తిమోతికి రాసిన రెండో ఉత్తరం
1 క్రీస్తుయేసు ద్వారా పొందబోయే జీవం+ గురించిన వాగ్దానానికి అనుగుణంగా, దేవుని ఇష్టప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడినైన పౌలు అనే నేను 2 నా ప్రియమైన కుమారుడు తిమోతికి+ రాస్తున్న ఉత్తరం.
తండ్రైన దేవుడు, అలాగే మన ప్రభువైన క్రీస్తుయేసు నీకు అపారదయను, కరుణను, శాంతిని అనుగ్రహించాలి.
3 నా పూర్వీకుల్లా నేను ఎవరికైతే పవిత్రసేవ చేస్తున్నానో ఆ దేవునికి నేను కృతజ్ఞుణ్ణి. నేను స్వచ్ఛమైన మనస్సాక్షితో అలా సేవ చేస్తున్నాను; నేను రాత్రింబగళ్లు పట్టుదలతో చేసే ప్రార్థనల్లో మానకుండా నిన్ను గుర్తుచేసుకుంటున్నాను. 4 నీ కన్నీళ్లను తలచుకున్నప్పుడు, నిన్ను చూడాలని బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్ను చూస్తే నా హృదయం సంతోషంతో నిండిపోతుంది. 5 వేషధారణలేని నీ విశ్వాసం+ నాకు గుర్తొస్తుంది. అలాంటి విశ్వాసం మొదట మీ అమ్మమ్మ లోయిలో, మీ అమ్మ యునీకేలో ఉంది. అదే విశ్వాసం నీలో కూడా ఉందని నేను నమ్ముతున్నాను.
6 అందుకే, నీలో ఉన్న వరాన్ని, అంటే నేను నీ మీద చేతులు ఉంచినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని అగ్ని రాజేసినట్టు రాజేయమని నీకు గుర్తుచేస్తున్నాను.+ 7 దేవుడు ఇచ్చే పవిత్రశక్తి మనలో పిరికితనాన్ని కాదుగానీ+ శక్తిని,+ ప్రేమను, మంచి వివేచనను పుట్టిస్తుంది. 8 కాబట్టి మన ప్రభువు గురించిన సాక్ష్యం విషయంలో గానీ, ఆయన కోసం ఖైదీగా ఉన్న నా విషయంలో గానీ సిగ్గుపడకు.+ బదులుగా దేవుని శక్తి మీద ఆధారపడుతూ+ మంచివార్త కోసం కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండు.+ 9 దేవుడు మన పనుల్ని బట్టి కాదుగానీ తన సంకల్పాన్ని, అపారదయను బట్టి మనల్ని కాపాడాడు,+ పవిత్రులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు.+ ఆ అపారదయ, క్రీస్తుయేసు ద్వారా ఎంతోకాలం క్రితమే మనకు ఇవ్వబడింది. 10 మన రక్షకుడైన క్రీస్తుయేసు వెల్లడవ్వడం+ ద్వారా ఇప్పుడు అది స్పష్టంగా చూపించబడింది. ఆయన, మరణాన్ని రద్దు చేసి,+ జీవాన్ని,+ అక్షయతను*+ పొందడం ఎలాగో మంచివార్త+ ద్వారా వెల్లడిచేశాడు. 11 ఆ మంచివార్తకే నేను ప్రచారకుడిగా, అపొస్తలుడిగా, బోధకుడిగా నియమించబడ్డాను.+
12 నేను ఈ బాధలు అనుభవిస్తున్నది కూడా అందుకే,+ కానీ నేను సిగ్గుపడను.+ ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నాకు తెలుసు; నేను ఆయనకు అప్పగించినదాన్ని ఆ రోజు వచ్చేంతవరకు ఆయన కాపాడగలడనే నమ్మకం నాకు ఉంది.+ 13 నువ్వు నా దగ్గర విన్న మంచి* మాటల ప్రమాణాన్ని* పాటిస్తూ ఉండు;+ క్రీస్తుయేసుతో ఐక్యంగా ఉండడం వల్ల కలిగే విశ్వాసంతో, ప్రేమతో అలా పాటించు. 14 నీకు అప్పగించబడిన ఈ అమూల్యమైన సంపదను మనలో నివసిస్తున్న పవిత్రశక్తి+ సహాయంతో కాపాడు.
15 ఆసియా ప్రాంతం వాళ్లందరూ,+ ఫుగెల్లు, హెర్మొగెనేతో సహా అందరూ నన్ను విడిచి వెళ్లిపోయారని నీకు తెలుసు. 16 ఒనేసిఫోరు ఇంటివాళ్ల+ మీద ప్రభువు కరుణ చూపించాలి. ఎందుకంటే అతను చాలాసార్లు నాకు సేదదీర్పు ఇచ్చాడు, నా సంకెళ్ల విషయంలో అతను సిగ్గుపడలేదు. 17 బదులుగా అతను రోములో ఉన్నప్పుడు నాకోసం పట్టుదలగా వెదికి, నన్ను కలిశాడు. 18 తీర్పు రోజున ప్రభువైన యెహోవా* అతని మీద కరుణ చూపించాలి. ఎఫెసులో అతను నాకు ఎంత సేవ చేశాడో నీకు బాగా తెలుసు.
2 కాబట్టి నా కుమారుడా,+ క్రీస్తుయేసుతో ఐక్యంగా ఉండడం వల్ల పొందిన అపారదయ ద్వారా నువ్వు శక్తి పొందుతూ ఉండు. 2 నువ్వు నా దగ్గర విన్న విషయాల్ని, అంటే ఎంతోమంది సాక్షులు ధృవీకరించిన విషయాల్ని+ నమ్మకమైన పురుషులకు అప్పగించు. దానివల్ల వాళ్లు కూడా ఇతరులకు బోధించడానికి తగినవిధంగా అర్హులౌతారు. 3 క్రీస్తుయేసుకు మంచి సైనికుడిగా,+ కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండు.+ 4 సైనికుడిగా సేవచేసే ఏ వ్యక్తీ వ్యాపారాల్లో* పాల్గొనడు.* ఎందుకంటే అతను, తనను సైనికుడిగా చేర్చుకున్న వ్యక్తి ఆమోదం పొందాలనుకుంటాడు. 5 ఆటల పోటీల్లో కూడా, నియమాల ప్రకారం ఆడితేనే తప్ప ఎవ్వరూ బహుమతిని* గెల్చుకోలేరు.+ 6 కష్టపడి పనిచేసే రైతు పంటను మొదట తినాలి. 7 నేను చెప్తున్న విషయాల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండు; ప్రభువు నీకు అన్ని విషయాల్లో అవగాహనను* అనుగ్రహిస్తాడు.
8 దావీదు సంతానమైన*+ యేసుక్రీస్తు మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడని+ గుర్తుంచుకో; దాని గురించిన మంచివార్తనే నేను ప్రకటిస్తున్నాను.+ 9 ఆ మంచివార్త కోసమే నేను బాధలు అనుభవిస్తున్నాను, నేరస్తుడిగా చెరసాలలో ఉన్నాను.+ అయితే, దేవుని వాక్యం బంధించబడి లేదు.+ 10 అందుకే, దేవుడు ఎంచుకున్నవాళ్ల కోసం నేను అన్నిటినీ సహిస్తూ ఉన్నాను.+ వాళ్లు కూడా క్రీస్తుయేసు ద్వారా కలిగే రక్షణను, శాశ్వతమైన మహిమను పొందాలన్నదే నా ఉద్దేశం. 11 ఈ మాట నమ్మదగినది: మనం ఆయనతో కలిసి చనిపోయి ఉంటే, ఆయనతో కలిసి బ్రతుకుతాం కూడా;+ 12 మనం సహిస్తూ ఉంటే, ఆయనతో కలిసి రాజులుగా పరిపాలిస్తాం;+ మనం ఆయన్ని తిరస్కరిస్తే, ఆయన మనల్ని తిరస్కరిస్తాడు;+ 13 మనం నమ్మకంగా లేకపోయినా, ఆయన మాత్రం నమ్మకంగానే ఉంటాడు; ఎందుకంటే ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు.
14 ఈ విషయాలు వాళ్లకు గుర్తుచేస్తూ ఉండు, పదాల గురించి పోట్లాడుకోవద్దని ఉపదేశిస్తూ* ఉండు. ఎందుకంటే దానివల్ల వినేవాళ్లకు హాని జరగడం* తప్ప ఒరిగేదేమీ ఉండదు. 15 దేవుని ఆమోదం పొందిన సేవకుడిగా, ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరంలేని పనివాడిగా, సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపయోగించేవాడిగా+ నిన్ను నువ్వు దేవునికి కనబర్చుకోవడానికి శాయశక్తులా కృషిచేయి. 16 పవిత్రమైనదాన్ని అగౌరవపర్చే పనికిరాని మాటల్ని తిరస్కరించు.+ ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడేవాళ్లు అంతకంతకూ దేవునికి దూరమౌతారు. 17 వాళ్ల మాటలు కొరుకుడు పుండులా వ్యాపిస్తాయి. హుమెనైయు, ఫిలేతు అలాంటివాళ్లే.+ 18 వాళ్లు, పునరుత్థానం ఇప్పటికే జరిగిపోయిందని చెప్తూ+ సత్యం నుండి తొలగిపోయారు, అలాగే కొందరి విశ్వాసాన్ని పాడుచేస్తున్నారు. 19 అయినా దేవుని గట్టి పునాది ఇంకా నిలిచే ఉంది, దానిమీద ఈ ముద్ర ఉంది: “తనవాళ్లు ఎవరో యెహోవాకు* తెలుసు,”+ “యెహోవా* పేరు ఉపయోగించి ప్రార్థించే+ ప్రతీ ఒక్కరు అవినీతిని వదిలేయాలి.”
20 ఒక గొప్ప ఇంట్లో బంగారు పాత్రలు, వెండి పాత్రలే కాకుండా చెక్క పాత్రలు, మట్టి పాత్రలు కూడా ఉంటాయి. కొన్నిటిని ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తారు, కొన్నిటిని మామూలు పనులకు ఉపయోగిస్తారు. 21 ఎవరైనా ఈ రెండో రకం పాత్రలకు దూరంగా ఉంటే, అతను ముఖ్యమైన పనులకు ఉపయోగపడే పనిముట్టుగా* ఉంటాడు; అతను శుద్ధీకరించబడి, తన యజమానికి పనికొచ్చే పాత్రగా ఉంటాడు, ప్రతీ మంచిపనికి సిద్ధంగా ఉంటాడు. 22 అందుకే నువ్వు యౌవన కోరికల నుండి పారిపో; పవిత్రమైన హృదయంతో ప్రభువు పేరు ఉపయోగించి ప్రార్థించేవాళ్లతో కలిసి నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, శాంతిని అలవర్చుకోవడానికి గట్టిగా కృషిచేయి.
23 అంతేకాదు, గొడవల్ని రేపే మూర్ఖమైన, అర్థంపర్థంలేని వాదనల్ని తిరస్కరించు.+ 24 ఎందుకంటే, ప్రభువు దాసుడు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా అతను అందరితో మృదువుగా* వ్యవహరించాలి,+ అతనికి బోధించే సామర్థ్యం ఉండాలి, అతనికి ఎవరైనా హాని చేస్తే నిగ్రహం చూపించాలి,+ 25 వ్యతిరేకించేవాళ్లకు సౌమ్యంగా ఉపదేశించాలి.+ బహుశా, దేవుడు వాళ్లలో పశ్చాత్తాపాన్ని* కలిగించి, వాళ్లు సత్యం గురించిన సరైన జ్ఞానం పొందేలా చేయవచ్చు.+ 26 దానివల్ల వాళ్లు, అపవాది తన ఇష్టం నెరవేర్చేలా తమను సజీవంగా పట్టుకున్నాడని+ గుర్తించి, కళ్లు తెరిచి, అతని ఉచ్చులో నుండి తప్పించుకోవచ్చు.
3 అయితే ఈ విషయం తెలుసుకో. చివరి రోజుల్లో+ ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి. 2 ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: తమను తాము ప్రేమించుకునేవాళ్లు,* డబ్బును ప్రేమించేవాళ్లు, గొప్పలు చెప్పుకునేవాళ్లు, గర్విష్ఠులు, దూషించేవాళ్లు, తల్లిదండ్రులకు లోబడనివాళ్లు, కృతజ్ఞత లేనివాళ్లు, విశ్వసనీయంగా ఉండనివాళ్లు, 3 మమకారం లేనివాళ్లు, మొండివాళ్లు,* లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు, 4 నమ్మకద్రోహులు, మూర్ఖులు,* గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు, దేవుణ్ణి కాకుండా సుఖాల్ని ప్రేమించేవాళ్లు, 5 పైకి దైవభక్తి ఉన్నట్టు కనిపించినా, దానికి తగ్గట్టు జీవించనివాళ్లు.+ అలాంటివాళ్లకు నువ్వు దూరంగా ఉండు. 6 వాళ్లలో కొందరు కుయుక్తిగా ఇళ్లలో చొరబడతారు; పాపాల అదుపులో ఉండి వివిధరకాల కోరికల వెంట పరుగులుతీసే బలహీనమైన స్త్రీలను చెరపట్టుకుపోతారు. 7 అలాంటి స్త్రీలు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు, అయినా ఎప్పటికీ సత్యం గురించిన సరైన జ్ఞానం సంపాదించుకోలేరు.
8 యన్నే, యంబ్రే అనేవాళ్లు మోషేను వ్యతిరేకించినట్టే, ఈ మనుషులు కూడా సత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాంటివాళ్ల మనసు పూర్తిగా భ్రష్టుపట్టింది; వాళ్లు విశ్వాసానికి తగ్గట్టు నడుచుకోవట్లేదు కాబట్టి దేవుడు వాళ్లను ఆమోదించడు. 9 అయితే వాళ్లు అంతకుమించి ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆ ఇద్దరు మనుషుల్లాగే వాళ్ల మూర్ఖత్వం కూడా అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.+ 10 నువ్వైతే నా బోధను, నా జీవన విధానాన్ని, నా లక్ష్యాన్ని, నా విశ్వాసాన్ని, నా ఓర్పును, నా ప్రేమను, నా సహనాన్ని జాగ్రత్తగా అనుసరించావు.+ 11 అంతేకాదు అంతియొకయలో,+ ఈకొనియలో,+ లుస్త్రలో+ నాకు ఎదురైన హింసలు, నేను పడిన బాధలు నీకు తెలుసు. వాటన్నిటి నుండి ప్రభువు నన్ను కాపాడాడు. 12 నిజానికి, క్రీస్తుయేసు శిష్యులుగా దైవభక్తితో జీవించాలని కోరుకునే వాళ్లందరికీ హింసలు వస్తాయి.+ 13 అయితే దుష్టులు, మోసగాళ్లు ఇతరుల్ని తప్పుదోవ పట్టిస్తూ, వాళ్లూ తప్పుదోవ పడుతూ అంతకంతకూ చెడిపోతారు.+
14 నువ్వు మాత్రం, నువ్వు నేర్చుకున్నవాటిని, నీకు నమ్మకం కుదిరినవాటిని పాటిస్తూ ఉండు. ఎందుకంటే, నువ్వు ఎవరి నుండి ఆ విషయాలు నేర్చుకున్నావో నీకు తెలుసు; 15 అంతేకాదు పసితనం+ నుండే నీకు పవిత్ర లేఖనాలు తెలుసు.+ క్రీస్తుయేసు మీద విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చే రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని అవి నీకు ఇవ్వగలవు.+ 16 లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు.+ అవి బోధించడానికి,+ గద్దించడానికి, సరిదిద్దడానికి, దేవుని నీతి ప్రమాణాల ప్రకారం క్రమశిక్షణ ఇవ్వడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.+ 17 దానివల్ల దేవుని సేవకుడు ప్రతీ మంచిపని చేయడానికి పూర్తిగా సమర్థుడు అవ్వగలుగుతాడు, పూర్తిగా సిద్ధంగా ఉండగలుగుతాడు.
4 దేవుని ముందు, క్రీస్తుయేసు ముందు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. క్రీస్తుయేసు వెల్లడై+ తన రాజ్యంతో వచ్చినప్పుడు+ బ్రతికున్నవాళ్లకు, చనిపోయినవాళ్లకు తీర్పుతీరుస్తాడు.+ నేను నీకు ఆజ్ఞాపించేది ఏమిటంటే, 2 వాక్యాన్ని ప్రకటించు;+ అనుకూలంగా ఉన్న సమయాల్లో, కష్టమైన సమయాల్లో చురుగ్గా* ఆ పని చేయి; సంపూర్ణమైన ఓర్పుతో, బోధనాకళతో+ గద్దించు,+ గట్టిగా హెచ్చరించు, ప్రోత్సహించు. 3 ఎందుకంటే, ప్రజలు మంచి* బోధను సహించని+ రోజులు వస్తాయి; వాళ్లు తమ సొంత కోరికలకు అనుగుణంగా, తమకు నచ్చేవాటిని చెప్పే బోధకుల్ని పోగుచేసుకుంటారు.+ 4 వాళ్లు సత్యాన్ని వినడం మానేసి, కట్టుకథల వైపు తిరుగుతారు. 5 కానీ నువ్వైతే అన్ని విషయాల్లో నీ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకో, కష్టాల్ని సహించు,+ మంచివార్త ప్రచారకుడిగా* పనిచేయి,* నీ పరిచర్యను పూర్తిగా నెరవేర్చు.+
6 నేను ఇప్పటికే పానీయార్పణగా+ పోయబడుతున్నాను, నా విడుదల సమయం+ దగ్గరపడింది. 7 నేను మంచి పోరాటం పోరాడాను,+ పరుగుపందెంలో చివరిదాకా పరుగెత్తాను,+ విశ్వాసాన్ని అనుసరించాను. 8 ఇప్పుడు నాకోసం నీతి కిరీటం+ సిద్ధంగా ఉంచబడింది. నీతిగల న్యాయమూర్తి అయిన ప్రభువు+ ఆ రోజున నాకు దాన్ని బహుమతిగా ఇస్తాడు;+ నా ఒక్కడికే కాదు, ఆయన వెల్లడయ్యే సమయం కోసం ఆశగా ఎదురుచూసే వాళ్లందరికీ ఇస్తాడు.
9 వీలైనంత త్వరగా నా దగ్గరికి రావడానికి ప్రయత్నించు. 10 ఎందుకంటే ఈ వ్యవస్థ* మీద ప్రేమతో దేమా+ నన్ను వదిలి థెస్సలొనీకకు వెళ్లిపోయాడు; క్రేస్కే గలతీయకు వెళ్లాడు, తీతు దల్మతియకు వెళ్లాడు. 11 లూకా ఒక్కడే నా దగ్గర ఉన్నాడు. నువ్వు వచ్చేటప్పుడు మార్కును వెంటబెట్టుకుని రా, అతను పరిచర్యలో నాకు సహాయంగా ఉంటాడు. 12 తుకికును+ నేను ఎఫెసుకు పంపించాను. 13 నువ్వు వచ్చేటప్పుడు త్రోయలో కర్పు దగ్గర నేను వదిలేసి వచ్చిన అంగీని, అలాగే గ్రంథపు చుట్టల్ని, ముఖ్యంగా తోలు కాగితాల్ని* తీసుకురా.
14 రాగిపనివాడైన అలెక్సంద్రు నాకు ఎంతో హాని చేశాడు. అతని పనులకు తగ్గట్టు యెహోవా* అతనికి ప్రతిఫలమిస్తాడు.+ 15 అతని విషయంలో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అతను మా సందేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.
16 మొదటిసారి నేను నా వాదన వినిపిస్తున్నప్పుడు ఎవ్వరూ నా పక్షాన నిలబడలేదు, అందరూ నన్ను విడిచి వెళ్లిపోయారు. వాళ్లు చేసినదానికి దేవుడు వాళ్లను జవాబుదారులుగా ఎంచకూడదని కోరుకుంటున్నాను. 17 అయితే ప్రభువు నా దగ్గర నిలబడి, నాలో శక్తిని నింపాడు. నా ద్వారా ప్రకటనా పని పూర్తిగా జరగాలని, అన్నిదేశాల ప్రజలు దాన్ని వినాలని+ అలా చేశాడు; నేను సింహం నోటి నుండి కాపాడబడ్డాను.+ 18 ప్రభువు, ప్రతీ చెడ్డపని నుండి నన్ను కాపాడి, తన పరలోక రాజ్యం కోసం నన్ను సురక్షితంగా ఉంచుతాడు.+ ఆయనకు యుగయుగాలు మహిమ కలగాలి. ఆమేన్.
19 ప్రిస్కకు,* అకులకు,+ ఒనేసిఫోరు ఇంటివాళ్లకు+ నా శుభాకాంక్షలు చెప్పు.
20 ఎరస్తు+ కొరింథులో ఉండిపోయాడు. అయితే త్రోఫిము+ అనారోగ్యంగా ఉండడంతో నేను అతన్ని మిలేతులో వదిలేసి వచ్చాను. 21 చలికాలం మొదలవ్వకముందే ఇక్కడికి రావడానికి గట్టిగా ప్రయత్నించు.
యుబూలు, పుదే, లిను, క్లౌదియ, సహోదరులందరూ నీకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
22 ప్రభువు నువ్వు చూపించే స్ఫూర్తికి తోడుండాలి. ఆయన అపారదయ నీకు తోడుండాలి.
లేదా “కుళ్లిపోయే అవకాశం లేని శరీరాన్ని.”
లేదా “ఆరోగ్యకరమైన; ప్రయోజనకరమైన.”
లేదా “నమూనాను.”
అనుబంధం A5 చూడండి.
లేదా “రోజువారీ కార్యకలాపాల్లో” అయ్యుంటుంది.
అక్ష., “చిక్కుకోడు.”
అక్ష., “కిరీటాన్ని.”
లేదా “వివేచనను.”
అక్ష., “విత్తనం నుండి వచ్చిన.”
అక్ష., “పూర్తిస్థాయిలో సాక్ష్యమిస్తూ.”
లేదా “వాళ్లను నాశనం చేయడం; వాళ్లను తలక్రిందులు చేయడం.”
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
లేదా “పాత్రగా.”
లేదా “యుక్తితో.”
లేదా “మారుమనసును.”
లేదా “స్వార్థపరులు.”
లేదా “ఇతరులతో సమ్మతించడానికి ఇష్టపడనివాళ్లు.”
లేదా “తలబిరుసుగా ప్రవర్తించేవాళ్లు.”
లేదా “అత్యవసర భావంతో.”
లేదా “ఆరోగ్యకరమైన; ప్రయోజనకరమైన.”
లేదా “సువార్తికుడిగా.”
లేదా “మంచివార్త ప్రకటిస్తూ ఉండు.”
లేదా “యుగం.” పదకోశం చూడండి.
అంటే, తోలు గ్రంథపు చుట్టల్ని.
అనుబంధం A5 చూడండి.
ప్రిస్కిల్ల అని కూడా పిలవబడింది.