47
దృశ్య సహాయకాల సమర్థమైన ఉపయోగం
మీ బోధనలో దృశ్య సహాయకాలను ఎందుకు ఉపయోగించాలి? ఎందుకంటే అలా ఉపయోగించినప్పుడు మీ బోధన మరింత సమర్థంగా ఉండగలదు. యెహోవా యేసుక్రీస్తులు దృశ్య సహాయకాలను ఉపయోగించారు, వారి నుండి మనం నేర్చుకోవచ్చు. నోటి ద్వారా పలికిన మాటకు దృశ్య సహాయకాలు తోడైతే ఆ సమాచారాన్ని రెండు ఇంద్రియాలు గ్రహిస్తాయి. ఇది మీ ప్రేక్షకుల అవధానాన్ని ఆకట్టుకునేందుకు, వారి మనస్సులపై పడిన ముద్రను మరింత ప్రగాఢం చేసేందుకు సహాయం చేస్తుంది. మీరు సువార్తను అందించేటప్పుడు దృశ్య సహాయకాలను ఎలా చేర్చవచ్చు? మీరు వాటిని అత్యంత సమర్థంగా ఉపయోగిస్తున్నారని ఎలా నిశ్చయపరచుకోవచ్చు?
అత్యంత గొప్ప బోధకులు దృశ్య సహాయకాలను ఎలా ఉపయోగించారు? యెహోవా కీలకమైన పాఠాలను బోధించడానికి సులభంగా గుర్తుంచుకోదగిన దృశ్య సహాయకాలను ఉపయోగించాడు. ఒక రాత్రి ఆయన అబ్రాహామును బయటికి తీసుకువచ్చి, “నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి—నీ సంతానము ఆలాగవునని” చెప్పాడు. (ఆది. 15:5) మానవుడిగా ఆలోచిస్తే ఆ వాగ్దానం నెరవేరడం అసంభవం అనిపించినా అబ్రాహాము ప్రగాఢంగా కదిలించబడ్డాడు, యెహోవాపై విశ్వాసముంచాడు. మరో సందర్భంలో యెహోవా యిర్మీయాను ఒక కుమ్మరి ఇంటికి పంపించి, తన పనిస్థలంలో ఆ కుమ్మరి జిగటమన్నుకు రూపాన్నిస్తుండడం చూడనిచ్చాడు. అది మానవులపై సృష్టికర్తకు ఉన్న అధికారం విషయంలో ఎంత చిరస్మరణీయమైన పాఠం! (యిర్మీ. 18:1-6) యెహోవా, కరుణ విషయంలో సొరచెట్టు ద్వారా తనకు నేర్పించిన పాఠాన్ని యోనా అసలు మరచిపోగలడా? (యోనా 4:6-11) కొన్ని యుక్తమైన వస్తువులను ఉపయోగిస్తూ ప్రవచనార్థక సందేశాలను నటించి చూపమని కూడా యెహోవా తన ప్రవక్తలకు చెప్పాడు. (1 రాజు. 11:29-33; యిర్మీ. 27:1-8; యెహె. 4:1-17) గుడారము, దేవాలయము కూడా మనం పరలోకంలోని వాస్తవాలను అర్థం చేసుకోవడానికి సహాయం చేసే ప్రతీకలే. (హెబ్రీ. 9:9,23,24) ప్రాముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి దర్శనాలను కూడా దేవుడు విస్తృతంగా ఉపయోగించాడు.—యెహె. 1:4-28; 8:2-18; అపొ. 10:9-16; 16:9,10; ప్రక. 1:1.
దృశ్య సహాయకాలను యేసు ఎలా ఉపయోగించాడు? యేసు మాటల్లో తప్పును పట్టుకోవాలని పరిసయ్యులు, హేరోదీయులు చూసినప్పుడు ఆయన ఒక దేనారము అడిగి తీసుకొని దానిపైనున్న కైసరు రూపాన్ని చూపించాడు. ఆ తర్వాత ఆయన కైసరువి కైసరుకు చెల్లించాలని, దేవునివి దేవునికి చెల్లించాలని వివరించాడు. (మత్త. 22:19-21) మనకు కలిగిన సమస్తాన్ని దేవుణ్ణి ఘనపరచడానికి ఉపయోగించాలన్న పాఠాన్ని బోధించడానికి యేసు దేవాలయం వద్ద ఒక బీద విధవరాలిని చూపించాడు; ఆమె వేసిన రెండు కాసుల కానుక ఆమె పూర్తి జీవనాదాయం. (లూకా 21:1-4) మరో సందర్భంలో ఆయన, ప్రసిద్ధికెక్కాలన్న కాంక్ష లేకుండా నమ్రత కలిగివుండడానికి ఉదాహరణగా ఒక చిన్నబిడ్డను చూపించాడు. (మత్త. 18:2-6) ఆయన వ్యక్తిగతంగా తన శిష్యుల పాదాలను కడగడం ద్వారా కూడా నమ్రతకు అర్థాన్ని చూపించాడు.—యోహా. 13:14.
దృశ్య సహాయకాలను ఉపయోగించే విధానాలు. యెహోవా వలే మనం కూడా దర్శనాల ద్వారా ఇతరులకు సమాచారాన్ని అందించలేము. అయినా యెహోవాసాక్షుల ప్రచురణల్లో ఆలోచింపజేసే అనేక చిత్రాలు ఉంటాయి. ఆసక్తిగల ప్రజలు దేవుని వాక్యంలో వాగ్దానం చేయబడిన భూ పరదైసును ఊహించుకోవడానికి వాటిని ఉపయోగించండి. మీరు ఒక గృహ బైబిలు అధ్యయనంలో, అధ్యయనం చేస్తున్నదానికి సంబంధించిన ఒక చిత్రం వైపుకి విద్యార్థి అవధానాన్ని ఆకర్షించి, తనేమి చూస్తున్నాడో చెప్పమని అడగండి. యెహోవా ప్రవక్తయైన ఆమోసుకు కొన్ని దర్శనాలు ఇచ్చిన తర్వాత “ఆమోసూ, నీకు కనబడుచున్నదే[మి]” అని అడగడం గమనార్హం. (ఆమో. 7:7, 8; 8:1, 2) దృశ్య బోధనా సహాయకాలుగా పనిచేయడానికి చిత్రించబడిన చిత్రాల వైపుకి ప్రజల అవధానాన్ని మళ్ళించి, మీరు కూడా అలాంటి ప్రశ్నలే అడగవచ్చు.
కాగితం మీద లెక్కలు వేయడమో లేదా, ప్రముఖ సంఘటనలను అవి జరిగిన క్రమంలో పెడుతూ కాలక్రమ పట్టిక గీయడమో చేస్తే, దానియేలు 4:16 లోని “ఏడు కాలములు,” దానియేలు 9:24 లోని “డెబ్బదివారములు” వంటి ప్రవచనాలు ప్రజలకు త్వరగా అర్థమవుతాయి. అలాంటి దృశ్య సహాయకాలు మనం అధ్యయనం చేసే అనేక ప్రచురణల్లో కనిపిస్తాయి.
మీ కుటుంబ బైబిలు అధ్యయనంలో గుడారము, యెరూషలేము మందిరము, యెహెజ్కేలు దర్శన దేవాలయము వంటివాటి గురించిన చర్చల్లో, మీరు ఒక చిత్రాన్ని గానీ చేత్తో గీసిన బొమ్మను గానీ ఉపయోగిస్తే అర్థం చేసుకోవడానికి మరింత సులభంగా ఉంటాయి. అవి మనకు లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం)లోను, నూతనలోక అనువాదము—రెఫరెన్సులతో కూడినది (ఆంగ్లం)లోని అపెండిక్సులోను, అలాగే అనేక కావలికోట సంచికల్లోను కనిపిస్తాయి.
మీ కుటుంబంతోపాటు బైబిలు చదువుతున్నప్పుడు మ్యాపులను ఉపయోగించండి. అబ్రాహాము ఊరు నుండి హారానుకు, ఆ తర్వాత బేతేలుకు చేసిన ప్రయాణాన్ని మ్యాపులో చూడండి. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తును విడిచి వాగ్దానం చేయబడిన దేశానికి ప్రయాణం చేసేటప్పుడు వారు వెళ్ళిన మార్గాన్ని పరిశీలించండి. ఒక్కొక్క గోత్రానికి స్వాస్థ్యంగా ఇవ్వబడిన ప్రాంతం ఎక్కడుందో గుర్తించండి. సొలొమోను రాజ్యం ఎంత వరకు విస్తరించివుందో గమనించండి. యెజెబెలు బెదిరించిన తర్వాత ఏలీయా యెజ్రెయేలు నుండి పారిపోతూ బెయేర్షెబా అవతలనున్న అరణ్యం వరకు వెళ్ళిన మార్గాన్ని అనుసరించండి. (1 రాజు. 18:46-19:4) యేసు ప్రకటించిన నగరాలు పట్టణాలు మ్యాపులో చూడండి. అపొస్తలుల కార్యములు పుస్తకంలో వర్ణించబడినట్లుగా పౌలు చేసిన ప్రయాణ మార్గాలను అనుసరించండి.
బైబిలు విద్యార్థులకు సంఘ కార్యకలాపాలను పరిచయం చేస్తున్నప్పుడు దృశ్య సహాయకాలు చాలా ఉపయోగపడతాయి. సమావేశాల్లో చర్చించబోయే సమాచారం ఎలాంటిదో వివరిస్తూ ముద్రిత కార్యక్రమ పట్టికను మీ విద్యార్థికి చూపించవచ్చు. రాజ్యమందిరాన్ని ఎవరైనా దగ్గరుండి చూపించడం మూలంగా, యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించడం మూలంగా అనేకులు ప్రభావితులయ్యారు. మన పని గురించి దాని ఉద్దేశం గురించి ఉన్న అపోహలు తొలగించడానికి ఇదొక సమర్థవంతమైన మార్గంగా ఉండగలదు. రాజ్యమందిరాన్ని చూపిస్తున్నప్పుడు అది ఇతర ఆరాధనా స్థలాల నుండి ఎలా భిన్నంగా ఉందో వివరించండి. రాజ్యమందిరం ఎంత నిరాడంబరంగా ఉందో అది నేర్చుకోవడానికి ఎంతగా దోహదపడుతుందో నొక్కిచెప్పండి. ప్రత్యేకంగా మన బహిరంగ పరిచర్య కోసం రూపొందించబడిన విభాగాలు—సాహిత్య పంపిణీ విభాగం, ప్రకటనా ప్రాంతం మ్యాపులు, చందా బాక్సులు (చందాల కోసం పళ్ళాలు తిప్పడం ఉండదు) వంటివి చూపించండి.
పరిపాలక సభ నిర్దేశంలో తయారు చేయబడిన వీడియోలు అందుబాటులో ఉన్నట్లైతే, బైబిలుపై నమ్మకాన్ని పెంపొందించడానికి, యెహోవాసాక్షుల కార్యకలాపాలను గురించి తెలియజేయడానికి, బైబిలు సూత్రాలకు అనుగుణంగా జీవించేలా ప్రేక్షకులను ప్రోత్సహించడానికి వాటిని ఉపయోగించండి.
పెద్ద సమూహాల కోసం దృశ్య సహాయకాలు ఉపయోగించడం. చక్కగా సిద్ధపడి, సమర్థవంతంగా అందిస్తే దృశ్య సహాయకాలు పెద్ద సమూహాలకు కూడా సమర్థమైన బోధనా సహాయకాలుగా ఉండగలవు. అలాంటి దృశ్య సహాయకాలను నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి అనేక రూపాల్లో అందించింది.
కావలికోటలోని అధ్యయన సమాచారంలో తరచూ చిత్రాల రూపంలో దృశ్య సహాయకాలు ఉంటాయి, వీటిని నిర్వాహకుడు ముఖ్యాంశాలను నొక్కిచెప్పడానికి ఉపయోగించవచ్చు. సంఘ పుస్తక అధ్యయనంలో ఉపయోగించే ప్రచురణల్లో కూడా అలాగే చేయవచ్చు.
బహిరంగ ప్రసంగాల సంక్షిప్త ప్రతులు కొన్ని, వివిధ విషయాలను దృష్టాంతపరచడానికి దృశ్య సహాయకాలు ఉపయోగించే అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే సాధారణంగా, ప్రేక్షకుల్లో అత్యధికుల దగ్గర బైబిలు ఉంటుంది కాబట్టి, బైబిలులో ఉన్న విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. ప్రసంగంలోని ఒకటి లేక అంతకన్నా ఎక్కువ ముఖ్యాంశాలను వివరించడానికి ఒక చిత్రాన్ని చూపించడమో లేక బోర్డు మీద కొన్ని ముఖ్యాంశాలను క్లుప్తంగా వ్రాయడమో చేయాల్సిన అవసరం ఉంటే, ఆ దృశ్య సహాయకం సమావేశ స్థలం చివరి వరుసల్లో కూర్చున్న వారికి కూడా స్పష్టంగా కనిపిస్తుందా (లేక చదవడం వీలవుతుందా) అన్నది ముందే రూఢిపరచుకోండి. అలాంటి సహాయకాలను తక్కువగా ఉపయోగించాలి.
మాట్లాడేటప్పుడు బోధించేటప్పుడు దృశ్య సహాయకాలను ఉపయోగించడంలో మీ లక్ష్యం వినోదాన్ని అందించడం కాదు. మర్యాదకరమైన దృశ్య సహాయకాన్ని ఉపయోగించినప్పుడు అది, ప్రత్యేకంగా నొక్కిచెప్పాల్సిన అవసరం ఎక్కువగా ఉన్న తలంపులకు దృశ్యపరమైన బలాన్ని అందించాలి. నోటితో పలికిన మాటను స్పష్టం చేయడానికి దోహదపడినప్పుడు, అర్థం చేసుకోవడాన్ని సులభతరం చేసినప్పుడు, లేదా చెప్పిన మాటల నమ్మకత్వానికి బలమైన రుజువునిచ్చినప్పుడు అలాంటి సహాయకాలు ఉపయోగకరమైన సంకల్పాన్ని నెరవేరుస్తాయి. ఉచితరీతిలో ఉపయోగించినప్పుడు యుక్తమైన దృశ్య సహాయకం మనస్సులపై ఎంత గాఢమైన ముద్రను వేస్తుందంటే, అటు దృశ్య సహాయకము, ఇటు ఉపదేశ విషయము రెండూ ఎన్నో సంవత్సరాల పాటు గుర్తుండిపోతాయి.
దృశ్య, శ్రవణ సామర్థ్యాలు రెండూ, విద్యా ప్రక్రియలో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ ఇంద్రియాలను అత్యంత గొప్ప బోధకులు ఎలా ఉపయోగించుకున్నారో గుర్తుచేసుకోండి, ఇతరుల హృదయాలను కదిలించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో వారిని అనుకరించడానికి కృషి చేయండి.