కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt 1 థెస్సలొనీకయులు 1:1-5:28
  • 1 థెస్సలొనీకయులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 1 థెస్సలొనీకయులు
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 థెస్సలొనీకయులు

థెస్సలొనీకయులకు రాసిన మొదటి ఉత్తరం

1 తండ్రైన దేవునితో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తుతో ఐక్యంగా ఉన్న థెస్సలొనీకయుల సంఘానికి పౌలు, సిల్వాను,*+ తిమోతి+ రాస్తున్న ఉత్తరం.

దేవుడు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.

2 మేము మా ప్రార్థనల్లో మీ అందర్నీ గుర్తుచేసుకున్న ప్రతీసారి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం.+ 3 విశ్వాసం వల్ల మీరు చేస్తున్న పనిని, ప్రేమతో మీరు చేస్తున్న కృషిని, ప్రభువైన యేసుక్రీస్తు మీద మీకున్న నిరీక్షణనుబట్టి+ మీరు చూపిస్తున్న సహనాన్ని తండ్రైన దేవుని ముందు మేము ఎప్పుడూ గుర్తుచేసుకుంటున్నాం. 4 దేవుడు ప్రేమించే సహోదరులారా, ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడని మాకు తెలుసు. 5 ఎందుకంటే, మేము మీకు మంచివార్తను కేవలం మాటలతో మాత్రమే కాదుగానీ దేవుని పవిత్రశక్తితో, బలమైన నమ్మకంతో ప్రకటించాం, అది మీపై గొప్ప ప్రభావం చూపించింది. మీ మంచి కోసం మేము మీ మధ్య ఎలా పనిచేశామో మీకే తెలుసు. 6 మీరు మమ్మల్ని, ప్రభువును ఆదర్శంగా తీసుకున్నారు.+ ఎందుకంటే, మీరు ఎన్నో కష్టాల్లో ఉన్నా+ పవిత్రశక్తి వల్ల కలిగే సంతోషంతో వాక్యాన్ని స్వీకరించారు. 7 అలా మీరు మాసిదోనియ, అకయ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులందరికీ ఆదర్శంగా నిలిచారు.

8 మీ వల్ల మాసిదోనియ, అకయ ప్రాంతాల్లోని ప్రజలు యెహోవా* వాక్యాన్ని విన్నారు. అంతేకాదు, దేవుని మీద మీకున్న విశ్వాసం గురించి అన్ని ప్రాంతాల వాళ్లకు తెలిసింది.+ కాబట్టి ఇక మేము ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. 9 ఎందుకంటే, మేము మిమ్మల్ని మొదటిసారి ఎలా కలిశామో, మీరు జీవంగల సత్యదేవునికి దాసులుగా ఉండడానికి ఎలా మీ విగ్రహాల్ని వదిలేసి+ దేవునివైపు తిరిగారో వాళ్లే చెప్తుంటారు. 10 అంతేకాదు, దేవుడు మృతుల్లో నుండి బ్రతికించిన తన కుమారుడి కోసం, అంటే యేసు కోసం మీరు ఎలా ఎదురుచూస్తున్నారో+ వాళ్లు చెప్తుంటారు. రానున్న దేవుని ఆగ్రహం+ నుండి మనల్ని రక్షించేది ఆయనే.

2 సహోదరులారా, మేము మీ దగ్గరికి రావడం వృథా అవ్వలేదని మీకు బాగా తెలుసు.+ 2 ఎందుకంటే, మేము ఫిలిప్పీలో ఉండగా మొదట్లో బాధలు అనుభవించాం,+ అవమానాలపాలయ్యాం. ఈ విషయం మీకు కూడా తెలుసు. అయినాసరే, మన దేవుని సహాయంతో మేము ధైర్యం కూడగట్టుకుని, ఎంతో వ్యతిరేకత మధ్య* మీకు దేవుని గురించిన మంచివార్తను ప్రకటించాం.+ 3 మేము తప్పుడు ఆలోచనలతోనో, అపవిత్రమైన, మోసపూరితమైన ఉద్దేశాలతోనో మీకు ఉపదేశించట్లేదు. 4 అయితే, మంచివార్తను ప్రకటించే బాధ్యత చేపట్టడానికి దేవుడు మమ్మల్ని అర్హులుగా ఎంచాడు కాబట్టి, మేము మనుషుల్ని సంతోషపెట్టాలని కాకుండా మా హృదయాల్ని పరిశోధించే దేవుణ్ణి+ సంతోషపెట్టాలని మాట్లాడుతున్నాం.

5 నిజానికి, మేము ఎప్పుడూ ముఖస్తుతి చేయలేదని, అత్యాశతో+ లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడలేదని మీకు తెలుసు; దీనికి దేవుడే సాక్షి! 6 అంతేకాదు మేము మనుషుల నుండి, అంటే మీ నుండో, ఇతరుల నుండో ఘనత పొందాలని ప్రయత్నించలేదు. కావాలంటే మేము క్రీస్తు అపొస్తలులుగా మీ మీద ఎక్కువ ఖర్చుల భారం మోపవచ్చు.+ 7 కానీ మేము, పాలిచ్చే తల్లి తన పిల్లల్ని అపురూపంగా చూసుకున్నట్టు మీతో మృదువుగా వ్యవహరించాం. 8 మీ మీద ఉన్న వాత్సల్యం వల్ల, మీకు దేవుని గురించిన మంచివార్తను చెప్పడమే కాదు, మీకోసం మా ప్రాణాల్ని కూడా ఇవ్వాలని నిశ్చయించుకున్నాం,+ ఎందుకంటే మీరు మాకు చాలా ప్రియమైనవాళ్లు.+

9 సహోదరులారా, మేము ఎంత కష్టపడ్డామో, ఎంత ప్రయాసపడ్డామో మీకు ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. మేము దేవుని గురించిన మంచివార్తను మీకు ప్రకటించినప్పుడు, మీలో ఎవ్వరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టపడి పనిచేశాం.+ 10 మేము విశ్వాసులైన మీతో విశ్వసనీయంగా, నీతిగా, నింద లేకుండా నడుచుకున్నాం అనడానికి మీరే సాక్షులు, అలాగే దేవుడు కూడా. 11 తండ్రి తన పిల్లలతో వ్యవహరించినట్టు మేము మీతో వ్యవహరించాం.+ మీకు ఉపదేశాన్ని, ఊరటను, మీలో ప్రతీ ఒక్కరికి సలహాల్ని ఇస్తూ వచ్చాం.+ ఈ విషయం మీకు బాగా తెలుసు. 12 మీరు దేవునికి నచ్చేలా, అంటే మిమ్మల్ని తన రాజ్యంలోకి పిలిచి+ మీకు తన మహిమను ఇచ్చే దేవునికి+ నచ్చేలా నడుచుకోవాలని+ మేము అలా చేశాం.

13 నిజానికి, ఇందుకే మేము మానకుండా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం.+ ఎందుకంటే, మీరు మా దగ్గర దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దాన్ని మనుషుల వాక్యంలా కాకుండా దేవుని వాక్యంలా స్వీకరించారు. అది నిజంగా దేవుని వాక్యమే. ఆ వాక్యమే విశ్వాసులైన మీ మీద గొప్ప ప్రభావం చూపిస్తోంది. 14 ఎందుకంటే సహోదరులారా, యూదయలో క్రీస్తుయేసుతో ఐక్యంగా ఉన్న దేవుని సంఘాల్ని మీరు ఆదర్శంగా తీసుకున్నారు; వాళ్లు యూదుల చేతుల్లో అనుభవిస్తున్న కష్టాల్నే మీరు మీ సొంత ఊరివాళ్ల చేతుల్లో అనుభవించారు.+ 15 ఆ యూదులు చివరికి ప్రభువైన యేసును, ప్రవక్తల్ని కూడా చంపారు,+ మమ్మల్ని హింసించారు.+ వాళ్లు దేవుణ్ణి సంతోషపెట్టట్లేదు. పైగా, మనుషులందరికీ ప్రయోజనం చేకూర్చే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. 16 ఎలాగంటే, అన్యజనులు రక్షణ పొందేలా మేము మంచివార్త ప్రకటిస్తుంటే వాళ్లు అడ్డుకుంటున్నారు.+ ఈ విధంగా, వాళ్ల పాపాలు ఇంకా ఎక్కువౌతున్నాయి. చివరికి దేవుని ఆగ్రహం వాళ్ల మీదికి వచ్చేసింది.+

17 సహోదరులారా, మేము కొంతకాలం మీకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు (మేము మిమ్మల్ని చూడలేకపోయినా మీరు మా హృదయాల్లో ఉన్నారు), మిమ్మల్ని చూడాలనే బలమైన కోరికతో మిమ్మల్ని కలవడానికి అన్నిరకాలుగా ప్రయత్నించాం. 18 అందుకే మేము మీ దగ్గరికి రావాలనుకున్నాం. పౌలు అనే నేను ఒక్కసారి కాదు, రెండుసార్లు అలా రావడానికి ప్రయత్నించాను. కానీ సాతాను మా దారిని అడ్డుకున్నాడు. 19 మన ప్రభువైన యేసు ప్రత్యక్షత సమయంలో ఆయన ఎదుట మా నిరీక్షణ, మా ఆనందం, మా సంతోష కిరీటం ఎవరు? మీరే కదా?+ 20 అవును, మీరే మా ఘనత, మా ఆనందం.

3 కాబట్టి మేము ఇక తట్టుకోలేకపోయినప్పుడు, ఒంటరిగా ఏథెన్సులో+ ఉండిపోవడమే మంచిదనుకొని, 2 మన సహోదరుడూ క్రీస్తు గురించిన మంచివార్త విషయంలో దేవుని పరిచారకుడూ* అయిన తిమోతిని+ మీ దగ్గరికి పంపించాం. మీ విశ్వాసం విషయంలో మిమ్మల్ని స్థిరపర్చడానికి,* ఓదార్చడానికి అతన్ని పంపించాం. 3 ఈ శ్రమల వల్ల ఎవ్వరూ విశ్వాసంలో బలహీనపడకూడదని* అలా పంపించాం. ఇలాంటి శ్రమలు మనం అనుభవించక తప్పదని+ మీకు కూడా తెలుసు. 4 ఎందుకంటే, మేము మీ దగ్గర ఉన్నప్పుడు, మనకు శ్రమలు వస్తాయని ముందుగానే మీతో చెప్తూ వచ్చాం. ఇప్పుడు జరిగింది అదేనని మీకు తెలుసు.+ 5 అందుకే, నేను ఇక తట్టుకోలేకపోయినప్పుడు, మీ నమ్మకత్వం గురించి తెలుసుకోవడానికి తిమోతిని పంపించాను.+ అపవాది*+ ఏదోకరకంగా మిమ్మల్ని ప్రలోభపెట్టాడేమో, మేము పడ్డ కష్టం వృథా అయిపోయిందేమో అనే ఆందోళనతో అతన్ని పంపించాను.

6 అయితే ఇప్పుడే తిమోతి మీ దగ్గర నుండి వచ్చి,+ మీ నమ్మకత్వం గురించి, మీ ప్రేమ గురించి సంతోషకరమైన వార్త చెప్పాడు. అలాగే, మీరు ఎప్పుడూ మమ్మల్ని ప్రేమతో గుర్తుచేసుకుంటున్నారని, మేము మిమ్మల్ని చూడాలని తపిస్తున్నట్టే మీరూ మమ్మల్ని చూడాలని తపిస్తున్నారని మాకు చెప్పాడు. 7 అందుకే సహోదరులారా, మాకు ఇన్ని కష్టాలూ శ్రమలూ వచ్చినా, మీ వల్ల, మీరు చూపించే నమ్మకత్వం వల్ల మాకు ఊరట కలిగింది.+ 8 ప్రభువు శిష్యులుగా మీరు స్థిరంగా నిలబడితే మాకు కొత్త బలం వస్తుంది.* 9 మీ విషయంలో దేవుని ముందు మాకు కలుగుతున్న గొప్ప సంతోషాన్ని బట్టి మీ గురించి ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం? 10 మిమ్మల్ని చూసేలా, మీ విశ్వాసం బలపడడానికి కావాల్సిన సహాయం చేసేలా అవకాశం కలిగించమని మేము రాత్రింబగళ్లు ఎంతో పట్టుదలతో దేవుణ్ణి వేడుకుంటున్నాం.+

11 మన తండ్రైన దేవుడు, అలాగే మన ప్రభువైన యేసు మేము మీ దగ్గరికి వచ్చేలా మార్గం తెరవాలని కోరుకుంటున్నాం. 12 అంతేకాదు, మీ మీద మాకున్న ప్రేమ ఎక్కువౌతున్నట్టే, మీకు మీ తోటి విశ్వాసుల మీద, అలాగే అందరి మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువయ్యేలా+ ప్రభువు మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. 13 అలా, మన ప్రభువైన యేసు తన పవిత్రులందరితో పాటు ప్రత్యక్షమైనప్పుడు,+ మన తండ్రైన దేవుని ముందు మీ హృదయాల్ని స్థిరపర్చాలని, మిమ్మల్ని నిందలేనివాళ్లుగా, పవిత్రులుగా చేయాలని+ కోరుకుంటున్నాం.

4 సహోదరులారా, దేవుణ్ణి సంతోషపెట్టడానికి మీరు ఎలా నడుచుకోవాలో మేము మీకు నిర్దేశాలు ఇచ్చాం,+ నిజానికి మీరు ఇప్పుడు అలాగే నడుచుకుంటున్నారు. అయితే, ఇంకా పూర్తిస్థాయిలో అలా నడుచుకోమని యేసు ప్రభువు పేరున మిమ్మల్ని అర్థిస్తున్నాం, బ్రతిమాలుతున్నాం. 2 యేసు ప్రభువు పేరున మేము మీకు ఇచ్చిన నిర్దేశాలేమిటో* మీకు తెలుసు.

3 మీరు పవిత్రులుగా ఉండాలి,+ లైంగిక పాపానికి* దూరంగా ఉండాలి+ అనేదే దేవుని ఇష్టం. 4 మీరు పవిత్రంగా,+ గౌరవప్రదంగా ఉండాలంటే, మీలో ప్రతీ ఒక్కరికి మీ శరీరాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలిసుండాలి.+ 5 మీరు దేవుడు తెలియని ప్రజల్లా+ అత్యాశతో కూడిన లైంగిక వాంఛతో+ రగిలిపోకూడదు. 6 ఈ విషయంలో ఎవ్వరూ హద్దులు దాటి తోటి సహోదరుని హక్కులకు భంగం కలిగించకూడదు. ఎందుకంటే వీటన్నిటి విషయంలో యెహోవా* తగిన శిక్ష విధిస్తాడు. దీని గురించి మేము ఇంతకుముందు కూడా చెప్పాం, గట్టిగా హెచ్చరించాం. 7 ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రంగా జీవించడానికి కాదు, పవిత్రంగా జీవించడానికి.+ 8 కాబట్టి ఎవరైనా ఈ విషయాన్ని లెక్కచేయకపోతే, అతను మనిషిని కాదుగానీ మీకు తన పవిత్రశక్తినిచ్చే దేవుణ్ణే+ లెక్కచేయట్లేదు.+

9 ఇక సహోదర ప్రేమ విషయానికొస్తే,+ దాని గురించి మేము మీకు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పిస్తున్నాడు.+ 10 నిజానికి, మీరు మాసిదోనియ అంతటా ఉన్న సహోదరులందరి మీద ప్రేమ చూపిస్తున్నారు. అయితే సహోదరులారా, ఇంకా పూర్తిస్థాయిలో అలా ప్రేమ చూపిస్తూ ఉండమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. 11 మేము మీకు నిర్దేశాలు ఇచ్చినట్టే, మీరు ప్రశాంతంగా జీవించాలని,+ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదని,+ మీ చేతులతో కష్టపడి పనిచేయాలని+ గట్టిగా తీర్మానించుకోండి. 12 అప్పుడు మీరు గౌరవప్రదంగా నడుచుకుంటున్నారని బయటివాళ్లు గమనిస్తారు,+ మీకు ఏ లోటూ ఉండదు.

13 అంతేకాదు సహోదరులారా, చనిపోయినవాళ్ల*+ భవిష్యత్తు గురించి మీకు తెలియకుండా ఉండడం, మీరు నిరీక్షణలేని ప్రజల్లా దుఃఖంలో మునిగిపోవడం+ నాకు ఇష్టంలేదు. 14 యేసు చనిపోయి బ్రతికించబడ్డాడని మనం విశ్వసిస్తే,+ యేసు శిష్యులుగా చనిపోయినవాళ్లను కూడా దేవుడు యేసుతోపాటు ఉండడానికి బ్రతికిస్తాడని విశ్వసిస్తాం.+ 15 యెహోవా* వాక్యం ఆధారంగా మేము మీకు చెప్పేదేమిటంటే, మనలో ఎవరైతే ప్రభువు ప్రత్యక్షత కాలం వరకు బ్రతికుంటారో వాళ్లు ఇప్పటికే చనిపోయినవాళ్ల* కన్నా ఏ విధంగానూ ముందుగా బ్రతికించబడరు; 16 ఎందుకంటే, స్వయంగా ప్రభువే అధికార స్వరంతో, ప్రధానదూత+ స్వరంతో, దేవుని బాకా శబ్దంతో పరలోకం నుండి దిగివస్తాడు; క్రీస్తు శిష్యులుగా చనిపోయినవాళ్లు ముందుగా బ్రతికించబడతారు.+ 17 ఆ తర్వాత, బ్రతికున్న మనం వాళ్లతోపాటు ఉండడానికి, పైనున్న ప్రభువును కలవడానికి మేఘాల మీద వెళ్తాం;+ అలా మనం ఎప్పుడూ ప్రభువుతోనే ఉంటాం.+ 18 ఈ మాటలతో ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండండి.

5 సహోదరులారా, సమయాల గురించి, కాలాల గురించి మీకు ఏమీ రాయాల్సిన అవసరం లేదు. 2 ఎందుకంటే, యెహోవా* రోజు+ రాత్రిపూట దొంగ వచ్చినట్టు వస్తుందని+ మీకు బాగా తెలుసు. 3 ప్రజలు ఎప్పుడైతే, “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని అంటూ ఉంటారో అప్పుడు, గర్భిణీ స్త్రీకి పురిటినొప్పులు వచ్చినట్టు, హఠాత్తుగా వాళ్ల మీదికి నాశనం వస్తుంది,+ వాళ్లు అస్సలు తప్పించుకోలేరు. 4 అయితే సహోదరులారా, ఆ రోజు అకస్మాత్తుగా మీ మీదికి రావడానికి మీరేమీ దొంగల్లా చీకట్లో లేరు. 5 ఎందుకంటే, మీరంతా వెలుగు పుత్రులు, పగటి పుత్రులు.+ మనం రాత్రికో, చీకటికో చెందినవాళ్లం కాదు.+

6 కాబట్టి, ఇతరుల్లా మనం నిద్రపోకుండా మెలకువగా ఉందాం,+ మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుందాం. 7 ఎందుకంటే, నిద్రపోయేవాళ్లు రాత్రిపూట నిద్రపోతారు, మద్యం మత్తులో ఉండేవాళ్లు రాత్రిపూట మత్తుగా ఉంటారు. 8 అయితే పగటికి చెందిన మనం మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుందాం; విశ్వాసం, ప్రేమ అనే కవచాన్ని* ధరించుకుందాం; రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని* పెట్టుకుందాం.+ 9 ఎందుకంటే, దేవుడు మనల్ని ఎంచుకున్నది తన ఆగ్రహం చూపించడానికి కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించడానికి.+ 10 మనం మెలకువగా ఉన్నా, నిద్రపోయినా* తనతో కలిసి జీవించాలని+ క్రీస్తు మన కోసం చనిపోయాడు. 11 కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టే, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ,* ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి.+

12 సహోదరులారా, ఇప్పుడు మేము మిమ్మల్ని కోరేదేమిటంటే, మీ మధ్య కష్టపడి పనిచేస్తూ, ప్రభువు సేవలో మీకు నాయకత్వం వహిస్తూ, మీకు ఉపదేశిస్తున్న వాళ్లను గౌరవించండి; 13 వాళ్లు చేసే పనిని బట్టి, ప్రేమతో వాళ్లమీద విశేషమైన గౌరవం చూపించండి.+ ఒకరితో ఒకరు శాంతిగా మెలగండి.+ 14 అదే సమయంలో సహోదరులారా, మేము మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, పద్ధతిగా నడుచుకోనివాళ్లను హెచ్చరించండి,+ కృంగినవాళ్లతో* ఊరటనిచ్చేలా మాట్లాడండి, బలహీనులకు మద్దతివ్వండి, అందరితో ఓర్పుగా ఉండండి.+ 15 మీలో ఎవ్వరూ హాని చేసినవాళ్లకు తిరిగి హాని చేయకూడదు.+ బదులుగా తోటి విశ్వాసులకు, అలాగే అందరికీ ఏది మంచిదో దాన్నే ఎప్పుడూ చేయండి.+

16 ఎప్పుడూ ఆనందిస్తూ ఉండండి.+ 17 ఎప్పుడూ ప్రార్థించండి.+ 18 ప్రతీ విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి.+ క్రీస్తుయేసు శిష్యులుగా మీరు అలా చేయడమే దేవుని ఇష్టం. 19 దేవుని పవిత్రశక్తి జ్వాలను ఆర్పకండి.+ 20 ప్రవచనాల్ని చులకనగా చూడకండి.+ 21 అన్నిటినీ పరీక్షించి, ఏది మంచిదో నిర్ధారించుకోండి,+ దాన్ని గట్టిగా పట్టుకోండి. 22 అన్నిరకాల దుష్టత్వానికి దూరంగా ఉండండి.+

23 శాంతికి మూలమైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని పూర్తిగా పవిత్రపర్చాలి. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత వరకు* మీ స్ఫూర్తి, మీ ప్రాణం,* మీ శరీరం అంతా ఏ విషయంలోనూ కళంకం* లేకుండా కాపాడబడాలి.+ 24 మిమ్మల్ని పిలుస్తున్న దేవుడు నమ్మకమైనవాడు, ఆయన తప్పకుండా అలా చేస్తాడు.

25 సహోదరులారా, మా కోసం ప్రార్థిస్తూ ఉండండి.+

26 సహోదరులందర్నీ పవిత్రమైన ముద్దు పెట్టుకొని పలకరించండి.

27 ఈ ఉత్తరాన్ని సహోదరులందరికీ చదివి వినిపించమని ప్రభువు పేరున మిమ్మల్ని వేడుకుంటున్నాను.+

28 మన ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీకు తోడుండాలి.

సీల అని కూడా పిలవబడ్డాడు.

అనుబంధం A5 చూడండి.

లేదా “సంఘర్షణతో” అయ్యుంటుంది.

లేదా “దేవుని తోటి పనివాడూ” అయ్యుంటుంది.

లేదా “బలపర్చడానికి.”

లేదా “ఊగిసలాడకూడదని.”

లేదా “ప్రలోభపెట్టేవాడు.”

లేదా “మేము బ్రతికినట్టే.”

లేదా “ఆదేశాలేమిటో.”

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

అనుబంధం A5 చూడండి.

అక్ష., “మరణంలో నిద్రిస్తున్నవాళ్ల.”

అనుబంధం A5 చూడండి.

అక్ష., “మరణంలో నిద్రిస్తున్నవాళ్ల.”

అనుబంధం A5 చూడండి.

లేదా “ఛాతి కవచాన్ని.”

అంటే, హెల్మెట్‌.

లేదా “మరణంలో నిద్రించినా.”

లేదా “ఒకరికొకరు ఊరటను ఇచ్చుకుంటూ.”

లేదా “నిరుత్సాహంలో ఉన్నవాళ్లతో.”

అక్ష., “ప్రత్యక్షమైనప్పుడు.”

పదకోశం చూడండి.

లేదా “నింద.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి