యోహాను రాసిన మొదటి ఉత్తరం
1 జీవ వాక్యం+ గురించి మేము మీకు రాస్తున్నాం. ఆయన మొదటి నుండి ఉన్నాడు, మేము ఆయన మాట్లాడుతుంటే విన్నాం, ఆయన్ని కళ్లారా చూశాం, జాగ్రత్తగా గమనించాం, చేతులతో ముట్టుకున్నాం. 2 (అవును, శాశ్వత జీవితం వెల్లడిచేయబడింది, మేము దాన్ని చూశాం, దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాం,+ దాని గురించి మీకు ప్రకటిస్తున్నాం. ఈ శాశ్వత జీవితం+ తండ్రి నుండి వచ్చింది, అది మాకు వెల్లడిచేయబడింది.) 3 మేము చూసింది, విన్నది మీకు ప్రకటిస్తున్నాం.+ మేము తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఐక్యంగా* ఉన్నట్టే మీరు మాతో ఐక్యంగా* ఉండాలని+ అలా చేస్తున్నాం. 4 మన ఆనందం సంపూర్ణం అవ్వాలని మేము ఈ విషయాలు రాస్తున్నాం.
5 మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడు వెలుగు,+ ఆయనలో చీకటి ఏమాత్రం లేదు. 6 ఒకవేళ మనం, “ఆయనతో ఐక్యంగా ఉన్నాం” అని చెప్పుకుంటూ చీకట్లో నడుస్తూ ఉంటే, మనం అబద్ధమాడుతున్నాం, మనం సత్యానికి అనుగుణంగా నడుచుకోవట్లేదు.+ 7 అయితే, ఆయన వెలుగులో ఉన్నట్టే మనం కూడా వెలుగులో నడుస్తుంటే, మనం ఒకరితో ఒకరం ఐక్యంగా ఉన్నాం, ఆయన కుమారుడైన యేసు రక్తం మన పాపాలన్నిటి నుండి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది.+
8 ఒకవేళ మనం, “మాలో ఏ పాపం లేదు” అని చెప్పుకుంటే, మనల్ని మనం మోసం చేసుకున్నట్టే,+ మనలో సత్యం లేనట్టే. 9 కానీ మనం మన పాపాల్ని ఒప్పుకుంటే, ఆయన నమ్మకమైనవాడు, నీతిమంతుడు కాబట్టి మనల్ని క్షమిస్తాడు, అన్నిరకాల చెడుతనం నుండి మనల్ని పవిత్రుల్ని చేస్తాడు.+ 10 అయితే మనం, “మేము పాపం చేయలేదు” అని చెప్పుకుంటే, మనం ఆయన్ని అబద్ధాలకోరుగా చేస్తున్నట్టే, ఆయన వాక్యం మనలో లేనట్టే.
2 నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా ఉండాలని ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేసినా, తండ్రి దగ్గర మనకు ఒక సహాయకుడు* ఉన్నాడు, ఆయనే నీతిమంతుడైన యేసుక్రీస్తు.+ 2 ఆయన మన పాపాల కోసం ప్రాయశ్చిత్త* బలిని అర్పించాడు.+ కేవలం మన పాపాల కోసమే కాదు, లోకమంతటా ఉన్న ప్రజల పాపాల కోసం ఆ బలిని అర్పించాడు.+ 3 మనం ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటే, మనకు ఆయన తెలుసని గ్రహిస్తాం. 4 ఎవరైనా, “నేను ఆయన్ని తెలుసుకున్నాను” అని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞల్ని పాటించకపోతే ఆ వ్యక్తి అబద్ధాలకోరు, అతనిలో సత్యం లేదు. 5 కానీ ఎవరైనా ఆయన వాక్యాన్ని పాటిస్తుంటే, దేవుని ప్రేమ అతనిలో నిజంగా పరిపూర్ణం చేయబడింది. దీన్నిబట్టి మనం ఆయనతో ఐక్యంగా ఉన్నామని మనకు తెలుస్తుంది.+ 6 ఆయనతో ఐక్యంగా ఉన్నానని చెప్పుకునే వ్యక్తికి ఆయనలాగే నడుచుకుంటూ ఉండాల్సిన బాధ్యత ఉంది.+
7 ప్రియ సహోదరులారా, నేను మీకు రాస్తున్న ఆజ్ఞ కొత్తదేమీ కాదు, పాతదే, మొదటి నుండీ మీ దగ్గర ఉన్నదే.+ మీరు విన్న వాక్యమే ఆ పాత ఆజ్ఞ. 8 యేసు, అలాగే మీరు పాటించిన ఆ ఆజ్ఞనే మళ్లీ కొత్త ఆజ్ఞలా మీకు రాస్తున్నాను. ఎందుకంటే చీకటి వెళ్లిపోతోంది, నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తోంది.+
9 వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుణ్ణి ద్వేషించే వ్యక్తి ఇంకా చీకట్లోనే ఉన్నాడు.+ 10 తన సహోదరుణ్ణి ప్రేమించే వ్యక్తి వెలుగులో ఉంటాడు, అతను దేనివల్లా తడబడడు. 11 కానీ తన సహోదరుణ్ణి ద్వేషించే వ్యక్తి చీకట్లో ఉన్నాడు, చీకట్లోనే నడుస్తున్నాడు,+ చీకటి వల్ల అతని కళ్లకు ఏమీ కనిపించదు కాబట్టి అతను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలీదు.+
12 చిన్నపిల్లలారా, ఆయన* పేరును బట్టి దేవుడు మీ పాపాల్ని క్షమించాడు+ కాబట్టి మీకు రాస్తున్నాను. 13 తండ్రులారా, మొదటి నుండి ఉన్న వ్యక్తిని మీరు తెలుసుకున్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు దుష్టుడిపై+ విజయం సాధించారు కాబట్టి మీకు రాస్తున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని తెలుసుకున్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. 14 తండ్రులారా, మొదటి నుండి ఉన్న వ్యక్తిని మీరు తెలుసుకున్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ హృదయాల్లో ఉంది,+ మీరు దుష్టుడిపై విజయం సాధించారు+ కాబట్టి మీకు రాస్తున్నాను.
15 లోకాన్ని గానీ, లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి.+ ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే, ఆ వ్యక్తిలో తండ్రి ప్రేమ ఉండదు;+ 16 ఎందుకంటే లోకంలో ఉన్న ప్రతీదానికి, అంటే శరీరాశ,+ నేత్రాశ,*+ వస్తుసంపదల్ని గొప్పగా చూపించుకోవడం* అనేవాటికి మూలం తండ్రి కాదు, లోకమే. 17 అంతేకాదు లోకం, దాని ఆశ నాశనం కాబోతున్నాయి,+ అయితే దేవుని ఇష్టాన్ని చేసే వ్యక్తి నిరంతరం జీవిస్తాడు.+
18 చిన్నపిల్లలారా, ఇది చివరి గంట. క్రీస్తువిరోధి వస్తున్నాడని మీరు విన్నట్టే,+ ఇప్పటికే చాలామంది క్రీస్తువిరోధులు వచ్చారు.+ ఈ వాస్తవాన్ని బట్టి ఇది చివరి గంట అని మనకు తెలుసు. 19 వాళ్లు మన మధ్యే ఉండేవాళ్లు, కానీ మనల్ని వదిలి వెళ్లిపోయారు, వాళ్లు మనవాళ్లు* కాదు.+ వాళ్లు మనవాళ్లయితే మనతోనే ఉండేవాళ్లు. కానీ వాళ్లు అలా వెళ్లిపోయి, అందరూ మనవాళ్లు కాదని చూపించారు.+ 20 మీరు పవిత్రుడైన దేవుని చేత అభిషేకించబడ్డారు,+ అంతేకాదు మీ అందరికీ జ్ఞానం ఉంది. 21 మీకు సత్యం తెలీదని కాదుగానీ+ మీకు సత్యం తెలుసు కాబట్టి, సత్యం నుండి ఏ అబద్ధం పుట్టదు+ కాబట్టి నేను మీకు రాస్తున్నాను.
22 యేసే క్రీస్తని ఒప్పుకోని వ్యక్తి తప్ప అబద్ధాలకోరు ఎవరు?+ తండ్రిని, కుమారుణ్ణి ఒప్పుకోని వ్యక్తే క్రీస్తువిరోధి.+ 23 కుమారుణ్ణి ఒప్పుకోని ప్రతీ వ్యక్తికి తండ్రి ఆమోదం కూడా ఉండదు.+ కానీ కుమారుణ్ణి ఒప్పుకునే వ్యక్తికి+ తండ్రి ఆమోదం కూడా ఉంటుంది.+ 24 మీ విషయానికొస్తే, మొదటి నుండి మీరు విన్న విషయాలు మీ హృదయాల్లో ఉండాలి.+ మొదటి నుండి మీరు విన్న విషయాలు మీ హృదయాల్లో ఉంటే, మీరు కుమారుడితో, తండ్రితో ఐక్యంగా ఉంటారు. 25 అంతేకాదు, ఆయనే స్వయంగా మనకు శాశ్వత జీవితాన్ని+ వాగ్దానం చేశాడు.
26 మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ల గురించి నేను ఈ విషయాలు మీకు రాస్తున్నాను. 27 మీ విషయానికొస్తే, దేవుడు తన పవిత్రశక్తితో మిమ్మల్ని అభిషేకించాడు,+ ఆ పవిత్రశక్తి మీలో ఉంది. ఇప్పుడు మీకు ఇంకొకరు బోధించాల్సిన అవసరం లేదు; అయితే మిమ్మల్ని అభిషేకించడం ద్వారా దేవుడే మీకు అన్ని విషయాలు బోధిస్తున్నాడు.+ ఆ అభిషేకం సత్యం, అది అబద్ధం కాదు, అది మీకు బోధించినట్టే మీరు ఆయనతో ఐక్యంగా ఉండండి.+ 28 కాబట్టి చిన్నపిల్లలారా, మీరు ఆయనతో ఐక్యంగా ఉండండి. అలాచేస్తే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ధైర్యంగా ఉంటాం,+ సిగ్గుపడి ఆయనకు దూరంగా వెళ్లం. 29 ఆయన నీతిమంతుడని మీకు తెలిసివుంటే, నీతిగా నడుచుకునే వాళ్లందరూ ఆయన పిల్లలని+ కూడా మీకు తెలుసు.
3 తండ్రి మనమీద చూపించిన ప్రేమ ఎలాంటిదో చూడండి,+ దేవుని పిల్లలని పిలవబడే అవకాశాన్ని ఆయన మనకు ఇచ్చాడు!+ అవును, మనం దేవుని పిల్లలం. అందుకే లోకానికి మనం తెలీదు,+ ఎందుకంటే అది ఆయన్ని తెలుసుకోలేదు.+ 2 ప్రియ సహోదరులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలం,+ కానీ భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో ఇంకా వెల్లడి చేయబడలేదు.+ అయితే ఆయన వెల్లడి చేయబడినప్పుడు మనం ఆయనలా ఉంటామని మాత్రం మనకు తెలుసు, ఎందుకంటే మనం ఆయన్ని నిజంగా చూస్తాం. 3 ఈ నిరీక్షణ ఉన్న ప్రతీ ఒక్కరు తమను తాము పవిత్రపర్చుకుంటారు,+ ఎందుకంటే ఆయన పవిత్రుడు.
4 అలవాటుగా పాపం చేసే ప్రతీ ఒక్కరు నియమాన్ని కూడా మీరుతున్నారు, నియమాన్ని మీరడమే పాపం. 5 మన పాపాల్ని తీసేయడానికి+ ఆయన వెల్లడి చేయబడ్డాడనే విషయం కూడా మీకు తెలుసు, ఆయనలో ఏ పాపం లేదు. 6 ఆయనతో ఐక్యంగా ఉన్న వాళ్లెవ్వరూ అలవాటుగా పాపం చేయరు;+ అలవాటుగా పాపం చేసే వాళ్లెవ్వరూ ఆయన్ని చూడలేదు, ఆయన్ని తెలుసుకోలేదు. 7 చిన్నపిల్లలారా, ఎవ్వరూ మిమ్మల్ని తప్పుదారి పట్టించకుండా చూసుకోండి; నీతిగా నడుచుకునేవాళ్లు ఆయనలాగే నీతిమంతులు. 8 అలవాటుగా పాపం చేసేవాళ్లు అపవాది వైపు ఉన్నారు, ఎందుకంటే అపవాది మొదటి నుండి పాపం చేస్తూనే ఉన్నాడు.+ అపవాది పనుల్ని నాశనం చేయడానికే దేవుని కుమారుడు వెల్లడి చేయబడ్డాడు.+
9 దేవుని పిల్లలెవ్వరూ అలవాటుగా పాపం చేయరు,+ ఎందుకంటే అలాంటి వాళ్లలో దేవుని విత్తనం* ఉంది. వాళ్లు దేవుని పిల్లలు+ కాబట్టి అలవాటుగా పాపం చేయలేరు. 10 దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో దీన్నిబట్టి స్పష్టమౌతుంది: నీతిగా నడుచుకోని వాళ్లెవ్వరూ, సహోదరుణ్ణి ప్రేమించని వాళ్లెవ్వరూ దేవుని పిల్లలు కారు.+ 11 మొదటి నుండి మీరు విన్నది, మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలనే సందేశాన్నే;+ 12 మనం కయీనులా ఉండకూడదు, అతను దుష్టుడి వైపు ఉండి తన తమ్ముణ్ణి దారుణంగా చంపేశాడు.+ అతను ఎందుకు అలా చేశాడు? ఎందుకంటే అతని పనులు చాలా చెడ్డవి,+ కానీ అతని తమ్ముడి పనులు నీతిగలవి.+
13 సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నందుకు ఆశ్చర్యపోకండి.+ 14 మనం సహోదరుల్ని ప్రేమిస్తాం+ కాబట్టి, మరణాన్ని దాటి జీవంలోకి వచ్చామని+ మనకు తెలుసు. అలా ప్రేమించని వ్యక్తి మరణంలోనే ఉండిపోయాడు.+ 15 తన సహోదరుణ్ణి ద్వేషించే ప్రతీ వ్యక్తి హంతకుడే,+ ఏ హంతకుడూ శాశ్వత జీవితం పొందడని మీకు తెలుసు.+ 16 ఆయన తన ప్రాణాన్ని మనకోసం అర్పించాడు కాబట్టి మనం ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నాం.+ అలాగే సహోదరుల కోసం మన ప్రాణాలు ఇవ్వాల్సిన బాధ్యత మనమీద ఉంది.+ 17 ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సినవి ఉన్న ఒక వ్యక్తి, తన సహోదరుడు అవసరంలో ఉండడం చూసి కూడా అతని మీద కనికరం చూపించకపోతే, ఆ వ్యక్తికి దేవుని మీద ప్రేమ ఉందని ఎలా చెప్పగలం?+ 18 చిన్నపిల్లలారా, మన ప్రేమను మాటల్లో కాదు+ చేతల్లో చూపించాలి,+ ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి.
19 దానివల్ల, మనం సత్యం వైపు ఉన్నామని గ్రహిస్తాం, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మన హృదయాలకు భరోసా ఇస్తాం,* 20 ఎందుకంటే కొన్ని విషయాల్లో మన హృదయాలు మనల్ని నిందించవచ్చు; దేవుడు మన హృదయాల కన్నా గొప్పవాడని, ఆయనకు అన్నీ తెలుసని+ మనం గుర్తుంచుకుందాం. 21 ప్రియ సహోదరులారా, ఒకవేళ మన హృదయాలు మనల్ని నిందించకపోతే, మనం దేవునితో ధైర్యంగా మాట్లాడగలుగుతాం;+ 22 అంతేకాదు, మనం ఏమి అడిగినా ఆయన మనకు ఇస్తాడు.+ ఎందుకంటే మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాం, ఆయనకు నచ్చే పనులు చేస్తున్నాం. 23 నిజానికి దేవుని ఆజ్ఞ ఏమిటంటే: మనం తన కుమారుడైన యేసుక్రీస్తు పేరు మీద విశ్వాసం ఉంచాలి, ఆయన ఆజ్ఞాపించినట్టు ఒకరినొకరం ప్రేమించుకోవాలి.+ 24 అంతేకాదు, దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్లు ఆయనతో ఐక్యంగా ఉంటారు, ఆయన వాళ్లతో ఐక్యంగా ఉంటాడు. ఆయన మనకు ఇచ్చిన పవిత్రశక్తిని బట్టి, ఆయన మనతో ఐక్యంగా ఉన్నాడని మనకు తెలుసు.+
4 ప్రియ సహోదరులారా, దేవుని నుండి వచ్చిందనిపించే ప్రతీ సందేశాన్ని* నమ్మకండి,+ అయితే అవి* నిజంగా దేవుని నుండి వచ్చాయో లేదో నిర్ధారించుకోండి.+ ఎందుకంటే లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయల్దేరారు.+
2 ఒక సందేశం* దేవుని నుండి వచ్చిందో లేదో ఇలా నిర్ధారించుకోవచ్చు: యేసుక్రీస్తు మనిషిగా* వచ్చాడని చెప్పే ప్రతీ సందేశం దేవుని నుండి వచ్చింది.+ 3 కానీ యేసు మనిషిగా వచ్చాడని ఒప్పుకోని ఏ సందేశమైనా* అది దేవుని నుండి వచ్చింది కాదు.+ అది క్రీస్తువిరోధి నుండి వచ్చిన సందేశం. అతను అలాంటి విషయాలు చెప్తాడని మీరు విన్నారు,+ అతని సందేశం ఇప్పటికే లోకంలో వినిపిస్తోంది.+
4 చిన్నపిల్లలారా, మీరు దేవునివైపు ఉన్నారు, మీరు అబద్ధ ప్రవక్తల్ని జయించారు.+ ఎందుకంటే మీతో ఐక్యంగా ఉన్న దేవుడు,+ లోకంతో ఐక్యంగా ఉన్న అపవాది+ కన్నా బలవంతుడు. 5 అబద్ధ ప్రవక్తలు లోకంవైపు ఉన్నారు;+ అందుకే వాళ్లు లోక సంబంధమైన విషయాలు మాట్లాడతారు, లోకం వాళ్ల మాట వింటుంది.+ 6 మనం దేవునివైపు ఉన్నాం. దేవుణ్ణి తెలుసుకున్న ప్రతీ ఒక్కరు మన మాట వింటారు;+ దేవునివైపు లేనివాళ్లు మన మాట వినరు.+ ఈ విధంగా మనం ఏది సత్య సందేశమో,* ఏది తప్పుడు సందేశమో గుర్తించగలుగుతాం.+
7 ప్రియ సహోదరులారా, మనం ఒకరినొకరం ప్రేమిస్తూనే ఉందాం;+ ఎందుకంటే ప్రేమకు మూలం దేవుడు, ప్రేమ ఉన్నవాళ్లంతా దేవుని పిల్లలు, వాళ్లకు దేవుడు తెలుసు.+ 8 ప్రేమ లేనివాళ్లకు దేవుడు తెలీదు, ఎందుకంటే దేవుడు ప్రేమ.+ 9 దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి లోకంలోకి పంపించినప్పుడు ఆయనకు మనమీద ఉన్న ప్రేమ వెల్లడైంది. ఆ కుమారుని ద్వారా మనం జీవం పొందాలని దేవుడు ఆయన్ని పంపించాడు.+ 10 మనం తనను ప్రేమించామని దేవుడు మనల్ని ప్రేమించలేదు, బదులుగా దేవుడే మనల్ని ప్రేమించి, మన పాపాల కోసం ప్రాయశ్చిత్త* బలిగా తన కుమారుణ్ణి పంపించాడు.+
11 ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడు కాబట్టి, ఒకరినొకరం ప్రేమించుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది.+ 12 ఎవ్వరూ ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు.+ మనం ఒకరినొకరం ప్రేమిస్తూ ఉంటే దేవుడు మనతోనే ఉంటాడు, మనలో ఆయన ప్రేమ పరిపూర్ణం చేయబడుతుంది. 13 దేవుడు మనకు తన పవిత్రశక్తిని ఇచ్చాడు కాబట్టి, మనం ఆయనతో ఐక్యంగా ఉన్నామని, ఆయన మనతో ఐక్యంగా ఉన్నాడని మనకు తెలుసు. 14 అంతేకాదు, తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకునిగా పంపించాడని+ మేము స్వయంగా చూశాం, దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. 15 యేసును దేవుని కుమారుడని ఒప్పుకునే వాళ్లతో+ దేవుడు ఐక్యంగా ఉన్నాడు, వాళ్లు దేవునితో ఐక్యంగా ఉన్నారు. 16 దేవునికి మనమీద ఎంత ప్రేమ ఉందో మనం తెలుసుకున్నాం, దాన్ని నమ్ముతున్నాం.+
దేవుడు ప్రేమ. ఎప్పుడూ ప్రేమ చూపించే వ్యక్తి దేవునితో ఐక్యంగా ఉన్నాడు, దేవుడు అతనితో ఐక్యంగా ఉన్నాడు. 17 ఈ విధంగా ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడింది. దానివల్లే మనం తీర్పు రోజున ధైర్యంగా* ఉండగలుగుతాం.+ ఎందుకంటే ఈ లోకంలో మనం యేసులాగే ఉన్నాం. 18 ప్రేమలో భయం ఉండదు,+ పరిపూర్ణ ప్రేమ భయాన్ని తరిమేస్తుంది; ఎందుకంటే, భయం మనల్ని వెనక్కి లాగుతుంది. భయపడే వ్యక్తిలో ప్రేమ పరిపూర్ణం చేయబడలేదు. 19 దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం.
20 ఎవరైనా, “నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని చెప్పుకుంటూ తన సహోదరుణ్ణి ద్వేషిస్తే అతను అబద్ధాలకోరు. ఎందుకంటే, తాను చూసే సహోదరుణ్ణి ప్రేమించని వ్యక్తి,+ తాను చూడని దేవుణ్ణి+ ప్రేమించలేడు. 21 దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి తన సహోదరుణ్ణి కూడా ప్రేమించాలి, ఇది దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ.+
5 యేసే క్రీస్తు అని నమ్మే ప్రతీ ఒక్కరు దేవుని పిల్లలే.*+ తండ్రైన దేవుణ్ణి ప్రేమించే ప్రతీ ఒక్కరు ఆయన పిల్లల్ని కూడా ప్రేమిస్తారు. 2 మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్ని పాటించినప్పుడు, మనం ఆయన పిల్లల్ని+ ప్రేమిస్తున్నామని మనకు తెలుస్తుంది. 3 దేవుణ్ణి ప్రేమించడమంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడమే; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.+ 4 ఎందుకంటే, దేవుని పిల్లలంతా* లోకాన్ని జయిస్తారు.+ మనం మన విశ్వాసంతో లోకాన్ని జయించాం.+
5 లోకాన్ని జయించేది ఎవరు?+ యేసు దేవుని కుమారుడని విశ్వసించేవాళ్లే+ కదా? 6 నీళ్ల ద్వారా, రక్తం ద్వారా వచ్చింది ఆయనే, అంటే యేసుక్రీస్తే; ఆయన నీళ్లతో మాత్రమే కాదు,+ నీళ్లతో, రక్తంతో వచ్చాడు.+ దీని గురించి పవిత్రశక్తే సాక్ష్యం ఇస్తోంది,+ అది సత్యాన్ని వెల్లడి చేస్తుంది.* 7 ఈ మూడు సాక్ష్యం ఇస్తున్నాయి: 8 పవిత్రశక్తి,+ నీళ్లు,+ రక్తం;+ ఈ మూడూ ఒకే విధమైన సాక్ష్యం ఇస్తున్నాయి.
9 మనుషుల సాక్ష్యాన్ని మనం అంగీకరిస్తాం కదా, దేవుని సాక్ష్యం ఇంకా గొప్పది. ఎందుకంటే స్వయంగా దేవుడే తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 10 దేవుని కుమారుని మీద విశ్వాసం ఉంచే వ్యక్తి, దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని తన హృదయంలో అంగీకరిస్తాడు. దేవుని మీద విశ్వాసంలేని వ్యక్తి దేవుణ్ణి అబద్ధాలకోరుగా చేశాడు,+ ఎందుకంటే తన కుమారుని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని అతను విశ్వసించలేదు. 11 ఆ సాక్ష్యం ఏమిటంటే, దేవుడు మనకు శాశ్వత జీవితాన్ని ఇచ్చాడు, ఈ శాశ్వత జీవితం ఆయన కుమారునిలో ఉంది.+ 12 కుమారుణ్ణి అంగీకరించే వాళ్లకు ఈ శాశ్వత జీవితం ఉంటుంది; దేవుని కుమారుణ్ణి అంగీకరించని వాళ్లకు ఈ శాశ్వత జీవితం ఉండదు.+
13 దేవుని కుమారుని పేరు మీద విశ్వాసముంచే మీకు శాశ్వత జీవితం ఉందనే సంగతి మీరు తెలుసుకోవాలని మీకు ఈ విషయాలు రాస్తున్నాను. 14 మనకున్న నమ్మకం* ఏమిటంటే,+ మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు.+ 15 మనం ఏది అడిగినా ఆయన వింటాడని మనకు తెలిస్తే, మనం ఆయన్ని ఏవైతే అడిగామో వాటిని పొందుతామని కూడా మనకు తెలుసు.+
16 తన సహోదరుడు మరణశిక్షకు తగని పాపం చేయడం ఒక వ్యక్తి చూస్తే, అతను తన సహోదరుని కోసం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ఆ సహోదరునికి, అవును మరణశిక్షకు తగని పాపం చేసినవాళ్లకు జీవాన్ని ఇస్తాడు.+ అయితే మరణశిక్షకు తగిన పాపం కూడా ఉంది.+ ఇలాంటి పాపం చేసేవాళ్ల గురించి ప్రార్థించమని నేను చెప్పట్లేదు. 17 అన్నిరకాల చెడ్డపనులు పాపమే,+ అయితే మరణశిక్షకు తగని పాపం కూడా ఉంది.
18 దేవుని పిల్లలెవ్వరూ అలవాటుగా పాపం చేయరని మనకు తెలుసు. దేవుని కుమారుడు* వాళ్లకు కాపలా ఉంటాడు కాబట్టి దుష్టుడు వాళ్లను తాకలేడు.* 19 మనం దేవునివైపు ఉన్నామని మనకు తెలుసు, కానీ లోకమంతా దుష్టుని గుప్పిట్లో* ఉంది.+ 20 అయితే దేవుని కుమారుడు వచ్చాడని+ మనకు తెలుసు. మనం సత్యదేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకునేలా కుమారుడు మనకు లోతైన అవగాహన ఇచ్చాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం ఆయనతో ఐక్యంగా ఉన్నాం. ఆయనే సత్యదేవుడు, ఆయనే శాశ్వత జీవితాన్ని ఇస్తాడు.+ 21 చిన్నపిల్లలారా, విగ్రహాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.+
లేదా “సహవాసంలో.”
లేదా “మా సహవాసంలో.”
లేదా “మన తరఫున వాదించే వ్యక్తి.”
లేదా “దేవునితో శాంతియుత సంబంధం తిరిగి నెలకొల్పుకోవడానికి తోడ్పడే; దేవుణ్ణి శాంతింపజేసే.”
అంటే, యేసు.
లేదా “కంటికి నచ్చేది కావాలనుకోవడం.”
లేదా “తమకు ఉన్నవాటి గురించి గొప్పలు చెప్పుకోవడం.”
లేదా “మనలాంటి వాళ్లు.”
అంటే, పునరుత్పత్తి చేసే లేదా ఫలించే సామర్థ్యం ఉన్న విత్తనం.
లేదా “మన హృదయాల్ని ఒప్పిస్తాం.”
లేదా “ప్రతీ ప్రేరేపిత సందేశాన్ని.”
లేదా “ఆ ప్రేరేపిత సందేశాలు.”
లేదా “ప్రేరేపిత సందేశం.”
లేదా “శరీరంతో.”
లేదా “ఏ ప్రేరేపిత సందేశమైనా.”
లేదా “ప్రేరేపిత సందేశమో.”
లేదా “దేవునితో శాంతియుత సంబంధం తిరిగి నెలకొల్పుకోవడానికి తోడ్పడే; దేవుణ్ణి శాంతింపజేసే.”
లేదా “నమ్మకంతో.”
అక్ష., “దేవుని నుండి పుట్టినవాళ్లే.”
అక్ష., “దేవుని నుండి పుట్టిన ప్రతీది.”
లేదా “అదే సత్యం.”
లేదా “ధైర్యం.”
అక్ష., “దేవుని నుండి పుట్టినవాడు.”
లేదా “వాళ్లమీద తన పట్టు బిగించడు.”
లేదా “అధీనంలో.”