కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt ఎఫెసీయులు 1:1-6:24
  • ఎఫెసీయులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎఫెసీయులు
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఎఫెసీయులు

ఎఫెసీయులకు రాసిన ఉత్తరం

1 దేవుని ఇష్టప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడినైన పౌలు అనే నేను ఎఫెసులో+ ఉన్న పవిత్రులకు, అంటే క్రీస్తుయేసు నమ్మకమైన శిష్యులకు రాస్తున్న ఉత్తరం.

2 మన తండ్రైన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.

3 మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు స్తుతించబడాలి; ఆయన క్రీస్తు శిష్యులమైన మనకు పవిత్రశక్తి ద్వారా పరలోకంలో ప్రతీ వరాన్ని ఇచ్చి దీవించాడు.+ 4 ఎందుకంటే, మనం ఆయనతో* ఐక్యంగా ఉండాలని ప్రపంచం పుట్టకముందే* దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. మనం ప్రేమ చూపిస్తూ ఆయన ముందు పవిత్రులుగా, మచ్చలేనివాళ్లుగా ఉండాలని+ ఆయన అలా చేశాడు. 5 ఎందుకంటే ఆయన తన సంతోషం కోసం, తన ఇష్టప్రకారం+ యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన సొంత పిల్లలుగా* దత్తత తీసుకోవాలని+ ముందే నిర్ణయించాడు.+ 6 ఆయన తన ప్రియ కుమారుడి+ ద్వారా మనపై చూపించిన మహిమాన్విత అపారదయను+ బట్టి ప్రజలు తనను స్తుతించాలని అలా చేశాడు. 7 ఆయన ద్వారానే, అంటే ఆ కుమారుడి రక్తం ద్వారానే విమోచన క్రయధనం* వల్ల మనకు విడుదల దొరికింది;+ అవును, మన పాపాలకు క్షమాపణ దొరికింది.+ నిజంగా దేవుని అపారదయ చాలా గొప్పది!

8 దేవుడు తెలివి, అవగాహనతో ఆ అపారదయను మనకు పుష్కలంగా ఇచ్చి, 9 తన సంకల్పం గురించిన పవిత్ర రహస్యాన్ని మనకు తెలియజేశాడు.+ ఆ రహస్యం ఆయన ఇష్టానికి, ఆయన సంకల్పానికి అనుగుణంగా ఉంది. 10 నిర్ణయించబడిన కాలాలు ముగిసినప్పుడు, అన్నిటినీ అంటే పరలోకంలో ఉన్నవాటిని, భూమ్మీద ఉన్నవాటిని క్రీస్తులో ఐక్యం చేయడానికి+ ఒక వ్యవహార నిర్వహణను ఏర్పాటు చేయాలనేది ఆ సంకల్పం. అవును, క్రీస్తులో అన్నీ ఐక్యమౌతాయి. 11 యూదులమైన మేము ఆయనతోనే ఐక్యంగా ఉన్నాం, వారసులుగా నియమించబడ్డాం.+ ఎందుకంటే, తన ఇష్టప్రకారం తాను అనుకున్న ప్రతీది నెరవేర్చే దేవుడు తన సంకల్పం ప్రకారం ముందుగానే మమ్మల్ని నిర్ణయించాడు. 12 క్రీస్తు మీద మొట్టమొదట నిరీక్షణ ఉంచిన మా ద్వారా తనకు స్తుతి, మహిమ కలగాలని అలా చేశాడు. 13 అయితే అన్యజనులైన మీరు కూడా సత్యాన్ని విన్న తర్వాత, అంటే మీ రక్షణ గురించిన మంచివార్తను విన్న తర్వాత క్రీస్తు మీద నిరీక్షణ ఉంచారు. మీరు ఆయన్ని నమ్మిన తర్వాత, దేవుడు క్రీస్తును ఉపయోగించుకొని, వాగ్దానం చేయబడిన పవిత్రశక్తితో మీకు ముద్రవేశాడు.+ 14 మనం తప్పకుండా స్వాస్థ్యాన్ని పొందుతామనడానికి దేవుడు మనకు ముందుగా ఇచ్చిన గుర్తే* ఆ పవిత్రశక్తి.+ విమోచన క్రయధనం+ ద్వారా తన ప్రజల్ని*+ విడిపించడానికి దేవుడు అలా ముద్రవేశాడు. దానివల్ల ఆయనకు స్తుతి, మహిమ కలుగుతాయి.

15 అందుకే, ప్రభువైన యేసు మీద మీకున్న విశ్వాసం గురించి, పవిత్రులందరి మీద మీరు చూపించే ప్రేమ గురించి విన్న నేను కూడా 16 మానకుండా మీ విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎప్పుడూ నా ప్రార్థనల్లో మిమ్మల్ని గుర్తుచేసుకుంటున్నాను; 17 మన ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుడు, తేజోమయుడైన తండ్రి మీకు తెలివిని, తాను బయల్పర్చే విషయాల గురించిన అవగాహనను ఇవ్వాలని, అలా మీరు ఆయన గురించిన సరైన జ్ఞానం సంపాదించాలని ప్రార్థిస్తున్నాను.+ 18 మీరు స్పష్టంగా చూసేలా ఆయన మీ హృదయాల్ని* తెరిచాడు. దానివల్ల మీరు ఆయన ఏ నిరీక్షణ కోసం మిమ్మల్ని పిలిచాడో, పవిత్రులకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఆయన ఏ గొప్ప సంపదల్ని సిద్ధం చేశాడో తెలుసుకోగలుగుతారు.+ 19 అంతేకాదు, విశ్వాసులమైన మనమీద పనిచేసే ఆయన శక్తి ఎంత గొప్పదో+ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఆ శక్తి ఎంత గొప్పదనే విషయం, 20 దేవుడు మృతుల్లో నుండి క్రీస్తును బ్రతికించి పరలోకంలో తన కుడిపక్కన+ కూర్చోబెట్టుకున్నప్పుడు రుజువైంది. 21 దేవుడు క్రీస్తుకు ఇచ్చిన ఆ స్థానం ప్రభుత్వాలన్నిటి కన్నా, అధికారాలన్నిటి కన్నా, శక్తులన్నిటి కన్నా, పరిపాలనలన్నిటి కన్నా, పేర్లన్నిటి కన్నా ఎంతో ఉన్నతమైనది.+ ఈ వ్యవస్థలో* ఉన్నవే కాదు రానున్న వ్యవస్థలో ఉండే అన్నిటికన్నా కూడా అది ఉన్నతమైనది. 22 అంతేకాదు దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల కింద లోబర్చి,+ సంఘానికి సంబంధించి అన్నిటిమీద ఆయన్ని శిరస్సుగా* నియమించాడు.+ 23 ఆ సంఘం ఆయన శరీరం,+ అది ఆయన లక్షణాలతో నిండివుంది, ఆయనే అన్నిటినీ సంపూర్ణం చేస్తాడు.

2 అంతేకాదు మీ తప్పుల వల్ల, పాపాల వల్ల చనిపోయిన స్థితిలో ఉన్న మిమ్మల్ని దేవుడు బ్రతికించాడు.+ 2 అంతకుముందు మీరు ఈ లోక వ్యవస్థకు* అనుగుణంగా, ఈ లోక వైఖరిని పాలించేవాడి+ ఇష్టానుసారంగా నడుచుకున్నారు.+ ఆ వైఖరి+ గాలిలా అంతటా వ్యాపించి, అవిధేయుల* మీద ప్రభావం చూపిస్తోంది. 3 అవును, ఒకప్పుడు మనందరం వాళ్లలాగే మన శరీర కోరికల ప్రకారం నడుచుకునేవాళ్లం;+ శరీరం కోరుకున్నవాటిని, మనసుకు నచ్చినవాటిని చేసేవాళ్లం,+ వాళ్లలాగే మనం కూడా పుట్టుకతోనే దేవుని ఆగ్రహానికి గురవ్వాల్సినవాళ్లం.+ 4 అయితే దేవుడు అత్యంత కరుణామయుడు,+ ఆయనకు మనమీద ఉన్న ప్రేమ ఎంతో గొప్పది+ కాబట్టి, 5 పాపాల వల్ల చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని క్రీస్తుతోపాటు బ్రతికించాడు.+ దేవుని అపారదయ వల్లే మీరు రక్షణ పొందారు. 6 అంతేకాదు, క్రీస్తుయేసు శిష్యులమైన మనల్ని దేవుడు క్రీస్తుతోపాటు బ్రతికించి, ఆయనతోపాటు పరలోకంలో కూర్చోబెట్టాడు.+ 7 క్రీస్తుయేసు శిష్యులమైన మనమీద దేవుడు తన మంచితనంతో* రానున్న కొత్తలోకంలో* గొప్ప అపారదయను చూపించాలని అలా చేశాడు.

8 ఆ అపారదయ వల్లే, విశ్వాసం ద్వారా మీరు రక్షణ పొందారు.+ అది మీ అంతట మీరు పొందింది కాదు, దేవుడు ఇచ్చిన బహుమతి. 9 అది మనం చేసే పనుల వల్ల పొందేది కాదు+ కాబట్టి దాని విషయంలో గొప్పలు చెప్పుకునే అవకాశం ఎవరికీ ఉండదు. 10 మనం దేవుని చేతి పని; ఆయన క్రీస్తుయేసు శిష్యులమైన మనల్ని+ మంచిపనులు చేయడానికి సృష్టించాడు.+ ఆ మంచిపనుల్ని దేవుడు మన కోసం ముందే ఏర్పాటుచేశాడు.

11 కాబట్టి పుట్టుకతో అన్యజనులైన మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ఒకప్పుడు, మనుషులచేత సున్నతి పొందినవాళ్లు మిమ్మల్ని సున్నతి పొందనివాళ్లు అని పిలిచేవాళ్లు. 12 అప్పట్లో మీకు క్రీస్తు తెలీదు, మీరు ఇశ్రాయేలు ప్రజలకు దూరంగా ఉండేవాళ్లు, వాగ్దానం మీద ఆధారపడిన ఒప్పందాల్లో* మీకు వంతు ఉండేది కాదు;+ మీరు ఈ లోకంలో ఏ నిరీక్షణా లేకుండా జీవించేవాళ్లు, మీకు దేవుడు తెలీదు.+ 13 ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తుయేసు శిష్యులుగా, ఆయన రక్తం వల్ల దేవునికి దగ్గరయ్యారు. 14 ఎందుకంటే ఆయనే మనకు శాంతిని తెచ్చాడు,+ రెండు గుంపుల ప్రజల్ని ఒక్కటి చేశాడు,+ వాళ్ల మధ్య ఉన్న అడ్డుగోడను పడగొట్టాడు.+ 15 ఆయన తన శరీరాన్ని అర్పించడం ద్వారా ఆ రెండు గుంపుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని తీసేశాడు; అంటే ఆజ్ఞలు, నియమాలు ఉన్న ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు. ఆ రెండు గుంపుల్లో ఉన్న తన శిష్యుల్ని ఒకే కొత్త గుంపుగా* చేయాలని,+ శాంతిని తేవాలని అలా చేశాడు; 16 అంతేకాదు, హింసాకొయ్య* మీద తన మరణం ద్వారా+ అప్పటికే శత్రుత్వాన్ని తీసేశాడు+ కాబట్టి, ఆ రెండు గుంపుల ప్రజలకు, దేవునికి మధ్య శాంతియుత సంబంధాన్ని తిరిగి నెలకొల్పి వాళ్లను ఒక్క గుంపుగా* చేయాలని అలా చేశాడు. 17 ఆయన వచ్చి, దేవునికి దూరంగా ఉన్న మీకు, దేవునికి దగ్గరగా ఉన్నవాళ్లకు శాంతి సువార్తను ప్రకటించాడు. 18 ఎందుకంటే, ఆయన ద్వారా రెండు గుంపుల వాళ్లం ఒకే పవిత్రశక్తిని పొంది, ఏ ఆటంకం లేకుండా తండ్రికి ప్రార్థించగలుగుతున్నాం.

19 కాబట్టి మీరిక అపరిచితులు, పరదేశులు కాదు.+ బదులుగా, మీరు పవిత్రుల తోటి పౌరులు,+ దేవుని ఇంటివాళ్లు;+ 20 మీరు అపొస్తలులు, ప్రవక్తలు+ అనే పునాది మీద ఒక భవనంగా నిర్మించబడ్డారు. ఆ పునాదికి ముఖ్యమైన మూలరాయి క్రీస్తుయేసే.+ 21 క్రీస్తుతో ఐక్యంగా ఉండడం వల్ల ఆ భవనం భాగాలన్నీ ఒకదానితో ఒకటి చక్కగా అమర్చబడుతూ,+ భవనమంతా యెహోవాకు* పవిత్ర ఆలయంగా రూపొందుతోంది.+ 22 ఆయనతో ఐక్యంగా ఉన్న మీరు కూడా దేవుని కోసం ఒక ఆలయంగా నిర్మించబడుతున్నారు. అది దేవుడు తన పవిత్రశక్తి ద్వారా నివసించే ఆలయం.+

3 అందుకే, పౌలు అనే నేను అన్యజనులైన మీకోసం క్రీస్తుయేసు ఖైదీగా+ ఉన్నాను. 2 మీరు దేవుని అపారదయ నుండి ప్రయోజనం పొందేలా మీకు సహాయం చేసే బాధ్యత*+ నాకు అప్పగించబడిందని మీరు వినే ఉంటారు. 3 అవును, దేవుడు పవిత్ర రహస్యాన్ని నాకు బయల్పర్చడం ద్వారా ఆ బాధ్యతను అప్పగించాడు. దీనిగురించి ఇంతకుముందే మీకు క్లుప్తంగా రాశాను. 4 కాబట్టి మీరు ఇది చదివినప్పుడు, క్రీస్తు గురించిన పవిత్ర రహస్యం+ మీద నాకెంత అవగాహన ఉందో మీకు తెలుస్తుంది. 5 దేవుడు పవిత్రశక్తి ద్వారా ఆ రహస్యాన్ని తన పవిత్ర అపొస్తలులకు, ప్రవక్తలకు ఇప్పుడు స్పష్టంగా బయల్పర్చాడు, అయితే వెనకటి తరాల వాళ్లకు దాన్ని అంత స్పష్టంగా తెలియజేయలేదు.+ 6 ఆ రహస్యం ఏమిటంటే, క్రీస్తుయేసు శిష్యులైన అన్యజనులు మంచివార్త ద్వారా తోటి వారసులూ ఒకే శరీరంలో అవయవాలూ అవుతారు,+ దేవుడు వాగ్దానం చేసినవాటిని మాతోపాటు పంచుకుంటారు. 7 దేవుని అపారదయను బట్టి నేను ఈ రహస్యానికి పరిచారకుణ్ణి అయ్యాను. ఆయన తన శక్తిని ఉపయోగించి నాకు ఈ ఉచిత బహుమతిని ఇచ్చాడు.+

8 పవిత్రులందరిలో అల్పుడైనవాని కన్నా తక్కువవాడినైన నాకు+ దేవుడు ఆ అపారదయను అనుగ్రహించాడు.+ లెక్కకు అందని క్రీస్తు సంపదల గురించిన మంచివార్తను నేను అన్యజనులకు ప్రకటించాలని, 9 పవిత్ర రహస్యం ఎలా అమలులోకి తీసుకురాబడిందో గుర్తించేలా+ నేను ప్రతీ ఒక్కరికి సహాయం చేయాలని ఆయన నాకు ఆ అపారదయను అనుగ్రహించాడు. అన్నిటినీ సృష్టించిన దేవుడు ఆ రహస్యాన్ని ఎంతోకాలం దాచివుంచాడు. 10 ఎన్నో విధాల్లో కనిపించే దేవుని తెలివి ఇప్పుడు సంఘం+ ద్వారా పరలోకంలో ఉన్న ప్రభుత్వాలకు, అధికారాలకు తెలియజేయబడాలని ఆయన అలా చేశాడు.+ 11 ఇది మన ప్రభువైన క్రీస్తుయేసుకు సంబంధించి దేవుడు అనుకున్న నిత్య సంకల్పానికి అనుగుణంగా ఉంది.+ 12 క్రీస్తుయేసు వల్లే మనం ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం, ఆయన మీద ఉన్న విశ్వాసం ద్వారానే దేవునికి నిర్భయంగా ప్రార్థించగలుగుతున్నాం.+ 13 కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, మీ కోసం నేను అనుభవిస్తున్న శ్రమల్ని చూసి కృంగిపోకండి. ఎందుకంటే, అవి మీకు ఘనతను తెస్తాయి.+

14 అందుకే నేను మోకరించి తండ్రికి ప్రార్థిస్తున్నాను. 15 పరలోకంలో, భూమ్మీద ఉన్న ప్రతీ కుటుంబం ఆయన వల్లే ఉనికిలో ఉంది. 16 ఆయన ఎంతో మహిమగల దేవుడు. ఆయన తన పవిత్రశక్తి ద్వారా మీకు శక్తినిచ్చి మీ హృదయాల్ని, మనసుల్ని బలపర్చాలని+ ప్రార్థిస్తున్నాను; 17 మీ విశ్వాసం ద్వారా మీ హృదయాల్లో ప్రేమతోపాటు క్రీస్తు నివసించాలని,+ మీరు వేళ్లూనుకున్న చెట్టులా+ పునాది మీద స్థిరంగా ఉండాలని,+ 18 అలా మీరు పవిత్రులందరితో పాటు దేవుని విషయాల వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఎంత అనేది పూర్తిగా గ్రహించాలని, 19 జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను+ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను; అప్పుడు మీరు దేవుడు ఇచ్చే దైవిక లక్షణాలన్నిటినీ పూర్తిగా అలవర్చుకోగలుగుతారు.

20 మనలో పనిచేస్తున్న తన శక్తి+ ప్రకారం, దేవుడు మనం అడిగే వాటన్నిటికన్నా, ఊహించగలిగే వాటన్నిటికన్నా ఎంతో గొప్పవాటిని చేయగలడు.+ 21 ఆయనకు సంఘం ద్వారా, క్రీస్తుయేసు ద్వారా తరతరాలు, యుగయుగాలు మహిమ కలగాలి. ఆమేన్‌.

4 కాబట్టి ప్రభువు ఖైదీనైన నేను,+ మీరు అందుకున్న పిలుపుకు తగ్గట్టు నడుచుకోమని+ మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. 2 అంటే, ఎప్పుడూ వినయంగా*+ సౌమ్యంగా ఉంటూ, ఓర్పు చూపిస్తూ,+ ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ,+ 3 ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలుగుతూ, పవిత్రశక్తి వల్ల కలిగిన ఐక్యతను కాపాడుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తూ ఉండమని బ్రతిమాలుతున్నాను.+ 4 మీరు ఏ నిరీక్షణ కోసం పిలుపు అందుకున్నారో ఆ నిరీక్షణ ఒక్కటే,+ అలాగే శరీరం ఒక్కటే,+ పవిత్రశక్తి ఒక్కటే;+ 5 ప్రభువు ఒక్కడే,+ విశ్వాసం* ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే; 6 అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. ఆయనకు అందరి మీద అధికారం ఉంది, ఆయన అందరి ద్వారా పనిచేస్తున్నాడు, ఆయన శక్తి అందరిలో పనిచేస్తోంది.

7 క్రీస్తు ఉచిత బహుమతిని పంచి ఇచ్చిన ప్రకారం దేవుడు మనలో ఒక్కొక్కరికి అపారదయను అనుగ్రహించాడు.+ 8 ఎందుకంటే లేఖనం ఇలా చెప్తుంది: “ఆయన పైకి వెళ్తున్నప్పుడు బందీల్ని తీసుకెళ్లాడు; మనుషుల్లో వరాల్ని* ఇచ్చాడు.”+ 9 ఇక్కడ, “ఆయన పైకి వెళ్తున్నప్పుడు” అనే మాటకు అర్థం ఏంటి? ఆయన కిందికి, అంటే భూమ్మీదికి వచ్చాడనే కదా. 10 కిందికి వచ్చిన ఆయనే, అన్నిటినీ పూర్తిచేయగలిగేలా ఆకాశమంతటినీ దాటి+ ఎంతో పైకి వెళ్లాడు.+

11 ఆయన కొందర్ని అపొస్తలులుగా,+ కొందర్ని ప్రవక్తలుగా,+ కొందర్ని మంచివార్త ప్రచారకులుగా,*+ కొందర్ని కాపరులుగా, బోధకులుగా+ ఇచ్చాడు. 12 పవిత్రుల్ని సరైన దారిలో పెట్టడానికి,* పరిచర్య పని చేయడానికి, క్రీస్తు శరీరాన్ని* బలపర్చడానికి*+ వాళ్లను ఏర్పాటు చేశాడు. 13 మనందరం విశ్వాసం విషయంలో, దేవుని కుమారుని గురించిన సరైన జ్ఞానం విషయంలో ఒక్కటయ్యేవరకు, సంపూర్ణ పరిణతిగల క్రీస్తులా పూర్తిస్థాయిలో పరిణతి సాధించేవరకు+ వాళ్లు ఆ పని చేస్తుంటారు. 14 కాబట్టి మనం ఇకనుండి చిన్నపిల్లల్లా ఉండకూడదు. అంటే, కుయుక్తితో ఇతరుల్ని మోసం చేసేవాళ్ల తప్పుడు బోధల్ని నమ్మి సముద్రపు కెరటాలకు, గాలికి అటూఇటూ కొట్టుకుపోయే పడవలా ఉండకూడదు.+ 15 అయితే, మనం నిజమే మాట్లాడుతూ, ప్రేమతో పురికొల్పబడి మన శిరస్సయిన క్రీస్తు+ కింద అన్ని విషయాల్లో పరిణతి సాధించేవరకు ఎదుగుతూ ఉందాం. 16 ఆయన నుండి శరీరమంతా+ చక్కగా అమర్చబడుతుంది, అవయవాలన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ శరీరానికి అవసరమైనదాన్ని అందిస్తాయి. ప్రతీ అవయవం తన పనిని సరిగ్గా చేస్తే శరీరం బాగా ఎదుగుతుంది, ప్రేమలో బలపడుతుంది.+

17 కాబట్టి ప్రభువు పేరున నేను మీకు చెప్పేది, మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, మీరిక అన్యజనుల్లా అర్థంపర్థంలేని* ఆలోచనల+ ప్రకారం నడుచుకోకండి.+ 18 తమ అజ్ఞానం వల్ల, మొద్దుబారిన హృదయాల వల్ల వాళ్లు* చీకట్లో ఉన్నారు, దేవుడు ఇస్తానన్న శాశ్వత జీవితానికి దూరంగా ఉన్నారు. 19 వాళ్లు నైతిక విచక్షణను పూర్తిగా కోల్పోయి, అత్యాశతో అన్నిరకాల అపవిత్రమైన పనులు చేస్తూ లెక్కలేనితనంలో*+ మునిగిపోయారు.

20 అయితే క్రీస్తు గురించి మీరు అలా నేర్చుకోలేదు. 21 (మీరు నిజంగా ఆయన మాటలు విని, యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా బోధించబడివుంటే, ఈ విషయం మీకు తెలుసు.) 22 మీరు మీ పాత ప్రవర్తనకు అనుగుణంగా ఉన్న పాత వ్యక్తిత్వాన్ని వదిలేయాలని+ నేర్చుకున్నారు. అది దాని మోసపూరిత కోరికల వల్ల దిగజారుతూ ఉంది.+ 23 అలాగే మీరు కొత్త ఆలోచనా విధానాన్ని* అలవర్చుకుంటూ ఉండాలి;+ 24 నిజమైన నీతికి, విశ్వసనీయతకు అనుగుణంగా దేవుని ఇష్టప్రకారం సృష్టించబడిన కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవాలి.+

25 కాబట్టి, మోసం చేయడం మానేసిన మీరు సాటిమనిషితో* నిజమే మాట్లాడండి.+ ఎందుకంటే మనందరం ఒకే శరీరంలోని అవయవాలం.+ 26 మీకు కోపం వచ్చినా, పాపం మాత్రం చేయకండి,+ సూర్యుడు అస్తమించే లోపే మీ కోపాన్ని తీసేసుకోండి;+ 27 అపవాదికి అవకాశం* ఇవ్వకండి.+ 28 దొంగతనం చేసేవాళ్లు ఇకనుండి దొంగతనం చేయకూడదు; బదులుగా కష్టపడి పనిచేయాలి,+ అవసరంలో ఉన్నవాళ్లకు ఎంతోకొంత ఇవ్వగలిగేలా తమ సొంత చేతులతో నిజాయితీగల పని చేయాలి.+ 29 మీ నోటి నుండి చెడ్డ మాట అనేదే రాకూడదు.+ బదులుగా, వినేవాళ్లకు ప్రయోజనం కలిగేలా అవసరాన్ని బట్టి, బలపర్చే మంచి మాటలే మాట్లాడండి.+ 30 దేవుని పవిత్రశక్తిని బాధపెట్టకండి.*+ మీరు విమోచన క్రయధనం* ద్వారా విడుదల పొందే+ రోజు కోసం దేవుడు ఆ పవిత్రశక్తితోనే మీకు ముద్ర వేశాడు.+

31 మీరు అన్నిరకాల ద్వేషం, అలాగే కోపం, ఆగ్రహం, అరవడం, తిట్టడం, అన్నిరకాల చెడుతనం మానేయండి.+ 32 బదులుగా ఒకరితో ఒకరు దయగా మెలగండి, కనికరం చూపించండి,+ క్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి.+

5 కాబట్టి మీరు, దేవునికి ప్రియమైన పిల్లల్లా ఆయన్ని అనుకరించండి,+ 2 ప్రేమతో నడుచుకుంటూ ఉండండి, క్రీస్తు కూడా మనల్ని* ప్రేమించి,+ మన* కోసం తనను తాను దేవునికి పరిమళభరిత అర్పణగా, బలిగా అర్పించుకున్నాడు.+

3 లైంగిక పాపం,* అన్నిరకాల అపవిత్రత, అత్యాశ అనేవాటి ప్రస్తావన కూడా మీ మధ్య రానివ్వకండి,+ అది పవిత్రులకు తగదు;+ 4 అంతేకాదు అవమానకరమైన ప్రవర్తన, మూర్ఖంగా మాట్లాడడం, అసభ్యమైన హాస్యం అనేవి కూడా పవిత్రులకు తగవు. బదులుగా, మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉండండి.+ 5 ఎందుకంటే లైంగిక పాపి*+ గానీ, అపవిత్రుడు గానీ, విగ్రహపూజ చేసేవాళ్లతో సమానుడైన అత్యాశపరుడు+ గానీ క్రీస్తు పరిపాలించే దేవుని రాజ్యానికి వారసుడు అవ్వడని+ మీకు తెలుసు, ఈ విషయాన్ని మీరు పూర్తిగా అర్థంచేసుకున్నారు.

6 పనికిరాని మాటలతో ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి, ఎందుకంటే అలాంటివాటి వల్ల అవిధేయుల మీదికి దేవుని ఆగ్రహం వస్తుంది. 7 కాబట్టి, మీరు వాళ్లలా ఉండకండి; 8 ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువు శిష్యులుగా వెలుగులో ఉన్నారు.+ కాబట్టి వెలుగు బిడ్డల్లా నడుచుకోండి, 9 ఎందుకంటే వెలుగు ఫలంలో అన్నిరకాల మంచితనం, నీతి, సత్యం ఉన్నాయి.+ 10 ప్రభువుకు ఏది ఇష్టమో జాగ్రత్తగా తెలుసుకుంటూ* ఉండండి;+ 11 పనికిరాని చీకటి పనులు మానేయండి;+ బదులుగా వాటిని బట్టబయలు చేయండి. 12 ఎందుకంటే, ప్రజలు రహస్యంగా చేసే పనుల గురించి ప్రస్తావించడం కూడా సిగ్గుచేటు. 13 వెలుగు అన్నిటినీ బట్టబయలు చేస్తుంది, కాబట్టి బట్టబయలు అయ్యేవన్నీ వెలుగే. 14 అందుకే దేవుడు ఇలా అంటున్నాడు: “నిద్రిస్తున్న ఓ మనిషీ, మేలుకో, మృతుల్లో నుండి బ్రతికి రా,+ క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు.”+

15 కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ తెలివితక్కువవాళ్లలా కాకుండా తెలివిగలవాళ్లలా నడుచుకోండి, 16 మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి,* ఎందుకంటే రోజులు చెడ్డవి. 17 అందుకే మీరు మూర్ఖుల్లా ప్రవర్తించకండి, బదులుగా యెహోవా* ఇష్టం ఏమిటో అర్థంచేసుకుంటూ ఉండండి.+ 18 అంతేకాదు మద్యం* మత్తులో ఉండకండి,+ అది విపరీత* ప్రవర్తనకు దారి తీస్తుంది. బదులుగా పవిత్రశక్తితో నింపబడుతూ ఉండండి. 19 కీర్తనలు, దేవుణ్ణి స్తుతించే పాటలు, ఆరాధనా గీతాలు పాడుతూ*+ ఒకరినొకరు బలపర్చుకోండి, మీ హృదయాల్లో యెహోవాకు* స్తుతిగీతాలు పాడండి,+ 20 ఎల్లప్పుడూ మన తండ్రైన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరున ప్రతీ విషయంలో కృతజ్ఞతలు చెప్తూ ఉండండి.+

21 క్రీస్తు మీద ప్రగాఢ గౌరవంతో* ఒకరికొకరు లోబడివుండండి.+ 22 భార్యలు ప్రభువుకు లోబడివున్నట్టే భర్తలకు లోబడివుండాలి.+ 23 ఎందుకంటే, సంఘం అనే శరీరానికి క్రీస్తు శిరస్సుగా,+ రక్షకుడిగా ఉన్నట్టే, భర్త కూడా తన భార్యకు శిరస్సుగా ఉన్నాడు.+ 24 సంఘం క్రీస్తుకు లోబడివున్నట్టే, భార్య కూడా ప్రతీ విషయంలో భర్తకు లోబడివుండాలి. 25 భర్తలారా, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి, దానికోసం తన ప్రాణం పెట్టాడు,+ అలాగే మీరు కూడా మీ భార్యల్ని ప్రేమిస్తూ ఉండండి;+ 26 ఆయన, సంఘాన్ని దేవుని వాక్యమనే నీళ్లతో కడిగి పవిత్రపర్చాలని+ అలా చేశాడు; 27 సంఘం మచ్చ గానీ ముడత గానీ ఇంకే లోపం గానీ లేకుండా+ పవిత్రంగా, నిష్కళంకంగా ఉండాలని,+ అలా అది తన కళ్లముందు వైభవంగా కనిపించాలని ఆయన అలా చేశాడు.

28 అలాగే భర్తలు కూడా తమ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్టు తమ భార్యల్ని ప్రేమించాలి. తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకుంటున్నాడు. 29 ఏ మనిషీ తన శరీరాన్ని ద్వేషించుకోడు కానీ దాన్ని పోషించి, సంరక్షించుకుంటాడు. క్రీస్తు కూడా సంఘాన్ని అలాగే చూసుకుంటున్నాడు. 30 ఎందుకంటే మనం ఆయన శరీర అవయవాలం.+ 31 “అందుకే, పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెట్టి, తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు,* వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు.”+ 32 ఈ పవిత్ర రహస్యం+ గొప్పది. ఇప్పుడు నేను క్రీస్తు గురించి, సంఘం గురించి మాట్లాడుతున్నాను.+ 33 ఏదేమైనా, మీలో ప్రతీ ఒక్కరు తనను తాను ప్రేమించుకున్నట్టు తన భార్యను ప్రేమించాలి;+ భార్య విషయానికొస్తే, ఆమెకు తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి.+

6 పిల్లలారా, ప్రభువు ఇష్టానికి అనుగుణంగా మీ అమ్మానాన్నల మాట వినండి,*+ ఇది దేవుని దృష్టికి సరైనది. 2 వాగ్దానంతో పాటు ఇవ్వబడిన మొదటి ఆజ్ఞ ఇదే: “నువ్వు మీ అమ్మానాన్నల్ని గౌరవించు.+ 3 అప్పుడు నీ జీవితం బాగుంటుంది,* నువ్వు భూమ్మీద ఎక్కువకాలం జీవిస్తావు.” 4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం తెప్పించకండి;+ బదులుగా యెహోవా* నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను,+ ఉపదేశాన్ని ఇస్తూ* వాళ్లను పెంచండి.+

5 దాసులారా, క్రీస్తుకు విధేయత చూపించినట్టు, భూమ్మీదున్న మీ యజమానులకు భయంతో, గౌరవంతో మనస్ఫూర్తిగా విధేయత చూపించండి.+ 6 మనుషుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో, వాళ్లు చూస్తున్నప్పుడు మాత్రమే కాదుగానీ+ క్రీస్తు దాసుల్లా దేవుని ఇష్టాన్ని జరిగిస్తున్నట్టు నిండు హృదయంతో* విధేయత చూపించండి.+ 7 మనుషులకు సేవ చేస్తున్నట్టు కాకుండా యెహోవాకు* సేవ చేస్తున్నట్టు+ మంచి మనసుతో చేయండి. 8 ఎందుకంటే దాసుడైనా, స్వతంత్రుడైనా మంచిపని చేసే ప్రతీ వ్యక్తి యెహోవా* నుండి ప్రతిఫలం పొందుతాడని మీకు తెలుసు.+ 9 యజమానులారా, మీరు కూడా మీ దాసులతో అలాగే ప్రవర్తించండి, వాళ్లను బెదిరించకండి. ఎందుకంటే వాళ్లకూ మీకూ యజమాని అయిన వ్యక్తి పరలోకంలో ఉన్నాడని+ మీకు తెలుసు. ఆయనకు పక్షపాతం లేదు.

10 చివరిగా నేను మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, ప్రభువు తన మహాబలంతో ఇచ్చే శక్తిని పొందుతూ ఉండండి.+ 11 మీరు అపవాది పన్నాగాలకు* పడిపోకుండా స్థిరంగా నిలబడగలిగేలా దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని ధరించండి.+ 12 ఎందుకంటే, మనం పోరాడుతున్నది*+ మనుషులతో కాదు; మనం ప్రభుత్వాలతో, అధికారాలతో, ఈ చీకటి ప్రపంచ పాలకులతో, అంటే పరలోకంలోని చెడ్డదూతల* సైన్యంతో+ పోరాడుతున్నాం. 13 అందుకే, మీరు దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని ధరించండి.+ మీరలా చేస్తే, శత్రువు దాడిచేసినప్పుడు* అతన్ని ఎదిరించగలుగుతారు; మీరు చేయాల్సినవన్నీ చేస్తే, స్థిరంగా నిలబడి పోరాడగలుగుతారు.

14 కాబట్టి మీరు నడుముకు సత్యం అనే దట్టీ కట్టుకుని,+ ఛాతికి నీతి అనే కవచం తొడుక్కుని+ స్థిరంగా నిలబడండి; 15 మీ పాదాలకు, శాంతి సువార్త ప్రకటించడం కోసం సంసిద్ధత అనే చెప్పులు వేసుకోండి.+ 16 వీటన్నిటితో పాటు విశ్వాసం అనే పెద్ద డాలు పట్టుకోండి,+ దానితో మీరు దుష్టుడి అగ్ని బాణాలన్నీ* ఆర్పేయగలుగుతారు.+ 17 అంతేకాదు, మీ తలకు రక్షణ అనే శిరస్త్రాణం* పెట్టుకోండి,+ పవిత్రశక్తి ద్వారా ఇవ్వబడిన దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకోండి.+ 18 అలాగే, ప్రతీ సందర్భంలో అన్నిరకాల ప్రార్థనలతో,+ అభ్యర్థనలతో పవిత్రశక్తికి అనుగుణంగా ప్రార్థిస్తూ ఉండండి.+ అందుకోసం ఎల్లప్పుడూ మెలకువగా ఉంటూ, పవిత్రులందరి కోసం వేడుకుంటూ ఉండండి. 19 నేను మంచివార్త గురించిన పవిత్ర రహస్యాన్ని తెలియజేయడానికి నోరు తెరిచినప్పుడు సరైన పదాలతో ధైర్యంగా మాట్లాడగలిగేలా నాకోసం కూడా ప్రార్థించండి.+ 20 ఆ మంచివార్త కోసమే నేను సంకెళ్లు వేయబడిన రాయబారిగా పనిచేస్తున్నాను.+ నేను దాని గురించి మాట్లాడాల్సినంత ధైర్యంగా మాట్లాడేలా నాకోసం ప్రార్థించండి.

21 ప్రియ సహోదరుడూ ప్రభువుకు నమ్మకమైన పరిచారకుడూ అయిన తుకికు+ నా గురించి, నా పనుల గురించి మీకు అన్నీ వివరంగా చెప్తాడు.+ 22 మేమెలా ఉన్నామో మీకు తెలియాలని, అతను మీ హృదయాలకు ఊరటనివ్వాలని అతన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను.

23 తండ్రైన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి సహోదరులు శాంతిని, విశ్వాసంతో కూడిన ప్రేమను పొందాలని కోరుకుంటున్నాను. 24 మన ప్రభువైన యేసుక్రీస్తు మీద చెక్కుచెదరని ప్రేమ ఉన్నవాళ్లందరికీ దేవుని అపారదయ తోడుండాలి.

అంటే, క్రీస్తుతో.

అక్ష., “(విత్తనం) పడకముందే,” అంటే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టకముందే.

అక్ష., “కుమారులుగా.”

పదకోశం చూడండి.

లేదా “బయానా (అడ్వాన్సు); పూచీ (టోకెన్‌).”

అక్ష., “సొత్తును.”

లేదా “మనోనేత్రాల్ని.”

లేదా “యుగంలో.” పదకోశం చూడండి.

లేదా “తలగా.”

లేదా “పోకడలకు.”

లేదా “అవిధేయత పుత్రుల.”

లేదా “అనుగ్రహంతో.”

అక్ష., “వ్యవస్థల్లో.” లేదా “యుగాల్లో.” పదకోశం చూడండి.

లేదా “నిబంధనల్లో.”

అక్ష., “కొత్త వ్యక్తిగా.”

పదకోశం చూడండి.

అక్ష., “ఒక్క శరీరంగా.”

అనుబంధం A5 చూడండి.

లేదా “ఆ గృహనిర్వాహకత్వం.”

లేదా “దీనమనస్సుతో.”

లేదా “సరైన మార్గం.”

లేదా “కానుకల్ని.”

లేదా “సువార్తికులుగా.”

లేదా “పవిత్రులకు శిక్షణ ఇవ్వడానికి.”

అంటే, సంఘాన్ని.

అక్ష., “కట్టడానికి.”

లేదా “వ్యర్థమైన.”

అక్ష., “వాళ్ల మనసులు.”

లేదా “సిగ్గులేని ప్రవర్తనలో.” గ్రీకులో అసెల్జీయ. పదకోశం చూడండి.

లేదా “మనసును నిర్దేశించే శక్తిని.” అక్ష., “మానసిక స్ఫూర్తిని.”

లేదా “పొరుగువాడితో.”

లేదా “చోటు.”

లేదా “దుఃఖపెట్టకండి.”

పదకోశం చూడండి.

లేదా “మిమ్మల్ని” అయ్యుంటుంది.

లేదా “మీ” అయ్యుంటుంది.

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

పదకోశంలో “లైంగిక పాపం” చూడండి.

లేదా “నిర్ధారించుకుంటూ.”

అక్ష., “నియమిత సమయాన్ని కొనుక్కోండి.”

అనుబంధం A5 చూడండి.

అక్ష., “ద్రాక్షారసం.”

లేదా “అమర్యాదకరమైన.”

లేదా “మీకోసం పాడుకుంటూ” అయ్యుంటుంది.

అనుబంధం A5 చూడండి.

అక్ష., “భయంతో.”

లేదా “భార్యతోనే ఉండిపోతాడు.”

లేదా “విధేయులై ఉండండి.”

లేదా “నువ్వు వర్ధిల్లుతావు.”

అనుబంధం A5 చూడండి.

లేదా “మార్గనిర్దేశాన్ని ఇస్తూ; ఆయన మనసును నాటుతూ.”

లేదా “ప్రాణంతో.” పదకోశం చూడండి.

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “వ్యూహాలకు.”

అక్ష., “మన కుస్తీపట్టు.”

పదకోశం చూడండి.

అక్ష., “చెడ్డ రోజున.”

లేదా “విసిరే ఆయుధాలన్నీ; చిన్న బల్లెములన్నీ.”

అంటే, హెల్మెట్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి