కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt తీతు 1:1-3:15
  • తీతు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తీతు
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
తీతు

తీతుకు రాసిన ఉత్తరం

1 దేవుని దాసుణ్ణి, యేసుక్రీస్తు అపొస్తలుణ్ణి అయిన పౌలు అనే నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. నా విశ్వాసం, అపొస్తలుడిగా నేను చేస్తున్న సేవ దేవుడు ఎంచుకున్నవాళ్ల విశ్వాసానికి, సత్యం గురించిన సరైన జ్ఞానానికి అనుగుణంగా ఉన్నాయి; ఈ సత్యం దైవభక్తికి అనుగుణంగా ఉంది. 2 ఇవి శాశ్వత జీవితమనే+ నిరీక్షణమీద ఆధారపడి ఉన్నాయి. ఆ శాశ్వత జీవితాన్ని అబద్ధమాడలేని దేవుడు+ ఎంతోకాలం క్రితమే వాగ్దానం చేశాడు; 3 కానీ ఆయన తాను అనుకున్న సమయంలో, మంచివార్తను ప్రకటించే పని ద్వారా తన సందేశాన్ని తెలియజేశాడు. ఆ మంచివార్తను ప్రకటించే బాధ్యత మన రక్షకుడైన దేవుని ఆజ్ఞమేరకు నాకు అప్పగించబడింది.+ 4 తోటి విశ్వాసివైన తీతూ, నా నిజమైన కుమారుడా,

తండ్రైన దేవుడు, అలాగే మన రక్షకుడైన క్రీస్తుయేసు నీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.

5 నేను నీకు ఇచ్చిన నిర్దేశాల ప్రకారం, నువ్వు లోపాల్ని* సరిచేయాలని, ఒక్కో నగరానికి వెళ్తూ పెద్దల్ని నియమించాలని నిన్ను క్రేతులో ఉంచి వచ్చాను. 6 ఒక సహోదరుణ్ణి పెద్దగా నియమించాలంటే అతని మీద ఏ నిందా ఉండకూడదు, అతనికి ఒకే భార్య ఉండాలి, అతని పిల్లలు విశ్వాసులై ఉండాలి, ఆ పిల్లలకు చెడు తిరుగుళ్లు తిరుగుతారనే* లేదా తిరగబడేవాళ్లనే చెడ్డపేరు ఉండకూడదు.+ 7 పర్యవేక్షకుడు దేవుని సంఘాన్ని చూసుకునే వ్యక్తి* కాబట్టి అతని మీద ఏ నిందా ఉండకూడదు, అతను మొండివాడు+ గానీ, ముక్కోపి+ గానీ, తాగుబోతు గానీ, కొట్టేవాడు గానీ, అక్రమ లాభాన్ని ఆశించేవాడు గానీ అయ్యుండకూడదు. 8 బదులుగా అతను ఆతిథ్యమిచ్చేవాడు,+ మంచితనాన్ని ప్రేమించేవాడు, మంచి వివేచన గలవాడు,+ నీతిమంతుడు, విశ్వసనీయుడు,+ ఆత్మనిగ్రహం గలవాడు+ అయ్యుండాలి; 9 బోధించేటప్పుడు* నమ్మకమైన వాక్యాన్ని* గట్టిగా అంటిపెట్టుకునేవాడై ఉండాలి.+ అప్పుడే అతను మంచి* బోధతో+ ఇతరుల్ని ప్రోత్సహించగలుగుతాడు, ఆ బోధను వ్యతిరేకించేవాళ్లను గద్దించగలుగుతాడు.+

10 ఎందుకంటే తిరుగుబాటు చేసేవాళ్లు, పనికిరాని మాటలు మాట్లాడేవాళ్లు, మోసగాళ్లు, ముఖ్యంగా సున్నతి గురించి పట్టుబట్టేవాళ్లు చాలామంది ఉన్నారు.+ 11 వాళ్ల నోళ్లు మూయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్లు అక్రమ లాభం కోసం, బోధించకూడని విషయాల్ని బోధిస్తూ కుటుంబాలకు కుటుంబాల్నే నాశనం చేస్తున్నారు. 12 వాళ్లలో ఒకతను, అంటే వాళ్ల సొంత ప్రవక్తే ఇలా అన్నాడు: “క్రేతువాళ్లు ఎప్పుడూ అబద్ధాలాడతారు, వాళ్లు ప్రమాదకరమైన క్రూరమృగాలు, సోమరులు, తిండిబోతులు.”

13 అతని సాక్ష్యం నిజం. అందుకే వాళ్లను తీవ్రంగా గద్దిస్తూ ఉండు. అప్పుడే వాళ్లు విశ్వాసంలో దృఢంగా* ఉంటూ 14 యూదుల కట్టుకథల్ని, సత్యాన్ని విడిచిపెట్టేవాళ్ల ఆజ్ఞల్ని లెక్కచేయకుండా ఉంటారు. 15 పవిత్రులకు అన్నీ పవిత్రం;+ కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదీ పవిత్రం కాదు. ఎందుకంటే వాళ్ల మనసు, మనస్సాక్షి రెండూ కలుషితమైపోయాయి.+ 16 వాళ్లు తమకు దేవుడు తెలుసని అందరిముందు చెప్పుకుంటారు, కానీ వాళ్ల పనులు+ వాళ్లు దేవుణ్ణి తిరస్కరిస్తున్నారని చూపిస్తాయి. ఎందుకంటే వాళ్లు అసహ్యమైనవాళ్లు, అవిధేయులు, ఏ మంచిపనికీ పనికిరానివాళ్లు.

2 నువ్వైతే మంచి* బోధకు అనుగుణంగా ఉన్నవాటినే బోధిస్తూ ఉండు.+ 2 వృద్ధ పురుషులు అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి, బాధ్యతగా* నడుచుకోవాలి, మంచి వివేచన చూపించాలి; విశ్వాసం, ప్రేమ, సహనం విషయంలో దృఢంగా* ఉండాలి. 3 అలాగే వృద్ధ స్త్రీలు భయభక్తులతో నడుచుకోవాలి, లేనిపోనివి కల్పించి చెప్పకూడదు, మద్యానికి బానిసలు కాకూడదు, మంచి విషయాలు బోధించాలి. 4 వాళ్లు అలా ఉంటే భర్తల్ని, పిల్లల్ని ప్రేమించమని తమకన్నా చిన్నవయసు స్త్రీలకు సలహా ఇవ్వగలుగుతారు.* 5 అంతేకాదు మంచి వివేచన చూపించమని, పవిత్రంగా ఉండమని, ఇంట్లో పనులు చేసుకోమని, మంచిపనులు చేయమని, భర్తలకు లోబడివుండమని+ సలహా ఇవ్వగలుగుతారు. అప్పుడు దేవుని వాక్యం గురించి చెడ్డగా మాట్లాడే అవకాశం ఎవ్వరికీ ఉండదు.

6 అలాగే, యువకుల్ని మంచి వివేచన చూపించమని+ ప్రోత్సహిస్తూ* ఉండు. 7 నువ్వు అన్ని విషయాల్లో మంచిపనులకు ఆదర్శంగా ఉంటూ అలా చేయి. స్వచ్ఛమైన విషయాల్ని* పూర్తి పట్టుదలతో బోధించు,+ 8 విమర్శించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకుండా మంచి* మాటలతో బోధించు.+ అప్పుడు వ్యతిరేకులు, ఏ విషయంలోనూ మన గురించి చెడ్డగా* మాట్లాడే అవకాశం దొరకక సిగ్గుపడతారు.+ 9 దాసులు అన్ని విషయాల్లో తమ యజమానులకు లోబడివుండాలి,+ వాళ్లను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి, వాళ్లకు ఎదురు మాట్లాడకూడదు, 10 వాళ్లవేవీ దొంగిలించకూడదు; బదులుగా పూర్తి నమ్మకస్థులుగా ఉండాలి. అలా వాళ్లు, ప్రతీ విషయంలో మన రక్షకుడైన దేవుని బోధను అలంకరిస్తారు.+

11 ఎందుకంటే, అన్నిరకాల ప్రజలకు రక్షణ తీసుకొచ్చే దేవుని అపారదయ వెల్లడైంది. 12 ఆ అపారదయ మనం భక్తిహీన ప్రవర్తనను, లోక సంబంధమైన కోరికల్ని+ తిరస్కరించేలా, ఈ వ్యవస్థలో* మంచి వివేచనతో, నీతితో, దైవభక్తితో జీవించేలా మనకు శిక్షణ ఇస్తుంది. 13 అదే సమయంలో మనం, మన అద్భుతమైన నిరీక్షణ నిజమవ్వాలని,+ మహాదేవుని మహిమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ వెల్లడవ్వాలని ఎదురుచూస్తూ ఉందాం. 14 మనం తనకు ప్రత్యేకమైన సొత్తు అయ్యేలా, మంచిపనుల విషయంలో ఉత్సాహం చూపించే ప్రజలుగా ఉండేలా,+ మనల్ని అన్నిరకాల చెడుతనం నుండి విడుదల చేసి*+ శుద్ధి చేయడానికి ఆయన తనను తాను అర్పించుకున్నాడు.+

15 నువ్వు పూర్తి అధికారంతో ఈ విషయాలు బోధిస్తూ, ప్రోత్సహిస్తూ, గద్దిస్తూ ఉండు.+ నిన్ను చిన్నచూపు చూసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకు.

3 ప్రభుత్వాలకు, అధికారాలకు లోబడమని, విధేయులుగా ఉండమని,+ ప్రతీ మంచిపని కోసం సిద్ధంగా ఉండమని వాళ్లకు గుర్తుచేస్తూ ఉండు. 2 అలాగే ఎవరి గురించీ చెడుగా మాట్లాడొద్దని, గొడవలు పెట్టుకునేవాళ్లుగా, పట్టుబట్టేవాళ్లుగా ఉండొద్దని,*+ అందరి పట్ల పూర్తి సౌమ్యతతో మెలగమని+ కూడా వాళ్లకు గుర్తుచేస్తూ ఉండు. 3 ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా బుద్ధిలేనివాళ్లుగా, అవిధేయులుగా, దారితప్పినవాళ్లుగా, రకరకాల కోరికలకూ సుఖాలకూ బానిసలుగా ఉండేవాళ్లం, చెడ్డపనులు చేసేవాళ్లం, ఈర్ష్యపడే వాళ్లం, అసహ్యంగా ప్రవర్తించేవాళ్లం, ఒకరినొకరం ద్వేషించుకునేవాళ్లం.

4 అయితే మన రక్షకుడైన దేవుని దయ,+ మనుషుల పట్ల ఆయనకున్న ప్రేమ వెల్లడైనప్పుడు 5 (మనం చేసిన ఏ నీతి పనుల వల్లో కాదుగానీ+ తన కరుణ వల్ల)+ ఆయన మనల్ని రక్షించాడు. మనం జీవం పొందేలా+ మనల్ని శుభ్రపర్చడం* ద్వారా, పవిత్రశక్తితో నూతనం చేయడం ద్వారా+ ఆయన మనల్ని రక్షించాడు. 6 మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద ఈ పవిత్రశక్తిని సమృద్ధిగా* కుమ్మరించాడు.+ 7 తన అపారదయ ద్వారా మనం నీతిమంతులమని తీర్పు పొందిన తర్వాత,+ శాశ్వత జీవిత నిరీక్షణ+ ప్రకారం మనం వారసులం అవ్వాలని+ ఆయన అలా చేశాడు.

8 ఈ మాటలు నమ్మదగినవి. నువ్వు వీటిని నొక్కిచెప్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాచేస్తే, దేవుని మీద విశ్వాసముంచిన వాళ్లు అన్ని సమయాల్లో మంచిపనుల మీదే మనసు పెట్టగలుగుతారు. ఈ మాటలు మంచివి, ఉపయోగకరమైనవి.

9 అయితే మూర్ఖమైన వాదనలకు, వంశావళులకు, ధర్మశాస్త్రం గురించిన గొడవలూ కొట్లాటలకు దూరంగా ఉండు. ఎందుకంటే వాటివల్ల ఏ ఉపయోగమూ ఉండదు, అవి వ్యర్థమైనవి.+ 10 అబద్ధ బోధను*+ వ్యాప్తిచేసే వ్యక్తికి ఒకట్రెండుసార్లు బుద్ధిచెప్పి,*+ అప్పటికీ వినకపోతే అతనితో సహవాసం మానేయి. 11 ఎందుకంటే, అలాంటి వ్యక్తి సత్యమార్గాన్ని వదిలేశాడని, పాపం చేస్తూ తనను తాను దోషిగా ప్రకటించుకున్నాడని నీకు తెలుసు.

12 నేను అర్తెమాను గానీ తుకికును+ గానీ నీ దగ్గరికి పంపించినప్పుడు, నికొపొలికి రావడానికి గట్టిగా ప్రయత్నించు. ఎందుకంటే నేను చలికాలం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. 13 ధర్మశాస్త్రంలో ఆరితేరిన జేనాకు, అలాగే అపొల్లోకు కావాల్సినవన్నీ శ్రద్ధగా ఏర్పాటుచేయి, వాళ్ల ప్రయాణానికి ఏమీ తక్కువ కాకుండా చూసుకో.+ 14 అయితే మనవాళ్లు కూడా, అత్యవసర పరిస్థితుల్లో ఇతరులకు సహాయం చేయగలిగేలా మంచిపనులు చేస్తూ ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ల మంచిపనులకు లోటు లేకుండా ఉంటుంది.*

15 నాతో ఉన్నవాళ్లంతా నీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మామీద ప్రేమ* ఉన్న విశ్వాసులకు నా శుభాకాంక్షలు చెప్పు.

దేవుని అపారదయ మీ అందరికీ తోడుండాలి.

లేదా “దోషాల్ని.”

లేదా “అడ్డూఅదుపూ లేనివాళ్లనే.”

లేదా “దేవుని గృహనిర్వాహకుడు.”

లేదా “బోధనాకళను ఉపయోగిస్తున్నప్పుడు.”

లేదా “నమ్మదగిన సందేశాన్ని.”

లేదా “ఆరోగ్యకరమైన; ప్రయోజనకరమైన.”

అక్ష., “ఆరోగ్యంగా.”

లేదా “ఆరోగ్యకరమైన; ప్రయోజనకరమైన.”

లేదా “గౌరవంగా.”

అక్ష., “ఆరోగ్యంగా.”

లేదా “బుద్ధి చెప్పగలుగుతారు.”

లేదా “వేడుకుంటూ.”

లేదా “స్వచ్ఛతతో” అయ్యుంటుంది.

లేదా “ఆరోగ్యకరమైన; ప్రయోజనకరమైన.”

లేదా “నీచంగా.”

లేదా “యుగంలో.” పదకోశం చూడండి.

అక్ష., “విమోచించి; విడిపించి.”

లేదా “అర్థం చేసుకునేవాళ్లుగా ఉండమని; సహేతుకత గలవాళ్లుగా ఉండమని.”

లేదా “మనకు స్నానం చేయించడం.”

లేదా “ఉదారంగా.”

అక్ష., “తెగను.”

లేదా “హెచ్చరించి.”

అక్ష., “వాళ్లు నిష్ఫలులు కాకుండా ఉంటారు.”

లేదా “అనురాగం.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి