఒక సుంకరి గురించి చెప్పాడు. సుంకరులు అంటే పన్ను వసూలు చేసే వాళ్లు. పరిసయ్యులు అంటే మత బోధకులు, వీళ్లు సాధారణంగా వేరేవాళ్లకన్నా తామే నీతిమంతులం అన్నట్లు ప్రవర్తించేవాళ్లు. యేసు చెప్పిన కథలోని పరిసయ్యుడు ప్రార్థన చేసేందుకు యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్లాడు.
దేవుడు సుంకరిని ఎందుకు ఇష్టపడ్డాడు, పరిసయ్యుడిని ఎందుకు ఇష్టపడలేదు?
ఒక సుంకరి కూడా ప్రార్థన చేయడానికి ఆలయానికి వెళ్లాడని యేసు చెప్పాడు. సుంకరులంటే చాలామందికి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే, సుంకరులు తమను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారని వాళ్లు నమ్మేవాళ్లు. అది నిజమే, ఎందుకంటే సుంకరుల్లో చాలామంది అన్ని సమయాల్లో నిజాయితీగా ఉండేవాళ్లు కాదు.
ఆలయంలో పరిసయ్యుడు దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ‘దేవా! నేను ఇతరుల్లా పాపిని కానందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ప్రజలను మోసం చేయను, వేరే చెడ్డ పనులు చేయను. నేను అక్కడున్న ఆ సుంకరిలాంటి వాడిని కాదు. నేను నీతిమంతుణ్ణి. నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను కాబట్టి నీ గురించి ఆలోచించడానికి నాకు ఎక్కువ సమయం ఉంటుంది. నా సంపాదన అంతటిలో పదోవంతు ఆలయానికి ఇస్తాను.’ ఈ పరిసయ్యుడు వేరేవాళ్లకన్నా తానే మెరుగని నిజంగా అనుకునివుంటాడు కదా?— ఆ విషయం గురించి కూడా ఆయన దేవునితో చెప్పాడు.
కానీ సుంకరి అలా చేయలేదు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తలెత్తి ఆకాశంవైపు కూడా చూడలేదు. తల వంచుకుని దూరంగా నిలబడ్డాడు. ఆ సుంకరి తాను చేసిన పాపాలకు సిగ్గుపడుతూ బాధతో గుండెలు బాదుకున్నాడు. ఆయన తాను చాలా మంచివాడినని దేవునికి చెప్పుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ ఆయన ఇలా ప్రార్థించాడు, ‘దేవా! నేనొక పాపిని, నాపై దయచూపించు.’
వీళ్లిద్దరిలో దేవుడు ఎవరిని ఇష్టపడతాడని మీరు అనుకుంటున్నారు? తనెంతో మంచివాడినని అనుకున్న పరిసయ్యుడినా? లేకపోతే, తాను చేసిన పాపాలకు ఎంతో సిగ్గుపడిన సుంకరినా?—
దేవుడు సుంకరినే ఇష్టపడ్డాడని యేసు చెప్పాడు. ఎందుకు? ‘వేరేవాళ్లకన్నా మెరుగైన వాళ్లమన్నట్లు చూపించుకోవడానికి ప్రయత్నించే ప్రతీ ఒక్కరు తగ్గించబడతారు. కానీ తమ గురించి తాము తక్కువవాళ్లమని అనుకునేవాళ్లు గొప్ప చేయబడతారు’ అని యేసు వివరించాడు.—లూకా 18:9-14.
ఈ కథ చెప్పి యేసు ఏ పాఠం నేర్పించాడు?— వేరేవాళ్లకన్నా మనమే మెరుగైన వాళ్లమని అనుకోవడం తప్పు అని ఆయన బోధించాడు. వేరేవాళ్లకన్నా మనమే మెరుగైనవాళ్లమని అనుకుంటున్నట్లు మనం చెప్పకపోవచ్చు. కానీ మనం అలా అనుకుంటున్నట్లు, మనం మన పనుల ద్వారా చూపించే అవకాశం ఉంది. మీరు ఎప్పుడైనా అలా చేశారా?— అపొస్తలుడైన పేతురు ఏంచేశాడో చూడండి.
యేసు తాను బంధించబడినప్పుడు తన అపొస్తలులందరూ తనను వదిలివెళ్లిపోతారని వాళ్లతో అన్నాడు. అప్పుడు పేతురు, ‘అందరూ నిన్ను వదిలి వెళ్లినా నేను ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్లను’ అని గొప్పలు చెప్పుకున్నాడు. కానీ పేతురు పొరబడ్డాడు. పేతురు తన మీద తాను మరీ ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. నిజంగానే ఆయన యేసును వదిలి వెళ్లిపోయాడు. 30వ అధ్యాయంలోచూడబోతున్నట్లు, ఆయన యేసు దగ్గరకు తిరిగి వచ్చాడు.—మత్తయి 26:31-33.
ఇప్పుడు మన గురించి ఆలోచిద్దాం. స్కూల్లో మీ టీచరు మిమ్మల్ని, మీ తోటి విద్యార్థిని కొన్ని ప్రశ్నలు అడిగింది అనుకుందాం. వాటికి సమాధానాలు మీ తోటి విద్యార్థికి తెలియదు కానీ మీకు తెలుసు. అప్పుడు మీరేమి చేస్తారు? సమాధానాలు మీకు తెలుసు కాబట్టి మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ వెంటనే సమాధానం చెప్పలేకపోతున్న తోటి విద్యార్థితో పోల్చుకుని, మీరు గొప్ప అనుకోవడం మంచిదేనా?— మీ తోటి విద్యార్థి మీకన్నా తక్కువని చూపిస్తూ మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోవడం సరైనదేనా?—
పరిసయ్యుడు అదే చేశాడు. సుంకరికన్నా తానే నీతిమంతుడినని గొప్పలు చెప్పుకున్నాడు. కానీ పరిసయ్యుని ఆలోచన తప్పు అని గొప్ప బోధకుడు చెప్పాడు. నిజమే, కొంతమంది కొన్ని పనులను వేరేవాళ్ల కన్నా చాలా చక్కగా చేయగలరు. అంతమాత్రాన వాళ్లు వేరేవాళ్లకన్నా గొప్పవాళ్లని కాదు.
మీకు వేరేవాళ్లకన్నా ఎక్కువ తెలిసినంత మాత్రాన మీరు వాళ్లకన్నా గొప్పవాళ్లు అయిపోతారా?
కాబట్టి, వేరేవాళ్లకన్నా మనకు ఎక్కువ తెలిసినంత మాత్రాన మనం గొప్పలు చెప్పుకోవచ్చా?— దీని గురించి ఒకసారి ఆలోచించండి. మన మెదడును మనమే చేసుకున్నామా?— కాదు, మనలో ప్రతీ ఒక్కరికి దేవుడే మెదడు ఇచ్చాడు. మనకు తెలిసిన చాలా విషయాలు వేరేవాళ్ల దగ్గర నేర్చుకున్నవే. మనం ఒక పుస్తకంలో నుండి చదివి తెలుసుకుని ఉండవచ్చు. లేదా వాటి గురించి ఎవరైనా మనకు చెప్పివుండవచ్చు. మనంతట మనమే ఏదైనా ఒక సమస్యను పరిష్కరించాం అనుకోండి, అది ఎలా చేయగలిగాం?— సరిగ్గా చెప్పారు, దేవుడు మనకు ఇచ్చిన మెదడును ఉపయోగించి చేయగలిగాం.
ఎవరైనా ఒక పనిచేయడానికి బాగా కష్టపడ్డారనుకోండి, వాళ్లను మెచ్చుకోవడం మంచిది. వాళ్లు చేసిన పని మీకు నచ్చిందని చెప్పండి. వాళ్లు ఆ పనిని ఇంకా చక్కగా చేయడానికి మీరు వాళ్లకు సహాయం కూడా చేయవచ్చు. వేరేవాళ్లు కూడా మీకు అలాగే చేయాలని మీరు కోరుకుంటారు కదా?—
మనం వేరేవాళ్లకన్నా బలంగా ఉన్నా, ఎందుకు గొప్పలు చెప్పుకోకూడదు?
కొంతమంది వేరేవాళ్లకన్నా బలంగా ఉంటారు. మీరు మీ చెల్లికన్నా, తమ్ముడికన్నా బలంగా ఉన్నారనుకోండి. దాని గురించి మీరు గొప్పలు చెప్పుకోవాలా?— అలా చెప్పుకోకూడదు. మనం తినే ఆహారంవల్లే మనకు బలం వస్తుంది. సూర్య కాంతిని, వర్షాన్ని, ఆహారం పండించడానికి అవసరమైన వాటన్నిటినీ దేవుడే ఇస్తున్నాడు, అవునా?— కాబట్టి, మనం బలంగా ఉంటే అందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి.—అపొస్తలుల కార్యములు 14:16, 17.
ఎవరన్నా తమ గురించి గొప్పలు చెప్పుకుంటుంటే వినడం మనలో ఎవరికీ నచ్చదు, అవునా?— యేసు చెప్పిన ఈ మాటలను గుర్తుంచుకుందాం, ‘మనుషులు మీకు ఎలా చేయాలని మీరు కోరుకుంటారో మీరు వాళ్లకు అలాగే చేయండి.’ మనం అలా చేస్తే, గొప్ప బోధకుడు చెప్పిన కథలో, తన గురించి గొప్పలు చెప్పుకున్న పరిసయ్యునిలా ఎప్పటికీ ఉండము.—లూకా 6:31.
ఒకసారి ఒక వ్యక్తి యేసును సత్పురుషుడని అన్నాడు. సత్పురుషుడు అంటే మంచివాడని అర్థం. ఆ వ్యక్తి అన్నదానికి మన గొప్ప బోధకుడు, ‘అవును నేను సత్పురుషుడినే’ అన్నాడా?— లేదు, ఆయన అలా అనలేదు. కానీ ఆయన, ‘దేవుడు తప్ప ఎవరూ సత్పురుషుడు కాదు’ అని చెప్పాడు. (మార్కు 10:18) గొప్ప బోధకుడు పరిపూర్ణుడే అయినా ఆయన తన గురించి గొప్పలు చెప్పుకోలేదుగానీ, అందరూ తన తండ్రి అయిన యెహోవానే స్తుతించేలా చేశాడు.
అయితే, మనం ఎవరి గురించైనా గొప్పలు చెప్పుకోవచ్చా?— అవును, ఒక్కరి గురించి చెప్పుకోవచ్చు. మనల్ని సృష్టించిన యెహోవా దేవుని గురించి మనం గొప్పలు చెప్పుకోవచ్చు. అందమైన సూర్యాస్తమయాన్ని లేదా ప్రకృతిలో కనిపించే మరేదైనా అద్భుతాన్ని చూసినప్పుడు, ‘మన ప్రేమగల దేవుడైన యెహోవా దీన్ని చేశాడు’ అని చెప్పవచ్చు. యెహోవా మనకోసం ఇప్పటికే చేసిన అద్భుతమైన వాటి గురించి, భవిష్యత్తులో చేయబోయే వాటి గురించి వేరే వాళ్లకు చెప్పడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉందాం.
ఈ అబ్బాయి దేని గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు?
గొప్పలు చెప్పుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుందో, ఆ అలవాటును మనమెలా మానుకోవచ్చో, సామెతలు 16:5, 18; యిర్మీయా 9:23, 24; 1 కొరింథీయులు 4:7; 13:4 వచనాలు చదివి తెలుసుకుందాం.