27
పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడం
మీరు మీ ప్రసంగాన్ని సిద్ధం చేసుకోవడం కోసం చాలా కష్టపడి ఉండవచ్చు. మీ దగ్గర పరిజ్ఞానాన్నందించే సమాచారముండవచ్చు. అది తర్కబద్ధంగా ఉండవచ్చు. మీరు దాన్ని అనర్గళంగా అందించగల్గుతుండవచ్చు. కానీ మీ ప్రేక్షకుల శ్రద్ధ అటు కొంచెం ఇటు కొంచెం ఉంటూ వాళ్ళ మనస్సులు అడపాదడపా ఇతర విషయాల మీదికి వెళ్తూ ఉండడం వల్ల మీరు చెప్పిన దాంట్లో వాళ్ళు ఏవో కొన్ని మాత్రమే వింటే మీ అందింపు ఎంత సమర్థవంతంగా ఉన్నట్లు? తమ మనస్సులను ప్రసంగం మీద నిలపడం ప్రేక్షకులకు కష్టమవుతున్నట్లయితే, మీరు వారి హృదయాలను చేరుకునే అవకాశం ఉందంటారా?
అలాంటి సమస్యకు మూలకారణం ఏమై ఉండవచ్చు? అందుకు వేర్వేరు విషయాలు కారణమవుతుండవచ్చు. పదేపదే నోట్సు చూడకుండా చెప్పలేకపోవడమే తరచూ కారణమవుతుంటుంది. మరొక మాటలో చెప్పాలంటే ప్రసంగీకుడు అస్తమానం నోట్సు చూసుకుంటున్నాడు, లేదా ఆయన మాట్లాడే విధానం మరీ నియతంగా ఉంటోంది. అయితే ఈ సమస్యలు ప్రసంగానికి సిద్ధపడే విధానంతో నేరుగా ముడిపడివుంటాయి.
మీరు మొదట మీ ప్రసంగాన్నంతటినీ వ్రాసుకొని, ఆ తర్వాత దాన్ని సంక్షిప్త ప్రతిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే, పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడం కష్టమవుతున్నట్లు మీరు గ్రహించవచ్చు. ఎందుకని? ఎందుకంటే మీరు నిర్దిష్ట పదాలను ఎంపిక చేసుకుని వాటినే ఉపయోగించాలనుకున్నారు. మీరు మీ ప్రసంగం కోసం సంక్షిప్త ప్రతిని ఉపయోగించినా మీరు మొదట వ్రాసుకున్న ప్రతిలో వాడిన పదాలను గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దేనినైనా వ్రాసుకున్నప్పుడు మాటలు మరింత నియతంగా ఉంటాయి. వాక్య నిర్మాణం దైనందిన సంభాషణలో చెప్పే వాక్యాల కన్నా సంక్లిష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రసంగంలో చెప్పే వాక్యాలు కూడా అలాగే ఉంటాయి.
మీరు ప్రసంగాన్ని విశదంగా వ్రాసుకునే బదులు, ఈ విధంగా చేయడానికి ప్రయత్నించండి: (1) మీరు ప్రసంగాంశాన్నీ, ఆ అంశాన్ని విపులీకరించేందుకు మీరు ఉపయోగించబోతున్న విషయం యొక్క ముఖ్య పార్శ్వాలనూ ఎంపిక చేసుకోండి. చిన్న ప్రసంగానికి ముఖ్యాంశాలు రెండుంటే సరిపోవచ్చు. కొంచెం పెద్ద ప్రసంగానికి నాలుగో ఐదో అంశాలు ఉండవచ్చు. (2) ఒక్కో ముఖ్యాంశాన్ని విపులీకరించేందుకు మీరు ఉపయోగించాలనుకుంటున్న ప్రధాన లేఖనాలను ఆయా ముఖ్యాంశాల క్రింద వ్రాసుకోండి; అలాగే, ఉపమానాలనూ కీలక వాదనలనూ కూడా టూకీగా వ్రాసిపెట్టుకోండి. (3) ప్రసంగానికి ఉపోద్ఘాతమెలా ఇవ్వాలో ఆలోచించుకోండి. ఒకటో రెండో వాక్యాలను వ్రాసిపెట్టుకోవచ్చు కూడా. అలాగే ముగింపును గురించి కూడా ఆలోచించి పెట్టుకోండి.
ప్రసంగం కోసం సిద్ధపడడం చాలా ప్రాముఖ్యం. అయితే ప్రతి పదాన్నీ కంఠస్థం చేయాలని చూడకండి. పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించాలంటే సిద్ధపడేటప్పుడు పదాలకు కాక వ్యక్తం చేయాలనుకుంటున్న విషయాలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. మీ మనస్సులో ఒక విషయం తర్వాత మరొక విషయం నిరాటంకంగా వచ్చే వరకు వాటి గురించి మననం చేసుకోవాలి. మీ ప్రసంగ నిర్మాణం తర్కబద్ధంగా విపులీకరించబడితే మంచిగా ఆలోచించిపెట్టుకున్నదైతే విషయాలు ఒకదాని తర్వాత ఒకటి నిరాటంకంగా రావడం కష్టమేమీ కాదు, మీ ప్రసంగంలో విషయాలు సహజంగా సులభంగా వస్తాయి.
ప్రయోజనాల గురించి ఆలోచించండి. పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడం వల్ల వచ్చే ప్రాముఖ్యమైన ప్రయోజనమేమిటంటే మీరు అర్థవంతంగా మాట్లాడగలుగుతారు, అప్పుడు ప్రజలు వెంటనే ప్రతిస్పందిస్తారు. మీ మాటలు మరింత సజీవంగా ఉండి వారికి మరింత ఆసక్తికరంగా ఉంటాయి.
ఈ పద్ధతిలో మాట్లాడడం వల్ల మీరు శ్రోతల కళ్ళల్లోకి వీలైనంత మట్టుకు చూడగలుగుతారు, తద్వారా మీరు వారితో భావప్రకటన చేసే విధానం మెరుగుపడుతుంది. మీరు ఒక్కో వాక్యంలో పదాల కోసం నోట్సు మీద ఆధారపడరు గనుక మీరు చెబుతున్న విషయం గురించి మీకు బాగా తెలుసనీ మీరు చెబుతున్నది నిజమనీ మీరు దాన్ని హృదయపూర్వకంగా నమ్ముతున్నారనీ అనుకునేందుకు మీ శ్రోతలు ఇంకా ఎక్కువ మొగ్గుచూపుతారు. కాబట్టి ఈ విధంగా ప్రసంగించినప్పుడు మీ ప్రసంగం ఆప్యాయతతోకూడినదై ఉంటుంది, సంభాషణా శైలిలో నిజంగా హృదయాలను చేరుకునేదై ఉంటుంది.
పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగిస్తే అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలవుతుంది. మీరు సిద్ధం చేసుకున్న సమాచారం సవరింపులు చేసుకోలేని విధంగా ఉండదు. ఉదాహరణకు మీరు ప్రసంగమిచ్చే రోజు ఉదయం, మీరు చెప్పబోతున్న విషయానికి నేరుగా సంబంధమున్న గమనార్హమైన వార్తా నివేదిక వచ్చిందనుకోండి. దాన్ని పేర్కొనడం సముచితంగా ఉండదంటారా? లేదా మీరు ప్రసంగిస్తున్నప్పుడు, ప్రేక్షకుల్లో బడికి వెళ్ళే వయస్సుగల పిల్లలు చాలామంది ఉన్నారని మీరు గ్రహించవచ్చు. మీరు చెబుతున్న సమాచారం తమ జీవితాలపై ఎలా ప్రభావం చూపగలదో వారు గ్రహించేలా సహాయపడేందుకు, మీ ఉపమానాల్లోనూ వాటి అన్వయింపుల్లోనూ సవరింపులు చేసి చెప్పడం ఎంత మంచిది!
పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడం వల్ల కలిగే మరొక ప్రయోజనమేమిటంటే, మొదట మీ మనస్సే ఉత్తేజపరచబడుతుంది. ప్రశంసించే, ప్రతిస్పందించే ప్రేక్షకులున్నప్పుడు మీరూ మరింత ఉత్సాహాన్ని పొంది విషయాలను విపులీకరిస్తారు, లేదా కొన్ని విషయాలను నొక్కి చెప్పేందుకు వాటిని మళ్ళీ చెప్పడానికి సమయం తీసుకుంటారు. మీ ప్రేక్షకుల ఆసక్తి తగ్గుముఖం పడుతున్నట్లు మీరు గమనిస్తే, మనస్సు అటూ ఇటూ పోతున్న వారితో ఊరికే మాట్లాడే బదులు ఆ సమస్యను అధిగమించేందుకు దోహదపడే పద్ధతులను మీరు అవలంబించగలుగుతారు.
ఈ ప్రమాదాలను నివారించుకోండి. పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలుంటాయని మీకు తెలిసుండాలి. ఒక ప్రమాదం ఏమిటంటే, నిర్ధారిత సమయాన్ని మించిపోవడం. మీరు ప్రసంగించేటప్పుడు అనేక అదనపు విషయాలను చేర్చితే సమయం సరిపోకపోవడం ఒక సమస్య కావచ్చు. ఈ సమస్యను అధిగమించేందుకు, మీ ప్రసంగంలో ఒక్కో భాగానికి కేటాయించబడిన సమయాన్ని మీరు తయారుచేసుకున్న సంక్షిప్త ప్రతి మీద వ్రాసిపెట్టుకొని, ఆ సమయాన్ని పాటించండి.
ముఖ్యంగా అనుభవజ్ఞులైన ప్రసంగీకులు ఎదుర్కొనే మరొక ప్రమాదం ఏమిటంటే, అమితమైన ఆత్మవిశ్వాసం. బహిరంగంగా ప్రసంగించడంలో అనుభవమున్నందువల్ల కేటాయించబడిన సమయంలోగా కొన్ని విషయాలను చెప్పేయడం అంత కష్టం కాదని కొందరు ప్రసంగీకులు అనుకోవచ్చు. కానీ స్వయంగా యెహోవాయే మహోపదేశకుడుగా ఉన్న విద్యా కార్యక్రమంలో మనం పాల్గొంటున్నామన్న వాస్తవాన్ని గురించి మనకున్న కృతజ్ఞతా వినయమూ మనం ప్రతీ నియామకాన్నీ ప్రార్థనాపూర్వకంగా మొదలుపెట్టేందుకు, చక్కగా సిద్ధపడేందుకు మనల్ని ప్రేరేపించాలి.—యెష. 30:20; రోమా. 12:6-8.
పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడంలో అనుభవంలేని చాలామంది ప్రసంగీకులకు ఎక్కువ చింతను కలిగించేది, చెప్పాలనుకున్న విషయాలను మరిచిపోయే అవకాశముందన్నది కావచ్చు. అలా మరిచిపోయే ప్రమాదమున్నంత మాత్రాన, సమర్థవంతంగా మాట్లాడడంలో మొదటి అడుగు అయిన నోట్సు చూడకుండా ప్రసంగించే అలవాటును మానుకోకండి. మంచిగా సిద్ధపడి, యెహోవా తన ఆత్మను సహాయంగా ఇస్తాడని ఆయన వైపుకు చూడండి.—యోహా. 14:26.
పదాల గురించి కొంతమంది ప్రసంగీకులకున్న మితిమీరిన చింత, పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించాలని వాళ్ళు చేసే ప్రయత్నానికి అడ్డొస్తుంది. పదేపదే నోట్సు చూడకుండా చేసే ప్రసంగంలో, వ్రాతప్రతి ప్రసంగంలోలా చక్కగా ఎంపిక చేసుకున్న పదాలు గానీ వ్యాకరణ ఖచ్చితత్వం గానీ ఉండకపోవచ్చన్నది నిజమే, కానీ ఆకర్షణీయమైన సంభాషణా శైలి వాటి లోటును తీరుస్తుంది. తాము తేలికగా అర్థం చేసుకోగల పదాలతో సరళమైన వాక్యాల్లో తెలియజేసిన విషయాలకు ప్రజలు వెంటనే ప్రతిస్పందిస్తారు. మీరు బాగా సిద్ధపడితే సముచితమైన పదబంధాలు సహజంగా వస్తాయి. అలా వచ్చేది మీరు కంఠస్థం చేసినందువల్ల కాదుగానీ, మీరు ఆ విషయాలను కావలసినంత మేరకు మననం చేయడం వల్లనే. మీరు మంచి మాటలను మీ దైనందిన సంభాషణల్లో వాడితే మీరు వేదిక మీద ఉన్నప్పుడు కూడా అవే సహజంగా వస్తాయి.
ఎలాంటి నోట్సు ఉపయోగించాలి? కొంతకాలం పాటు అభ్యాసం అయ్యాక, మీరు మీ ప్రసంగంలోని ఒక్కొక్క అంశానికి కేవలం కొన్ని పదాలను వ్రాసుకుంటూ సంక్షిప్త ప్రతి పరిమాణాన్ని తగ్గించుకోగలుగుతారు. అలాంటి పదాలతోపాటు మీరు ఉపయోగించాలనుకుంటున్న లేఖనాలను కూడా ఒక కార్డు మీద గానీ కాగితం మీద గానీ వ్రాసుకుంటే అవసరమైనప్పుడు వాటిని సులభంగా చూసుకోవచ్చు. చాలా మట్టుకు క్షేత్ర పరిచర్య కోసం సరళమైన సంక్షిప్త ప్రతిని మీరు మీ మనస్సులోనే రూపొందించుకొని మననం చేస్తారు. మీరు పునర్దర్శనం కోసం ఒక విషయం మీద పరిశోధన చేసినట్లయితే, దాన్ని ఒక కాగితం మీద క్లుప్తంగా వ్రాసుకొని మీ బైబిలు పేజీల మధ్య పెట్టుకోవచ్చు. లేదా మీరు మీ చర్చకు ఆధారంగా “చర్చనీయ బైబిలు అంశములు”లోని సంక్షిప్త ప్రతిని గానీ లేఖనముల నుండి తర్కించడం (ఆంగ్లం) అనే పుస్తకంలోని సమాచారాన్ని గానీ ఉపయోగించవచ్చు.
అయితే కొన్ని వారాల్లోనే కూటాల్లో మీరు నిర్వహించవలసిన భాగాలు అనేకముంటే, ఒకవేళ బహిరంగ ప్రసంగాలివ్వడానికి కూడా మీరు నియమించబడితే మీకు ఇంకొంచెం విస్తృతమైన నోట్సు అవసరమని మీరు గ్రహిస్తుండవచ్చు. ఎందుకు అవసరం? ఎందుకంటే మీరు ఆ నియామకాల్లో ఒక్కో దాన్ని నిర్వహించే ముందు ఆ సమాచారాన్నంతటినీ గుర్తుచేసుకునేందుకు. అయితే మీరు ప్రసంగించేటప్పుడు పదాల కోసం నోట్సు మీద మరీ ఎక్కువగా ఆధారపడుతున్నట్లయితే, ఒక్కో వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యంలో ఏదో ఒకచోట నోట్సు చూసి చెబుతున్నట్లయితే, సాధారణంగా పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడం వల్ల వచ్చే ప్రయోజనాలు కలగవు. మీరు విస్తృతమైన నోట్సును ఉపయోగిస్తున్నట్లయితే, మీ ప్రసంగ సంక్షిప్త ప్రతికి ఆధారమైన పదాలనూ లేఖనాల ఉల్లేఖనాలకూ ఏదైనా గుర్తు పెట్టుకోండి, అప్పుడే మీరు ప్రసంగించేటప్పుడు సులభంగా వాటిని మాత్రమే చూడగలుగుతారు.
అనుభవజ్ఞుడైన ప్రసంగీకుడు సాధారణంగా పదేపదే నోట్సు చూడకుండానే ప్రసంగిస్తున్నప్పటికీ సమాచారాన్ని అందించేందుకు ఇతర పద్ధతులను అవలంబించడం వల్ల కూడా ప్రయోజనాలుంటాయి. ఉపోద్ఘాతంలోనూ ముగింపులోనూ ప్రేక్షకులను చూస్తూ జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న శక్తివంతమైన పదాలతో ఒక విషయాన్ని చెప్పడం అవసరమైనప్పుడు, కొన్ని వాక్యాలను కంఠస్థం చేసి చెప్పడం సమర్థంగా ఉండవచ్చు. వాస్తవాలను, అంకెలను, ఉల్లేఖనాలను లేదా లేఖనాలను ఉపయోగించేటప్పుడు చదవడం సముచితంగా ఉంటుంది, భావాలను సమర్థవంతంగా వ్యక్తంచేస్తూ చదవవచ్చు.
వివరణ ఇవ్వమని ఇతరులు అడిగినప్పుడు. కొన్నిసార్లు మన నమ్మకాల గురించి వివరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముందుగా సిద్ధపడే అవకాశం మనకు ఉండకపోవచ్చు. క్షేత్రసేవలో మనం కలిసిన వ్యక్తి అభ్యంతరం చెప్పినప్పుడు అలా జరగవచ్చు. మనం బంధువులతో మాట్లాడేటప్పుడూ పనిస్థలంలోగానీ స్కూల్లోగానీ మాట్లాడేటప్పుడూ అలాంటి పరిస్థితులు ఎదురుకావచ్చు. ప్రభుత్వాధికారులు కూడా మన నమ్మకాల గురించీ మన జీవన విధానం గురించీ వివరంగా చెప్పమని అడగవచ్చు. “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను [“ప్రగాఢమైన గౌరవముతోను,” NW] సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా” ఉండమని లేఖనాలు ఉద్బోధిస్తున్నాయి.—1 పేతు. 3:15,16.
పేతురూ యోహానూ యూదుల మహాసభలో ఎలా ప్రత్యుత్తరమిచ్చారన్నది అపొస్తలుల కార్యములు 4:19,20 లో గమనించండి. వారు కేవలం రెండు వాక్యాల్లో తమ నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పారు. అపొస్తలుల ఎదుటవున్న ప్రశ్నే మహాసభ ఎదుట కూడా ఉందని సూచిస్తూ తమ ప్రేక్షకులకు తగిన ప్రత్యుత్తరమిచ్చారు. తర్వాత స్తెఫనుకు వ్యతిరేకంగా అబద్ధ ఆరోపణలు చేయబడినప్పుడు ఆయన కూడా అదే సభ ఎదుటికి తీసుకువెళ్ళబడ్డాడు. ఆయన అప్పటికప్పుడు ఎంతో శక్తివంతంగా ఇచ్చిన జవాబును అపొస్తలుల కార్యములు 7:2-53 లో చదవండి. ఆయన తన సమాచారాన్ని క్రమబద్ధంగా ఎలా పొందుపరుచుకున్నాడు? ఆయన చరిత్రలో జరిగిన సంఘటనలను అవి జరిగిన క్రమం ప్రకారం చెప్పాడు. ఇశ్రాయేలు జనాంగం చూపించిన తిరుగుబాటు స్ఫూర్తిని సముచితమైన ఒకచోట నొక్కిచెప్పడం మొదలుపెట్టాడు. మహాసభ దేవుడి కుమారుణ్ణి చంపించడం ద్వారా అదే స్ఫూర్తిని కనబరిచిందని ముగింపులో ఆయన చూపించాడు.
మీరు మీ నమ్మకాల గురించి అప్పటికప్పుడు వివరించాల్సిన పరిస్థితి తలెత్తితే మీరు సమర్థవంతమైన వ్యాఖ్యానాలనిచ్చేందుకు మీకు ఏది సహాయపడగలదు? అర్తహషస్త రాజు వేసిన ప్రశ్నకు జవాబిచ్చే ముందు మౌనంగా ప్రార్థించిన నెహెమ్యాను అనుకరించండి. (నెహె. 2:4) తర్వాత చెప్పవలసిన విషయాల సంక్షిప్త ప్రతిని మనస్సులోనే రూపొందించుకోండి. ప్రాథమిక దశలను ఈ విధంగా పట్టిక వేయవచ్చు: (1) వివరణలో చేర్చవలసిన ఒకటో రెండో విషయాలను ఎంపిక చేసుకోండి (చర్చనీయ బైబిలు అంశములులోని అంశాలను ఉపయోగించాలని మీరు నిర్ణయించుకోవచ్చు). (2) ఆ విషయాలను బలపరిచేందుకు ఏ లేఖనాలను ఉపయోగించాలో కూడా నిర్ణయించుకోండి. (3) అడిగిన వ్యక్తి వినడానికి సుముఖత చూపేలా నొప్పించకుండా ఎలా వివరించడం మొదలుపెట్టవచ్చో ఆలోచించుకోండి. ఆ తర్వాత మాట్లాడడం మొదలుపెట్టండి.
ఒత్తిళ్ళకు గురైనప్పుడు ఏమి చేయాలో మీకు జ్ఞాపకముంటుందా? “వారు మిమ్మును అప్పగించునప్పుడు,—ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు [“మీరు మాత్రమే,” NW] కారు” అని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్త. 10:19,20) దానర్థం అద్భుతంగా “జ్ఞానంతో మాట్లాడే” వరం మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఇవ్వబడినట్లు మీకు కూడా ఇవ్వబడుతుందని కాదు. (1 కొరిం. 12:8, ఈజీ-టు-రీడ్ వర్షన్) యెహోవా క్రైస్తవ సంఘం తన సేవకులకు నేర్పిస్తున్న విద్యను పొందేందుకు మిమ్మల్ని మీరు క్రమంగా అందుబాటులో ఉంచుకుంటే మీకు అవసరమైనప్పుడు కావలసిన సమాచారాన్ని పరిశుద్ధాత్మ మీ స్మరణకు తెస్తుంది.—యెష. 50:4.
పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడం చాలా సమర్థంగా ఉంటుందనడంలో సందేహం లేదు. మీరు సంఘంలో నియామకాలను నిర్వహించేటప్పుడు అలా మాట్లాడేందుకు క్రమంగా అభ్యసిస్తే, అవసరమైనప్పుడు అప్పటికప్పుడు జవాబులివ్వడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే చెప్పవలసిన విషయాల సంక్షిప్త ప్రతిని తయారుచేసుకునే పద్ధతులు దానికి కూడా వర్తిస్తాయి. ఇలా అభ్యసించడం మానుకోకండి. పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడాన్ని నేర్చుకోవడం మీరు మీ క్షేత్ర పరిచర్యను మరింత సమర్థంగా చేయడానికి మీకు సహాయపడుతుంది. అంతేగాక మీ సంఘంలో ప్రసంగాలిచ్చే ఆధిక్యత మీకుంటే, మీరు ప్రేక్షకుల శ్రద్ధను నిలబెట్టే సాధ్యతా వారి హృదయాలను స్పృశించే సాధ్యతా ఎక్కువగా ఉంటాయి.