మిస్ట్రల్—నిపుణతగల భూతల దృశ్య రూపకర్త
ఫ్రాన్స్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
పొందికైన వరుసల్లో సమాంతరంగా ఉన్న కంచెలు, కొండల ప్రక్కన గాలివాలున కుప్పలుగా ఉన్నట్లున్న గ్రామాలు, ఒక వైపు తమ ఆకులను, కొమ్మలనన్నింటినీ పోగొట్టుకున్నట్లుండే చెట్లు. ఇవీ ఆగ్నేయ ఫ్రాన్స్‌లో ప్రావెన్స్ యొక్క భూతల దృశ్యానికి సామాన్యమైన లక్షణాలు, వీటన్నిటి వెనుక మిస్ట్రల్ అని పిలువబడే గాలి హస్తం ఉంది.
ఆల్ప్స్‌లోని ఫేన్, దక్షిణ అమెరికాలోని పాంపిరో, ఉత్తర అమెరికా రాకీ పర్వతాలలోని షనూక్, వాయవ్య ఆఫ్రికాలోని హర్మట్టన్, బైబిలులో పేర్కొనబడిన ఊరకులోను వంటి ఇతర ప్రసిద్ధ గాలుల పంక్తిలో మిస్ట్రల్ చేరుతుంది.a (అపొస్తలుల కార్యములు 27:14) మిస్ట్రల్ అనే పేరు “నిపుణతగల” అనే అర్థమున్న ఒక ప్రావెన్సల్ పదం నుండి వస్తుంది. దాని పేరుకు తగ్గట్లే అది గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచగలదు.
మధ్య ఫ్రాన్స్పైనున్న అధిక వాతావరణ పీడనం, మధ్యధరాపైనున్న అల్ప వాతావరణ పీడనం మధ్య అంతులేని “సంఘర్షణ” మూలంగా మిస్ట్రల్ ఏర్పడింది. దాని గొప్ప శక్తి పర్వతాంతర ప్రభావం అని పిలువబడేదాని నుండి వస్తుంది. ఆల్ప్స్కు, మసీఫ్ సెంట్రల్ పీఠభూమికి మధ్య ప్రయాణించే మిస్ట్రల్, డాన్సార్ ఇరుకు మార్గం నుండి ఒక గరాటు నుండి ప్రయాణిస్తున్నట్లుగా బయటికి వచ్చిన తరువాత అత్యంత శక్తివంతంగా ఉంటుంది.
వేసవికాలంలో మిస్ట్రల్ మేఘాల్ని పారద్రోలుతుంది. చలికాలంలో, మిస్ట్రల్ చలిని సహింపరానిదిగా చేస్తుంది. ఉష్ణమండల ప్రాంతంలో తప్ప అది లేట్ఫ్రాస్ట్ను కలుగజేయగలదు. అది ఏ కాలమైనా స్థానిక నివాసులకు చిరాకు కలిగినప్పుడు తరచూ మిస్ట్రల్ను నిందిస్తారు.
కానీ వృక్షాలను గాలిలో ఎగురుతున్న జెండాలను పోలివుండేలా చేస్తూ, ల్యూబేరాన్లోని వైభవోపేతమైన దేవదారు అడవిపై మిస్ట్రల్ తన ప్రజ్ఞను పూర్తిగా కనబరుస్తుంది. మరోవైపు, మిస్ట్రల్ తన కష్ట ఫలాలను నాశనం చేస్తూ, పొడి కాలంలో అడవిలోని అగ్నిని అధికం చేస్తుంది.
“మూడు, ఆరు, లేక తొమ్మిది రోజులు,” అలా సాగుతుంది మిస్ట్రల్ ఎంత కాలం వీస్తుందనే దాని గురించిన పాత ప్రావెన్సల్ సామెత. కానీ నిపుణతగల ఈ గాలి అంతకంటే ఎక్కువ కాలం వీచగలదు. ఉదాహరణకు 1965లో, అది 23 రోజులు ఆగకుండా వీచింది!
మానవుడు మిస్ట్రల్ను ఎదుర్కోవడం నేర్చుకున్నాడు. సమాంతరంగా ఉన్న కంచెలు పొలాలను కాపాడుతాయి, గ్రామాల్లోని పాత ఇళ్లకు చాలా అరుదుగా ఉత్తరం వైపు ద్వారం ఉంటుంది. దాని చల్లటి గాలులు చాలా అసౌకర్యాన్ని కలిగించినప్పటికీ మిస్ట్రల్ను, నిపుణతగల భూతల దృశ్య రూపశిల్పిగా దృష్టించవచ్చు.
[అధస్సూచి]
a మరింత సమాచారం కొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 1, పేజీ 770 చూడండి.