కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt కొలొస్సయులు 1:1-4:18
  • కొలొస్సయులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కొలొస్సయులు
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
కొలొస్సయులు

కొలొస్సయులకు రాసిన ఉత్తరం

1 దేవుని ఇష్టప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడినైన పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి+ 2 కొలొస్సయిలో క్రీస్తు శిష్యులుగా ఉన్న పవిత్రులకు, నమ్మకమైన సహోదరులకు రాస్తున్న ఉత్తరం.

మన తండ్రైన దేవుడు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.

3 మేము మీ గురించి ప్రార్థించినప్పుడల్లా, మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం. 4 ఎందుకంటే, క్రీస్తుయేసు మీద మీకున్న విశ్వాసం గురించి, పవిత్రులందరి మీద మీకున్న ప్రేమ గురించి మేము విన్నాం. 5 పరలోకంలో మీకోసం సిద్ధంగా ఉన్నవాటి మీద మీకున్న నిరీక్షణ+ వల్ల మీరు ఆ ప్రేమ చూపిస్తున్నారు. మంచివార్త గురించిన సత్యం మీకు ప్రకటించబడినప్పుడు మీరు ఆ నిరీక్షణ గురించి విన్నారు. 6 మంచివార్త ఫలించి ప్రపంచమంతటా వ్యాపిస్తున్నట్టే,+ మీ మధ్య కూడా ఫలించి వ్యాపిస్తోంది. మీరు దేవుని అపారదయ గురించిన సత్యాన్ని విని, దాన్ని సరిగ్గా అర్థంచేసుకున్న రోజు నుండి అలా జరుగుతోంది. 7 మా ప్రియమైన తోటి దాసుడూ క్రీస్తుకు నమ్మకమైన పరిచారకుడూ అయిన ఎపఫ్రా+ దగ్గర మీరు నేర్చుకున్నది ఆ సత్యాన్నే. 8 మీరు దేవుని పవిత్రశక్తి సహాయంతో అలవర్చుకున్న ప్రేమ గురించి అతనే మాకు చెప్పాడు.

9 అందుకే, అది విన్న రోజు నుండి మేము మానకుండా మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నాం.+ మీరు అసలైన తెలివిని, పవిత్రశక్తి ఇచ్చే అవగాహనను పొంది+ దేవుని ఇష్టం గురించిన సరైన జ్ఞానంతో నిండివుండాలని;+ 10 మీరు ప్రతీ మంచిపని చేస్తూ, దేవుని గురించిన సరైన జ్ఞానం విషయంలో ఎదుగుతూ+ ఆయన్ని పూర్తిగా సంతోషపెట్టేలా యెహోవాకు* తగినట్టు నడుచుకోవాలని; 11 మీరు ఓర్పుతో, సంతోషంతో అన్నిటినీ సహించేలా దేవుని గొప్పశక్తి మీకు కావాల్సిన బలాన్ని ఇవ్వాలని;+ 12 వెలుగులో ఉన్న పవిత్రులకు తాను ఇచ్చే స్వాస్థ్యంలో భాగం పొందేలా+ మిమ్మల్ని అర్హుల్ని చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలని ప్రార్థిస్తున్నాం.

13 దేవుడు మనల్ని చీకటి అధికారం నుండి విడిపించి,+ తన ప్రియ కుమారుని రాజ్యంలోకి తెచ్చాడు. 14 ఆ కుమారుని ద్వారానే విమోచన క్రయధనం* వల్ల మనం విడుదలయ్యాం, అంటే మన పాపాలకు క్షమాపణ దొరికింది.+ 15 ఆయన, కనిపించని దేవుని ప్రతిబింబం,+ మొత్తం సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడు;+ 16 మిగతా వాటన్నిటినీ, అంటే అటు పరలోకంలో ఇటు భూమ్మీద, కనిపించేవాటినీ కనిపించనివాటినీ అవి సింహాసనాలైనా, పరిపాలనలైనా, ప్రభుత్వాలైనా, అధికారాలైనా అన్నిటినీ దేవుడు ఆయన్ని ఉపయోగించుకునే సృష్టించాడు.+ అన్నీ ఆయన ద్వారా,+ ఆయన కోసం సృష్టించబడ్డాయి. 17 అంతేకాదు, ఆ కుమారుడు మిగతా వాటన్నిటికన్నా ముందే ఉన్నాడు,+ దేవుడు ఆయన్ని ఉపయోగించుకునే వాటన్నిటినీ ఉనికిలోకి తెచ్చాడు. 18 సంఘమనే శరీరానికి ఆయనే శిరస్సు.*+ ఆయనే అన్నిటికీ ఆరంభం. మృతుల్లో నుండి మొట్టమొదట బ్రతికించబడింది కూడా ఆయనే,+ అలా ఆయన అన్నిట్లో మొదటివాడు అయ్యాడు; 19 ఎందుకంటే, అన్నిటినీ ఆయనలో సంపూర్ణం చేయడం+ దేవునికి నచ్చింది. 20 అంతేకాదు అన్నీ, అంటే ఇటు భూమ్మీద ఉన్నవి, అటు పరలోకంలో ఉన్నవి ఆ కుమారుని ద్వారా మళ్లీ తనతో శాంతియుత సంబంధం కలిగివుండేలా చేయడం+ దేవునికి నచ్చింది. ఆ కుమారుడు హింసాకొయ్య* మీద చిందించిన రక్తం వల్లే అది సాధ్యమైంది.+

21 నిజంగానే, ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండేవాళ్లు, దేవునికి శత్రువులుగా ఉండేవాళ్లు; ఎందుకంటే, మీ మనసు చెడ్డవాటి మీద ఉండేది; 22 కానీ ఇప్పుడు, శరీరాన్ని అర్పించిన తన కుమారుని మరణం ద్వారా మీరు మళ్లీ తనతో శాంతియుత సంబంధం కలిగివుండేలా దేవుడు చేశాడు. మిమ్మల్ని తన ముందు పవిత్రులుగా, మచ్చలేనివాళ్లుగా, నిందలేనివాళ్లుగా నిలబెట్టుకోవాలని+ ఆయన అలా చేశాడు. 23 అయితే అందుకోసం మీరు మీ విశ్వాసాన్ని పునాది+ మీద స్థాపించుకుని, స్థిరంగా ఉంటూ+ అందులో కొనసాగాలి.+ అంతేకాదు, మీరు ఏ మంచివార్తనైతే విన్నారో, ఏ మంచివార్తయితే భూమంతటా* ప్రకటించబడిందో+ ఆ మంచివార్త ఇచ్చిన నిరీక్షణ నుండి మీరు పక్కకు వెళ్లకూడదు. పౌలు అనే నేను ఆ మంచివార్తకే పరిచారకుణ్ణి అయ్యాను.

24 ఇప్పుడు నేను మీకోసం పడుతున్న బాధల్ని బట్టి సంతోషిస్తున్నాను; క్రీస్తు విషయంలో ఆయన శరీరం కోసం, అంటే సంఘం కోసం+ నేను* అనుభవించాల్సి ఉన్న శ్రమల్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను.+ 25 దేవుడు నాకు అప్పగించిన బాధ్యత+ ప్రకారం ఆ సంఘానికే నేను పరిచారకుణ్ణి అయ్యాను. మీకు ప్రయోజనం కలిగేలా దేవుని వాక్యాన్ని పూర్తిగా ప్రకటించాలని, 26 అంటే ఎన్నో యుగాలుగా,* ఎన్నో తరాలుగా దాచబడిన+ పవిత్ర రహస్యాన్ని+ ప్రకటించాలని దేవుడు నాకు ఆ బాధ్యతను అప్పగించాడు. ఆ రహస్యం ఇప్పుడు దేవుని పవిత్రులకు బయల్పర్చబడింది;+ 27 అలాగే అన్యజనుల్లో ప్రకటించబడుతున్న ఆ పవిత్ర రహస్యం గొప్ప సంపదల్ని పవిత్రులైన మీకు వెల్లడిచేయడం దేవునికి నచ్చింది.+ మీరు క్రీస్తుతో ఐక్యమవ్వడం, ఆయనతో పాటు మహిమపర్చబడడం+ అన్నదే ఆ రహస్యం. 28 దేవుని ముందు ప్రతీ ఒక్కర్ని పరిణతిగల క్రీస్తు శిష్యునిగా నిలబెట్టడం కోసం+ క్రీస్తు గురించే మనం ప్రతీ ఒక్కరికి ప్రకటిస్తున్నాం, ఉపదేశిస్తున్నాం, పూర్తి తెలివితో బోధిస్తున్నాం. 29 ఇందుకోసమే నేను కష్టపడుతున్నాను, నాలో బలంగా పనిచేస్తున్న ఆయన శక్తి సహాయంతో తీవ్రంగా కృషిచేస్తున్నాను.+

2 మీ కోసం, లవొదికయలో ఉన్నవాళ్ల కోసం,+ ఇప్పటివరకు నన్ను చూడని వాళ్లందరి కోసం నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. 2 అలా వాళ్లకు ఊరట కలగాలని,+ వాళ్లంతా ప్రేమతో ఒక్కటవ్వాలని,+ వాళ్లు స్పష్టమైన, ఖచ్చితమైన అవగాహన అనే సంపదనూ దేవుని పవిత్ర రహస్యం గురించిన సరైన జ్ఞానం అనే సంపదనూ కలిగివుండాలని నా ఉద్దేశం. ఆ పవిత్ర రహస్యం క్రీస్తే.+ 3 తెలివికి, జ్ఞానానికి సంబంధించిన సంపదలన్నీ ఆయనలోనే జాగ్రత్తగా దాచబడివున్నాయి.+ 4 మీరు ఎవరి మాయమాటల వల్లా మోసపోకూడదని ఈ విషయం చెప్తున్నాను. 5 నేను మీ దగ్గర లేకపోయినా, నా మనసు మాత్రం మీతోనే ఉంది. మీరు సక్రమంగా నడుచుకోవడం,+ క్రీస్తు మీద మీ విశ్వాసం స్థిరంగా ఉండడం+ చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది.

6 కాబట్టి, మీరు ప్రభువైన క్రీస్తుయేసును ఎలా అంగీకరించారో, అలాగే ఆయనతో ఐక్యంగా నడుస్తూ ఉండండి. 7 మీరు నేర్చుకున్నట్టే, క్రీస్తు మీద మీకున్న విశ్వాసం లోతుగా వేళ్లూనుకున్న చెట్టులా బలంగా,+ స్థిరంగా ఉండాలి.+ మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు+ మీ విశ్వాసం ఉప్పొంగాలి.

8 క్రీస్తు బోధలకు కాకుండా, మనుషుల సంప్రదాయాలకూ ఈ లోకంలోని ప్రాథమిక విషయాలకూ అనుగుణంగా ఉన్న తత్త్వజ్ఞానంతో, మోసపూరితమైన వట్టి మాటలతో ఎవ్వరూ మిమ్మల్ని బానిసలుగా చేసుకోకుండా* జాగ్రత్తపడండి;+ 9 ఎందుకంటే, దేవుని లక్షణాలన్నీ పూర్తిస్థాయిలో ఉన్నది క్రీస్తులోనే.+ 10 కాబట్టి, ఆయన వల్లే మీరు సంపూర్ణులయ్యారు. ప్రభుత్వాలన్నిటికీ, అధికారాలన్నిటికీ ఆయన శిరస్సుగా ఉన్నాడు.+ 11 ఆయనతో మీకున్న సంబంధం వల్ల మీరు సున్నతి కూడా పొందారు, అది మనుషుల వల్ల పొందే సున్నతి కాదు, బదులుగా పాపభరిత శరీరాన్ని* వదిలేయడం+ ద్వారా క్రీస్తు సేవకులు పొందే సున్నతి.+ 12 ఎందుకంటే, మీరు క్రీస్తు తీసుకున్న బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఆయనతోపాటు పాతిపెట్టబడ్డారు.+ అయితే, ఆయనతో మీకున్న సంబంధం ద్వారా మీరు క్రీస్తుతోపాటు బ్రతికించబడ్డారు.+ ఎందుకంటే, మృతుల్లో నుండి క్రీస్తును లేపిన దేవుని శక్తివంతమైన పనిమీద+ మీకు విశ్వాసం ఉంది.

13 అంతేకాదు మీ పాపాల వల్ల, సున్నతి లేకపోవడం వల్ల చనిపోయిన స్థితిలో ఉన్న మిమ్మల్ని దేవుడు ఆయనతోపాటు బ్రతికించాడు. దేవుడు మన పాపాలన్నిటినీ దయతో క్షమించాడు; 14 చేతితో రాయబడిన, మనకు వ్యతిరేకంగా ఉన్న+ ధర్మశాస్త్రాన్ని తుడిచేశాడు.+ ఆయన దాన్ని మేకులతో హింసాకొయ్యకు* దిగగొట్టి రద్దుచేశాడు.+ 15 ఆ హింసాకొయ్య* ద్వారా దేవుడు ప్రభుత్వాల, అధికారాల బట్టలు తీసేసి, విజయోత్సాహంతో అందరిముందు వాటిని ఖైదీలుగా నడిపించుకొని తీసుకెళ్తూ, వాటిమీద గెలిచానని చూపించాడు.+

16 కాబట్టి మీరు ఏమి తినాలో, ఏమి తాగాలో నిర్ణయించే అవకాశాన్ని గానీ ఫలానా పండుగను, అమావాస్యను, విశ్రాంతి రోజును* ఆచరించాలో వద్దో చెప్పే అవకాశాన్ని గానీ ఎవ్వరికీ ఇవ్వకండి. 17 అవి రాబోయేవాటి నీడ మాత్రమే,+ కానీ నిజం క్రీస్తులో ఉంది.+ 18 దొంగ వినయంలో, దేవదూతల ఆరాధనలో సంతోషిస్తూ, తమకు కలిగిన దర్శనాల విషయంలో పట్టుబట్టే వాళ్లెవరి వల్లా మీ బహుమతిని పోగొట్టుకోకండి. అలాంటివాళ్లు అపరిపూర్ణ మనుషుల్లా ఆలోచిస్తూ, సరైన కారణం లేకుండానే గర్వపడుతుంటారు. 19 వాళ్లు శిరస్సును+ అంటిపెట్టుకొని లేరు. నిజానికి, ఆ శిరస్సు నుండి శరీరమంతా పోషించబడి, కీళ్లు-కండరాలతో చక్కగా అమర్చబడి, దేవుని శక్తితో ఎదుగుతూ ఉంది.+

20 ఈ లోకంలోని ప్రాథమిక విషయాలకు+ సంబంధించి మీరు క్రీస్తుతోపాటు చనిపోయారు. అలాంటిది, మీరు ఇంకా లోకంలో భాగంగా ఉన్నట్టు, 21 “దీన్ని తీసుకోవద్దు, దాన్ని రుచిచూడొద్దు, అది ముట్టుకోవద్దు” అనే ఆజ్ఞలకు+ ఎందుకు లోబడుతున్నారు? 22 నిజానికి అవి, తినగానే తాగగానే మాయమైపోయే వాటికి సంబంధించిన నియమాలు; అవి కేవలం మనుషుల ఆజ్ఞలు, బోధలు మాత్రమే. 23 వాళ్లు ఇష్టమొచ్చినట్టు చేసే ఆరాధనలో, వాళ్లు చూపించే దొంగ వినయంలో, తమ శరీరాల్ని బాధ పెట్టుకోవడంలో తెలివి ఉన్నట్టు కనిపించవచ్చు,+ కానీ శరీర కోరికలతో పోరాడడానికి అవి ఏమాత్రం ఉపయోగపడవు.

