35
విషయాన్ని నొక్కి చెప్పడానికి మళ్ళీ చెప్పడం
సమర్థవంతమైన బోధనలో మళ్ళీ చెప్పడం ఉంది. ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ఒకటి కన్నా ఎక్కువ సార్లు చెప్పినప్పుడు, శ్రోతలు దానిని జ్ఞాపకముంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విషయాన్ని మరొకసారి కొంచెం వేరే మాటల్లో చెబితే, వాళ్ళు దాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు.
మీరు చెప్పిన మాటలు మీ శ్రోతలకు జ్ఞాపకం లేకపోతే, వాళ్ళ నమ్మకాల మీదా వాళ్ళు జీవిస్తున్న విధానం మీదా అవి ప్రభావం చూపించలేవు. మీరు ప్రత్యేకంగా నొక్కి చెప్పే విషయాల గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉండవచ్చు.
విషయాలను మళ్ళీ చెప్పడంలో మన మహోపదేశకుడైన యెహోవా మనకు మంచి మాదిరి ఉంచుతున్నాడు. ఆయన ఇశ్రాయేలు జనాంగానికి పది ఆజ్ఞలను ఇచ్చాడు. తన వక్తయైన ఒక దేవదూతను పంపించి ఆయన ద్వారా, సీనాయి కొండ దగ్గర ఆ జనాంగాలకు ఆ ఆజ్ఞలను వినిపించాడు. తర్వాత ఆయన వాటిని లిఖిత రూపంలో మోషేకిచ్చాడు. (నిర్గ. 20:1-17; 31:18; ద్వితీ. 5:22) ఆ జనాంగము వాగ్దానం చేయబడిన దేశంలోనికి ప్రవేశించకముందు, యెహోవా నిర్దేశం ప్రకారం మోషే ఆ జనాంగానికి ఆ ఆజ్ఞలను మళ్ళీ చెప్పాడు, పరిశుద్ధాత్మ ద్వారా మోషే వాటిని లిఖిత రూపంలో పెట్టాడు, అవి ద్వితీయోపదేశకాండము 5:6-21 వచనాల్లో ఉన్నాయి. ఇశ్రాయేలుకు ఇవ్వబడిన ఆజ్ఞల్లో, వారు తమ పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణశక్తితోను యెహోవాను ప్రేమించి సేవించాలన్న ఆదేశం ఉంది. ఈ ఆదేశం మళ్ళీ మళ్ళీ ఇవ్వబడింది. (ద్వితీ. 6:5; 10:12; 11:13; 30:6) ఎందుకని? ఎందుకంటే, యేసు చెప్పినట్లు అది “ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.” (మత్త. 22:34-38) తాను ఆజ్ఞాపించినవాటన్నింటికీ విధేయత చూపించడాన్ని గంభీరంగా తీసుకోవాలని యూదాలోని ప్రజలకు యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా 20 కన్నా ఎక్కువ సార్లు గుర్తు చేశాడు. (యిర్మీ. 7:23; 11:4; 12:17; 19:15) అన్యజనులు ‘నేను యెహోవానై యున్నానని తెలిసికొందురు’ అని యెహెజ్కేలు ద్వారా దేవుడు 60 కన్నా ఎక్కువ సార్లు చెప్పాడు.—యెహె. 6:10;38:23.
యేసు పరిచర్యను గురించిన నివేదికలో మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఉండే సమర్థవంతమైన ఉపయోగాన్ని కూడా మనం చూస్తాం. ఉదాహరణకు నాలుగు సువార్తల్లోని ప్రతి సువార్తా మరొక సువార్తలో గానీ అంతకన్నా ఎక్కువ సువార్తల్లో గానీ నివేదించబడిన ప్రాముఖ్యమైన సంఘటనలను చర్చిస్తుంది, అయితే వాటిని కొంచెం భిన్నమైన కోణాల్లో చెబుతుంది. తన బోధనలోని ఉపదేశంలోని ఒక ప్రాథమిక అంశాన్ని యేసు ఒకటి కన్నా ఎక్కువ సందర్భాల్లో వేర్వేరు విధాల్లో చెప్పాడు. (మార్కు 9:34-37; 10:35-45; యోహా. 13:2-17) యేసు తన మరణానికి కొన్ని రోజుల ముందు ఒలీవ కొండ మీద ఉన్నప్పుడు, “ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి” అన్న ప్రాముఖ్యమైన సలహాను నొక్కిచెప్పేందుకు దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాడు.—మత్త. 24:42; 25:13.
క్షేత్ర పరిచర్యలో. మీరు ప్రజలకు సాక్ష్యమిచ్చేటప్పుడు, మీరు చెప్పేది వాళ్ళు గుర్తుంచుకోవాలని మీరు ఆశిస్తారు. మీరు ఆ లక్ష్యాన్ని సాధించేందుకు సమర్థవంతంగా మళ్ళీ మళ్ళీ చెప్పడం దోహదపడగలదు.
ఒక విషయాన్ని చర్చిస్తున్నప్పుడే దాన్ని మళ్ళీ చెప్పడం, ఒక వ్యక్తి మనస్సుపై దాన్ని ముద్రించేందుకు తరచూ సహాయపడుతుంది. కాబట్టి ఒక లేఖనాన్ని చదివిన తర్వాత, ఒక లేఖనంలోని ప్రాముఖ్యమైన భాగాన్ని మళ్ళీ చూపించి, “ఈ వచనంలో ఆ మాట ఎలా ఉపయోగించబడిందో మీరు గమనించారా?” అని అడగడం ద్వారా నొక్కిచెప్పవచ్చు.
సంభాషణలోని చివరి వాక్యాలను కూడా సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు “మన సంభాషణలో మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, . . .” అని అంటూ ముఖ్యమైన విషయాన్ని మళ్ళీ చెప్పవచ్చు. ఈ విధంగా ఏమైనా చెప్పవచ్చు: “భూమిని పరదైసుగా మార్చాలన్నదే దేవుని సంకల్పం. ఆ సంకల్పం నిశ్చయంగా వాస్తవమవుతుంది.” లేదా ఇలా చెప్పవచ్చు: “మనం ఈ విధానపు అంత్యదినాల్లో జీవిస్తున్నామని బైబిలు స్పష్టంగా చూపిస్తోంది. దాని అంతం నుండి మనం తప్పించుకోవాలంటే, దేవుడు మన నుండి కోరుతున్నదేమిటో మనం తెలుసుకోవలసిన అవసరముంది.” లేదా “మనం ఇప్పటి వరకు చూసినట్లు, కుటుంబ జీవిత సమస్యలను అధిగమించడానికి బైబిలు ఆచరణాత్మకమైన ఉపదేశాన్ని ఇస్తోంది” అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక బైబిలు ఉల్లేఖనాన్ని, గుర్తుంచుకోవలసిన అంశంగా మళ్ళీ చెప్పవచ్చు. సమర్థమైన విధంగా మళ్ళీ చెప్పాలంటే ముందుగా దాని గురించి ఆలోచించుకోవడం అవసరమన్నది సుస్పష్టం.
బైబిలు అధ్యయనాల్లోనూ పునర్దర్శనాల్లోనూ చెప్పినదాన్నే మళ్ళీ చెప్పడంలో పునఃసమీక్షా ప్రశ్నలను ఉపయోగించడం ఉండవచ్చు.
ఒక వ్యక్తికి ఒక బైబిలు సలహాను అర్థం చేసుకోవడం గానీ దాన్ని అన్వయించుకోవడం గానీ కష్టంగా ఉంటే, ఒకటి కన్నా ఎక్కువ సందర్భాల్లో మీరు ఆ విషయాన్ని క్లుప్తంగా చెప్పడం అవసరం కావచ్చు. వివిధ కోణాల్లో దాన్ని చర్చించడానికి ప్రయత్నించండి. చర్చ ఎక్కువసేపు జరపనవసరం లేదు కానీ ఆ విషయం గురించి ఆలోచిస్తుండమని విద్యార్థిని ప్రోత్సహించాలి. ప్రముఖ స్థానం పొందాలన్న కోరికను అధిగమించేందుకు తన శిష్యులకు సహాయం చేయడానికి యేసు ఈ పద్ధతిలో విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాడన్న విషయం గుర్తుంచుకోండి.—మత్త. 18:1-6; 20:20-28; లూకా 22:24-27.
ప్రసంగాలు ఇచ్చేటప్పుడు. వేదిక మీద నుండి ప్రసంగాలు ఇస్తున్నప్పుడు సమాచారాన్ని కేవలం అందించడమే మీ లక్ష్యం కాదు. మీ ప్రేక్షకులు దాన్ని అర్థం చేసుకొని గుర్తుంచుకొని అన్వయించుకోవాలని మీరు కోరుకుంటారు. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పండి.
అయితే మీరు ముఖ్యాంశాలను అతి తరచుగా మళ్ళీ మళ్ళీ చెబితే మీ శ్రోతల అవధానం ప్రక్కకు మళ్ళవచ్చు. ప్రత్యేకంగా నొక్కిచెప్పవలసిన అంశాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. ఆ అంశాలు సాధారణంగా ముఖ్యమైనవై ఉంటాయి, వాటి ఆధారంగానే ప్రసంగం విపులీకరించబడుతుంది. అయితే మీ శ్రోతలకు ప్రత్యేకంగా విలువైనవిగా ఉండే ఇతర విషయాలను కూడా వాటిలో చేర్చవచ్చు.
మళ్ళీ చెప్పేందుకు మీ ముఖ్యాంశాలను మొదట మీ ఉపోద్ఘాతంలో క్లుప్తంగా చెప్పవచ్చు. మీరు చర్చించబోతున్న విషయాన్ని సంగ్రహంగా తెలిపే చిన్న వాక్యాలతోనో ప్రశ్నలతోనో పరిష్కరించవలసిన సమస్యలను తెలిపే చిన్న ఉదాహరణలతోనో చెప్పండి. ముఖ్యాంశాలు ఎన్ని ఉన్నాయో చెప్పి మొదటిది, రెండవది అంటూ ఒక్కొక్క అంశాన్ని పేర్కొనండి. తర్వాత వాటిలో ఒక్కొక్కదాన్నీ ప్రసంగపు ముఖ్యభాగంలో విపులీకరించి చెప్పండి. మీ ప్రసంగపు ముఖ్యభాగంలో ఒక అంశాన్ని చర్చించి తర్వాతి అంశానికి వెళ్ళే ముందు దాన్ని మరొకసారి పేర్కొనడం ద్వారా నొక్కిచెప్పవచ్చు. లేదా ముఖ్యాంశం అన్వయమున్న ఉదాహరణను ఉపయోగించడం ద్వారా నొక్కిచెప్పవచ్చు. ముఖ్యాంశాలను వాటి ముగింపులో మళ్ళీ చెప్పడం ద్వారా విభిన్న విషయాలను ఉపయోగించి వాటిని ప్రత్యేకంగా గుర్తింపజేయడం ద్వారా ముందు వేసిన ప్రశ్నలకు జవాబివ్వడం ద్వారా లేదా ముందు పేర్కొన్న సమస్యలకు పరిష్కార మార్గాలను చెప్పడం ద్వారా మళ్ళీ నొక్కిచెప్పవచ్చు.
అనుభవజ్ఞుడైన ప్రసంగీకుడు పైవిధంగా చేయడమే కాకుండా ప్రేక్షకుల్లో ఒక్కో వ్యక్తిని జాగ్రత్తగా గమనిస్తాడు. వారిలో కొందరికి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టమైతే, ప్రసంగీకుడికి అది తెలుస్తుంది. ఆ విషయం ప్రాముఖ్యమైనదైతే ఆయన దాన్ని మళ్ళీ చెబుతాడు. అయితే వాడిన పదాలనే మళ్ళీ వాడడం వల్ల ప్రయోజనముండకపోవచ్చు. బోధించడంలో అంతకన్నా ఎక్కువే ఉంది. ఆయన పరిస్థితులకు తగిన విధంగా కావలసిన సవరింపులు చేసుకోగలిగేలా ఉండాలి. తన ప్రసంగానికి అప్పటికప్పుడు కొన్నింటిని అదనంగా చేర్చడం అవసరం కావచ్చు. ఒక బోధకుడిగా మీరు ఎంత సమర్థంగా ఉంటారన్నది మీరు ఈ విధంగా ప్రేక్షకులకు అవసరమైనవాటిని చర్చించడాన్ని నేర్చుకునేదాన్ని బట్టి ఉంటుంది.