కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt అపొస్తలుల కార్యములు 1:1-28:31
  • అపొస్తలుల కార్యాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అపొస్తలుల కార్యాలు
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
అపొస్తలుల కార్యాలు

అపొస్తలుల కార్యాలు

1 ఓ థెయొఫిలా, నేను నీకు రాసిన మొదటి పుస్తకంలో యేసు చేసిన, బోధించిన వాటన్నిటి గురించి వివరించాను.+ 2 అంటే, యేసు తాను ఎంచుకున్న అపొస్తలులకు* పవిత్రశక్తి ద్వారా నిర్దేశాలు ఇచ్చి, పరలోకానికి ఎత్తబడిన+ రోజు వరకు చేసిన, బోధించిన వాటన్నిటి గురించి వివరించాను. 3 ఆయన బాధలు పడిన తర్వాత, తాను బ్రతికి ఉన్నానని ఎన్నో ఒప్పింపజేసే రుజువులతో వాళ్లకు చూపించుకున్నాడు.+ 40 రోజులపాటు ఆయన వాళ్లకు చాలాసార్లు కనిపించి, దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. 4 ఆయన వాళ్లను కలిసినప్పుడు వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు యెరూషలేమును విడిచి వెళ్లకండి.+ తండ్రి వాగ్దానం నెరవేరేవరకు ఎదురుచూస్తూ ఉండండి.+ ఆ వాగ్దానం గురించి మీరు నా దగ్గర విన్నారు. 5 యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు. అయితే, కొన్ని రోజుల్లో మీరు పవిత్రశక్తితో బాప్తిస్మం పొందుతారు.”+

6 కాబట్టి వాళ్లు మళ్లీ కలుసుకున్నప్పుడు, “ప్రభువా, ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని మళ్లీ ఇస్తావా?”+ అని ఆయన్ని అడిగారు. 7 దానికి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “సమయాల్ని, కాలాల్ని తండ్రి తన అధికారం కింద ఉంచుకున్నాడు.+ వాటిని మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 8 అయితే పవిత్రశక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు;+ అప్పుడు యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో,+ భూమంతటా+ మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.”*+ 9 ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, వాళ్లు చూస్తుండగానే పైకి ఎత్తబడ్డాడు. ఒక మేఘం ఆయన్ని కప్పేసింది, దాంతో వాళ్లిక ఆయన్ని చూడలేకపోయారు.+ 10 ఆయన వెళ్తున్నప్పుడు వాళ్లు ఆకాశంలోకి అలాగే చూస్తూ ఉన్నారు. ఇంతలో తెల్లని వస్త్రాలు వేసుకున్న ఇద్దరు మనుషులు+ హఠాత్తుగా వాళ్ల పక్కన నిలబడి 11 ఇలా అన్నారు: “గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు? మీ దగ్గర నుండి ఆకాశంలోకి ఎత్తబడిన ఈ యేసు ఏ విధంగా ఆకాశంలోకి వెళ్లడం మీరు చూశారో అదేవిధంగా వస్తాడు.”

12 అప్పుడు వాళ్లు ఒలీవల కొండ నుండి యెరూషలేముకు తిరిగొచ్చారు.+ ఆ కొండ యెరూషలేముకు సుమారు ఒక కిలోమీటరు* దూరంలోనే ఉంది. 13 వాళ్లు వచ్చాక, తాము బస చేస్తున్న మేడగదిలోకి వెళ్లారు. వాళ్లెవరంటే: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, ఉత్సాహవంతుడైన సీమోను, యాకోబు కుమారుడైన యూదా.+ 14 వీళ్లందరూ, వీళ్లతోపాటు ఇంకొందరు స్త్రీలు,+ యేసు తమ్ముళ్లు,+ ఆయన తల్లి మరియ కలిసి ఏక మనసుతో పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నారు.

15 అలాంటి ఒక రోజున పేతురు అక్కడున్న సహోదరుల (దాదాపు 120 మంది) మధ్య నిలబడి ఇలా అన్నాడు: 16 “సహోదరులారా,* యూదా గురించి పవిత్రశక్తి దావీదు ద్వారా చెప్పిన లేఖనం+ నెరవేరాల్సి ఉంది. ఈ యూదా యేసును బంధించినవాళ్లకు దారి చూపించాడు.+ 17 అతను మాలో ఒకడిగా లెక్కించబడ్డాడు,+ మాలాగే పరిచర్య చేశాడు. 18 (అన్యాయంగా సంపాదించిన డబ్బుతో అతను ఒక పొలం కొన్నాడు.+ అతను తలకిందులుగా పడడంతో అతని శరీరం చీలిపోయి లోపలి అవయవాలన్నీ బయటికి వచ్చాయి.+ 19 ఈ సంగతి యెరూషలేము ప్రజలందరికీ తెలిసింది. దాంతో ఆ పొలానికి వాళ్ల భాషలో అకెల్దమ అనే పేరు వచ్చింది. ఆ మాటకు “రక్తపు పొలం” అని అర్థం.) 20 ఎందుకంటే కీర్తనల పుస్తకంలో ఇలా రాయబడింది: ‘అతను నివసించే చోటు నిర్మానుష్యమైపోవాలి. అందులో ఒక్క నివాసి కూడా ఉండకూడదు.’+ ‘అతని స్థానాన్ని* వేరే వ్యక్తి తీసుకోవాలి.’+ 21 కాబట్టి మనం ఒకర్ని ఎంచుకోవాలి. యేసు మన మధ్య పరిచర్య చేసిన* కాలమంతటిలో అతను మనతోపాటు ఉన్నవాడై ఉండాలి; 22 యేసు యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నప్పటి+ నుండి పరలోకానికి ఎత్తబడిన+ రోజు వరకు అతను మనతోపాటు ఉన్నవాడై ఉండాలి; అంతేకాదు, మనలాగే యేసు పునరుత్థానాన్ని+ చూసినవాడై ఉండాలి.”

23 కాబట్టి వాళ్లు ఇద్దరు వ్యక్తుల్ని సూచించారు. ఒకతను, బర్సబ్బా అని పిలవబడిన యోసేపు. ఇతన్ని యూస్తు అని కూడా పిలిచేవాళ్లు. ఇంకొకతను మత్తీయ. 24 తర్వాత వాళ్లు ప్రార్థన చేసి ఇలా అన్నారు: “యెహోవా,* నీకు అందరి హృదయాలు తెలుసు.+ ఈ ఇద్దరిలో నువ్వు ఎవర్ని ఎంచుకున్నావో దయచేసి మాకు చూపించు. 25 తన సొంత దారిలో వెళ్లడం కోసం యూదా వదిలేసిన ఈ పరిచర్యను, అపొస్తలత్వాన్ని పొందడానికి నువ్వు ఎవర్ని ఎంచుకున్నావో దయచేసి మాకు చూపించు.”+ 26 కాబట్టి వాళ్లు ఆ ఇద్దరి గురించి చీట్లు* వేశారు,+ చీటి మత్తీయ పేరు మీద వచ్చింది. కాబట్టి అతను 11 మంది అపొస్తలులతో పాటు లెక్కించబడ్డాడు.*

2 పెంతెకొస్తు పండుగ రోజున+ శిష్యులందరూ ఒకే చోట ఉన్నారు. 2 అప్పుడు ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. అది వేగంగా వీచే బలమైన గాలి శబ్దంలా ఉంది. వాళ్లు కూర్చున్న ఇల్లంతా ఆ శబ్దంతో నిండిపోయింది.+ 3 అప్పుడు అగ్ని లాంటి నాలుకలు వాళ్లకు కనిపించాయి. ఆ నాలుకలు విడిపోయి, వాళ్లలో ఒక్కొక్కరి మీద ఒక్కో నాలుక వాలింది. 4 దాంతో వాళ్లంతా పవిత్రశక్తితో నిండిపోయారు;+ ఆ పవిత్రశక్తి ఇచ్చిన సామర్థ్యం ప్రకారం వాళ్లు వేర్వేరు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు.+

5 ఆ సమయంలో భూమ్మీదున్న* అన్నిదేశాల నుండి వచ్చిన దైవభక్తిగల యూదులు యెరూషలేములో ఉన్నారు.+ 6 ఆ శబ్దం వినిపించినప్పుడు చాలామంది ప్రజలు అక్కడికి వచ్చారు. శిష్యులు ఆ ప్రజల్లో ప్రతీ ఒక్కరి మాతృభాషలో మాట్లాడడం విని వాళ్లంతా అవాక్కయ్యారు. 7 వాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయి ఇలా అన్నారు: “ఇక్కడ చూడండి, మాట్లాడుతున్న వీళ్లంతా గలిలయ వాళ్లే కదా?+ 8 అయితే మనలో ప్రతీ ఒక్కరం, వీళ్లు మన మాతృభాషల్లో* మాట్లాడడం వింటున్నామేంటి? 9 మనలో పార్తీయులు, మాదీయులు,+ ఏలామీయులు,+ మెసొపొతమియ, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా ప్రాంతం వాళ్లు,+ 10 ఫ్రుగియ, పంఫూలియ, ఐగుప్తు,* కురేనేకు దగ్గర్లో ఉన్న లిబియ ప్రాంతాల నివాసులు, రోము నుండి వచ్చి యెరూషలేములో తాత్కాలికంగా నివసిస్తున్న యూదులు, యూదులుగా మారిన అన్యజనులు,+ 11 క్రేతీయులు, అరబీయులు ఉన్నారు. వీళ్లు మన భాషల్లో దేవుని శక్తివంతమైన కార్యాల గురించి మాట్లాడడం మనమంతా వింటున్నాం.” 12 వాళ్లంతా ఆశ్చర్యపోయి, అయోమయంతో, “అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?” అని చెప్పుకున్నారు. 13 అయితే ఇతరులు శిష్యుల్ని ఎగతాళి చేస్తూ, “వీళ్లు కొత్త* ద్రాక్షారసం తాగిన మత్తులో ఉన్నారు” అని అన్నారు.

14 అయితే పేతురు పదకొండుమంది అపొస్తలులతో+ పాటు లేచి నిలబడి బిగ్గరగా ఇలా అన్నాడు: “యూదయ మనుషులారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త ప్రజలారా, మీకు ఈ విషయం తెలియాలి. మీరు నా మాటలు జాగ్రత్తగా వినండి. 15 మీరు అనుకుంటున్నట్టు వీళ్లేమీ తాగిన మత్తులో లేరు. ఎందుకంటే ఇప్పుడు సమయం దాదాపు ఉదయం 9 గంటలే.* 16 అయితే, యోవేలు ప్రవక్త చెప్పిన ఈ మాటలు వీళ్ల విషయంలో నెరవేరుతున్నాయి: 17 ‘దేవుడు ఇలా అంటున్నాడు: “చివరి రోజుల్లో అన్నిరకాల ప్రజల మీద నా పవిత్రశక్తిని* కుమ్మరిస్తాను. మీ కుమారులు, కూతుళ్లు ప్రవచిస్తారు. మీ యౌవనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు.+ 18 ఆ రోజుల్లో నేను నా దాసుల మీద, దాసురాళ్ల మీద కూడా నా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను; వాళ్లు ప్రవచిస్తారు.+ 19 అంతేకాదు, నేను పైన ఆకాశంలో అద్భుతాల్ని, కింద భూమ్మీద సూచనల్ని అంటే రక్తాన్ని, అగ్నిని, పొగ మేఘాల్ని కలగజేస్తాను. 20 మహిమాన్వితమైన యెహోవా* మహారోజు రాకముందు సూర్యుడు చీకటి అవుతాడు, చంద్రుడు రక్తంలా మారతాడు. 21 అప్పుడు యెహోవా* పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.” ’+

22 “ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి: దేవుడు నజరేయుడైన యేసు ద్వారా మీ మధ్య శక్తివంతమైన పనుల్ని, అద్భుతాల్ని, సూచనల్ని చేసి యేసును తానే పంపించానని స్పష్టంగా చూపించాడు.+ ఈ సంగతి మీకు బాగా తెలుసు. 23 యేసు బంధించబడతాడని దేవునికి ముందే తెలుసు, కాబట్టి దేవుడే తన ఇష్టప్రకారం* దాన్ని నిర్ణయించాడు.+ ఈ వ్యక్తినే మీరు ధర్మశాస్త్రం తెలియనివాళ్ల చేత కొయ్యకు దిగగొట్టించి చంపేశారు.+ 24 అయితే దేవుడు ఆయన్ని మరణ బంధకాల* నుండి విడిపించి, మళ్లీ బ్రతికించాడు.+ ఎందుకంటే, మరణం ఆయన్ని బంధించి ఉంచడం అసాధ్యం.+ 25 దావీదు ఆయన గురించి ఇలా చెప్పాడు: ‘నేను ఎప్పుడూ యెహోవాను* నా ముందు* ఉంచుకుంటాను. ఆయన నా కుడిపక్కన ఉన్నాడు కాబట్టి నేను ఎప్పటికీ కదిలించబడను. 26 అందుకే నా హృదయం ఉల్లాసంగా ఉంది, నా నాలుక ఎంతో సంతోషిస్తోంది. నేను* ఆశతో జీవిస్తాను; 27 ఎందుకంటే నువ్వు నన్ను* సమాధిలో* విడిచిపెట్టవు. నీ విశ్వసనీయుణ్ణి కుళ్లిపోనివ్వవు.+ 28 జీవ మార్గాలు నువ్వు నాకు తెలియజేశావు; నీ సన్నిధిలో నా హృదయాన్ని గొప్ప సంతోషంతో నింపుతావు.’+

29 “సహోదరులారా, మన కుటుంబ పెద్ద దావీదు గురించి నన్ను ధైర్యంగా మాట్లాడనివ్వండి. దావీదు చనిపోయి పాతిపెట్టబడ్డాడని,+ అతని సమాధి ఈ రోజు వరకు మన మధ్యే ఉందని మీకు తెలుసు. 30 దావీదు ఒక ప్రవక్త; అంతేకాదు, అతని సంతానంలో ఒకర్ని అతని సింహాసనం మీద కూర్చోబెడతానని దేవుడు ఒట్టేసి చేసిన ప్రమాణం అతనికి తెలుసు.+ 31 క్రీస్తు పునరుత్థానం గురించి దావీదుకు ముందే తెలుసు, అతను దాని గురించి మాట్లాడాడు కూడా. దేవుడు క్రీస్తును సమాధిలో* విడిచిపెట్టలేదని, ఆయన శరీరం కుళ్లిపోలేదని దావీదు చెప్పాడు.+ 32 ఈ యేసునే దేవుడు పునరుత్థానం చేశాడు, దీనికి మేమందరం సాక్షులం.+ 33 ఆయన హెచ్చించబడి దేవుని కుడివైపున కూర్చున్నాడు;+ తండ్రి వాగ్దానం చేసిన పవిత్రశక్తిని పొందాడు.+ కాబట్టి మీరు చూస్తున్న, వింటున్న ఈ పవిత్రశక్తిని కుమ్మరించాడు. 34 దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అయితే అతనే స్వయంగా ఇలా చెప్పాడు: ‘యెహోవా* నా ప్రభువుతో ఇలా అన్నాడు: 35 “నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు నువ్వు నా కుడిపక్కన కూర్చో.” ’+ 36 కాబట్టి మీరు కొయ్య మీద శిక్ష వేసిన ఈ యేసునే+ దేవుడు ప్రభువుగా,+ క్రీస్తుగా నియమించాడని ఇశ్రాయేలు ఇంటివాళ్లందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి.”

37 ఆ మాట విన్నప్పుడు వాళ్లకు గుండెల్లో పొడిచినట్టు అనిపించింది. దాంతో వాళ్లు పేతురును, మిగతా అపొస్తలుల్ని, “సహోదరులారా, ఇప్పుడు మేము ఏంచేయాలి?” అని అడిగారు. 38 అప్పుడు పేతురు వాళ్లకిలా చెప్పాడు: “పశ్చాత్తాపపడండి,+ మీ పాపాలు క్షమించబడేలా+ మీలో ప్రతీ ఒక్కరు యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం తీసుకోండి.+ అప్పుడు మీరు పవిత్రశక్తి అనే ఉచిత బహుమతిని పొందుతారు. 39 ఎందుకంటే ఈ వాగ్దానం,+ మన దేవుడైన యెహోవా* తన దగ్గరికి పిలిచే వాళ్లందరి కోసం అంటే మీ కోసం, మీ పిల్లల కోసం, దూరాన ఉన్న వాళ్లందరి కోసం చేయబడింది.”+ 40 అతను ఇంకా చాలా మాటలతో పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చి, “ఈ చెడ్డ తరానికి+ దూరంగా ఉండి నాశనాన్ని తప్పించుకోండి” అంటూ వాళ్లను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 41 కాబట్టి అతని మాటను సంతోషంగా అంగీకరించినవాళ్లు బాప్తిస్మం తీసుకున్నారు.+ ఆ రోజు దాదాపు 3,000 మంది వాళ్లతో చేరారు.+ 42 వాళ్లు అపొస్తలులు బోధించేవాటిని పట్టుదలతో నేర్చుకుంటూ, తమ దగ్గర ఉన్నవన్నీ ఒకరితో ఒకరు పంచుకుంటూ,* కలిసి భోంచేస్తూ,+ ప్రార్థిస్తూ ఉన్నారు.+

43 అపొస్తలులు ఎన్నో అద్భుతాలు, సూచనలు చేయడం మొదలుపెట్టారు.+ ఇది చూసిన ప్రతీ ఒక్కరిలో భయం మొదలైంది. 44 విశ్వాసులైన వాళ్లందరూ కలిసి ఉన్నారు, తమకు ఉన్నవన్నీ ఒకరితో ఒకరు పంచుకున్నారు. 45 వాళ్లు తమ భూముల్ని, ఆస్తిపాస్తుల్ని అమ్మి,+ వచ్చిన డబ్బును అందరికీ వాళ్లవాళ్ల అవసరాన్ని బట్టి పంచిపెడుతూ ఉన్నారు.+ 46 వాళ్లు ప్రతీరోజు ఏక మనసుతో, ఒకే ఉద్దేశంతో ఆలయంలో కలుసుకుంటూ, వేర్వేరు ఇళ్లలో భోంచేస్తూ, తమ ఆహారాన్ని ఎంతో సంతోషంతో పంచుకుంటూ ఉన్నారు. వాళ్లు ప్రతీది మనస్ఫూర్తిగా చేస్తూ, 47 దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రజలందరి దగ్గర మంచిపేరు సంపాదించుకుంటూ ఉన్నారు. అదే సమయంలో, రక్షణ మార్గంలో ప్రవేశించినవాళ్లను యెహోవా* ప్రతీరోజు వాళ్లతో చేరుస్తూ ఉన్నాడు.+

3 ఒకరోజు ప్రార్థన సమయమప్పుడు అంటే దాదాపు మధ్యాహ్నం మూడింటికి* పేతురు, యోహాను ఆలయానికి వెళ్తున్నారు. 2 అదే సమయంలో, పుట్టినప్పటి నుండి కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తిని కొంతమంది మోసుకెళ్తున్నారు. అతను ఆలయానికి వచ్చేవాళ్ల దగ్గర డబ్బులు అడుక్కునేలా, వాళ్లు అతన్ని ప్రతీరోజు ఆలయంలో సౌందర్యం అనే ద్వారం దగ్గర ఉంచేవాళ్లు. 3 అతను ఆలయంలోకి వెళ్లబోతున్న పేతురును, యోహానును చూసినప్పుడు, వాళ్లను డబ్బులు అడగడం మొదలుపెట్టాడు. 4 అప్పుడు పేతురు, యోహాను అతని వైపు సూటిగా చూశారు. పేతురు అతనితో, “మా వైపు చూడు” అన్నాడు. 5 కాబట్టి అతను వాళ్ల దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అనే ఆశతో వాళ్ల వైపే చూస్తూ ఉన్నాడు. 6 అయితే పేతురు, “వెండిబంగారాలు నా దగ్గర లేవు కానీ నా దగ్గర ఏది ఉందో అదే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు పేరున చెప్తున్నాను, లేచి నడువు!” అన్నాడు. 7 ఆ మాట చెప్పి పేతురు అతని కుడిచెయ్యి పట్టుకొని పైకి లేపాడు. వెంటనే అతని పాదాలకు, చీలమండలకు బలం వచ్చింది.+ 8 అతను వెంటనే లేచి, నడుస్తూ గెంతుతూ+ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్లతోపాటు ఆలయంలోకి వెళ్లాడు. 9 అతను నడవడం, దేవుణ్ణి స్తుతించడం అక్కడున్న వాళ్లంతా చూశారు. 10 డబ్బులు అడుక్కోవడానికి ఆలయంలో సౌందర్య ద్వారం దగ్గర కూర్చునే వ్యక్తి అతనే అని వాళ్లు గుర్తుపట్టారు. అతనికి జరిగింది చూసి వాళ్లు ఎంతో ఆశ్చర్యంలో, సంతోషంలో మునిగిపోయారు.

11 అతను పేతురు యోహానుల చేతులు పట్టుకొని ఉండగానే, సొలొమోను మంటపంలో ఉన్న వీళ్ల దగ్గరికి+ ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యంతో పరుగెత్తుకుంటూ వచ్చారు. 12 అది చూసి పేతురు వాళ్లతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, దీని గురించి మీరెందుకు ఇంతగా ఆశ్చర్యపోతున్నారు? మేమేదో మా సొంత శక్తితోనో, దైవభక్తితోనో అతన్ని నడిచేలా చేసినట్టు ఎందుకు మా వైపు ఇలా కళ్లార్పకుండా చూస్తున్నారు? 13 మన పూర్వీకుల దేవుడు, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు+ తన సేవకుడైన+ యేసును మహిమపర్చాడు.+ ఆ యేసును మీరు అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినా మీరు ఆయన్ని వద్దనుకున్నారు. 14 అవును, పవిత్రుడూ నీతిమంతుడూ అయిన ఆయన్ని మీరు వద్దనుకున్నారు. బదులుగా నరహంతకుడైన ఒక వ్యక్తిని మీ కోసం విడుదల చేయమని పిలాతును అడిగారు.+ 15 జీవాన్ని ఇవ్వడానికి నియమించబడిన ముఖ్య ప్రతినిధిని*+ మీరు చంపారు. అయితే దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు, ఈ వాస్తవానికి మేము సాక్షులం.+ 16 ఆయన పేరు ద్వారా, అంటే ఆయన పేరులో మాకున్న విశ్వాసాన్ని బట్టి మీరు చూస్తున్న, మీకు తెలిసిన ఈ వ్యక్తి బలపర్చబడ్డాడు. యేసు వల్ల మాకున్న విశ్వాసాన్ని బట్టి ఈ వ్యక్తి మీ అందరి కళ్లముందు పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడు. 17 సహోదరులారా, మీ నాయకుల్లాగే+ మీరు కూడా తెలియకే అలా చేశారని+ నాకు తెలుసు. 18 క్రీస్తు బాధలు పడతాడని దేవుడు తన ప్రవక్తలందరి ద్వారా ముందే ప్రకటించిన విషయాలు నెరవేరేలా దేవుడే దాన్ని అనుమతించాడు.+

19 “కాబట్టి మీరు పశ్చాత్తాపపడి+ దేవుని వైపు తిరగండి.+ అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి,*+ యెహోవాయే* మీకు సేదదీర్పును ఇస్తాడు.* 20 మీ కోసం నియమించబడిన క్రీస్తును, అంటే యేసును పంపిస్తాడు. 21 అయితే, అన్నిటినీ చక్కదిద్దే* సమయాలు వస్తాయని గతంలో తన పవిత్ర ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పాడు; అప్పటివరకు యేసు పరలోకంలోనే ఉండాలి. 22 నిజానికి మోషే ఇలా చెప్పాడు: ‘మీ దేవుడైన యెహోవా* మీ కోసం మీ సహోదరుల్లో నుండి నాలాంటి ఒక ప్రవక్తను రప్పిస్తాడు.+ ఆయన మీకు చెప్పే ప్రతీది మీరు వినాలి.+ 23 ఎవరైనా* ఆ ప్రవక్త చెప్పింది వినకపోతే అతను ప్రజల్లో ఉండకుండా పూర్తిగా నాశనం చేయబడతాడు.’+ 24 మోషే మాత్రమే కాదు, సమూయేలు దగ్గర నుండి ప్రవక్తలందరూ ఈ రోజుల గురించి స్పష్టంగా ప్రకటించారు.+ 25 మీరు ప్రవక్తల పిల్లలు, దేవుడు మీ పూర్వీకులతో చేసిన ఒప్పందానికి* వారసులు.+ దేవుడు అబ్రాహాముతో ఇలా చెప్పాడు: ‘నీ సంతానం* ద్వారా భూమ్మీదున్న అన్ని కుటుంబాలు దీవించబడతాయి.’+ 26 దేవుడు తన సేవకుణ్ణి లేపిన తర్వాత, ఆయన్ని ముందుగా మీ దగ్గరికి పంపించాడు.+ మీలో ప్రతీ ఒక్కర్ని మీ చెడుపనుల నుండి పక్కకు మళ్లించి మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన అలా చేశాడు.”

4 పేతురు, యోహాను* ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు యాజకులు, ఆలయ పర్యవేక్షకుడు, సద్దూకయ్యులు+ వాళ్ల దగ్గరికి వచ్చారు. 2 అపొస్తలులు ప్రజలకు బోధిస్తుండడం, మృతుల్లో నుండి యేసు పునరుత్థానం గురించి* అందరిముందు ప్రకటిస్తుండడం+ చూసి వాళ్లకు చిరాకొచ్చింది. 3 కాబట్టి వాళ్లు ఆ ఇద్దర్నీ పట్టుకొని తర్వాతి రోజు వరకు బంధించి ఉంచారు,+ ఎందుకంటే అప్పటికే సాయంత్రమైంది. 4 అయితే, వాళ్ల మాటలు విన్నవాళ్లలో చాలామంది నమ్మారు, దాంతో శిష్యుల్లో పురుషుల సంఖ్య దాదాపు 5,000కు చేరుకుంది.+

5 తర్వాతి రోజు యూదుల నాయకులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో సమావేశమయ్యారు. 6 వాళ్లతోపాటు ముఖ్య యాజకుడు అన్న,+ కయప,+ యోహాను, అలెక్సంద్రు, అలాగే ముఖ్య యాజకుడి బంధువులందరు కూడా వచ్చారు. 7 వాళ్లు పేతురును, యోహానును తమ మధ్య నిలబెట్టి, “ఏ అధికారంతో, ఎవరి పేరున మీరు దీన్ని చేశారు?” అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. 8 అప్పుడు పేతురు పవిత్రశక్తితో నిండిపోయి,+ వాళ్లతో ఇలా అన్నాడు:

“నాయకులారా, పెద్దలారా, 9 ఈ కుంటివాడి విషయంలో జరిగిన మంచిపని+ గురించి ఈ రోజు మమ్మల్ని విచారణ చేస్తున్నారా, అతనెలా బాగయ్యాడో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? 10 అలాగైతే మీరంతా, అలాగే ఇశ్రాయేలు ప్రజలంతా ఈ విషయం తెలుసుకోవాలి: నజరేయుడైన యేసుక్రీస్తు పేరున,+ ఆయన ద్వారానే ఈ వ్యక్తి మీ ముందు ఆరోగ్యంగా నిలబడ్డాడు. ఆ యేసుక్రీస్తునే మీరు కొయ్య మీద శిక్ష వేసి చంపారు,+ కానీ దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు.+ 11 ‘కట్టేవాళ్లయిన మీరు వద్దనుకున్న రాయి, ముఖ్యమైన మూలరాయి* అయింది,’ ఆ రాయి యేసే.+ 12 అంతేకాదు, ఆయన ద్వారా తప్ప ఇంకెవ్వరి ద్వారా రక్షణ రాదు. ఎందుకంటే, మనల్ని రక్షించడానికి ప్రజల్లో నుండి దేవుడు ఎంచుకున్న* వేరే ఏ పేరూ భూమ్మీద* లేదు.”+

13 వాళ్లు పేతురు యోహానుల ధైర్యం చూసి, వాళ్లు చదువుకోని* సామాన్యులని+ గ్రహించినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరు యేసుతోపాటు ఉండేవాళ్లని వాళ్లు గ్రహించడం మొదలుపెట్టారు.+ 14 బాగైన వ్యక్తి వాళ్లిద్దరితో పాటు నిలబడి ఉండడం చూసినప్పుడు+ వాళ్లు ఏమీ బదులు చెప్పలేకపోయారు.+ 15 కాబట్టి వాళ్లు ఆ ముగ్గుర్ని మహాసభ నుండి బయటికి వెళ్లమని ఆజ్ఞాపించి, ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు: 16 “వీళ్లను మనం ఏమి చేయాలి?+ నిజంగానే వీళ్లు ఒక అసాధారణమైన సూచన చేశారు, ఇది యెరూషలేములోని వాళ్లందరికీ తెలిసిపోయింది,+ దీన్ని మనం కాదనలేం. 17 అయితే ఈ విషయం ప్రజల్లో ఇంకా వ్యాప్తిచెందకుండా ఉండేలా, ఆ పేరున ఇక ఎవరితోనూ మాట్లాడవద్దని వాళ్లను బెదిరిద్దాం.”+

18 కాబట్టి వాళ్లు ఆ ఇద్దరు శిష్యుల్ని పిలిచి, యేసు పేరున ఏమీ మాట్లాడవద్దని, బోధించవద్దని ఆజ్ఞాపించారు. 19 అప్పుడు పేతురు, యోహాను వాళ్లతో ఇలా అన్నారు: “దేవుని మాట కాకుండా మీ మాట వినడం దేవుని దృష్టిలో సరైనదేనా? మీరే ఆలోచించండి. 20 మేమైతే చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేం.”+ 21 దాంతో వాళ్లు ఆ ఇద్దర్ని ఇంకోసారి బెదిరించి, విడుదల చేశారు. ఎందుకంటే వాళ్లను శిక్షించడానికి వాళ్లకు ఏ కారణం దొరకలేదు, పైగా వాళ్లు ప్రజలకు భయపడ్డారు.+ ఎందుకంటే ప్రజలందరూ జరిగినదాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. 22 అంతేకాదు, ఈ అద్భుతం* ద్వారా బాగైన వ్యక్తి వయసు 40 ఏళ్ల పైనే ఉంటుంది.

23 విడుదలైన తర్వాత పేతురు, యోహాను తమ సొంత ప్రజల దగ్గరికి వెళ్లి, ముఖ్య యాజకులు, పెద్దలు తమతో అన్న మాటల్ని వాళ్లకు చెప్పారు. 24 అది విన్నాక, వాళ్లంతా కలిసి దేవునికి ఇలా ప్రార్థించారు:

“సర్వోన్నత ప్రభువా, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న వాటన్నిటినీ నువ్వే చేశావు.+ 25 నీ సేవకుడూ మా పూర్వీకుడూ అయిన దావీదు నోట పవిత్రశక్తి ద్వారా నువ్వే ఈ మాటలు అన్నావు:+ ‘దేశాలు ఎందుకు అల్లకల్లోలంగా మారాయి? దేశదేశాల ప్రజలు ఎందుకు పనికిరాని వాటి గురించి ఆలోచిస్తున్నారు? 26 భూరాజులు యెహోవాకు,* ఆయన అభిషిక్తునికి* వ్యతిరేకంగా నిలబడ్డారు, పరిపాలకులు వాళ్లకు వ్యతిరేకంగా పోగయ్యారు.’+ 27 నిజంగానే హేరోదు, పొంతి పిలాతు+ అన్యజనులతో ఇశ్రాయేలీయులతో కలిసి, నువ్వు అభిషేకించిన+ నీ పవిత్ర సేవకుడైన యేసుకు వ్యతిరేకంగా ఈ నగరంలో గుమికూడారు. 28 నువ్వు ముందే చెప్పినవి జరగాలని వాళ్లు అలా గుమికూడారు. నీ ఇష్టప్రకారం, నీ శక్తితో నువ్వే అలా జరిగేలా చేశావు.+ 29 అయితే ఇప్పుడు, యెహోవా,* దయచేసి వాళ్ల బెదిరింపుల్ని విని, నీ దాసులు నీ వాక్యాన్ని పూర్తి ధైర్యంతో ప్రకటిస్తూ ఉండేలా సహాయం చేయి. 30 అదే సమయంలో, నువ్వు నీ శక్తితో రోగుల్ని బాగుచేస్తూ ఉండు. నీ పవిత్ర సేవకుడైన యేసు పేరు ద్వారా సూచనలు, అద్భుతాలు జరుగుతూ ఉండేలా చేయి.”+

31 వాళ్లు పట్టుదలగా ప్రార్థించినప్పుడు,* వాళ్లు సమావేశమైన స్థలం కంపించింది; వాళ్లలో ప్రతీ ఒక్కరు పవిత్రశక్తితో నిండిపోయి+ దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు.+

32 అంతేకాదు విశ్వసించినవాళ్లు చాలామంది ఉన్నారు, వాళ్లందరికీ ఒకే అభిప్రాయం* ఉంది. వాళ్లలో ఏ ఒక్కరూ తమకున్నవి తమవని అనుకునేవాళ్లు కాదు. బదులుగా, తమకు ఉన్నవన్నీ ఇతరులతో పంచుకునేవాళ్లు.+ 33 అపొస్తలులు గొప్ప శక్తితో ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు,+ దేవుడు వాళ్లందరి మీద తన అపారదయ చూపించాడు. 34 నిజానికి వాళ్లలో ఎవరికీ లోటు ఉండేది కాదు.+ ఎందుకంటే పొలాలు, ఇళ్లు ఉన్నవాళ్లందరూ వాటిని అమ్మి, వచ్చిన డబ్బును 35 అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేవాళ్లు.+ అపొస్తలులు ఆ డబ్బును ప్రతీ ఒక్కరికి వాళ్లవాళ్ల అవసరాన్ని బట్టి పంచేవాళ్లు.+ 36 కుప్రకు చెందిన ఒక లేవీయుడు ఉండేవాడు. అతని పేరు యోసేపు. అపొస్తలులు అతనికి బర్నబా+ (ఆ మాటను అనువదిస్తే, “ఓదార్పు పుత్రుడు”* అని అర్థం) అనే పేరు పెట్టారు. 37 అతనికి కొంత భూమి ఉంది. అతను దాన్ని అమ్మి, వచ్చిన డబ్బును అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.+

5 అయితే అననీయ అనే ఒక వ్యక్తి, తన భార్య సప్పీరాతో కలిసి తమ ఆస్తిలో కొంత అమ్మాడు. 2 కానీ వచ్చిన దానిలో కొంత డబ్బును రహస్యంగా తన దగ్గరే పెట్టుకున్నాడు, ఈ విషయం అతని భార్యకు కూడా తెలుసు. అతను మిగతా డబ్బును తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.+ 3 అయితే పేతురు ఇలా అన్నాడు: “అననీయా, పవిత్రశక్తిని మోసం చేసేలా,+ పొలం డబ్బులో కొంత రహస్యంగా నీ దగ్గర పెట్టుకునేలా* సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించాడు? 4 నువ్వు దాన్ని అమ్మకముందు ఆ భూమి నీదే కదా? దాన్ని అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ దగ్గరే ఉంది కదా? ఇలాంటి చెడ్డపని చేయాలని అసలు నీకెలా అనిపించింది? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడావు.” 5 ఈ మాటలు వినగానే అననీయ కుప్పకూలి చనిపోయాడు. దాని గురించి విన్న వాళ్లందరికీ చాలా భయమేసింది. 6 తర్వాత అక్కడున్న కొంతమంది యువకులు లేచి అతన్ని బట్టల్లో చుట్టి, మోసుకెళ్లి, పాతిపెట్టారు.

7 సుమారు మూడు గంటలు గడిచిన తర్వాత, జరిగింది తెలియక అతని భార్య అక్కడికి వచ్చింది. 8 పేతురు ఆమెను, “చెప్పు, మీరిద్దరు ఇంత మొత్తానికే పొలాన్ని అమ్మారా?” అని అడిగాడు. అందుకు ఆమె, “అవును, ఇంతకే అమ్మాం” అంది. 9 అప్పుడు పేతురు ఆమెతో, “యెహోవా* పవిత్రశక్తిని పరీక్షించాలని మీరిద్దరూ కలిసి ఎందుకు అనుకున్నారు? ఇదిగో! నీ భర్తను పాతిపెట్టినవాళ్లు తలుపు దగ్గరే ఉన్నారు, వాళ్లు నిన్ను కూడా మోసుకెళ్తారు” అన్నాడు. 10 ఆ క్షణమే ఆమె పేతురు పాదాల దగ్గర కుప్పకూలి చనిపోయింది. ఆ యువకులు లోపలికి వచ్చినప్పుడు ఆమె చనిపోయి ఉండడం చూసి, ఆమెను బయటికి మోసుకెళ్లి, ఆమె భర్త పక్కనే ఆమెను పాతిపెట్టారు. 11 దాంతో సంఘమంతటికీ, ఈ విషయాల గురించి విన్న వాళ్లందరికీ చాలా భయమేసింది.

12 అంతేకాదు, అపొస్తలులు ప్రజల మధ్య ఎన్నో సూచనలు, అద్భుతాలు చేస్తూ వచ్చారు.+ వాళ్లంతా సొలొమోను మంటపంలో కలుసుకునేవాళ్లు.+ 13 వేరే ఎవ్వరికీ వాళ్లతో కలిసే ధైర్యం లేకపోయింది. అయినా, ప్రజలు వాళ్ల గురించి గొప్పగా మాట్లాడుకునేవాళ్లు. 14 అంతేకాదు ఇంకా చాలామంది స్త్రీపురుషులు ప్రభువు మీద విశ్వాసముంచి శిష్యులయ్యారు.+ 15 చివరికి ప్రజలు రోగుల్ని ముఖ్య వీధుల్లోకి తీసుకొచ్చి చిన్న పరుపుల మీద, చాపల మీద పడుకోబెట్టారు; పేతురు అటువైపుగా వెళ్తున్నప్పుడు కనీసం అతని నీడైనా వాళ్లలో కొంతమంది మీద పడాలని అలా చేశారు.+ 16 పైగా, యెరూషలేము చుట్టుపక్కల నగరాల నుండి ప్రజలు గుంపులుగుంపులుగా వస్తూ ఉన్నారు. వాళ్లు రోగుల్ని, అపవిత్ర దూతలు* పట్టినవాళ్లను మోసుకొని వచ్చారు. వాళ్లలో ప్రతీ ఒక్కరు బాగయ్యారు.

17 అయితే అసూయతో నిండిపోయిన ప్రధానయాజకుడు, అతనితో ఉన్న వాళ్లందరూ అంటే సద్దూకయ్యుల తెగవాళ్లు కోపంతో లేచి 18 అపొస్తలుల్ని పట్టుకుని* చెరసాలలో వేశారు.+ 19 కానీ రాత్రిపూట యెహోవా* దూత ఆ చెరసాల తలుపులు తెరిచి,+ వాళ్లను బయటికి తీసుకొచ్చి ఇలా చెప్పాడు: 20 “మీరు ఆలయానికి వెళ్లి, రాబోయే జీవితం గురించి ప్రజలతో మాట్లాడుతూ ఉండండి.” 21 ఆ మాటలు విన్నాక, వాళ్లు తెల్లవారుజామున ఆలయంలోకి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు.

ప్రధానయాజకుడు, అతనితో ఉన్నవాళ్లు వచ్చాక వాళ్లు మహాసభను, ఇశ్రాయేలీయుల* పెద్దలందర్నీ* సమావేశపర్చారు. అపొస్తలుల్ని తమ ముందుకు తీసుకురమ్మని అధికారుల్ని చెరసాలకు పంపించారు. 22 అయితే ఆ అధికారులు అక్కడికి వెళ్లినప్పుడు, వాళ్లకు చెరసాలలో అపొస్తలులు కనిపించలేదు. దాంతో వాళ్లు తిరిగొచ్చి ఆ విషయం చెప్పారు. 23 వాళ్లు ఇలా అన్నారు: “చెరసాల భద్రంగా తాళం వేసి ఉంది. భటులు తలుపుల దగ్గరే నిలబడి ఉన్నారు. కానీ దాన్ని తెరిచినప్పుడు లోపల ఎవరూ లేరు.” 24 ఆలయ పర్యవేక్షకుడు, ముఖ్య యాజకులు ఆ మాటలు విన్నప్పుడు, ఇది ఎక్కడికి దారితీస్తుందో అని కంగారుపడ్డారు. 25 అయితే ఒక వ్యక్తి వాళ్ల దగ్గరికి వచ్చి, “ఇదిగో! మీరు చెరసాలలో వేసినవాళ్లు ఆలయంలో ఉన్నారు, వాళ్లు ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు. 26 అప్పుడు ఆలయ పర్యవేక్షకుడు తన అధికారులతో పాటు వెళ్లి వాళ్లను తీసుకొచ్చాడు. కానీ వాళ్లమీద ఎలాంటి దౌర్జన్యం చేయలేదు. ఎందుకంటే ప్రజలు తమను రాళ్లతో కొట్టి చంపుతారేమో అని వాళ్లు భయపడ్డారు.+

27 కాబట్టి వాళ్లు ఆ అపొస్తలుల్ని తీసుకొచ్చి మహాసభ ముందు నిలబెట్టారు. అప్పుడు ప్రధానయాజకుడు వాళ్లను ప్రశ్నిస్తూ 28 ఇలా అన్నాడు: “ఆ పేరున ఇక బోధించవద్దని మేము మీకు గట్టిగా ఆజ్ఞాపించాం.+ అయినాసరే, మీరు మీ బోధతో యెరూషలేమును నింపేశారు. మీరు ఆ వ్యక్తి చావుకు* మమ్మల్ని బాధ్యుల్ని చేయాలనుకుంటున్నారు.”+ 29 అప్పుడు పేతురు, మిగతా అపొస్తలులు ఇలా అన్నారు: “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు.+ 30 మీరు కొయ్యకు* వేలాడదీసి చంపిన యేసును మన పూర్వీకుల దేవుడు లేపాడు.+ 31 తన కుడిపక్కన కూర్చునేలా దేవుడు ఆయన్ని హెచ్చించాడు.+ ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ పొందేలా+ దేవుడు ఆయన్ని ముఖ్య ప్రతినిధిగా,+ రక్షకునిగా+ నియమించాడు. 32 ఈ విషయాలకు మేము సాక్షులం.+ తనకు లోబడేవాళ్లకు* దేవుడు ఇచ్చిన పవిత్రశక్తి కూడా వీటికి సాక్షిగా ఉంది.”+

33 ఆ మాట విన్నప్పుడు వాళ్లకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో వాళ్లు అపొస్తలుల్ని చంపాలనుకున్నారు. 34 అయితే గమలీయేలు+ అనే ఒక పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలబడ్డాడు. అతను ప్రజలందరూ గౌరవించే ధర్మశాస్త్ర బోధకుడు. అతను, అపొస్తలుల్ని కాసేపు బయట ఉంచమని ఆజ్ఞాపించాడు. 35 తర్వాత, అక్కడున్న వాళ్లతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీళ్లకు విధించాలనుకుంటున్న శిక్ష విషయంలో జాగ్రత్తగా ఉండండి. 36 కొంతకాలం క్రితం, థూదా అనే వ్యక్తి తాను ఒక ప్రముఖుణ్ణని చెప్పుకున్నాడు. దాదాపు 400 మంది అతనితో చేరారు. అయితే అతను చంపబడ్డాడు. అప్పుడు అతని గుంపు చెల్లాచెదురైపోయింది, ఎక్కడా లేకుండా పోయింది. 37 ఆ తర్వాత, జనసంఖ్య తీసుకున్న రోజుల్లో గలిలయవాడైన యూదా బయల్దేరాడు. అతను ప్రజలు తనను అనుసరించేలా చేసుకున్నాడు. అతను కూడా లేకుండా పోయాడు, అతన్ని అనుసరించిన వాళ్లందరూ చెల్లాచెదురైపోయారు. 38 కాబట్టి నేను మీకు చెప్పేదేమిటంటే, ఈ మనుషుల జోలికి వెళ్లకండి, వాళ్లను అలా వదిలేయండి. ఈ ఆలోచన గానీ ఈ పని గానీ మనుషుల నుండి వచ్చినదైతే అది నాశనమైపోతుంది. 39 కానీ అది దేవుని నుండి వచ్చినదైతే, మీరు దాన్ని నాశనం చేయలేరు.+ చివరికి మీరు దేవునితోనే పోరాడేవాళ్లు అవుతారేమో.”+ 40 వాళ్లు అతని మాట విని అపొస్తలుల్ని పిలిపించి, వాళ్లను కొట్టించి,+ ఇకమీదట యేసు పేరున మాట్లాడవద్దని ఆజ్ఞాపించి వాళ్లను వదిలేశారు.

41 వాళ్లు యేసు పేరు కోసం అవమానించబడే గొప్ప అవకాశం తమకు దక్కిందని సంతోషిస్తూ+ మహాసభ నుండి వెళ్లిపోయారు. 42 వాళ్లు ప్రతీరోజు ఆలయంలో, అలాగే ఇంటింటా+ మానకుండా బోధిస్తూ, క్రీస్తు గురించిన అంటే యేసు గురించిన మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.+

6 ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నప్పుడు, గ్రీకు భాష మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే, ప్రతీరోజు ఆహారం పంచిపెడుతున్నప్పుడు, గ్రీకు భాష మాట్లాడే విధవరాళ్లు నిర్లక్ష్యానికి గురౌతున్నారు.+ 2 కాబట్టి పన్నెండుమంది అపొస్తలులు శిష్యులందర్నీ పిలిచి ఇలా అన్నారు: “ఆహారం పంచిపెట్టడం కోసం మేము దేవుని వాక్యాన్ని బోధించే పనిని ఆపడం సరైనది కాదు.*+ 3 కాబట్టి సహోదరులారా, మీ మధ్య మంచిపేరు ఉన్న, పవిత్రశక్తితో తెలివితో నిండిన+ ఏడుగురు పురుషుల్ని మీరే ఎంచుకోండి;+ మేము వాళ్లను ఈ అవసరమైన పని మీద నియమిస్తాం.+ 4 మేము మాత్రం ప్రార్థించడానికి, వాక్యాన్ని బోధించడానికి* మా పూర్తి సమయాన్ని, శక్తిని వెచ్చిస్తాం.” 5 వాళ్లు చెప్పిన మాట శిష్యులందరికీ నచ్చింది. కాబట్టి వాళ్లు విశ్వాసంతో, పవిత్రశక్తితో నిండిన స్తెఫనును, అలాగే ఫిలిప్పును,+ ప్రొకొరును, నీకానోరును, తీమోనును, పర్మెనాసును, అంతియొకయకు చెందిన నీకొలాసును ఎంచుకున్నారు. ఈ నీకొలాసు యూదా మతంలోకి మారినవాడు. 6 శిష్యులు వీళ్లను అపొస్తలుల దగ్గరికి తీసుకొచ్చారు. అపొస్తలులు ప్రార్థన చేసి, వాళ్ల మీద చేతులు ఉంచారు.+

7 దానివల్ల దేవుని వాక్యం వ్యాప్తిచెందుతూ ఉంది.+ యెరూషలేములో శిష్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది.+ యాజకుల్లో కూడా చాలామంది విశ్వాసులయ్యారు.+

8 స్తెఫను దేవుని అనుగ్రహంతో, శక్తితో నిండిపోయి ప్రజల మధ్య గొప్ప అద్భుతాల్ని, సూచనల్ని చేస్తూ ఉన్నాడు. 9 కానీ స్వతంత్రుల* సమాజమందిరానికి చెందిన కొంతమంది; కురేనీయులు, అలెక్సంద్రియులు కొంతమంది; కిలికియ, ఆసియా నుండి వచ్చిన కొంతమంది ముందుకొచ్చి స్తెఫనుతో వాదనకు దిగారు. 10 అయితే స్తెఫను తెలివితో, పవిత్రశక్తితో మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్లు అతని ముందు నిలవలేకపోయారు.+ 11 అప్పుడు వాళ్లు, “ఇతను మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడడం మేము విన్నాం” అనే మాట ప్రజల్లో వ్యాప్తి చేయమని కొంతమందిని రహస్యంగా ఉసిగొల్పారు. 12 అంతేకాదు వాళ్లు ప్రజల్ని, పెద్దల్ని, శాస్త్రుల్ని కూడా రెచ్చగొట్టారు. వాళ్లు హఠాత్తుగా అతని మీదికి వచ్చి, బలవంతంగా అతన్ని పట్టుకొని, మహాసభకు తీసుకెళ్లారు. 13 వాళ్లు అబద్ధ సాక్షుల్ని ముందుకు తీసుకొచ్చారు, ఆ సాక్షులు ఇలా చెప్పారు: “ఇతను దేవుని ఆలయానికి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఆపట్లేదు. 14 ఉదాహరణకు, నజరేయుడైన యేసు ఈ ఆలయాన్ని పడగొడతాడని, మోషే మనకిచ్చిన ఆచారాల్ని ఆయన మారుస్తాడని ఇతను చెప్పడం మేము విన్నాం.”

15 మహాసభలో కూర్చున్న వాళ్లందరూ అతని ముఖాన్ని చూసినప్పుడు, అతని ముఖం వాళ్లకు దేవదూత ముఖంలా కనిపించింది.

7 అయితే ప్రధానయాజకుడు, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. 2 అప్పుడు స్తెఫను ఇలా అన్నాడు: “సహోదరులారా, తండ్రులారా, వినండి. మన పూర్వీకుడైన అబ్రాహాము హారానులో నివసించడానికి ముందు,+ మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి కనిపించి, 3 ‘నీ దేశాన్ని, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు’ అని చెప్పాడు.+ 4 తర్వాత అతను కల్దీయుల దేశం నుండి బయటికి వచ్చి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయాక,+ దేవుడు అతన్ని మీరు ఇప్పుడు ఉంటున్న ఈ దేశానికి వెళ్లమన్నాడు.+ 5 కానీ ఈ దేశంలో దేవుడు అతనికి వారసత్వ ఆస్తిగా ఏమీ ఇవ్వలేదు, కనీసం అతను కాలు పెట్టేంత స్థలం కూడా ఇవ్వలేదు. అయితే అతనికి, ఆ తర్వాత అతని సంతానానికి* ఈ దేశాన్ని వారసత్వ ఆస్తిగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.+ అప్పటికి అబ్రాహాముకు ఇంకా పిల్లలు లేరు. 6 అంతేకాదు, అతని సంతానం* తమది కాని దేశంలో పరదేశులుగా ఉంటారని, ఆ దేశ ప్రజలు వీళ్లను బానిసలుగా చేసుకొని 400 ఏళ్లపాటు వీళ్లను కష్టాలు పెడతారని దేవుడు అతనికి చెప్పాడు.+ 7 అయితే, ‘ఏ దేశంలో వాళ్లు బానిసలుగా ఉంటారో ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తాను.+ ఇవి జరిగిన తర్వాత వాళ్లు ఆ దేశం నుండి బయటికి వచ్చి ఈ స్థలంలో నాకు పవిత్రసేవ చేస్తారు’+ అని దేవుడు చెప్పాడు.

8 “దేవుడు అతనితో సున్నతి ఒప్పందం కూడా చేశాడు.+ తర్వాత అతను ఇస్సాకుకు తండ్రి అయ్యాడు,+ ఎనిమిదో రోజున అతనికి సున్నతి చేశాడు.+ ఇస్సాకు యాకోబుకు తండ్రి అయ్యాడు.* యాకోబు, 12 మంది కుటుంబ పెద్దలకు* తండ్రి అయ్యాడు. 9 ఆ కుటుంబ పెద్దలు యోసేపు మీద అసూయపడి+ అతన్ని ఐగుప్తీయులకు అమ్మేశారు.+ అయితే దేవుడు అతనికి తోడుగా ఉండి+ 10 అతనికి వచ్చిన శ్రమలన్నిటిలో అతన్ని కాపాడాడు; ఐగుప్తు రాజైన ఫరో ముందు అతనికి దయను, తెలివిని అనుగ్రహించాడు. ఫరో అతన్ని ఐగుప్తు మీద, తన ఇల్లంతటి మీద అధికారిగా నియమించాడు.+ 11 తర్వాత ఐగుప్తు దేశమంతటి మీదికి, అలాగే కనాను దేశమంతటి మీదికి కరువు వచ్చింది. అవును, గొప్ప శ్రమ వచ్చింది. దాంతో మన పూర్వీకులకు తినడానికి ఏమీ దొరకలేదు.+ 12 అయితే ఐగుప్తులో ఆహారం* ఉందని తెలియడంతో యాకోబు మన పూర్వీకుల్ని మొదటిసారి ఐగుప్తుకు పంపించాడు.+ 13 వాళ్లు రెండోసారి వెళ్లినప్పుడు, యోసేపు తాను ఎవరో తన సహోదరులకు చెప్పాడు. అప్పుడు యోసేపు కుటుంబం గురించి ఫరోకు తెలిసింది.+ 14 కాబట్టి యోసేపు తన తండ్రి యాకోబును, తన బంధువులందర్నీ కనాను దేశం నుండి రమ్మని కబురు పంపాడు.+ వాళ్లందరూ 75 మంది.+ 15 కాబట్టి యాకోబు ఐగుప్తుకు వెళ్లాడు.+ తర్వాత అతను అక్కడే చనిపోయాడు.+ అలాగే మన పూర్వీకులు కూడా చనిపోయారు.+ 16 వాళ్ల ఎముకల్ని షెకెముకు తీసుకెళ్లి, షెకెములో హమోరు కుమారుల దగ్గర అబ్రాహాము వెండి నాణేలతో కొన్న సమాధిలో  పెట్టారు.+

17 “దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేరే సమయం దగ్గరపడుతుండగా, ఐగుప్తులో ఇశ్రాయేలీయుల సంఖ్య ఎంతగానో పెరుగుతూ వచ్చింది. 18 తర్వాత, యోసేపు గురించి తెలియని ఇంకో రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలుపెట్టాడు.+ 19 అతను మన పూర్వీకుల మీద కుట్ర పన్నాడు. వాళ్ల పిల్లలు బ్రతికి ఉండకూడదనే ఉద్దేశంతో, పుట్టగానే ఆ పిల్లల్ని వదిలేయాలని వాళ్లను బలవంతం చేశాడు. అలా వాళ్లతో చెడుగా వ్యవహరించాడు.+ 20 ఆ సమయంలోనే మోషే పుట్టాడు, అతను చాలా* అందంగా ఉండేవాడు. మూడు నెలలు అతను తండ్రి ఇంట్లోనే పెరిగాడు.+ 21 అయితే అతను వదిలేయబడినప్పుడు+ ఫరో కూతురు అతన్ని తీసుకొని, తన సొంత కుమారుడిలా పెంచింది.+ 22 కాబట్టి ఐగుప్తీయుల విద్యలన్నిటినీ* మోషేకు నేర్పించారు. నిజానికి అతను శక్తివంతంగా మాట్లాడాడు, గొప్ప పనులు చేశాడు.+

23 “అతనికి 40 ఏళ్లు వచ్చినప్పుడు, తన సహోదరుల్ని అంటే ఇశ్రాయేలీయుల్ని చూడడానికి* వెళ్లాలని అతని మనసుకు అనిపించింది.*+ 24 అప్పుడు అతను ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయునితో అన్యాయంగా ప్రవర్తించడం చూసి ఆ ఇశ్రాయేలీయుణ్ణి కాపాడాడు, ఆ ఐగుప్తీయుణ్ణి చంపి తన సహోదరుని తరఫున పగతీర్చుకున్నాడు. 25 దేవుడు తన ద్వారా వాళ్లను కాపాడబోతున్నాడనే విషయాన్ని తన సహోదరులు గ్రహిస్తారని అతను అనుకున్నాడు. కానీ వాళ్లు గ్రహించలేదు. 26 తర్వాతి రోజు అతను వాళ్ల దగ్గరికి వెళ్లినప్పుడు ఇద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడుకోవడం చూశాడు. అతను వాళ్ల మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తూ, ‘మీరిద్దరు సహోదరులు. మీరెందుకు ఇలా పోట్లాడుకుంటున్నారు?’ అని అన్నాడు. 27 అయితే తన సహోదరుణ్ణి కొడుతున్న వ్యక్తి, మోషేను పక్కకు నెట్టేసి ఇలా అన్నాడు: ‘మా మీద పరిపాలకునిగా, న్యాయమూర్తిగా నిన్ను ఎవరు నియమించారు? 28 నిన్న ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టే నన్ను కూడా చంపాలనుకుంటున్నావా?’ 29 ఆ మాట విన్నప్పుడు మోషే పారిపోయి, మిద్యాను దేశంలో పరదేశిగా జీవించాడు. అక్కడ అతనికి ఇద్దరు కుమారులు పుట్టారు.+

30 “40 సంవత్సరాల తర్వాత, సీనాయి పర్వతం దగ్గరున్న ఎడారి* ప్రాంతంలో, మండుతున్న ముళ్లపొద మంటల్లో అతనికి ఒక దేవదూత కనిపించాడు.+ 31 ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మోషే ఎంతో ఆశ్చర్యపోయాడు. అదేమిటో తెలుసుకుందామని దాని దగ్గరికి వెళ్తుండగా, యెహోవా* స్వరం అతనికి ఇలా వినిపించింది: 32 ‘నేను మీ పూర్వీకుల దేవుణ్ణి, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి.’+ దాంతో మోషే వణికిపోయి, ఇక దానివైపు చూసే ధైర్యం చేయలేదు. 33 అప్పుడు యెహోవా* అతనితో ఇలా చెప్పాడు: ‘నీ పాదాలకున్న చెప్పులు తీసేయి, నువ్వు నిలబడిన స్థలం పవిత్రమైనది. 34 ఐగుప్తులో ఉన్న నా ప్రజలు పడుతున్న కష్టాల్ని నేను నిజంగా చూశాను, వాళ్ల మూల్గులు నేను విన్నాను.+ అందుకే వాళ్లను కాపాడడానికి దిగివచ్చాను. రా, నేను నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను.’ 35 ‘నిన్ను పరిపాలకునిగా, న్యాయమూర్తిగా ఎవరు నియమించారు?’+ అంటూ వాళ్లు తిరస్కరించిన ఆ మోషేనే దేవుడు పరిపాలకునిగా, విమోచకునిగా పంపించాడు.+ ముళ్లపొదలో అతనికి కనిపించిన దేవదూత ద్వారా అలా పంపించాడు. 36 ఈ మోషే ఐగుప్తులో, ఎర్రసముద్రం దగ్గర,+ అలాగే 40 సంవత్సరాల పాటు ఎడారిలో+ అద్భుతాలు, సూచనలు చేస్తూ+ వాళ్లను బయటికి నడిపించాడు.+

37 “ ‘దేవుడు మీ కోసం మీ సహోదరుల్లో నుండి నాలాంటి ఒక ప్రవక్తను రప్పిస్తాడు’+ అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతనే. 38 ఎడారిలో ఇశ్రాయేలీయుల* మధ్య ఉన్నదీ, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన+ దేవదూతతో,+ అలాగే మన పూర్వీకులతో ఉన్నదీ ఇతనే. ఇతనే మనకు ఇవ్వడానికి దేవుని నుండి సజీవమైన సందేశాన్ని అందుకున్నాడు.+ 39 మన పూర్వీకులు అతని మాట వినడానికి నిరాకరించారు.+ వాళ్లు అతన్ని పక్కకు నెట్టేసి, తమ హృదయాల్లో ఐగుప్తుకు వెళ్లాలని కోరుకున్నారు.+ 40 వాళ్లు అహరోనుతో ఇలా అన్నారు: ‘మనల్ని నడిపించడానికి మన కోసం దేవుళ్లను చేయి. ఐగుప్తు దేశం నుండి మనల్ని బయటికి నడిపించిన ఈ మోషేకు ఏమైందో తెలీదు.’+ 41 కాబట్టి వాళ్లు ఒక దూడ విగ్రహాన్ని తయారు చేసుకుని, దానికి బలి అర్పించారు, తమ చేతులతో చేసినదాన్ని చూస్తూ సంబరాలు జరుపుకున్నారు.+ 42 కాబట్టి ప్రవక్తల పుస్తకంలో రాసివున్నట్టే దేవుడు వాళ్లను సూర్య చంద్ర నక్షత్రాల్ని పూజించేలా వదిలేశాడు.+ ఆ పుస్తకంలో ఇలా రాసివుంది: ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, ఎడారిలో 40 సంవత్సరాల పాటు మీరు అర్పణలు, బలులు అర్పించింది నాకా? కాదు కదా? 43 మీరు మొలొకు గుడారాన్ని,+ రొంఫా దేవుడి నక్షత్రాన్ని ఒక చోటి నుండి ఇంకో చోటికి మోసుకెళ్లారు. మీరు పూజించడానికే ఆ ప్రతిమల్ని చేసుకున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని బబులోను అవతలికి పంపించేస్తాను.’+

44 “మన పూర్వీకులకు ఎడారిలో ఒక సాక్ష్యపు గుడారం ఉండేది. దాన్ని చేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. దేవుడు మోషేకు చూపించిన నమూనా ప్రకారం వాళ్లు దాన్ని చేశారు.+ 45 తర్వాత, మన పూర్వీకుల పిల్లలు ఆ గుడారాన్ని పొందారు. వాళ్లు యెహోషువతో పాటు అన్యజనుల దేశానికి వెళ్లినప్పుడు దాన్ని తమతో తీసుకెళ్లారు.+ దేవుడు మన పూర్వీకుల ముందు నుండి వాళ్లను వెళ్లగొట్టాడు.+ దావీదు రోజుల వరకు ఆ గుడారం అక్కడే ఉంది. 46 దావీదు దేవుని దృష్టిలో అనుగ్రహం పొందాడు. అతను యాకోబు దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టే గొప్ప అవకాశం తనకు ఇవ్వమని కోరాడు.+ 47 కానీ దేవుని కోసం ఆ మందిరాన్ని సొలొమోను కట్టాడు.+ 48 అయితే చేతులతో చేసిన మందిరాల్లో సర్వోన్నతుడు నివసించడు.+ దీని గురించి ప్రవక్త కూడా ఇలా చెప్పాడు: 49 ‘యెహోవా* ఇలా అంటున్నాడు: ఆకాశం నా సింహాసనం,+ భూమి నా పాదపీఠం.+ మీరు నా కోసం ఎలాంటి మందిరం కడతారు? నా విశ్రాంతి స్థలం ఎక్కడ? 50 వీటన్నిటినీ చేసింది నా చేతులే కదా?’+

51 “మొండి ప్రజలారా, మీరు మీ చెవులు మూసుకున్నారు, మీ ఆలోచనాతీరు మార్చుకోవడానికి సిద్ధంగా లేరు.* మీరు ఎప్పుడూ పవిత్రశక్తిని ఎదిరిస్తున్నారు. మీ పూర్వీకులు చేసినట్టే మీరూ చేస్తున్నారు.+ 52 మీ పూర్వీకులు హింసించని ప్రవక్త ఒక్కరైనా ఉన్నారా?+ అవును, ఆ నీతిమంతుని రాక గురించి ముందే ప్రకటించినవాళ్లను మీ పూర్వీకులు చంపేశారు.+ మీరేమో ఆ నీతిమంతునికి ద్రోహం చేసి, ఆయన్ని హత్య చేశారు;+ 53 దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని పొంది+ కూడా దాన్ని పాటించలేదు.”

54 ఆ మాటలు విన్నప్పుడు వాళ్లకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో వాళ్లు స్తెఫనును చూస్తూ పళ్లు కొరకడం మొదలుపెట్టారు. 55 అయితే అతను పవిత్రశక్తితో నిండిపోయి, ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. అతనికి దేవుని మహిమ, దేవుని కుడిపక్కన యేసు నిలబడి ఉండడం కనిపించింది.+ 56 అప్పుడు అతను, “ఇదిగో! ఆకాశం తెరవబడి ఉండడం, మానవ కుమారుడు+ దేవుని కుడిపక్కన నిలబడి ఉండడం+ నేను చూస్తున్నాను” అన్నాడు. 57 ఆ మాట వినగానే వాళ్లు గట్టిగా కేకలు వేస్తూ, తమ చెవులు మూసుకొని, ఒక్కసారిగా అందరూ అతని మీదికి వచ్చారు. 58 వాళ్లు అతన్ని నగరం బయటికి లాక్కొచ్చి, అతని మీదికి రాళ్లు విసరడం మొదలుపెట్టారు.+ అతని మీద అబద్ధసాక్ష్యం చెప్పినవాళ్లు+ తమ పైవస్త్రాల్ని సౌలు అనే ఒక యువకుడి పాదాల దగ్గర పెట్టారు.+ 59 వాళ్లు స్తెఫను మీద రాళ్లు విసురుతున్నప్పుడు, అతను ఇలా వేడుకున్నాడు: “యేసు ప్రభువా, నా ప్రాణాన్ని* నీకు అప్పగిస్తున్నాను.” 60 తర్వాత అతను మోకరించి బిగ్గరగా ఇలా అన్నాడు: “యెహోవా,* ఈ పాపానికి వాళ్లను బాధ్యులుగా ఎంచకు.”+ ఆ మాట అన్నాక, అతను చనిపోయాడు.*

8 స్తెఫను హత్యను సౌలు ఆమోదించాడు.+

ఆ రోజు నుండి యెరూషలేములో ఉన్న సంఘం మీదికి తీవ్రమైన హింస రావడం మొదలైంది. అపొస్తలులు తప్ప మిగతా శిష్యులందరూ యూదయ, సమరయ అంతటా చెదిరిపోయారు.+ 2 అయితే దైవభక్తిగల పురుషులు స్తెఫనును మోసుకెళ్లి సమాధి చేశారు. వాళ్లు అతని గురించి చాలా ఏడ్చారు. 3 సౌలు మాత్రం సంఘం మీద క్రూరంగా దాడిచేయడం మొదలుపెట్టాడు. అతను ఒక ఇంటి తర్వాత ఇంకో ఇంట్లో చొరబడి పురుషుల్ని, స్త్రీలను బయటికి ఈడ్చుకొచ్చి చెరసాలలో వేయించాడు.+

4 అయితే చెదిరిపోయినవాళ్లు తాము వెళ్లిన ప్రాంతాల్లో వాక్యం గురించిన మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.+ 5 ఫిలిప్పు సమరయ+ నగరానికి* వెళ్లి అక్కడి ప్రజలకు క్రీస్తు గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. 6 ప్రజలు గుంపులుగుంపులుగా వచ్చి ఫిలిప్పు మాటల్ని మనసుపెట్టి విన్నారు, అతను చేస్తూ ఉన్న సూచనల్ని గమనించారు. 7 వాళ్లలో అపవిత్ర దూతలు* పట్టినవాళ్లు చాలామంది ఉన్నారు. ఆ అపవిత్ర దూతలు పెద్దగా కేకలు వేస్తూ వాళ్లలో నుండి బయటికి వచ్చేవాళ్లు.+ అంతేకాదు చాలామంది పక్షవాతం ఉన్నవాళ్లు, కుంటివాళ్లు కూడా బాగయ్యారు. 8 దాంతో ఆ నగరమంతా సంతోషంతో నిండిపోయింది.

9 ఆ నగరంలో సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తాను గొప్పవాడినని చెప్పుకుంటూ తన ఇంద్రజాలంతో సమరయ వాసుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తేవాడు. 10 సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు అందరూ అతను చెప్పేది శ్రద్ధగా వింటూ, “ఇతను దేవుని శక్తి, గొప్ప శక్తి” అనేవాళ్లు. 11 అతను చాలాకాలంపాటు వాళ్లను తన ఇంద్రజాలంతో ఆశ్చర్యపర్చాడు కాబట్టి అతను చెప్పేది వాళ్లు శ్రద్ధగా వినేవాళ్లు. 12 అయితే ఫిలిప్పు వాళ్లకు దేవుని రాజ్యం గురించిన,+ యేసుక్రీస్తు పేరు గురించిన మంచివార్త ప్రకటించిన తర్వాత వాళ్లు అతన్ని నమ్మి పురుషులు, స్త్రీలు అందరూ బాప్తిస్మం తీసుకోవడం మొదలుపెట్టారు.+ 13 సీమోను కూడా విశ్వాసి అయ్యాడు. బాప్తిస్మం తీసుకున్నాక సీమోను ఫిలిప్పుతోనే+ ఉన్నాడు; జరుగుతున్న సూచనల్ని, గొప్ప శక్తివంతమైన పనుల్ని చూసి అతను ఎంతో ఆశ్చర్యపోయాడు.

14 సమరయ ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరించారని యెరూషలేములో ఉన్న అపొస్తలులు విన్నప్పుడు+ పేతురును, యోహానును వాళ్ల దగ్గరికి పంపించారు. 15 వీళ్లు సమరయకు వెళ్లి, అక్కడి విశ్వాసులు పవిత్రశక్తి పొందేలా వాళ్లకోసం ప్రార్థించారు.+ 16 ఎందుకంటే, వాళ్లు యేసు ప్రభువు పేరున బాప్తిస్మం తీసుకున్నారు కానీ అప్పటివరకు వాళ్లలో ఎవ్వరూ పవిత్రశక్తి పొందలేదు.+ 17 పేతురు, యోహాను వాళ్ల మీద చేతులు ఉంచినప్పుడు+ వాళ్లు పవిత్రశక్తి పొందడం మొదలైంది.

18 అపొస్తలులు ఎవరి మీదైనా చేతులు ఉంచితే వాళ్లు పవిత్రశక్తి పొందుతున్నారని సీమోను చూశాడు, కాబట్టి అతను అపొస్తలులకు డబ్బు ఇస్తూ, 19 “నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్లు పవిత్రశక్తి పొందేలా, ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి” అన్నాడు. 20 అయితే పేతురు అతనితో ఇలా అన్నాడు: “నీ వెండి నీతోపాటు నాశనమైపోవాలి. ఎందుకంటే, దేవుడు ఉచితంగా ఇచ్చే బహుమతిని నువ్వు డబ్బుతో కొనుక్కోగలనని+ అనుకున్నావు. 21 ఈ విషయంతో నీకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే దేవుని ముందు నీ హృదయం సరిగ్గా లేదు. 22 కాబట్టి నీ చెడుతనం విషయంలో పశ్చాత్తాపపడు. యెహోవాను* పట్టుదలగా వేడుకో. బహుశా ఆయన నీ హృదయంలోని చెడ్డ ఆలోచనను క్షమిస్తాడేమో. 23 ఎందుకంటే నువ్వు నాకు చేదైన విషంలా,* అవినీతికి దాసుడిలా కనిపిస్తున్నావు.” 24 అప్పుడు సీమోను వాళ్లతో, “మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా దయచేసి నా కోసం యెహోవాను* వేడుకోండి”* అన్నాడు.

25 వాళ్లు పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చి, యెహోవా* వాక్యం గురించి మాట్లాడిన తర్వాత యెరూషలేముకు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. వాళ్లు వెళ్తూవెళ్తూ, సమరయుల చాలా గ్రామాల్లో మంచివార్త ప్రకటిస్తూ ఉన్నారు.+

26 అయితే, యెహోవా* దూత+ ఫిలిప్పుతో మాట్లాడి ఇలా అన్నాడు: “నువ్వు లేచి దక్షిణం వైపు యెరూషలేము నుండి గాజాకు వెళ్లే దారి వెంబడి వెళ్లు.” (ఈ దారి ఎడారిలో ఉంది.) 27 దాంతో అతను లేచి వెళ్లాడు. అప్పుడు ఇదిగో! ఇతియోపీయుడైన ఒక ఆస్థాన అధికారి* అతనికి కనిపించాడు. అతను ఇతియోపీయుల రాణియైన కందాకే కింద పనిచేసేవాడు. అతను రాణి ఖజానా అంతటినీ చూసుకునేవాడు. దేవుణ్ణి ఆరాధించడం కోసం అతను యెరూషలేముకు వచ్చి+ 28 తిరిగెళ్తున్నాడు. అతను తన రథంలో కూర్చొని యెషయా ప్రవక్త గ్రంథాన్ని బిగ్గరగా చదువుతున్నాడు. 29 కాబట్టి దేవుడు తన పవిత్రశక్తి ద్వారా ఫిలిప్పుతో, “ఆ రథం దగ్గరికి వెళ్లు” అని చెప్పాడు. 30 అప్పుడు ఫిలిప్పు రథం పక్కనే పరుగెత్తుతూ, ఆ వ్యక్తి యెషయా ప్రవక్త గ్రంథాన్ని బిగ్గరగా చదువుతుండడం విని, “నువ్వు చదువుతున్నది నీకు అర్థమౌతోందా?” అని అడిగాడు. 31 అందుకు అతను, “ఎవరో ఒకరు విడమర్చి చెప్పకపోతే నాకెలా అర్థమౌతుంది?” అన్నాడు. తర్వాత అతను ఫిలిప్పును రథం ఎక్కి తనతోపాటు కూర్చోమని వేడుకున్నాడు. 32 అతను లేఖనాల్లోని ఈ భాగాన్ని చదువుతున్నాడు: “గొర్రెలా వధించబడడానికి ఆయన్ని తీసుకొచ్చారు. బొచ్చు కత్తిరించేవాళ్ల ముందు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు ఆయన తన నోరు తెరవలేదు.+ 33 ఆయన అవమానించబడినప్పుడు ఆయనకు న్యాయం జరగలేదు.+ భూమ్మీద లేకుండా ఆయన ప్రాణాన్ని తీసేశారు,+ ఆయన తరం గురించిన వివరాలు ఎవరు చెప్తారు?”

34 ఆ అధికారి ఫిలిప్పును, “ప్రవక్త ఎవరి గురించి ఈ మాటలు అన్నాడు? తన గురించా, వేరే వ్యక్తి గురించా? దయచేసి నాకు చెప్పు” అని అడిగాడు. 35 అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసు గురించిన మంచివార్త అతనికి ప్రకటించాడు. 36 వాళ్లు ఆ దారిలో వెళ్తుండగా వాళ్లకు నీళ్లు కనిపించాయి. దాంతో ఆ అధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్లు ఉన్నాయి; నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?” అని అడిగాడు. 37 *—— 38 వెంటనే అతను రథాన్ని ఆపమని ఆదేశించాడు. అప్పుడు ఫిలిప్పు, ఆ అధికారి నీళ్లలోకి దిగారు; ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. 39 వాళ్లు నీళ్లలో నుండి బయటికి వచ్చినప్పుడు, యెహోవా* పవిత్రశక్తి వెంటనే ఫిలిప్పును అక్కడి నుండి వేరే చోటికి తీసుకెళ్లింది. ఆ అధికారి అతన్ని ఇక చూడలేదు. అయితే ఆ అధికారి సంతోషంగా తన దారిన వెళ్లిపోయాడు. 40 ఫిలిప్పు అష్డోదుకు వెళ్లి, కైసరయకు+ వచ్చేవరకు ఆ నగరాలన్నిట్లో మంచివార్త ప్రకటిస్తూ ఉన్నాడు.

9 అయితే సౌలు ఇంకా ప్రభువు శిష్యుల్ని బెదిరిస్తూ ఉన్నాడు; వాళ్లను చంపేయాలని గట్టిగా కోరుకున్నాడు.+ అతను ప్రధానయాజకుడి దగ్గరికి వెళ్లి, 2 ప్రభువు మార్గానికి+ చెందిన స్త్రీపురుషులు ఎవరైనా కనిపిస్తే వాళ్లను బంధించి యెరూషలేముకు తీసుకొచ్చేలా, దమస్కు నగరంలోని సమాజమందిరాలకు ఉత్తరాలు రాసి ఇవ్వమని అడిగాడు.

3 అతను ప్రయాణిస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు, ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.+ 4 దాంతో అతను నేల మీద పడిపోయాడు. అప్పుడు ఒక స్వరం, “సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు?” అని తనతో చెప్పడం అతను విన్నాడు. 5 అప్పుడు సౌలు, “ప్రభువా, నువ్వెవరు?” అని అడిగాడు. అందుకు ఆయన ఇలా అన్నాడు: “నేను నువ్వు హింసిస్తున్న యేసును.+ 6 నువ్వు లేచి దమస్కు నగరానికి వెళ్లు. నువ్వు ఏంచేయాలో అక్కడ ఒక వ్యక్తి నీకు చెప్తాడు.” 7 అతనితో పాటు ప్రయాణిస్తున్న వాళ్లకు నోట మాట రాక అలాగే నిలబడిపోయారు. వాళ్లకు స్వరం* వినిపిస్తోంది కానీ మాట్లాడుతున్న వ్యక్తి కనిపించట్లేదు.+ 8 అప్పుడు సౌలు నేల మీద నుండి లేచాడు, అతని కళ్లు తెరుచుకునే ఉన్నా అతనికి ఏమీ కనిపించట్లేదు. కాబట్టి వాళ్లు అతన్ని చేతులు పట్టుకొని నడిపించుకుంటూ దమస్కుకు తీసుకొచ్చారు. 9 మూడు రోజుల వరకు అతను ఏమీ చూడలేకపోయాడు.+ అతను ఏమీ తినలేదు, తాగలేదు.

10 దమస్కులో అననీయ+ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభువు ఒక దర్శనంలో అతనికి కనిపించి, “అననీయ!” అని పిలిచాడు. అతను, “చెప్పు ప్రభువా” అన్నాడు. 11 ప్రభువు అతనికి ఇలా చెప్పాడు: “నువ్వు లేచి, తిన్ననిది అనబడే వీధికి వెళ్లు. అక్కడ యూదా ఇంట్లో ఉన్న, తార్సుకు+ చెందిన సౌలు అనే వ్యక్తి కోసం అడుగు. ఇదిగో! అతను ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. 12 అతను ఒక దర్శనంలో, అననీయ అనే వ్యక్తి లోపలికి రావడం, తనకు మళ్లీ చూపు వచ్చేలా+ ఆ వ్యక్తి తన మీద చేతులు ఉంచడం చూశాడు.” 13 అయితే అననీయ ఇలా అన్నాడు: “ప్రభువా, అతని గురించి, యెరూషలేములో ఉన్న నీ పవిత్రులకు అతను చేసిన హాని అంతటి గురించి చాలామంది చెప్తుంటే విన్నాను. 14 ఇప్పుడతను ముఖ్య యాజకులు ఇచ్చిన అధికారంతో, నీ పేరు మీద నమ్మకముంచే వాళ్లందర్నీ బంధించడానికి ఇక్కడికి వచ్చాడు.”+ 15 అయితే ప్రభువు అతనికి ఇలా చెప్పాడు: “వెళ్లు! అన్యజనులకు,+ రాజులకు,+ ఇశ్రాయేలు ప్రజలకు నా పేరు గురించి సాక్ష్యమివ్వడానికి నేను ఎంచుకున్న వ్యక్తి*+ అతను. 16 నా పేరు కోసం అతను ఎన్ని బాధలు పడాలో నేను అతనికి చూపిస్తాను.”+

17 కాబట్టి అననీయ వెళ్లి ఆ ఇంట్లో ప్రవేశించి, సౌలు మీద చేతులుంచి, “సౌలా, సహోదరుడా, నువ్వు వస్తున్న దారిలో నీకు కనిపించిన ప్రభువైన యేసే నువ్వు చూపు పొందేలా, పవిత్రశక్తితో నింపబడేలా నన్ను నీ దగ్గరికి పంపాడు” అన్నాడు.+ 18 వెంటనే సౌలు కళ్ల నుండి పొరల లాంటివి రాలాయి, అతనికి మళ్లీ చూపు వచ్చింది. అప్పుడు అతను లేచి బాప్తిస్మం తీసుకున్నాడు. 19 తర్వాత అతను కాస్త భోంచేసి బలపడ్డాడు.

సౌలు కొన్నిరోజులు దమస్కులోని+ శిష్యులతో ఉన్నాడు. 20 వెంటనే అతను, యేసే దేవుని కుమారుడని సమాజమందిరాల్లో ప్రకటించడం మొదలుపెట్టాడు. 21 అయితే అతని మాటలు విన్నవాళ్లంతా ఆశ్చర్యంలో మునిగిపోయి, “యెరూషలేములో యేసు పేరు మీద నమ్మకముంచిన వాళ్లను ఘోరంగా హింసించిన వ్యక్తి ఇతను కాదా?+ ఇతను ఇక్కడికి వచ్చింది యేసు శిష్యుల్ని బంధించి ముఖ్య యాజకుల దగ్గరికి తీసుకెళ్లడానికి కాదా?”+ అని చెప్పుకున్నారు. 22 అయితే సౌలు అంతకంతకూ శక్తి పొందుతూ,* యేసే క్రీస్తని రుజువులతో నిరూపిస్తూ+ దమస్కులో ఉన్న యూదుల్ని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు.

23 చాలా రోజులు గడిచాక, అక్కడి యూదులు సౌలును చంపాలని కుట్రపన్నారు.+ 24 అయితే తన మీద వాళ్లు పన్నిన కుట్ర గురించి సౌలుకు తెలిసింది. అతన్ని చంపడానికి వాళ్లు రాత్రింబగళ్లు ఆ నగర ద్వారాల దగ్గర కూడా కాచుకొని ఉన్నారు. 25 కాబట్టి అతని శిష్యులు అతన్ని తీసుకెళ్లి, నగర ప్రాకారానికి ఉన్న కిటికీ గుండా రాత్రివేళ అతన్ని గంపలో కిందికి దించారు.+

26 సౌలు యెరూషలేముకు చేరుకున్నప్పుడు,+ అక్కడున్న శిష్యులతో కలవడానికి ప్రయత్నాలు చేశాడు. కానీ వాళ్లంతా అతనికి భయపడ్డారు. ఎందుకంటే అతను యేసు శిష్యుడయ్యాడని వాళ్లు నమ్మలేదు. 27 అయితే బర్నబా+ అతనికి సహాయం చేసి, అతన్ని అపొస్తలుల దగ్గరికి తీసుకెళ్లాడు. సౌలు దారిలో ప్రభువును చూడడం,+ ప్రభువు సౌలుతో మాట్లాడడం, దమస్కులో సౌలు యేసు పేరున ధైర్యంగా మాట్లాడడం+ గురించి బర్నబా వాళ్లకు వివరంగా చెప్పాడు. 28 కాబట్టి సౌలు యెరూషలేములో స్వేచ్ఛగా తిరుగుతూ,* ప్రభువు పేరున ధైర్యంగా మాట్లాడుతూ వాళ్లతోనే ఉండిపోయాడు. 29 అతను గ్రీకు భాష మాట్లాడే యూదులతో మాట్లాడుతూ, వాళ్లతో వాదిస్తూ ఉన్నాడు. అయితే వాళ్లు అతన్ని చంపడానికి ప్రయత్నాలు చేశారు.+ 30 ఆ విషయం సహోదరులకు తెలిసినప్పుడు, వాళ్లు అతన్ని కైసరయకు తీసుకొచ్చి అక్కడి నుండి తార్సుకు పంపించేశారు.+

31 తర్వాత యూదయలో, గలిలయలో, సమరయలో+ ఉన్న సంఘమంతా కొంతకాలంపాటు ప్రశాంతతను అనుభవించింది, బలపడుతూ వచ్చింది. శిష్యులు యెహోవా* మార్గంలో* నడుస్తూ, పవిత్రశక్తి ద్వారా కలిగే ఆదరణకు*+ అనుగుణంగా జీవిస్తూ ఉండగా వాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

32 పేతురు ఆ ప్రాంతమంతా తిరుగుతూ, లుద్దలో+ ఉన్న పవిత్రుల దగ్గరికి కూడా వచ్చాడు. 33 అక్కడ, ఎనిమిది సంవత్సరాలుగా పక్షవాతంతో మంచం పట్టిన ఐనెయ అనే వ్యక్తి అతనికి కనిపించాడు. 34 పేతురు అతనితో, “ఐనెయా, యేసుక్రీస్తు నిన్ను బాగుచేస్తున్నాడు.+ లేచి నీ పరుపు సర్దుకో”+ అన్నాడు. అతను వెంటనే లేచాడు. 35 లుద్దలో, షారోను మైదానంలో నివసిస్తున్న వాళ్లంతా అతన్ని చూసినప్పుడు వాళ్లు ప్రభువు మీద విశ్వాసముంచారు.

36 యొప్పేలో తబితా అనే శిష్యురాలు ఉంది. గ్రీకు భాషలోకి అనువదిస్తే ఆమె పేరు దొర్కా.* ఆమె ఎన్నో మంచిపనులు చేసేది, పేదవాళ్లకు ఎంతో సహాయం చేసేది. 37 అయితే ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. కాబట్టి వాళ్లు ఆమెకు స్నానం చేయించి, మేడ మీదున్న గదిలో పడుకోబెట్టారు. 38 లుద్ద యొప్పేకు దగ్గర్లోనే ఉంది కాబట్టి పేతురు ఆ నగరంలో ఉన్నాడని శిష్యులు విన్నప్పుడు వాళ్లు ఇద్దరు మనుషుల్ని అక్కడికి పంపించి, “దయచేసి, ఆలస్యం చేయకుండా మా దగ్గరికి రా” అని అతన్ని వేడుకోమన్నారు. 39 దాంతో పేతురు లేచి వాళ్లతో పాటు వెళ్లాడు. అతను అక్కడికి చేరుకున్నప్పుడు, వాళ్లు అతన్ని మేడ మీది గదిలోకి తీసుకెళ్లారు. విధవరాళ్లందరూ అతని దగ్గరికి వచ్చి ఏడుస్తూ, దొర్కా తమతో ఉన్నప్పుడు చేసిన వస్త్రాల్ని* చూపించారు. 40 అప్పుడు పేతురు అందర్నీ బయటికి పంపించి,+ మోకాళ్లూని ప్రార్థించాడు. తర్వాత అతను ఆమె మృతదేహం వైపుకు తిరిగి, “తబితా, లే!” అన్నాడు. దాంతో ఆమె కళ్లు తెరిచింది, పేతురును చూసి లేచి కూర్చుంది.+ 41 అతను ఆమెకు చెయ్యి అందించి లేపి, పవిత్రుల్ని, విధవరాళ్లను పిలిచి తబితా మళ్లీ బ్రతికిందని వాళ్లకు చూపించాడు.+ 42 ఈ విషయం గురించి యొప్పే అంతటా తెలిసిపోయింది. దాంతో చాలామంది ప్రభువు మీద విశ్వాసముంచారు.+ 43 పేతురు యొప్పేలో సీమోను అనే చర్మకారుడి* ఇంట్లో చాలా రోజులు ఉన్నాడు.+

10 కైసరయలో కొర్నేలి అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఇటలీ దళంలో* సైనికాధికారి.* 2 అతను దైవభక్తి గలవాడు. అతను, అతని ఇంటివాళ్లందరూ దేవునికి భయపడేవాళ్లు. అతను ప్రజలకు ఎన్నో దానధర్మాలు చేసేవాడు. ఎప్పుడూ పట్టుదలగా దేవునికి ప్రార్థించేవాడు. 3 ఒకరోజు, మధ్యాహ్నం దాదాపు మూడింటికి*+ అతనికి ఒక దర్శనం వచ్చింది. దానిలో అతను, ఒక దేవదూత తన దగ్గరికి రావడం స్పష్టంగా చూశాడు. ఆ దేవదూత అతన్ని, “కొర్నేలీ!” అని పిలిచాడు. 4 కొర్నేలి భయపడి ఆ దేవదూతనే చూస్తూ, “ఏంటి ప్రభూ?” అని అడిగాడు. ఆ దేవదూత అతనితో ఇలా అన్నాడు: “నీ ప్రార్థనలు, దానధర్మాలు దేవుని సన్నిధికి చేరాయి. దేవుడు వాటిని గుర్తుచేసుకున్నాడు.+ 5 కాబట్టి యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అని పిలవబడే సీమోనును పిలిపించు. 6 అతను సముద్రతీరాన ఉన్న సీమోను అనే చర్మకారుడి ఇంట్లో అతిథిగా ఉన్నాడు.” 7 అతనితో మాట్లాడిన దేవదూత వెళ్లిపోగానే కొర్నేలి ఇద్దరు సేవకుల్ని, తనకు ఎప్పుడూ సేవచేసే సైనికుల్లో దైవభక్తిగల ఒకతన్ని పిలిచాడు. 8 అతను జరిగిందంతా వాళ్లకు చెప్పి, వాళ్లను యొప్పేకు పంపించాడు.

9 తర్వాతి రోజు వాళ్లు ప్రయాణిస్తూ ఆ నగరం దగ్గరికి చేరుకున్నారు. ఆ సమయంలో పేతురు ప్రార్థించడానికి మిద్దె మీదికి వెళ్లాడు. అప్పుడు మధ్యాహ్నం దాదాపు 12 గంటలు* అయింది. 10 అతనికి బాగా ఆకలి వేయడంతో ఏమైనా తినాలనుకున్నాడు. భోజనం సిద్ధమౌతుండగా, అతనికి ఒక దర్శనం వచ్చింది.*+ 11 ఆకాశం తెరవబడడం, పెద్ద దుప్పటి లాంటిదాన్ని నాలుగు మూలల్లో పట్టుకొని భూమ్మీదికి దించడం అతను చూశాడు. 12 భూమ్మీద ఉండే అన్నిరకాల నాలుగు కాళ్ల జంతువులు, పాకే జీవులు,* ఆకాశపక్షులు అందులో ఉన్నాయి. 13 అప్పుడు ఒక స్వరం పేతురుతో, “పేతురూ, లేచి వాటిని చంపుకొని తిను!” అని చెప్పింది. 14 కానీ పేతురు, “లేదు ప్రభువా, నేను అలా చేయలేను. ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధమైనదేదీ, అపవిత్రమైనదేదీ నేను ఎప్పుడూ తినలేదు” అన్నాడు.+ 15 ఆ స్వరం రెండోసారి అతనితో మాట్లాడి, “దేవుడు పవిత్రపర్చిన వాటిని నిషిద్ధమైనవని అనొద్దు” అని చెప్పింది. 16 మూడోసారి కూడా అలాగే జరిగింది. తర్వాత వెంటనే ఆ దుప్పటి లాంటిది ఆకాశానికి ఎత్తబడింది.

17 ఆ దర్శనానికి అర్థం ఏమైవుంటుందో అని పేతురు కలవరపడుతుండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఎక్కడుందో అడిగి తెలుసుకొని, అప్పుడే అతని ఇంటి గుమ్మం దగ్గర నిలబడి,+ 18 సీమోను పేతురు అక్కడ అతిథిగా ఉన్నాడా అని బిగ్గరగా అడిగారు. 19 పేతురు ఇంకా ఆ దర్శనం గురించే ఆలోచిస్తుండగా, దేవుడు తన పవిత్రశక్తి ద్వారా ఇలా చెప్పాడు:+ “ఇదిగో! ముగ్గురు మనుషులు నీ గురించి అడుగుతున్నారు. 20 నువ్వు లేచి, కిందికి దిగి, ఏమాత్రం సందేహించకుండా వాళ్లతో వెళ్లు. ఎందుకంటే నేనే వాళ్లను పంపించాను.” 21 అప్పుడు పేతురు కిందికి దిగి, “మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే. మీరు ఎందుకు వచ్చారు?” అని ఆ మనుషుల్ని అడిగాడు. 22 దానికి వాళ్లు ఇలా చెప్పారు: “సైనికాధికారి కొర్నేలి+ నీతిపరుడు, దేవునికి భయపడే వ్యక్తి. యూదులందరి మధ్య అతనికి మంచిపేరు ఉంది. దేవుడు ఒక పవిత్ర దేవదూతను కొర్నేలి దగ్గరికి పంపి, నిన్ను ఇంటికి పిలిపించుకొని, నువ్వు చెప్పేది వినమని అతన్ని ఆదేశించాడు.” 23 కాబట్టి అతను వాళ్లను లోపలికి పిలిచి, అతిథి మర్యాదలు చేశాడు.

తర్వాతి రోజు అతను లేచి వాళ్లతో వెళ్లాడు. యొప్పేకు చెందిన కొంతమంది సహోదరులు కూడా అతనితో వెళ్లారు. 24 ఆ తర్వాతి రోజు అతను కైసరయకు చేరుకున్నాడు. కొర్నేలి వాళ్లకోసం ఎదురుచూస్తూ తన బంధువుల్ని, దగ్గరి స్నేహితుల్ని అక్కడికి పిలిపించాడు. 25 పేతురు వచ్చినప్పుడు, కొర్నేలి అతన్ని కలుసుకొని, అతని పాదాల దగ్గర పడి, అతనికి వంగి నమస్కారం చేశాడు. 26 అయితే పేతురు, “లే, నేను కూడా మనిషినే”+ అంటూ అతన్ని పైకి లేపాడు. 27 తర్వాత అతనితో మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లి, అక్కడ చాలామంది ఉండడం చూశాడు. 28 అప్పుడు పేతురు వాళ్లతో ఇలా అన్నాడు: “యూదుల చట్టం ప్రకారం, యూదులు అన్యజనులతో సహవాసం చేయడం గానీ, వాళ్లను కలవడం గానీ ఎంత తప్పో+ మీకు బాగా తెలుసు. అయినాసరే, నేను ఏ మనిషినీ అపవిత్రుడిగా ఎంచకూడదని దేవుడు నాకు చూపించాడు.+ 29 అందుకే మీరు నా కోసం మనుషుల్ని పంపినప్పుడు, ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇంతకీ మీరు నన్ను ఎందుకు పిలిచారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను.”

30 అప్పుడు కొర్నేలి ఇలా చెప్పాడు: “నాలుగు రోజుల క్రితం సరిగ్గా ఇదే సమయానికి అంటే మధ్యాహ్నం దాదాపు మూడింటికి* నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు, మెరిసే వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి నా ముందు నిలబడి 31 ఇలా అన్నాడు: ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీ దానధర్మాలు గుర్తుచేసుకున్నాడు. 32 కాబట్టి యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అనబడే సీమోనును పిలిపించు. అతను సముద్రతీరాన ఉన్న సీమోను అనే చర్మకారుడి ఇంట్లో అతిథిగా ఉన్నాడు.’+ 33 అప్పుడు నేను వెంటనే నీ కోసం మనుషుల్ని పంపాను. నువ్వు ఇక్కడికి వచ్చి మంచిపని చేశావు. ఏ విషయాల్ని చెప్పమని యెహోవా* నీకు ఆజ్ఞాపించాడో వాటిని వినడానికి మేమంతా ఇప్పుడు దేవుని ముందు సిద్ధంగా ఉన్నాం.”

34 అప్పుడు పేతురు మాట్లాడడం మొదలుపెట్టి ఇలా అన్నాడు: “దేవునికి పక్షపాతం లేదని+ నాకు ఇప్పుడు నిజంగా అర్థమైంది. 35 ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.+ 36 ఆయన ఇశ్రాయేలు ప్రజలకు యేసుక్రీస్తు ద్వారా శాంతి గురించిన మంచివార్త ప్రకటించి,+ వాళ్లకు ఒక సందేశాన్ని పంపించాడు. ఈ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు.+ 37 యోహాను బాప్తిస్మం గురించి ప్రకటించిన తర్వాత, గలిలయ దగ్గర మొదలుపెట్టి+ యూదయ అంతట ప్రజలు ఏ అంశం గురించి మాట్లాడుకున్నారో మీకు తెలుసు. 38 వాళ్లు నజరేతుకు చెందిన యేసు గురించి మాట్లాడుకున్నారు. దేవుడు ఆయన్ని పవిత్రశక్తితో అభిషేకించాడు.+ ఆయనకు శక్తిని ఇచ్చాడు. దానివల్ల ఆయన మంచిపనులు చేస్తూ, అపవాది చేత పీడించబడుతున్న వాళ్లను బాగుచేస్తూ+ ఆ ప్రాంతమంతా తిరిగాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు.+ 39 యూదుల దేశంలో, యెరూషలేములో ఆయన చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. అయితే వాళ్లు ఆయన్ని కొయ్యకు* వేలాడదీసి చంపేశారు. 40 దేవుడు మూడో రోజున ఆయన్ని బ్రతికించి,+ ఆయన ప్రజలకు కనిపించేలా* చేశాడు. 41 అయితే దేవుడు ఆయన్ని అందరికీ కనిపించేలా చేయలేదు కానీ ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతోపాటు తిని తాగిన మాకు మాత్రమే కనిపించేలా చేశాడు.+ ఆయన్ని చూసేలా, ఆయన గురించి మాట్లాడేలా దేవుడు ముందే మమ్మల్ని నియమించాడు. 42 అంతేకాదు బ్రతికున్నవాళ్లకు, చనిపోయినవాళ్లకు తీర్పు తీర్చడానికి దేవుడు న్యాయమూర్తిగా నియమించిన వ్యక్తి+ ఈయనే అని ప్రజలకు ప్రకటించమని, పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వమని కూడా ఆయన మాకు ఆజ్ఞాపించాడు.+ 43 ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చారు.+ ఆయన మీద విశ్వాసముంచే ప్రతీ ఒక్కరి పాపాలు ఆయన పేరు ద్వారా క్షమించబడతాయని+ వాళ్లు చెప్పారు.”

44 పేతురు ఈ విషయాల గురించి మాట్లాడుతుండగానే, వాక్యం వింటున్న వాళ్లందరి మీదికి పవిత్రశక్తి వచ్చింది.+ 45 పవిత్రశక్తి అనే ఉచిత బహుమతిని అన్యజనులు కూడా పొందడం చూసి, పేతురుతో పాటు వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు* ఎంతో ఆశ్చర్యపోయారు. 46 ఎందుకంటే, అక్కడున్నవాళ్లు వేరే భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి మహిమపర్చడం వాళ్లు విన్నారు.+ అప్పుడు పేతురు ఇలా అన్నాడు: 47 “వీళ్లు మనలాగే పవిత్రశక్తిని పొందారు కాబట్టి వీళ్లు నీళ్లలో బాప్తిస్మం తీసుకోకుండా ఎవరైనా ఆపగలరా?”+ 48 దాంతో పేతురు, వాళ్లు యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం తీసుకోవాలని ఆజ్ఞాపించాడు.+ తర్వాత వాళ్లు కొన్ని రోజులు తమ దగ్గరే ఉండమని అతన్ని వేడుకున్నారు.

11 అన్యజనులు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించారని యూదయలో ఉన్న అపొస్తలులు, సహోదరులు విన్నారు. 2 కాబట్టి పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు, సున్నతిని సమర్థించేవాళ్లు+ అతన్ని విమర్శించడం మొదలుపెట్టి, 3 “నువ్వు సున్నతి పొందనివాళ్ల ఇంటికి వెళ్లి, వాళ్లతో కలిసి భోంచేశావు” అన్నారు. 4 అప్పుడు పేతురు ఆ విషయం గురించి వాళ్లకిలా వివరించడం మొదలుపెట్టాడు:

5 “నేను యొప్పే నగరంలో ప్రార్థిస్తున్నప్పుడు ఒక దర్శనం చూశాను. పెద్ద దుప్పటి లాంటి దాన్ని* నాలుగు మూలల్లో పట్టుకొని ఆకాశం నుండి కిందికి దించడం నాకు కనిపించింది. అది నా వరకూ వచ్చింది.+ 6 దానిలోకి జాగ్రత్తగా చూసినప్పుడు, అందులో భూమ్మీద ఉండే నాలుగు కాళ్ల జంతువులు, క్రూరమృగాలు, పాకే జీవులు,* ఆకాశపక్షులు నాకు కనిపించాయి. 7 అంతేకాదు, ‘పేతురూ, లేచి వీటిని చంపుకొని తిను!’ అని ఒక స్వరం నాతో చెప్పడం విన్నాను. 8 అప్పుడు నేను, ‘లేదు ప్రభువా, నేను అలా చేయలేను. ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధమైనదేదీ, అపవిత్రమైనదేదీ నేను ఎప్పుడూ తినలేదు’ అన్నాను. 9 రెండోసారి, ఆకాశం నుండి వచ్చిన స్వరం ఇలా అంది: ‘దేవుడు పవిత్రపర్చిన వాటిని నిషిద్ధమైనవని అనొద్దు.’ 10 మూడోసారి కూడా అలాగే జరిగింది. తర్వాత అదంతా తిరిగి ఆకాశానికి ఎత్తబడింది. 11 సరిగ్గా అదే సమయానికి, ముగ్గురు మనుషులు మేము బస చేస్తున్న ఇంటి దగ్గర నిలబడ్డారు. నన్ను కలుసుకోమని ఒక వ్యక్తి కైసరయ నుండి వాళ్లను పంపించాడు.+ 12 ఏమాత్రం సందేహించకుండా వాళ్లతో వెళ్లమని దేవుడు తన పవిత్రశక్తి ద్వారా నాకు చెప్పాడు. అయితే ఈ ఆరుగురు సహోదరులు కూడా నాతో వచ్చారు. తర్వాత మేము ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాం.

13 “ఒక దేవదూత తమ ఇంట్లో నిలబడి ఇలా అన్నాడని అతను చెప్పాడు: ‘యొప్పేకు మనుషుల్ని పంపి, పేతురు అని పిలవబడే సీమోనును పిలిపించు.+ 14 నువ్వూ, నీ ఇంటివాళ్లందరూ ఎలా రక్షణ పొందవచ్చో అతను నీకు చెప్తాడు.’ 15 అయితే నేను ఇంకా మాట్లాడుతుండగానే, మొదట్లో మన మీదికి వచ్చినట్టే పవిత్రశక్తి వాళ్ల మీదికి కూడా వచ్చింది.+ 16 అప్పుడు ప్రభువు చాలాసార్లు అన్న ఈ మాటలు నాకు గుర్తొచ్చాయి: ‘యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు.+ అయితే మీరు పవిత్రశక్తితో బాప్తిస్మం పొందుతారు.’+ 17 ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన మనకు దేవుడు పవిత్రశక్తి అనే ఉచిత బహుమతిని ఇచ్చాడు. అదే ఉచిత బహుమతిని దేవుడు వాళ్లకు కూడా ఇచ్చాడు. అలాంటప్పుడు, దేవుణ్ణి అడ్డుకోవడానికి* నేను ఎవర్ని?”+

18 వాళ్లు ఈ విషయాలు విన్నప్పుడు పేతురుకు అడ్డు చెప్పడం మానేసి, “అంటే, దేవుడు అన్యజనులు కూడా జీవాన్ని పొందేలా పశ్చాత్తాపపడాలని కోరుకుంటున్నాడన్న మాట” అని అంటూ దేవుణ్ణి మహిమపర్చారు.+

19 స్తెఫను చనిపోయిన తర్వాత వచ్చిన శ్రమ వల్ల చెల్లాచెదురైపోయిన వాళ్లు+ ఫేనీకే, కుప్ర, అంతియొకయ వరకూ వెళ్లారు. కానీ వాళ్లు యూదులకు మాత్రమే వాక్యాన్ని ప్రకటించారు.+ 20 అయితే కుప్ర నుండి, కురేనే నుండి వచ్చిన కొంతమంది అంతియొకయలో ఉన్నారు. వాళ్లు గ్రీకు భాష మాట్లాడే ప్రజలతో మాట్లాడుతూ ప్రభువైన యేసు గురించిన మంచివార్త ప్రకటించడం మొదలుపెట్టారు. 21 పైగా యెహోవా* చెయ్యి వాళ్లకు తోడుగా ఉంది కాబట్టి చాలామంది విశ్వాసులై ప్రభువు వైపుకు తిరిగారు.+

22 వాళ్ల గురించిన వార్త యెరూషలేములో ఉన్న సంఘానికి తెలిసింది. దాంతో వాళ్లు బర్నబాను+ అంతియొకయ వరకు పంపించారు. 23 అతను అక్కడికి చేరుకొని, దేవుని అపారదయను చూసి చాలా సంతోషించాడు, ఇకముందు కూడా స్థిరమైన హృదయంతో ప్రభువుకు విశ్వసనీయంగా ఉండమని వాళ్లందర్నీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు;+ 24 ఎందుకంటే అతను మంచివాడు; పవిత్రశక్తితో, విశ్వాసంతో నిండిన వ్యక్తి. అంతేకాదు, చాలామంది ప్రభువు మీద విశ్వాసముంచారు.+ 25 కాబట్టి అతను ఎలాగైనా సౌలును వెతికి కనుక్కోవాలని తార్సుకు వెళ్లాడు.+ 26 సౌలు కనిపించాక బర్నబా అతన్ని అంతియొకయకు తీసుకొచ్చాడు. వాళ్లు ఒక సంవత్సరమంతా అక్కడున్న సంఘంతో సహవసిస్తూ చాలామందికి బోధించారు. దేవుని నిర్దేశం ప్రకారం శిష్యులు క్రైస్తవులని+ మొట్టమొదట పిలవబడింది అంతియొకయలోనే.

27 ఆ రోజుల్లో కొందరు ప్రవక్తలు+ యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చారు. 28 వాళ్లలో ఒకతను అగబు.+ భూమంతటి మీదికి గొప్ప కరువు రాబోతుందని+ అతను పవిత్రశక్తి ద్వారా ముందే చెప్పాడు. ఆ కరువు క్లౌదియ కాలంలో నిజంగానే వచ్చింది. 29 కాబట్టి శిష్యులు ఒక్కొక్కరు తాము ఇవ్వగలిగిన దాన్నిబట్టి,+ యూదయలో ఉన్న సహోదరులకు సహాయం పంపించాలని+ నిశ్చయించుకున్నారు. 30 ఆ సహాయాన్ని వాళ్లు బర్నబా ద్వారా, సౌలు ద్వారా అక్కడి పెద్దలకు పంపించారు.+

12 సుమారు ఆ రోజుల్లోనే హేరోదు రాజు, సంఘంలోని కొంతమందిని హింసించడం మొదలుపెట్టాడు.+ 2 అతను యోహాను సహోదరుడైన యాకోబును+ కత్తితో చంపించాడు.+ 3 దానివల్ల యూదులు సంతోషించారని గ్రహించి అతను పేతురును కూడా బంధించమని తన సైనికులకు చెప్పాడు. (ఇది పులవని రొట్టెల పండుగ రోజుల్లో జరిగింది.)+ 4 సైనికులు అతన్ని పట్టుకొని చెరసాలలో వేశారు.+ నాలుగు గుంపుల సైనికులు వంతులవారీగా అతన్ని కాపలా కాశారు, ఒక్కో గుంపులో నలుగురు సైనికులు ఉన్నారు. పస్కా పండుగ తర్వాత పేతురును ప్రజల ముందుకు తీసుకురావాలని* హేరోదు అనుకున్నాడు. 5 కాబట్టి పేతురును చెరసాలలోనే ఉంచారు. సంఘం మాత్రం అతని కోసం పట్టుదలగా దేవునికి ప్రార్థిస్తూ ఉంది.+

6 హేరోదు పేతురును బయటికి తీసుకురావాలనుకున్న రోజుకు ముందు రాత్రి, పేతురు రెండు సంకెళ్లతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. తలుపు ముందున్న కాపలావాళ్లు ఆ చెరసాలకు కాపలా కాస్తున్నారు. 7 అయితే ఇదిగో! యెహోవా* దూత అక్కడ నిలబడి ఉన్నాడు.+ దాంతో చెరసాల గదిలో వెలుగు ప్రకాశించింది. ఆ దూత పేతురు భుజాన్ని తట్టి, “త్వరగా లే!” అంటూ అతన్ని నిద్రలేపాడు. అప్పుడు అతని చేతులకున్న సంకెళ్లు ఊడిపోయాయి.+ 8 తర్వాత ఆ దూత అతనితో, “నీ నడుం కట్టుకుని చెప్పులు వేసుకో” అన్నాడు. అతను అలాగే చేశాడు. చివరిగా దూత అతనితో, “నీ పైవస్త్రం వేసుకుని నా వెంట రా” అన్నాడు. 9 పేతురు ఆ దూత వెనకే నడుస్తూ బయటికి వచ్చాడు. కానీ దేవదూత చేస్తున్నదంతా నిజమని అతనికి తెలీదు; తాను ఒక దర్శనం చూస్తున్నానని అతను అనుకున్నాడు. 10 వాళ్లిద్దరు మొదటి కాపలాను, రెండో కాపలాను దాటి, నగరంలోకి దారితీసే చెరసాల ఇనుప ద్వారం దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆ ద్వారం దానంతటదే తెరుచుకుంది. వాళ్లు బయటికి వచ్చాక ఒక వీధి దాటారు. వెంటనే ఆ దేవదూత అతని దగ్గర నుండి వెళ్లిపోయాడు. 11 అప్పుడు పేతురు జరుగుతున్నది ఏమిటో గ్రహించి, “నాకిప్పుడు స్పష్టంగా అర్థమైంది. యెహోవా* తన దూతను పంపించి హేరోదు చేతిలో నుండి నన్ను తప్పించాడు. నాకు ఎలాంటి కీడు జరుగుతుందని యూదులు అనుకున్నారో దానంతటి నుండి ఆయన నన్ను కాపాడాడు”+ అని అనుకున్నాడు.

12 అతను ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాక, యోహాను తల్లియైన మరియ ఇంటికి వెళ్లాడు; ఈ యోహానుకు మార్కు అనే పేరు కూడా ఉంది.+ చాలామంది శిష్యులు అక్కడికి వచ్చి ప్రార్థిస్తున్నారు. 13 అతను వాకిట్లో ఉన్న తలుపు తట్టినప్పుడు, రొదే అనే పనమ్మాయి తలుపు తీయడానికి వచ్చింది. 14 ఆమె పేతురు గొంతు గుర్తుపట్టి, ఆ సంతోషంలో తలుపు కూడా తీయకుండా పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లి, పేతురు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడని వాళ్లకు చెప్పింది. 15 వాళ్లు ఆమెతో, “నీకు పిచ్చి పట్టింది” అన్నారు. అయితే ఆమె మాత్రం పేతురు నిజంగానే వచ్చాడని బలంగా చెప్తూ ఉంది. అప్పుడు వాళ్లు, “అది అతని దేవదూత” అని చెప్పడం మొదలుపెట్టారు. 16 అయితే పేతురు అక్కడే నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. వాళ్లు తలుపు తీసినప్పుడు, అతన్ని చూసి ఆశ్చర్యంలో మునిగిపోయారు. 17 పేతురు వాళ్లకు నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసి, చెరసాల నుండి యెహోవా* తనను ఎలా బయటికి తీసుకొచ్చాడో వివరంగా చెప్పాడు. తర్వాత, “ఈ విషయాల గురించి యాకోబుకు,+ మిగతా సహోదరులకు చెప్పండి” అని వాళ్లతో అన్నాడు. ఆ తర్వాత అతను అక్కడి నుండి బయల్దేరి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు.

18 అయితే తెల్లవారినప్పుడు, పేతురు ఎక్కడికి వెళ్లాడో తెలియక సైనికుల్లో కలకలం మొదలైంది. 19 హేరోదు పేతురు కోసం జాగ్రత్తగా వెతికించాడు. పేతురు దొరకకపోయేసరికి అతను కాపలావాళ్లను విచారణ చేసి, వాళ్లను శిక్షించడానికి తీసుకెళ్లమని ఆజ్ఞాపించాడు.+ తర్వాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ కొంతకాలం ఉన్నాడు.

20 హేరోదు తూరు, సీదోను ప్రజల మీద చాలా కోపంగా ఉన్నాడు. కాబట్టి వాళ్లు ఒకే ఉద్దేశంతో హేరోదు దగ్గరికి వచ్చి, తమకు సహాయం చేసేలా బ్లాస్తు అనే వ్యక్తిని ఒప్పించారు. ఇతను రాజు ఇంటి వ్యవహారాలు చూసుకునేవాడు. వాళ్లు హేరోదు పరిపాలించే ప్రాంతం నుండి ఆహారం కొనుక్కునేవాళ్లు కాబట్టి తాము రాజుతో శాంతి నెలకొల్పుకోవాలని కోరుకుంటున్నామని రాజును వేడుకున్నారు. 21 ఒక ప్రత్యేకమైన రోజున, హేరోదు రాజవస్త్రాలు వేసుకొని న్యాయపీఠం మీద కూర్చొని ప్రజల్ని ఉద్దేశిస్తూ ప్రసంగించడం మొదలుపెట్టాడు. 22 అప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలు, “ఇది దేవుని స్వరమే కానీ మనిషి స్వరం కాదు!” అని అరవడం మొదలుపెట్టారు. 23 అతను దేవుణ్ణి మహిమపర్చలేదు కాబట్టి వెంటనే యెహోవా* దూత అతన్ని జబ్బుపడేలా చేశాడు. దాంతో అతను పురుగులు పడి చనిపోయాడు.

24 అయితే యెహోవా* వాక్యం వ్యాప్తి చెందుతూ వచ్చింది, చాలామంది విశ్వాసులయ్యారు.+

25 బర్నబా,+ సౌలు యెరూషలేములో సహాయం* చేసిన తర్వాత+ తిరిగి అంతియొకయకు వచ్చి, మార్కు అనే పేరు కూడా ఉన్న యోహానును తమతో తీసుకెళ్లారు.+

13 అంతియొకయలోని సంఘంలో ప్రవక్తలు, బోధకులు ఉన్నారు.+ వాళ్లు ఎవరంటే: బర్నబా, నలుపు* అనే పేరున్న సుమెయోను, కురేనేకు చెందిన లూకియ, పరిపాలకుడైన హేరోదుతో పాటు చదువుకున్న మనయేను, అలాగే సౌలు. 2 వాళ్లు యెహోవాను* సేవిస్తూ ఉపవాసం చేస్తుండగా దేవుడు తన పవిత్రశక్తి ద్వారా ఇలా చెప్పాడు: “బర్నబాను, సౌలును నా కోసం ప్రత్యేకపర్చండి,+ ఒక పని కోసం నేను వాళ్లను ఎంచుకున్నాను.”+ 3 అప్పుడు వాళ్లు ఉపవాసం ఉండి, ప్రార్థించిన తర్వాత వాళ్లిద్దరి మీద చేతులు ఉంచి వాళ్లను పంపించారు.

4 కాబట్టి, పవిత్రశక్తి ద్వారా పంపబడిన ఈ ఇద్దరు సెలూకయకు వెళ్లారు. తర్వాత అక్కడి నుండి ఓడలో కుప్ర అనే ద్వీపానికి వెళ్లారు. 5 వాళ్లు ఆ ద్వీపంలోని సలమీ నగరానికి చేరుకున్నప్పుడు, అక్కడున్న యూదుల సమాజమందిరాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. యోహాను* వాళ్లకు సహాయకుడిగా ఉన్నాడు.+

6 వాళ్లు సలమీ నుండి బయల్దేరి ఆ ద్వీపానికి అవతలి వైపున ఉన్న పాఫు నగరం దగ్గరికి వచ్చారు. అక్కడ వాళ్లకు బర్‌యేసు అనే ఒక యూదుడు కలిశాడు. అతనొక మంత్రగాడు, అబద్ధ ప్రవక్త. 7 అతను సెర్గి పౌలు అనే స్థానిక అధిపతి* దగ్గర పనిచేసేవాడు. ఈ సెర్గి పౌలు తెలివైనవాడు. అతను దేవుని వాక్యాన్ని వినాలనే కోరికతో పౌలును, బర్నబాను తన దగ్గరికి పిలిపించుకున్నాడు. 8 అయితే ప్రభువును విశ్వసించకుండా అతన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఎలుమ* అనే ఆ మంత్రగాడు (నిజానికి, ఎలుమ అనే పేరును అనువదిస్తే, “మంత్రగాడు” అని అర్థం) వాళ్లను వ్యతిరేకించాడు. 9 అయితే పౌలు అని కూడా పిలవబడిన సౌలు పవిత్రశక్తితో నిండిపోయి, ఎలుమ వైపు సూటిగా చూస్తూ 10 ఇలా అన్నాడు: “అన్నిరకాల మోసంతో, చెడుతనంతో నిండినవాడా, అపవాది కుమారుడా,+ సమస్తమైన నీతికి విరోధీ, నువ్వు యెహోవా* సరైన మార్గాల్ని చెడగొట్టడం ఆపవా? 11 ఇదిగో! యెహోవా* చెయ్యి నీకు వ్యతిరేకంగా ఉంది. నువ్వు గుడ్డివాడివై కొంతకాలం సూర్యకాంతిని చూడకుండా ఉంటావు.” వెంటనే అతని కళ్లు మసకబారాయి, వాటికి చీకటి కమ్ముకుంది. దాంతో అతను ఎవరైనా తనను చెయ్యి పట్టుకొని నడిపిస్తారేమో అని వెతుకుతూ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. 12 జరిగింది చూశాక ఆ స్థానిక అధిపతి విశ్వాసి అయ్యాడు, ఎందుకంటే అతను యెహోవా* బోధకు చాలా ఆశ్చర్యపోయాడు.

13 తర్వాత పౌలు, అతనితో ఉన్నవాళ్లు ఓడ ఎక్కి పాఫు నుండి బయల్దేరి పంఫూలియలో ఉన్న పెర్గేకు చేరుకున్నారు. అయితే యోహాను*+ వాళ్లను వదిలేసి యెరూషలేముకు తిరిగెళ్లిపోయాడు.+ 14 వాళ్లు పెర్గే నుండి బయల్దేరి పిసిదియలో ఉన్న అంతియొకయకు వచ్చారు. వాళ్లు విశ్రాంతి రోజున* సమాజమందిరానికి వెళ్లి+ కూర్చున్నారు. 15 అక్కడ ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల పుస్తకాల్ని చదవడం పూర్తయిన తర్వాత+ సమాజమందిర అధికారులు వాళ్లను, “సహోదరులారా, ప్రజల్ని ప్రోత్సహించే మాట ఏదైనా మీ దగ్గరుంటే చెప్పండి” అని అడిగారు. 16 అప్పుడు పౌలు లేచి నిలబడి, తన చేతులతో సైగ చేస్తూ ఇలా అన్నాడు:

“ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడే ఇతర ప్రజలారా, వినండి. 17 ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వీకుల్ని ఎంచుకున్నాడు. వాళ్లు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు ఆయన వాళ్లను హెచ్చించి, తన శక్తివంతమైన బాహువుతో వాళ్లను ఆ దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు.+ 18 దాదాపు 40 సంవత్సరాలు ఎడారిలో ఆయన వాళ్లను భరించాడు.+ 19 కనాను దేశంలో ఉన్న ఏడు జనాల్ని నాశనం చేశాక వాళ్ల దేశాన్ని ఇశ్రాయేలీయులకు వారసత్వ ఆస్తిగా పంచి ఇచ్చాడు.+ 20 ఇదంతా దాదాపు 450 సంవత్సరాల కాలంలో జరిగింది.

“తర్వాత, సమూయేలు ప్రవక్త కాలం వరకు దేవుడు వాళ్లకు న్యాయాధిపతుల్ని ఇచ్చాడు.+ 21 కానీ ఆ తర్వాత ఇశ్రాయేలీయులు తమకు రాజు కావాలని పట్టుబట్టారు.+ దాంతో దేవుడు కీషు కుమారుడైన సౌలును వాళ్లకు రాజుగా ఇచ్చాడు. అతను బెన్యామీను గోత్రానికి చెందినవాడు.+ అతను 40 సంవత్సరాలు వాళ్లను పరిపాలించాడు. 22 అతన్ని సింహాసనం నుండి తొలగించిన తర్వాత, దేవుడు వాళ్ల కోసం దావీదును రాజుగా ఎంచుకున్నాడు.+ దేవుడు దావీదు గురించి సాక్ష్యమిస్తూ, ‘నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను,+ అతను నా హృదయానికి నచ్చిన వ్యక్తి.+ నేను కోరుకున్నవన్నీ అతను చేస్తాడు’ అని అన్నాడు. 23 దేవుడు తాను చేసిన వాగ్దానం ప్రకారం, అతని సంతానంలో* నుండి ఇశ్రాయేలీయుల దగ్గరికి ఒక రక్షకుణ్ణి పంపించాడు. ఆయనే యేసు.+ 24 ఆయన రావడానికి ముందు యోహాను, పశ్చాత్తాపానికి గుర్తుగా బాప్తిస్మం తీసుకొమ్మని ఇశ్రాయేలు ప్రజలందరికీ బహిరంగంగా ప్రకటించాడు. 25 అయితే తన పరిచర్య ముగింపుకు వచ్చినప్పుడు యోహాను ఇలా అనేవాడు: ‘నేను మీరు అనుకుంటున్న వ్యక్తిని కాదు. అయితే ఇదిగో! నా తర్వాత ఒకాయన వస్తున్నాడు, ఆయన పాదాలకున్న చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు.’+

26 “సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడే ఇతర ప్రజలారా, రక్షణ గురించిన ఈ సందేశాన్ని దేవుడు మన దగ్గరికి పంపించాడు.+ 27 యెరూషలేము నివాసులు, వాళ్ల నాయకులు ఆయన్ని గుర్తుపట్టలేదు. అయితే వాళ్లు తాము తీర్చిన తీర్పు ద్వారా ప్రవక్తలు చెప్పిన మాటల్ని నెరవేర్చారు.+ ఆ మాటలే ప్రతీ విశ్రాంతి రోజున బయటికి చదవబడుతున్నాయి. 28 ఆయనకు మరణశిక్ష వేయడానికి ఏ కారణం దొరకకపోయినా,+ వాళ్లు ఆయన్ని చంపించమని పిలాతును పట్టుబట్టారు.+ 29 ఆయన గురించి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత, వాళ్లు ఆయన్ని కొయ్య* మీద నుండి కిందికి దించి సమాధిలో* పెట్టారు.+ 30 అయితే దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు.+ 31 తనతో కలిసి గలిలయ నుండి యెరూషలేముకు వచ్చినవాళ్లకు ఆయన చాలారోజుల పాటు కనిపించాడు. వీళ్లు ఇప్పుడు ఆయన గురించి ప్రజలకు సాక్ష్యమిస్తున్నారు.+

32 “కాబట్టి దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దానం గురించిన మంచివార్తను మేము మీకు ప్రకటిస్తున్నాం. 33 దేవుడు యేసును తిరిగి బ్రతికించడం* ద్వారా,+ వాళ్ల పిల్లలమైన మన కోసం ఆ వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చాడు. ఎందుకంటే, ‘నువ్వు నా కుమారుడివి; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను’+ అని రెండో కీర్తనలో ఉంది. 34 దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి తిరిగి బ్రతికించి, ఎప్పటికీ కుళ్లిపోని శరీరం ఇచ్చాడు; ఆ విషయాన్ని దేవుడు ముందే ఇలా చెప్పాడు: ‘నేను దావీదుకు వాగ్దానం చేసిన విశ్వసనీయ ప్రేమను మీ మీద చూపిస్తాను, ఆ వాగ్దానం నమ్మదగినది.’*+ 35 కాబట్టి ఇంకో కీర్తనలో కూడా ఇలా రాయబడింది: ‘నువ్వు నీ విశ్వసనీయుణ్ణి కుళ్లిపోనివ్వవు.’+ 36 దావీదు తన జీవితకాలమంతా దేవుణ్ణి సేవించి* చనిపోయాడు,* అతన్ని వాళ్ల పూర్వీకులతో పాటు పాతిపెట్టారు, అతని శరీరం కుళ్లిపోయింది.+ 37 అయితే దేవుడు తిరిగి బ్రతికించిన వ్యక్తి శరీరం కుళ్లిపోలేదు.+

38 “కాబట్టి సహోదరులారా, ఒక విషయం మీకు తెలియాలి. అదేమిటంటే, ఈయన ద్వారానే దేవుడు మీ పాపాల్ని క్షమిస్తాడని నేను మీకు ప్రకటిస్తున్నాను.+ 39 మోషే ధర్మశాస్త్రం మిమ్మల్ని నీతిమంతులుగా చేయలేకపోయింది.+ అయితే దేవుడు, విశ్వసించే ప్రతీ ఒక్కర్ని యేసు ద్వారా నీతిమంతులుగా తీర్పుతీరుస్తాడు.+ 40 కాబట్టి ప్రవక్తల పుస్తకాల్లో రాయబడిన ఈ విషయాలు మీ మీదికి రాకుండా జాగ్రత్తపడండి: 41 ‘తిరస్కరించే ప్రజలారా, మీ రోజుల్లో నేను చేసే ఒక పనిని చూడండి. మీరు దాన్ని అస్సలు నమ్మరు. ఎవరైనా దాని గురించి వివరంగా చెప్పినా మీరు దాన్ని నమ్మరు. బదులుగా మీరు ఆశ్చర్యపోతారు, నాశనమౌతారు.’ ”+

42 పౌలు, బర్నబా బయటికి వెళ్తున్నప్పుడు, తర్వాతి విశ్రాంతి రోజున కూడా ఈ విషయాల గురించి మాట్లాడమని ప్రజలు వాళ్లను వేడుకున్నారు. 43 వాళ్లందరూ సమాజమందిరం నుండి వెళ్లిపోయిన తర్వాత చాలామంది యూదులు, యూదులుగా మారి దేవుణ్ణి ఆరాధించిన అన్యజనులు పౌలును, బర్నబాను అనుసరించారు. పౌలు, బర్నబా వాళ్లతో మాట్లాడుతూ దేవుని అపారదయను పొందుతూ ఉండమని వాళ్లను ప్రోత్సహించారు.+

44 తర్వాతి విశ్రాంతి రోజున, దాదాపు ఆ నగరంలోని వాళ్లంతా యెహోవా* వాక్యాన్ని వినడానికి వచ్చారు. 45 యూదులు వాళ్లందర్నీ చూసినప్పుడు అసూయతో నిండిపోయి, పౌలు చెప్పే విషయాల్ని వ్యతిరేకిస్తూ దూషించడం మొదలుపెట్టారు.+ 46 కాబట్టి పౌలు, బర్నబా వాళ్లతో ధైర్యంగా ఇలా అన్నారు: “దేవుని వాక్యం మొదట మీకు ప్రకటించబడడం తప్పనిసరి.+ అయితే మీరు దాన్ని నిరాకరిస్తున్నారు, పైగా శాశ్వత జీవితం పొందడానికి మీరు అర్హులని మీరు అనుకోవట్లేదు, కాబట్టి ఇదిగో! మేము అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాం.+ 47 ఎందుకంటే, ‘భూమి అంచుల వరకు రక్షణను తీసుకెళ్లడానికి నేను నిన్ను అన్యజనులకు* వెలుగుగా నియమించాను’ అని యెహోవా* మాకు ఆజ్ఞాపించాడు.”+

48 అన్యజనులు ఆ మాటలు విన్నప్పుడు సంతోషిస్తూ యెహోవా* వాక్యాన్ని మహిమపర్చడం మొదలుపెట్టారు. శాశ్వత జీవితం పొందడానికి తగిన* హృదయ స్థితి ఉన్నవాళ్లందరూ విశ్వాసులయ్యారు. 49 అంతేకాదు యెహోవా* వాక్యం ఆ చుట్టుపక్కలంతా వ్యాపిస్తూ ఉంది. 50 అయితే యూదులు ఆ నగరంలో ఉన్న దైవభక్తిగల గొప్పింటి స్త్రీలను, ప్రముఖులైన పురుషుల్ని రెచ్చగొట్టారు. దాంతో వాళ్లు పౌలు బర్నబాల మీదికి హింస వచ్చేలా చేసి,+ వాళ్లను ఆ నగర పొలిమేరల అవతలికి వెళ్లగొట్టారు. 51 కాబట్టి ఆ ప్రజలకు హెచ్చరికగా ఉండడానికి, వాళ్లిద్దరు తమ పాదాలకు అంటుకున్న దుమ్ము దులిపేసుకుని ఈకొనియకు వెళ్లిపోయారు.+ 52 శిష్యులు పవిత్రశక్తితో, సంతోషంతో నింపబడుతూ ఉన్నారు.+

14 ఈకొనియలో పౌలు, బర్నబా యూదుల సమాజమందిరంలోకి వెళ్లారు. వాళ్లు అక్కడ ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులు, గ్రీకువాళ్లు విశ్వాసులయ్యారు. 2 అయితే విశ్వసించని యూదులు అన్యజనుల్ని ప్రేరేపించి పౌలును, బర్నబాను ద్వేషించేలా వాళ్ల మనసుల్ని చెడగొట్టారు.+ 3 అందుకే వాళ్లు యెహోవా* అధికారంతో ధైర్యంగా మాట్లాడుతూ చాలాకాలం అక్కడ ఉన్నారు. దేవుడు వాళ్ల ద్వారా సూచనలు, అద్భుతాలు జరిగేలా చేసి తన అపారదయ గురించిన సందేశాన్ని* ధృవీకరించాడు.+ 4 అయితే ఆ నగరంలోని ప్రజలు రెండుగా విడిపోయారు. కొందరు యూదులకు, మిగతావాళ్లు ఆ ఇద్దరు అపొస్తలులకు మద్దతిచ్చారు. 5 అన్యజనులు, యూదులు, యూదుల నాయకులు వాళ్లిద్దర్ని అవమానించాలని, రాళ్లతో కొట్టాలని అనుకున్నారు.+ 6 ఈ విషయం గురించి తెలిసినప్పుడు పౌలు, బర్నబా లుకయొనియలోని లుస్త్ర, దెర్బే అనే నగరాలకు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు పారిపోయారు.+ 7 అక్కడ కూడా వాళ్లు మంచివార్త ప్రకటిస్తూనే ఉన్నారు.

8 లుస్త్రలో, పాదాలు చచ్చుబడిపోయిన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను పుట్టుకతోనే కుంటివాడు, ఎప్పుడూ నడవలేదు. 9 పౌలు మాట్లాడుతుండగా అతను వింటున్నాడు. పౌలు అతని వైపే చూస్తూ, బాగవ్వడానికి కావాల్సిన విశ్వాసం అతనికి ఉందని గమనించి,+ 10 “నీ కాళ్ల మీద నిలబడు” అని బిగ్గరగా అన్నాడు. దాంతో అతను వెంటనే లేచి, నడవడం మొదలుపెట్టాడు.+ 11 పౌలు చేసింది చూసినప్పుడు ప్రజలు లుకయొనియ భాషలో, “దేవుళ్లు మనుషుల రూపంలో మన దగ్గరికి దిగివచ్చారు!”+ అని అరిచారు. 12 కాబట్టి వాళ్లు బర్నబాను ద్యుపతి అని, పౌలును హెర్మే అని పిలవడం మొదలుపెట్టారు. ఇద్దరిలో పౌలు ఎక్కువగా మాట్లాడాడు కాబట్టి అతన్ని హెర్మే అని పిలిచారు. 13 ఆ నగర ప్రవేశ ద్వారం దగ్గర ద్యుపతి ఆలయం ఉంది. దాని పూజారి ఎద్దుల్ని, పూలదండల్ని నగర ద్వారాల దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రజలతో కలిసి బలులు అర్పించాలని అనుకున్నాడు.

14 అయితే అపొస్తలులైన బర్నబా, పౌలు దాని గురించి విన్నప్పుడు తమ వస్త్రాలు చింపుకొని ఆ గుంపుల్లోకి చొరబడి ఇలా అరిచారు: 15 “స్నేహితులారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మనుషులమే, మీకున్న లాంటి బలహీనతలే మాకూ ఉన్నాయి.+ మీరు ఇలాంటి వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటన్నిటినీ చేసిన జీవంగల దేవుని+ వైపుకు తిరగాలని మేము మీకు మంచివార్త ప్రకటిస్తున్నాం. 16 గతంలో ఆయన దేశాలన్నిటినీ తమకు నచ్చినట్టు చేయనిచ్చాడు.+ 17 అయినా, మంచి చేయడం ద్వారా ఆయన తన గురించి తాను సాక్ష్యమిచ్చాడు.+ ఆయన ఆకాశం నుండి వర్షాల్నీ పుష్కలంగా పంటనిచ్చే రుతువుల్నీ ఇస్తూ,+ ఆహారంతో మిమ్మల్ని సంతృప్తిపరుస్తూ, మీ హృదయాల్ని సంతోషంతో నింపుతూ వచ్చాడు.”+ 18 ఇంత చెప్పిన తర్వాత కూడా, తమకు బలి అర్పించకుండా ప్రజల్ని ఆపడానికి వాళ్లు చాలా కష్టపడాల్సి వచ్చింది.

19 అయితే అంతియొకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి ప్రజల్ని తమ వైపుకు తిప్పుకున్నారు.+ దాంతో వాళ్లు పౌలును రాళ్లతో కొట్టి, అతను చనిపోయాడని అనుకొని నగరం బయటికి ఈడ్చుకెళ్లారు.+ 20 అయితే శిష్యులు పౌలు చుట్టూ చేరినప్పుడు అతను లేచి నగరంలోకి ప్రవేశించాడు. తర్వాతి రోజు అతను బర్నబాతో కలిసి దెర్బేకు వెళ్లాడు.+ 21 ఆ నగరంలో మంచివార్త ప్రకటించి చాలామందిని శిష్యుల్ని చేసిన తర్వాత వాళ్లు లుస్త్రకు, ఈకొనియకు, అంతియొకయకు తిరిగెళ్లారు. 22 అక్కడ పౌలు, బర్నబా విశ్వాసంలో స్థిరంగా ఉండమని శిష్యుల్ని ప్రోత్సహిస్తూ వాళ్లను బలపర్చారు.+ వాళ్లు శిష్యులతో ఇలా అన్నారు: “ఎన్నో శ్రమల్ని ఎదుర్కొని మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి.”+ 23 అంతేకాదు వాళ్లు ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి+ ఒక్కో సంఘంలో పెద్దల్ని నియమించారు;+ ఆ పెద్దల్ని వాళ్లు నమ్మిన యెహోవాకు* అప్పగించారు.

24 తర్వాత వాళ్లు పిసిదియ మీదుగా ప్రయాణించి పంఫూలియకు వచ్చారు.+ 25 పెర్గేలో వాక్యం ప్రకటించిన తర్వాత వాళ్లు అత్తాలియకు వెళ్లారు. 26 అక్కడి నుండి వాళ్లు ఓడలో తిరిగి అంతియొకయకు బయల్దేరారు. ఇప్పుడు వాళ్లు ఏ పనైతే ముగించారో, ఆ పని కోసం సహోదరులు వాళ్లను దేవుని అపారదయకు అప్పగించింది అక్కడే.+

27 వాళ్లు అక్కడికి చేరుకున్నాక, అక్కడున్న సంఘాన్ని ఒకచోట సమావేశపర్చి, తమ ద్వారా దేవుడు చేసిన వాటన్నిటి గురించి వాళ్లకు చెప్పారు. అలాగే, దేవుడు అన్యజనుల కోసం విశ్వాసమనే తలుపు తెరిచాడని కూడా వాళ్లకు చెప్పారు.+ 28 వాళ్లు ఆ శిష్యుల దగ్గర చాలాకాలం ఉన్నారు.

15 యూదయ నుండి కొంతమంది అంతియొకయకు వచ్చి, “మీరు మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేయించుకుంటేనే+ రక్షించబడతారు” అని సహోదరులకు బోధించడం మొదలుపెట్టారు. 2 వాళ్లకు, పౌలు బర్నబాలకు మధ్య చాలాసేపు తీవ్రమైన వాద ప్రతివాదాలు జరిగాయి. అప్పుడు సహోదరులు ఈ వివాదం గురించి యెరూషలేములో ఉన్న అపొస్తలులతో, పెద్దలతో మాట్లాడడానికి పౌలును, బర్నబాను, ఇంకొంతమందిని పంపాలని నిర్ణయించారు.+

3 సంఘం వాళ్లను సాగనంపింది. వాళ్లు ఫేనీకే, సమరయ గుండా ప్రయాణిస్తూ, అన్యజనులు దేవుని వైపుకు తిరగడం గురించి అక్కడి సహోదరులకు వివరంగా చెప్తూ వాళ్లకు ఎంతో సంతోషం కలిగించారు. 4 వాళ్లు యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడి సంఘంలోని వాళ్లు, అపొస్తలులు, పెద్దలు వాళ్లను సాదరంగా ఆహ్వానించారు. పౌలు, బర్నబాలు దేవుడు తమ ద్వారా చేసిన వాటన్నిటి గురించి వాళ్లకు చెప్పారు. 5 అయితే, అంతకుముందు పరిసయ్యుల బోధల్ని అనుసరించి,* ఆ తర్వాత విశ్వాసులుగా మారిన కొంతమంది లేచి నిలబడి, “విశ్వాసులుగా మారిన అన్యజనులు సున్నతి చేయించుకోవాలి; మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని వాళ్లకు ఆజ్ఞాపించాలి” అని అన్నారు.+

6 కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడడానికి అపొస్తలులు, పెద్దలు సమావేశమయ్యారు. 7 చాలాసేపు తీవ్రంగా చర్చించుకున్న తర్వాత పేతురు లేచి నిలబడి ఇలా అన్నాడు: “సహోదరులారా, అన్యజనులు మొదట నా ద్వారా మంచివార్త విని విశ్వాసం ఉంచాలని దేవుడు మీలో నుండి నన్ను ఎంచుకున్నాడని మీకు బాగా తెలుసు.+ 8 అయితే, దేవునికి హృదయాలు తెలుసు;+ ఆయన మనకు ఇచ్చినట్టే వాళ్లకు కూడా పవిత్రశక్తిని ఇచ్చి,+ తాను వాళ్లను ఆమోదించానని సాక్ష్యమిచ్చాడు. 9 వాళ్లకున్న విశ్వాసాన్ని బట్టి వాళ్ల హృదయాల్ని పవిత్రపర్చడం ద్వారా+ దేవుడు మనల్ని, అన్యజనుల్ని ఒకేలా చూస్తున్నానని తెలియజేశాడు.+ 10 అలాంటిది, మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని+ బరువును*+ శిష్యుల మీద పెడుతూ మీరెందుకు ఇప్పుడు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు? 11 యూదులమైన మనం ప్రభువైన యేసు అపారదయ ద్వారా రక్షణ పొందుతామని నమ్ముతున్నాం,+ శిష్యులుగా మారిన అన్యజనులు కూడా అదే నమ్ముతున్నారు.”+

12 దాంతో వాళ్లంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. పౌలు, బర్నబాలు దేవుడు తమ ద్వారా అన్యజనుల మధ్య చేసిన ఎన్నెన్నో సూచనల గురించి, అద్భుతాల గురించి చెప్తుంటే వాళ్లు వినడం మొదలుపెట్టారు. 13 వాళ్లు మాట్లాడడం పూర్తయ్యాక యాకోబు ఇలా అన్నాడు: “సహోదరులారా, నేను చెప్పేది వినండి. 14 దేవుడు తన పేరు కోసం అన్యజనుల్లో నుండి కూడా ప్రజల్ని ఎంచుకోవడానికి,+ ఇప్పుడు వాళ్లను అంగీకరిస్తున్నాడని ఇంతకుముందే సుమెయోను*+ వివరంగా చెప్పాడు. 15 ఇది ప్రవక్తలు రాసిన ఈ మాటలకు అనుగుణంగా ఉంది: 16 ‘ఆ తర్వాత నేను తిరిగొచ్చి, పడిపోయిన దావీదు ఇంటిని* నిలబెడతాను. దాని శిథిలాల్ని బాగుచేసి దాన్ని మళ్లీ ముందున్న స్థితికి తీసుకొస్తాను. 17 అప్పుడు మిగిలినవాళ్లు, నా పేరుతో పిలవబడే అన్నిదేశాల ప్రజలతో కలిసి పట్టుదలగా యెహోవాను* వెతుకుతారని వీటిని చేస్తున్న యెహోవా* చెప్తున్నాడు.+ 18 వీటిని ఆయన ఎంతోకాలం ముందే నిర్ణయించాడు.’+ 19 కాబట్టి, దేవుని వైపు తిరుగుతున్న అన్యజనుల్ని ఇబ్బందిపెట్టడం మంచిదికాదని నా అభిప్రాయం.*+ 20 అయితే విగ్రహపూజ వల్ల కలుషితమైనవాటికి,+ లైంగిక పాపానికి,*+ గొంతు పిసికి* చంపినవాటికి, రక్తానికి దూరంగా ఉండమని+ వాళ్లకు రాసి పంపాలన్నదే నా అభిప్రాయం. 21 మోషే పుస్తకాల్లోని ఈ ఆజ్ఞల్ని ప్రకటించేవాళ్లు ప్రాచీనకాలాల నుండి అన్ని నగరాల్లో ఉన్నారు. ఎందుకంటే, ప్రతీ విశ్రాంతి రోజున ఆ పుస్తకాల్లో ఉన్నవాటిని సమాజమందిరాల్లో బయటికి చదివి వినిపిస్తున్నారు.”+

22 అప్పుడు అపొస్తలులు, పెద్దలు సంఘమంతటితో కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్లు తమలో నుండి ఎంచుకోబడినవాళ్లను పౌలు, బర్నబాలతో పాటు అంతియొకయకు పంపాలని అనుకున్నారు. కాబట్టి వాళ్లు సహోదరుల మధ్య నాయకత్వం వహిస్తున్న ఇద్దర్ని అంటే బర్సబ్బా అని పిలవబడిన యూదాను, సీలను+ పంపించారు. 23 అపొస్తలులు, పెద్దలు ఈ మాటలు రాసి వాళ్లతో పంపించారు:

“అంతియొకయలో,+ సిరియాలో, కిలికియలో ఉన్న యూదులుకాని* సహోదరులకు మీ సహోదరులైన అపొస్తలులు, పెద్దలు రాస్తున్న ఉత్తరం: మీకు శుభాకాంక్షలు! 24 మేము ఎలాంటి నిర్దేశాలు ఇవ్వకపోయినా, ఇక్కడి నుండి కొంతమంది మీ దగ్గరికి వచ్చి మీ నమ్మకాల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ తమ మాటలతో మిమ్మల్ని ఇబ్బందిపెట్టారని మాకు తెలిసింది. 25 కాబట్టి ఇద్దరు సహోదరుల్ని ఎంపికచేసి వాళ్లను మా ప్రియ సహోదరులైన బర్నబాతో, పౌలుతో పాటు మీ దగ్గరికి పంపాలని మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. 26 వాళ్లు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కోసం తమ జీవితాల్ని అంకితం చేశారు.+ 27 ఈ ఉత్తరంలో ఉన్న విషయాల్నే స్వయంగా మీకు వివరించడానికి మేము యూదాను, సీలను కూడా పంపిస్తున్నాం.+ 28 అవసరమైన ఈ విషయాలు తప్ప అదనంగా ఏ భారం మీ మీద పెట్టకూడదని పవిత్రశక్తి సహాయంతో+ మేము ఒక ముగింపుకు వచ్చాం, అవేమిటంటే: 29 విగ్రహాలకు బలి ఇచ్చినవాటికి,+ రక్తానికి,+ గొంతు పిసికి* చంపినవాటికి,+ లైంగిక పాపానికి*+ ఎప్పుడూ దూరంగా ఉండండి. మీరు జాగ్రత్తగా వీటికి దూరంగా ఉంటే మీకు మంచి జరుగుతుంది. మీరు క్షేమంగా ఉండాలి!”*

30 వీళ్లు బయల్దేరి అంతియొకయకు వచ్చారు. అక్కడ శిష్యులందర్నీ ఒక చోట సమావేశపర్చి ఆ ఉత్తరం వాళ్ల చేతికి ఇచ్చారు. 31 వాళ్లు ఉత్తరం చదివాక, అందులో ఉన్న ప్రోత్సహించే మాటల్ని బట్టి ఎంతో సంతోషించారు. 32 అయితే యూదా, సీల ప్రవక్తలు కాబట్టి వాళ్లు చాలా ప్రసంగాలిచ్చి సహోదరుల్ని ప్రోత్సహించారు, బలపర్చారు.+ 33 వాళ్లు అక్కడ కొన్ని రోజులు ఉన్నాక, సహోదరులు వాళ్లకు వీడ్కోలు చెప్పారు. తర్వాత వాళ్లు యెరూషలేముకు తిరిగెళ్లారు. 34 *— — 35 అయితే పౌలు, బర్నబా చాలామంది సహోదరులతో కలిసి యెహోవా* వాక్యం గురించిన మంచివార్తను బోధిస్తూ, ప్రకటిస్తూ అంతియొకయలో ఉండిపోయారు.

36 కొన్ని రోజుల తర్వాత పౌలు బర్నబాతో, “మనం ఏయే నగరాల్లో యెహోవా* వాక్యాన్ని ప్రకటించామో ఆ నగరాలన్నిటికీ ఇప్పుడు* తిరిగెళ్లి, అక్కడున్న సహోదరుల్ని కలుద్దాం. వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం”+ అన్నాడు. 37 అప్పుడు బర్నబా, మార్కు అని పిలవబడే యోహానును+ తమతో తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. 38 కానీ అతన్ని తమతో పాటు తీసుకెళ్లడం పౌలుకు ఇష్టంలేదు. ఎందుకంటే అతను వాళ్లతో పాటు పనిచేయకుండా, పంఫూలియలో వాళ్లను వదిలేసి వెళ్లిపోయాడు.+ 39 కాబట్టి వాళ్లిద్దరు చాలా కోపంతో గొడవపడి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. బర్నబా+ మార్కును వెంటబెట్టుకొని ఓడలో కుప్రకు బయల్దేరాడు. 40 పౌలు సీలను ఎంచుకున్నాడు. పౌలు మీద యెహోవా* తన అపారదయ చూపించాలని+ సహోదరులు ప్రార్థించిన తర్వాత అతను బయల్దేరాడు. 41 అతను సిరియా, కిలికియ గుండా ప్రయాణిస్తూ సంఘాల్ని బలపరుస్తూ ఉన్నాడు.

16 పౌలు దెర్బేకు, ఆ తర్వాత లుస్త్రకు+ వెళ్లాడు. అక్కడ తిమోతి+ అనే శిష్యుడు ఉన్నాడు. వాళ్ల అమ్మ ఒక విశ్వాసి, ఆమె యూదురాలు. కానీ వాళ్ల నాన్న గ్రీకువాడు. 2 తిమోతికి లుస్త్రలో, ఈకొనియలో ఉన్న సహోదరుల దగ్గర మంచిపేరు ఉంది. 3 పౌలు అతన్ని తన వెంట తీసుకెళ్లాలనే కోరికను వ్యక్తం చేశాడు. తిమోతి తండ్రి గ్రీకువాడని ఆ ప్రాంతాల్లోని యూదులందరికీ తెలుసు కాబట్టి వాళ్లను బట్టి+ పౌలు తిమోతికి సున్నతి చేయించాడు. 4 వాళ్లు ఒక నగరం నుండి ఇంకో నగరానికి వెళ్తూ యెరూషలేములోని అపొస్తలులు, పెద్దలు నిర్ణయించిన ఆజ్ఞల్ని సహోదరులకు చెప్పి వాటిని పాటించమన్నారు.+ 5 దానివల్ల సంఘాలు విశ్వాసంలో స్థిరపడుతూ ఉన్నాయి, విశ్వాసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది.

6 అంతేకాదు, వాళ్లు ఫ్రుగియ గుండా, గలతీయ+ దేశం గుండా ప్రయాణించారు. ఎందుకంటే, ఆసియా ప్రాంతంలో వాక్యాన్ని ప్రకటించకుండా పవిత్రశక్తి వాళ్లను అడ్డుకుంది. 7 తర్వాత వాళ్లు ముసియకు వచ్చినప్పుడు బితూనియలోకి+ వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే పవిత్రశక్తి ద్వారా యేసు* వాళ్లను వెళ్లనివ్వలేదు. 8 కాబట్టి వాళ్లు ముసియ దాటి* త్రోయకు వచ్చారు. 9 అయితే రాత్రిపూట పౌలుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో, మాసిదోనియకు చెందిన ఒక వ్యక్తి పౌలు ముందు నిలబడి, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయి” అని వేడుకుంటున్నాడు. 10 పౌలుకు ఆ దర్శనం రాగానే, మాసిదోనియ వాళ్లకు మంచివార్త ప్రకటించడానికి దేవుడే మమ్మల్ని పిలిపించాడని గుర్తించి మేము అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించాం.

11 కాబట్టి మేము త్రోయ నుండి ఓడ ఎక్కి నేరుగా సమొత్రాకే అనే ద్వీపానికి వెళ్లాం. తర్వాతి రోజు నెయపొలి అనే నగరానికి చేరుకున్నాం. 12 అక్కడి నుండి మేము ఫిలిప్పీ+ అనే రోమా నగరానికి* వెళ్లాం. ఇది మాసిదోనియ ప్రాంతంలో ప్రముఖ నగరం. మేము కొన్ని రోజులు ఆ నగరంలోనే ఉన్నాం. 13 ఆ నగర ద్వారం బయట, నది ఒడ్డున ప్రార్థనా స్థలం ఉంటుంది అనుకొని మేము విశ్రాంతి రోజున అక్కడికి వెళ్లాం. మేము అక్కడ కూర్చొని, అక్కడ సమావేశమైన స్త్రీలతో మాట్లాడడం మొదలుపెట్టాం. 14 అప్పుడు, ఊదారంగు వస్త్రాలు* అమ్ముకునే లూదియ అనే దైవభక్తిగల స్త్రీ మేము చెప్పేది వింటూ ఉంది. ఆమె తుయతైర + నగరానికి చెందినది. పౌలు చెప్తున్నవాటిని శ్రద్ధగా విని, అంగీకరించేలా యెహోవా* ఆమె హృదయాన్ని తెరిచాడు. 15 ఆమె, ఆమె ఇంటివాళ్లు బాప్తిస్మం తీసుకున్నప్పుడు+ ఆమె మమ్మల్ని, “నేను యెహోవాకు* నమ్మకంగా ఉన్నానని మీకు అనిపిస్తే వచ్చి నా ఇంట్లో ఉండండి” అని బ్రతిమాలింది. మొత్తానికి వాళ్లింటికి వెళ్లేలా ఆమె మమ్మల్ని ఒప్పించింది.

16 మేము ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు, చెడ్డదూత* పట్టిన ఒక పనమ్మాయి మాకు ఎదురుపడింది. ఆ దూత వల్ల ఆమె భవిష్యత్తు* చెప్పేది.+ అలా ఆమె తన యజమానులకు ఎంతో లాభం సంపాదించి పెట్టింది. 17 ఆ అమ్మాయి పౌలు వెనక, మా వెనక వస్తూ, “వీళ్లు సర్వోన్నత దేవుని దాసులు.+ వీళ్లు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారు” అని అరుస్తూ ఉంది. 18 ఆమె చాలారోజుల పాటు అలా చేస్తూ వచ్చింది. చివరికి పౌలుకు విసుగొచ్చి, ఆమె వైపుకు తిరిగి చెడ్డదూతతో, “యేసుక్రీస్తు పేరున నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఆమెలో నుండి బయటికి రా” అన్నాడు. వెంటనే ఆ చెడ్డదూత ఆమెలో నుండి బయటికి వచ్చాడు.+

19 ఆమె యజమానులు డబ్బులు సంపాదించుకునే అవకాశం పోయిందని+ గుర్తించినప్పుడు పౌలును, సీలను పట్టుకొని సంతలోకి ఈడ్చి పాలకుల ముందుకు తీసుకెళ్లారు.+ 20 వాళ్లు ఆ ఇద్దర్ని నగర పాలకుల ముందుకు తీసుకెళ్లి ఇలా అన్నారు: “వీళ్లు మన నగరంలో చాలా అలజడి రేపుతున్నారు.+ వీళ్లు యూదులు. 21 రోమీయులమైన మనం స్వీకరించలేని, పాటించలేని ఆచారాల్ని వీళ్లు బోధిస్తున్నారు.” 22 అప్పుడు ప్రజలంతా కలిసి వాళ్ల మీదికి లేచారు. వాళ్ల వస్త్రాలు చింపేసి, వాళ్లను కర్రలతో కొట్టమని నగర పాలకులు ఆజ్ఞాపించారు.+ 23 వాళ్లు పౌలును, సీలను చాలా దెబ్బలు కొట్టి, చెరసాలలో వేశారు. వాళ్లను జాగ్రత్తగా కాపలా కాయమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు.+ 24 కాబట్టి అతను వాళ్లను చెరసాల లోపలి గదిలో వేసి, వాళ్ల కాళ్లను బొండలో బిగించాడు.

25 అయితే దాదాపు మధ్యరాత్రి సమయంలో పౌలు, సీల ప్రార్థిస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు.+ ఖైదీలు అది వింటున్నారు. 26 అప్పుడు ఉన్నట్టుండి పెద్ద భూకంపం వచ్చింది. దానివల్ల చెరసాల పునాదులు కదిలాయి, వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి, ప్రతీ ఒక్కరి సంకెళ్లు, బొండలు ఊడిపోయాయి.+ 27 చెరసాల అధికారి నిద్రలేచి చూసేసరికి చెరసాల తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి. దాంతో అతను ఖైదీలు పారిపోయారు అనుకొని తన కత్తి తీసి, తనను తాను చంపుకోబోయాడు.+ 28 అయితే పౌలు, “అలా చేయకు, మేమంతా ఇక్కడే ఉన్నాం!” అని బిగ్గరగా అరిచాడు. 29 అప్పుడు ఆ అధికారి దీపాలు తెమ్మని చెప్పి, లోపలికి పరుగెత్తి, భయంతో వణికిపోతూ పౌలు, సీల ముందు మోకరించాడు. 30 అతను వాళ్లను బయటికి తీసుకొచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. 31 వాళ్లు, “ప్రభువైన యేసు మీద విశ్వాసముంచు. అప్పుడు నువ్వు, నీ ఇంటివాళ్లు రక్షణ పొందుతారు”+ అని చెప్పారు. 32 అప్పుడు వాళ్లు అతనికి, అతని ఇంటివాళ్లందరికీ యెహోవా* వాక్యాన్ని ప్రకటించారు. 33 రాత్రి ఆ సమయంలోనే* అతను వాళ్లను తీసుకెళ్లి వాళ్ల గాయాల్ని కడిగాడు. తర్వాత ఆలస్యం చేయకుండా అతను, అతని ఇంటివాళ్లందరూ బాప్తిస్మం తీసుకున్నారు.+ 34 అతను వాళ్లను తన ఇంటికి తీసుకెళ్లి, వాళ్లకోసం భోజనం ఏర్పాటు చేశాడు. అతను ఇప్పుడు దేవుని మీద విశ్వాసముంచాడు కాబట్టి అతను, అతని ఇంటివాళ్లందరూ చాలా సంతోషించారు.

35 తెల్లవారినప్పుడు నగర పాలకులు రక్షక భటుల్ని పంపి, “వాళ్లను విడుదల చేయి” అని చెప్పారు. 36 చెరసాల అధికారి వాళ్ల మాటల్ని పౌలుకు చెప్తూ, “మిమ్మల్ని విడుదల చేయమని చెప్పడానికి నగర పాలకులు మనుషుల్ని పంపారు. కాబట్టి ఇప్పుడు మీరు బయటికి వెళ్లండి, మీరు విడుదలయ్యారు” అన్నాడు. 37 కానీ పౌలు వాళ్లతో, “రోమీయులమైన మమ్మల్ని+ వాళ్లు విచారణ చేయకుండానే అందరిముందు కొట్టి, చెరసాలలో వేశారు. ఇప్పుడేమో రహస్యంగా బయటికి వెళ్లగొడతారా? లేదు, వాళ్లే స్వయంగా వచ్చి మమ్మల్ని బయటికి తీసుకెళ్లాలి” అన్నాడు. 38 రక్షక భటులు ఈ మాటల్ని నగర పాలకులకు చెప్పారు. వాళ్లు రోమా పౌరులని విన్నప్పుడు ఆ పాలకులు భయపడ్డారు.+ 39 కాబట్టి వాళ్లు వచ్చి, క్షమించమని వేడుకున్నారు. తర్వాత వాళ్లను బయటికి తీసుకొచ్చి, నగరం విడిచి వెళ్లిపొమ్మని బ్రతిమాలారు. 40 అయితే వాళ్లు చెరసాల నుండి బయటికి వచ్చి లూదియ ఇంటికి వెళ్లారు. వాళ్లక్కడ సహోదరుల్ని చూసినప్పుడు వాళ్లను ప్రోత్సహించి,+ అక్కడి నుండి వెళ్లిపోయారు.

17 తర్వాత వాళ్లు అంఫిపొలి, అపొల్లోనియ గుండా ప్రయాణించి థెస్సలొనీకకు వచ్చారు.+ అక్కడ యూదుల సమాజమందిరం ఉంది. 2 కాబట్టి పౌలు తన అలవాటు ప్రకారం+ దానిలోకి వెళ్లాడు. పౌలు మూడు వారాలపాటు ప్రతీ విశ్రాంతి రోజున, లేఖనాలు అర్థంచేసుకునేలా అక్కడి వాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు.+ 3 క్రీస్తు బాధలు పడడం,+ మృతుల్లో నుండి బ్రతకడం+ అవసరమని పౌలు వివరిస్తూ, లేఖనాల ద్వారా రుజువు చేస్తూ ఉన్నాడు. “నేను మీకు ప్రకటిస్తున్న ఈ యేసే క్రీస్తు” అని అతను వాళ్లకు చెప్పాడు. 4 దానివల్ల వాళ్లలో కొంతమంది విశ్వాసులయ్యారు; వాళ్లు పౌలుతో, సీలతో సహవసించారు.+ అంతేకాదు దైవభక్తి ఉన్న చాలామంది గ్రీకువాళ్లు, ఎంతోమంది ప్రముఖులైన స్త్రీలు కూడా విశ్వాసులై వాళ్లతో సహవసించారు.

5 కానీ యూదులు అసూయతో నిండిపోయి,+ పనీపాటా లేకుండా సంతలో తిరిగే కొంతమంది చెడ్డవాళ్లను పోగుచేశారు; ఆ యూదులు ఒక అల్లరిమూకను తయారుచేసి, నగరంలో అలజడి రేపడం మొదలుపెట్టారు. వాళ్లు యాసోను ఇంటి మీద దాడి చేశారు. పౌలును, సీలను ఆ అల్లరిమూక ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. 6 పౌలు, సీల కనిపించకపోయేసరికి వాళ్లు యాసోనును, కొంతమంది సహోదరుల్ని నగర పాలకుల దగ్గరికి ఈడ్చుకెళ్లి ఇలా అరిచారు: “లోకాన్ని తలకిందులు చేసిన ఈ మనుషులు ఇక్కడికి కూడా వచ్చారు.+ 7 యాసోను వాళ్లను తన ఇంట్లో అతిథులుగా ఉంచుకున్నాడు. యేసు అనే ఇంకో రాజు ఉన్నాడని చెప్తూ వీళ్లందరూ కైసరు ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు.”+ 8 ఈ మాటలు విన్నప్పుడు ఆ గుంపు, అలాగే నగర పాలకులు ఆందోళనపడ్డారు. 9 వాళ్లు యాసోను దగ్గర, మిగతావాళ్ల దగ్గర జామీను తీసుకొని వాళ్లను వెళ్లనిచ్చారు.

10 చీకటి పడగానే సహోదరులు పౌలును, సీలను బెరయకు పంపించారు. వాళ్లు అక్కడికి చేరుకున్న తర్వాత, యూదుల సమాజమందిరంలోకి వెళ్లారు. 11 థెస్సలొనీకలోని వాళ్లకన్నా బెరయలో ఉన్న యూదులు నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపించారు. అందుకే వాళ్లు ఎంతో ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. తాము విన్న విషయాలు నిజమో కాదో తెలుసుకోవడానికి వాళ్లు ప్రతీరోజు లేఖనాల్ని జాగ్రత్తగా పరిశోధిస్తూ వచ్చారు. 12 కాబట్టి వాళ్లలో చాలామంది విశ్వాసులయ్యారు. గ్రీకువాళ్లలో చాలామంది ప్రముఖ స్త్రీలు, అలాగే కొంతమంది పురుషులు కూడా విశ్వాసులయ్యారు. 13 అయితే, పౌలు బెరయలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని థెస్సలొనీకలో ఉన్న యూదులకు తెలిసినప్పుడు, బెరయలో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టి అలజడి రేపడానికి వాళ్లు అక్కడికి వచ్చారు.+ 14 అప్పుడు సహోదరులు వెంటనే పౌలును సముద్రతీరం వరకు పంపించారు.+ సీల, తిమోతి మాత్రం అక్కడే ఉండిపోయారు. 15 అయితే, పౌలుతో పాటు ఉన్నవాళ్లు అతన్ని ఏథెన్సు వరకు తీసుకెళ్లారు. కానీ వీలైనంత త్వరగా సీలను, తిమోతిని+ తన దగ్గరికి రమ్మని చెప్పమంటూ పౌలు వాళ్లకు నిర్దేశాలు ఇచ్చాడు. దాంతో అతని వెంట వచ్చినవాళ్లు బయల్దేరి వెళ్లిపోయారు.

16 పౌలు వాళ్ల కోసం ఏథెన్సులో వేచి ఉన్నప్పుడు, ఆ నగరం విగ్రహాలతో నిండి ఉండడం చూసి అతని హృదయం రగిలిపోయింది. 17 అప్పుడతను లేఖనాల్ని అర్థంచేసుకునేలా సమాజమందిరంలో యూదులకు, దైవభక్తిగల ఇతరులకు, అలాగే ప్రతీరోజు సంతలో కలిసేవాళ్లకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. 18 అయితే ఎపికూరీయుల, స్తోయికుల తత్త్వవేత్తలు కొంతమంది పౌలుతో వాదించడం మొదలుపెట్టారు. కొంతమంది, “ఈ వదరుబోతు ఏం చెప్పాలని అనుకుంటున్నాడు?” అన్నారు. ఇంకొంతమంది, “ఇతను విదేశీ దేవుళ్ల గురించి ప్రకటిస్తున్నట్టున్నాడు” అన్నారు. ఎందుకంటే పౌలు యేసు గురించిన, చనిపోయినవాళ్లు తిరిగి బ్రతకడం* గురించిన మంచివార్త ప్రకటిస్తున్నాడు.+ 19 కాబట్టి వాళ్లు అతన్ని అరేయొపగుకు* తీసుకెళ్లి ఇలా అన్నారు: “నువ్వు నేర్పిస్తున్న ఈ కొత్త బోధ ఏమిటో మేము తెలుసుకోవచ్చా? 20 ఎందుకంటే మేము ఇప్పటివరకు వినని విషయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మేము వాటి అర్థాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాం.” 21 నిజానికి ఏథెన్సు ప్రజలందరూ, అలాగే అక్కడ నివసించే* విదేశీయులు ఖాళీ సమయమంతా ఏదైనా కొత్త విషయం గురించి చెప్తూనో, వింటూనో గడిపేస్తుంటారు. 22 అప్పుడు పౌలు అరేయొపగు+ మధ్యలో నిలబడి ఇలా అన్నాడు:

“ఏథెన్సు ప్రజలారా, ఇతరులతో పోలిస్తే అన్ని విషయాల్లో మీకు దైవభక్తి ఎక్కువని నేను గమనించాను.+ 23 ఉదాహరణకు, నేను నగరంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, మీరు పూజించే* విగ్రహాల్ని జాగ్రత్తగా గమనించాను. నాకు ఒక బలిపీఠం కూడా కనిపించింది. దానిమీద, ‘తెలియని దేవునికి’ అని చెక్కి ఉంది. కాబట్టి మీరు తెలియక పూజిస్తున్న ఆ దేవుని గురించే నేను మీకు ప్రకటిస్తున్నాను. 24 లోకాన్ని, అందులో ఉన్న వాటన్నిటినీ చేసిన దేవుడు ఆకాశానికి, భూమికి ప్రభువు+ కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు.+ 25 అంతేకాదు, తనకేదో అవసరం ఉన్నట్టు ఆయన మనుషుల సహాయం కోసం ఎదురుచూడడు.+ ఎందుకంటే ఆయనే అందరికీ ప్రాణాన్ని, ఊపిరిని,+ అన్నిటినీ ఇస్తున్నాడు. 26 భూమంతటి మీద జీవించడానికి+ ఆయన ఒకే ఒక్క మనిషి+ నుండి అన్నిదేశాల మనుషుల్ని చేశాడు. చాలా విషయాలకు ఆయన సమయాన్ని నిర్ణయించాడు, మనుషులు ఎక్కడ నివసించాలో ఆ సరిహద్దుల్ని కూడా నిర్ణయించాడు.+ 27 ఎందుకంటే ప్రజలు తన కోసం వెతికి, తడవులాడి, తనను కనుక్కోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.+ నిజానికి, ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు. 28 ఆయన వల్లే మనకు జీవం వచ్చింది, ఆయన వల్లే మనం కదులుతున్నాం, ఇక్కడున్నాం. చివరికి, మీ కవులలో కొంతమంది చెప్పినట్టు, ‘మనం కూడా ఆయన పిల్లలమే.’*

29 “మనం దేవుని పిల్లలం*+ కాబట్టి, దేవుడు బంగారంతోనో, వెండితోనో, రాయితోనో చేయబడిన వాటిలా, మనుషుల ఆలోచనల ప్రకారం చేతులతో చేసిన వాటిలా ఉంటాడని అనుకోకూడదు.+ 30 నిజమే, ప్రజలకు తన గురించి తెలియని ఆ కాలాల్ని దేవుడు చూసీచూడనట్టు వదిలేశాడు.+ ఇప్పుడైతే, అన్నిచోట్ల ఉన్న ప్రజలందరూ పశ్చాత్తాపపడాలని ఆయన ప్రకటిస్తున్నాడు. 31 ఎందుకంటే, తాను నియమించిన మనిషి ద్వారా ప్రపంచానికి న్యాయంగా తీర్పు తీర్చే ఒక రోజును ఆయన నిర్ణయించాడు.+ దేవుడు ఆ మనిషిని మృతుల్లో నుండి తిరిగి బ్రతికించడం+ ద్వారా, ఆ తీర్పు రోజు తప్పకుండా వస్తుందని హామీ ఇచ్చాడు.”

32 చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతకడం* గురించిన బోధను వాళ్లు విన్నప్పుడు, కొంతమంది ఎగతాళి చేశారు.+ అయితే ఇంకొంతమంది, “దీని గురించి నువ్వు చెప్పేది మేము ఇంకో సమయంలో వింటాం” అన్నారు. 33 కాబట్టి పౌలు అక్కడి నుండి వెళ్లిపోయాడు. 34 అయితే కొంతమంది పౌలుతో చేరి విశ్వాసులయ్యారు. వాళ్లలో అరేయొపగు న్యాయస్థాన న్యాయమూర్తి దియొనూసి, దమరి అనే స్త్రీ, ఇంకొంతమంది ఉన్నారు.

18 ఆ తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయల్దేరి కొరింథుకు వచ్చాడు. 2 అతనికి అకుల+ అనే యూదుడు కలిశాడు. అతని సొంత ఊరు పొంతు. క్లౌదియ చక్రవర్తి యూదులందర్నీ రోము విడిచివెళ్లమని ఆజ్ఞాపించడంతో అతను ఈమధ్యే తన భార్య ప్రిస్కిల్లతో పాటు ఇటలీ నుండి అక్కడికి వచ్చాడు. అందుకే పౌలు వాళ్లను కలవడానికి వెళ్లాడు. 3 వాళ్ల వృత్తి కూడా డేరాలు తయారుచేయడమే కాబట్టి పౌలు వాళ్లింట్లో ఉండి వాళ్లతో కలిసి పనిచేశాడు.+ 4 ప్రతీ విశ్రాంతి రోజున పౌలు సమాజమందిరంలో ప్రసంగం ఇస్తూ+ యూదుల్ని, గ్రీకువాళ్లను ఒప్పించేవాడు.

5 సీల,+ తిమోతి+ మాసిదోనియ నుండి వచ్చాక, పౌలు తన సమయాన్నంతా వాక్యాన్ని ప్రకటించడంలోనే గడిపాడు, యేసే క్రీస్తని రుజువు చేయడానికి యూదులకు సాక్ష్యమిస్తూ ఉన్నాడు.+ 6 కానీ ఆ యూదులు పౌలును వ్యతిరేకిస్తూ, దూషిస్తూ వచ్చారు. కాబట్టి పౌలు తన వస్త్రాల్ని దులిపేసుకొని,+ “మీకు ఏం జరిగినా ఆ బాధ్యత మీదే.+ మీ రక్తం విషయంలో నేను నిర్దోషిని.+ ఇప్పటినుండి నేను అన్యజనుల దగ్గరికి వెళ్తాను”+ అని వాళ్లతో అన్నాడు. 7 తర్వాత పౌలు సమాజమందిరాన్ని విడిచిపెట్టి, భక్తిపరుడైన తీతియు యూస్తు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నాడు. అతని ఇల్లు సమాజమందిరం పక్కనే ఉంది. 8 సమాజమందిరం అధికారి క్రిస్పు,+ అతని ఇంటివాళ్లందరూ ప్రభువు మీద విశ్వాసముంచారు. మంచివార్త విన్న కొరింథీయుల్లో చాలామంది విశ్వాసముంచి, బాప్తిస్మం తీసుకోవడం మొదలుపెట్టారు. 9 అంతేకాదు రాత్రిపూట పౌలుకు ఒక దర్శనం వచ్చింది. అందులో ప్రభువు అతనితో ఇలా చెప్పాడు: “భయపడకు. మాట్లాడుతూనే ఉండు, ఆపకు. 10 ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను,+ నీకు హాని జరిగేలా ఎవరూ నీ మీద దాడిచేయరు. ఈ నగరంలో నా మీద విశ్వాసం ఉంచబోయేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు.” 11 కాబట్టి పౌలు ఒకటిన్నర సంవత్సరాల పాటు అక్కడే ఉండి, వాళ్ల మధ్య దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు.

12 గల్లియోను అకయ ప్రాంతానికి స్థానిక అధిపతిగా* ఉన్నప్పుడు, యూదులు పౌలు మీద మూకుమ్మడిగా దాడిచేసి, అతన్ని న్యాయపీఠం ముందుకు తీసుకెళ్లి, 13 “ఇతను చట్ట వ్యతిరేకమైన పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించమని ప్రజలకు నేర్పిస్తున్నాడు” అన్నారు. 14 పౌలు మాట్లాడబోతున్నప్పుడు గల్లియోను ఆ యూదులతో ఇలా అన్నాడు: “యూదులారా, ఇతను చేసింది తప్పో, ఘోరమైన నేరమో అయితే నేను మీ మాటల్ని ఓపిగ్గా వినడం సరైనదే. 15 కానీ అది మాటల గురించిన, పేర్ల గురించిన లేదా మీ ధర్మశాస్త్రం గురించిన వివాదమైతే+ దాన్ని మీరే చూసుకోవాలి. ఈ విషయాల్లో న్యాయమూర్తిగా ఉండడం నాకు ఇష్టంలేదు.” 16 ఆ మాటలు అన్నాక, అతను వాళ్లను న్యాయపీఠం ముందు నుండి వెళ్లగొట్టాడు. 17 అప్పుడు వాళ్లందరూ సమాజమందిరం అధికారైన సొస్తెనేసును+ పట్టుకొని, న్యాయపీఠం ముందు అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. అయితే గల్లియోను ఈ విషయాల్లో ఏమాత్రం కలగజేసుకోలేదు.

18 పౌలు ఇంకా చాలా రోజులు అక్కడున్నాక, అక్కడి సహోదరులకు వీడ్కోలు చెప్పి ఓడలో సిరియాకు బయల్దేరాడు. అతనితో పాటు ప్రిస్కిల్ల, అకుల కూడా ఉన్నారు. కెంక్రేయలో+ పౌలు తన మొక్కుబడి తీర్చుకోవడానికి తలవెంట్రుకలు కత్తిరించుకున్నాడు. 19 వాళ్లు ఎఫెసుకు చేరుకున్నప్పుడు పౌలు వాళ్లను అక్కడ విడిచిపెట్టి, సమాజమందిరంలోకి వెళ్లి లేఖనాలు అర్థంచేసుకునేలా యూదులకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు.+ 20 వాళ్లు పౌలును ఇంకొన్ని రోజులు అక్కడే ఉండమని బ్రతిమాలినా అతను ఒప్పుకోలేదు. 21 అతను వాళ్లకు వీడ్కోలు చెప్పి, “యెహోవాకు* ఇష్టమైతే మళ్లీ మీ దగ్గరికి వస్తాను” అన్నాడు. తర్వాత, ఓడలో ఎఫెసు నుండి బయల్దేరి 22 కైసరయకు వచ్చాడు. తర్వాత అతను వెళ్లి* సంఘాన్ని పలకరించి, అంతియొకయకు వచ్చాడు.+

23 పౌలు కొంతకాలం అక్కడున్న తర్వాత గలతీయ, ఫ్రుగియ+ దేశాల్లో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తూ శిష్యులందర్నీ బలపర్చాడు.+

24 అపొల్లో+ అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతని సొంతూరు అలెక్సంద్రియ. అతను మంచి ప్రసంగీకుడు, లేఖనాల మీద అతనికి మంచి పట్టు ఉంది. 25 అతను యెహోవా* మార్గం గురించి ఉపదేశించబడ్డాడు. పవిత్రశక్తి నింపిన ఉత్సాహంతో అతను యేసుకు సంబంధించిన విషయాల గురించి ఖచ్చితంగా మాట్లాడుతూ, బోధిస్తూ ఉన్నాడు. అయితే, యోహాను ప్రకటించిన బాప్తిస్మం గురించి మాత్రమే అతనికి తెలుసు. 26 అతను సమాజమందిరంలో ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రిస్కిల్ల, అకుల+ అతను చెప్పేది విన్నప్పుడు అతన్ని తమతో పాటు తీసుకెళ్లి దేవుని మార్గం గురించి ఇంకా ఖచ్చితంగా అతనికి వివరించారు. 27 తర్వాత, అపొల్లో అకయకు వెళ్లాలనుకున్నాడు కాబట్టి సహోదరులు అక్కడి శిష్యులకు ఉత్తరం రాసి, అతన్ని ప్రేమతో చేర్చుకోమని ప్రోత్సహించారు. అతను అక్కడికి వెళ్లాక, దేవుని అపారదయ ద్వారా విశ్వాసులైన వాళ్లకు ఎంతో సహాయం చేశాడు. 28 అతను యేసే క్రీస్తని లేఖనాల నుండి చూపిస్తూ, యూదులు బోధించేది తప్పు అని శక్తివంతమైన మాటలతో అందరిముందు సంపూర్ణంగా రుజువు చేశాడు.+

19 అపొల్లో+ కొరింథులో ఉన్నప్పుడు పౌలు సముద్రతీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ ఎఫెసుకు+ వచ్చాడు. అక్కడ అతను కొంతమంది శిష్యుల్ని చూసి, 2 “మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రశక్తిని పొందారా?”+ అని అడిగాడు. వాళ్లు, “పవిత్రశక్తి గురించి అసలు మేమెప్పుడూ వినలేదు” అన్నారు. 3 అప్పుడు పౌలు, “మరైతే మీరు ఎలాంటి బాప్తిస్మం తీసుకున్నారు?” అని అడిగాడు. వాళ్లు, “మేము యోహాను బోధ ప్రకారం బాప్తిస్మం తీసుకున్నాం”+ అన్నారు. 4 దానికి పౌలు ఇలా అన్నాడు: “యోహాను తన తర్వాత వస్తున్న వ్యక్తి మీద,+ అంటే యేసు మీద విశ్వాసం ఉంచమని ప్రజలకు చెప్తూ పశ్చాత్తాపానికి గుర్తుగా బాప్తిస్మం ఇచ్చాడు.”+ 5 ఆ మాటలు విన్నాక వాళ్లు ప్రభువైన యేసు పేరున బాప్తిస్మం తీసుకున్నారు. 6 పౌలు వాళ్లమీద తన చేతులు ఉంచినప్పుడు, వాళ్లమీదికి పవిత్రశక్తి వచ్చింది.+ దాంతో వాళ్లు వేరే భాషల్లో మాట్లాడడం, ప్రవచించడం మొదలుపెట్టారు.+ 7 వాళ్లంతా దాదాపు 12 మంది పురుషులు.

8 పౌలు సమాజమందిరంలోకి వెళ్లి+ దేవుని రాజ్యం గురించి ప్రసంగాలిస్తూ, చర్చిస్తూ,* ప్రజల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ధైర్యంగా మాట్లాడాడు.+ అలా మూడు నెలలపాటు చేశాడు. 9 అయితే కొంతమంది నమ్మడానికి మొండిగా నిరాకరించారు, ప్రభువు మార్గాన్ని+ ప్రజల ముందు దూషించారు. దాంతో పౌలు వాళ్లను విడిచిపెట్టి+ శిష్యుల్ని తనతోపాటు తీసుకెళ్లాడు. అతను తురన్ను పాఠశాల సభా భవనంలో రోజూ ప్రసంగాలిస్తూ ఉన్నాడు. 10 అతను రెండు సంవత్సరాల పాటు అలా చేశాడు. దానివల్ల ఆసియా ప్రాంతంలో ఉన్నవాళ్లందరూ అంటే యూదులు, గ్రీకువాళ్లు ప్రభువు వాక్యాన్ని విన్నారు.

11 అలాగే దేవుడు పౌలు ద్వారా ఎన్నో గొప్పగొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు.+ 12 చివరికి పౌలు శరీరాన్ని తాకిన చేతి రుమాళ్లను, నడికట్లను కూడా ప్రజలు రోగుల దగ్గరికి తీసుకెళ్లేవాళ్లు.+ అప్పుడు వాళ్లు బాగయ్యేవాళ్లు, చెడ్డదూతలు* బయటికి వచ్చేసేవాళ్లు.+ 13 అయితే, చెడ్డదూతల్ని వెళ్లగొడుతూ తిరిగే కొంతమంది యూదులు కూడా, “పౌలు ప్రకటిస్తున్న యేసు అధికారంతో నేను ఆజ్ఞాపిస్తున్నాను”+ అని అంటూ చెడ్డదూతలు పట్టినవాళ్ల మీద ప్రభువైన యేసు పేరును ఉపయోగించడానికి ప్రయత్నించేవాళ్లు. 14 స్కెవ అనే యూదుల ముఖ్య యాజకుడి ఏడుగురు కుమారులు కూడా అలా చేసేవాళ్లు. 15 కానీ ఆ చెడ్డదూత, “నాకు యేసు తెలుసు,+ పౌలు తెలుసు.+ కానీ మీరెవరు?” అని వాళ్లతో అన్నాడు. 16 అప్పుడు చెడ్డదూత పట్టిన వ్యక్తి వాళ్ల మీదికి ఎగిరి దూకి, వాళ్లందర్నీ లొంగదీసుకొని, వాళ్ల మీద గెలిచాడు. దాంతో వాళ్లు బట్టలు లేకుండా, గాయాలతో ఆ ఇంటినుండి పారిపోయారు. 17 ఈ విషయం గురించి ఎఫెసులో ఉన్నవాళ్లందరికీ అంటే యూదులకు, గ్రీకువాళ్లకు తెలిసింది. దాంతో అందరికీ భయం పట్టుకుంది. అంతేకాదు, యేసు ప్రభువు పేరుకు మహిమ కలుగుతూ వచ్చింది. 18 విశ్వాసులైన వాళ్లలో చాలామంది వచ్చి తమ పాపాల్ని అందరిముందు ఒప్పుకునేవాళ్లు, తాము చేసిన చెడ్డపనుల గురించి చెప్పేవాళ్లు. 19 నిజానికి, ఇంద్రజాలం చేసేవాళ్లలో చాలామంది తమ పుస్తకాల్ని ఒకచోటికి తీసుకొచ్చి అందరిముందు వాటిని కాల్చేశారు.+ వాటి ఖరీదు లెక్కేసినప్పుడు, అది 50,000 వెండి నాణేలు అని తేలింది. 20 అలా యెహోవా* వాక్యం ఎంతో గొప్ప రీతిలో వ్యాప్తిచెందుతూ, జయిస్తూ వచ్చింది.+

21 ఇవి జరిగాక పౌలు మాసిదోనియ,+ అకయ గుండా ప్రయాణించి యెరూషలేముకు వెళ్లాలని+ నిర్ణయించుకున్నాడు. “యెరూషలేముకు వెళ్లాక, రోముకు కూడా వెళ్లాలి”+ అని అతను అనుకున్నాడు. 22 కాబట్టి అతను తనకు సహాయం చేసేవాళ్లలో ఇద్దర్ని అంటే తిమోతిని,+ ఎరస్తును+ మాసిదోనియకు పంపించాడు. పౌలు మాత్రం కొంతకాలం ఆసియా ప్రాంతంలోనే ఉండిపోయాడు.

23 ఆ సమయంలో, ప్రభువు మార్గం+ గురించి పెద్ద అలజడి రేగింది.+ 24 దేమేత్రి అనే వెండి పనివాడు అర్తెమి ఆలయం లాంటి చిన్నచిన్న వెండి ఆలయాలు తయారుచేస్తూ ఆ పని చేసేవాళ్లకు చాలా లాభాలు తెచ్చిపెట్టాడు.+ 25 అతను వాళ్లను, అలాంటి పని చేసే ఇతరుల్ని పోగుచేసి ఇలా అన్నాడు: “స్నేహితులారా, ఈ వ్యాపారం వల్లే మనం చాలా డబ్బు సంపాదిస్తున్నామని మీకు బాగా తెలుసు. 26 అయితే ఈ పౌలు, చేతులతో చేసిన దేవుళ్లు అసలు దేవుళ్లే కాదని+ చెప్తూ ఎఫెసులోనే+ కాకుండా దాదాపు ఆసియా ప్రాంతమంతటా చాలామందిని ఒప్పించాడు, వాళ్లు అతని మాటలు నమ్మారు. దీని గురించి మీరు చూస్తున్నారు, వింటున్నారు. 27 దీన్ని ఇలాగే కొనసాగనిస్తే, మనం చేస్తున్న ఈ వ్యాపారానికి చెడ్డపేరు వస్తుంది. అంతేకాదు, అర్తెమి మహాదేవి ఆలయానికి విలువే లేకుండా పోతుంది. ఆసియా ప్రాంతం అంతటా మాత్రమే కాకుండా భూమంతటా పూజించబడుతున్న అర్తెమి వైభవం కూడా నశించిపోతుంది.” 28 ఆ మాటలు వినగానే వాళ్లు కోపంతో ఊగిపోతూ, “ఎఫెసీయుల దేవత అర్తెమి గొప్పది!” అని అరవడం మొదలుపెట్టారు.

29 దాంతో ఆ నగరమంతా అయోమయంతో నిండిపోయింది, వాళ్లంతా కలిసి ఒక్కసారిగా నాటకశాలలోకి దూసుకొచ్చి పౌలు ప్రయాణ సహవాసులు, మాసిదోనియ వాళ్లు అయిన గాయియును, అరిస్తార్కును+ తమతో పాటు ఈడ్చుకొని వచ్చారు. 30 అప్పుడు పౌలు లోపలున్న ప్రజల దగ్గరికి వెళ్లాలని అనుకున్నాడు, కానీ శిష్యులు అతన్ని వెళ్లనివ్వలేదు. 31 పౌలుతో స్నేహంగా ఉన్న కొంతమంది పండుగల, ఆటల అధికారులు కూడా పౌలుకు కబురు పంపి, ఆ నాటకశాలలోకి వెళ్లే సాహసం చేయొద్దని అతన్ని వేడుకున్నారు. 32 అప్పుడు అక్కడున్న ప్రజలంతా అయోమయంలో ఉన్నారు, కొంతమంది ఒకలా ఇంకొంతమంది ఇంకోలా కేకలు వేస్తున్నారు. అయితే వాళ్లలో చాలామందికి అసలు వాళ్లు అక్కడికి ఎందుకొచ్చారో కూడా తెలీదు. 33 కాబట్టి యూదులు అలెక్సంద్రును ముందుకు తోస్తుండగా ప్రజలు అతన్ని బయటికి తీసుకొచ్చారు. అతను ప్రజల్ని నిశ్శబ్దంగా ఉండమని చేతితో సైగ చేసి, ప్రజలకు తన వాదన వినిపించాలని అనుకున్నాడు. 34 కానీ అతను యూదుడని గుర్తుపట్టినప్పుడు వాళ్లందరూ ముక్తకంఠంతో, “ఎఫెసీయుల దేవత అర్తెమి గొప్పది!” అని కేకలు వేయడం మొదలుపెట్టారు. వాళ్లు అలా దాదాపు రెండు గంటలపాటు అరిచారు.

35 చివరికి ఆ నగర ముఖ్య అధికారి ప్రజల్ని శాంతపర్చి ఇలా అన్నాడు: “ఎఫెసు ప్రజలారా, అర్తెమి మహాదేవికి, ఆకాశం నుండి పడిన ప్రతిమకు ఎఫెసీయుల నగరం కాపలాదారు అని తెలియని మనిషి ఎవరు? 36 ఈ విషయాల్ని ఎవరూ కాదనలేరు. కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉండండి, దూకుడుగా ప్రవర్తించకండి. 37 ఎందుకంటే మీరు ఇక్కడికి తీసుకొచ్చిన మనుషులు గుళ్లను దోచేవాళ్లు కాదు, మన దేవతను దూషించేవాళ్లు కూడా కాదు. 38 కాబట్టి దేమేత్రికి+ గానీ, అతనితో ఉన్న పనివాళ్లకు గానీ ఎవరితోనైనా సమస్య ఉంటే, అందుకోసం న్యాయస్థానాలు ఉన్నాయి, స్థానిక అధిపతులు* ఉన్నారు. వాళ్ల ముందు తమ ఆరోపణలు వినిపించవచ్చు. 39 ఇది కాకుండా మీకు వేరే ఆరోపణలు ఏమైనా ఉంటే, అవి చట్టప్రకారం సభలో నిర్ణయించబడాలి. 40 ఈ రోజు జరిగిన విషయాల వల్ల మన మీద తిరుగుబాటు నేరం ఆరోపించబడే ప్రమాదముంది. ఎందుకంటే ఈ అల్లరిమూక ఎందుకు అలజడి రేపిందని అడిగితే, మనం కారణం చెప్పలేం.” 41 ఈ మాటలు చెప్పి అతను వాళ్లను పంపించేశాడు.

20 అలజడి తగ్గిపోయాక పౌలు శిష్యుల్ని పిలిపించాడు. తర్వాత వాళ్లను ప్రోత్సహించి, వాళ్లకు వీడ్కోలు చెప్పి, మాసిదోనియకు ప్రయాణం మొదలుపెట్టాడు. 2 ఆ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ అక్కడి శిష్యుల్ని చాలా మాటలతో ప్రోత్సహించాక గ్రీసుకు చేరుకున్నాడు. 3 పౌలు అక్కడ మూడు నెలలు ఉన్నాడు. అతను ఓడలో సిరియాకు బయల్దేరుతుండగా, తనను చంపడానికి యూదులు కుట్ర పన్నారని+ తెలుసుకొని మాసిదోనియ మీదుగా తిరిగెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 4 బెరయవాడైన పుర్రు కుమారుడు సోపత్రు; థెస్సలొనీక వాళ్లయిన అరిస్తార్కు,+ సెకుందు; దెర్బే వాడైన గాయియు; తిమోతి,+ అలాగే ఆసియా ప్రాంతానికి చెందిన తుకికు,+ త్రోఫిము+ అతనితో పాటు ఉన్నారు. 5 వీళ్లు మా కన్నా ముందే త్రోయకు వెళ్లి మా కోసం ఎదురుచూస్తున్నారు. 6 అయితే పులవని రొట్టెల పండుగ రోజుల+ తర్వాత మేము ఫిలిప్పీలో ఓడ ఎక్కి, ఐదు రోజుల్లో త్రోయకు చేరుకొని వాళ్లను కలుసుకున్నాం. అక్కడ మేము ఏడురోజులు ఉన్నాం.

7 వారం మొదటి రోజున* మేము భోజనం చేయడానికి* ఒకచోట కలుసుకున్నాం. అప్పుడు పౌలు అక్కడున్న వాళ్లను ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తర్వాతి రోజు అతను అక్కడి నుండి బయల్దేరబోతున్నాడు. అతను మధ్యరాత్రి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. 8 మేము కలుసుకున్న మేడగదిలో చాలా దీపాలున్నాయి. 9 ఐతుకు అనే ఒక యువకుడు అక్కడ కిటికీ దగ్గర కూర్చొని ఉన్నాడు. పౌలు మాట్లాడుతూ ఉండగా అతనికి నిద్ర ముంచుకొచ్చింది. చివరికి అతను నిద్రపోయి, ఆ నిద్రలో మూడో అంతస్తు నుండి కింద పడిపోయాడు. వాళ్లు అతని దగ్గరికి వెళ్లేసరికి అతను చనిపోయి ఉన్నాడు. 10 అయితే పౌలు కిందికి వెళ్లి, అతని మీద పడుకొని, అతన్ని కౌగిలించుకొని,+ “కంగారుపడకండి, ఇతను బ్రతికే ఉన్నాడు”+ అని అన్నాడు. 11 తర్వాత పౌలు పైకి వెళ్లి, రొట్టె విరిచి, భోజనం చేయడం మొదలుపెట్టాడు. అతను చాలాసేపు, అంటే తెల్లారేవరకు మాట్లాడుతూనే ఉన్నాడు. తర్వాత అక్కడి నుండి బయల్దేరాడు. 12 వాళ్లు ఆ యువకుణ్ణి తీసుకెళ్లారు. అతను తిరిగి బ్రతికించబడ్డాడని* చూసి చెప్పలేనంత సంతోషించారు.

13 అప్పుడు మేము ఓడ ఎక్కి అస్సుకు వెళ్లాం. పౌలు మాత్రం కాలినడకన అక్కడికి వచ్చాడు. అక్కడ పౌలును ఓడ ఎక్కించుకోవాలన్నది మా ఉద్దేశం. నిజానికి పౌలే అలా చేయమని మాకు చెప్పాడు. 14 అస్సులో పౌలు మమ్మల్ని కలుసుకున్నప్పుడు, మేము అతన్ని ఓడ ఎక్కించుకొని మితులేనేకు వెళ్లాం. 15 తర్వాతి రోజు మేము అక్కడి నుండి ఓడలో బయల్దేరి కీయొసు ద్వీపానికి కొంతదూరంలో ఆగాం. ఆ తర్వాతి రోజు సమొసులో కాసేపు ఆగాం. మరుసటి రోజు మిలేతుకు చేరుకున్నాం. 16 వీలైతే పెంతెకొస్తు పండుగ రోజున యెరూషలేములో ఉండాలని+ పౌలు హడావిడిగా వెళ్తున్నాడు కాబట్టి ఆసియా ప్రాంతంలో ఏమాత్రం సమయం గడపకూడదనే ఉద్దేశంతో ఎఫెసును+ దాటివెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

17 అయితే పౌలు మిలేతు నుండి ఎఫెసుకు కబురు పంపి అక్కడి సంఘ పెద్దల్ని పిలిపించుకున్నాడు. 18 వాళ్లు తన దగ్గరికి వచ్చినప్పుడు పౌలు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను ఆసియా ప్రాంతంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుండి మీ మధ్య ఎలా నడుచుకున్నానో మీకు బాగా తెలుసు.+ 19 నేను పూర్తి వినయంతో,*+ కన్నీళ్లతో, యూదులు పన్నిన కుట్రల వల్ల కష్టాలు పడుతూ ప్రభువుకు సేవ చేశాను. 20 మీకు మంచి చేసే* దేన్నీ నేను మీకు చెప్పకుండా ఉండలేదు, మీకు బహిరంగంగా+ ఇంటింటా+ బోధించకుండా ఉండలేదు. 21 అయితే, పశ్చాత్తాపపడి+ దేవుని వైపు తిరగమని, మన ప్రభువైన యేసు మీద విశ్వాసం ఉంచమని యూదులకు, గ్రీకువాళ్లకు పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చాను.+ 22 ఇప్పుడు ఇదిగో! పవిత్రశక్తి* నిర్దేశం ప్రకారం నేను యెరూషలేముకు వెళ్తున్నాను. అయితే అక్కడ నాకు ఏమి జరుగుతుందో నాకు తెలీదు. 23 ఒకటి మాత్రం తెలుసు. నా కోసం సంకెళ్లు, శ్రమలు ఎదురుచూస్తున్నాయని పవిత్రశక్తి ప్రతీ నగరంలో నాకు మళ్లీమళ్లీ సాక్ష్యమిస్తోంది.+ 24 అయితే, నా ప్రాణం నాకు ఏమాత్రం ముఖ్యమైనదని* నేను అనుకోవట్లేదు. ఈ పరుగుపందాన్ని, ప్రభువైన యేసు నుండి నేను పొందిన పరిచర్యను పూర్తి చేయాలన్నదే నా కోరిక.+ ఆ పరిచర్య ఏమిటంటే, దేవుని అపారదయకు సంబంధించిన మంచివార్త గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వడమే.

25 “నేను మీ మధ్య రాజ్యాన్ని ప్రకటిస్తూ వచ్చాను. అయితే ఇదిగో! మీలో ఎవ్వరూ మళ్లీ నా ముఖం చూడరు. 26 ఎవరి రక్తం విషయంలోనూ నేను దోషిని కానని+ సాక్ష్యమివ్వడానికి ఈ రోజు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. 27 నేను దేవుని ఇష్టమంతటినీ* మీకు చెప్పకుండా ఉండలేదు.+ 28 మీరు మీ విషయంలో,+ అలాగే దేవుని సంఘాన్ని కాయడం కోసం పవిత్రశక్తి మిమ్మల్ని ఎవరి మధ్య పర్యవేక్షకులుగా నియమించిందో+ ఆ మంద అంతటి విషయంలో శ్రద్ధ తీసుకోండి.+ దేవుడు ఆ సంఘాన్ని తన సొంత కుమారుడి రక్తంతో కొన్నాడు.+ 29 నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ల లాంటి వాళ్లు మీలో ప్రవేశిస్తారని,+ వాళ్లు మందతో మృదువుగా ప్రవర్తించరని నాకు తెలుసు. 30 అంతేకాదు, శిష్యుల్ని తమ వెంట ఈడ్చుకెళ్లాలని తప్పుడు బోధలు బోధించే మనుషులు మీలో నుండే బయల్దేరతారు.+

31 “కాబట్టి ఎప్పుడూ మెలకువగా ఉండండి. నేను మూడు సంవత్సరాల పాటు+ మానకుండా రాత్రింబగళ్లు మీలో ఒక్కొక్కరికి కన్నీళ్లతో ఉపదేశమిచ్చానని గుర్తుపెట్టుకోండి. 32 ఇప్పుడు నేను మిమ్మల్ని దేవునికి, ఆయన అపారదయ గురించిన వాక్యానికి అప్పగిస్తున్నాను. ఆ వాక్యం మిమ్మల్ని బలపర్చి, పవిత్రపర్చబడిన వాళ్లందరి మధ్య మీకు స్వాస్థ్యాన్ని ఇవ్వగలదు.+ 33 ఎవరి వెండిబంగారాల కోసం, వస్త్రాల కోసం నేను ఆశపడలేదు.+ 34 నేను నా అవసరాల కోసం, నాతోపాటు ఉన్నవాళ్ల అవసరాల కోసం ఈ చేతులతో పని చేశానని+ మీకు తెలుసు. 35 మీరు ఇలా కష్టపడి పనిచేస్తూ+ బలహీనంగా ఉన్నవాళ్లకు సహాయం చేయాలని, ప్రభువైన యేసు చెప్పిన మాటలు మనసులో ఉంచుకోవాలని అన్ని విషయాల్లో మీకు చూపించాను. యేసే స్వయంగా ఇలా చెప్పాడు: ‘తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే+ ఎక్కువ సంతోషం ఉంది.’ ”

36 పౌలు ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్లందరితో పాటు మోకరించి ప్రార్థించాడు. 37 వాళ్లంతా చాలా ఏడ్చి, పౌలును కౌగిలించుకొని,* ఆప్యాయంగా* ముద్దు పెట్టుకున్నారు. 38 ముఖ్యంగా, తన ముఖాన్ని ఇంకెప్పుడూ చూడరని పౌలు అన్న మాటకు+ వాళ్లు చాలా బాధపడ్డారు. తర్వాత వాళ్లు పౌలును ఓడ వరకు సాగనంపారు.

21 మేము బరువైన హృదయాలతో వాళ్లను విడిచి ఓడలో బయల్దేరాం. మేము వేగంగా ప్రయాణించి నేరుగా కోసు ద్వీపానికి చేరుకున్నాం. తర్వాతి రోజు రొదుకి, అక్కడి నుండి పతరకి చేరుకున్నాం. 2 అక్కడ మాకు ఫేనీకేకి వెళ్తున్న ఒక ఓడ కనిపించడంతో అందులోకి ఎక్కి బయల్దేరాం. 3 మేము ప్రయాణిస్తుండగా మధ్యలో కుప్ర ద్వీపం కనిపించింది. అది మాకు ఎడమవైపున ఉంది. మేము దాన్ని దాటి సిరియా వైపుకు ప్రయాణించి తూరులో దిగాం. అది ఓడలోని సరుకుల్ని దించాల్సిన స్థలం. 4 అక్కడ మేము శిష్యుల కోసం వెతికాం. వాళ్లు కనిపించినప్పుడు మేము ఏడురోజులు తూరులోనే ఉన్నాం. పవిత్రశక్తి వాళ్లకు తెలియజేసిన దాన్నిబట్టి, యెరూషలేములో అడుగుపెట్టొద్దని వాళ్లు పౌలుకు పదేపదే చెప్పారు.+ 5 మేము బయల్దేరాల్సిన సమయం వచ్చినప్పుడు, తిరిగి మా ప్రయాణం కొనసాగించాం. అయితే స్త్రీలు, పిల్లలతో సహా వాళ్లందరూ మమ్మల్ని సాగనంపడానికి సముద్రతీరం వరకు వచ్చారు. అక్కడ మేము మోకరించి ప్రార్థన చేసి, 6 ఒకరికొకరం వీడ్కోలు చెప్పుకున్నాం. తర్వాత మేము ఓడ ఎక్కి బయల్దేరాం, వాళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

7 మేము ఓడలో తూరును విడిచి తొలెమాయికి చేరుకున్నాం. అక్కడ మేము సహోదరుల్ని పలకరించి వాళ్లతో ఒక రోజు ఉన్నాం. 8 తర్వాతి రోజు మేము అక్కడి నుండి బయల్దేరి కైసరయకు చేరుకున్నాం. అక్కడ మేము మంచివార్త ప్రచారకుడైన* ఫిలిప్పు ఇంట్లో బస చేశాం. అతను యెరూషలేములో అపొస్తలులు ఎంచుకున్న ఏడుగురిలో ఒకడు.+ 9 అతనికి పెళ్లికాని* నలుగురు కూతుళ్లు ఉన్నారు, వాళ్లు ప్రవచించేవాళ్లు.+ 10 అక్కడ మేము చాలా రోజులు ఉన్న తర్వాత, యూదయ నుండి అగబు+ అనే ప్రవక్త వచ్చాడు. 11 అతను మా దగ్గరికి వచ్చి, పౌలు నడికట్టు తీసుకొని, దానితో తన కాళ్లూచేతులు కట్టేసుకొని ఇలా అన్నాడు: “దేవుడు తన పవిత్రశక్తి ద్వారా ఇలా చెప్తున్నాడు: ‘ఈ నడికట్టు ఎవరిదో అతన్ని యెరూషలేములో ఉన్న యూదులు ఇలా బంధిస్తారు.+ వాళ్లు అతన్ని అన్యజనుల చేతికి అప్పగిస్తారు.’ ”+ 12 ఆ మాటలు విన్నప్పుడు మేము, అక్కడున్నవాళ్లు కలిసి పౌలును యెరూషలేముకు వెళ్లొద్దని వేడుకోవడం మొదలుపెట్టాం. 13 అప్పుడు పౌలు, “మీరెందుకు ఇలా ఏడుస్తూ నా గుండెను* బలహీనం చేస్తున్నారు? ప్రభువైన యేసు పేరు కోసం యెరూషలేములో బంధించబడడానికే కాదు చనిపోవడానికి కూడా నేను సిద్ధమే”+ అన్నాడు. 14 అతను ఎంతకీ ఒప్పుకోకపోయే సరికి, మేము అతన్ని ఒప్పించే ప్రయత్నం మానేసి,* “యెహోవా* ఇష్టమే జరగాలి” అన్నాం.

15 ఆ తర్వాత, మేము ప్రయాణానికి సిద్ధమై యెరూషలేముకు బయల్దేరాం. 16 తొలి శిష్యుల్లో ఒకడు, కుప్రవాడు అయిన మ్నాసోను ఇంటికి మమ్మల్ని తీసుకెళ్లడానికి కైసరయ నుండి కొంతమంది శిష్యులు మాతో పాటు వచ్చారు. మేము అతని ఇంట్లో ఉండడానికి ఆహ్వానించబడ్డాం. 17 మేము యెరూషలేముకు వచ్చినప్పుడు, అక్కడి సహోదరులు మాకు సంతోషంగా స్వాగతం పలికారు. 18 అయితే ఆ తర్వాతి రోజు పౌలు మాతో కలిసి యాకోబు+ దగ్గరికి వచ్చాడు, పెద్దలందరూ అక్కడున్నారు. 19 పౌలు వాళ్లను పలకరించి, తన పరిచర్య ద్వారా దేవుడు అన్యజనుల మధ్య చేసినవాటి గురించి వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు.

20 పౌలు చెప్పింది విన్నాక వాళ్లు దేవుణ్ణి మహిమపర్చడం మొదలుపెట్టారు. అయితే వాళ్లు అతనితో ఇలా అన్నారు: “సహోదరుడా, యూదుల్లో ఎన్ని వేలమంది విశ్వాసులయ్యారో చూస్తున్నావు కదా. వాళ్లందరూ ధర్మశాస్త్రాన్ని ఉత్సాహంగా పాటిస్తున్నారు.+ 21 అయితే వాళ్లు నీ గురించి కొన్ని పుకార్లు విన్నారు. నువ్వు అన్యజనుల మధ్య ఉన్న యూదులందరితో తమ పిల్లలకు సున్నతి చేయించవద్దని, ఇతర ఆచారాలు పాటించవద్దని చెప్తూ మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టమని* బోధించావని+ వాళ్లు విన్నారు. 22 దీని గురించి మనం ఏంచేయాలి? నువ్వు ఇక్కడికి వచ్చావనే సంగతి వాళ్లకు తప్పకుండా తెలుస్తుంది. 23 కాబట్టి మేము చెప్పినట్టు చేయి. మొక్కుబడి చేసుకున్న నలుగురు పురుషులు మా దగ్గర ఉన్నారు. 24 వాళ్లను నీతో తీసుకెళ్లి, ఆచారబద్ధంగా వాళ్లతోపాటు నువ్వు కూడా శుద్ధి చేసుకో; వాళ్లు తలవెంట్రుకలు కత్తిరించుకోవడానికి అయ్యే ఖర్చులు నువ్వే పెట్టుకో. అప్పుడు నీ గురించి విన్న పుకార్లు నిజం కాదని, నువ్వు క్రమపద్ధతిలో నడుచుకుంటున్నావని, నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావని+ అందరికీ తెలుస్తుంది. 25 అన్యజనుల్లో నుండి వచ్చిన విశ్వాసుల విషయానికొస్తే, విగ్రహాలకు బలి ఇచ్చినవాటికి,+ రక్తానికి,+ గొంతు పిసికి* చంపినవాటికి,+ లైంగిక పాపానికి*+ వాళ్లు దూరంగా ఉండాలనే మా నిర్ణయాన్ని వాళ్లకు ఉత్తరంలో రాసి పంపించాం.”

26 కాబట్టి పౌలు ఆ తర్వాతి రోజు వాళ్లను తీసుకెళ్లి, వాళ్లతోపాటు తాను కూడా ఆచారబద్ధంగా శుద్ధి చేసుకున్నాడు.+ తర్వాత పౌలు, ఆ శుద్ధీకరణ రోజులు ఎప్పుడు పూర్తౌతాయో, వాళ్లలో ఒక్కొక్కరి కోసం ఎప్పుడు అర్పణను ఇవ్వాలో చెప్పడం కోసం ఆలయంలోకి వెళ్లాడు.

27 ఆ ఏడురోజులు పూర్తి కావస్తుండగా, ఆసియా నుండి వచ్చిన యూదులు ఆలయంలో అతన్ని చూసి ప్రజలందర్నీ ఉసిగొల్పారు. తర్వాత అతన్ని పట్టుకొని, 28 “ఇశ్రాయేలు ప్రజలారా, మాకు సాయం చేయండి! మన ప్రజలకు, మన ధర్మశాస్త్రానికి, ఈ ఆలయానికి వ్యతిరేకంగా ప్రతీచోట ప్రతీ ఒక్కరికి బోధిస్తున్న వ్యక్తి ఇతనే. అది చాలదన్నట్టు, చివరికి గ్రీకువాళ్లను ఆలయంలోకి తీసుకొచ్చి ఈ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశాడు”+ అని అరిచారు. 29 అంతకుముందు వాళ్లు నగరంలో, పౌలుతో పాటు ఎఫెసీయుడైన త్రోఫిము+ ఉండడం చూసి, పౌలు అతన్ని ఆలయంలోకి తీసుకొచ్చాడని అనుకున్నారు. 30 నగరమంతా అల్లకల్లోలంగా తయారైంది. ప్రజలు గుంపులుగుంపులుగా పరుగెత్తుకుంటూ వచ్చి పౌలును పట్టుకొని, ఆలయంలో నుండి బయటికి ఈడ్చుకొచ్చారు. వెంటనే ఆలయం తలుపులు మూయబడ్డాయి. 31 వాళ్లు పౌలును చంపడానికి ప్రయత్నిస్తుండగా, యెరూషలేము అంతా గందరగోళంగా ఉందని సహస్రాధిపతికి* వార్త అందింది. 32 అతను వెంటనే సైనికుల్ని, సైనికాధికారుల్ని తీసుకొని వేగంగా వాళ్ల దగ్గరికి వెళ్లాడు. ప్రజలు సహస్రాధిపతిని, సైనికుల్ని చూసినప్పుడు పౌలును కొట్టడం ఆపేశారు.

33 తర్వాత, ఆ సహస్రాధిపతి వాళ్ల దగ్గరికి వచ్చి పౌలును అదుపులోకి తీసుకున్నాడు, అతన్ని రెండు సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించాడు;+ అతను ఎవరో, ఏమి చేశాడో చెప్పమని ప్రజల్ని అడిగాడు. 34 అయితే ప్రజల్లో కొంతమంది ఒకలా, ఇంకొంతమంది ఇంకోలా అరవడం మొదలుపెట్టారు. అంతా గందరగోళంగా ఉండేసరికి అక్కడ నిజంగా ఏమి జరుగుతోందో అతనికి అర్థంకాలేదు. దాంతో పౌలును సైనికుల కోటలోకి తీసుకెళ్లమని అతను ఆజ్ఞాపించాడు. 35 అయితే పౌలు మెట్ల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రజలు అతనికి హానిచేయాలని చూస్తుండడంతో సైనికులు అతన్ని మోసుకొని వెళ్లాల్సి వచ్చింది. 36 ఎందుకంటే చాలామంది ప్రజలు, “అతన్ని చంపేయండి!” అని అరుస్తూ అతని వెనక వస్తూ ఉన్నారు.

37 పౌలును సైనికుల కోటలోకి తీసుకెళ్లబోతుండగా అతను సహస్రాధిపతిని, “నేను ఒక మాట చెప్పవచ్చా?” అని అడిగాడు. దానికి అతను ఇలా అన్నాడు: “నీకు గ్రీకు భాష వచ్చా? 38 అయితే కొంతకాలం క్రితం తిరుగుబాటు లేవదీసి 4,000 మంది హంతకుల్ని ఎడారిలోకి తీసుకెళ్లిన ఐగుప్తీయుడివి నువ్వే కదా?” 39 అప్పుడు పౌలు, “నిజానికి నేనొక యూదుణ్ణి.+ కిలికియలోని తార్సు+ అనే ముఖ్యమైన నగర పౌరుడిని. కాబట్టి, ప్రజలతో మాట్లాడడానికి నాకు అనుమతి ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నాను” అన్నాడు. 40 అతను అనుమతి ఇచ్చినప్పుడు పౌలు మెట్ల మీద నిలబడి తన చేతులతో ప్రజలకు సైగ చేశాడు, అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ప్రజలతో హీబ్రూ భాషలో+ ఇలా అన్నాడు:

22 “సహోదరులారా, తండ్రులారా, ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి.”+ 2 పౌలు తమతో హీబ్రూ భాషలో మాట్లాడడం విన్నప్పుడు, వాళ్లు ఇంకా నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు పౌలు ఇలా అన్నాడు: 3 “నేనొక యూదుణ్ణి,+ కిలికియలోని తార్సులో+ పుట్టాను. కానీ ఈ నగరంలోనే గమలీయేలు+ పాదాల దగ్గర చదువు నేర్చుకున్నాను. మన పూర్వీకులు పాటించిన ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించాలని ఉపదేశం పొందాను.+ ఇప్పుడు మీరంతా చూపిస్తున్నట్టే దేవుని సేవ విషయంలో ఉత్సాహం చూపించాను.+ 4 ప్రభువు మార్గాన్ని అనుసరిస్తున్న పురుషుల్ని, స్త్రీలను బంధించి, చెరసాలల్లో వేయడానికి అప్పగించాను. వాళ్లను హింసించాను, చంపించాను.+ 5 దీని గురించి ప్రధానయాజకుడు, పెద్దల సభలోని వాళ్లంతా సాక్ష్యం చెప్పగలరు. అంతేకాదు, దమస్కులోని తోటి యూదులకు ఇవ్వడానికి వాళ్ల దగ్గర ఉత్తరాలు కూడా తీసుకుని, దమస్కులో ప్రభువు మార్గాన్ని అనుసరిస్తున్నవాళ్లను బంధించి, శిక్షించడానికి వాళ్లను యెరూషలేముకు తీసుకురావాలని అక్కడికి బయల్దేరాను.

6 “అయితే, నేను ప్రయాణిస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు మధ్యాహ్న సమయంలో, ఉన్నట్టుండి ఆకాశం నుండి గొప్ప వెలుగు నా చుట్టూ ప్రకాశించింది.+ 7 ఆ వెలుగు వల్ల నేను నేల మీద పడిపోయాను. అప్పుడు ఒక స్వరం, ‘సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు?’ అని నాతో అనడం విన్నాను. 8 అప్పుడు నేను, ‘ప్రభువా, నువ్వెవరు?’ అని అడిగాను. దానికి ఆయన నాతో, ‘నేను నువ్వు హింసిస్తున్న నజరేయుడైన యేసును’ అన్నాడు. 9 నాతోపాటు ఉన్నవాళ్లకు ఆ వెలుగు కనిపించింది, కానీ ఆ స్వరం నాతో ఏం చెప్పిందో వాళ్లకు అర్థం కాలేదు.* 10 అప్పుడు నేను, ‘ప్రభువా, నేను ఏమి చేయాలి?’ అని అడిగాను. ప్రభువు నాతో ఇలా అన్నాడు: ‘నువ్వు లేచి దమస్కుకు వెళ్లు. నువ్వు ఏమి చేయాలని నిర్ణయించబడిందో అక్కడ ఒక వ్యక్తి నీకు చెప్తాడు.’+ 11 ఆ వెలుగు చాలా ప్రకాశవంతంగా ఉండడం వల్ల నేను ఏమీ చూడలేకపోయాను. కాబట్టి నాతో ఉన్నవాళ్లు నన్ను చేతులు పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్లడంతో దమస్కుకు చేరుకున్నాను.

12 “ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటిస్తూ, అక్కడి యూదులందరి మధ్య మంచిపేరు ఉన్న అననీయ అనే వ్యక్తి 13 నా దగ్గరికి వచ్చాడు. అతను నా పక్కన నిలబడి నాతో, ‘సౌలా, సహోదరుడా, మళ్లీ చూపు పొందు!’ అన్నాడు. ఆ క్షణమే నాకు చూపొచ్చింది, దాంతో నేను అతన్ని చూశాను.+ 14 అప్పుడతను ఇలా అన్నాడు: ‘తన ఇష్టాన్ని తెలుసుకోవడానికి, ఆ నీతిమంతుణ్ణి చూడడానికి,+ ఆయన స్వరం వినడానికి మన పూర్వీకుల దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. 15 నువ్వు చూసిన వాటన్నిటి గురించి, విన్న వాటన్నిటి గురించి మనుషులందరి ముందు ప్రకటిస్తూ ఆయనకు సాక్షిగా ఉండాలని అలా ఎంచుకున్నాడు.+ 16 ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? లేచి బాప్తిస్మం తీసుకో. ఆయన పేరున ప్రార్థించి+ నీ పాపాలు కడిగేసుకో.’+

17 “తర్వాత నేను యెరూషలేముకు తిరిగెళ్లి+ ఆలయంలో ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఒక దర్శనం వచ్చింది.* 18 దానిలో నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఇలా అన్నాడు: ‘నువ్వు వెంటనే లేచి, యెరూషలేము నుండి త్వరగా వెళ్లిపో. ఎందుకంటే నా గురించి నువ్వు ఇచ్చే సాక్ష్యాన్ని వాళ్లు ఒప్పుకోరు.’+ 19 అప్పుడు నేను ఇలా అన్నాను: ‘ప్రభువా, నేను ఒక సమాజమందిరంలో నుండి ఇంకో సమాజమందిరంలోకి వెళ్తూ, నిన్ను విశ్వసిస్తున్నవాళ్లను చెరసాలలో వేయించేవాణ్ణని, కొట్టేవాణ్ణని+ వాళ్లకు బాగా తెలుసు. 20 అంతేకాదు, స్తెఫను అనే నీ సాక్షి చంపబడుతున్నప్పుడు* నేను అక్కడే నిలబడి ఉన్నాను. వాళ్లు చేస్తున్నదాన్ని అంగీకరిస్తూ, అతన్ని చంపుతున్నవాళ్ల పైవస్త్రాలకు కాపలా ఉన్నాను.’+ 21 కానీ ఆయన నాతో, ‘వెళ్లు, నేను నిన్ను దూరంగా ఉన్న అన్యజనుల దగ్గరికి పంపిస్తాను’ అన్నాడు.”+

22 ఈ మాట వరకు వాళ్లు అతను చెప్పింది వింటూ ఉన్నారు. తర్వాత వాళ్లు బిగ్గరగా ఇలా అరిచారు: “ఇతన్ని భూమ్మీద ఉండకుండా చంపేయండి. ఇతను బ్రతకడానికి అర్హుడు కాడు!” 23 వాళ్లు అరుస్తూ, తమ పైవస్త్రాలు విసిరేస్తూ, గాల్లోకి దుమ్ము ఎత్తి పోస్తూ ఉండడంతో+ 24 పౌలును సైనికుల కోటలోకి తీసుకెళ్లమని సహస్రాధిపతి* ఆజ్ఞాపించాడు. వాళ్లు పౌలుకు వ్యతిరేకంగా ఎందుకలా అరుస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవడం కోసం అతన్ని కొరడాలతో కొట్టి విచారణ చేయాలని చెప్పాడు. 25 అయితే, పౌలును కొరడాలతో కొట్టడానికి వాళ్లు అతన్ని కట్టేసినప్పుడు, పౌలు అక్కడ నిలబడిన సైనికాధికారిని, “విచారణ చేయకుండానే ఒక రోమీయుణ్ణి* కొరడాలతో కొట్టే హక్కు మీకుందా?”+ అని అడిగాడు. 26 సైనికాధికారి ఆ మాట విన్నప్పుడు సహస్రాధిపతి దగ్గరికి వెళ్లి, “నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు? ఇతను ఒక రోమీయుడు” అని చెప్పాడు. 27 దాంతో ఆ సహస్రాధిపతి పౌలు దగ్గరికి వచ్చి, “చెప్పు, నువ్వు రోమీయుడివా?” అని అడిగాడు. పౌలు, “అవును” అన్నాడు. 28 అప్పుడు సహస్రాధిపతి, “నేను చాలా డబ్బులు ఇచ్చి రోమా పౌరసత్వ హక్కుల్ని కొనుక్కున్నాను” అన్నాడు. అయితే పౌలు, “నాకు మాత్రం అవి పుట్టుకతోనే వచ్చాయి”+ అని చెప్పాడు.

29 దాంతో, అతన్ని హింసించి విచారణ చేయాలనుకున్న వాళ్లు వెంటనే వెనక్కి తగ్గారు. పౌలు రోమీయుడని, తాను అతన్ని సంకెళ్లతో బంధించానని గ్రహించినప్పుడు ఆ సహస్రాధిపతి భయపడిపోయాడు.+

30 యూదులు అతన్ని ఎందుకు నిందిస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆ సహస్రాధిపతి అనుకున్నాడు. కాబట్టి ఆ తర్వాతి రోజు అతను పౌలును విడుదల చేసి, ముఖ్య యాజకుల్ని, మహాసభ వాళ్లందర్నీ సమావేశమవ్వమని ఆజ్ఞాపించాడు. తర్వాత పౌలును అక్కడికి రప్పించి అతన్ని వాళ్ల మధ్య నిలబెట్టించాడు.+

23 పౌలు మహాసభలోని వాళ్లవైపు సూటిగా చూస్తూ, “సహోదరులారా, ఈ రోజు వరకు నేను దేవుని ముందు ఏ తప్పూ చేయకుండా నడుచుకున్నానని నా మనస్సాక్షి+ నాకు చెప్తుంది” అని అన్నాడు. 2 అప్పుడు ప్రధానయాజకుడు అననీయ, పౌలును నోటి మీద కొట్టమని పౌలు పక్కన నిలబడివున్న వాళ్లకు ఆజ్ఞాపించాడు. 3 దానికి పౌలు అతనితో, “సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు. ధర్మశాస్త్రం ప్రకారం నాకు తీర్పు తీర్చడానికి కూర్చున్న నువ్వు, నన్ను కొట్టమని ఆజ్ఞాపించి ధర్మశాస్త్రాన్ని మీరతావా?” అన్నాడు. 4 అప్పుడు అతని పక్కన నిలబడి ఉన్నవాళ్లు, “నువ్వు దేవుని ప్రధానయాజకుణ్ణి అవమానిస్తున్నావా?” అన్నారు. 5 అందుకు పౌలు, “సహోదరులారా, అతను ప్రధానయాజకుడని నాకు తెలీదు. ఎందుకంటే, ‘నీ ప్రజల అధికారి గురించి అవమానకరంగా మాట్లాడకూడదు’ అని రాయబడి ఉంది”+ అన్నాడు.

6 అక్కడున్నవాళ్లలో సగం మంది సద్దూకయ్యులు, సగం మంది పరిసయ్యులు అని తెలిసి పౌలు మహాసభలో బిగ్గరగా ఇలా అన్నాడు: “సహోదరులారా, నేనొక పరిసయ్యుణ్ణి.+ పరిసయ్యుల కుటుంబంలో పుట్టాను. నేను చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారనే బోధను* నమ్ముతాను, అందుకే ఇప్పుడు నాకు తీర్పు జరుగుతోంది.” 7 అతను అలా అనేసరికి పరిసయ్యులకు, సద్దూకయ్యులకు మధ్య గొడవ మొదలైంది. దాంతో వాళ్లు రెండుగా విడిపోయారు. 8 ఎందుకంటే, సద్దూకయ్యులు పునరుత్థానం గానీ, దేవదూతలు గానీ, అదృశ్యప్రాణులు* గానీ లేవని నమ్ముతారు. పరిసయ్యులు మాత్రం అవన్నీ ఉన్నాయని నమ్ముతారు.*+ 9 కాబట్టి అక్కడ పెద్ద అలజడి రేగింది. పరిసయ్యుల తెగకు చెందిన కొంతమంది శాస్త్రులు లేచి చాలా కోపంగా ఇలా వాదించడం మొదలుపెట్టారు: “ఇతనిలో మాకు ఏ తప్పూ కనిపించలేదు. ఒకవేళ అతనితో ఒక అదృశ్యప్రాణి గానీ, దేవదూత గానీ మాట్లాడివుంటే+—.” 10 గొడవ ఇంకా పెద్దదయ్యేసరికి, వాళ్లు పౌలును చంపేస్తారేమోనని సహస్రాధిపతి* భయపడ్డాడు. కాబట్టి వాళ్ల దగ్గరికి వెళ్లి, వాళ్ల మధ్య నుండి పౌలును లాక్కొచ్చి సైనికుల కోటలోకి తీసుకెళ్లమని సహస్రాధిపతి సైనికులకు ఆజ్ఞాపించాడు.

11 అయితే ఆ రాత్రి, ప్రభువు పౌలు పక్కన నిలబడి, “ధైర్యంగా ఉండు!+ నువ్వు నా గురించి యెరూషలేములో పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చినట్టే రోములో కూడా సాక్ష్యమివ్వాలి”+ అని చెప్పాడు.

12 తెల్లవారినప్పుడు యూదులు పౌలు మీద కుట్రపన్నారు. అతన్ని చంపేంతవరకు తాము ఏమైనా తిన్నా, తాగినా తమ మీదికి శాపం రావాలని ఒట్టు పెట్టుకున్నారు. 13 అలా ఒట్టు పెట్టుకున్నవాళ్లు 40 కన్నా ఎక్కువమంది. 14 వాళ్లు ముఖ్య యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్లి ఇలా అన్నారు: “పౌలును చంపేంతవరకు మేము ఏమైనా తింటే మా మీదికి శాపం రావాలని ఒట్టు పెట్టుకున్నాం. 15 కాబట్టి ఇప్పుడు మీరూ, మహాసభ వాళ్లూ కలిసి సహస్రాధిపతి దగ్గరికి వెళ్లి పౌలును మీ దగ్గరికి తీసుకురమ్మని అడగండి. మీరు పౌలును ఇంకా పూర్తిస్థాయిలో విచారణ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పండి. అయితే అతను మీ దగ్గరికి రాకముందే అతన్ని చంపేయడానికి మేము సిద్ధంగా ఉంటాం.”

16 అయితే వాళ్లు పౌలు కోసం మాటు వేయడానికి పథకం వేస్తున్నారని పౌలు మేనల్లుడు విని, సైనికుల కోటలోకి వెళ్లి దాని గురించి పౌలుకు చెప్పాడు. 17 అప్పుడు పౌలు ఒక సైనికాధికారిని పిలిచి, “ఈ యువకుడు సహస్రాధిపతికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాడు, ఇతన్ని సహస్రాధిపతి దగ్గరికి తీసుకెళ్లు” అని చెప్పాడు. 18 దాంతో సైనికాధికారి ఆ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరికి తీసుకెళ్లి ఇలా అన్నాడు: “చెరసాలలో ఉన్న పౌలు నన్ను పిలిచి, ఈ యువకుణ్ణి నీ దగ్గరికి తీసుకెళ్లమన్నాడు. ఇతను నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు.” 19 సహస్రాధిపతి ఆ యువకుడి చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్లి, “నువ్వు నాతో ఏమి చెప్పాలనుకుంటున్నావు?” అని అడిగాడు. 20 అప్పుడు ఆ యువకుడు ఇలా చెప్పాడు: “పౌలును ఇంకొన్ని ప్రశ్నలు అడగడం కోసం అన్నట్టు, అతన్ని రేపు మహాసభ దగ్గరికి తీసుకురమ్మని నిన్ను వేడుకోవాలని యూదులు ఒక నిర్ణయానికి వచ్చారు.+ 21 వాళ్లు అడిగే దానికి నువ్వు ఒప్పుకోవద్దు. 40 కన్నా ఎక్కువమంది పౌలు కోసం మాటువేసి ఉన్నారు. పౌలును చంపేంతవరకు తాము ఏమైనా తిన్నా, తాగినా తమ మీదికి శాపం రావాలని వాళ్లు ఒట్టు పెట్టుకున్నారు.+ ఇప్పుడు వాళ్లు సిద్ధంగా ఉన్నారు, నీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.” 22 దాంతో సహస్రాధిపతి, “దీని గురించి నువ్వు నాతో చెప్పినట్టు ఎవరితో అనకు” అని ఆజ్ఞాపించి ఆ యువకుణ్ణి పంపించేశాడు.

23 తర్వాత, సహస్రాధిపతి ఇద్దరు సైనికాధికారుల్ని పిలిపించి ఇలా చెప్పాడు: “రాత్రి దాదాపు తొమ్మిదింటికి* కైసరయ వరకు వెళ్లడానికి 200 మంది సైనికుల్ని, 70 మంది గుర్రపురౌతుల్ని, 200 మంది ఈటెలు పట్టుకున్న సైనికుల్ని సిద్ధం చేయండి. 24 అలాగే అధిపతైన ఫేలిక్సు దగ్గరికి పౌలు క్షేమంగా చేరుకునేలా, అతన్ని తీసుకెళ్లడానికి గుర్రాల్ని కూడా సిద్ధం చేయండి.” 25 తర్వాత సహస్రాధిపతి ఇలా ఉత్తరం రాశాడు:

26 “గౌరవనీయుడైన అధిపతి ఫేలిక్సుకు క్లౌదియ లూసియ రాస్తున్న ఉత్తరం: నీకు శుభాకాంక్షలు! 27 యూదులు ఈ వ్యక్తిని పట్టుకొని, చంపబోయారు. అయితే ఇతను ఒక రోమా పౌరుడని నాకు తెలిసింది.+ కాబట్టి నేను నా సైనికులతో త్వరగా వెళ్లి ఇతన్ని కాపాడాను.+ 28 వాళ్లు ఇతన్ని నిందించడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని, నేను ఇతన్ని వాళ్ల మహాసభకు+ తీసుకెళ్లాను. 29 వాళ్లు తమ ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాల గురించి+ ఇతన్ని నిందిస్తున్నారని నేను తెలుసుకున్నాను. అయితే మరణశిక్ష విధించడానికి గానీ, చెరసాలలో వేయడానికి గానీ సరిపోయే ఏ ఒక్క నేరం ఇతని మీద మోపబడలేదు. 30 కానీ వాళ్లు ఇతన్ని చంపడానికి కుట్ర చేస్తున్నారని నాకు తెలిసింది+ కాబట్టి ఉన్నపళంగా ఇతన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను. ఇతని మీద ఏమైనా చెప్పాలంటే నీ ముందు చెప్పమని ఇతన్ని నిందిస్తున్నవాళ్లను ఆదేశించాను.”

31 కాబట్టి సైనికులు తమకు ఇవ్వబడిన ఆదేశాల ప్రకారం రాత్రిపూట పౌలును తీసుకొని+ అంతిపత్రికి చేరుకున్నారు. 32 తర్వాతి రోజు గుర్రపురౌతులు పౌలుతోపాటు వెళ్లారు. మిగతా సైనికులు, సైనికుల కోటకు తిరిగెళ్లారు. 33 రౌతులు కైసరయలోకి ప్రవేశించి, అధిపతికి ఆ ఉత్తరాన్ని అందజేశారు. వాళ్లు పౌలును కూడా అతనికి అప్పగించారు. 34 అధిపతి ఆ ఉత్తరం చదివి, పౌలు ఏ ప్రాంతానికి చెందినవాడో అడిగి, అతను కిలికియకు+ చెందినవాడని తెలుసుకున్నాడు. 35 తర్వాత అతను ఇలా అన్నాడు: “నిన్ను నిందిస్తున్నవాళ్లు వచ్చినప్పుడు+ నీ విషయం గురించి పూర్తిగా వింటాను.” పౌలును హేరోదు రాజభవనంలో* కాపలావాళ్ల సంరక్షణలో ఉంచమని అతను ఆజ్ఞాపించాడు.

24 ఐదు రోజుల తర్వాత, ప్రధానయాజకుడు అననీయ+ కొంతమంది పెద్దలతో, తెర్తుల్లు అనే న్యాయవాదితో కలిసి అధిపతి+ దగ్గరికి వచ్చాడు. పౌలు మీద ఆరోపణలు చేయడానికి వాళ్లు అక్కడికి వచ్చారు. 2 తెర్తుల్లును మాట్లాడమని అన్నప్పుడు అతను పౌలును నిందించడం మొదలుపెట్టి అధిపతి ముందు ఇలా అన్నాడు:

“నీ వల్ల మేము ఎంతో శాంతిని అనుభవిస్తున్నామని, నీ ముందుచూపు వల్ల ఈ ప్రజల్లో ఎన్నో సంస్కరణలు జరుగుతున్నాయని మాకు తెలుసు. 3 గౌరవనీయుడివైన ఫేలిక్సూ, ఈ విషయాల్ని మేము అన్ని సమయాల్లో ప్రతీ చోట ఎంతో కృతజ్ఞతా భావంతో ఒప్పుకుంటున్నాం. 4 అయితే నీ సమయాన్ని ఇంక వృథా చేయకుండా మా సంగతి గురించి క్లుప్తంగా చెప్తాను, దయతో వినమని వేడుకుంటున్నాను. 5 ఈ మనిషి ఒక చీడపురుగని,*+ భూమ్మీదున్న యూదులందరి మధ్య తిరుగుబాట్లు లేవదీస్తున్నాడని+ మేము గమనించాం. ఇతను నజరేయులు అనే తెగకు+ నాయకుడు. 6 అంతేకాదు ఇతను ఆలయాన్ని అపవిత్రం చేయడానికి కూడా ప్రయత్నించాడు, కాబట్టి మేము ఇతన్ని పట్టుకున్నాం.+ 7 *—— 8 నువ్వే స్వయంగా ఇతన్ని విచారిస్తే, మేము ఇతని మీద చేసిన ఆరోపణలన్నీ నిజమని నీకు తెలుస్తుంది.”

9 అప్పుడు, యూదులు కూడా ఆ మాటలు నిజమని పదేపదే చెప్తూ పౌలును నిందించడం మొదలుపెట్టారు. 10 అధిపతి పౌలును మాట్లాడమన్నట్టు సైగ చేయడంతో పౌలు ఇలా అన్నాడు:

“నువ్వు ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రజలకు న్యాయమూర్తిగా ఉన్నావని నాకు తెలుసు. కాబట్టి నేను సంతోషంగా నా వాదన నీకు వినిపిస్తాను.+ 11 ఆరాధించడానికి నేను యెరూషలేముకు వెళ్లి 12 రోజులు కూడా దాటలేదు.+ కావాలంటే ఈ విషయం గురించి నువ్వు అడిగి తెలుసుకోవచ్చు. 12 నేను ఆలయంలో ఎవరితోనైనా వాదిస్తున్నట్టు లేదా సమాజమందిరాల్లో గానీ, ఆ నగరంలో గానీ అల్లరిమూకను రేపుతున్నట్టు వాళ్లు చూడలేదు. 13 అంతేకాదు, ఇప్పుడు వాళ్లు నా మీద చేస్తున్న ఆరోపణల్ని నీ ముందు రుజువు చేయలేరు. 14 అయితే ఒక విషయాన్ని నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. వీళ్లు తెగ అని దేన్నైతే పిలుస్తున్నారో ఆ మార్గంలో నడుస్తూ నేను నా పూర్వీకుల దేవునికి పవిత్రసేవ చేస్తున్నాను.+ ధర్మశాస్త్రంలో, ప్రవక్తల పుస్తకాల్లో రాసివున్న వాటన్నిటినీ+ నేను నమ్ముతాను. 15 అంతేకాదు నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు తిరిగి బ్రతికిస్తాడని*+ వాళ్లలాగే నేనూ నమ్మకంతో ఎదురుచూస్తున్నాను. 16 దానివల్లే నేను దేవుని ముందు, మనుషుల ముందు మంచి* మనస్సాక్షిని కాపాడుకోవడానికి+ ఎప్పుడూ కృషి చేస్తున్నాను. 17 చాలా సంవత్సరాల తర్వాత నేను నా ప్రజల్లో కొంతమందికి దానధర్మాలు+ అందజేయడానికి, దేవునికి అర్పణలు అర్పించడానికి యెరూషలేముకు వెళ్లాను. 18 అలా చేస్తున్నప్పుడు, నేను ఆచారబద్ధంగా శుద్ధి చేసుకొని ఆలయంలో ఉండగా వాళ్లు నన్ను చూశారు.+ అంతేగానీ, నా దగ్గర గుంపులుగుంపులుగా ప్రజలు ఉండడం గానీ, నేను అలజడి సృష్టించడం గానీ వాళ్లు చూడలేదు. అయితే ఆసియా ప్రాంతం నుండి వచ్చిన కొంతమంది యూదులు అక్కడ ఉన్నారు. 19 వాళ్లు నిజంగా నా మీద ఏవైనా ఆరోపణలు చేయాలనుకుంటే, నీ ముందుకు వచ్చి చేయాలి.+ 20 లేదా ఇక్కడున్న వాళ్లయినా సరే, నేను మహాసభ ముందు నిలబడి ఉన్నప్పుడు నాలో ఏ తప్పు కనిపించిందో చెప్పొచ్చు. 21 నేను వాళ్ల మధ్య నిలబడి ఉన్నప్పుడు, ‘నేను చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారనే బోధను నమ్ముతాను, అందుకే ఇప్పుడు నాకు తీర్పు జరుగుతోంది’ అని బిగ్గరగా అన్నాను. అది కాకుండా నేను ఏ తప్పయినా చేసుంటే వాళ్లు చెప్పొచ్చు.”+

22 అయితే, ప్రభువు మార్గం+ గురించిన వాస్తవాలు బాగా తెలిసిన ఫేలిక్సు తీర్పు వాయిదా వేస్తూ, “సహస్రాధిపతి* లూసియ రాగానే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాను” అన్నాడు. 23 తర్వాత, పౌలును కాపలాలో ఉంచమని, అయితే అతనికి కొంత స్వేచ్ఛ ఇవ్వమని, అతనివాళ్లు ఎవరైనా అతని అవసరాలు చూసుకోవాలనుకుంటే అనుమతించమని సైనికాధికారికి ఆదేశాలు ఇచ్చాడు.

24 కొన్ని రోజుల తర్వాత ఫేలిక్సు తన భార్య ద్రుసిల్లతో కలిసి వచ్చాడు, ఆమె యూదురాలు. అప్పుడు ఫేలిక్సు పౌలును పిలిపించుకొని, క్రీస్తుయేసు మీద విశ్వాసం గురించి పౌలు మాట్లాడుతుంటే విన్నాడు.+ 25 అయితే పౌలు నీతి గురించి, ఆత్మనిగ్రహం గురించి, రాబోయే తీర్పు గురించి+ మాట్లాడినప్పుడు ఫేలిక్సు భయపడిపోయి, “ఇప్పటికైతే వెళ్లు, నాకు అవకాశం దొరికినప్పుడు నిన్ను మళ్లీ పిలిపిస్తాను” అన్నాడు. 26 అదే సమయంలో, పౌలు తనకు డబ్బు ఇస్తాడని ఫేలిక్సు ఆశించాడు. అందుకే అతన్ని పదేపదే పిలిపించుకొని మాట్లాడేవాడు. 27 రెండు సంవత్సరాలు గడిచాక ఫేలిక్సు స్థానంలోకి పోర్కియు ఫేస్తు వచ్చాడు. అయితే ఫేలిక్సు యూదుల దగ్గర మంచిపేరు సంపాదించుకోవాలనే కోరికతో+ పౌలును చెరసాలలోనే ఉంచి వెళ్లిపోయాడు.

25 కాబట్టి ఫేస్తు+ ఆ ప్రాంతానికి వచ్చి అధికారం చేపట్టిన మూడు రోజుల తర్వాత కైసరయ నుండి యెరూషలేముకు వెళ్లాడు. 2 అక్కడ ముఖ్య యాజకులు, యూదుల్లో ప్రముఖులు పౌలు మీద తమ ఆరోపణల గురించి ఫేస్తుకు చెప్పి+ అతన్ని వేడుకోవడం మొదలుపెట్టారు. 3 తమ మనవి అంగీకరించి పౌలును యెరూషలేముకు పంపించమని అడిగారు. నిజానికి వాళ్లు పౌలు కోసం మాటువేసి అతన్ని దారిలోనే చంపేయాలని పథకం వేస్తున్నారు.+ 4 అయితే పౌలు కైసరయలోనే ఉండాలని, త్వరలో తానే స్వయంగా అక్కడికి వెళ్తున్నానని ఫేస్తు వాళ్లకు చెప్పాడు. 5 తర్వాత అతను ఇలా అన్నాడు: “అతను నిజంగా ఏదైనా తప్పు చేసివుంటే, మీలో పలుకుబడి ఉన్నవాళ్లు నాతో పాటు వచ్చి అతని మీద ఆరోపణలు చేయవచ్చు.”+

6 ఫేస్తు వాళ్ల మధ్య ఎనిమిది, పది రోజుల కన్నా ఎక్కువ రోజులు గడపకుండానే కైసరయకు వెళ్లాడు. తర్వాతి రోజు అతను న్యాయపీఠం మీద కూర్చొని, పౌలును తన ముందుకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. 7 పౌలు లోపలికి రాగానే, యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలబడి అతని మీద ఎన్నో తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ వాటిని రుజువు చేయలేకపోయారు.+

8 అయితే పౌలు తనను తాను సమర్థించుకుంటూ, “యూదుల ధర్మశాస్త్రం విషయంలో గానీ, ఆలయం విషయంలో గానీ, కైసరు విషయంలో గానీ నేను ఏ పాపం చేయలేదు”+ అన్నాడు. 9 అయితే ఫేస్తు యూదుల దగ్గర మంచిపేరు సంపాదించుకోవాలనే కోరికతో,+ “మనం యెరూషలేముకు వెళ్లడం, ఈ విషయాల గురించి అక్కడ నా సమక్షంలో నీకు తీర్పు జరగడం నీకు ఇష్టమేనా?” అని పౌలును అడిగాడు. 10 కానీ పౌలు ఇలా అన్నాడు: “నేను కైసరు న్యాయపీఠం ముందు నిలబడి ఉన్నాను, నాకు తీర్పు జరగాల్సింది ఇక్కడే. నేను యూదుల విషయంలో ఏ తప్పూ చేయలేదు. దీని గురించి నీకు కూడా బాగా తెలుసు. 11 నేను నిజంగా దోషినైతే, మరణశిక్ష వేసేంత తప్పు ఏదైనా చేసివుంటే+ చనిపోవడానికి వెనుకాడను. కానీ వాళ్లు నా మీద చేస్తున్న ఆరోపణలు నిజం కాకపోతే, వాళ్ల దగ్గర మంచిపేరు సంపాదించుకోవడం కోసం నన్ను వాళ్ల చేతికి అప్పగించే హక్కు ఎవరికీ లేదు. నేను కైసరుకే విన్నవించుకుంటాను!”+ 12 ఫేస్తు తన సలహాదారులతో* మాట్లాడిన తర్వాత, “కైసరుకు విన్నవించుకుంటానని అన్నావు కదా, కైసరు దగ్గరికే వెళ్తావు” అని చెప్పాడు.

13 కొన్ని రోజుల తర్వాత అగ్రిప్ప రాజు, బెర్నీకే కలిసి ఫేస్తును పలకరించడానికి అధికారిక సందర్శనం మీద కైసరయకు వచ్చారు. 14 వాళ్లు అక్కడ చాలా రోజులు ఉండడంతో ఫేస్తు పౌలు విషయాన్ని రాజు ముందు పెట్టి ఇలా అన్నాడు:

“ఫేలిక్సు ఒక వ్యక్తిని చెరసాలలోనే వదిలి వెళ్లిపోయాడు. 15 నేను యెరూషలేములో ఉన్నప్పుడు ముఖ్య యాజకులు, యూదుల పెద్దలు అతని గురించి నాకు చెప్పారు.+ అతనికి శిక్షపడేలా తీర్పు ఇవ్వమని వాళ్లు నన్ను అడిగారు. 16 అయితే, తనను నిందించేవాళ్లతో ముఖాముఖిగా మాట్లాడి, తన మీద చేసిన ఫిర్యాదు విషయంలో తనను తాను సమర్థించుకునే అవకాశం నిందితుడికి ఇవ్వకుండానే ఇతరుల కోరిక ప్రకారం అతన్ని వాళ్లకు అప్పగించడం రోమీయుల పద్ధతి కాదని చెప్పాను.+ 17 కాబట్టి వాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఆలస్యం చేయకుండా, ఆ తర్వాతి రోజే న్యాయపీఠం మీద కూర్చొని అతన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాను. 18 వాళ్లు లేచి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు, వాళ్లు అతని మీద ఎలాంటి చెడ్డ విషయాలు ఆరోపిస్తారని నేను అనుకున్నానో వాటిలో ఒక్కటి కూడా అతని మీద ఆరోపించలేదు.+ 19 వాళ్లకు తమ మతం గురించి,+ యేసు అనే వ్యక్తి గురించి కొన్ని గొడవలు ఉన్నాయంతే. ఈ యేసు చనిపోయాడు, కానీ అతను బ్రతికే ఉన్నాడని పౌలు గట్టిగా చెప్తూ ఉన్నాడు.+ 20 ఈ గొడవ ఎలా పరిష్కరించాలో నాకు అర్థంకాలేదు. దాంతో యెరూషలేముకు వెళ్లడం, ఈ విషయాల గురించి అక్కడ తీర్పు జరగడం అతనికి ఇష్టమో కాదో అడిగాను.+ 21 కానీ చక్రవర్తి* నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తనను కాపలాలో ఉంచమని పౌలు విన్నవించుకున్నాడు.+ కాబట్టి అతన్ని కైసరు దగ్గరికి పంపించేంత వరకు కాపలాలోనే ఉంచమని నేను ఆజ్ఞాపించాను.”

22 అప్పుడు అగ్రిప్ప, “అతను ఏం చెప్తాడో నాకూ వినాలని ఉంది”+ అని ఫేస్తుతో అన్నాడు. దానికి ఫేస్తు, “రేపు వినవచ్చు” అన్నాడు. 23 తర్వాతి రోజు అగ్రిప్ప, బెర్నీకే సహస్రాధిపతులతో,* నగర ప్రముఖులతో కలిసి ఎంతో ఆడంబరంగా సభా భవనంలోకి ప్రవేశించారు. ఫేస్తు ఆజ్ఞాపించినప్పుడు, పౌలును అక్కడికి తీసుకొచ్చారు. 24 అప్పుడు ఫేస్తు ఇలా అన్నాడు: “అగ్రిప్ప రాజా, నువ్వూ ఇక్కడున్న మీరంతా ఈ మనిషిని చూస్తున్నారు కదా. యెరూషలేములో, అలాగే ఇక్కడా యూదులందరూ ఇతను ఇక ఏమాత్రం బ్రతకకూడదని కేకలు వేస్తూ+ ఇతని గురించి నాకు మనవి చేశారు. 25 అయితే మరణశిక్ష వేసేంత తప్పు ఏదీ ఇతను చేయలేదని నేను గ్రహించాను.+ కాబట్టి ఇతను చక్రవర్తికి* విన్నవించుకుంటానని అన్నప్పుడు, ఇతన్ని చక్రవర్తి దగ్గరికి పంపించాలని నిర్ణయించుకున్నాను. 26 అయితే ఇతని గురించి చక్రవర్తికి* ఖచ్చితంగా రాయడానికి నా దగ్గర ఏమీ లేదు. అందుకే, న్యాయ విచారణ జరిగితే ఉత్తరంలో రాయడానికి నాకు ఏదోకటి దొరుకుతుందనే ఉద్దేశంతో ఇతన్ని మీ అందరి ముందుకు, ముఖ్యంగా అగ్రిప్ప రాజా, నీ ముందుకు తీసుకొచ్చాను. 27 ఖైదీ మీదున్న ఆరోపణలు ఏమిటో తెలపకుండానే అతన్ని పంపించడం సమంజసం కాదని నాకు అనిపిస్తుంది.”

26 అగ్రిప్ప+ పౌలుతో, “నువ్వు నీ వాదన వినిపించవచ్చు” అన్నాడు. అప్పుడు పౌలు తన చెయ్యి చాపి, తన వాదన వినిపించడం మొదలుపెట్టాడు:

2 “అగ్రిప్ప రాజా, యూదులు ఏ విషయాల గురించి నా మీద ఆరోపణలు చేస్తున్నారో+ వాటి గురించి ఈ రోజు నీ ముందు నా వాదన వినిపించడం నాకు సంతోషంగా ఉంది. 3 ముఖ్యంగా, యూదుల ఆచారాల గురించి, వాళ్ల మధ్య ఉన్న వివాదాల గురించి నీకు బాగా తెలుసు కాబట్టి నీ ముందు మాట్లాడడం నాకు సంతోషంగా ఉంది. నా వాదనను ఓపిగ్గా వినమని నిన్ను వేడుకుంటున్నాను.

4 “నిజానికి చిన్నప్పటి నుండి నా ప్రజల మధ్య ఉన్నప్పుడు, అలాగే యెరూషలేములో ఉన్నప్పుడు నా జీవితం ఎలా ఉండేదో యూదులందరికీ బాగా తెలుసు.+ 5 కాబట్టి నేను చాలాకాలం నుండి వాళ్లకు తెలుసు. వాళ్లు కావాలనుకుంటే, నేను పరిసయ్యుల తెగకు చెందినవాణ్ణని+ నీ ముందు సాక్ష్యం చెప్పగలరు. మిగతా యూదుల కన్నా ఈ తెగవాళ్లు చాలా నిష్ఠగా ఉంటారని+ నీకు తెలుసు. 6 అయితే, దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దానం నెరవేరడం కోసం నేను ఎదురుచూస్తున్నాను,+ అందుకే ఇప్పుడు నాకు విచారణ జరుగుతోంది. 7 మన 12 గోత్రాలవాళ్లు ఎంతో ఉత్సాహంగా రాత్రింబగళ్లు పవిత్రసేవ చేస్తూ ఆ వాగ్దానం నెరవేరడం కోసమే ఎదురుచూస్తున్నారు. రాజా, నేను దానికోసం ఎదురుచూస్తున్నాను కాబట్టే యూదులు నా మీద ఆరోపణలు చేస్తున్నారు.+

8 “దేవుడు చనిపోయినవాళ్లను బ్రతికిస్తాడనే విషయం నమ్మశక్యం కాదని మీలో కొంతమందికి ఎందుకు అనిపిస్తోంది? 9 ఒకప్పుడు నేను కూడా నజరేయుడైన యేసు పేరుకు వ్యతిరేకంగా చాలా పనులు చేయాలని గట్టిగా నమ్మాను. 10 యెరూషలేములో నేను సరిగ్గా అదే చేశాను. ముఖ్య యాజకుల దగ్గర పొందిన అధికారంతో+ పవిత్రుల్లో చాలామందిని చెరసాలల్లో వేశాను.+ వాళ్లను చంపడానికి మద్దతు తెలిపాను. 11 అన్ని సమాజమందిరాల్లో, వాళ్లను అదేపనిగా శిక్షిస్తూ తమ విశ్వాసం విడిచిపెట్టేలా వాళ్లను బలవంతం చేయడానికి ప్రయత్నించాను. వాళ్ల మీద నాకు చాలా కోపం ఉండేది కాబట్టి వాళ్లను హింసించడానికి వేరే నగరాలకు కూడా వెళ్లాను.

12 “అలా ఒక సందర్భంలో, ముఖ్య యాజకులు ఇచ్చిన అధికారంతో, వాళ్ల ఆజ్ఞమేరకు నేను దమస్కుకు ప్రయాణిస్తున్నాను. 13 రాజా, మధ్యాహ్నం అప్పుడు దారిలో సూర్యకాంతి కన్నా గొప్ప వెలుగు ఆకాశం నుండి నా చుట్టూ, నాతో ప్రయాణిస్తున్న వాళ్ల చుట్టూ ప్రకాశించడం చూశాను.+ 14 దాంతో మేమంతా నేల మీద పడిపోయాం. అప్పుడు ఒక స్వరం హీబ్రూ భాషలో, ‘సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు? ముల్లుకర్రకు* ఎదురుతన్నడం వల్ల నీకే హాని జరుగుతుంది’ అని నాతో చెప్పడం విన్నాను. 15 అప్పుడు నేను, ‘ప్రభువా, నువ్వెవరు?’ అని అడిగాను. దానికి ప్రభువు ఇలా అన్నాడు: ‘నేను నువ్వు హింసిస్తున్న యేసును. 16 ఇప్పుడు నువ్వు లేచి నిలబడు. నువ్వు చూసిన విషయాలకూ నేను నీకు చూపించబోయే విషయాలకూ నిన్ను సాక్షిగా, సేవకుడిగా ఎంచుకోవడానికే నేను నీకు కనిపించాను.+ 17 ఈ ప్రజల నుండి, అలాగే నేను నిన్ను ఎక్కడికైతే పంపించబోతున్నానో ఆ దేశాల ప్రజల+ నుండి నేను నిన్ను కాపాడతాను. 18 వాళ్ల కళ్లు తెరవడానికి,+ వాళ్లను చీకట్లో+ నుండి వెలుగు+ వైపుకు, సాతాను అధికారం+ నుండి దేవుని అధికారం వైపుకు తిప్పడానికి నిన్ను వాళ్ల దగ్గరికి పంపిస్తున్నాను. దానివల్ల వాళ్లు పాపక్షమాపణను,+ అలాగే నా మీదున్న విశ్వాసం వల్ల పవిత్రపర్చబడిన వాళ్లమధ్య స్వాస్థ్యాన్ని పొందగలుగుతారు.’

19 “కాబట్టి అగ్రిప్ప రాజా, పరలోకం నుండి వచ్చిన ఆ దర్శనానికి నేను అవిధేయత చూపించలేదు. 20 అయితే ముందుగా దమస్కులోని+ వాళ్లకు, తర్వాత యెరూషలేములో,+ అలాగే యూదయ దేశమంతటా ఉన్నవాళ్లకు, అన్యజనులకు, ‘పశ్చాత్తాపపడండి, పశ్చాత్తాపానికి తగిన పనులు చేస్తూ+ దేవుని వైపుకు తిరగండి’ అనే సందేశాన్ని ప్రకటిస్తూ వచ్చాను. 21 అందుకే యూదులు ఆలయంలో నన్ను పట్టుకొని చంపడానికి ప్రయత్నించారు.+ 22 అయితే దేవుడిచ్చిన సహాయంతో ఈ రోజు వరకు నేను సామాన్యులకు, గొప్పవాళ్లకు ప్రకటిస్తున్నాను. ప్రవక్తలు, మోషే ఏమేం జరగబోతున్నాయని రాశారో వాటిని మాత్రమే నేను ప్రకటిస్తున్నాను.+ 23 క్రీస్తు బాధలు పడతాడని,+ చనిపోయినవాళ్లలో నుండి మొదట బ్రతికించబడిన* వ్యక్తిగా+ ఈ ప్రజలకు, అలాగే అన్యజనులకు వెలుగును ప్రకటిస్తాడని+ వాళ్లు రాశారు.”

24 పౌలు ఇలా తన వాదన వినిపిస్తున్నప్పుడు ఫేస్తు బిగ్గరగా, “పౌలూ! నీకు మతిపోయింది. అతిగా చదువుకోవడం వల్ల నీకు పిచ్చి పట్టింది!” అన్నాడు. 25 కానీ పౌలు ఇలా అన్నాడు: “గౌరవనీయుడివైన ఫేస్తూ, నాకు పిచ్చి పట్టలేదు. నేను సత్యమే చెప్తున్నాను, మంచి వివేచనతో మాట్లాడుతున్నాను. 26 నిజానికి, నేను ఎవరితోనైతే ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నానో ఆ రాజుకు ఈ విషయాల గురించి బాగా తెలుసు. వీటిలో ఏ ఒక్కటీ అతనికి తెలియనిది కాదని నా నమ్మకం. ఎందుకంటే వీటిలో ఏదీ రహస్యంగా జరగలేదు.+ 27 అగ్రిప్ప రాజా, నువ్వు ప్రవక్తల్ని నమ్ముతావా? నమ్ముతావని నాకు తెలుసు.” 28 అయితే అగ్రిప్ప పౌలుతో, “త్వరలోనే నువ్వు నన్ను క్రైస్తవుడిగా మార్చేస్తావు” అన్నాడు. 29 దానికి పౌలు, “త్వరగానైనా ఆలస్యంగానైనా నువ్వే కాదు, ఈ రోజు నా మాటలు వింటున్న వాళ్లందరూ నాలాగే అవ్వాలని, కానీ ఈ సంకెళ్లు మాత్రం ఉండకూడదని దేవునికి ప్రార్థిస్తున్నాను” అన్నాడు.

30 అప్పుడు రాజు లేచి నిలబడ్డాడు. అలాగే అధిపతి, బెర్నీకే, వాళ్లతోపాటు కూర్చొని ఉన్నవాళ్లు కూడా లేచి నిలబడ్డారు. 31 అయితే, వాళ్లు వెళ్లిపోతూ ఒకరితో ఒకరు, “ఇతను మరణశిక్ష వేసేంత, చెరసాలలో వేసేంత తప్పేదీ చేయట్లేదు”+ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 32 తర్వాత అగ్రిప్ప ఫేస్తుతో ఇలా అన్నాడు: “ఇతను కైసరుకు విన్నవించుకుంటానని+ అనకపోయుంటే ఇతన్ని విడుదల చేయగలిగేవాళ్లం.”

27 మేము ఓడలో ఇటలీకి వెళ్లాలని నిర్ణయించారు+ కాబట్టి వాళ్లు పౌలును, ఇంకొంతమంది ఖైదీల్ని యూలికి అప్పగించారు. అతను ఔగుస్తు* దళంలో ఒక సైనికాధికారి. 2 మేము, అద్రముత్తియ నుండి ఆసియా ప్రాంత తీరం పొడవునా ఉన్న ఓడరేవులకు వెళ్లే ఓడ ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాం. మాతోపాటు అరిస్తార్కు+ ఉన్నాడు. అతను మాసిదోనియలోని థెస్సలొనీక నగరానికి చెందినవాడు. 3 తర్వాతి రోజు మేము సీదోనుకు చేరుకున్నాం. యూలి మానవత్వంతో పౌలు మీద దయ చూపించి అతన్ని తన స్నేహితుల దగ్గరికి వెళ్లనిచ్చాడు. దానివల్ల వాళ్లు పౌలుకు సహాయం చేయగలిగారు.

4 అక్కడి నుండి మేము ఓడ ఎక్కి బయల్దేరాం. ఎదురుగాలి వీస్తుండడంతో మేము కుప్ర అనే ద్వీపం చాటున ప్రయాణించాం. 5 తర్వాత సముద్రం గుండా కిలికియ, పంఫూలియ వెంబడి ప్రయాణిస్తూ లుకియలోని మూర దగ్గరున్న ఓడరేవులో దిగాం. 6 అక్కడ సైనికాధికారి, అలెక్సంద్రియ నుండి ఇటలీకి వెళ్తున్న ఒక ఓడను చూసి మమ్మల్ని అందులోకి ఎక్కించాడు. 7 తర్వాత మేము చాలా రోజులు ఓడలో నెమ్మదిగా ప్రయాణించి, కష్టం మీద క్నీదుకు వచ్చాం. గాలి మమ్మల్ని నేరుగా ముందుకు వెళ్లనివ్వలేదు కాబట్టి మేము క్రేతు చాటున సల్మోనేకు ఎదురుగా ప్రయాణించాం. 8 మేము కష్టం మీద తీరం వెంబడి ప్రయాణిస్తూ మంచిరేవులు అనే చోటికి వచ్చాం. అది లసైయ నగరానికి దగ్గర్లో ఉంది.

9 చాలా రోజులు గడిచాయి. ప్రాయశ్చిత్త రోజు+ ఉపవాసం కూడా అయిపోయింది. కాబట్టి అప్పటికల్లా ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది. దాంతో పౌలు వాళ్లకు ఇలా సలహా ఇచ్చాడు: 10 “స్నేహితులారా, ఈ ప్రయాణం వల్ల ఓడలో ఉన్న సరుకులకు, ఓడకు మాత్రమే కాదు మన ప్రాణాలకు కూడా హాని, గొప్ప నష్టం జరుగుతుందని నాకు అనిపిస్తుంది.” 11 కానీ సైనికాధికారి పౌలు చెప్పేది వినకుండా, ఓడ నడిపే వ్యక్తి మాటను, ఓడ యజమాని మాటను విన్నాడు. 12 అయితే చలికాలంలో ఉండడానికి ఆ రేవు అనుకూలంగా ఉండదు కాబట్టి అక్కడి నుండి బయల్దేరి ఎలాగోలా ఫీనిక్సుకి వెళ్లగలిగితే చలికాలం అక్కడ గడపవచ్చని చాలామంది సలహా ఇచ్చారు. ఫీనిక్సు క్రేతు ద్వీపంలో ఉన్న ఒక ఓడరేవు. ఈ రేవులోకి ప్రవేశించడానికి ఈశాన్యం నుండి, ఆగ్నేయం నుండి దారి ఉంది.

13 దక్షిణ దిక్కు నుండి గాలి మెల్లగా వీచే సరికి వాళ్లు తమ గమ్యం చేరుకోగలమని అనుకున్నారు. కాబట్టి వాళ్లు లంగరు పైకెత్తి క్రేతు వెంబడి, తీరానికి దగ్గర్లో ప్రయాణించడం మొదలుపెట్టారు. 14 అయితే ఎంతోసేపు కాకముందే, ఊరకులోను* అనే భయంకరమైన గాలి వీచింది. 15 బలమైన గాలి ఓడ మీదికి వీస్తుండడంతో గాలికి ఎదురుగా ఓడను నడపడం వీలుకాలేదు. దాంతో గాలి వీస్తున్న వైపు మా ఓడను కొట్టుకొనిపోనిచ్చాం. 16 తర్వాత మేము కౌద అనే చిన్న ద్వీపం చాటున వేగంగా ప్రయాణించాం. అయినాసరే, ఓడ వెనక భాగంలో ఉన్న పడవను* కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాం. 17 అయితే దాన్ని ఓడ పైకి ఎక్కించిన తర్వాత, ఓడ బద్దలు కాకుండా ఉండడం కోసం అడుగుభాగం నుండి పైవరకు తాళ్లతో బిగించి కట్టారు. ఓడ సూర్తిసు* అనే ఇసుక తిప్పల మీదికి దూసుకెళ్తుందేమో అని భయపడి తెరచాప తాళ్లను కొన్నిటిని లాగేసి ఓడను కొట్టుకొనిపోనిచ్చారు. 18 తుఫాను బలంగా కొడుతుండడంతో తర్వాతి రోజు వాళ్లు ఓడను తేలిక చేయడానికి సరుకుల్ని సముద్రంలో పడేయడం మొదలుపెట్టారు. 19 మూడో రోజు వాళ్లు ఓడ పరికరాల్ని తమ చేతులారా సముద్రంలో పడేశారు.

20 చాలారోజుల పాటు సూర్యుడు గానీ నక్షత్రాలు గానీ కనిపించలేదు. భయంకరమైన తుఫాను ఓడను కొడుతుండడంతో చివరికి మేము బ్రతికి బయటపడతామనే ఆశ సన్నగిల్లడం మొదలైంది. 21 చాలా రోజులుగా వాళ్లు ఆహారం ముట్టలేదు. అప్పుడు పౌలు వాళ్ల మధ్య నిలబడి ఇలా అన్నాడు: “స్నేహితులారా, మీరు నా సలహా విని క్రేతు నుండి బయల్దేరకుండా ఉండుంటే ఈ హాని, ఈ నష్టం జరిగేవి కావు.+ 22 అయినాసరే, ధైర్యం తెచ్చుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే, మీలో ఏ ఒక్కరూ చనిపోరు. ఓడ మాత్రం బద్దలౌతుంది. 23 నేను ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నానో, ఎవరికి పవిత్రసేవ చేస్తున్నానో ఆ దేవుని దూత+ నిన్న రాత్రి నా పక్కన నిలబడి, 24 ‘పౌలూ, భయపడకు. నువ్వు కైసరు ముందు నిలబడాలి.+ ఇదిగో! నీతోపాటు ప్రయాణిస్తున్నవాళ్ల ప్రాణాల్ని కూడా దేవుడు దయతో కాపాడతాడు’ అని చెప్పాడు. 25 కాబట్టి స్నేహితులారా, ధైర్యం తెచ్చుకోండి. నాకు దేవుని మీద నమ్మకం ఉంది, ఆయన ఆ దూత నాతో చెప్పినట్టే చేస్తాడు. 26 అయితే మన ఓడ ఏదైనా ఒక ద్వీపానికి+ తగిలి బద్దలవ్వాల్సి ఉంది.”

27 మేము సముద్రం మీద 14 రోజులు ఉన్నాం. మేము అద్రియ సముద్రం మీద గాలికి అటూఇటూ కొట్టుకొనిపోతుండగా, అర్ధరాత్రి వేళ ఓడ ఒక తీరానికి దగ్గరగా వెళ్తోందని నావికులకు అనిపించింది. 28 అక్కడ వాళ్లు లోతు కొలిచినప్పుడు, దాదాపు 36 మీటర్లు* ఉంది. కాబట్టి వాళ్లు ఇంకాస్త దూరం వెళ్లి కొలిచారు. అక్కడ లోతు దాదాపు 27 మీటర్లు* ఉంది. 29 ఓడ వెళ్లి రాళ్లకు కొట్టుకుంటుందేమో అని భయపడి వాళ్లు ఓడ వెనక భాగం నుండి నాలుగు లంగర్లు వేశారు. తర్వాత, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూశారు. 30 అయితే, నావికులు ఓడ ముందు భాగం నుండి లంగర్లు దింపుతున్నట్టు నటిస్తూ చిన్న పడవను సముద్రంలోకి దించి పారిపోవడానికి ప్రయత్నిస్తుండడంతో 31 పౌలు సైనికాధికారితో, సైనికులతో ఇలా అన్నాడు: “వీళ్లు ఓడలో ఉంటేనే తప్ప మీరు ప్రాణాలతో బయటపడలేరు.”+ 32 దాంతో సైనికులు ఆ చిన్న పడవ తాళ్లను కోసేసి దాన్ని పడిపోనిచ్చారు.

33 తెల్లవారబోతున్నప్పుడు పౌలు వాళ్లందర్నీ కాస్త భోంచేయమని చెప్తూ ఇలా అన్నాడు: “ఇప్పటికి 14 రోజుల నుండి మీరు ఏమీ తినకుండా ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. 34 కాబట్టి కాస్త భోంచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇది మీ మంచి కోసమే. ఎందుకంటే, మీలో ఎవరికీ ఏ హానీ జరగదు.” 35 ఆ మాట అన్న తర్వాత అతను ఒక రొట్టె తీసుకొని, వాళ్లందరి ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్పి, దాన్ని విరిచి, తినడం మొదలుపెట్టాడు. 36 దాంతో వాళ్లంతా ధైర్యం తెచ్చుకొని కాస్త భోంచేశారు. 37 ఓడలో మొత్తం 276 మందిమి ఉన్నాం. 38 వాళ్లు తృప్తిగా భోంచేసిన తర్వాత, ఓడను తేలిక చేయడం కోసం అందులో ఉన్న గోధుమల్ని సముద్రంలో పడేశారు.+

39 తెల్లవారినప్పుడు, అది ఏ ప్రాంతమో వాళ్లు గుర్తుపట్టలేకపోయారు.+ అయితే ఒక ఇసుక తీరాన్ని చూసి సాధ్యమైతే ఓడను అక్కడికి చేర్చాలని నిశ్చయించుకున్నారు. 40 కాబట్టి వాళ్లు తాళ్లను కోసేసి లంగర్లను సముద్రంలో పడిపోనిచ్చారు. అదే సమయంలో తెడ్ల కట్లు విప్పారు. తర్వాత గాలి ఓడను తీరం వైపుకు నడిపించేలా ఓడ ముందు భాగంలో ఉన్న తెరచాపను పైకెత్తారు. 41 ఓడ రెండు ప్రవాహాలు కలిసిన చోట ఉన్న పెద్ద ఇసుక దిబ్బలోకి దూసుకెళ్లింది. దాంతో ఓడ ముందు భాగం అందులో ఇరుక్కుపోయి కదల్లేకపోయింది. అయితే ఓడ వెనక భాగం అలల తాకిడికి ముక్కలుముక్కలు అయింది.+ 42 కాబట్టి ఖైదీలెవ్వరూ ఈదుకుంటూ పారిపోకూడదని సైనికులు వాళ్లను చంపాలని నిర్ణయించుకున్నారు. 43 అయితే సైనికాధికారి పౌలును క్షేమంగా తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి సైనికులు తాము అనుకున్నట్టు చేయకుండా ఆపాడు. అతను, ఈత వచ్చినవాళ్లను సముద్రంలోకి దూకి ముందుగా ఒడ్డుకు చేరుకోమని ఆజ్ఞాపించాడు. 44 తర్వాత మిగతావాళ్లు అక్కడికి వెళ్లాలని చెప్పాడు. కొంతమంది చెక్క పలకల మీద, ఇంకొంతమంది పగిలిన ఓడ ముక్కల మీద వెళ్లాలని చెప్పాడు. అలా అందరూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు.+

28 మేము క్షేమంగా తీరాన్ని చేరుకున్న తర్వాత, ఆ ద్వీపం పేరు మెలితే+ అని తెలుసుకున్నాం. 2 ఆ ద్వీపవాసులు* మానవత్వంతో మా మీద ఎంతో దయ చూపించారు. అప్పుడు వర్షం కురుస్తోంది, చలిగా ఉంది కాబట్టి వాళ్లు మంట వెలిగించి, ప్రేమతో మమ్మల్నందర్నీ చేర్చుకున్నారు. 3 అయితే పౌలు మోపెడు కట్టెలు పోగేసి వాటిని ఆ మంటలో వేసినప్పుడు, ఆ సెగకు ఒక విషసర్పం బయటికొచ్చి అతని చేతిని కరిచి పట్టుకుంది. 4 ఆ విషసర్పం పౌలు చేతికి వేలాడుతుండడం చూసి ఆ ద్వీపవాసులు, “ఇతను ఖచ్చితంగా హంతకుడు. సముద్రం నుండి తప్పించుకున్నా న్యాయం* ఇతన్ని బ్రతకనివ్వలేదు” అని చెప్పుకున్నారు. 5 అయితే పౌలు తన చేతిని విదిలించడంతో ఆ విషసర్పం మంటల్లో పడింది. దాని కాటు వల్ల అతనికి ఏ హానీ జరగలేదు. 6 వాళ్లు మాత్రం అతని శరీరం వాచిపోతుందేమో, అతను ఉన్నట్టుండి కిందపడి చనిపోతాడేమో అని చూస్తూ ఉన్నారు. ఎంతసేపైనా అతనికి ఏ హానీ జరగకపోవడంతో వాళ్లు తమ అభిప్రాయం మార్చుకొని, అతనొక దేవుడు అనడం మొదలుపెట్టారు.

7 ఆ ద్వీప ప్రముఖుడు పొప్లికి ఆ చుట్టుపక్కల కొన్ని భూములు ఉన్నాయి. అతను మమ్మల్ని ఆహ్వానించి, మూడురోజుల పాటు మాకు అతిథిమర్యాదలు చేశాడు. 8 అయితే పొప్లి వాళ్ల నాన్న అనారోగ్యంతో మంచం మీద పడుకొని ఉన్నాడు. అతను జ్వరంతో, జిగట విరేచనాలతో బాధపడుతున్నాడు. పౌలు అతని దగ్గరికి వెళ్లి, ప్రార్థించి, అతని మీద చేతులుంచి అతన్ని బాగుచేశాడు.+ 9 ఇది జరిగిన తర్వాత, ఆ ద్వీపంలో అనారోగ్యంతో బాధపడుతున్న మిగతావాళ్లు కూడా పౌలు దగ్గరికి వచ్చి బాగయ్యారు.+ 10 అంతేకాదు ఆ ద్వీపవాసులు ఎన్నో బహుమతులు ఇచ్చి మమ్మల్ని గౌరవించారు, మేము ఓడలో బయల్దేరే సమయం వచ్చినప్పుడు మాకు కావాల్సినవన్నీ తెచ్చి ఇచ్చారు.

11 మూడు నెలల తర్వాత మేము “ద్యుపతి కుమారులు” అనే చిహ్నం ఉన్న ఓడలో బయల్దేరాం. ఆ ఓడ అలెక్సంద్రియ నుండి వచ్చి చలికాలం అక్కడే ఉండిపోయింది. 12 మేము సురకూసై ఓడరేవుకు చేరుకొని అక్కడ మూడు రోజులు ఉన్నాం. 13 అక్కడి నుండి బయల్దేరి రేగియుకు వచ్చాం. ఒక రోజు తర్వాత, దక్షిణ గాలి వీచడంతో రెండో రోజు పొతియొలీకి చేరుకున్నాం. 14 అక్కడ మాకు సహోదరులు కలిశారు. వాళ్లు ఒక వారం రోజులు తమతో ఉండమని బ్రతిమాలడంతో ఏడు రోజులు వాళ్లతోపాటు ఉండి ఆ తర్వాత రోముకు బయల్దేరాం. 15 మేము రోముకు వస్తున్నామని అక్కడి సహోదరులు విన్నప్పుడు వాళ్లు మమ్మల్ని కలుసుకోవడానికి త్రిసత్రముల దగ్గరికి వచ్చారు. కొంతమందైతే, అప్పీయా సంత వరకూ వచ్చారు. పౌలు వాళ్లను చూడగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ధైర్యం తెచ్చుకున్నాడు.+ 16 చివరికి మేము రోముకు వచ్చినప్పుడు, ఒక సైనికుడి కాపలాలో పౌలు తన ఇంట్లో ఒంటరిగా ఉండడానికి అనుమతి దొరికింది.

17 అయితే మూడు రోజుల తర్వాత పౌలు అక్కడి యూదుల్లో ప్రముఖుల్ని పిలిపించాడు. వాళ్లు వచ్చినప్పుడు అతను వాళ్లతో ఇలా అన్నాడు: “సహోదరులారా, మన ప్రజలకు గానీ, మన పూర్వీకుల ఆచారాలకు గానీ వ్యతిరేకంగా నేనేమీ చేయకపోయినా,+ నన్ను యెరూషలేములో బంధించి రోమీయుల చేతికి అప్పగించారు.+ 18 నన్ను విచారణ చేసిన తర్వాత,+ మరణశిక్ష వేయడానికి ఏ కారణం లేకపోవడంతో+ వాళ్లు నన్ను విడుదల చేయాలని అనుకున్నారు. 19 కానీ యూదులు అందుకు ఒప్పుకోకపోయేసరికి, నేను కైసరుకు విన్నవించుకుంటానని చెప్పాల్సి వచ్చింది.+ అంతేగానీ నా ప్రజల మీద ఆరోపణలు చేయాలనేది నా ఉద్దేశం కాదు. 20 ఇందుకే మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని వేడుకున్నాను. ఇశ్రాయేలీయులు ఎవరి కోసం ఎదురుచూస్తున్నారో ఆయన వల్లే నేను ఇలా సంకెళ్లతో బంధించబడి ఉన్నాను.”+ 21 అప్పుడు వాళ్లు పౌలుతో ఇలా అన్నారు: “నీ గురించి యూదయ నుండి మాకు ఉత్తరాలు అందలేదు. అక్కడి నుండి వచ్చిన సహోదరుల్లో ఎవరూ నీ గురించి చెప్పలేదు, ఏమాత్రం చెడుగా మాట్లాడలేదు. 22 అయితే నీ ఆలోచనలు ఏమిటో నీ నోటి నుండే వినడం సరైనదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే, నిజంగానే ప్రతీచోట ప్రజలు ఈ తెగకు+ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని+ మాకు తెలుసు.”

23 వాళ్లు పౌలును కలవడానికి ఒక రోజును అనుకున్నారు. ఆ రోజు అంతకుముందు కన్నా ఎక్కువమంది పౌలు ఉంటున్న ఇంటికి వచ్చారు. పౌలు ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యమిస్తూ వాళ్లకు ప్రకటించాడు. అలా మోషే ధర్మశాస్త్రంలో,+ ప్రవక్తల పుస్తకాల్లో రాసివున్న వాటిని+ ఉపయోగిస్తూ యేసు గురించి వాళ్లను ఒప్పించడానికి+ ప్రయత్నించాడు. 24 పౌలు చెప్పింది కొంతమంది నమ్మారు, ఇంకొంతమంది నమ్మలేదు. 25 వాళ్లకు వేర్వేరు అభిప్రాయాలు ఉండడంతో వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు పౌలు ఇలా అన్నాడు:

“పవిత్రశక్తి యెషయా ప్రవక్త ద్వారా మీ పూర్వీకులతో చెప్పిన ఈ మాట నిజమే: 26 ‘ఈ ప్రజల దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు: “మీరు వినడం వరకు వింటారు కానీ మీకు ఏమాత్రం అర్థంకాదు, మీరు చూడడం వరకు చూస్తారు కానీ మీకు ఏమీ కనిపించదు.+ 27 ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి. వాళ్లు చెవులతో వింటారు కానీ స్పందించరు. వాళ్లు తమ కళ్లు మూసుకున్నారు. వాళ్లు తమ కళ్లతో చూడడానికి, చెవులతో వినడానికి ఇష్టపడట్లేదు; తమ హృదయాలతో అర్థంచేసుకొని నావైపుకు తిరగడానికి నిరాకరిస్తున్నారు. నేను వాళ్లను బాగుచేయకుండా ఉండాలని అలా చేస్తున్నారు.” ’+ 28 కాబట్టి, దేవుడు అనుగ్రహించే రక్షణ గురించిన సందేశం అన్యజనుల దగ్గరికి పంపించబడిందని+ మీరు తెలుసుకోవాలి. వాళ్లు తప్పకుండా దాన్ని వింటారు.”+ 29 *——

30 కాబట్టి పౌలు తన అద్దె ఇంట్లో నివసిస్తూ పూర్తిగా రెండు సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు.+ అతను తన దగ్గరికి వచ్చే వాళ్లందర్నీ సాదరంగా ఆహ్వానిస్తూ, 31 ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు గురించి బోధిస్తూ ఉన్నాడు.+

పదకోశం చూడండి.

అక్ష., “నాకు సాక్షులుగా ఉంటారు.”

అక్ష., “విశ్రాంతి రోజు ప్రయాణమంత.” విశ్రాంతి రోజున ప్రయాణించేందుకు అనుమతించబడిన దూరం.

అక్ష., “పురుషులారా, సహోదరులారా.”

అంటే, పర్యవేక్షకునిగా అతని స్థానాన్ని.

లేదా “వస్తూ వెళ్తూ ఉన్న.”

అనుబంధం A5 చూడండి.

పదకోశం చూడండి.

అంటే, మిగతా 11 మందిలాగే ఎంచబడ్డాడు.

లేదా “ఆకాశం కింద ఉన్న.”

లేదా “మనం పుట్టిన భాషల్లో.”

లేదా “ఈజిప్టు.”

లేదా “తియ్యని.”

అక్ష., “మూడో గంటే.”

అక్ష., “పవిత్రశక్తిలో కొంత.”

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “ఆలోచన ప్రకారం.”

అక్ష., “వేదనల.” లేదా “తాళ్ల” అయ్యుంటుంది.

అనుబంధం A5 చూడండి.

లేదా “నా కళ్లముందు.”

అక్ష., “నా శరీరం.”

లేదా “నా ప్రాణాన్ని.”

లేదా “హేడిస్‌లో,” అంటే మానవజాతి సాధారణ సమాధిలో. పదకోశం చూడండి.

లేదా “హేడిస్‌లో,” అంటే మానవజాతి సాధారణ సమాధిలో. పదకోశం చూడండి.

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “కలిసి సహవసిస్తూ.”

అనుబంధం A5 చూడండి.

అక్ష., “తొమ్మిదో గంట అప్పుడు.”

లేదా “జీవాధిపతిని.”

అక్ష., “తుడిచేయబడతాయి.”

అనుబంధం A5 చూడండి.

లేదా “యెహోవా ముఖం నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి.”

లేదా “పునరుద్ధరించే.”

అనుబంధం A5 చూడండి.

లేదా “ఏ ప్రాణి అయినా.”

లేదా “నిబంధనకు.”

అక్ష., “విత్తనం.”

అక్ష., “వాళ్లు.”

లేదా “యేసు ఉదాహరణతో మృతుల పునరుత్థానం గురించి.”

అక్ష., “మూలకు తల.”

అక్ష., “ప్రజల్లో ఇవ్వబడిన.”

లేదా “ఆకాశం కింద.”

అంటే, నిరక్షరాస్యులని కాదు, రబ్బీల పాఠశాలల్లో చదువుకోనివాళ్లని అర్థం.

లేదా “సూచన.”

అనుబంధం A5 చూడండి.

లేదా “ఆయన క్రీస్తుకు.”

అనుబంధం A5 చూడండి.

లేదా “అభ్యర్థించినప్పుడు.”

అక్ష., “ఒకే హృదయం, ప్రాణం.”

లేదా “ఇతరుల్ని ప్రోత్సహించేవాడు.”

లేదా “దగ్గర పెట్టుకునేట్టు తెగించేలా.”

అనుబంధం A5 చూడండి.

పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.

లేదా “బంధించి.”

అనుబంధం A5 చూడండి.

అక్ష., “ఇశ్రాయేలు కుమారుల.”

లేదా “పెద్దల సభ అంతటినీ.”

అక్ష., “రక్తానికి.”

లేదా “చెట్టుకు.”

అంటే, పరిపాలకునిగా తనకు లోబడేవాళ్లకు.

లేదా “ఇష్టం లేదు.”

లేదా “వాక్య పరిచర్యకు.”

లేదా “స్వతంత్రులుగా చేయబడినవాళ్ల.”

అక్ష., “విత్తనానికి.”

అక్ష., “విత్తనం.”

లేదా “ఇస్సాకు యాకోబు విషయంలో అలాగే చేశాడు” అయ్యుంటుంది.

లేదా “మూలపురుషులకు.”

లేదా “ధాన్యం.”

లేదా “దేవుని దృష్టిలో.”

అక్ష., “తెలివి అంతటినీ.”

లేదా “ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారో చూడడానికి.”

లేదా “అతను నిర్ణయించుకున్నాడు.”

పదకోశం చూడండి.

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “సమాజం.”

అనుబంధం A5 చూడండి.

లేదా “మీ హృదయాలు, చెవులు సున్నతి పొందలేదు.”

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

అనుబంధం A5 చూడండి.

అక్ష., “మరణంలో నిద్రించాడు.”

లేదా “సమరయలోని ఒక నగరానికి” అయ్యుంటుంది.

పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “పైత్యరసంలా చేదుగా.”

అనుబంధం A5 చూడండి.

లేదా “పట్టుదలగా ప్రార్థించండి.”

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

అక్ష., “నపుంసకుడు.” పదకోశం చూడండి.

అనుబంధం A3 చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “స్వరం శబ్దం.”

లేదా “పాత్ర.”

లేదా “ప్రకటించే విషయంలో అంతకంతకూ సమర్థుడిగా తయారౌతూ.”

లేదా “వస్తూ వెళ్తూ.”

అనుబంధం A5 చూడండి.

అక్ష., “భయంలో.”

లేదా “ప్రోత్సాహానికి; బలానికి.”

దొర్కా అనే గ్రీకు పేరుకు, తబితా అనే అరామిక్‌ పేరుకు “కొండజింక” అని అర్థం.

లేదా “పైవస్త్రాల్ని.”

అంటే, జంతు చర్మాల్ని తోలుగా మార్చే వ్యక్తి.

ఇందులో 600 మంది రోమా సైనికులు ఉండేవాళ్లు.

లేదా “శతాధిపతి,” ఇతని కింద 100 మంది సైనికులు ఉండేవాళ్లు.

అక్ష., “దాదాపు తొమ్మిదో గంట అప్పుడు.”

అక్ష., “దాదాపు ఆరో గంట.”

లేదా “అతను పరవశుడయ్యాడు.”

లేదా “సరీసృపాలు.”

అక్ష., “తొమ్మిదో గంట అప్పుడు.”

అనుబంధం A5 చూడండి.

లేదా “చెట్టుకు.”

లేదా “వెల్లడయ్యేలా.”

లేదా “నమ్మకమైనవాళ్లు.”

లేదా “ఒక రకమైన పాత్రను.”

లేదా “సరీసృపాలు.”

లేదా “దేవుని మార్గంలో అడ్డుగా నిలబడడానికి.”

అనుబంధం A5 చూడండి.

లేదా “విచారణ చేయడానికి తీసుకురావాలని.”

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

అక్ష., “పరిచారం.”

అక్ష., “నీగెరు.”

అనుబంధం A5 చూడండి.

అంటే, మార్కు అనే పేరున్న యోహాను.

పదకోశం చూడండి.

6వ వచనంలో ఉన్న “బర్‌యేసు” ఇతనే.

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

అంటే, మార్కు అనే పేరున్న యోహాను.

లేదా “సబ్బాతు రోజున.”

అక్ష., “విత్తనంలో.”

లేదా “చెట్టు.”

లేదా “స్మారక సమాధిలో.”

లేదా “పునరుత్థానం చేయడం.”

లేదా “నమ్మకమైనది; ఆధారపడదగినది.”

లేదా “దేవుని ఇష్టాన్ని నెరవేర్చి.”

అక్ష., “మరణంలో నిద్రించాడు.”

అనుబంధం A5 చూడండి.

లేదా “దేశాలకు.”

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “సరైన.”

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “వాక్యాన్ని.”

అనుబంధం A5 చూడండి.

అక్ష., “పరిసయ్యుల తెగకు చెందిన.”

లేదా “కాడిని.”

అంటే, పేతురు.

లేదా “డేరాను; పర్ణశాలను.”

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “నిర్ణయం.”

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

లేదా “రక్తం ఒలికించకుండా.”

లేదా “అన్యజనుల్లో నుండి వచ్చిన.”

లేదా “రక్తం ఒలికించకుండా.”

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

లేదా “వీడ్కోలు.”

అనుబంధం A3 చూడండి.

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

లేదా “ఏదేమైనా” అయ్యుంటుంది.

అనుబంధం A5 చూడండి.

లేదా “యేసు పవిత్రశక్తి,” అంటే దేవుని నుండి యేసు పొందిన పవిత్రశక్తి.

లేదా “గుండా.”

ఇది ఇటలీ వెలుపల ఉన్న నగరం, ఇక్కడి నివాసులకు ప్రత్యేక హక్కులు ఉండేవి.

లేదా “అద్దకం.”

అనుబంధం A5 చూడండి.

అనుబంధం A5 చూడండి.

పదకోశం చూడండి.

లేదా “సోదె.”

అనుబంధం A5 చూడండి.

అక్ష., “ఆ గంటలోనే.”

లేదా “పునరుత్థానం.”

పదకోశం చూడండి.

లేదా “దాన్ని సందర్శించే.”

లేదా “భక్తి చూపించే.”

లేదా “సంతానమే.”

లేదా “సంతానం.”

లేదా “మృతుల పునరుత్థానం.”

పదకోశం చూడండి.

అనుబంధం A5 చూడండి.

అక్ష., “ఎక్కివెళ్లి.” యెరూషలేముకు అని తెలుస్తోంది.

అనుబంధం A5 చూడండి.

లేదా “తర్కిస్తూ.”

పదకోశం చూడండి.

అనుబంధం A5 చూడండి.

పదకోశం చూడండి.

మత్తయి 28:1 అధస్సూచి చూడండి.

అక్ష., “రొట్టె విరవడానికి.”

లేదా “పునరుత్థానం చేయబడ్డాడని.”

లేదా “దీనమనస్సుతో.”

లేదా “ప్రయోజనం చేకూర్చే.”

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “విలువైనదని.”

లేదా “సంకల్పమంతటినీ.”

అక్ష., “పౌలు మెడ మీద పడి.”

లేదా “మృదువుగా.”

లేదా “సువార్తికుడైన.”

అక్ష., “కన్యలైన.”

లేదా “నిశ్చయాన్ని.”

అక్ష., “మౌనంగా ఉండిపోయి.”

అనుబంధం A5 చూడండి.

అక్ష., “మతభ్రష్టత్వాన్ని.”

లేదా “రక్తం ఒలికించకుండా.”

గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

ఇతని కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.

లేదా “వాళ్లు వినలేదు.”

లేదా “నేను పరవశుణ్ణి అయ్యాను.”

లేదా “రక్తం చిందించబడుతున్నప్పుడు.”

ఇతని కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.

లేదా “రోమా పౌరుణ్ణి.”

లేదా “మృతుల పునరుత్థానాన్ని.”

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “బహిరంగంగా ప్రకటిస్తారు.”

ఇతని కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.

అక్ష., “మూడో గంట అప్పుడు.”

లేదా “ప్రేతోర్యంలో.”

లేదా “సమస్యలు సృష్టిస్తున్నాడని.” అక్ష., “తెగులని.”

అనుబంధం A3 చూడండి.

లేదా “పునరుత్థానం చేస్తాడని.”

లేదా “మచ్చలేని.”

ఇతని కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.

లేదా “సలహాదారుల సభతో.”

లేదా “ఔగుస్తు.” ఇది రోమా చక్రవర్తికి ఉన్న బిరుదు, పేరు కాదు.

వీళ్ల కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.

లేదా “ఔగుస్తుకు.” ఇది రోమా చక్రవర్తికి ఉన్న బిరుదు, పేరు కాదు.

అక్ష., “ప్రభువుకు.”

పదకోశం చూడండి.

లేదా “పునరుత్థానం చేయబడిన.”

ఇది రోమా చక్రవర్తికి ఉన్న బిరుదు, పేరు కాదు.

అంటే, ఈశాన్య గాలి.

ఇది ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడే చిన్న పడవ.

పదకోశం చూడండి.

అక్ష., “20 ఫాథమ్‌లు.” అనుబంధం B14 చూడండి.

అక్ష., “15 ఫాథమ్‌లు.” అనుబంధం B14 చూడండి.

లేదా “వేరే భాష మాట్లాడే ప్రజలు.”

గ్రీకులో డైకె. ఈ పదం న్యాయాన్ని అమలు చేసే దేవతను సూచిస్తుండవచ్చు.

అనుబంధం A3 చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి