పత్రిక ముఖ్యాంశం | ఈ ప్రపంచం నాశనం అవుతుందా?
జవాబుల కోసం అన్వేషణ
కుప్పలు కుప్పలుగా వస్తున్న చెడు వార్తలు వింటుంటే మీకు కంగారుగా లేదా భయంగా ఉందా? అయితే అలా ఉంది మీ ఒక్కరికే కాదు. 2014వ సంవత్సరంలో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బారాక్ ఒబామా ఇలా చెప్పారు: వార్తల్లో వస్తున్న చెడు విషయాలను చూసి చాలామందికి “లోకం చాలా ఫాస్ట్‌గా తిరుగుతుంది . . . దీన్ని ఎవ్వరూ ఆపలేక పోతున్నారు” అని అనిపిస్తుంది.
అయితే, అలా చెప్పిన వెంటనే ప్రపంచంలో ఉన్న చాలా సమస్యలను పరిష్కరించడానికి ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాల గురించి ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడారు. కొన్ని ప్రభుత్వ పథకాలను ఆయన “మంచి వార్తలు” అని పిలిచారు. వాటి విషయంలో “అపారమైన నమ్మకంతో” ‘అవి నెరవేరతాయనే ఆశతో’ ఉన్నానని కూడా చెప్పారు. మరో మాటలో చెప్పాలంటే, మంచి ఉద్దేశాలతో మనుషులు చేసే ప్రయత్నాలే లోకాన్ని మారుస్తాయని, నాశనం కాకుండా ఆపుతాయని ఆయన చెప్పారు.
చాలామంది ఆయనలానే ఆశాభావంతో ఉన్నారు. ఉదాహరణకు, కొంతమంది సైన్స్‌మీద వాళ్ల నమ్మకాన్ని పెట్టారు. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి జరగడం వల్ల ప్రపంచ సమస్యలు పరిష్కారం అవుతాయని వాళ్లు నమ్ముతున్నారు. డిజిటల్ టెక్నాలజీలో, సరికొత్త విషయాలను కనిపెట్టడంలో నిపుణుడు అయిన ఒకతను ఇలా ఊహించాడు, 2030 సంవత్సరం వచ్చే సరికి, “మన టెక్నాలజీ వెయ్యి రెట్లు ఎక్కువ శక్తివంతంగా, 2045వ సంవత్సరం వచ్చే సరికి లక్షల రెట్లు శక్తివంతంగా తయారౌతుంది.” అతను ఇంకా ఇలా అంటున్నాడు: “మనం చాలా బాగా చేస్తున్నాము. మనం ఎదుర్కొనే సమస్యలు అంత పెద్దవి కాదు, వాటికన్నా వాటిని పరిష్కారం చేయడానికి మనకున్న శక్తే చాలా ఎక్కువ.”
ప్రపంచ పరిస్థితులు నిజంగా ఎంత దారుణంగా ఉన్నాయి? మనం నిజంగా ప్రపంచ నాశనానికి అంచున ఉన్నామా? కొంతమంది శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు రాబోయే రోజులు బాగుంటాయని చెప్తున్నా, చాలామందిలో భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే సందేహం ఉంది. ఎందుకు?
ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధాలు. ఎంత ఎక్కువగా ప్రయత్నించినా ఐక్యరాజ్య సమితి, ఇతర సంస్థలు ఆయుధాలను తగ్గించడంలో లేదా పూర్తిగా తీసివేయడంలో విఫలం అయ్యాయి. ఎదురు తిరిగే నాయకులు ఆయుధాలను నియంత్రించే చట్టాలను ఎగతాళి చేస్తున్నారు. కొన్ని దేశాలకు అణు ఆయుధాలను ప్రోత్సహించిన చరిత్ర ఉంది. అలాంటి దేశాలు చాలా ఆవేశంగా వాళ్లుకున్న పాత బాంబులను మెరుగుపర్చి, ఇంకా ప్రాణాంతకమైన ఆయుధాలను సృష్టించుకుంటున్నారు. ఒకప్పుడు ఎక్కువ నాశానాన్ని తీసుకురాలేని దేశాలు కూడా ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలను నాశనం చేయగలవు.
అణు ఆయుధాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న దేశాల వల్ల “శాంతిగా” ఉన్న సమయంలో కూడా ఎప్పుడూ లేని విధంగా ప్రపంచం చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. “ఉదాహరణకు, లీథల్ ఆటనామస్ వెపన్స్ సిస్టమ్స్ మనుషుల ప్రమేయం లేదా పర్యవేక్షణ లేకుండానే ‘చంపే’ నిర్ణయం తీసుకోగలవు. ఇది ఎక్కువ ఆందోళనకరంగా ఉంది,” అని బులెటిన్ ఆఫ్ ద ఎటామిక్ సైన్‌టిస్ట్స్ హెచ్చరిస్తుంది.
మన ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. నిజమే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విషయంలో సైన్స్ కొంతవరకే సహాయం చేసింది. జబ్బులకు కారణాలైన హై బ్లడ్ ప్రషర్, విపరీతమైన లావు, వాతావరణ కాలుష్యం, మందుల దుర్వినియోగం ఎక్కువౌతున్నాయి. అంటువ్యాధులు కాని క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్ లాంటి ఎన్నో వ్యాధుల వల్ల చాలామంది చనిపోతున్నారు. ఇతర వ్యాధులు కూడా చాలా ఎక్కువౌతున్నాయి, వాటిలో మానసిక వ్యాధులు కూడా ఉన్నాయి. ఇటీవల సంవత్సరాల్లో ఎబోలా వైరస్, జికా వైరస్ లాంటి ప్రాణాంతక అంటువ్యాధులు తెలియకుండా వ్యాపిస్తున్నాయి. విషయం ఏమిటంటే, వ్యాధులను నియంత్రించడం మనుషుల చేతిలో లేదు, వ్యాధులు అంతం అవుతాయనే నమ్మకం కూడా లేదు.
ప్రకృతిపై మానవ దాడులు. ఫ్యాక్టరీలు భూవాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉన్నాయి. కలుషితమైన గాలిని పీల్చుకుని ప్రతి సంవత్సరం లక్షలమంది ప్రజలు చనిపోతున్నారు.
మనిషి, సమాజం, ప్రభుత్వ ఏజెన్సీలు చెత్తను, వైద్య, వ్యవసాయ వ్యర్థపదార్థాలను, ప్లాస్టిక్ పదార్థాలను, ఇతర వ్యర్థపదార్థాలను సముద్రాల్లో పడేస్తున్నారు. “ఈ విషపూరిత వ్యర్థాలు సముద్ర జీవులను, మొక్కలను, వాటిని తినే మనుషులను కూడా కలుషితం చేస్తున్నాయి,” అని ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ మెరైన్ సైన్స్ వివరిస్తుంది.
మనకు స్వచ్ఛమైన నీళ్లు కరువైపోతున్నాయి. బ్రిటిష్ సైన్స్ రచయిత రాబిన్ మకీ ఇలా హెచ్చరిస్తున్నారు: “నీటి కొరత అనే సమస్య ప్రపంచంలో అన్ని చోట్ల వస్తుంది.” నీటి కొరతకు చాలావరకు మనుషులే కారణమని, దీనివల్ల చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ నాయకులు ఒప్పుకుంటున్నారు.
మనుషులపై ప్రకృతి దాడులు. తుఫాన్లు, అల్పపీడనాలు, వాయుగుండాలు, భూకంపాలు భయంకరమైన వరదలు వచ్చేలా, కొండచరియలు విరిగి పడేలా, ఇతర విధాల నష్టాలు కలిగేలా చేస్తున్నాయి. ఈ ప్రకృతి శక్తుల వల్ల ఇంతకుముందుకన్నా ఇప్పుడు ఎంతోమంది ప్రజలు చనిపోయారు లేదా ఇతర విధాలుగా కూడా నష్టపోయారు. యు.ఎస్. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రచురించిన అధ్యయనాల ప్రకారం, బలమైన తుఫానులు, ఘోరమైన వడగాలులు, పెద్దపెద్ద వరదలు, కరువులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వరదలు-కరువులు చక్రంలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తాయి. ప్రకృతి మనుషులను నాశనం చేసే అవకాశం ఉందా?
మనకు ప్రమాదాన్ని తీసుకొచ్చే ఇతర సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని మీరు గమనించే ఉంటారు. కానీ ఈ రోజుల్లో జరిగే ప్రతీ నష్టం గురించి ఆలోచించడం వల్ల, భవిష్యత్తుకు సంబంధించిన సంతృప్తికరమైన జవాబులు దొరకవు. రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు చెప్పే వాటిని వినడం వల్ల కూడా జవాబులు దొరకవని కొంతమంది అనవచ్చు. ముందు ఆర్టికల్‌లో చెప్పినట్లుగా ప్రపంచ పరిస్థితులకు, భవిష్యత్తుకు సంబంధించిన సరైన జవాబులను చాలామంది పొందారు. ఆ జవాబులు ఎక్కడ దొరుకుతాయి?