ఫిలిప్పీయులకు రాసిన ఉత్తరం
1 ఫిలిప్పీలోని+ క్రీస్తుయేసు శిష్యులైన పవిత్రులందరికీ, అలాగే పర్యవేక్షకులకు, సంఘ పరిచారకులకు+ క్రీస్తుయేసు దాసులైన పౌలు, తిమోతి రాస్తున్న ఉత్తరం.
2 మన తండ్రైన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.
3 నేను మిమ్మల్ని గుర్తుచేసుకున్న ప్రతీసారి నా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. 4 నేను మీ అందరి కోసం పట్టుదలగా ప్రార్థించినప్పుడల్లా అలా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఎప్పుడూ మీ గురించి సంతోషంగా దేవుణ్ణి వేడుకుంటున్నాను.+ 5 ఎందుకంటే మీరు మంచివార్త విన్న రోజు నుండి ఈ రోజు వరకు దాన్ని వ్యాప్తి చేయడంలో మీ సహకారం అందించారు. 6 మీలో ఒక మంచిపనిని మొదలుపెట్టిన దేవుడే, క్రీస్తుయేసు రోజుకల్లా+ దాన్ని పూర్తి చేస్తాడని+ నేను గట్టిగా నమ్ముతున్నాను. 7 మీరు నా హృదయంలో ఉన్నారు కాబట్టి నేను మీ అందరి గురించి అలా ఆలోచించడం సరైనదే. నేను చెరసాలలో ఉన్నప్పుడు+ మీరు నాకు సహాయం చేశారు. అంతేకాదు, మంచివార్త తరఫున వాదించే విషయంలో,* దాన్ని ప్రకటించేలా చట్టబద్ధమైన హక్కును సంపాదించే విషయంలో+ మీరు నాకు మద్దతిచ్చారు. అలా మీరూ, నేనూ దేవుని అపారదయ నుండి ప్రయోజనం పొందాం.
8 క్రీస్తుయేసుకు ఉన్నలాంటి వాత్సల్యమే మీ మీద నాకు ఉంది. ఆ వాత్సల్యంతోనే నేను మీ అందరి కోసం తపిస్తున్నాను, దీనికి దేవుడే సాక్షి. 9 మీ ప్రేమ సరైన జ్ఞానం,+ మంచి వివేచనలతో+ పాటు అంతకంతకూ పెరగాలని+ నేను ప్రార్థిస్తూ ఉన్నాను; 10 మీరు ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోవాలని,+ అలా మీరు క్రీస్తు రోజు వరకు స్వచ్ఛంగా ఉండాలని, ఇతరులు విశ్వాసం కోల్పోవడానికి కారణం కాకుండా ఉండాలని+ నేను ప్రార్థిస్తున్నాను; 11 అలాగే యేసుక్రీస్తు ద్వారా మీరు పుష్కలంగా నీతిఫలం ఫలించాలని+ ప్రార్థిస్తున్నాను, దానివల్ల దేవునికి మహిమ, స్తుతి కలుగుతాయి.
12 సహోదరులారా, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా పరిస్థితి నిజానికి మంచివార్తను వ్యాప్తి చేయడానికే తోడ్పడింది. 13 నేను క్రీస్తు కోసం ఖైదీగా ఉన్నాననే విషయం+ ప్రేతోర్య సైనికులందరికీ,* మిగతా వాళ్లందరికీ తెలిసింది.+ 14 ప్రభువు సేవలో ఉన్న చాలామంది సహోదరులు నా సంకెళ్ల వల్ల ప్రోత్సాహం పొంది చాలా ధైర్యంగా, ఏమాత్రం భయపడకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు.
15 నిజమే, కొందరు ఈర్ష్యతో, శత్రుభావంతో క్రీస్తును ప్రకటిస్తున్నారు, కానీ ఇతరులు మంచి ఉద్దేశంతో ప్రకటిస్తున్నారు. 16 మంచి ఉద్దేశంతో ప్రకటించేవాళ్లు ప్రేమతో క్రీస్తును ప్రకటిస్తున్నారు, ఎందుకంటే మంచివార్త తరఫున వాదించడానికి*+ దేవుడు నన్ను నియమించాడని వాళ్లకు తెలుసు. 17 కానీ ఈర్ష్యతో, శత్రుభావంతో ప్రకటించేవాళ్లు స్వచ్ఛమైన ఉద్దేశంతో కాకుండా, గొడవలకు దిగే మనస్తత్వంతో ప్రకటిస్తున్నారు; ఖైదీగా ఉన్న నాకు సమస్యలు సృష్టించాలని వాళ్లు అలా చేస్తున్నారు. 18 కానీ దానివల్ల ఏమైంది? చెడు ఉద్దేశంతోనో, మంచి ఉద్దేశంతోనో అన్నివిధాలుగా క్రీస్తు గురించిన సందేశం ప్రకటించబడుతోంది; అందుకు నేను సంతోషిస్తున్నాను. ఇకముందు కూడా సంతోషిస్తూనే ఉంటాను. 19 ఎందుకంటే మీ ప్రార్థనల వల్ల,+ యేసుక్రీస్తు ఇచ్చే పవిత్రశక్తి వల్ల+ నాకు రక్షణ కలుగుతుందని నాకు తెలుసు. 20 నేను ఏ రకంగానూ సిగ్గుపడాల్సిన అవసరం రాదనే నమ్మకం, ఆశ నాకున్నాయి. అయితే, నేను ధైర్యంగా మాట్లాడడం వల్ల ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నా* ద్వారా క్రీస్తు మహిమపర్చబడతాడు; నేను బ్రతికున్నా సరే, చనిపోయినా సరే, నా ద్వారా ఆయన మహిమపర్చబడతాడు.+
21 నేను బ్రతికుంటే, నా జీవితాన్ని క్రీస్తు కోసం ఉపయోగిస్తాను.+ ఒకవేళ నేను చనిపోయినా, అదీ నాకు లాభమే.+ 22 నేను బ్రతికుంటే, నా సేవలో ఇంకా ఎక్కువ ఫలితాలు సాధిస్తాను; అయితే నేను ఏది ఎంచుకుంటాననేది మాత్రం చెప్పను. 23 నేను ఈ రెండిటి మధ్య నలిగిపోతున్నాను. ఒకవైపు నేను విడుదల పొంది క్రీస్తుతో ఉండాలనుకుంటున్నాను,+ నిజానికి క్రీస్తుతో ఉండడమే చాలా మంచిది.+ 24 మరోవైపు, మీకోసం నేను బ్రతికుండడం చాలా అవసరం. 25 కాబట్టి మీ ప్రగతి కోసం, విశ్వాసం వల్ల మీలో కలిగే సంతోషం కోసం నేను బ్రతికుండి మీ అందరితో పాటు ఉంటాననే నమ్మకం నాకుంది. 26 దానివల్ల, నేను మళ్లీ మీతో ఉన్నప్పుడు, క్రీస్తుయేసు శిష్యులైన మీకు నా వల్ల పట్టలేని సంతోషం కలుగుతుంది.
27 మీరు క్రీస్తు గురించిన మంచివార్తకు తగ్గట్టు ప్రవర్తించాలన్నదే* నా కోరిక.+ అప్పుడు, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినా, రాకపోయినా, మీరు ఒకే ఆలోచనతో+ స్థిరంగా ఉంటూ, మంచివార్త మీదున్న విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కలిసికట్టుగా కృషి చేస్తున్నారనే వార్త నేను వినగలుగుతాను. 28 అంతేకాదు, మీరు వ్యతిరేకుల బెదిరింపులకు ఏమాత్రం లొంగిపోవట్లేదని కూడా నాకు తెలుస్తుంది. ఇది వాళ్ల నాశనానికి,+ మీ రక్షణకు రుజువు;+ ఈ రుజువు దేవుని నుండి వస్తుంది. 29 ఎందుకంటే, క్రీస్తు మీద నమ్మకం ఉంచే అవకాశమే కాదు, ఆయన కోసం బాధలు అనుభవించే అవకాశం కూడా మీకు దొరికింది.+ 30 నేను ఏ పోరాటం చేయడం మీరు చూశారో,+ ఇప్పటికీ నేను ఏ పోరాటం చేస్తున్నానని మీరు వింటున్నారో, అదే పోరాటం మీరూ చేస్తున్నారు.
2 మీరు క్రీస్తుతో ఐక్యంగా ఉన్నారు, ఇతరుల్ని ప్రోత్సహిస్తున్నారు, ప్రేమతో ఊరటనిస్తున్నారు, శ్రద్ధ, వాత్సల్యం, కనికరం చూపిస్తున్నారు; కాబట్టి 2 మీకందరికీ ఒకే ఆలోచన ఉందని, ఒకే రకమైన ప్రేమ ఉందని, మీరు పూర్తిస్థాయిలో ఐక్యంగా ఉన్నారని, మీకు ఒకే మనసు ఉందని చూపిస్తూ+ నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3 గొడవలకు దిగే మనస్తత్వాన్ని,+ అహాన్ని చూపించకండి; బదులుగా వినయంతో* ఇతరుల్ని మీకన్నా గొప్పవాళ్లుగా ఎంచండి;+ 4 మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా+ ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.+
5 క్రీస్తుయేసుకు ఉన్న ఈ మనస్తత్వాన్నే మీరూ కలిగివుండండి.+ 6 ఆయన దేవుని స్వరూపంలో ఉన్నాసరే,+ దేవుని స్థానాన్ని చేజిక్కించుకోవాలనే, ఆయనతో సమానంగా ఉండాలనే ఆలోచన కూడా రానివ్వలేదు.+ 7 బదులుగా ఆయన అన్నీ వదులుకుని, దాసునిలా మారి,+ మనిషిలా అయ్యాడు.+ 8 అంతేకాదు, ఆయన మనిషిగా వచ్చినప్పుడు తనను తాను తగ్గించుకుని, చనిపోయేంతగా విధేయత చూపించాడు;+ అవును, హింసాకొయ్య* మీద చనిపోయేంతగా విధేయుడయ్యాడు.+ 9 ఈ కారణం వల్లే దేవుడు ఆయన్ని హెచ్చించి, అంతకుముందు కన్నా ఉన్నతమైన స్థానంలో పెట్టాడు,+ దయతో అన్నిటికన్నా శ్రేష్ఠమైన పేరును ఆయనకు ఇచ్చాడు.+ 10 పరలోకంలో, భూమ్మీద, భూమికింద ఉన్న ప్రతీ ఒక్కరు యేసు పేరున మోకరించాలని, 11 తండ్రైన దేవునికి మహిమ కలిగేలా ప్రతీ ఒక్కరు యేసుక్రీస్తే ప్రభువని బహిరంగంగా ఒప్పుకోవాలని+ దేవుడు అలా చేశాడు.
12 నా ప్రియ సహోదరులారా, మీరు ఎప్పుడూ లోబడుతూ ఉన్నారు, నేను మీతో ఉన్నప్పుడే కాదు, నేను మీతో లేని ఈ సమయంలో ఇంకా ఎక్కువగా లోబడుతున్నారు. అదేవిధంగా మీరు భయంతో, వణుకుతో మీ సొంత రక్షణ కోసం కృషిచేస్తూ ఉండండి. 13 ఎందుకంటే తనకు ఇష్టమైనవి చేయాలనే కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని ఇచ్చి దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు. అలా చేయడం ఆయనకు ఇష్టం. 14 మీరు ఏమి చేసినా సణగకుండా,+ వాదించుకోకుండా+ చేయండి; 15 అప్పుడే మీరు ఏ నిందా లేకుండా నిర్దోషంగా ఉండగలుగుతారు; లోకంలో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న మీరు,+ ఈ చెడ్డ* తరం+ మధ్య ఏ మచ్చా లేకుండా దేవుని పిల్లలుగా ఉండగలుగుతారు. 16 మీరు జీవ వాక్యాన్ని+ గట్టిగా పట్టుకొని ఉండండి. దానివల్ల, నేను అనవసరంగా పరుగెత్తలేదని, వృథాగా కష్టపడలేదని తెలుసుకుని క్రీస్తు రోజున నాకు సంతోషం కలుగుతుంది. 17 మీ విశ్వాసం వల్ల మీరు చేసే పవిత్రసేవ* అనే బలి+ మీద నేను పానీయార్పణగా పోయబడుతున్నా+ సరే నాకు ఆనందమే, మీ అందరితో పాటు నేనూ సంతోషిస్తాను. 18 అలాగే మీరు కూడా ఆనందించాలి, నాతో పాటు సంతోషించాలి.
19 యేసు ప్రభువుకు ఇష్టమైతే, త్వరలోనే తిమోతిని మీ దగ్గరికి పంపించాలని అనుకుంటున్నాను.+ అతను మీ గురించిన విశేషాలు నాకు చెప్తే, నాకు ప్రోత్సాహం కలుగుతుంది. 20 అతనిలాంటి మనస్తత్వం కలిగి మీ విషయంలో నిజమైన శ్రద్ధ చూపించేవాళ్లు ఇంకెవ్వరూ నా దగ్గర లేరు. 21 మిగతావాళ్లంతా ఎవరి పనులు వాళ్లు చూసుకుంటున్నారే తప్ప యేసుక్రీస్తుకు సంబంధించిన పనులు చూడట్లేదు. 22 కానీ తిమోతి తానేంటో నిరూపించుకున్నాడని మీకు తెలుసు. ఒక పిల్లవాడు+ తన తండ్రితో కలిసి పనిచేసినట్టు, మంచివార్తను వ్యాప్తిచేయడానికి అతను నాతో కలిసి సేవచేశాడు. 23 అందుకని, అతన్నే మీ దగ్గరికి పంపించాలని అనుకుంటున్నాను. నా విషయంలో పరిస్థితులు ఎలా మారతాయో తెలియగానే అతన్ని పంపిస్తాను. 24 నిజానికి, ప్రభువుకు ఇష్టమైతే త్వరలో నేను కూడా వస్తాననే నమ్మకం నాకుంది.+
25 ప్రస్తుతానికి, ఎపఫ్రొదితును మీ దగ్గరికి పంపించడం అవసరమని నాకు అనిపిస్తోంది. అతను నా సహోదరుడు, నా తోటి పనివాడు, నా తోటి సైనికుడు, నా అవసరాలు చూసుకోవడానికి మీరు పంపిన ప్రతినిధి.+ 26 అతను మిమ్మల్ని చూడాలని పరితపిస్తున్నాడు, అతనికి జబ్బుచేసిన సంగతి మీకు తెలిసిందని అతను కృంగిపోయాడు. 27 నిజమే, అనారోగ్యం వల్ల అతను చనిపోయేవాడే; కానీ దేవుడు అతని మీద కరుణ చూపించాడు, అతని మీదే కాదు నా మీద కూడా కరుణ చూపించాడు. ఇప్పటికే దుఃఖంలో ఉన్న నాకు ఇంకా ఎక్కువ దుఃఖం కలగకూడదని అలా చేశాడు. 28 కాబట్టి, వీలైనంత త్వరగా అతన్ని మీ దగ్గరికి పంపిస్తాను. అప్పుడు మీరు అతన్ని చూసి మళ్లీ సంతోషిస్తారు, నా ఆందోళన కూడా కాస్త తగ్గుతుంది. 29 మీరు ప్రభువు శిష్యుల్ని ఎప్పుడూ ఆహ్వానించే విధంగా పూర్తి సంతోషంతో అతన్ని ఆహ్వానించండి, అలాంటి సహోదరుల్ని విలువైనవాళ్లుగా చూడండి.+ 30 ఎందుకంటే, క్రీస్తు పనికోసం* అతను దాదాపు చనిపోయే పరిస్థితి వచ్చింది, మీ స్థానంలో నాకు సేవచేయడానికి అతను తన ప్రాణాన్ని ప్రమాదంలో పడేసుకున్నాడు.+
3 చివరిగా, నా సహోదరులారా, ప్రభువు సేవలో ఆనందిస్తూ ఉండండి.+ రాసిన విషయాల్నే మీకు మళ్లీ రాయడం నాకు కష్టమేమీ కాదు, నేను రాసేది మీ మంచి కోసమే.
2 కుక్కల* విషయంలో జాగ్రత్త; హాని తలపెట్టేవాళ్ల విషయంలో జాగ్రత్త; సున్నతి చేయించుకోవాలని పట్టుబట్టేవాళ్ల*+ విషయంలో జాగ్రత్త. 3 ఎందుకంటే, మనం చేసుకున్నదే అసలైన సున్నతి;+ మనం దేవుని పవిత్రశక్తితో పవిత్రసేవ చేస్తున్నాం, శరీరం విషయంలో కాకుండా క్రీస్తుయేసు విషయంలో గొప్పలు చెప్పుకుంటున్నాం.+
4 శరీరం విషయంలో గొప్పలు చెప్పుకోవాలనుకుంటే నేను కూడా చెప్పుకోగలను. ఆ మాటకొస్తే, గొప్పలు చెప్పుకోవడానికి వేరే ఎవ్వరి కన్నా నాకే ఎక్కువ కారణాలు ఉన్నాయి. 5 నేను ఎనిమిదో రోజున సున్నతి పొందాను,+ ఇశ్రాయేలీయుణ్ణి, బెన్యామీను గోత్రం వాణ్ణి, అసలైన హెబ్రీయుణ్ణి,+ ధర్మశాస్త్రం పాటించే విషయానికొస్తే, పరిసయ్యుణ్ణి;+ 6 ఉత్సాహం మాటకొస్తే, సంఘాన్ని హింసించాను;+ ధర్మశాస్త్రం ద్వారా కలిగే నీతి విషయానికొస్తే, నిందలేనివాణ్ణి. 7 అయితే, ఏవేవి నాకు లాభంగా ఉన్నాయో వాటిని నేను క్రీస్తు కోసం నష్టంగా ఎంచుకున్నాను.*+ 8 చెప్పాలంటే, నా ప్రభువైన క్రీస్తుయేసు గురించిన సాటిలేని జ్ఞానం కోసం నేను అన్నిటినీ నష్టంగా ఎంచుకుంటున్నాను. ఆయన కోసం నేను అన్నీ వదులుకున్నాను, వాటిని చెత్తతో సమానంగా ఎంచుతున్నాను. ఎందుకంటే నేను క్రీస్తు అనుగ్రహం పొందాలని, 9 ఆయనతో ఐక్యంగా ఉండాలని అనుకుంటున్నాను; ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల కలిగే నా సొంత నీతిని బట్టి కాదుగానీ క్రీస్తు మీద విశ్వాసం వల్ల దేవుడు అనుగ్రహించే నీతిని+ బట్టి అలా ఉండాలని నా కోరిక. 10 నా లక్ష్యం ఏమిటంటే క్రీస్తును, ఆయన పునరుత్థానానికి ఉన్న శక్తిని+ తెలుసుకోవాలి, ఆయనలా బాధలు అనుభవించాలి,+ ఆయనలా చనిపోవాలి.+ 11 సాధ్యమైతే నేను మొదటి పునరుత్థానంలో ఉండాలన్నదే నా ఉద్దేశం.+
12 నేను ఇప్పటికే బహుమతిని పొందాననో, పరిపూర్ణుడిని అయ్యాననో అనుకోవట్లేదు. బదులుగా, క్రీస్తుయేసు దేని కోసమైతే నన్ను ఎంచుకున్నాడో* దాన్ని పట్టుకోవడానికి+ నేను కృషిచేస్తూ ఉన్నాను.+ 13 సహోదరులారా, నేను ఇప్పటికే దాన్ని పట్టుకున్నానని అనుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, వెనక ఉన్నవాటిని మర్చిపోయి,+ ముందున్న వాటి కోసం పరుగెత్తుతున్నాను. 14 క్రీస్తుయేసు ద్వారా దేవుడు తాను పిలిచినవాళ్లకు ఇచ్చే బహుమతిని, అంటే పరలోక జీవితాన్ని పొందాలని నేను లక్ష్యం వైపే పరుగెత్తుతున్నాను.+ 15 కాబట్టి, మనలో పరిణతి చెందినవాళ్లం+ ఇదే మనస్తత్వాన్ని కలిగివుందాం. ఒకవేళ ఏ విషయంలోనైనా మీ ఆలోచన వేరుగా ఉంటే, మీరు సరైన మనస్తత్వాన్ని కలిగివుండడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. 16 ఏదేమైనా, మనం ప్రగతి సాధించినమేరకు ఇదే పద్ధతిలో ముందుకు సాగిపోతూ ఉందాం.
17 సహోదరులారా, మీరందరూ నన్ను ఆదర్శంగా తీసుకోండి.+ మేము ఉంచిన ఆదర్శానికి తగ్గట్టు నడుచుకునేవాళ్లను గమనిస్తూ ఉండండి. 18 ఎందుకంటే క్రీస్తు హింసాకొయ్యకు* శత్రువుల్లా నడుచుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్ల గురించి నేను తరచూ చెప్పేవాణ్ణి, ఇప్పుడు కూడా కన్నీళ్లతో చెప్తున్నాను. 19 నాశనమే వాళ్ల అంతం; వాళ్ల కోరికలే* వాళ్ల దేవుడు; సిగ్గుపడాల్సిన విషయాల గురించి వాళ్లు గర్వపడుతున్నారు; వాళ్ల మనసంతా లోకసంబంధ విషయాల పైనే ఉంది.+ 20 కానీ మన పౌరసత్వం+ పరలోకంలో ఉంది;+ అక్కడి నుండి వచ్చే రక్షకుని కోసం, అంటే ప్రభువైన యేసుక్రీస్తు కోసం మనం ఆతురతతో ఎదురుచూస్తున్నాం.+ 21 అన్నిటినీ లోబర్చుకోగల+ తన గొప్పశక్తితో ఆయన మన బలహీనమైన శరీరాన్ని తన మహిమాన్విత శరీరంలా మారుస్తాడు.+
4 కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీరు ఇలాగే క్రీస్తుతో ఐక్యంగా ఉంటూ స్థిరంగా ఉండండి.+ నా సహోదరులారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని చూడాలని తపిస్తున్నాను; మీరే నా సంతోషం, నా కిరీటం.
2 ప్రభువు సేవలో ఒకే ఆలోచనతో ఉండమని+ యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను. 3 ఆ స్త్రీలకు సహాయం చేస్తూ ఉండమని నా నిజమైన తోటి పనివాడివైన నిన్ను కూడా కోరుతున్నాను. ఆ ఇద్దరు నాతో, క్లెమెంతుతో, నా తోటి పనివాళ్లయిన మిగతావాళ్లతో కలిసి మంచివార్త కోసం ఎంతో ప్రయాసపడ్డారు.* వాళ్లందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి.+
4 ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందించండి. మళ్లీ చెప్తున్నాను, ఆనందించండి!+ 5 మీరు పట్టుబట్టే ప్రజలు కాదని*+ అందరికీ తెలియనివ్వండి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6 ఏ విషయం గురించీ ఆందోళన పడకండి.+ కానీ ప్రతీ విషయంలో ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, అలాగే కృతజ్ఞతలు చెప్పండి;+ 7 అప్పుడు, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి+ క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు* కాపలా ఉంటుంది.+
8 చివరిగా సహోదరులారా, ఏవి నిజమైనవో, ఏవి ప్రాముఖ్యమైనవో, ఏవి నీతిగలవో, ఏవి పవిత్రమైనవో,* ఏవి ప్రేమించదగినవో, ఏవి గౌరవప్రదమైనవో, ఏవి మంచివో, ఏవి పొగడదగినవో వాటి గురించి ఆలోచిస్తూ* ఉండండి.+ 9 వేటినైతే మీరు నా దగ్గర నేర్చుకున్నారో, అంగీకరించారో, విన్నారో, నాలో చూశారో, వాటిని పాటించండి.+ అప్పుడు శాంతికి మూలమైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
10 ఇప్పుడు మీరు మళ్లీ నా గురించి ఆలోచిస్తున్నందుకు+ ప్రభువు సేవకుడినైన నాకు చాలా సంతోషంగా ఉంది. నా బాగోగుల విషయంలో మీకు ఎప్పుడూ శ్రద్ధ ఉంది, కానీ దాన్ని చూపించే అవకాశం కొంతకాలం మీకు దొరకలేదు. 11 నాకు ఏదో అవసరం ఉండి నేనిలా మాట్లాడట్లేదు; ఎందుకంటే నా పరిస్థితులు ఎలా ఉన్నా సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను.+ 12 తక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో,+ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండినా, ఆకలిగా ఉన్నా, సమృద్ధిగా ఉన్నా, ఏమీ లేకున్నా తృప్తిగా జీవించడమనే రహస్యం నేర్చుకున్నాను. 13 ఎందుకంటే, నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.+
14 అయినాసరే, నా కష్టాల్లో మీరు నాకు సహాయం చేశారు, అది మంచి విషయం. 15 నిజానికి ఫిలిప్పీయులారా, మీరు మొదటిసారి మంచివార్త తెలుసుకున్న తర్వాత, నేను మాసిదోనియ నుండి బయల్దేరుతున్నప్పుడు, మీరు తప్ప ఒక్క సంఘం కూడా నాకు సహాయం చేయలేదు, నా సహాయం తీసుకోలేదు.+ ఈ విషయం మీకూ తెలుసు. 16 ఎందుకంటే, నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు మీరు నా అవసరాల్లో సహాయం చేశారు, ఒక్కసారి కాదు, రెండుసార్లు అలా సహాయం చేశారు. 17 మీ నుండి బహుమతిని ఆశించి నేనిలా చెప్పట్లేదు, బదులుగా దేవుని దగ్గర మీ సంపదను పెంచే మంచిపనుల్ని మీరు ఇంకా ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాను. 18 నాకు కావాల్సిన ప్రతీది నా దగ్గర ఉంది, చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉంది. నాకు ఏ లోటూ లేదు, ఎందుకంటే మీరు ఎపఫ్రొదితు+ ద్వారా పంపించింది నాకు అందింది. అది దేవుడు అంగీకరించే, ఇష్టపడే, పరిమళభరిత బలి.+ 19 మీరు చేసినదానికి ప్రతిఫలంగా, మహిమాన్విత సంపదలుగల దేవుడు మీకు కావాల్సినవన్నీ క్రీస్తుయేసు ద్వారా పూర్తిగా దయచేస్తాడు.+ 20 మన తండ్రైన దేవునికి యుగయుగాలు మహిమ కలగాలి. ఆమేన్.
21 క్రీస్తుయేసు శిష్యులుగా ఉన్న పవిత్రుల్లో ప్రతీ ఒక్కరికి నా శుభాకాంక్షలు చెప్పండి. నాతో ఉన్న సహోదరులు కూడా మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. 22 పవిత్రులంతా, ముఖ్యంగా కైసరు* ఇంటివాళ్లు+ మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
23 ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీరు చూపించే స్ఫూర్తికి తోడుండాలి.
న్యాయస్థానంలో అని తెలుస్తోంది.
అంటే, రోమా చక్రవర్తిని కాపాడే సైనికుల గుంపు.
న్యాయస్థానంలో అని తెలుస్తోంది.
అక్ష., “నా శరీరం.”
లేదా “పౌరులుగా నడుచుకోవాలన్నదే.”
లేదా “దీనమనస్సుతో.”
పదకోశం చూడండి.
లేదా “కుటిలమైన, వక్ర.”
లేదా “ప్రజాసేవ.”
లేదా “ప్రభువు పనికోసం” అయ్యుంటుంది.
అంటే, అపవిత్రుల.
లేదా “శరీరాన్ని కోసుకునేవాళ్ల.”
లేదా “ఇష్టపూర్వకంగా వదులుకున్నాను” అయ్యుంటుంది.
అక్ష., “పట్టుకున్నాడో.”
పదకోశం చూడండి.
అక్ష., “కడుపే.”
లేదా “తీవ్రంగా పోరాడారు.”
లేదా “అర్థం చేసుకునేవాళ్లని; సహేతుకత గలవాళ్లని.”
లేదా “ఆలోచనలకు; మానసిక సామర్థ్యాలకు.”
లేదా “స్వచ్ఛమైనవో.”
లేదా “ధ్యానిస్తూ.”
లేదా “రోమా చక్రవర్తి.”