3 అయితే మీరు క్రీస్తుతోపాటు బ్రతికించబడివుంటే, పైనున్న వాటినే వెతుకుతూ ఉండండి. క్రీస్తు అక్కడే దేవుని కుడిపక్కన కూర్చొని ఉన్నాడు.+ 2 మీరు పైనున్న వాటిమీదే మనసుపెట్టండి,+ భూమ్మీదున్న వాటిమీద కాదు. 3 ఎందుకంటే మీరు చనిపోయారు, ఇప్పుడు మీ జీవం దేవుని ఇష్టప్రకారం క్రీస్తు దగ్గర దాచబడివుంది. 4 మన జీవమైన క్రీస్తు+ వెల్లడి చేయబడినప్పుడు, మీరు కూడా ఆయనతోపాటు వెల్లడి చేయబడి ఆయన మహిమలో పాలుపంచుకుంటారు.+

5 కాబట్టి, భూమ్మీద ఉన్న మీ శరీర అవయవాల్ని చంపేసుకోండి.+ లైంగిక పాపం,* అపవిత్రత, అదుపులేని లైంగిక వాంఛ,+ చెడు కోరిక, విగ్రహపూజతో సమానమైన అత్యాశ అనేవి వాటిలో నుండే పుడతాయి. 6 వాటివల్ల దేవుని ఆగ్రహం రాబోతుంది. 7 ఒకప్పుడు మీరు కూడా అలాగే ప్రవర్తించేవాళ్లు.+ 8 కానీ ఇప్పుడు మీరు వాటన్నిటినీ వదిలేయాలి. మీరు ఆగ్రహం, కోపం, చెడుతనం, తిట్టడం మానేయాలి,+ మీ నోటి నుండి అసభ్యమైన మాటలు రాకూడదు.+ 9 ఒకరితో ఒకరు అబద్ధమాడకండి.+ మీ పాత వ్యక్తిత్వాన్ని* దాని అలవాట్లతో సహా తీసిపారేయండి,+ 10 అయితే కొత్త వ్యక్తిత్వాన్ని ధరించండి.+ ఆ వ్యక్తిత్వం, దాన్ని సృష్టించిన దేవుణ్ణి ప్రతిబింబించేలా+ సరైన జ్ఞానంతో అంతకంతకూ కొత్తదౌతూ ఉంటుంది. 11 ఇందులో గ్రీకువాళ్లని, యూదులని; సున్నతి చేయించుకున్నవాళ్లని, సున్నతి చేయించుకోనివాళ్లని; విదేశీయులని, సిథియనులని;* దాసులని, స్వతంత్రులని తేడా లేదు. క్రీస్తే అన్నీ, ఆయనే అందరిలో ఉన్నాడు.

12 మీరు దేవుడు ఎంచుకున్న వ్యక్తులు,+ పవిత్రులు, ఆయన ప్రేమించేవాళ్లు కాబట్టి వాత్సల్యంతో కూడిన కనికరాన్ని, దయను, వినయాన్ని,*+ సౌమ్యతను, ఓర్పును+ అలవర్చుకోండి.* 13 ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి.+ ఇతరుల మీద ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నాసరే అలా క్షమించండి.+ యెహోవా* మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి.+ 14 వీటన్నిటి కన్నా ముఖ్యంగా, ప్రేమను అలవర్చుకోండి.* ఎందుకంటే ప్రేమ ప్రజల్ని పూర్తిస్థాయిలో ఐక్యం చేస్తుంది.+

15 అంతేకాదు, మీరు ఒకే శరీరంగా ఉంటూ శాంతితో మెలగాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు కాబట్టి క్రీస్తు శాంతి మీ హృదయాల్లో ఏలనివ్వండి.*+ అలాగే కృతజ్ఞులై ఉండండి. 16 క్రీస్తు సందేశం మీలో పూర్తిగా పనిచేయనివ్వండి, మీకు పూర్తి తెలివిని అనుగ్రహించనివ్వండి. మీరు కీర్తనలతో,+ దేవుణ్ణి స్తుతించే పాటలతో, కృతజ్ఞత* ఉట్టిపడే ఆరాధనా గీతాలతో ఒకరికొకరు బోధించుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి,* అలాగే మీ హృదయాల్లో యెహోవాకు* పాటలు పాడండి.+ 17 మీరు ఏమి మాట్లాడినా, ఏమి చేసినా ప్రతీది యేసు ప్రభువు పేరున చేయండి, ఆయన ద్వారా తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెప్తూ అలా చేయండి.+

18 భార్యలారా, మీ భర్తలకు లోబడివుండండి.+ ప్రభువు శిష్యులు అలా చేయడం సరైనది. 19 భర్తలారా, మీ భార్యల్ని ప్రేమిస్తూ ఉండండి,+ వాళ్ల మీద విపరీతమైన కోపం చూపించకండి.*+ 20 పిల్లలారా, ప్రతీ విషయంలో మీ అమ్మానాన్నల మాట వినండి.*+ ఇది ప్రభువుకు ఇష్టం. 21 తండ్రులారా, మీ పిల్లలకు కోపం తెప్పించకండి.*+ అలాచేస్తే వాళ్లు కృంగిపోతారు.* 22 దాసులారా, భూమ్మీదున్న మీ యజమానులకు ప్రతీ విషయంలో విధేయత చూపించండి.+ మనుషుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో, వాళ్లు చూస్తున్నప్పుడు మాత్రమే కాదుగానీ, యెహోవా* మీదున్న భయంతో మనస్ఫూర్తిగా విధేయత చూపించండి. 23 మీరు ఏమి చేసినా, మనుషుల కోసం చేస్తున్నట్టు కాకుండా, యెహోవా* కోసం చేస్తున్నట్టు మనస్ఫూర్తిగా, మీ పూర్తి శక్తితో చేయండి.+ 24 ఎందుకంటే, మీరు యెహోవా* నుండే స్వాస్థ్యాన్ని బహుమతిగా పొందుతారని మీకు తెలుసు.+ మీ యజమాని అయిన క్రీస్తుకు దాసులుగా ఉండండి. 25 తప్పుచేసిన వ్యక్తికి తప్పకుండా శిక్ష పడుతుంది,+ దేవునికి పక్షపాతం లేదు.+

4 యజమానులారా, మీకు కూడా పరలోకంలో ఒక యజమాని ఉన్నాడని+ గుర్తుంచుకుని, మీ దాసులతో నీతిగా, న్యాయంగా వ్యవహరించండి.

2 పట్టుదలతో ప్రార్థించండి,+ ఈ విషయంలో మెలకువగా ఉంటూ కృతజ్ఞతలు తెలపండి.+ 3 అలాగే మా కోసం కూడా ప్రార్థించండి.+ మేము వాక్యాన్ని ప్రకటించడానికి, క్రీస్తు గురించిన పవిత్ర రహస్యం గురించి మాట్లాడడానికి దేవుడు మార్గం* తెరవాలని వేడుకోండి. ఆ పవిత్ర రహస్యం కోసమే నేను చెరసాలలో ఉన్నాను.+ 4 నేను దాని గురించి మాట్లాడాల్సినంత స్పష్టంగా మాట్లాడేలా సహాయం చేయమని దేవునికి ప్రార్థించండి.

5 మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకుంటూ,* బయటివాళ్లతో తెలివిగా నడుచుకుంటూ ఉండండి.+ 6 మీ మాటలు ఎప్పుడూ దయగా, ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి.+ అప్పుడు, ప్రతీ ఒక్కరికి ఎలా జవాబివ్వాలో మీకు తెలుస్తుంది.+

7 నా ప్రియ సహోదరుడూ ప్రభువు సేవలో నమ్మకమైన పరిచారకుడూ తోటి దాసుడూ అయిన తుకికు+ నా గురించిన సంగతులన్నీ మీకు చెప్తాడు. 8 మేము ఎలా ఉన్నామో మీకు చెప్పడానికి, మీ హృదయాలకు ఊరటనివ్వడానికి అతన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను. 9 అతను, నమ్మకమైన నా ప్రియ సహోదరుడూ మీ ప్రాంతంవాడూ అయిన ఒనేసిముతో+ కలిసి వస్తున్నాడు; వాళ్లిద్దరు ఇక్కడి సంగతులన్నీ మీకు చెప్తారు.

10 నా తోటి ఖైదీ అరిస్తార్కు,+ అలాగే బర్నబా దగ్గరి బంధువు మార్కు+ (మీ దగ్గరికి వస్తే సాదరంగా ఆహ్వానించమని+ నేను చెప్పింది ఇతని గురించే) మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. 11 యూస్తు అనే పేరున్న యేసు కూడా మీకు శుభాకాంక్షలు చెప్తున్నాడు. వీళ్లంతా సున్నతి చేయించుకున్న ప్రజల్లోని వాళ్లు. దేవుని రాజ్యం కోసం పాటుపడే విషయంలో వీళ్లు మాత్రమే నా తోటి పనివాళ్లు, వీళ్లు నాకు ఎంతో ఊరటను ఇచ్చారు.* 12 క్రీస్తుయేసు దాసుడూ మీ ప్రాంతంవాడూ అయిన ఎపఫ్రా+ మీకు శుభాకాంక్షలు చెప్తున్నాడు. మీరు పరిణతిగల వాళ్లలా స్థిరంగా నిలబడాలని, దేవుడు చేయబోయే ప్రతీదాని విషయంలో మీకు గట్టి నిశ్చయత ఉండాలని అతను మీ కోసం ఎప్పుడూ పట్టుదలతో ప్రార్థిస్తున్నాడు. 13 అతను మీ కోసం, అలాగే లవొదికయ, హియెరాపొలి ప్రాంతాల వాళ్ల కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడని అతని గురించి సాక్ష్యం చెప్తున్నాను.

14 ప్రియమైన వైద్యుడు లూకా,+ దేమా+ మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. 15 లవొదికయలో ఉన్న సహోదరులకు, సహోదరి నుంఫాకు, ఆమె ఇంట్లో సమకూడే సంఘానికి+ నా శుభాకాంక్షలు చెప్పండి. 16 ఈ ఉత్తరం మీ దగ్గర చదివి వినిపించాక, లవొదికయవాళ్ల సంఘంలో కూడా చదివే ఏర్పాటు చేయండి.+ అలాగే, లవొదికయవాళ్లకు నేను పంపిన ఉత్తరాన్ని మీ దగ్గర చదివే ఏర్పాటు కూడా చేయండి. 17 అంతేకాదు, ప్రభువు శిష్యునిగా తాను స్వీకరించిన పరిచర్యను పూర్తిచేసేలా దానిమీద శ్రద్ధ పెట్టమని అర్ఖిప్పుకు+ చెప్పండి.

18 పౌలు అనే నేను స్వహస్తాలతో నా శుభాకాంక్షలు రాస్తున్నాను.+ నా సంకెళ్లను గుర్తుపెట్టుకోండి.+ దేవుని అపారదయ మీకు తోడుండాలి.

అనుబంధం A5 చూడండి.

పదకోశం చూడండి.

లేదా “తల.”

పదకోశం చూడండి.

లేదా “ఆకాశం కింద ఉన్న సృష్టంతటికీ.”

అక్ష., “నా శరీరంలో.”

అక్ష., “గత వ్యవస్థల్లో.” పదకోశం చూడండి.

లేదా “ఎరగా పట్టుకుపోకుండా.”

లేదా “శరీర పద్ధతుల్ని.”

పదకోశం చూడండి.

లేదా “ఆయన” అయ్యుంటుంది.

లేదా “సబ్బాతును.”

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

అక్ష., “వ్యక్తిని.”

“సిథియనులు” అనే మాట అనాగరికుల్ని సూచించింది.

లేదా “దీనమనస్సును.”

లేదా “ధరించండి.”

అనుబంధం A5 చూడండి.

లేదా “ధరించండి.”

లేదా “మీ హృదయాల్ని అదుపుచేయనివ్వండి.”

లేదా “మంచితనం; దయ.”

లేదా “ఒకరికొకరు ఉపదేశించుకోండి.”

అనుబంధం A5 చూడండి.

లేదా “వాళ్లతో కఠినంగా వ్యవహరించకండి.”

లేదా “విధేయులై ఉండండి.”

లేదా “రెచ్చగొట్టకండి; చిరాకు తెప్పించకండి.”

లేదా “నిరుత్సాహపడతారు.”

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “తలుపు.”

అక్ష., “నియమిత సమయాన్ని కొనుక్కుంటూ.”

లేదా “నాకు సహాయం చేసి నన్ను బలపర్చారు.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి