కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt 1 తిమోతి 1:1-6:21
  • 1 తిమోతి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 1 తిమోతి
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 తిమోతి

తిమోతికి రాసిన మొదటి ఉత్తరం

1 మన రక్షకుడైన దేవుడూ మన నిరీక్షణైన క్రీస్తుయేసూ+ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడినైన పౌలు అనే నేను, 2 విశ్వాసంలో నా నిజమైన కుమారుడు+ తిమోతికి*+ రాస్తున్న ఉత్తరం.

తండ్రైన దేవుడు, అలాగే మన ప్రభువైన క్రీస్తుయేసు నీకు అపారదయను, కరుణను, శాంతిని అనుగ్రహించాలి.

3 నేను మాసిదోనియకు బయల్దేరే ముందు ఎఫెసులో ఉండమని నీకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు అక్కడ ఉండి భిన్నమైన సిద్ధాంతాల్ని బోధించేవాళ్లను అలా చేయొద్దని ఆజ్ఞాపించు. 4 అలాగే కట్టుకథల మీద, వంశావళుల మీద మనసు పెట్టొద్దని+ వాళ్లను ఆజ్ఞాపించు. ఎందుకంటే వాటివల్ల ఒరిగేదేమీ లేదు;+ అవి అనవసరమైన ఊహాగానాలకే దారితీస్తాయి తప్ప, మన విశ్వాసాన్ని బలపర్చడానికి దేవుడు ఇస్తున్నవాటిలో అవి లేవు. 5 మనం స్వచ్ఛమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో, వేషధారణలేని విశ్వాసంతో+ ప్రేమ చూపించాలని+ నేను ఈ నిర్దేశం* ఇస్తున్నాను. 6 కొందరు వీటి నుండి పక్కకుమళ్లి అర్థంపర్థంలేని ముచ్చట్ల వైపు తిరిగారు.+ 7 వాళ్లకు ధర్మశాస్త్ర బోధకులు అవ్వాలని+ ఉంది కానీ వాళ్లేం చెప్తున్నారో, వేటి గురించి గట్టిగా పట్టుబట్టుతున్నారో వాళ్లకే తెలీదు.

8 ధర్మశాస్త్రం మంచిదని మనకు తెలుసు, అయితే దాన్ని సరిగ్గా అన్వయించాలి. 9 అలాగే ఈ వాస్తవాన్ని మనసులో ఉంచుకోవాలి, ధర్మశాస్త్రం నీతిమంతుల కోసం రూపొందించబడలేదు కానీ అక్రమంగా నడుచుకునే వాళ్లకోసం,+ తిరుగుబాటుచేసే వాళ్లకోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం, విశ్వసనీయంగాలేని* వాళ్లకోసం, పవిత్రమైనవాటిని లెక్కచేయని వాళ్లకోసం, తల్లిదండ్రుల్ని చంపే వాళ్లకోసం, హంతకుల కోసం, 10 లైంగిక పాపం* చేసేవాళ్ల కోసం, స్వలింగ సంపర్కులైన పురుషుల కోసం, మనుషుల్ని అపహరించేవాళ్ల కోసం, అబద్ధాలకోరుల కోసం, బూటకపు ప్రమాణాలు చేసేవాళ్ల కోసం, మంచి* బోధకు+ విరుద్ధంగా ఉన్న దేన్నైనా చేసేవాళ్ల కోసం రూపొందించబడింది. 11 ఈ మంచి బోధ, సంతోషంగల దేవుడు నాకు అప్పగించిన మహిమగల మంచివార్తకు+ అనుగుణంగా ఉంది.

12 నాకు బలాన్నిచ్చిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు నేను కృతజ్ఞుణ్ణి. ఎందుకంటే, ఆయన తన పరిచర్య కోసం నన్ను నియమించి నన్ను నమ్మకమైనవానిగా ఎంచాడు.+ 13 నిజానికి ఒకప్పుడు నేను దైవదూషణ చేసేవాణ్ణి, హింసించేవాణ్ణి, తలబిరుసుగా ప్రవర్తించేవాణ్ణి.+ అయితే నేను తెలియక, విశ్వాసం లేక అలా ప్రవర్తించాను కాబట్టి ఆయన నా మీద కరుణ చూపించాడు. 14 మన ప్రభువు నామీద ఎంతో అపారదయ చూపించాడు, క్రీస్తుయేసు నుండి నేను విశ్వాసాన్ని, ప్రేమను పొందాను. 15 ఈ మాట నమ్మదగినది, దీన్ని పూర్తిగా అంగీకరించవచ్చు: పాపుల్ని రక్షించడానికి క్రీస్తుయేసు ఈ లోకంలోకి వచ్చాడు.+ వాళ్లందరిలో నేనే పెద్ద పాపిని.+ 16 అయినాసరే, నా ద్వారా తన ఓర్పును పూర్తిస్థాయిలో చూపించాలని, అలాంటి పెద్ద పాపినైన నా మీద క్రీస్తుయేసు కరుణ చూపించాడు. శాశ్వత జీవితం కోసం తన మీద విశ్వాసం ఉంచబోయే వాళ్లకు+ నేను ఒక ఉదాహరణగా ఉండాలని అలా చేశాడు.

17 యుగయుగాలకు రాజు,+ అక్షయుడు,* అదృశ్యుడు అయిన ఏకైక దేవునికి+ యుగయుగాలు ఘనత, మహిమ కలగాలి. ఆమేన్‌​.

18 నా కుమారుడా, తిమోతీ, నీ గురించి చెప్పబడిన ప్రవచనాలకు అనుగుణంగా నేను ఈ నిర్దేశాన్ని* నీకు అప్పగిస్తున్నాను. వీటిని బట్టి నువ్వు మంచి పోరాటం పోరాడుతూ+ 19 నీ విశ్వాసాన్ని, మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలని నా ఉద్దేశం.+ అలాంటి మనస్సాక్షిని పక్కకు నెట్టేయడం వల్ల కొందరి విశ్వాసం ఓడ బద్దలైనట్టు బద్దలైంది. 20 వాళ్లలో హుమెనైయు,+ అలెక్సంద్రు కూడా ఉన్నారు. దైవదూషణ చేయకూడదనే విషయాన్ని వాళ్లు క్రమశిక్షణ ద్వారా తెలుసుకోవాలని నేను వాళ్లను సాతానుకు అప్పగించాను.+

2 కాబట్టి ముందుగా నేను వేడుకునేదేమిటంటే, మనం అన్నిరకాల ప్రజల కోసం అభ్యర్థనలు, ప్రార్థనలు, విన్నపాలు చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. 2 రాజుల కోసం, ఉన్నత స్థానాల్లో* ఉన్నవాళ్లందరి కోసం కూడా అలా చేయాలి.+ అప్పుడు మనం అన్ని విషయాల్లో దైవభక్తిని, పట్టుదలను చూపిస్తూ నెమ్మది కలిగి, ప్రశాంతంగా జీవించగలుగుతాం.+ 3 ఇది మన రక్షకుడైన దేవుని దృష్టికి మంచిది, అంగీకారమైనది. 4 ఆయన అన్నిరకాల ప్రజలు సత్యం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని రక్షించబడాలని కోరుకుంటున్నాడు.*+ 5 దేవుడు ఒక్కడే,+ దేవునికీ మనుషులకూ+ మధ్యవర్తి+ ఒక్కడే, ఆయన క్రీస్తుయేసు+ అనే మనిషి. 6 ఆయన అందరి* కోసం సరిసమానమైన విమోచన క్రయధనంగా* తనను తాను అర్పించుకున్నాడు.+ దాని గురించిన సాక్ష్యం తగిన సమయంలో ఇవ్వబడుతుంది. 7 దాని గురించి సాక్ష్యమివ్వడానికే+ నేను ప్రచారకుడిగా, అపొస్తలుడిగా,+ అలాగే విశ్వాసం, సత్యం విషయంలో అన్యజనులకు బోధకుడిగా+ నియమించబడ్డాను. నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు.

8 కాబట్టి మీరు సమావేశమయ్యే ప్రతీచోట, పురుషులు కోపానికి గానీ+ వాదులాటలకు గానీ చోటివ్వకుండా,+ పవిత్రమైన* చేతులెత్తి ప్రార్థిస్తూ ఉండాలని+ కోరుకుంటున్నాను. 9 అలాగే స్త్రీలు రకరకాల జడలతో, బంగారంతో, ముత్యాలతో, ఖరీదైన బట్టలతో కాకుండా, అణకువ, మంచి వివేచన ఉట్టిపడే గౌరవప్రదమైన* బట్టలతో తమను తాము అలంకరించుకోవాలి.+ 10 దైవభక్తిగల స్త్రీలకు తగినట్టు మంచిపనులు చేయాలి, అదే వాళ్లకు అలంకారం.+

11 స్త్రీలు మౌనంగా* ఉంటూ పూర్తి విధేయతతో+ నేర్చుకోవాలి. 12 బోధించడానికి గానీ పురుషుని మీద అధికారం చెలాయించడానికి గానీ స్త్రీకి నేను అనుమతి ఇవ్వను; ఆమె మౌనంగా* ఉండాలి.+ 13 ఎందుకంటే ముందు ఆదాము సృష్టించబడ్డాడు, ఆ తర్వాతే హవ్వ సృష్టించబడింది.+ 14 అంతేకాదు, ఆదాము మోసపోలేదు కానీ స్త్రీయే పూర్తిగా మోసపోయి,+ అపరాధి అయింది. 15 ఏదేమైనా, స్త్రీ మంచి వివేచన చూపిస్తూ+ విశ్వాసంతో, ప్రేమతో, పవిత్రతతో నడుచుకుంటూ ఉంటే, పిల్లల్ని కనడం ద్వారా ఆమె* సురక్షితంగా ఉంటుంది.+

3 ఈ మాట నమ్మదగినది: ఒక వ్యక్తి పర్యవేక్షకుడు+ అవ్వడానికి కృషిచేస్తుంటే, అతను మంచిపని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. 2 కాబట్టి, పర్యవేక్షకుడు ఎలా ఉండాలంటే: అతని మీద ఏ నిందా ఉండకూడదు, అతనికి ఒకే భార్య ఉండాలి, అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి, మంచి వివేచన ఉండాలి,+ పద్ధతిగా నడుచుకోవాలి, ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలి,+ బోధించే సామర్థ్యం ఉండాలి,+ 3 అతను తాగుబోతు గానీ+ ఇతరుల్ని కొట్టేవాడు గానీ పట్టుబట్టేవాడు గానీ అయ్యుండకూడదు,*+ గొడవలు పెట్టుకునేవాడు గానీ+ డబ్బును ప్రేమించేవాడు గానీ అయ్యుండకూడదు,+ 4 అతను తన ఇంటివాళ్లకు చక్కగా నాయకత్వం వహించేవాడై* ఉండాలి, అతనికి చక్కని ప్రవర్తన కలిగి లోబడివుండే పిల్లలు ఉండాలి+ 5 (ఎందుకంటే తన ఇంటివాళ్లకు ఎలా నాయకత్వం వహించాలో తెలియని వ్యక్తి దేవుని సంఘాన్ని ఎలా చూసుకుంటాడు?), 6 అతను ఈ మధ్యే విశ్వాసిగా మారినవాడు అయ్యుండకూడదు,+ లేదంటే అతను గర్వంతో ఉప్పొంగిపోయి అపవాది పొందిన తీర్పునే పొందే అవకాశం ఉంది. 7 అంతేకాదు, అతనికి బయటివాళ్ల దగ్గర కూడా మంచిపేరు* ఉండాలి.+ అప్పుడే అతను నిందలపాలు* కాకుండా, అపవాది ఉరిలో చిక్కుకోకుండా ఉంటాడు.

8 అలాగే సంఘ పరిచారకులు కూడా బాధ్యతగా* నడుచుకునేవాళ్లు అయ్యుండాలి; వాళ్లకు రెండు నాలుకల ధోరణి* ఉండకూడదు; వాళ్లు మితిమీరి మద్యం సేవించేవాళ్లు గానీ, అక్రమ లాభాన్ని ఆశించేవాళ్లు గానీ అయ్యుండకూడదు;+ 9 వాళ్లు స్వచ్ఛమైన మనస్సాక్షితో విశ్వాసానికి సంబంధించిన పవిత్ర రహస్యాన్ని అంటిపెట్టుకునేవాళ్లు+ అయ్యుండాలి.

10 అంతేకాదు, వాళ్లు అర్హులో కాదో ముందుగా పరీక్షించబడాలి; వాళ్ల మీద ఏ నిందా లేకపోతే+ సంఘ పరిచారకులుగా సేవచేయవచ్చు.

11 అలాగే, స్త్రీలు కూడా బాధ్యతగా* నడుచుకునేవాళ్లు అయ్యుండాలి; లేనిపోనివి కల్పించి చెప్పే స్వభావం వాళ్లకు ఉండకూడదు;+ వాళ్లు అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి.+

12 సంఘ పరిచారకుడికి ఒకే భార్య ఉండాలి; అతను తన పిల్లలకు, ఇంటివాళ్లకు చక్కగా నాయకత్వం వహించేవాడై ఉండాలి. 13 చక్కగా పరిచారం చేసే పురుషులు మంచిపేరు సంపాదించుకుంటారు, క్రీస్తుయేసుకు సంబంధించిన విశ్వాసం గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడగలుగుతారు.

14 నేను త్వరలోనే నీ దగ్గరికి వస్తానని అనుకుంటున్నాను. అయినాసరే నీకు ఈ విషయాలు ఎందుకు రాస్తున్నానంటే, 15 ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా, దేవుని ఇంటివాళ్ల మధ్య,+ అంటే జీవంగల దేవుని సంఘం మధ్య ఎలా నడుచుకోవాలో నీకు తెలుస్తుంది. ఆ సంఘం సత్యానికి స్తంభం, పునాది. 16 దైవభక్తికి సంబంధించిన పవిత్ర రహస్యం చాలా గొప్పది: ‘ఆయన* మానవ శరీరంతో వెల్లడిచేయబడ్డాడు,+ పరలోక శరీరంతో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని నీతిమంతుడిగా తీర్పుతీర్చాడు,+ ఆయన దేవదూతలకు కనిపించాడు;+ అన్యజనుల మధ్య ఆయన గురించి ప్రకటించబడింది;+ లోకంలోని ప్రజలు ఆయన్ని నమ్మారు;+ ఆయన మహిమతో పరలోకానికి తీసుకెళ్లబడ్డాడు.’

4 అయితే, తర్వాతి కాలాల్లో కొందరు, దేవుని నుండి వచ్చాయనిపించే మోసపూరిత సందేశాల* మీద,+ చెడ్డదూతల* బోధల మీద మనసుపెట్టడం వల్ల విశ్వాసం నుండి తొలగిపోతారని దేవుని పవిత్రశక్తి స్పష్టంగా చెప్తోంది. 2 అబద్ధాలాడేవాళ్ల వేషధారణ వల్ల+ వాళ్లు అలా తయారౌతారు, వాళ్ల మనస్సాక్షి మొద్దుబారిపోయింది.* 3 వాళ్లు, పెళ్లి చేసుకోవడం తప్పంటారు.+ అలాగే విశ్వాసం, సత్యం గురించిన సరైన జ్ఞానం ఉన్నవాళ్లు కృతజ్ఞతలు చెల్లించి+ తినడం కోసం దేవుడు సృష్టించినవాటిని+ తినకూడదని వాళ్లు ఆజ్ఞాపిస్తారు.+ 4 దేవుడు సృష్టించిన ప్రతీది మంచిదే;+ కృతజ్ఞతలు చెల్లించి తింటే, ఏదీ నిషిద్ధమైనది కాదు.+ 5 ఎందుకంటే దేవుని మాటతో, ప్రార్థనతో అది పవిత్రమౌతుంది.

6 నువ్వు ఈ సలహాను సహోదరులకు ఇస్తే, క్రీస్తుయేసుకు మంచి పరిచారకునిగా ఉంటావు; అలాగే విశ్వాసానికి సంబంధించిన మాటలతో, నువ్వు జాగ్రత్తగా అనుసరించిన మంచి బోధకు సంబంధించిన మాటలతో పోషించబడుతూ ఉంటావు.+ 7 అయితే, ముసలమ్మల కథల్లాంటి భక్తిహీనమైన కట్టుకథల్ని తిరస్కరించు.+ బదులుగా, దైవభక్తి చూపించడమే లక్ష్యంగా పెట్టుకుని నీకు నువ్వే శిక్షణ ఇచ్చుకో. 8 శారీరక శిక్షణ* కొంతవరకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే, అది ఇప్పటి జీవితం గురించి, రాబోయే జీవితం+ గురించి వాగ్దానం చేస్తుంది. 9 ఆ మాట నమ్మదగినది, దాన్ని పూర్తిగా అంగీకరించవచ్చు. 10 ఇందుకే మనం కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం.+ ఎందుకంటే మనం జీవంగల దేవుని మీద నిరీక్షణ ఉంచాం; ఆయన అన్నిరకాల ప్రజలకు,+ ముఖ్యంగా నమ్మకమైన సేవకులకు రక్షకుడు.+

