18
సమాధానమిచ్చేటప్పుడు బైబిలును ఉపయోగించడం
మన నమ్మకాల గురించీ మన జీవిత విధానం గురించీ ప్రస్తుత సంఘటనలపై మనకున్న దృక్కోణం గురించీ భవిష్యత్తు విషయమై మనకున్న నిరీక్షణ గురించీ సమాధానమిచ్చేటప్పుడు బైబిలును ఉపయోగించడానికి మనం కృషి చేస్తాం. ఎందుకు? ఎందుకంటే అది దేవుని వాక్యం. మన నమ్మకాలను బైబిలు నుండే తీసుకుంటాం. మన జీవిత విధానానికి బైబిలునే ఆధారంగా చేసుకుంటాం. లోక సంఘటనలను గురించిన మన దృక్కోణాన్ని బైబిలే తీర్చిదిద్దుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన మన నిరీక్షణ బైబిలులో వ్రాయబడిన ప్రేరేపిత వాగ్దానాలలో వ్రేళ్ళూనుకొని ఉంది.—2 తిమో.3:16,17.
మన పేరుతో పాటు మనం స్వీకరించిన బాధ్యతను గురించిన స్పృహ మనకు బాగా ఉంది. మనం యెహోవా సాక్షులము. (యెష. 43:12) కాబట్టి మనం ప్రశ్నలకు జవాబులను మానవ తత్త్వజ్ఞానం ఆధారంగా కాక యెహోవా తన ప్రేరేపిత వాక్యంలో చెబుతున్నదాని ఆధారంగా ఇస్తాము. వివిధ విషయాల గురించి వ్యక్తిగతంగా మనకంటూ అభిప్రాయాలు ఉన్నాయన్నది నిజమే, అయితే దేవుని వాక్యం సత్యము అన్న గట్టి నమ్మకం మనకు కలిగినందువల్లే మన దృక్కోణాలను తీర్చిదిద్దడానికి దాన్ని అనుమతిస్తాం. అనేక విషయాలకు సంబంధించి మనం మన సొంత ఇష్టాయిష్టాలను కలిగివుండే స్వేచ్ఛను బైబిలు మనకిస్తోంది. మనం ఇతరులపై మన ఇష్టాలను రుద్దడానికి ప్రయత్నించే బదులు లేఖనాల్లో ఉన్న సూత్రాలను బోధించాలని కోరుకుంటాం, ఆ విధంగా మనం అనుభవిస్తున్న స్వేచ్ఛను మన శ్రోతలు కూడా అనుభవించేందుకు మనం వారిని అనుమతిస్తాం. ఇతరులు “విశ్వాసమునకు విధేయులగునట్లు” అపొస్తలుడైన పౌలు కృషి చేసినట్లే మనమూ కృషి చేస్తాం.—రోమా.16:25-27.
ప్రకటన 3:14 లో యేసుక్రీస్తు “నమ్మకమైన సత్యసాక్షి”గా వర్ణించబడ్డాడు. తనను అడిగిన ప్రశ్నలకు ఎలా జవాబిచ్చాడు, తనను చిక్కున బెట్టే పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాడు? కొన్ని సందర్భాల్లో ఆయన ప్రజలను ఆలోచింపజేసే ఉపమానాలను ఉపయోగించాడు. మరికొన్ని సందర్భాల్లో ఒక లేఖనానికి సంబంధించి ప్రశ్న వేసిన వ్యక్తికి ఉన్న అవగాహనను గురించి అడగడం ద్వారా జవాబిచ్చాడు. తరచూ ఆయన లేఖనాలను ఉటంకిస్తూ వాటిని వేరే మాటల్లో చెప్పడమో పరోక్షంగా సూచించడమో చేస్తూ సమాధానమిచ్చాడు. (మత్త. 4:3-10; 12:1-8; లూకా 10:25-28; 17:32) మొదటి శతాబ్దంలో, లేఖనాల గ్రంథపు చుట్టలు సాధారణంగా సమాజ మందిరాల్లో ఉంచబడేవి. యేసుకు సొంతంగా ఆ గ్రంథపు చుట్టల సేకరణ ఉండేదనడానికి రుజువులేమీ లేవు. కానీ ఆయనకు లేఖనాలు బాగా తెలుసు, ఆయన ఇతరులకు బోధించేటప్పుడు తరచూ వాటిని సూచించేవాడు. (లూకా 24:27,44-47) తాను బోధించినదేదీ కూడా తనంతట తాను బోధించినది కాదని ఆయన సత్యసంధంగా చెప్పగలిగాడు. తన తండ్రి నుండి విన్నవాటి గురించే ఆయన మాట్లాడాడు.—యోహా.8:26.
యేసు మాదిరిని అనుకరించాలన్నదే మన కోరిక. దేవుడు మాట్లాడుతుండగా యేసు స్వయంగా విన్నట్లు మనం వినలేదు. కానీ బైబిలు దేవుని వాక్యం. మనం మన జవాబులకు బైబిలును ఆధారంగా ఉపయోగించినప్పుడు మన వైపుకు శ్రోతల ఆలోచనలను మళ్ళించకుండా ఉంటాము. అపరిపూర్ణుడైన ఒక మానవుడి అభిప్రాయాన్ని తెలియజేసే బదులు, ఏది సత్యమో దేవుణ్ణే చెప్పనివ్వాలని దృఢంగా నిర్ణయించుకున్నామని చూపిస్తాం.—యోహా.7:18; రోమా.3:4.
బైబిలును ఉపయోగించాలని మాత్రమే కాకుండా, మన శ్రోతలకు అత్యధిక ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా ఉపయోగించాలన్నదే మన కోరిక. మన శ్రోతలు విశాల హృదయంతో వినాలనుకుంటాం. ఎదుటి వ్యక్తి వైఖరిని బట్టి బైబిలు తలంపులను చెప్పడానికి ఉపోద్ఘాతంగా, “నిజానికి పరిగణలోకి తీసుకోవలసినది దేవుడు చెప్పేదాన్నే అని మీరు ఒప్పుకోరా?” అని గానీ “ఇదే ప్రశ్నను బైబిలు చర్చిస్తుందని మీకు తెలుసా?” అని గానీ అడగవచ్చు. బైబిలు మీద గౌరవంలేని వ్యక్తితో మీరు మాట్లాడుతున్నట్లయితే మీరు ఇంకొంచెం భిన్నమైన ఉపోద్ఘాతాన్ని ఉపయోగించవలసిన అవసరం ఉండవచ్చు. “ఒక ప్రాచీన ప్రవచనాన్ని మీకు చూపిస్తాను” అని గానీ “మానవ చరిత్రలో అత్యంత విస్తృతంగా పంపిణీ చేయబడిన పుస్తకం ఇలా చెబుతోంది . . .” అని గానీ మొదలుపెట్టవచ్చు.
కొన్ని సందర్భాల్లో ఒక లేఖన భాగాన్ని వేరే మాటల్లో చెప్పాలని మీరు ఎంపికచేసుకోవచ్చు. అయితే సాధ్యమైన చోటల్లా, బైబిలు తెరచి బైబిలు చెబుతున్నదేమిటో చదివి వినిపించడమే ఉత్తమం. ఆ లేఖనాన్ని ఆ వ్యక్తి సొంత బైబిలులో నుండి చూపించండి. బైబిలును ఇలా సూటిగా ఉపయోగించడం, తరచూ ప్రజలపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది.—హెబ్రీ.4:12.
ప్రశ్నలకు జవాబులిచ్చేటప్పుడు, బైబిలును ఉపయోగించవలసిన ప్రత్యేక బాధ్యత క్రైస్తవ పెద్దలకుంది. “ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను” అన్నది ఒక సహోదరుడు ఒక పెద్దగా సేవ చేసేందుకు అవసరమైన యోగ్యతల్లో ఒకటి. (తీతు 1:9) సంఘంలోని ఒక సభ్యుడు, తనకు ఒక పెద్ద సలహా ఇచ్చిన తర్వాత తన జీవితంలో గంభీరమైన నిర్ణయాన్ని తీసుకోవచ్చు. కాబట్టి ఆయన సలహా లేఖనాలపై స్థిరంగా ఆధారపడి ఉండడం ఎంత ప్రాముఖ్యం! బైబిలు ఆధారంగా ఉపదేశమివ్వడంలో ఒక పెద్ద ఉంచే మాదిరి, మరనేకులు బోధించే విధానంపై ప్రభావం చూపగలదు.