యువత కోసం ఐక్యరాజ్య సమితి చేపట్టిన కార్యక్రమాలు—ఎంత విజయవంతమయ్యాయి?
దాదాపు 15 ఏళ్ల క్రితం, ఐక్యరాజ్య సమితి 1985ను అంతర్జాతీయ యువత సంవత్సరంగా ప్రకటించింది. అంతేగాక, దాదాపు నాలుగేళ్ల క్రితం, 2000వ సంవత్సరం కోసం అలాగే ఆ తర్వాతి సంవత్సరాల కోసం ఐక్యరాజ్య సమితి యువత కొరకైన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాలు సమస్యలను తగ్గించి ప్రపంచంలో 100 కోట్ల కన్నా ఎక్కువగావున్న యౌవనులకు అవకాశాలను అధికం చేయగలవని ఆశించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు పరిస్థితిని ఏమైనా మెరుగుపరిచాయా?
కొన్ని ప్రాంతాల్లో నిస్సందేహంగా మెరుగుపరిచాయి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రచురించే చాయిసస్ అనే పత్రిక కొన్ని ఉదాహరణలను ఇస్తుంది: 1982లో థాయ్‌లాండ్‌లోని, పాఠశాలలకు వెళ్లే వయస్సుకన్నా తక్కువ వయస్సున్న పిల్లల్లో సగంకంటే ఎక్కువమంది కుపోషణకు గురయ్యారు. అయితే, పదేళ్ల కంటే తక్కువ కాలం తర్వాత, ఒక మోస్తరైన మరియు తీవ్రమైన కుపోషణ దాదాపు నిర్మూలించబడింది. ఓమాన్ దేశంలో, 1970లో కేవలం మూడే పాఠశాలలున్నాయి, 900 మంది బాలురు మాత్రం హాజరయ్యేవారు. కాని 1994లో, ఆ దేశంలో దాదాపు 5,00,000 మంది పిల్లలు పాఠశాలకు వెళ్లారు, వారిలో 49 శాతం మంది ఆడపిల్లలు. నిస్సందేహంగా అవి విజయ గాథలే.
అయితే, ఐక్యరాజ్య సమితి ప్రచురించే యువత కోసమైన ఐక్యరాజ్య సమితి కార్యాచరణ (ఆంగ్లం) అనేది ఇలా పేర్కొంది: ప్రాముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, విద్యా, ఉద్యోగం, పేదరికం వంటి రంగాల్లోవున్న ఎడతెగని సమస్యలు అభివృద్ధిని అధిగమించాయి. అయితే ప్రపంచ కార్యక్రమం మెరుగుపర్చాలని అభిలషిస్తున్న రంగాల్లో అవి కేవలం కొన్ని మాత్రమే.
ఉదాహరణకు, అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు 2000వ సంవత్సరానికల్లా పిల్లలందరికీ ప్రాథమిక విద్య అనే లక్ష్యాన్ని చేరుకోలేవు. ఈ దేశాల్లోని తల్లిదండ్రులు తరచూ తమ పిల్లలను పాఠశాలకు పంపలేరు ఎందుకంటే పాఠశాలలు అందుబాటులో లేవు లేక మరీ ఖరీదైనవిగా ఉన్నాయి. తత్ఫలితంగా, యువత కోసమైన ఐక్యరాజ్య సమితి కార్యాచరణ ఇలా పేర్కొంటోంది: “నిరక్షరాస్యులైన ప్రజల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.” ఫలితంగా, నిరక్షరాస్యత మూలంగా నిరుద్యోగం ఏర్పడుతుంది, నిరుద్యోగం మూలంగా “ఆత్మ న్యూనతాభావం, తక్కువవారిమనే భావం,” యౌవనుల ప్రతిభ నిర్జీవమైపోవడం, కడు బీదరికం వంటి అనేకానేక సామాజిక రుగ్మతలు ఉత్పన్నమౌతాయి. పేదరికం యౌవనులపైనా వృద్ధులపైనా ఒకేలా ప్రభావం చూపినప్పటికీ, ప్రాముఖ్యంగా యౌవనులు ఎక్కువగా దానికి గురయ్యే అవకాశముంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, “ఆకలి, కుపోషణ మానవత్వానికి ఎదురౌతున్న అత్యంత గంభీరమైన, సులభంగా లొంగని ముప్పులుగానే ఉంటున్నాయి” అని ఐక్యరాజ్య సమితికి చెందిన అదే మూలం ముగించి చెబుతుంది.
సదుద్దేశం గల కార్యక్రమాలు, కష్టపడి పని చేసే అధికారులు పరిస్థితిని కొంతమేరకు మెరుగుపరుస్తున్నప్పటికీ, వారు సమాజానికి హాని చేస్తున్న కారకాలను నిర్మూలించలేకపోతున్నారు. దాన్ని సాధించడానికి ఇంకా ఎక్కువే కావాలి. మెన్సెన్రెక్టెన్ ఎన్ డె నూడ్జాక్ వాన్ విరెల్డ్బెస్టూర్ (మానవ హక్కులు మరియు ప్రపంచ ప్రభుత్వ అవసరత) అనే పుస్తకం పేర్కొంటున్నట్లుగా, ‘అమలులో పెట్టగల కార్యక్రమాలను చేపట్టే స్థితిలోవున్న ప్రపంచ ప్రభుత్వం వస్తేనే’ ప్రపంచ సమస్యలు పరిష్కరించబడగలవు. కాబట్టి, క్రైస్తవులు—యౌవనులూ వృద్ధులూ ఒకేలా—యేసు ప్రార్థించమని తన అనుచరులకు చెప్పిన ప్రపంచ ప్రభుత్వమైన, రానైయున్న దేవుని రాజ్యం కోసం ఎదురు చూడడంలో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. (దానియేలు 2:44; మత్తయి 6:10) ఆ ప్రభుత్వం నిజంగా ఎంతో మార్పును తెస్తుంది!
[31వ పేజీలోని చిత్రం]
విద్య పిల్లలందరి ప్రాథమిక హక్కు మరియు అవసరం
[క్రెడిట్ లైను]
FAO photo/F. Mattioli
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
FAO photo/F. Mattioli
Logo: UN photo