11 ఈ ఆజ్ఞల్ని తెలియజేస్తూ, బోధిస్తూ ఉండు. 12 నీ యౌవనాన్ని బట్టి నిన్ను ఎవ్వరూ, ఎప్పుడూ చిన్నచూపు చూడకుండా జాగ్రత్తపడు. బదులుగా మాట్లాడే విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాసం విషయంలో, పవిత్రత* విషయంలో నమ్మకమైన సేవకులకు ఆదర్శంగా ఉండు. 13 నేను వచ్చేవరకు, బహిరంగంగా చదివే విషయంలో,+ ప్రోత్సహించే* విషయంలో, బోధించే విషయంలో కృషిచేస్తూ ఉండు. 14 నీలో ఉన్న వరాన్ని, అంటే పెద్దల సభ నీ మీద చేతులు ఉంచినప్పుడు+ ప్రవచనం ద్వారా నీకు ఇవ్వబడిన వరాన్ని నిర్లక్ష్యం చేయకు. 15 వీటి గురించి ధ్యానించు; వీటిలో నిమగ్నమవ్వు, అప్పుడు నీ ప్రగతి అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. 16 నీ మీద, నీ బోధ మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టు.+ ఈ విషయాల్లో పట్టుదల చూపించు, అలాచేస్తే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ బోధ వినేవాళ్లను కూడా రక్షిస్తావు.+

5 వృద్ధుడితో కఠినంగా మాట్లాడకు.+ బదులుగా అతన్ని తండ్రిగా భావించి దయతో ఉపదేశమివ్వు. అలాగే యౌవనుల్ని అన్నదమ్ములుగా, 2 వృద్ధ స్త్రీలను తల్లులుగా, యౌవన స్త్రీలను స్వచ్ఛమైన మనసుతో అక్కచెల్లెళ్లుగా భావించి దయతో ఉపదేశమివ్వు.

3 ఏ ఆధారంలేని విధవరాళ్ల మీద శ్రద్ధ చూపించు.*+ 4 అయితే ఏ విధవరాలికైనా పిల్లలు గానీ, మనవళ్లు-మనవరాళ్లు గానీ ఉంటే, వాళ్లు ముందుగా తమ ఇంట్లో దైవభక్తిని చూపించడం నేర్చుకోవాలి; తమ అమ్మానాన్నల, తాతామామ్మల రుణం తీర్చుకోవాలి;+ ఇది దేవుని దృష్టికి అంగీకారమైనది.+ 5 ఏ ఆధారంలేని, ఎవరూ లేని విధవరాలు దేవుని మీద నిరీక్షణ ఉంచి,+ రాత్రింబగళ్లు అభ్యర్థనలు, ప్రార్థనలు చేస్తూ ఉంటుంది.+ 6 కానీ శరీర కోరికలు తీర్చుకోవడంలో మునిగిపోయే విధవరాలు బ్రతికున్నా చనిపోయినట్టే. 7 కాబట్టి, వాళ్లు ఏ నిందా లేకుండా జీవించేలా ఈ నిర్దేశాల్ని* ఇస్తూ ఉండు. 8 ఎవరైనా తన వాళ్లకు, ముఖ్యంగా తన ఇంటివాళ్లకు అవసరమైనవి సమకూర్చకపోతే, అతను విశ్వాసాన్ని విడిచిపెట్టినట్టే; అతను అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.+

9 ఒక విధవరాలిని విధవరాళ్ల జాబితాలో చేర్చాలంటే, ఆమెకు 60 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉండాలి; ఆమె ఒకే పురుషునికి భార్యగా ఉండివుండాలి; 10 ఆమెకు మంచిపనులు చేసే స్త్రీ అనే పేరు+ ఉండాలి; ఆమె పిల్లల్ని పెంచినదై ఉండాలి; ఆతిథ్యమిచ్చే అలవాటు ఉన్నదై+ ఉండాలి; పవిత్రుల పాదాలు కడిగినదై+ ఉండాలి; కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకున్నదై+ ఉండాలి; ప్రతీ మంచిపనికి తనను తాను అంకితం చేసుకున్నదై ఉండాలి.

11 అయితే, యౌవన విధవరాళ్లను ఆ జాబితాలో చేర్చకు. ఎందుకంటే, తమ లైంగిక కోరికలు క్రీస్తు సేవకు అడ్డు వచ్చినప్పుడు, వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. 12 వాళ్లు తాము మొదట చేసిన ప్రమాణాన్ని* వదిలేశారు కాబట్టి వాళ్లకు తీర్పు ఉంటుంది. 13 వాళ్లు పనీపాటా లేకుండా ఆ ఇంటికీ ఈ ఇంటికీ తిరగడం నేర్చుకుంటారు; పనీపాటా లేకుండా ఉండడమే కాదు, ఊసుపోని కబుర్లు చెప్పడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం,+ తాము మాట్లాడకూడని విషయాల గురించి మాట్లాడడం నేర్చుకుంటారు. 14 కాబట్టి యౌవన విధవరాళ్లు పెళ్లి చేసుకుని,+ పిల్లల్ని కని,+ ఇంటిని చూసుకోవాలని, విమర్శించే అవకాశం వ్యతిరేకికి ఇవ్వకూడదని నా కోరిక. 15 నిజానికి, కొందరు విధవరాళ్లు ఇప్పటికే దారితప్పి సాతానును అనుసరించారు. 16 విశ్వాసియైన ఏ స్త్రీకైనా తన బంధువుల్లో విధవరాళ్లు ఉంటే, ఆమె వాళ్లకు సహాయం చేయాలి, అప్పుడు సంఘం మీద భారం పడకుండా ఉంటుంది. దానివల్ల సంఘం ఏ ఆధారంలేని విధవరాళ్లకు సహాయం చేయగలుగుతుంది.+

17 చక్కగా నాయకత్వం వహించే పెద్దలు,+ ముఖ్యంగా దేవుని వాక్యం గురించి మాట్లాడే విషయంలో, బోధించే విషయంలో కష్టపడి పనిచేసే పెద్దలు+ రెట్టింపు గౌరవానికి అర్హులు.+ 18 ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది: “నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు,”+ “పనివాడు తన జీతానికి అర్హుడు.”+ 19 ఇద్దరుముగ్గురు సాక్షులు ఉంటే తప్ప,+ సంఘ పెద్ద* మీద వేసిన నిందను అంగీకరించొద్దు. 20 అలవాటుగా పాపం చేసేవాళ్లను+ అందరి* ముందు గద్దించు,+ అది మిగతావాళ్లకు హెచ్చరికగా ఉంటుంది.* 21 ముందే ఒక నిర్ణయానికి రాకుండా, పక్షపాతం చూపించకుండా ఈ నిర్దేశాల్ని పాటించమని+ దేవుని ముందు, క్రీస్తుయేసు ముందు, దేవుడు ఎంపిక చేసుకున్న దేవదూతల ముందు నీకు ఆజ్ఞాపిస్తున్నాను.

22 తొందరపడి ఎప్పుడూ ఏ పురుషుని మీదా చేతులు ఉంచకు;*+ ఇతరుల పాపాల్లో పాలుపంచుకోకు; నిన్ను నువ్వు పవిత్రంగా ఉంచుకో.

23 ఇకమీదట నీళ్లు తాగకు,* బదులుగా నీ కడుపు కోసం, తరచూ నీకు వచ్చే జబ్బు కోసం కొంచెం ద్రాక్షారసం తాగు.

24 కొందరి పాపాలు అందరికీ తెలుస్తాయి, అవి నేరుగా తీర్పుకు నడిపిస్తాయి. కానీ ఇంకొందరి పాపాలు తర్వాత బయటపడతాయి.+ 25 మంచిపనుల విషయంలో కూడా అంతే. కొన్ని అందరికీ తెలుస్తాయి,+ తెలియనివాటిని దాచివుంచడం కుదరదు.+

6 దాసులుగా ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ యజమానుల్ని పూర్తి గౌరవానికి అర్హులుగా ఎంచాలి.+ అప్పుడు ప్రజలు దేవుని పేరు గురించి, ఆయన బోధ గురించి చెడుగా మాట్లాడుకోకుండా ఉంటారు.+ 2 అలాగే, విశ్వాసులైన యజమానులు ఉన్న దాసులు తమ యజమానులు సహోదరులే కదా అని వాళ్లతో గౌరవం లేకుండా ప్రవర్తించకూడదు. బదులుగా, తమ మంచి సేవ నుండి ప్రయోజనం పొందేది తోటి విశ్వాసులు, ప్రియ సహోదరులు కాబట్టి వాళ్లు ఇంకా చక్కగా సేవచేయాలి.

ఈ విషయాల్ని బోధిస్తూ, ఈ ఆజ్ఞల్ని తెలియజేస్తూ ఉండు. 3 ఎవరైనా మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి వచ్చిన మంచి* బోధతో,+ దైవభక్తికి అనుగుణంగా ఉన్న బోధతో+ ఏకీభవించకుండా తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తే, 4 అతను గర్వంతో ఉప్పొంగిపోతున్నట్టు; అతనికి ఏమీ అర్థంకాదు.+ అతనికి పదాల గురించి వాదించడం, చర్చించడమే లోకం.*+ వాటివల్ల ఈర్ష్య, గొడవలు, లేనిపోనివి కల్పించి చెప్పడాలు,* హానికరమైన సందేహాలు తలెత్తుతాయి, 5 చిన్నచిన్న విషయాల గురించి వాదోపవాదాలు జరుగుతాయి. తమ మనసు కలుషితమైపోయి,+ సత్యాన్ని ఇక అర్థం చేసుకునే స్థితిలో లేని మనుషులు ఆ వాదోపవాదాల్ని ఉసిగొల్పుతారు. వాళ్లు దైవభక్తిని స్వలాభం కోసం ఉపయోగించుకుంటారు.+ 6 నిజమే, ఉన్నవాటితో తృప్తిపడుతూ దైవభక్తితో జీవిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. 7 ఎందుకంటే, మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుండి ఏమీ తీసుకుపోలేం.+ 8 కాబట్టి మనకు ఆహారం, బట్టలు* ఉంటే చాలు, వాటితో తృప్తిపడదాం.+

9 అయితే ధనవంతులు అవ్వాలని నిశ్చయించుకున్నవాళ్లు ప్రలోభంలో, ఉరిలో,+ ఎన్నో హానికరమైన వెర్రి కోరికల్లో చిక్కుకుంటారు; అవి మనుషుల్ని కష్టాల్లోకి లాగుతాయి, నాశనం చేస్తాయి.+ 10 ఎందుకంటే డబ్బు మీది మోజు అన్నిరకాల చెడ్డవాటికి* మూలం. కొందరు దాని మోజులో పడి విశ్వాసం నుండి తొలగిపోయారు, ఎన్నో బాధలతో తమను తామే పొడుచుకున్నారు.*+

11 దేవుని సేవకుడా, నువ్వైతే వీటి నుండి పారిపో. బదులుగా నీతిని, దైవభక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, సౌమ్యతను చూపించడానికి+ గట్టిగా కృషిచేయి. 12 విశ్వాసం కోసం మంచి పోరాటం పోరాడు; నువ్వు దేనికోసం పిలవబడ్డావో, దేని గురించి ఎంతోమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావో ఆ శాశ్వత జీవితం మీద గట్టి పట్టు సాధించు.

13 అన్నిటినీ సజీవంగా ఉంచే దేవుని ఎదుట, అలాగే పొంతి పిలాతు ముందు మంచి సాక్ష్యం ఇచ్చిన క్రీస్తుయేసు+ ఎదుట నీకు ఈ ఆదేశాలు ఇస్తున్నాను: 14 మన ప్రభువైన యేసుక్రీస్తు వెల్లడయ్యే+ వరకు, నేను నీకు ఇచ్చిన ఆజ్ఞను ఏ కళంకం లేకుండా, నిందకు చోటివ్వకుండా పాటిస్తూ ఉండు; 15 సంతోషంగల, శక్తిమంతుడైన ప్రభువు నిర్ణయించబడిన సమయంలో తనను తాను వెల్లడి చేసుకుంటాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.+ 16 ఆయన మాత్రమే అమర్త్యత గలవాడు,+ సమీపించలేని తేజస్సులో+ నివసిస్తున్నాడు, ఏ మనిషీ ఆయన్ని చూడలేదు, చూడలేడు కూడా.+ ఘనత, శాశ్వత బలం ఆయనకు చెందాలి. ఆమేన్‌​.

17 ఈ వ్యవస్థలో* ధనవంతులుగా ఉన్నవాళ్లు గర్విష్ఠులుగా ఉండకూడదనీ, నశించిపోయే సిరిసంపదల మీద కాకుండా+ మనం ఆస్వాదిస్తున్న వాటన్నిటిని పుష్కలంగా ఇచ్చే దేవుని+ మీద నిరీక్షణ ఉంచాలనీ వాళ్లకు ఉపదేశించు.* 18 మేలు చేస్తూ మంచిపనుల విషయంలో ధనవంతులుగా ఉండమని, ఉదారస్ఫూర్తి చూపించమని, తమకున్నవాటిని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండమని+ వాళ్లకు చెప్పు. 19 అలాచేస్తే వాళ్లు దేవుని నుండి వచ్చే సంపదల్ని పోగు చేసుకుంటారు, అంటే భవిష్యత్తు కోసం మంచి పునాది వేసుకుంటారు, వాస్తవమైన జీవితం మీద గట్టి పట్టు సాధించగలుగుతారు.+

20 ప్రియమైన తిమోతీ, నీకు అప్పగించబడినదాన్ని కాపాడు,+ పవిత్రమైన దాన్ని తిరస్కరించే వట్టి మాటలకు, సత్యానికి విరుద్ధంగా మాట్లాడేలా చేసే తప్పుడు “జ్ఞానానికి” దూరంగా ఉండు.+ 21 అలాంటి జ్ఞానాన్ని ప్రదర్శించి కొందరు విశ్వాసం నుండి తొలగిపోయారు.

దేవుని అపారదయ నీకు తోడుండాలి.

“దేవుణ్ణి ఘనపర్చే వ్యక్తి” అని అర్థం.

లేదా “ఆదేశం; ఆజ్ఞ.”

లేదా “విశ్వసనీయ ప్రేమ లేని.”

పదకోశం చూడండి.

లేదా “ఆరోగ్యకరమైన; ప్రయోజనకరమైన.”

లేదా “నశించిపోనివాడు.”

లేదా “ఆదేశాన్ని; ఆజ్ఞను.”

లేదా “అధికార స్థానాల్లో.”

లేదా “రక్షించబడాలనేది ఆయన ఇష్టం.”

లేదా “అన్నిరకాల ప్రజల.”

పదకోశం చూడండి.

అక్ష., “విశ్వసనీయమైన.”

లేదా “తగిన.”

లేదా “నిశ్శబ్దంగా; ప్రశాంతంగా.”

లేదా “నిశ్శబ్దంగా; ప్రశాంతంగా.”

అక్ష., “వాళ్లు.”

లేదా “అర్థం చేసుకునేవాడై ఉండాలి; సహేతుకత గలవాడై ఉండాలి.”

లేదా “చక్కగా చూసుకునేవాడై.”

లేదా “మంచిసాక్ష్యం.”

లేదా “అవమానాలపాలు.”

లేదా “గౌరవంగా.”

లేదా “మోసపూరిత మాటలు మాట్లాడే గుణం.”

లేదా “గౌరవంగా.”

అంటే, యేసు.

లేదా “మోసపూరిత ప్రేరేపిత సందేశాల.”

పదకోశం చూడండి.

లేదా “కాల్చిన ఇనుముతో వాతవేయబడింది.”

లేదా “వ్యాయామం.”

లేదా “స్వచ్ఛత.”

లేదా “ఉపదేశించే.”

లేదా “గౌరవించు.”

లేదా “ఆజ్ఞల్ని.”

అక్ష., “మొదటి విశ్వాసాన్ని.”

లేదా “వృద్ధుడి.”

లేదా “చూసేవాళ్లందరి.”

అక్ష., “అప్పుడు మిగతావాళ్లకు భయం ఉంటుంది.”

అంటే, ఏ పురుషుణ్ణీ తొందరపడి నియమించకు.

లేదా “కేవలం నీళ్లు మాత్రమే తాగడం మానేయి.”

లేదా “ఆరోగ్యకరమైన; ప్రయోజనకరమైన.”

లేదా “అతను హానికరమైన ఊహాలోకంలో విహరిస్తాడు.”

లేదా “తిట్టడాలు.”

లేదా “ఆశ్రయం” అయ్యుంటుంది. అక్ష., “కప్పుకోవడం.”

లేదా “హానికరమైన వాటికి.”

లేదా “తమను తాము అంతటా పొడుచుకున్నారు.”

లేదా “యుగంలో.” పదకోశం చూడండి.

లేదా “ఆదేశించు.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి