పరిచయం
ప్రియమైన మీకు:
దేవుడు మీ ఫ్రెండా? అది కలలోనే సాధ్యమౌతుంది అని చాలామంది అనుకుంటారు. ఆయన ఎక్కడో దూరాన ఉంటాడు అని భయపడేవాళ్లు కొందరైతే, ఆయనకు దగ్గరయ్యే అర్హత నాకు లేదు అని ఆశ వదులుకునేవాళ్లు ఇంకొందరు. కానీ బైబిలు ప్రేమతో ఇలా ప్రోత్సహిస్తుంది: “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.” (యాకోబు 4:8) దేవుడు మనకు ఈ అభయాన్ని కూడా ఇస్తున్నాడు: “నీ దేవుడైన యెహోవా అనే నేను నీ కుడిచేతిని పట్టుకుంటున్నాను, ‘భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను’ అని నేనే నీతో చెప్తున్నాను.”—యెషయా 41:13.
ఇంతకీ మనం దేవునికి ఎలా బెస్ట్ ఫ్రెండ్ అవ్వవచ్చు? ఏ స్నేహమైనా నిలబడాలంటే అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవాలి, వాళ్ల గుణాల్ని ఇష్టపడాలి, వాటిని ప్రేమించాలి. అదేవిధంగా మనం దేవునికి ఫ్రెండ్ అవ్వాలంటే, ఆయన లక్షణాల గురించి, ఆయన ప్రవర్తించే తీరు గురించి బైబిల్లో చదివి తెలుసుకోవాలి. ప్రతీ లక్షణాన్ని యెహోవా ఎలా చూపిస్తాడో, యేసుక్రీస్తు ఎలా అచ్చుగుద్దినట్టు వాటిని చూపించాడో, వాటిని మనం కూడా ఎలా చూపించవచ్చో పరిశీలించినప్పుడు దేవునికి దగ్గరౌతాం. అలా పరిశీలిస్తున్నప్పుడు, యెహోవాయే ఈ విశ్వానికి సరైన, అసలుసిసలైన సర్వాధిపతి అని తెలుసుకుంటాం. అంతకంటే ముఖ్యంగా, మనకు ఎలాంటి తండ్రి కావాలో ఆయన సరిగ్గా అలాంటి తండ్రే అని అర్థం చేసుకుంటాం. శక్తి, న్యాయం, తెలివి, ప్రేమ ఉన్న యెహోవా తన నమ్మకమైన పిల్లల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు.
మీరు యెహోవా దేవునికి ఇంకా దగ్గరవ్వడానికి, ఆయనతో చెక్కుచెదరని బంధం పెంచుకోవడానికి, సదాకాలం జీవిస్తూ ఆయన్ని స్తుతించడానికి ఈ పుస్తకం సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం.
ప్రచురణకర్తలు