థెస్సలొనీకయులకు రాసిన రెండో ఉత్తరం
1 మన తండ్రైన దేవునితో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తుతో ఐక్యంగా ఉన్న థెస్సలొనీకయుల సంఘానికి పౌలు, సిల్వాను,* తిమోతి+ రాస్తున్న ఉత్తరం.
2 తండ్రైన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.
3 సహోదరులారా, మీ గురించి ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంది. అది సరైనదే, ఎందుకంటే మీ విశ్వాసం అంతకంతకూ ఎక్కువౌతోంది, మీ అందరికీ ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ కూడా పెరుగుతోంది.+ 4 అందుకే దేవుని సంఘాల్లో మేము మీ గురించి గొప్పగా మాట్లాడుతుంటాం;+ ఎందుకంటే ఎన్నో హింసలు, కష్టాలు* ఎదురైనా మీరు సహనాన్ని, విశ్వాసాన్ని చూపించారు.+ 5 ఇది దేవుని నీతిగల తీర్పుకు రుజువు. దీనివల్ల మీరు దేవుని రాజ్యానికి అర్హులుగా ఎంచబడతారు. నిజానికి, మీరు బాధలు అనుభవిస్తున్నది కూడా దానికోసమే.+
6 దేవుడు నీతిగలవాడు కాబట్టి మిమ్మల్ని శ్రమ పెట్టేవాళ్లను ఆయన శ్రమలపాలు చేస్తాడు.+ 7 అయితే ఇప్పుడు శ్రమలు అనుభవిస్తున్న మీరు మాతోపాటు విడుదల పొందుతారు. ఇది, యేసు ప్రభువు తన శక్తిమంతులైన దూతలతో పాటు పరలోకం నుండి+ మండుతున్న అగ్నిలో బయల్పర్చబడినప్పుడు+ జరుగుతుంది. 8 అప్పుడు ఆయన, దేవుడు తెలియనివాళ్ల మీదికి, మన ప్రభువైన యేసు గురించిన మంచివార్తకు లోబడనివాళ్ల మీదికి శిక్ష తీసుకొస్తాడు.*+ 9 శాశ్వత నాశనమనే శిక్ష పడడం+ వల్ల వాళ్లు ప్రభువు ఎదుట నుండి, ఆయన మహిమాన్విత శక్తి నుండి వెళ్లగొట్టబడతారు. 10 ఇది ఆయన తన పవిత్రులతో పాటు మహిమపర్చబడడానికి వచ్చినప్పుడు జరుగుతుంది. ఆ రోజు, ఆయన మీద విశ్వాసం చూపించిన వాళ్లంతా ఆయన్ని బట్టి ఆశ్చర్యపోతారు. మేము ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు విశ్వసించారు కాబట్టి వాళ్లలో మీరు కూడా ఉంటారు.
11 అందుకే మేము ఎప్పుడూ మీ కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు దేనికోసమైతే మిమ్మల్ని పిలిచాడో దానికి ఆయన మిమ్మల్ని అర్హులుగా ఎంచాలనీ,+ ఆయన తన శక్తితో తనకు నచ్చిన మంచి అంతటినీ చేయాలనీ, విశ్వాసంతో మీరు చేసే ప్రతీ పనిని ఆయన సంపూర్ణం చేయాలనీ ప్రార్థిస్తున్నాం. 12 అలా మీ ద్వారా మన ప్రభువైన యేసు పేరు మహిమపర్చబడాలని, మీరు ఆయన వల్ల మహిమపర్చబడాలని మా ఉద్దేశం. మన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించే అపారదయ వల్లే ఆ మహిమ కలుగుతుంది.
2 అయితే సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతకు,+ మనం ఆయన దగ్గరికి సమకూర్చబడడానికి+ సంబంధించి మేము మిమ్మల్ని కోరేదేమిటంటే, 2 యెహోవా* రోజు+ వచ్చేసిందని ఎవరైనా చెప్తే, అది ప్రవచన* రూపంలో అయినాసరే,+ మాటల రూపంలో అయినాసరే, మా నుండి వచ్చినట్టు కనిపించే ఉత్తరం రూపంలో అయినాసరే వెంటనే అయోమయంలో పడిపోకండి, భయాందోళనలకు గురికాకండి.
3 ఎవ్వరూ ఏ రకంగానూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించకుండా* చూసుకోండి. ఎందుకంటే, ముందు మతభ్రష్టత్వం+ పుట్టుకొచ్చి పాపపురుషుడు,+ అంటే నాశనపుత్రుడు+ బయల్పర్చబడితేనే గానీ ఆ రోజు రాదు. 4 ఆ పాపపురుషుడు ఒక వ్యతిరేకి. దేవుడని పిలవబడే ప్రతీదాని మీద, పూజించబడే ప్రతీ వస్తువు మీద అతను తనను తాను హెచ్చించుకుంటాడు. అలా, తానే ఒక దేవుణ్ణని అందరిముందూ చూపించుకుంటూ దేవుని ఆలయంలో కూర్చుంటాడు. 5 నేను మీతో ఉన్నప్పుడు మీకు ఈ విషయాలు చెప్పేవాణ్ణని గుర్తులేదా?
6 ఆ పాపపురుషుడు తన సమయం వచ్చినప్పుడే బయల్పర్చబడేలా అతన్ని అడ్డుకుంటున్నది ఎవరో ఇప్పుడు మీకు తెలుసు. 7 నిజమే, ఆ పాపపురుషుడి దుష్టత్వం ఇప్పటికే రహస్యంగా పనిచేస్తోంది,+ అయితే అతన్ని అడ్డుకుంటున్న వ్యక్తి వెళ్లిపోయేవరకే ఆ దుష్టత్వం అలా రహస్యంగా ఉంటుంది. 8 ఆ తర్వాత, పాపపురుషుడు బయల్పర్చబడతాడు. యేసు ప్రభువు ప్రత్యక్షత వెల్లడైనప్పుడు+ ఆయన తన నోటి ఊపిరితో అతన్ని నాశనం చేస్తాడు.+ 9 అయితే, పాపపురుషుడి ప్రత్యక్షత సాతాను వల్ల జరుగుతుంది.+ అతను సాతాను శక్తితోనే శక్తివంతమైన పనులు, బూటకపు సూచనలు, అద్భుతాలు,+ 10 నశించిపోతున్న వాళ్లను మోసగించే అన్నిరకాల అవినీతి పనులు+ చేస్తాడు. వాళ్లు రక్షణనిచ్చే సత్యం పట్ల బలమైన కోరికను చూపించలేదు కాబట్టి ఇదే వాళ్లకు శిక్ష. 11 వాళ్లు సత్యం పట్ల ఆసక్తి చూపించలేదు కాబట్టి, వాళ్లు అబద్ధాన్ని నమ్మేలా మోసపోవడానికి+ దేవుడు అనుమతిస్తాడు. 12 సత్యాన్ని నమ్మకుండా అవినీతిని ప్రేమించినందుకు వాళ్లందరూ తగిన తీర్పు పొందాలని దేవుడు అలా అనుమతిస్తాడు.
13 అయితే, యెహోవా* ప్రేమించే సహోదరులారా, మీ కోసం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంది. ఎందుకంటే మీకు రక్షణ కలగాలని దేవుడు మొదటినుండి మిమ్మల్ని ఎంచుకున్నాడు.+ ఆయన తన పవిత్రశక్తితో మిమ్మల్ని పవిత్రపర్చడం ద్వారా,+ సత్యం విషయంలో మీకున్న విశ్వాసం ద్వారా అలా ఎంచుకున్నాడు. 14 మేము ప్రకటించే మంచివార్త ద్వారానే దేవుడు మిమ్మల్ని ఆ రక్షణ కోసం పిలిచాడు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందాలనే ఉద్దేశంతో దేవుడు అలా చేశాడు.+ 15 కాబట్టి సహోదరులారా, స్థిరంగా ఉండండి.+ నోటి మాట ద్వారా గానీ మేము రాసిన ఉత్తరం ద్వారా గానీ మీరు ఏ విషయాలైతే నేర్చుకున్నారో వాటిని ఎప్పుడూ పాటిస్తూ ఉండండి.+ 16 మన ప్రభువైన యేసుక్రీస్తు, అలాగే మనల్ని ప్రేమించి తన అపారదయతో మనకు శాశ్వతమైన ఊరటను, గొప్ప నిరీక్షణను+ ఇచ్చిన మన తండ్రైన దేవుడు 17 మీ హృదయాలకు ఊరటనివ్వాలి, మీరు ఎప్పుడూ మంచిపనులు చేసేలా, మంచిమాటలు మాట్లాడేలా మిమ్మల్ని స్థిరపర్చాలి.*
3 చివరిగా సహోదరులారా, మా కోసం ప్రార్థిస్తూ ఉండండి.+ యెహోవా* వాక్యం వేగంగా వ్యాప్తిచెందుతూ ఉండాలని,+ అది మీ మధ్య మహిమపర్చబడుతూ ఉన్నట్టే ప్రజల మధ్య కూడా మహిమపర్చబడుతూ ఉండాలని, 2 హానిచేసే దుష్టుల నుండి దేవుడు మమ్మల్ని కాపాడాలని+ ప్రార్థించండి. ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు.+ 3 కానీ ప్రభువు నమ్మకమైనవాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, దుష్టుని నుండి కాపాడతాడు. 4 అంతేకాదు, మేము ఇచ్చిన నిర్దేశాలు మీరు పాటిస్తున్నారని, ముందుముందు కూడా ఇలా పాటిస్తూ ఉంటారని ప్రభువును బట్టి మీ మీద మాకు నమ్మకం ఉంది. 5 మీరు దేవుణ్ణి ప్రేమించేలా,+ క్రీస్తు కోసం సహించేలా+ ప్రభువు మీ హృదయాల్ని సరైన దిశలో నడిపిస్తూనే ఉండాలి.
6 సహోదరులారా, పద్ధతిగా నడుచుకోని ప్రతీ సహోదరునికి,+ మా నుండి మీరు* అందుకున్న నిర్దేశాల* ప్రకారం నడుచుకోని ప్రతీ సహోదరునికి దూరంగా ఉండమని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరున ఇప్పుడు మీకు నిర్దేశాలు ఇస్తున్నాం.+ 7 మమ్మల్ని ఎలా ఆదర్శంగా తీసుకోవాలో మీకు తెలుసు.+ ఎందుకంటే మేము మీ దగ్గర ఉన్నప్పుడు పద్ధతిగా నడుచుకున్నాం, 8 ఎవరి దగ్గరా ఉచితంగా* భోజనం చేయలేదు.+ అయితే మేము మీలో ఏ ఒక్కరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్లు ఎంతో కష్టపడి పనిచేశాం.+ 9 మాకు అధికారం లేక కాదుగానీ+ మీకు ఆదర్శంగా ఉండాలని+ అలా చేశాం. 10 నిజానికి మేము మీతో ఉన్నప్పుడు, “ఎవరికైనా పనిచేయడం ఇష్టంలేకపోతే వాళ్లు భోజనం చేయకూడదు”+ అని ఆదేశించేవాళ్లం. 11 మీలో కొందరు పద్ధతిగా నడుచుకోవట్లేదని,+ అసలు ఏ పనీ చేయట్లేదని, తమకు సంబంధంలేని విషయాల్లో తలదూరుస్తున్నారని+ మాకు వార్తలు అందుతున్నాయి. 12 ప్రభువైన యేసుక్రీస్తు పేరున అలాంటివాళ్లకు మేము ఆజ్ఞాపించేది, ఉపదేశించేది ఏమిటంటే, వాళ్లు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ల పని వాళ్లు చూసుకోవాలి, సొంతగా సంపాదించుకున్న ఆహారం తినాలి.+
13 సహోదరులారా, మీరైతే మంచి చేయడం మానకండి. 14 ఎవరైనా మేము ఈ ఉత్తరంలో చెప్పిన మాటకు లోబడకపోతే, అతను సిగ్గుపడేలా అతనికి గుర్తువేసి అతనితో సహవాసం మానేయండి.+ 15 అయితే అతన్ని శత్రువుగా చూడకండి, బదులుగా అతన్ని సహోదరుడిగా భావించి ఉపదేశిస్తూ ఉండండి.+
16 శాంతికి మూలమైన ప్రభువు అన్ని విషయాల్లో మీకు శాంతిని అనుగ్రహిస్తూ ఉండాలి.+ ప్రభువు మీ అందరికీ తోడుండాలి.
17 పౌలు అనే నేను స్వహస్తాలతో+ నా శుభాకాంక్షలు రాస్తున్నాను. నా ఉత్తరాలన్నిటినీ గుర్తుపట్టడానికి నా చేతిరాతే మీకు గుర్తు, ఇదే నా చేతిరాత.
18 మన ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీ అందరికీ తోడుండాలి.
సీల అని కూడా పిలవబడ్డాడు.
లేదా “శ్రమలు.”
లేదా “పగ తీర్చుకుంటాడు.”
అనుబంధం A5 చూడండి.
లేదా “ప్రేరేపిత సందేశం.”
లేదా “మోసగించకుండా.”
అనుబంధం A5 చూడండి.
లేదా “బలపర్చాలి.”
అనుబంధం A5 చూడండి.
లేదా “వాళ్లు” అయ్యుంటుంది.
లేదా “సంప్రదాయం.”
లేదా “డబ్బు చెల్లించకుండా.”