యోహాను సువార్త
1 మొదట్లో వాక్యం ఉన్నాడు,+ ఆ వాక్యం దేవునితో ఉన్నాడు,+ ఆ వాక్యం ఒక దేవుడు.*+ 2 మొదట్లో ఆయన దేవునితో ఉన్నాడు. 3 అన్నీ ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి, ఆయన లేకుండా ఏదీ సృష్టించబడలేదు.
4 ఆయన ద్వారా సృష్టించబడింది ఏమిటంటే, జీవం. ఆ జీవం మనుషులకు వెలుగు.+ 5 ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తోంది, అయితే చీకటి ఆ వెలుగును జయించలేకపోయింది.
6 దేవుడు పంపించిన ఒక మనిషి ఉన్నాడు, అతని పేరు యోహాను.+ 7 అతని ద్వారా అన్నిరకాల ప్రజలు నమ్మకముంచేలా, అతను ఆ వెలుగు గురించి సాక్ష్యమివ్వడానికి ఒక సాక్షిగా వచ్చాడు.+ 8 అతను ఆ వెలుగు కాదు, కానీ ఆ వెలుగు గురించి సాక్ష్యమివ్వడానికి వచ్చాడు.
9 అన్నిరకాల మనుషుల మీద ప్రకాశించే నిజమైన వెలుగు లోకంలోకి రాబోతుంది.+ 10 ఆయన లోకంలో ఉన్నాడు. లోకం ఆయన ద్వారానే సృష్టించబడింది,+ అయినా లోకం ఆయన్ని తెలుసుకోలేదు. 11 ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు, కానీ తనవాళ్లే ఆయన్ని అంగీకరించలేదు. 12 ఎవరైతే ఆయన్ని అంగీకరించారో వాళ్లందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చాడు.+ ఎందుకంటే వాళ్లు ఆయన పేరుమీద విశ్వాసం ఉంచుతున్నారు. 13 వాళ్లు రక్తమాంసాలవల్ల లేదా మానవ తండ్రుల ఇష్టంవల్ల పుట్టలేదు కానీ దేవునివల్ల పుట్టారు.+
14 ఆ వాక్యం శరీరంతో పుట్టి,+ మన మధ్య జీవించాడు. మనం ఆయన మహిమను చూశాం, అది తండ్రి ఒక్కగానొక్క కుమారునికి+ ఉండేలాంటి మహిమ. ఆయన దేవుని అనుగ్రహంతో,* సత్యంతో నిండివున్నాడు. 15 (యోహాను ఆయన గురించి సాక్ష్యమిస్తూ బిగ్గరగా ఇలా అన్నాడు: “ ‘నా వెనక వచ్చేవాడు ఇప్పుడు నాకంటే గొప్పవాడయ్యాడు, ఎందుకంటే ఆయన నాకన్నా ముందే ఉనికిలో ఉన్నాడు’+ అని నేను చెప్పింది ఈయన గురించే.”) 16 ఆయనలో అపారదయ సమృద్ధిగా ఉంది కాబట్టి మనందరం ఆయన నుండి అపారదయను పొందుతూ వచ్చాం. 17 దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు; అయితే అపారదయను,+ సత్యాన్ని యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు.+ 18 ఏ మనిషీ ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు;+ తండ్రి పక్కన ఉన్న*+ ఒక్కగానొక్క కుమారుడే ఆయన గురించి వివరించాడు, ఆ కుమారుడు దేవునిలా ఉన్నాడు.
19 “నువ్వు ఎవరు?” అని అడగడానికి యూదులు యెరూషలేము నుండి యాజకుల్ని, లేవీయుల్ని పంపించినప్పుడు యోహాను ఈ సాక్ష్యం ఇచ్చాడు.+ 20 అతను జవాబివ్వకుండా తప్పించుకోలేదు కానీ, “నేను క్రీస్తును కాను” అని ఒప్పుకున్నాడు. 21 “మరైతే నువ్వు ఏలీయావా?”+ అని వాళ్లు అడిగినప్పుడు, “కాదు” అన్నాడు. “మరి నువ్వు రావాల్సిన ఆ ప్రవక్తవా?”+ అని అడిగినప్పుడు, “కాదు” అని జవాబిచ్చాడు. 22 కాబట్టి వాళ్లు, “ఇంతకీ నువ్వు ఎవరివి? మాతో చెప్పు, మమ్మల్ని పంపినవాళ్లకు మేము సమాధానం చెప్పాలి. నీ గురించి నువ్వు ఏమని చెప్పుకుంటున్నావు?” అని అతన్ని అడిగారు. 23 అప్పుడు అతను, “యెషయా ప్రవక్త చెప్పినట్టు ‘యెహోవా* మార్గాన్ని ఖాళీగా ఉంచండి’ అని ఎడారిలో* బిగ్గరగా అరుస్తున్న వ్యక్తిని* నేను”+ అని చెప్పాడు.+ 24 వాళ్లను పరిసయ్యులు పంపించారు. 25 కాబట్టి వాళ్లు, “నువ్వు క్రీస్తువు, ఏలీయావు, ఆ ప్రవక్తవు కానప్పుడు బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నావు?” అని అతన్ని అడిగారు. 26 అప్పుడు యోహాను వాళ్లకిలా చెప్పాడు: “నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను. మీ మధ్య ఒకాయన ఉన్నాడు, ఆయన ఎవరో మీకు తెలీదు. 27 ఆయన నా వెనక వస్తున్నాడు, ఆయన చెప్పుల తాడు విప్పే అర్హత కూడా నాకు లేదు.”+ 28 ఈ సంఘటనలు, యోహాను బాప్తిస్మం ఇస్తున్న యొర్దాను నది అవతల ఉన్న బేతనియలో జరిగాయి.
29 తర్వాతి రోజు యేసు తన దగ్గరికి రావడం చూసి యోహాను ఇలా అన్నాడు: “ఇదిగో, లోక పాపాల్ని తీసేసే+ దేవుని గొర్రెపిల్ల!+ 30 ‘నా వెనక ఒకాయన వస్తున్నాడు. ఆయన ఇప్పుడు నాకంటే గొప్పవాడయ్యాడు, ఎందుకంటే ఆయన నాకన్నా ముందే ఉనికిలో ఉన్నాడు’ అని నేను చెప్పింది ఈయన గురించే.+ 31 ఈయన ఎవరో అప్పుడు నాకు కూడా తెలీదు. అయితే ఈయన్ని ఇశ్రాయేలీయులు స్పష్టంగా చూడాలని* నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తూ వచ్చాను.”+ 32 యోహాను ఇలా కూడా సాక్ష్యమిచ్చాడు: “పవిత్రశక్తి పావురం రూపంలో ఆకాశం నుండి దిగిరావడం నేను చూశాను, అది ఈయన మీద ఉండిపోయింది.+ 33 ఈయన ఎవరో అప్పుడు నాకు కూడా తెలీదు. అయితే, నీళ్లలో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపించిన దేవుడే స్వయంగా నాకు ఇలా చెప్పాడు: ‘పవిత్రశక్తి ఎవరిమీదికి దిగివచ్చి ఉండిపోవడం+ నువ్వు చూస్తావో ఆయనే పవిత్రశక్తిలో బాప్తిస్మం ఇస్తాడు.’+ 34 నేను దాన్ని చూశాను, ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చాను.”+
35 తర్వాతి రోజు యోహాను తన ఇద్దరు శిష్యులతో మళ్లీ అక్కడ నిలబడివున్నాడు. 36 అప్పుడు యేసు అటుగా వెళ్తుండడం చూసి యోహాను, “ఇదిగో, దేవుని గొర్రెపిల్ల!”+ అన్నాడు. 37 ఆ మాట వినగానే, ఆ ఇద్దరు శిష్యులు యేసును అనుసరించారు. 38 యేసు వాళ్లవైపు తిరిగి, వాళ్లు తన వెనక రావడం గమనించి, “మీకేం కావాలి?” అని అడిగాడు. అప్పుడు వాళ్లు, “రబ్బీ (ఆ మాటను అనువదిస్తే, “బోధకుడా” అని అర్థం), నువ్వు ఎక్కడ ఉంటున్నావు?” అని అడిగారు. 39 అప్పుడాయన వాళ్లతో, “వచ్చి చూడండి” అన్నాడు. కాబట్టి వాళ్లు వెళ్లి, ఆయన ఎక్కడ ఉంటున్నాడో చూసి ఆ రోజు ఆయనతోనే ఉండిపోయారు; అప్పుడు దాదాపు సాయంత్రం నాలుగు గంటలైంది.* 40 యోహాను మాటలు విని యేసును అనుసరించిన ఇద్దరిలో ఒకతను అంద్రెయ.+ ఇతను సీమోను పేతురుకు సహోదరుడు. 41 అంద్రెయ మొదట తన సహోదరుడైన సీమోను దగ్గరికి వెళ్లి, “మేము మెస్సీయను (ఆ మాటను అనువదిస్తే, “క్రీస్తు” అని అర్థం) చూశాం”+ అని చెప్పి, 42 అతన్ని యేసు దగ్గరికి తీసుకెళ్లాడు. యేసు అతనివైపు చూసి, “నువ్వు యోహాను కుమారుడివైన సీమోనువు;+ నువ్వు కేఫా (దాన్ని అనువదిస్తే, “పేతురు”*+) అని పిలవబడతావు” అన్నాడు.
43 ఆ తర్వాతి రోజు యేసు గలిలయకు వెళ్లాలనుకున్నాడు. అప్పుడు ఆయన ఫిలిప్పును+ చూసి, “వచ్చి, నన్ను అనుసరించు” అన్నాడు. 44 ఫిలిప్పు బేత్సయిదా నగరానికి చెందినవాడు. అంద్రెయ, పేతురు కూడా అక్కడివాళ్లే. 45 ఫిలిప్పు నతనయేలు+ దగ్గరికి వెళ్లి, “ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించైతే రాశాడో, ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయన్ని మేము కనుగొన్నాం. ఆయనే నజరేతువాడూ యోసేపు+ కుమారుడూ అయిన యేసు” అన్నాడు. 46 అయితే నతనయేలు, “నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా?” అని అతనితో అన్నాడు. అప్పుడు ఫిలిప్పు, “వచ్చి చూడు” అన్నాడు. 47 నతనయేలు తనవైపు వస్తుండడం చూసి యేసు, “ఇదిగో, ఇతను ఏ కపటమూ లేని నిజమైన ఇశ్రాయేలీయుడు”+ అని అన్నాడు. 48 అప్పుడు నతనయేలు, “నేను నీకు ఎలా తెలుసు?” అని యేసును అడిగాడు. దానికి యేసు, “ఫిలిప్పు నిన్ను పిలవకముందే, నువ్వు ఆ అంజూర చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అన్నాడు. 49 అప్పుడు నతనయేలు, “రబ్బీ, నువ్వు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజువి”+ అన్నాడు. 50 అందుకు యేసు అతనితో, “నేను నిన్ను అంజూర చెట్టు కింద చూశానని చెప్పాను కాబట్టి నమ్ముతున్నావా? నువ్వు వీటికన్నా గొప్పవాటిని చూస్తావు” అన్నాడు. 51 తర్వాత యేసు అతనితో ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, ఆకాశం* తెరవబడడం, దేవదూతలు మానవ కుమారుని* దగ్గరికి దిగిరావడం, పైకి ఎక్కివెళ్లడం మీరు చూస్తారు.”+
2 రెండు రోజుల తర్వాత, గలిలయలోని కానా అనే ఊరిలో ఒక పెళ్లివిందు జరిగింది, యేసు తల్లి అక్కడే ఉంది. 2 ఆ పెళ్లివిందుకు యేసును, ఆయన శిష్యుల్ని కూడా ఆహ్వానించారు.
3 ద్రాక్షారసం అయిపోతున్నప్పుడు యేసు తల్లి ఆయనతో, “వాళ్ల దగ్గర ద్రాక్షారసం లేదు” అని చెప్పింది. 4 అయితే యేసు ఆమెతో, “అమ్మా, దానికి మనమేం చేస్తాం?* నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు. 5 అప్పుడు వాళ్లమ్మ పనివాళ్లతో, “ఆయన మీకు ఏంచెప్తే అది చేయండి” అంది. 6 యూదుల శుద్ధీకరణ ఆచారం+ కోసం అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి. ఒక్కోదానిలో రెండు లేదా మూడు కుండల* నీళ్లు పడతాయి. 7 యేసు ఆ పనివాళ్లతో, “ఆ బానల్ని నీళ్లతో నింపండి” అన్నాడు. వాళ్లు అంచుల దాకా నింపారు. 8 తర్వాత ఆయన, “ఇప్పుడు మీరు వాటిలో కొంచెం విందు నిర్వాహకుడి దగ్గరికి తీసుకెళ్లండి” అని వాళ్లకు చెప్పాడు. వాళ్లు ఆయన చెప్పినట్టే చేశారు. 9 విందు నిర్వాహకుడు ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్లను రుచి చూశాడు. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో ఆ పనివాళ్లకు మాత్రమే తెలుసు కానీ అతనికి తెలీదు, కాబట్టి అతను పెళ్లికుమారుణ్ణి పిలిచి, 10 “అందరూ మొదట మంచి ద్రాక్షారసం పోసి, ప్రజలు మత్తులో ఉన్నప్పుడు తక్కువ రకం ద్రాక్షారసం పోస్తారు. నువ్వు మాత్రం ఇప్పుడు మంచి ద్రాక్షారసాన్ని ఇస్తున్నావు” అన్నాడు. 11 గలిలయలోని కానాలో యేసు చేసిన ఈ అద్భుతం ఆయన అద్భుతాల్లో మొదటిది. దాని ద్వారా ఆయన తన మహిమను అందరికీ వెల్లడిచేశాడు,+ ఆయన శిష్యులు ఆయనమీద విశ్వాసం ఉంచారు.
12 తర్వాత యేసు, ఆయన తల్లి, ఆయన తమ్ముళ్లు,+ ఆయన శిష్యులు కపెర్నహూముకు వెళ్లారు.+ అయితే వాళ్లు అక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు.
13 యూదుల పస్కా పండుగ+ దగ్గరపడింది కాబట్టి యేసు యెరూషలేముకు వెళ్లాడు. 14 ఆయన ఆలయంలోకి వెళ్లినప్పుడు అక్కడ ప్రజలు పశువుల్ని, గొర్రెల్ని, పావురాల్ని అమ్మడం,+ డబ్బులు మార్చేవాళ్లు తమ స్థానాల్లో కూర్చొని ఉండడం చూశాడు. 15 అప్పుడు యేసు తాళ్లతో ఒక కొరడా చేసి వాళ్లందర్ని, వాళ్ల గొర్రెల్ని, పశువుల్ని ఆలయంలో నుండి వెళ్లగొట్టాడు. డబ్బు మార్చేవాళ్ల నాణేల్ని, బల్లల్ని కింద పడేశాడు.+ 16 పావురాల్ని అమ్మేవాళ్లతో, “వీటిని ఇక్కడి నుండి తీసుకెళ్లండి! నా తండ్రి మందిరాన్ని వ్యాపార స్థలంగా* మార్చకండి!” అన్నాడు.+ 17 అప్పుడు ఆయన శిష్యులు, “నీ మందిరం* విషయంలో నాకున్న ఆసక్తి మండుతున్న అగ్నిలా ఉంటుంది”+ అని రాయబడి ఉందని గుర్తుతెచ్చుకున్నారు.
18 అది చూసి యూదులు, “నువ్వు ఈ పనులు చేస్తున్నావు కదా, వీటిని చేసే హక్కు నీకుందని నిరూపించుకోవడానికి ఏ అద్భుతం చేస్తావు?”+ అని యేసును అడిగారు. 19 అప్పుడు యేసు వాళ్లతో, “ఈ ఆలయాన్ని పడగొట్టండి, మూడు రోజుల్లో నేను దాన్ని లేపుతాను” అని అన్నాడు.+ 20 దానికి యూదులు, “ఈ ఆలయాన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది, నువ్వు మూడు రోజుల్లో దాన్ని లేపుతావా?” అన్నారు. 21 కానీ, ఆయన తన శరీరం అనే ఆలయం గురించి ఆ మాట అన్నాడు.+ 22 అయితే ఆయన మృతుల్లో నుండి బ్రతికించబడినప్పుడు, ఆయన శిష్యులు యేసు ఈ మాట తరచూ చెప్పేవాడని గుర్తుచేసుకుని లేఖనాల్ని, యేసు మాటల్ని నమ్మారు.
23 యేసు పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉన్నప్పుడు, ఆయన చేసిన అద్భుతాల్ని చూసి చాలామంది ఆయన పేరుమీద విశ్వాసం ఉంచారు. 24 కానీ యేసు వాళ్లను పూర్తిగా నమ్మలేదు, ఎందుకంటే మనుషుల హృదయాల్లో ఏముందో ఆయనకు తెలుసు. 25 అంతేకాదు, మనుషుల గురించి ఎవ్వరూ ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనుషుల స్వభావం ఆయనకు తెలుసు.+
3 నీకొదేము+ అనే ఒక పరిసయ్యుడు ఉన్నాడు, అతను యూదుల నాయకుల్లో ఒకడు. 2 రాత్రిపూట అతను యేసు దగ్గరికి వచ్చి,+ “రబ్బీ, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడివని మాకు తెలుసు. దేవుడు తోడుగా ఉంటే తప్ప ఎవరూ నువ్వు చేస్తున్న ఈ అద్భుతాలు చేయలేరు”+ అన్నాడు.+ 3 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా నీతో చెప్తున్నాను, ఒక వ్యక్తి మళ్లీ పుడితేనే* తప్ప+ అతను దేవుని రాజ్యాన్ని చూడలేడు.”+ 4 కాబట్టి నీకొదేము, “ఒక వ్యక్తి ముసలివాడైన తర్వాత మళ్లీ ఎలా పుట్టగలడు? అతను మళ్లీ తన తల్లి గర్భంలోకి ప్రవేశించి పుట్టగలడా?” అని అడిగాడు. 5 దానికి యేసు ఇలా జవాబిచ్చాడు: “నేను చాలా ఖచ్చితంగా నీతో చెప్తున్నాను, ఒక వ్యక్తి నీళ్లవల్ల,+ పవిత్రశక్తివల్ల+ పుడితేనే తప్ప దేవుని రాజ్యంలోకి వెళ్లలేడు. 6 మానవ తల్లిదండ్రుల వల్ల పుట్టేవాళ్లు మనుషుల పిల్లలు, పవిత్రశక్తి వల్ల పుట్టేవాళ్లు దేవుని పిల్లలు. 7 మీరు మళ్లీ పుట్టాలి అని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపోవద్దు. 8 గాలి ఎటు వీచాలనుకుంటే అటు వీస్తుంది, దాని శబ్దం నీకు వినిపిస్తుంది కానీ అది ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో నీకు తెలీదు. పవిత్రశక్తి వల్ల పుట్టిన ప్రతీ ఒక్కరి+ విషయం అలాగే ఉంటుంది.”
9 అప్పుడు నీకొదేము యేసును, “ఇవి ఎలా సాధ్యం?” అని అడిగాడు. 10 దానికి యేసు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలులో బోధకుడివై ఉండి, నీకు ఈ విషయాలు తెలియకపోవడం ఏంటి? 11 నేను చాలా ఖచ్చితంగా నీతో చెప్తున్నాను, మేము మాకు తెలిసినవాటి గురించే మాట్లాడుతున్నాం, చూసినవాటి గురించే సాక్ష్యమిస్తున్నాం, అయితే మేమిచ్చే సాక్ష్యాన్ని మీరు అంగీకరించరు. 12 నేను భూసంబంధమైన విషయాలు మీకు చెప్పాను, అయినా మీరు నమ్మట్లేదు. మరి నేను పరలోక సంబంధమైన విషయాలు చెప్తే ఎలా నమ్ముతారు? 13 అంతేకాదు, పరలోకం నుండి దిగివచ్చిన+ మానవ కుమారుడు తప్ప ఏ మనిషీ పరలోకానికి ఎక్కిపోలేదు.+ 14 మోషే ఎడారిలో సర్పాన్ని పైకెత్తినట్టే+ మానవ కుమారుడు కూడా ఎత్తబడాలి.+ 15 దానివల్ల, ఆయన్ని నమ్మే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందగలుగుతారు.+
16 “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు.+ ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.+ 17 దేవుడు లోకానికి తీర్పు తీర్చడానికి తన కుమారుణ్ణి పంపించలేదు గానీ, లోకం తన కుమారుడి ద్వారా రక్షించబడాలనే ఆయన్ని పంపించాడు.+ 18 ఆయనమీద విశ్వాసం ఉంచే వాళ్లెవ్వరికీ తీర్పు తీర్చబడదు.+ ఆయనమీద విశ్వాసం ఉంచనివాళ్లకు అప్పటికే తీర్పు తీర్చబడింది, ఎందుకంటే దేవుని ఒక్కగానొక్క కుమారుడి పేరుమీద వాళ్లు విశ్వాసం ఉంచలేదు.+ 19 తీర్పు దీని ఆధారంగా జరుగుతుంది: నిజంగానే వెలుగు లోకంలోకి వచ్చింది.+ అయితే మనుషులు చెడ్డపనులు చేస్తున్నారు కాబట్టి వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. 20 నీచమైన పనులు చేస్తూ ఉండే ప్రతీ ఒక్కరు వెలుగును ద్వేషిస్తారు; తమ పనులు బయటపడతాయని* వాళ్లు వెలుగు దగ్గరికి రారు. 21 అయితే సరైన పనులు చేసే ప్రతీ ఒక్కరు, తమ పనులు దేవుని ఇష్టప్రకారం ఉన్నాయని అందరికీ తెలిసేలా వెలుగు దగ్గరికి వస్తారు.”+
22 ఆ తర్వాత యేసు, ఆయన శిష్యులు యూదయలోని పల్లె ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ ఆయన వాళ్లతో కొంత సమయం గడిపాడు; బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు.+ 23 అయితే యోహాను కూడా సలీము దగ్గర ఉన్న ఐనోనులో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు, ఎందుకంటే అక్కడ ఒక పెద్ద నీటిమడుగు ఉంది.+ ప్రజలు ఆయన దగ్గరికి వస్తూ బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు. 24 అప్పటికి యోహాను ఇంకా చెరసాలలో వేయబడలేదు.+
25 శుద్ధీకరణ ఆచారం విషయంలో యోహాను శిష్యులకు, ఒక యూదుడికి మధ్య వాదన జరిగింది. 26 తర్వాత వాళ్లు యోహాను దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: “రబ్బీ, యొర్దాను నది అవతల నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి, నువ్వు సాక్ష్యమిచ్చిన వ్యక్తి+ నీకు తెలుసు కదా. ఇదిగో ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు, అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు.” 27 అప్పుడు యోహాను వాళ్లతో ఇలా అన్నాడు: “పరలోకం నుండి ఇవ్వబడితేనే తప్ప ఒక వ్యక్తి ఏదీ పొందలేడు. 28 ‘నేను క్రీస్తును కాదుగానీ ఆయనకు ముందుగా పంపబడ్డాను’+ అని నేను చెప్పిన మాట మీరే స్వయంగా విన్నారు. 29 పెళ్లికూతురు పెళ్లికుమారుడికి సొంతం.+ అయితే పెళ్లికుమారుడి స్నేహితుడు పక్కనే నిలబడి, పెళ్లికుమారుడి స్వరం విని, అతని స్వరాన్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. అలా, ఇప్పుడు నా సంతోషం సంపూర్ణమైంది. 30 ఆయన ఎక్కువౌతూ ఉండాలి, నేను తగ్గిపోతూ ఉండాలి.”
31 పైనుండి వచ్చే వ్యక్తి+ అందరికన్నా పైన ఉన్నాడు. భూమి నుండి వచ్చే వ్యక్తి భూసంబంధమైన వ్యక్తి, అతను భూమ్మీది విషయాల గురించే మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చే వ్యక్తి అందరికన్నా పైన ఉన్నాడు.+ 32 ఆయన తాను చూసినవాటి గురించి, విన్నవాటి గురించి సాక్ష్యమిస్తాడు.+ కానీ ఆయన సాక్ష్యాన్ని ఎవరూ అంగీకరించరు.+ 33 అయితే ఆయన సాక్ష్యాన్ని అంగీకరించిన ప్రతీ ఒక్కరు దేవుడు సత్యవంతుడని ధృవీకరించారు.*+ 34 దేవుడు పంపించిన వ్యక్తి దేవుని మాటలు మాట్లాడతాడు,+ ఎందుకంటే దేవుడు పవిత్రశక్తిని కొద్దికొద్దిగా* ఇవ్వడు. 35 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు,+ అన్నిటినీ ఆయన చేతికి అప్పగించాడు.+ 36 కుమారుడి మీద విశ్వాసం చూపించే వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు;+ కుమారుడికి విధేయత చూపించని వ్యక్తి శాశ్వత జీవితం పొందడు,+ కానీ దేవుని ఆగ్రహం అతని మీద నిలిచివుంటుంది.+
4 యోహాను కన్నా యేసు ఎక్కువమందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, వాళ్లకు బాప్తిస్మం ఇస్తున్నాడని+ పరిసయ్యులు విన్నారు. ఆ విషయం ప్రభువుకు తెలిసింది. 2 (అయితే యేసే స్వయంగా బాప్తిస్మం ఇవ్వలేదు గానీ ఆయన శిష్యులు ఇచ్చారు.) 3 అప్పుడు ఆయన యూదయ నుండి మళ్లీ గలిలయకు బయల్దేరాడు. 4 ఆయన సమరయ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి వచ్చింది. 5 అలా ప్రయాణిస్తూ ఆయన సమరయలోని సుఖారు అనే నగరానికి వచ్చాడు. అది యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన పొలానికి+ దగ్గర్లో ఉంది. 6 అక్కడ యాకోబు బావి కూడా ఉంది.+ ప్రయాణం వల్ల అలసిపోయి యేసు ఆ బావి* దగ్గర కూర్చున్నాడు, అప్పుడు దాదాపు మధ్యాహ్నం 12 గంటలు* అయింది.
7 ఆ సమయంలో ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చింది. యేసు ఆమెను, “తాగడానికి నాకు కొన్ని నీళ్లు ఇవ్వు” అని అడిగాడు. 8 (ఆయన శిష్యులు ఆహారం కొనుక్కురావడానికి నగరంలోకి వెళ్లారు.) 9 అప్పుడు ఆ సమరయ స్త్రీ ఆయనతో ఇలా అంది: “నువ్వు యూదుడివి, నేనేమో సమరయ స్త్రీని, మరి నువ్వెలా నన్ను నీళ్లు అడుగుతున్నావు?” (ఎందుకంటే యూదులు సమరయులతో మాట్లాడరు.)+ 10 అందుకు యేసు ఆమెతో ఇలా అన్నాడు: “దేవుడు ఉచితంగా ఇచ్చే బహుమతి+ ఏమిటో, ‘నాకు నీళ్లివ్వు’ అని నిన్ను అడుగుతున్నది ఎవరో నీకు తెలిసివుంటే, నువ్వు ఆయన్ని నీళ్లు అడిగేదానివి, ఆయన నీకు జీవజలం ఇచ్చేవాడు.”+ 11 అప్పుడు ఆమె యేసుతో ఇలా అంది: “అయ్యా, నీళ్లు చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదు. పైగా ఈ బావి లోతుగా ఉంది. మరి ఈ జీవజలాన్ని నువ్వు ఎక్కడి నుండి తెచ్చిస్తావు? 12 మన పూర్వీకుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు. అతను, అతని కుమారులు, అతని పశువులు తాగింది ఈ బావి నీళ్లే. నువ్వు అతని కన్నా గొప్పవాడివా?” 13 అందుకు యేసు ఇలా అన్నాడు: “ఈ బావి నీళ్లు తాగే ప్రతీ ఒక్కరికి మళ్లీ దాహం వేస్తుంది. 14 కానీ నేను ఇచ్చే నీళ్లు తాగే ఏ వ్యక్తికీ ఎప్పుడూ దాహం వేయదు.+ నేనిచ్చే నీళ్లు అతనిలో నీటి ఊటలా మారతాయి. ఆ ఊట అతనికి శాశ్వత జీవితాన్ని ఇవ్వడానికి అతనిలో ఉబుకుతూ ఉంటుంది.”+ 15 అప్పుడు ఆ స్త్రీ, “అయ్యా, నాకు దాహం వేయకుండా, నేను నీళ్లు చేదుకోవడానికి పదేపదే ఇక్కడికి రాకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వు” అని అడిగింది.
16 యేసు ఆమెతో, “నువ్వు వెళ్లి నీ భర్తను పిలుచుకొని రా” అన్నాడు. 17 అప్పుడు ఆ స్త్రీ, “నాకు భర్త లేడు” అని చెప్పింది. అందుకు యేసు ఇలా అన్నాడు: “ ‘నాకు భర్త లేడు’ అని నువ్వు సరిగ్గానే చెప్పావు. 18 నీకు ఐదుగురు భర్తలు ఉండేవాళ్లు, ఇప్పుడు నువ్వు ఎవరితో ఉంటున్నావో అతను నీ భర్త కాదు. నువ్వు చెప్పింది నిజమే.” 19 దానికి ఆ స్త్రీ ఆయనతో ఇలా అంది: “అయ్యా, నువ్వు ప్రవక్తవని నాకనిపిస్తుంది.+ 20 మా పూర్వీకులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ మీరు యెరూషలేములోనే ఆరాధించాలని చెప్తారు.”+ 21 అప్పుడు యేసు ఆమెతో ఇలా అన్నాడు: “అమ్మా, నీతో నిజంగా చెప్తున్నాను. ఒక సమయం రాబోతుంది, అప్పుడు మీరు ఈ పర్వతం మీద గానీ, యెరూషలేములో గానీ తండ్రిని ఆరాధించరు. 22 మీరు ఏం ఆరాధిస్తున్నారో మీకు తెలీదు;+ మేము ఏం ఆరాధిస్తున్నామో మాకు తెలుసు, ఎందుకంటే రక్షణ యూదులతోనే మొదలౌతుంది.+ 23 అయినప్పటికీ, తండ్రిని సరైన విధంగా ఆరాధించేవాళ్లు పవిత్రశక్తితో,* సత్యంతో ఆరాధించే సమయం రాబోతుంది, అది ఇప్పటికే వచ్చేసింది. నిజానికి తనను అలా ఆరాధించే వాళ్ల కోసమే తండ్రి చూస్తున్నాడు.+ 24 దేవుడు అదృశ్య వ్యక్తి,+ ఆయన్ని ఆరాధించేవాళ్లు పవిత్రశక్తితో,* సత్యంతో ఆరాధించాలి.”+ 25 అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు అని పిలవబడే మెస్సీయ రాబోతున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలు మాకు వివరంగా చెప్తాడు” అంది. 26 యేసు ఆమెతో, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అన్నాడు.+
27 సరిగ్గా అప్పుడే ఆయన శిష్యులు వచ్చారు. ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతుండడం చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. అయితే, “నీకేం కావాలి?” అని గానీ, “ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?” అని గానీ ఎవ్వరూ ఆయన్ని అడగలేదు. 28 అప్పుడు ఆ స్త్రీ తన కుండను అక్కడే విడిచిపెట్టి, నగరంలోకి వెళ్లి ప్రజలతో ఇలా అంది: 29 “ఒకాయన నేను చేసినవన్నీ చెప్పాడు, మీరు కూడా వచ్చి చూడండి. ఆయనే క్రీస్తు అయ్యుంటాడా?” 30 దాంతో వాళ్లు నగరం నుండి బయల్దేరి ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు.
31 ఈలోగా శిష్యులు, “రబ్బీ,+ భోంచేయి” అని ఆయన్ని వేడుకుంటూ ఉన్నారు. 32 అయితే ఆయన వాళ్లతో, “మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది” అన్నాడు. 33 అప్పుడు శిష్యులు, “ఆయన కోసం ఎవరు ఆహారం తెచ్చివుంటారు?” అని మాట్లాడుకున్నారు. 34 యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నన్ను పంపించిన వ్యక్తి ఇష్టాన్ని నెరవేర్చడం,+ ఆయనిచ్చిన పనిని పూర్తిచేయడమే నా ఆహారం.+ 35 పంట కోతకు రావడానికి ఇంకా నాలుగు నెలలు ఉందని మీరు చెప్తున్నారు కదా? ఇదిగో! నేను మీతో చెప్తున్నాను: మీ తలలెత్తి పొలాల్ని చూడండి, అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి.*+ 36 కోత కోసేవాడు ఇప్పటికే తన జీతం తీసుకుంటూ శాశ్వత జీవితం కోసం పంటను సమకూరుస్తున్నాడు. దానివల్ల విత్తేవాడు, కోసేవాడు కలిసి సంతోషిస్తారు.+ 37 ఈ విషయంలో, ‘విత్తేవాడు ఒకడు, కోసేవాడు ఒకడు’ అనే మాట నిజం. 38 మీరు కష్టపడని పంటను కోయడానికి మిమ్మల్ని పంపించాను. వేరేవాళ్లు కష్టపడ్డారు, మీరు వాళ్ల కష్టం నుండి ప్రయోజనం పొందారు.”
39 ఆ స్త్రీ, “నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు” అని ఇచ్చిన సాక్ష్యంవల్ల+ ఆ నగరంలోని చాలామంది సమరయులు ఆయనమీద విశ్వాసం ఉంచారు. 40 వాళ్లు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన్ని తమతోపాటు ఉండమని అడిగారు. ఆయన రెండురోజులు అక్కడే ఉన్నాడు. 41 దానివల్ల, ఆయన బోధించిన వాటిని విని ఇంకా చాలామంది నమ్మకం ఉంచారు. 42 వాళ్లు ఆ స్త్రీతో, “మేము ఇప్పటినుండి కేవలం నీ మాటల్ని బట్టే నమ్మట్లేదు; మేమే స్వయంగా ఆయన మాటలు విన్నాం, ఆయన నిజంగా లోక రక్షకుడని+ మాకు అర్థమైంది” అన్నారు.
43 ఆ రెండు రోజుల తర్వాత ఆయన అక్కడి నుండి గలిలయకు బయల్దేరాడు. 44 అయితే, ప్రవక్తకు తన సొంత దేశంలో గౌరవం ఉండదని యేసే స్వయంగా చెప్పాడు.+ 45 ఆయన గలిలయకు వచ్చినప్పుడు, అక్కడివాళ్లు ఆయన్ని స్వాగతించారు; ఎందుకంటే పండుగ సమయంలో ఆయన యెరూషలేములో చేసిన వాటన్నిటినీ వాళ్లు చూశారు.+ వాళ్లు కూడా ఆ పండుగకు వెళ్లారు.+
46 తర్వాత ఆయన మళ్లీ గలిలయలోని కానాకు వచ్చాడు, ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చింది అక్కడే.+ అప్పుడు కపెర్నహూములోని ఒక రాజసేవకుడి కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతను విని, యేసు దగ్గరికి వెళ్లి, తన కుమారుణ్ణి బాగుచేయడానికి కపెర్నహూముకు రమ్మని వేడుకున్నాడు. అతని కుమారుడు చావుబ్రతుకుల్లో ఉన్నాడు. 48 అయితే యేసు అతనితో, “సూచనలు, అద్భుతాలు చూస్తేనే గానీ మీరు అస్సలు నమ్మరు” అన్నాడు.+ 49 అప్పుడు రాజసేవకుడు, “ప్రభువా, మా అబ్బాయి చనిపోకముందే నాతో రా” అని యేసును వేడుకున్నాడు. 50 యేసు అతనితో, “వెళ్లు, మీ అబ్బాయి బాగయ్యాడు”+ అని చెప్పాడు. అతను యేసు చెప్పిన మాటను నమ్మి వెళ్లిపోయాడు. 51 అతను వెళ్తుండగా దారిలో అతని దాసులు ఎదురొచ్చి, మీ అబ్బాయి బాగయ్యాడని చెప్పారు. 52 అతను వాళ్లను ఎన్నింటికి బాగయ్యాడని అడిగాడు. వాళ్లు, “నిన్న దాదాపు మధ్యాహ్నం ఒంటిగంటకు* జ్వరం తగ్గిపోయింది” అని చెప్పారు. 53 “మీ అబ్బాయి బాగయ్యాడు” అని యేసు చెప్పింది సరిగ్గా అప్పుడే అని ఆ తండ్రికి అర్థమైంది.+ దాంతో అతను, అతని ఇంటివాళ్లందరూ విశ్వాసులయ్యారు. 54 ఇది, యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాక చేసిన రెండో అద్భుతం.+
5 ఆ తర్వాత, యూదుల పండుగ ఒకటి వచ్చింది,+ దాంతో యేసు యెరూషలేముకు వెళ్లాడు. 2 యెరూషలేములోని గొర్రెల ద్వారం+ దగ్గర ఒక కోనేరు ఉంది, హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలు ఉన్నాయి. 3 ఆ మంటపాల్లో రోగులు, గుడ్డివాళ్లు, కుంటివాళ్లు, కాళ్లూచేతులు చచ్చుబడినవాళ్లు* గుంపులుగుంపులుగా పడివున్నారు. 4 *—— 5 అయితే, 38 సంవత్సరాలుగా జబ్బుతో బాధపడుతున్న ఒక వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. 6 అతను అక్కడ పడుకొని ఉండడం యేసు చూశాడు. అతను చాలాకాలంగా జబ్బుతో బాధపడుతున్నాడని యేసుకు తెలుసు, కాబట్టి ఆయన, “నీకు బాగవ్వాలని ఉందా?” అని అతన్ని అడిగాడు.+ 7 అందుకు అతను, “అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించేవాళ్లు ఎవరూ లేరు, నేను వెళ్లేలోపు నాకన్నా ముందే ఎవరో ఒకరు అందులోకి దిగుతున్నారు” అన్నాడు. 8 యేసు అతనితో, “లేచి, నీ పరుపు* తీసుకొని నడువు” అన్నాడు.+ 9 అతను వెంటనే బాగయ్యి, తన పరుపు* తీసుకొని నడవడం మొదలుపెట్టాడు.
అది విశ్రాంతి రోజు.* 10 కాబట్టి కొంతమంది యూదులు అతనితో, “ఇవాళ విశ్రాంతి రోజు, నువ్వు పరుపు* మోయడం తప్పు” అని అంటూ ఉన్నారు.+ 11 దానికి అతను, “నన్ను బాగుచేసిన వ్యక్తే, ‘నీ పరుపు* తీసుకొని నడువు’ అని నాతో చెప్పాడు” అన్నాడు. 12 అప్పుడు వాళ్లు, “ ‘దీన్ని తీసుకొని నడువు’ అని నీతో చెప్పింది ఎవరు?” అని అడిగారు. 13 అయితే అతనికి తనను బాగుచేసింది ఎవరో తెలీదు, ఎందుకంటే యేసు ఆ చోటు నుండి వెళ్లిపోయి అక్కడున్న ప్రజల గుంపులో కలిసిపోయాడు.
14 తర్వాత యేసు అతన్ని ఆలయంలో చూసి, “ఇప్పుడు నువ్వు బాగయ్యావు. నీకు మరింత చెడు జరగకుండా ఇక మీదట పాపం చేయకు” అని అతనితో అన్నాడు. 15 అప్పుడు అతను వెళ్లి, తనను బాగుచేసింది యేసు అని యూదులతో చెప్పాడు. 16 కాబట్టి యూదులు యేసును హింసించడం మొదలుపెట్టారు. ఎందుకంటే యేసు విశ్రాంతి రోజున ఈ పనులు చేస్తున్నాడు. 17 అయితే యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నా తండ్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు, కాబట్టి నేను కూడా పనిచేస్తూ ఉన్నాను.”+ 18 అప్పటినుండి యూదులు యేసును చంపాలని ఇంకా ఎక్కువగా ప్రయత్నించారు. ఎందుకంటే యేసు విశ్రాంతి రోజును ఆచరించకపోగా, దేవుణ్ణి తన సొంత తండ్రి అని పిలుస్తూ+ తనను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని+ వాళ్లు అనుకున్నారు.
19 కాబట్టి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, కుమారుడు తనంతట తానే ఏ పనీ చేయలేడు, తండ్రి ఏ పనులు చేయడం కుమారుడు చూస్తాడో వాటినే కుమారుడు చేస్తాడు.+ తండ్రి చేసే పనులే కుమారుడు కూడా చేస్తాడు, ఆయనలాగే చేస్తాడు. 20 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు,*+ అలాగే తాను చేసే వాటన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు; అంతేకాదు మీరు ఆశ్చర్యంలో మునిగిపోయేలా, వీటికన్నా గొప్పవాటిని కూడా ఆయనకు చూపిస్తాడు.+ 21 తండ్రి ఎలాగైతే చనిపోయినవాళ్లను లేపి వాళ్లకు జీవాన్నిస్తాడో,+ అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టమైనవాళ్లకు జీవాన్నిస్తాడు.+ 22 తండ్రి ఏ ఒక్కరికీ తీర్పుతీర్చడు, అయితే తీర్పుతీర్చే పనంతటినీ ఆయన కుమారుడికి అప్పగించాడు.+ 23 తనను ఘనపర్చినట్టే అందరూ కుమారుణ్ణి కూడా ఘనపర్చాలని తండ్రి అలా చేశాడు. కుమారుణ్ణి ఘనపర్చనివాళ్లు ఆయన్ని పంపించిన తండ్రిని కూడా ఘనపర్చడం లేదు. 24 నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, నా మాటలు విని నన్ను పంపించిన తండ్రిమీద నమ్మకముంచే ప్రతీ వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు;+ అతనికి తీర్పు తీర్చబడదు, అతను మరణాన్ని దాటి జీవంలోకి వచ్చాడు.
25 “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, చనిపోయినవాళ్లు దేవుని కుమారుని స్వరం వినే ఒక సమయం రాబోతుంది, అది ఇప్పటికే వచ్చేసింది. ఆయన చెప్పేది శ్రద్ధగా విని, పాటించేవాళ్లు బ్రతుకుతారు. 26 జీవాన్నిచ్చే శక్తి తండ్రికి ఉంది;*+ అలాగే జీవాన్నిచ్చే* శక్తిని ఆయన కుమారుడికి కూడా ఇచ్చాడు.+ 27 అంతేకాదు ఆ కుమారుడు మానవ కుమారుడు+ కాబట్టి, తీర్పుతీర్చే అధికారాన్ని తండ్రి ఆయనకు ఇచ్చాడు.+ 28 దీనికి ఆశ్చర్యపోకండి. ఒక సమయం రాబోతుంది, అప్పుడు సమాధుల్లో* ఉన్న వాళ్లందరూ ఆయన స్వరం విని+ 29 బయటికి వస్తారు; మంచిపనులు చేసినవాళ్లు జీవించడానికి బ్రతికించబడతారు,* అలవాటుగా నీచమైన పనులు చేసినవాళ్లు తీర్పు పొందడానికి బ్రతికించబడతారు.+ 30 నా అంతట నేను ఏ పనీ చేయలేను. తండ్రి ఎలా చెప్తే అలా తీర్పు తీరుస్తాను; నా తీర్పు న్యాయమైనది,+ ఎందుకంటే నేను నా ఇష్టాన్ని కాదుగానీ నన్ను పంపించిన తండ్రి ఇష్టాన్నే చేయాలని కోరుకుంటున్నాను.+
31 “నా గురించి నేను ఒక్కడినే సాక్ష్యమిస్తే, నా సాక్ష్యం చెల్లదు.+ 32 అయితే నా గురించి సాక్ష్యమిచ్చే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన నా గురించి ఇచ్చే సాక్ష్యం నిజమని నాకు తెలుసు.+ 33 మీరు యోహాను దగ్గరికి మనుషుల్ని పంపించారు, అతను సత్యం గురించి సాక్ష్యమిచ్చాడు.+ 34 అయినా మనుషులు ఇచ్చే సాక్ష్యం నాకు అవసరం లేదు; అయితే మీరు రక్షించబడాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. 35 ఆ యోహాను మండుతూ, ప్రకాశించే దీపంలా ఉన్నాడు; కొంతకాలం మీరు అతని వెలుగులో సంతోషించడానికి ఇష్టపడ్డారు.+ 36 కానీ యోహాను ఇచ్చిన సాక్ష్యం కన్నా గొప్ప సాక్ష్యం నాకు ఉంది. తండ్రి నాకు నియమించిన పనులే, అంటే నేను చేస్తున్న ఈ పనులే తండ్రి నన్ను పంపించాడని సాక్ష్యం ఇస్తున్నాయి.+ 37 నన్ను పంపించిన తండ్రే స్వయంగా నా గురించి సాక్ష్యమిచ్చాడు.+ మీరు ఎప్పుడూ ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన రూపాన్ని చూడలేదు.+ 38 అంతేకాదు, ఆయన వాక్యం మీ హృదయాల్లో లేదు, ఎందుకంటే మీరు ఆయన పంపించిన వ్యక్తిని నమ్మట్లేదు.
39 “లేఖనాల వల్ల మీకు శాశ్వత జీవితం వస్తుందని మీరు వాటిని పరిశోధిస్తున్నారు.+ అయితే అవే* నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.+ 40 అయినా జీవం పొందేలా నా దగ్గరికి రావడం మీకు ఇష్టంలేదు.+ 41 మనుషులు ఇచ్చే మహిమ నాకు అవసరంలేదు. 42 మీకు దేవుని మీద ప్రేమ లేదని నాకు బాగా తెలుసు. 43 నేను నా తండ్రి పేరున వచ్చాను, కానీ మీరు నన్ను అంగీకరించరు. ఇంకెవరైనా తనంతట తానే వస్తే, అతన్ని మీరు అంగీకరిస్తారు. 44 మీరు ఏకైక దేవుడిచ్చే మహిమను కోరుకోకుండా మనుషులు ఇచ్చే మహిమను కోరుకుంటూ వాళ్లను మహిమపరుస్తూ ఉన్నారు; అలాంటప్పుడు మీరు నన్నెలా నమ్ముతారు?+ 45 తండ్రి దగ్గర నేను మిమ్మల్ని తప్పుపడతానని అనుకోకండి; మీరు ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ మోషేనే మిమ్మల్ని తప్పుపడుతున్నాడు.+ 46 నిజానికి మీరు మోషేని నమ్మి ఉంటే, నన్నూ నమ్మేవాళ్లు; ఎందుకంటే అతను నా గురించి రాశాడు.+ 47 అతను రాసినవాటినే మీరు నమ్మనప్పుడు, నేను చెప్పేవి ఎలా నమ్ముతారు?”
6 ఆ తర్వాత యేసు గలిలయ సముద్రం దాటి అవతలి వైపుకు వెళ్లాడు. ఆ సముద్రానికి తిబెరియ సముద్రం అనే పేరు కూడా ఉంది.+ 2 ఆయన అద్భుతాలు చేస్తూ రోగుల్ని బాగుచేయడం చూసి+ చాలామంది ప్రజలు ఆయన వెనక వెళ్తూ ఉన్నారు.+ 3 కాబట్టి యేసు, ఆయన శిష్యులు ఒక కొండ ఎక్కి అక్కడ కూర్చున్నారు. 4 యూదుల పస్కా పండుగ+ దగ్గర్లో ఉంది. 5 యేసు తల ఎత్తి, చాలామంది ప్రజలు తన దగ్గరికి రావడం చూసి ఫిలిప్పును, “వీళ్లు తినడానికి రొట్టెలు ఎక్కడ కొందాం?” అని అడిగాడు.+ 6 అయితే ఫిలిప్పును పరీక్షించడానికే యేసు అలా అడిగాడు, ఎందుకంటే తాను ఏమి చేయబోతున్నాడో యేసుకు తెలుసు. 7 దానికి ఫిలిప్పు, “వీళ్లలో ప్రతీ ఒక్కరికి కొంచెం ఇవ్వాలన్నా, రెండు వందల దేనారాల* రొట్టెలు కూడా సరిపోవు” అన్నాడు. 8 యేసు శిష్యుడూ సీమోను పేతురు సహోదరుడూ అయిన అంద్రెయ ఇలా అన్నాడు: 9 “ఇక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఐదు బార్లీ రొట్టెలు, రెండు చిన్నచేపలు ఉన్నాయి. అయితే ఇంతమందికి ఇవి ఎలా సరిపోతాయి?”+
10 అప్పుడు యేసు, “ప్రజల్ని కూర్చోమనండి” అని చెప్పాడు. అక్కడ చాలా గడ్డి ఉండడంతో వాళ్లు కూర్చున్నారు; వాళ్లలో దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు.+ 11 యేసు ఆ రొట్టెలు తీసుకొని, దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని అక్కడ కూర్చున్నవాళ్లకు పంచిపెట్టాడు; చేపల విషయంలో కూడా ఆయన అలాగే చేశాడు, ప్రజలు తృప్తిగా తిన్నారు. 12 ప్రజలు కడుపునిండా తిన్నాక యేసు తన శిష్యులతో, “మిగిలిన ముక్కలు పోగుచేయండి, ఏదీ వృథా కానివ్వకండి” అన్నాడు. 13 కాబట్టి ఆ ఐదు బార్లీ రొట్టెల నుండి ప్రజలు తిన్నాక మిగిలిన ముక్కల్ని శిష్యులు పోగుచేశారు. వాటితో 12 పెద్ద గంపల్ని నింపారు.
14 యేసు చేసిన ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు, “లోకంలోకి రావాల్సిన ప్రవక్త నిజంగా ఈయనే”+ అని అనడం మొదలుపెట్టారు. 15 వాళ్లు తన దగ్గరికి వచ్చి, తనను పట్టుకుని రాజుగా చేయబోతున్నారని తెలుసుకొని యేసు ఒక్కడే+ మళ్లీ కొండకు వెళ్లిపోయాడు.+
16 సాయంత్రమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం దగ్గరికి వెళ్లి,+ 17 పడవ ఎక్కి, సముద్రం అవతల ఉన్న కపెర్నహూముకు బయల్దేరారు. అప్పటికల్లా చీకటిపడింది, యేసు ఇంకా వాళ్ల దగ్గరికి రాలేదు.+ 18 పైగా, బలమైన గాలి వీస్తుండడం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది.+ 19 వాళ్లు దాదాపు మూడునాలుగు మైళ్లు* ప్రయాణించాక, యేసు ఆ సముద్రం మీద నడుస్తూ పడవ దగ్గరికి రావడం చూశారు. దాంతో వాళ్లు భయపడ్డారు. 20 అయితే ఆయన వాళ్లతో, “భయపడకండి, నేనే!” అన్నాడు.+ 21 వాళ్లు సంతోషంగా యేసును పడవలోకి ఎక్కించుకున్నారు. వెంటనే ఆ పడవ వాళ్లు వెళ్లాలనుకున్న ప్రాంతానికి చేరుకుంది.+
22 తర్వాతి రోజు, సముద్రం అవతలి వైపు ఉండిపోయిన ప్రజలు, అక్కడ ఏ పడవా లేకపోవడం గమనించారు. అక్కడ ఒక చిన్న పడవ ఉండేది కానీ శిష్యులు దానిలో వెళ్లిపోయారు, యేసు మాత్రం తన శిష్యులతోపాటు ఆ పడవ ఎక్కలేదు. 23 అయితే, ప్రభువు కృతజ్ఞతలు చెప్పిన తర్వాత తాము రొట్టెలు తిన్న ప్రాంతానికి తిబెరియ నుండి పడవలు వచ్చాయి. 24 యేసుగానీ ఆయన శిష్యులుగానీ అక్కడ లేకపోవడం చూసి, వాళ్లు ఆ పడవలు ఎక్కి యేసును వెతకడానికి కపెర్నహూముకు వచ్చారు.
25 సముద్రం అవతల యేసు వాళ్లకు కనిపించినప్పుడు, “రబ్బీ,+ ఇక్కడికి ఎప్పుడు వచ్చావు?” అని అడిగారు. 26 యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, మీరు అద్భుతాలు చూసినందువల్ల కాదుగానీ రొట్టెలు తిని తృప్తి పొందినందువల్లే నా కోసం వెదుకుతున్నారు.+ 27 పాడైపోయే ఆహారం కోసం కాకుండా, శాశ్వత జీవితాన్ని ఇచ్చే పాడవ్వని ఆహారం కోసం కష్టపడండి.+ మానవ కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు; ఎందుకంటే తండ్రైన దేవుడే స్వయంగా ఆయనపై తన ఆమోద ముద్ర వేశాడు.”+
28 అప్పుడు వాళ్లు, “దేవుని ఆమోదం పొందాలంటే మేము ఏంచేయాలి?” అని ఆయన్ని అడిగారు. 29 అందుకు యేసు వాళ్లతో, “మీరు దేవుని ఆమోదం పొందాలంటే, ఆయన పంపించిన వ్యక్తి మీద విశ్వాసం చూపించాలి” అన్నాడు.+ 30 అప్పుడు వాళ్లు ఆయనతో ఇలా అన్నారు: “మేము చూసి, నిన్ను నమ్మేలా నువ్వు ఏ అద్భుతం చేస్తావు?+ ఏ శక్తివంతమైన పని చేస్తావు? 31 మన పూర్వీకులు ఎడారిలో మన్నా తిన్నారు.+ ఎందుకంటే, ‘ఆయన పరలోకం* నుండి వాళ్లకు ఆహారం ఇచ్చాడు’ అని లేఖనాల్లో రాయబడివుంది.”+ 32 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. మోషే మీకు పరలోకం నుండి ఆహారం ఇవ్వలేదు, అయితే నా తండ్రి మీకు పరలోకం నుండి నిజమైన ఆహారం ఇస్తున్నాడు. 33 దేవుడిచ్చే ఆహారం పరలోకం నుండి వస్తుంది, లోకానికి జీవాన్నిస్తుంది.” 34 అప్పుడు వాళ్లు, “అయ్యా, మాకు ఎప్పుడూ ఆ ఆహారం ఇస్తూ ఉండు” అని అన్నారు.
35 యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాళ్లెవ్వరికీ అస్సలు ఆకలి వేయదు, నా మీద విశ్వాసం ఉంచే వాళ్లెవ్వరికీ అస్సలు దాహం వేయదు.+ 36 కానీ నేను మీతో చెప్పినట్టు, మీరు నన్ను చూసినా నా మీద నమ్మకం ఉంచట్లేదు. 37 తండ్రి నాకు ఇచ్చే వాళ్లందరూ నా దగ్గరికి వస్తారు, నా దగ్గరికి వచ్చేవాళ్లను నేను ఎప్పటికీ పంపించేయను.+ 38 ఎందుకంటే నేను నా సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి కాదుగానీ నన్ను పంపించిన వ్యక్తి ఇష్టాన్ని నెరవేర్చడానికే+ పరలోకం నుండి దిగివచ్చాను.+ 39 ఆయన నాకు ఇచ్చిన వాళ్లలో ఏ ఒక్కర్నీ నేను పోగొట్టుకోకూడదు అనేదే నా తండ్రి ఇష్టం. చివరి రోజున నేను వాళ్లందర్నీ తిరిగి బ్రతికించాలన్నదే*+ ఆయన ఇష్టం. 40 కుమారుణ్ణి అంగీకరించి, ఆయనమీద విశ్వాసం చూపించే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం.+ చివరి రోజున నేను అతన్ని తిరిగి బ్రతికిస్తాను.”+
41 “పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం నేనే”+ అని యేసు చెప్పినందుకు యూదులు ఆయనమీద సణుగుతూ, 42 “ఈయన యోసేపు కుమారుడైన యేసే కదా? ఈయన తల్లిదండ్రులు మనకు తెలిసినవాళ్లే కదా?+ మరి, ‘నేను పరలోకం నుండి దిగివచ్చాను’ అని ఈయన ఎలా అంటున్నాడు?” అని అన్నారు. 43 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “మీలో మీరు సణుక్కోకండి. 44 నన్ను పంపించిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఏ ఒక్కరూ నా దగ్గరికి రాలేరు.+ చివరి రోజున నేను అతన్ని తిరిగి బ్రతికిస్తాను.+ 45 ‘వాళ్లందరూ యెహోవా* చేత బోధించబడతారు’ అని ప్రవక్తలు రాశారు.+ తండ్రి చెప్పేది విని, ఆయన బోధను అంగీకరించిన ప్రతీ ఒక్కరు నా దగ్గరికి వస్తారు. 46 దేవుని దగ్గర నుండి వచ్చిన నేను తప్ప ఏ మనిషీ తండ్రిని చూడలేదు,+ నేను మాత్రమే ఆయన్ని చూశాను.+ 47 నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, నమ్మేవాళ్లు శాశ్వత జీవితం పొందుతారు.+
48 “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే.+ 49 మీ పూర్వీకులు ఎడారిలో మన్నా తిన్నా చనిపోయారు.+ 50 అయితే పరలోకం నుండి వచ్చే ఆహారం తినేవాళ్లెవ్వరూ చనిపోరు. 51 పరలోకం నుండి దిగివచ్చిన సజీవమైన ఆహారం నేనే. ఈ ఆహారాన్ని తినేవాళ్లు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు; నిజానికి లోకం జీవించేలా నేనిచ్చే ఆహారం నా శరీరమే.”+
52 అప్పుడు ఆ యూదులు, “ఈ మనిషి మనం తినడానికి తన శరీరాన్ని ఎలా ఇవ్వగలడు?” అని ఒకరితో ఒకరు వాదించుకున్నారు. 53 యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, మీరు మానవ కుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని తాగితే తప్ప జీవం పొందరు.*+ 54 నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని తాగే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందుతారు, చివరి రోజున నేను వాళ్లను తిరిగి బ్రతికిస్తాను.+ 55 ఎందుకంటే నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానీయం. 56 నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని తాగే వ్యక్తి నాతో ఐక్యంగా ఉంటాడు, నేను అతనితో ఐక్యంగా ఉంటాను.+ 57 సజీవుడైన దేవుడు నన్ను పంపించాడు, ఆయనవల్ల నేను జీవిస్తున్నాను; అదేవిధంగా నా శరీరాన్ని తినే వ్యక్తి నావల్ల జీవిస్తాడు.+ 58 పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. ఇది మీ పూర్వీకులు తిన్న ఆహారం లాంటిది కాదు, వాళ్లు దాన్ని తిన్నా చనిపోయారు. అయితే ఈ ఆహారాన్ని తినేవాళ్లు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు.”+ 59 యేసు కపెర్నహూములోని సమాజమందిరంలో* బోధిస్తున్నప్పుడు ఈ విషయాలు చెప్పాడు.
60 ఆ మాటలు విన్నప్పుడు ఆయన శిష్యుల్లో చాలామంది, “ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ఈ మాటలు ఎవరైనా వినగలరా?” అని చెప్పుకున్నారు. 61 తన శిష్యులు దీనిగురించి సణుక్కుంటున్నారని గ్రహించి యేసు వాళ్లను ఇలా అడిగాడు: “ఈ మాటలు మీకు కష్టంగా ఉన్నాయా? 62 మరి, మానవ కుమారుడు అంతకుముందున్న చోటికి+ ఎక్కివెళ్లడం చూస్తే మీరు ఏమంటారు? 63 జీవాన్ని ఇచ్చేది పవిత్రశక్తే;+ శరీరం వల్ల ఏ ఉపయోగమూ లేదు. నేను మీకు చెప్పిన మాటలు పవిత్రశక్తి వల్ల చెప్పాను, అవి జీవాన్ని ఇస్తాయి.+ 64 అయితే మీలో నమ్మనివాళ్లు కొంతమంది ఉన్నారు.” ఎవరు తనను నమ్మలేదో, ఎవరు తనకు నమ్మకద్రోహం చేస్తారో యేసుకు ముందునుండే తెలుసు,+ అందుకే అలా అన్నాడు. 65 ఆయన ఇంకా ఇలా అన్నాడు: “నా తండ్రి అనుమతిస్తే తప్ప ఎవ్వరూ నా దగ్గరికి రాలేరని+ అందుకే నేను మీతో చెప్పాను.”
66 దానివల్ల ఆయన శిష్యుల్లో చాలామంది ఆయన్ని అనుసరించడం మానేసి, తాము గతంలో చేసిన పనుల్ని చేసుకోవడానికి వెళ్లిపోయారు.+ 67 దాంతో యేసు పన్నెండుమంది అపొస్తలుల్ని,* “మీరు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నారా?” అని అడిగాడు. 68 అప్పుడు సీమోను పేతురు ఇలా అన్నాడు: “ప్రభువా, మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి?+ శాశ్వత జీవితాన్నిచ్చే మాటలు నీ దగ్గరే ఉన్నాయి.+ 69 నువ్వు దేవుని పవిత్రుడివని మేము నమ్మాం, తెలుసుకున్నాం.”+ 70 అప్పుడు యేసు వాళ్లతో, “మీ పన్నెండుమందిని ఎంచుకున్నది నేనే కదా,+ అయితే మీలో ఒకడు అపవాది* లాంటివాడు”+ అని అన్నాడు. 71 నిజానికి ఆయన, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా గురించి ఆ మాట అన్నాడు. అతను ఆ పన్నెండుమందిలో ఒకడైనప్పటికీ, ఆ తర్వాత యేసును అప్పగించాడు.+
7 తర్వాత, యేసు గలిలయలోనే తిరుగుతూ ప్రకటించాడు. యూదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తుండడం వల్ల ఆయన యూదయలో ప్రకటించడానికి ఇష్టపడలేదు.+ 2 అయితే, యూదుల గుడారాల* పండుగ+ దగ్గరపడింది. 3 కాబట్టి ఆయన తమ్ముళ్లు+ ఆయనతో ఇలా అన్నారు: “నువ్వు ఇక్కడి నుండి బయల్దేరి యూదయకు వెళ్లు, అప్పుడు నువ్వు చేస్తున్న పనుల్ని నీ శిష్యులు కూడా చూడగలుగుతారు. 4 అందరూ తనను తెలుసుకోవాలని కోరుకునే వ్యక్తి ఏ పనినీ రహస్యంగా చేయడు. నువ్వు ఈ పనులు చేస్తున్నావు కదా, నిన్ను నువ్వు లోకానికి చూపించుకో.” 5 నిజానికి ఆయన తమ్ముళ్లు ఆయనమీద విశ్వాసం ఉంచలేదు.+ 6 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నా సమయం ఇంకా రాలేదు,+ కానీ మీకైతే ఏ సమయమైనా సరైనదే. 7 లోకం మిమ్మల్ని ద్వేషించడానికి ఏ కారణమూ లేదు. అయితే లోకం నన్ను ద్వేషిస్తుంది, ఎందుకంటే దాని పనులు చెడ్డగా ఉన్నాయని నేను సాక్ష్యమిస్తున్నాను.+ 8 మీరు పండుగకి వెళ్లండి. నేను ఇప్పుడే రావట్లేదు, నా సమయం ఇంకా రాలేదు.”+ 9 ఆయన వాళ్లకు ఈ విషయాలు చెప్పిన తర్వాత గలిలయలోనే ఉండిపోయాడు.
10 అయితే ఆయన తమ్ముళ్లు పండుగకి వెళ్లిన తర్వాత, ఆయన కూడా రహస్యంగా పండుగకి వెళ్లాడు. 11 పండుగలో యూదులు, “ఆయన ఎక్కడున్నాడు?” అంటూ ఆయన కోసం వెదకడం మొదలుపెట్టారు. 12 చాలామంది ఆయన గురించి రహస్యంగా మాట్లాడుకున్నారు. కొంతమంది, “ఆయన మంచివాడు” అని అంటే ఇంకొంతమంది, “ఆయన మంచివాడు కాదు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు” అన్నారు.+ 13 అయితే యూదులకు భయపడి ఎవ్వరూ ఆయన గురించి బయటికి మాట్లాడేవాళ్లు కాదు.+
14 పండుగ సగం అయిపోయాక యేసు ఆలయంలోకి వెళ్లి బోధించడం మొదలుపెట్టాడు. 15 అప్పుడు యూదులు ఎంతో ఆశ్చర్యపోయి, “పాఠశాలల్లో* చదువుకోని ఈయనకు లేఖనాలు* ఇంత బాగా ఎలా తెలుసు?”+ అన్నారు.+ 16 దానికి యేసు ఇలా అన్నాడు: “నేను బోధించే బోధ నాది కాదు, నన్ను పంపిన వ్యక్తిదే.+ 17 ఎవరైనా దేవుని ఇష్టాన్ని చేయాలని కోరుకుంటే, నేను చేసే బోధ దేవుని నుండి వచ్చిందో, నా అంతట నేనే బోధిస్తున్నానో అతనికి తెలుస్తుంది.+ 18 సొంత ఆలోచనల్ని బోధించే ప్రతీ వ్యక్తి సొంత మహిమ కోసం చూసుకుంటాడు. అయితే తనను పంపిన వ్యక్తికి మహిమ తేవాలని కోరుకునే వ్యక్తి+ సత్యవంతుడు, అతనిలో ఏ అబద్ధమూ లేదు. 19 మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు+ కదా? కానీ మీలో ఒక్కరు కూడా దాన్ని పాటించట్లేదు. మీరెందుకు నన్ను చంపాలని చూస్తున్నారు?”+ 20 అప్పుడు ఆ ప్రజలు, “నీకు చెడ్డదూత* పట్టాడు. నిన్ను ఎవరు చంపాలని చూస్తున్నారు?” అన్నారు. 21 దానికి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను చేసిన* ఒక్క పనికి మీరందరూ ఆశ్చర్యపోతున్నారు. 22 దీని గురించి ఆలోచించండి: మోషే మీకు సున్నతి గురించిన నియమం ఇచ్చాడు+ (నిజానికి అది మోషే కాలంలో కాదు అతని పూర్వీకుల కాలంలోనే వచ్చింది).+ విశ్రాంతి రోజున మీరు ఒక వ్యక్తికి సున్నతి చేస్తారు. 23 మోషే ధర్మశాస్త్రాన్ని మీరకూడదని ఒక వ్యక్తి విశ్రాంతి రోజున సున్నతి పొందుతాడు కదా, అలాంటిది నేను విశ్రాంతి రోజున ఒక వ్యక్తిని పూర్తిగా బాగుచేశానని+ నామీద ఎందుకు కోపంతో మండిపడుతున్నారు? 24 పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి, న్యాయంగా తీర్పు తీర్చండి.”+
25 అప్పుడు కొంతమంది యెరూషలేము నివాసులు ఇలా చెప్పుకోవడం మొదలుపెట్టారు: “వాళ్లు చంపాలని చూస్తున్నది ఈయన్నే కదా?+ 26 అయినా చూడండి! ఈయన అందరిముందు మాట్లాడుతున్నా వాళ్లు ఈయన్ని ఏమీ అనట్లేదు. ఈయనే క్రీస్తు అని మన నాయకులకు నిజంగా తెలిసిపోయిందా ఏంటి? 27 ఈయన ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలుసు;+ అయితే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వస్తాడో ఎవరికీ తెలీదు.” 28 యేసు ఆలయంలో బోధిస్తూ బిగ్గరగా ఇలా అన్నాడు: “నేను ఎవర్నో, ఎక్కడి నుండి వచ్చానో మీకు తెలుసు. నా అంతట నేనే రాలేదు.+ నన్ను పంపిన వ్యక్తి నిజమైనవాడు,* ఆయన మీకు తెలీదు.+ 29 కానీ నాకు ఆయన తెలుసు,+ ఎందుకంటే నేను ఆయన దగ్గర నుండి* వచ్చాను; ఆయనే నన్ను పంపించాడు.” 30 అప్పుడు వాళ్లు ఆయన్ని పట్టుకోవాలని చూశారు,+ కానీ ఎవ్వరూ ఆయనమీద చెయ్యి వేయలేకపోయారు. ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు.+ 31 అయినా ప్రజల్లో చాలామంది ఆయనమీద విశ్వాసం ఉంచారు.+ వాళ్లు, “క్రీస్తు వచ్చినప్పుడు, ఈయన చేసిన అద్భుతాల కన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తాడా?” అని అనుకున్నారు.
32 ప్రజలు యేసు గురించి ఇలా రహస్యంగా మాట్లాడుకుంటున్నారని పరిసయ్యులు విన్నారు, దాంతో ముఖ్య యాజకులు, పరిసయ్యులు ఆయన్ని పట్టుకోవడానికి* భటుల్ని పంపించారు. 33 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నేను ఇంకా కొంతకాలమే మీతో ఉంటాను, తర్వాత నన్ను పంపిన తండ్రి దగ్గరికి వెళ్లిపోతాను.+ 34 మీరు నాకోసం వెదుకుతారు కానీ నన్ను కనుక్కోలేరు, నేను వెళ్లే చోటికి మీరు రాలేరు.”+ 35 దాంతో యూదులు తమలో తాము ఇలా అనుకున్నారు: “మనం కనుక్కోకుండా ఉండేలా ఈయన ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాడు? గ్రీకువాళ్ల మధ్య చెదిరిపోయిన యూదుల దగ్గరికి వెళ్లి గ్రీకువాళ్లకు ప్రకటించాలని అనుకుంటున్నాడా? 36 ‘మీరు నాకోసం వెదుకుతారు కానీ నన్ను కనుక్కోలేరు, నేను వెళ్లే చోటికి మీరు రాలేరు’ అని అనడంలో ఈయన ఉద్దేశం ఏంటి?”
37 పండుగలో చివరి రోజు మిగతా రోజులకన్నా చాలా ముఖ్యమైనది.+ ఆ రోజున యేసు నిలబడి బిగ్గరగా ఇలా అన్నాడు: “ఎవరికైనా దాహంగా ఉంటే, నా దగ్గరికి రావాలి. నేను అతనికి నీళ్లు ఇస్తాను.+ 38 ఎవరైనా నామీద విశ్వాసం ఉంచితే, లేఖనం చెప్తున్నట్టుగా ‘అతని హృదయంలో నుండి జీవజలాల ధారలు ప్రవహిస్తాయి.’ ”+ 39 అయితే, తనమీద విశ్వాసం ఉంచేవాళ్లు పొందబోతున్న పవిత్రశక్తి గురించి యేసు ఆ మాట చెప్పాడు. అప్పటికి వాళ్లు ఇంకా పవిత్రశక్తిని పొందలేదు,+ ఎందుకంటే యేసు ఇంకా మహిమపర్చబడలేదు.+ 40 ఆ మాటలు విన్నప్పుడు ప్రజల్లో కొంతమంది, “రావాల్సిన ఆ ప్రవక్త నిజంగా ఈయనే” అని అనడం మొదలుపెట్టారు.+ 41 కొంతమంది, “ఈయనే క్రీస్తు”+ అని అన్నారు. కానీ ఇంకొంతమంది ఇలా అన్నారు: “క్రీస్తు గలిలయ నుండి రాడు కదా?+ 42 క్రీస్తు దావీదు వంశంలో పుడతాడనీ,+ దావీదు ఊరైన బేత్లెహేము+ నుండే వస్తాడనీ లేఖనం చెప్పట్లేదా?” 43 దాంతో ఆయన గురించి ప్రజల్లో అభిప్రాయభేదం తలెత్తింది. 44 అయితే కొంతమంది ఆయన్ని పట్టుకోవాలని* అనుకున్నారు, కానీ ఎవ్వరూ ఆయనమీద చెయ్యి వేయలేకపోయారు.
45 ఆ భటులు ముఖ్య యాజకుల దగ్గరికి, పరిసయ్యుల దగ్గరికి తిరిగెళ్లినప్పుడు వాళ్లు, “మీరు ఆయన్ని ఎందుకు తీసుకురాలేదు?” అని అడిగారు. 46 దానికి ఆ భటులు, “ఇప్పటివరకు ఎవ్వరూ అలా మాట్లాడలేదు”+ అని చెప్పారు. 47 అప్పుడు పరిసయ్యులు వాళ్లతో ఇలా అన్నారు: “మీరు కూడా మోసపోయారా ఏంటి? 48 నాయకుల్లో, పరిసయ్యుల్లో ఒక్కరైనా ఆయనమీద విశ్వాసం ఉంచారా, లేదు కదా?+ 49 అయితే ధర్మశాస్త్రం తెలియని ఈ ప్రజలు శపించబడిన వాళ్లు.” 50 ఆ పరిసయ్యుల్లో, అంతకుముందు యేసు దగ్గరికి వచ్చిన నీకొదేము కూడా ఉన్నాడు. అతను వాళ్లతో ఇలా అన్నాడు: 51 “మన ధర్మశాస్త్రం ప్రకారం, ముందు ఒక వ్యక్తి చెప్పేది విని, అతను ఏంచేస్తున్నాడో తెలుసుకోకుండా అతనికి తీర్పు తీర్చలేం కదా?”+ 52 దానికి వాళ్లు అతనితో, “నువ్వు కూడా గలిలయ నుండే వచ్చావా ఏంటి? లేఖనాల్ని పరిశీలించి చూడు, గలిలయలో నుండి ఏ ప్రవక్తా రాడు” అన్నారు.*
8 12 అప్పుడు యేసు వాళ్లతో మళ్లీ ఇలా అన్నాడు: “నేను లోకానికి వెలుగును.+ నన్ను అనుసరించేవాళ్లు చీకట్లో నడవనే నడవరు, కానీ జీవాన్నిచ్చే వెలుగు+ వాళ్ల దగ్గర ఉంటుంది.” 13 అందుకు పరిసయ్యులు, “నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం చెల్లదు” అని ఆయనతో అన్నారు. 14 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకున్నా, నా సాక్ష్యం చెల్లుతుంది. ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు.+ మీకు మాత్రం నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు. 15 మీరు మనుషుల ఆలోచన* ప్రకారం తీర్పు తీరుస్తారు; నేను అసలు ఎవ్వరికీ తీర్పు తీర్చను. 16 ఒకవేళ నేను తీర్పు తీర్చినా, నా తీర్పు సరైనదే. ఎందుకంటే నేను ఒంటరిగా లేను, నన్ను పంపించిన తండ్రి నాకు తోడుగా ఉన్నాడు.+ 17 ‘ఇద్దరు మనుషుల సాక్ష్యం చెల్లుతుంది’ అని మీ ధర్మశాస్త్రంలో కూడా రాయబడివుంది కదా.+ 18 నా గురించి నేను సాక్ష్యమిస్తున్నాను, నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యమిస్తున్నాడు.”+ 19 అప్పుడు వాళ్లు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని ఆయన్ని అడిగారు. అందుకు యేసు ఇలా అన్నాడు: “మీకు నేను తెలీదు, నా తండ్రి తెలీదు.+ మీకు నేనెవరో తెలిసి ఉంటే, నా తండ్రి ఎవరో కూడా తెలిసుండేది.”+ 20 ఆయన ఆలయంలో బోధిస్తున్నప్పుడు, కానుకలు వేసే చోట ఆ మాటలు అన్నాడు.+ కానీ ఎవ్వరూ ఆయన్ని పట్టుకోలేదు, ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు.
21 ఆయన వాళ్లతో మళ్లీ ఇలా అన్నాడు: “నేను వెళ్లిపోతున్నాను, మీరు నాకోసం వెదుకుతారు; అయినా మీరు మీ పాపంలోనే చనిపోతారు.+ నేను వెళ్లే చోటికి మీరు రాలేరు.”+ 22 అప్పుడు యూదులు, “ ‘నేను వెళ్లే చోటికి మీరు రాలేరు’ అని అంటున్నాడు, ఆత్మహత్య చేసుకుంటాడా ఏంటి?” అని చెప్పుకున్నారు. 23 ఆయన వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు: “మీరు కింద నుండి వచ్చారు, నేను పై నుండి వచ్చాను.+ మీరు ఈ లోకం వాళ్లు, నేను ఈ లోకం వాణ్ణి కాదు. 24 అందుకే, మీరు మీ పాపంలోనే చనిపోతారని నేను అన్నాను. ఎందుకంటే, రావాల్సిన వాణ్ణి నేనే అని మీరు నమ్మకపోతే మీరు మీ పాపంలోనే చనిపోతారు.” 25 అప్పుడు వాళ్లు, “నువ్వు ఎవరు?” అని ఆయన్ని అడిగారు. అందుకు యేసు ఇలా అన్నాడు: “అసలు నేను ఇప్పటిదాకా మీతో ఎందుకు మాట్లాడుతున్నాను? 26 మీ గురించి మాట్లాడడానికి, తీర్పు తీర్చడానికి నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే, నన్ను పంపించిన వ్యక్తి సత్యవంతుడు. నేను ఆయన దగ్గర విన్న విషయాలే లోకంలో మాట్లాడుతున్నాను.”+ 27 ఆయన మాట్లాడుతున్నది తండ్రి గురించి అని వాళ్లకు అర్థం కాలేదు. 28 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “మీరు మానవ కుమారుణ్ణి కొయ్యకు వేలాడదీసిన తర్వాత+ నేనే ఆయన్ని అని,+ నా అంతట నేనే ఏమీ చేయనని మీరు తెలుసుకుంటారు.+ తండ్రి నాకు నేర్పించిన వాటినే నేను మాట్లాడుతున్నాను. 29 నన్ను పంపించిన వ్యక్తి నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎప్పుడూ ఆయనకు ఇష్టమైన పనులే చేస్తాను,+ కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు.” 30 ఆయన ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఆయన మీద విశ్వాసం ఉంచారు.
31 తన మీద నమ్మకం ఉంచిన యూదులతో యేసు ఇంకా ఇలా అన్నాడు: “మీరు ఎప్పుడూ నా బోధలు పాటిస్తూ ఉంటే,* మీరు నిజంగా నా శిష్యులు. 32 అంతేకాదు, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు,+ ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని* చేస్తుంది.”+ 33 అప్పుడు కొందరు ఇలా అన్నారు: “మేము అబ్రాహాము పిల్లలం, మేము ఎప్పుడూ ఎవ్వరికీ దాసులుగా ఉండలేదు. అలాంటప్పుడు నువ్వు, ‘మీరు స్వతంత్రులౌతారు’ అని ఎలా అంటున్నావు?” 34 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, పాపం చేసే ప్రతీ వ్యక్తి పాపానికి దాసుడు.+ 35 అంతేకాదు, దాసుడు తన యజమాని ఇంట్లో శాశ్వతంగా ఉండిపోడు; కుమారుడు మాత్రం ఉంటాడు. 36 కాబట్టి కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే, మీరు నిజంగా స్వతంత్రులౌతారు. 37 మీరు అబ్రాహాము పిల్లలని నాకు తెలుసు. అయినా మీరు నన్ను చంపాలని చూస్తున్నారు, ఎందుకంటే మీరు నా బోధల్ని అంగీకరించట్లేదు. 38 నేను నా తండ్రి దగ్గర చూసిన విషయాలే మాట్లాడుతున్నాను.+ కానీ మీరు మీ తండ్రి దగ్గర విన్నవాటిని చేస్తున్నారు.” 39 అందుకు వాళ్లు, “మా తండ్రి అబ్రాహాము” అన్నారు. అప్పుడు యేసు ఇలా అన్నాడు: “మీరు అబ్రాహాము పిల్లలైతే,+ అబ్రాహాము చేసిన పనులే చేస్తూ ఉండేవాళ్లు. 40 కానీ ఇప్పుడు మీరు, దేవుని దగ్గర విన్న సత్యాన్ని మీకు చెప్పిన నన్ను+ చంపాలని చూస్తున్నారు. అబ్రాహాము ఎప్పటికీ అలా చేసేవాడు కాదు. 41 మీరు మీ తండ్రి పనులే చేస్తున్నారు.” అప్పుడు వాళ్లు, “మేము అక్రమ సంతానం* కాదు. మాకు ఒక్కడే తండ్రి ఉన్నాడు, ఆయనే దేవుడు” అన్నారు.
42 యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “దేవుడే మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించేవాళ్లు.+ ఎందుకంటే నేను దేవుని దగ్గర నుండి వచ్చాను, ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. నా అంతట నేనే రాలేదు, ఆయనే నన్ను పంపించాడు.+ 43 మీకు నా బోధను అంగీకరించడం ఇష్టంలేదు, అందుకే నా మాటలు మీకు అర్థం కావట్లేదు. 44 మీ తండ్రి అపవాది. మీరు మీ తండ్రి కోరికల్నే నెరవేర్చాలని కోరుకుంటున్నారు.+ మొదటి నుండి అతను హంతకుడు.+ అతను సత్యంలో స్థిరంగా నిలబడలేదు, ఎందుకంటే అతనిలో సత్యం లేదు. అతను అబద్ధం చెప్పేటప్పుడు తన స్వభావం ప్రకారమే మాట్లాడతాడు; ఎందుకంటే అతను అబద్ధాలకోరు, అబద్ధానికి తండ్రి.+ 45 కానీ నేను నిజం మాట్లాడుతున్నాను, కాబట్టి మీరు నన్ను నమ్మట్లేదు. 46 నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం మాట్లాడుతుంటే మీరెందుకు నన్ను నమ్మట్లేదు? 47 దేవునికి చెందిన వ్యక్తి దేవుని మాటలు వింటాడు.+ కానీ మీరు దేవునికి చెందినవాళ్లు కాదు కాబట్టే నా మాటలు వినట్లేదు.”+
48 అప్పుడు యూదులు యేసుతో, “ ‘నువ్వు సమరయుడివి,+ నీకు చెడ్డదూత* పట్టాడు’+ అని మేము అన్న మాట నిజం కాదా?” అన్నారు. 49 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నాకు చెడ్డదూత పట్టలేదు కానీ నేను నా తండ్రిని ఘనపరుస్తున్నాను, మీరు నన్ను అవమానిస్తున్నారు. 50 నేను నాకు మహిమ రావాలని కోరుకోవట్లేదు;+ నాకు మహిమ రావాలని కోరుకునే వ్యక్తి వేరే ఉన్నాడు; తీర్పు తీర్చేది ఆయనే. 51 నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, ఎవరైనా నా మాటలు పాటిస్తే అతను ఎప్పటికీ చనిపోడు.”+ 52 అప్పుడు యూదులు ఆయనతో ఇలా అన్నారు: “నీకు చెడ్డదూత పట్టాడని మాకు ఇప్పుడు అర్థమైంది. అబ్రాహాము చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. నువ్వేమో, ‘ఎవరైనా నా మాటలు పాటిస్తే అతను ఎప్పటికీ చనిపోడు’ అంటున్నావు. 53 నువ్వు మా తండ్రైన అబ్రాహాము కన్నా గొప్పవాడివా? అతను చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. ఇంతకీ నువ్వు ఎవరు?” 54 దానికి యేసు ఇలా అన్నాడు: “నన్ను నేనే మహిమపర్చుకుంటే, నా మహిమకు అర్థంలేదు. నా తండ్రే నన్ను మహిమపరుస్తున్నాడు,+ ఆయన్నే మీరు మీ దేవుడని చెప్పుకుంటున్నారు. 55 అయినా మీరు ఆయన్ని తెలుసుకోలేదు,+ కానీ నాకు ఆయన తెలుసు.+ ఒకవేళ ఆయన నాకు తెలీదని నేను చెప్తే, మీలాగే నేను కూడా అబద్ధాలకోరును అవుతాను. కానీ ఆయన నాకు తెలుసు, ఆయన వాక్యాన్ని నేను పాటిస్తున్నాను. 56 మీ తండ్రి అబ్రాహాము నా రోజును చూస్తాననే ఆశతో చాలా సంతోషించాడు. అతను దాన్ని చూశాడు, సంతోషించాడు.”+ 57 అప్పుడు యూదులు ఆయనతో, “నీకు 50 ఏళ్లు కూడా లేవు, నువ్వు అబ్రాహామును చూశావా?” అన్నారు. 58 యేసు వాళ్లతో, “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, అబ్రాహాము పుట్టకముందే నేను ఉన్నాను”+ అన్నాడు. 59 దాంతో వాళ్లు ఆయన మీద విసరడానికి రాళ్లు తీసుకున్నారు. కానీ యేసు దాక్కొని, ఆలయంలో నుండి బయటికి వెళ్లిపోయాడు.
9 యేసు దారిలో వెళ్తున్నప్పుడు, పుట్టుకతోనే గుడ్డివాడైన ఒక వ్యక్తిని చూశాడు. 2 అప్పుడు శిష్యులు ఆయన్ని, “రబ్బీ,+ ఎవరు పాపం చేయడం వల్ల ఇతను గుడ్డివాడిగా పుట్టాడు? ఇతనా, ఇతని తల్లిదండ్రులా?” అని అడిగారు. 3 యేసు ఇలా జవాబిచ్చాడు: “ఇతను పాపం చేయడం వల్లో, ఇతని తల్లిదండ్రులు పాపం చేయడం వల్లో ఇతను గుడ్డివాడిగా పుట్టలేదు. కానీ ఇతని ద్వారా ప్రజలు దేవుని పనులు చూడగలిగేలా ఇది అవకాశం కల్పించింది.+ 4 మనం పగటిపూట నన్ను పంపించిన తండ్రి పనులు చేయాలి.+ రాత్రి రాబోతుంది, అప్పుడు ఎవ్వరూ పనిచేయలేరు. 5 నేను లోకంలో ఉన్నంతకాలం నేనే లోకానికి వెలుగును.”+ 6 యేసు ఈ మాటలు చెప్పాక, నేలమీద ఉమ్మి వేసి దానితో బురద చేసి, దాన్ని అతని కళ్ల మీద పూశాడు.+ 7 తర్వాత అతనితో, “వెళ్లి, సిలోయము (ఆ మాటను అనువదిస్తే, “పంపబడిన” అని అర్థం) కోనేరులో కడుక్కో” అని చెప్పాడు. అతను వెళ్లి కడుక్కొని చూపుతో తిరిగొచ్చాడు.+
8 అప్పుడు ఇరుగుపొరుగువాళ్లు, అంతకుముందు అతను అడుక్కోవడం చూసినవాళ్లు, “ఇతను అడుక్కునేవాడు కదా?” అని మాట్లాడుకున్నారు. 9 “అవును, అతనే” అని కొంతమంది, “అతను కాదు, అతనిలా ఉన్నాడంతే” అని ఇంకొంతమంది అన్నారు. అతను మాత్రం, “నేను అతన్నే” అని అంటూ ఉన్నాడు. 10 అప్పుడు వాళ్లు, “మరి నీకు చూపు ఎలా వచ్చింది?” అని అతన్ని అడిగారు. 11 దానికి అతను, “యేసు అనే ఒకాయన బురద చేసి, దాన్ని నా కళ్ల మీద పూసి, ‘సిలోయము దగ్గరికి వెళ్లి కడుక్కో’+ అని చెప్పాడు. నేను వెళ్లి కడుక్కున్నప్పుడు నాకు చూపు వచ్చింది” అని చెప్పాడు. 12 అప్పుడు వాళ్లు, “ఆయన ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. అతను, “నాకు తెలీదు” అని చెప్పాడు.
13 అంతకుముందు చూపులేని ఆ వ్యక్తిని వాళ్లు పరిసయ్యుల దగ్గరికి తీసుకెళ్లారు. 14 యేసు బురద చేసి అతనికి చూపు తెప్పించిన+ రోజు, అనుకోకుండా విశ్రాంతి రోజు.+ 15 దాంతో పరిసయ్యులు కూడా అతనికి చూపు ఎలా వచ్చిందని అడగడం మొదలుపెట్టారు. అప్పుడు అతను, “ఆయన నా కళ్ల మీద బురద పూశాడు. నేను కడుక్కున్నాను, చూడగలుగుతున్నాను” అని వాళ్లకు చెప్పాడు. 16 కొంతమంది పరిసయ్యులు, “ఈయన దేవుని దగ్గర నుండి వచ్చినవాడు కాదు, ఎందుకంటే ఈయన విశ్రాంతి రోజును పాటించట్లేదు”+ అన్నారు. ఇంకొంతమంది, “ఒక పాపి ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలడు?”+ అన్నారు. దాంతో వాళ్ల మధ్య అభిప్రాయభేదం తలెత్తింది.+ 17 వాళ్లు మళ్లీ ఆ గుడ్డివాణ్ణి, “ఆయన చూపు తెప్పించింది నీకే కదా, ఇంతకీ ఆయన గురించి నువ్వు ఏమంటావు?” అని అడిగారు. అతను, “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు.
18 అయితే ఆ యూదులు అతను ఒకప్పుడు గుడ్డివాడని, తర్వాత అతనికి చూపు వచ్చిందని నమ్మలేదు. కాబట్టి వాళ్లు అతని తల్లిదండ్రుల్ని పిలిపించి, 19 “ఇతను మీ అబ్బాయేనా? ఇతను పుట్టుకతోనే గుడ్డివాడా? మరి ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడు?” అని అడిగారు. 20 అప్పుడు అతని తల్లిదండ్రులు ఇలా చెప్పారు: “ఇతను మా అబ్బాయే, ఇతను పుట్టుకతోనే గుడ్డివాడు. 21 అయితే ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడో మాకు తెలీదు, ఇతనికి ఎవరు చూపు తెప్పించారో కూడా తెలీదు. ఇతన్నే అడగండి. ఇతను పెద్దవాడయ్యాడు, ఇతనే సమాధానం చెప్పుకుంటాడు.” 22 వాళ్లు యూదులకు భయపడి అలా చెప్పారు.+ ఎందుకంటే, ఎవరైనా యేసును క్రీస్తు అని ఒప్పుకుంటే అతన్ని సమాజమందిరం నుండి వెలివేయాలని+ యూదులు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. 23 అందుకే అతని తల్లిదండ్రులు, “ఇతను పెద్దవాడయ్యాడు, ఇతన్నే అడగండి” అన్నారు.
24 దాంతో యూదులు, అంతకుముందు గుడ్డివాడిగా ఉన్న అతన్ని మళ్లీ పిలిచి, “దేవుణ్ణి మహిమపర్చు; ఆ మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు” అన్నారు. 25 అప్పుడు అతను, “ఆయన పాపాత్ముడో కాదో నాకు తెలీదు. కానీ ఒక విషయం తెలుసు. ఒకప్పుడు నేను గుడ్డివాణ్ణి, ఇప్పుడు చూడగలుగుతున్నాను” అన్నాడు. 26 అప్పుడు వాళ్లు, “ఆయన నీకు ఏంచేశాడు? ఎలా చూపు తెప్పించాడు?” అని అడిగారు. 27 అతను, “నేను ఇంతకుముందే చెప్పాను, అయినా మీరు వినలేదు. మీరు మళ్లీ ఎందుకు వినాలనుకుంటున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా ఏంటి?” అని అన్నాడు. 28 దాంతో వాళ్లు అతన్ని చులకన చేసి మాట్లాడుతూ ఇలా అన్నారు: “నువ్వు ఆయన శిష్యుడివి. మేము మోషే శిష్యులం. 29 దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. అయితే ఈ మనిషి ఎక్కడి నుండి వచ్చాడో మాకు తెలీదు.” 30 అప్పుడు అతను ఇలా అన్నాడు: “ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన్ని ఎవరు పంపించారో మీకు తెలీదు, అయినా ఆయన నాకు చూపు తెప్పించాడు. 31 దేవుడు పాపుల ప్రార్థన వినడని+ మనకు తెలుసు. ఎవరైనా దేవునికి భయపడుతూ ఆయన ఇష్టాన్ని చేస్తే, అతని ప్రార్థన దేవుడు వింటాడు.+ 32 పుట్టుకతోనే గుడ్డివాడైన వ్యక్తికి ఎవరైనా చూపు తెప్పించినట్టు ప్రాచీనకాలం నుండి ఎప్పుడూ ఎవ్వరూ వినలేదు. 33 ఆయన దేవుని దగ్గర నుండి రాకపోయుంటే ఏమీ చేయలేడు.”+ 34 అప్పుడు వాళ్లు అతనితో, “నువ్వు పుట్టుకతోనే పాపివి, నువ్వు మాకు బోధిస్తున్నావా?” అంటూ అతన్ని గెంటేశారు.+
35 వాళ్లు అతన్ని గెంటేశారని యేసు విని, అతను కనిపించినప్పుడు, “నువ్వు మానవ కుమారుడి మీద విశ్వాసం ఉంచుతున్నావా?” అని అడిగాడు. 36 అప్పుడతను, “అయ్యా, నేను ఆయన మీద విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరో నాకు చెప్పు” అన్నాడు. 37 దానికి యేసు, “నువ్వు ఆయన్ని చూశావు, నిజానికి నీతో మాట్లాడుతున్నది ఆయనే” అన్నాడు. 38 అప్పుడతను, “ప్రభువా, నేను ఆయనమీద విశ్వాసం ఉంచుతున్నాను” అంటూ యేసుకు వంగి నమస్కారం చేశాడు. 39 అప్పుడు యేసు, “ఈ తీర్పు కోసమే, అంటే చూడలేనివాళ్లు చూడగలిగేలా,+ చూడగలిగేవాళ్లు గుడ్డివాళ్లయ్యేలా+ నేను ఈ లోకంలోకి వచ్చాను” అన్నాడు. 40 అక్కడున్న పరిసయ్యులు ఆ మాటలు విని, “మేము కూడా గుడ్డివాళ్లమా?” అని అన్నారు. 41 అందుకు యేసు, “మీరు గుడ్డివాళ్లు అయ్యుంటే, మీరు దోషులు కాకపోయేవాళ్లు. కానీ మీరు, ‘మేము చూస్తున్నాం’ అని చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం మీమీదే ఉంటుంది”+ అన్నాడు.
10 “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, గొర్రెల దొడ్డిలోకి ద్వారం నుండి రాకుండా వేరే మార్గంలో ఎక్కి వచ్చేవాడు దొంగ, దోచుకునేవాడు.+ 2 అయితే ద్వారం నుండి వచ్చేవాడు గొర్రెల కాపరి.+ 3 ద్వారపాలకుడు ఆయన కోసం తలుపు తెరుస్తాడు.+ గొర్రెలు ఆయన స్వరం వింటాయి.+ ఆయన తన సొంత గొర్రెల్ని పేరు పెట్టి పిలిచి, వాటిని బయటికి నడిపిస్తాడు. 4 తన గొర్రెలన్నిటినీ బయటికి తీసుకొచ్చాక, ఆయన వాటి ముందు నడుస్తాడు. అవి ఆయన స్వరాన్ని గుర్తుపడతాయి కాబట్టి ఆయన వెనక వెళ్తాయి. 5 అవి పరాయి వ్యక్తి వెనక అస్సలు వెళ్లవు కానీ అతని దగ్గర నుండి పారిపోతాయి. ఎందుకంటే పరాయివాళ్ల స్వరం వాటికి తెలీదు.” 6 యేసు చెప్పిన ఈ పోలిక ఆ యూదులకు అర్థం కాలేదు.
7 కాబట్టి యేసు మళ్లీ ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, గొర్రెలు వెళ్లే ద్వారాన్ని నేనే.+ 8 నా స్థానంలో వచ్చిన వాళ్లందరూ దొంగలు, దోచుకునేవాళ్లు; అయితే గొర్రెలు వాళ్ల మాట వినలేదు. 9 నేనే ద్వారాన్ని; నా ద్వారా ప్రవేశించేవాళ్లు రక్షించబడతారు. వాళ్లు లోపలికి వెళ్తూ, బయటికి వస్తూ ఉంటారు, వాళ్లకు ఆహారం దొరుకుతుంది.+ 10 దొంగ దొంగతనం చేయడానికి, చంపడానికి, నాశనం చేయడానికే వస్తాడు.+ అయితే గొర్రెలు జీవం పొందాలని, శాశ్వత జీవితం పొందాలని నేను వచ్చాను. 11 నేను మంచి కాపరిని;+ మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం పెడతాడు.+ 12 జీతగాడు కాపరి కాదు, గొర్రెలు అతనివి కావు, కాబట్టి తోడేలు రావడం చూసినప్పుడు అతను గొర్రెల్ని విడిచిపెట్టి పారిపోతాడు. (అప్పుడు తోడేలు వాటిని పట్టుకుని చెదరగొడుతుంది.) 13 అతను జీతగాడు కాబట్టి గొర్రెల గురించి పట్టించుకోడు. 14 నేను మంచి కాపరిని. తండ్రికి నేను, నాకు తండ్రి తెలిసినట్టే,+ 15 నా గొర్రెలు నాకు తెలుసు, నా గొర్రెలకు నేను తెలుసు;+ నేను గొర్రెల కోసం నా ప్రాణం పెడతాను.+
16 “అలాగే, ఈ దొడ్డివికాని వేరే గొర్రెలు నాకు ఉన్నాయి;+ వాటిని కూడా నేను తీసుకొని రావాలి, అవి నా స్వరాన్ని వింటాయి. అప్పుడు గొర్రెలన్నీ ఒకే కాపరి కింద ఒకే మంద అవుతాయి.+ 17 తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు,+ ఎందుకంటే నా ప్రాణాన్ని నేను మళ్లీ పొందేలా దాన్ని అర్పిస్తున్నాను.+ 18 ఎవరూ నా ప్రాణాన్ని నా నుండి తీసుకోలేరు, నా అంతట నేనే దాన్ని అర్పిస్తున్నాను. దాన్ని అర్పించే అధికారం నాకు ఉంది, మళ్లీ తీసుకునే అధికారం కూడా నాకు ఉంది.+ ఈ ఆజ్ఞను నేను నా తండ్రి నుండి పొందాను.”
19 ఈ మాటలవల్ల మళ్లీ యూదుల్లో అభిప్రాయభేదం తలెత్తింది.+ 20 వాళ్లలో చాలామంది, “ఇతనికి చెడ్డదూత* పట్టాడు, ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు ఎందుకు వింటున్నారు?” అని అన్నారు. 21 కొందరేమో, “ఇవి చెడ్డదూత పట్టిన మనిషి మాట్లాడే మాటలు కావు. చెడ్డదూత గుడ్డివాడికి చూపు తెప్పించలేడు కదా?” అన్నారు.
22 ఆ సమయంలో యెరూషలేములో సమర్పణ పండుగ జరుగుతోంది. అది చలికాలం. 23 యేసు, ఆలయంలోని సొలొమోను మంటపంలో+ నడుస్తున్నాడు. 24 అప్పుడు యూదులు ఆయన్ని చుట్టుముట్టి, “నువ్వు ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహాల మధ్య ఉంచుతావు? నువ్వే క్రీస్తువైతే, ఆ మాట మాతో స్పష్టంగా చెప్పు” అని అడగడం మొదలుపెట్టారు. 25 అందుకు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మీకు చెప్పాను, కానీ మీరు నమ్మట్లేదు. నా తండ్రి పేరున నేను చేసే పనులే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.+ 26 అయితే మీరు నా గొర్రెలు కాదు కాబట్టి నమ్మట్లేదు.+ 27 నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నాకు తెలుసు. అవి నన్ను అనుసరిస్తాయి.+ 28 వాటికి నేను శాశ్వత జీవితం ఇస్తాను,+ అవి ఏ విధంగానూ ఎప్పటికీ నాశనం కావు. ఎవ్వరూ నా చేతిలో నుండి వాటిని లాక్కోరు.+ 29 నా తండ్రి నాకు ఇచ్చిన ఆ గొర్రెలు మిగతా అన్నిటికంటే గొప్పవి. వాటిని తండ్రి చేతిలో నుండి ఎవ్వరూ లాక్కోలేరు.+ 30 నేను, తండ్రి ఒక్కటే.”*+
31 అప్పుడు యూదులు ఆయన్ని కొట్టడానికి మళ్లీ రాళ్లు తీసుకున్నారు. 32 కాబట్టి యేసు వాళ్లను, “తండ్రి నాకు చెప్పిన ఎన్నో మంచిపనుల్ని నేను మీకు చూపించాను. వాటిలో ఏ పనిని బట్టి మీరు నన్ను కొట్టాలనుకుంటున్నారు?” అని అడిగాడు. 33 అప్పుడు యూదులు, “మంచిపనుల్ని బట్టి కాదుగానీ, నువ్వు దేవుణ్ణి దూషించినందుకే నిన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నాం;+ నువ్వు మనిషివైనా దేవుణ్ణని చెప్పుకుంటున్నావు” అన్నారు. 34 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “మీ ధర్మశాస్త్రంలో, ‘ “మీరు దేవుళ్లు”*+ అని దేవుడు అన్నాడు’ అని రాయబడి ఉంది కదా? 35 దేవుని వాక్యం ఖండించేవాళ్లనే ఆయన ‘దేవుళ్లు’+ అని పిలిచినప్పుడు (దేవుని వాక్యం ఎప్పుడూ తప్పు కాదు), 36 తండ్రి పవిత్రపర్చి ఈ లోకంలోకి పంపించిన నేను, దేవుని కుమారుణ్ణని చెప్పుకున్నందుకు ‘నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావు’ అని అంటారా?+ 37 నేను నా తండ్రి పనుల్ని చేయకపోతుంటే నన్ను నమ్మకండి. 38 కానీ నేను వాటిని చేస్తుంటే, నన్ను నమ్మకపోయినా ఆ పనుల్ని నమ్మండి.+ అప్పుడు మీరు, తండ్రి నాతో ఐక్యంగా ఉన్నాడని, నేను తండ్రితో ఐక్యంగా ఉన్నానని గ్రహిస్తారు, స్పష్టంగా అర్థం చేసుకుంటారు.”+ 39 దాంతో వాళ్లు మళ్లీ ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఆయన వాళ్లకు దొరకకుండా వెళ్లిపోయాడు.
40 యేసు మళ్లీ, యొర్దాను అవతల యోహాను మొదట్లో బాప్తిస్మం ఇచ్చిన ప్రాంతానికి వెళ్లి,+ అక్కడ ఉండిపోయాడు. 41 చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్లు, “యోహాను ఒక్క అద్భుతం కూడా చేయలేదు, అయితే యోహాను ఈయన గురించి చెప్పినవన్నీ నిజం” అని చెప్పుకున్నారు.+ 42 అక్కడ చాలామంది ఆయనమీద విశ్వాసం ఉంచారు.
11 బేతనియలో లాజరు అనే ఒకతను ఉండేవాడు, అతనికి జబ్బు చేసింది; మరియ, ఆమె సహోదరి మార్త+ కూడా ఆ గ్రామంలోనే ఉండేవాళ్లు. 2 ప్రభువు పాదాల మీద అత్తరు పోసి, వాటిని తన తలవెంట్రుకలతో తుడిచింది ఈ మరియే;+ జబ్బుపడిన లాజరు ఆమె సహోదరుడు. 3 కాబట్టి అతని సహోదరీలు, “ప్రభువా, ఇదిగో! నువ్వు ప్రేమించే అతనికి జబ్బు చేసింది” అంటూ యేసుకు కబురు పంపించారు. 4 అయితే అది విన్నప్పుడు యేసు, “ఈ జబ్బు అతను చనిపోవడానికి రాలేదు, కానీ దేవుని మహిమ కోసం వచ్చింది.+ దాని ద్వారా దేవుని కుమారుడు మహిమపర్చబడడానికి వచ్చింది” అని అన్నాడు.
5 యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించాడు. 6 అయితే లాజరు జబ్బుపడ్డాడని విన్నప్పుడు యేసు ఇంకో రెండు రోజులు తానున్న చోటే ఉండిపోయాడు. 7 ఆ తర్వాత ఆయన తన శిష్యులతో, “మనం మళ్లీ యూదయకు వెళ్దాం” అన్నాడు. 8 శిష్యులు ఆయనతో, “రబ్బీ,+ ఈమధ్యే యూదయవాళ్లు నిన్ను రాళ్లతో కొట్టాలని చూశారు.+ నువ్వు మళ్లీ అక్కడికి వెళ్తావా?” అన్నారు. 9 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “పగలు 12 గంటలు ఉన్నాయి కదా?+ ఎవరైనా పగటిపూట నడిస్తే, వాళ్లు ఈ లోకపు వెలుగును చూస్తారు కాబట్టి దేనివల్లా తడబడరు. 10 కానీ ఎవరైనా రాత్రిపూట నడిస్తే, అతనిలో వెలుగు లేదు కాబట్టి అతను తడబడతాడు.”
11 ఈ విషయాలు చెప్పాక యేసు ఇంకా ఇలా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు,+ అతన్ని లేపడానికి వెళ్తున్నాను.” 12 అప్పుడు శిష్యులు ఆయనతో, “ప్రభువా, అతను నిద్రపోతుంటే బాగౌతాడు” అన్నారు. 13 నిజానికి యేసు లాజరు చనిపోయాడని చెప్తున్నాడు. కానీ వాళ్లేమో అతను నిద్రపోయి విశ్రాంతి తీసుకోవడం గురించి యేసు మాట్లాడుతున్నాడని అనుకున్నారు. 14 అప్పుడు యేసు వాళ్లతో స్పష్టంగా ఇలా చెప్పాడు: “లాజరు చనిపోయాడు,+ 15 అయితే నేను అక్కడ లేనందుకు సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను చేయబోయే పని మీ నమ్మకాన్ని బలపరుస్తుంది. మనం అతని దగ్గరికి వెళ్దాం పదండి.” 16 అప్పుడు, దిదుమ అని పిలవబడిన తోమా తన తోటి శిష్యులతో, “మనం కూడా వెళ్దాం, ఆయనతో పాటు చనిపోదాం” అని అన్నాడు.+
17 యేసు బేతనియకు చేరుకున్నప్పుడు, లాజరు అప్పటికే నాలుగు రోజులుగా సమాధిలో* ఉన్నాడని తెలుసుకున్నాడు. 18 బేతనియ యెరూషలేముకు దాదాపు రెండు మైళ్ల* దూరంలో ఉంది. 19 తమ సహోదరుణ్ణి పోగొట్టుకున్న మార్తను, మరియను ఓదార్చడానికి చాలామంది యూదులు వాళ్ల దగ్గరికి వచ్చారు. 20 యేసు వస్తున్నాడని విన్నప్పుడు మార్త ఆయన్ని కలుసుకోవడానికి వెళ్లింది, మరియ+ మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. 21 మార్త యేసుతో ఇలా అంది: “ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండివుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. 22 ఇప్పటికీ నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా ఆయన నీకు ఇస్తాడని నాకు నమ్మకం ఉంది.” 23 అప్పుడు యేసు ఆమెతో, “నీ సహోదరుడు లేస్తాడు” అన్నాడు. 24 అందుకు మార్త, “చివరి రోజున, చనిపోయినవాళ్లు బ్రతికించబడినప్పుడు* అతను లేస్తాడని నాకు తెలుసు” అంది.+ 25 అప్పుడు యేసు ఆమెతో ఇలా అన్నాడు: “చనిపోయినవాళ్లను బ్రతికించేది, జీవాన్ని ఇచ్చేది నేనే.*+ నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి చనిపోయినా మళ్లీ బ్రతుకుతాడు; 26 అంతేకాదు, ఇప్పుడు జీవిస్తూ నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి ఎప్పటికీ చనిపోడు.+ నువ్వు దీన్ని నమ్ముతున్నావా?” 27 అందుకు ఆమె, “అవును ప్రభువా, నువ్వు దేవుని కుమారుడివైన క్రీస్తువు అని, లోకంలోకి రావాల్సిన వ్యక్తివి అని నేను నమ్ముతున్నాను” అంది. 28 ఆమె ఈ మాటలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆమె తన సహోదరి మరియను పక్కకు పిలిచి, “బోధకుడు+ వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు” అంది. 29 మరియ ఆ మాట వినగానే వెంటనే లేచి, ఆయన దగ్గరికి వెళ్లింది.
30 యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు, మార్త ఆయన్ని కలిసిన చోటే ఉన్నాడు. 31 ఆ సమయంలో కొంతమంది యూదులు మరియను ఓదార్చడానికి ఆమె ఇంట్లో ఉన్నారు. ఆమె వెంటనే లేచి బయటికి వెళ్లడం చూసి వాళ్లు, ఆమె ఏడవడానికి సమాధి*+ దగ్గరికి వెళ్తోందని అనుకుని ఆమె వెనకే వెళ్లారు. 32 మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన్ని చూడగానే ఆయన పాదాల మీద పడి, “ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండివుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు” అని అంది. 33 ఆమె ఏడుస్తూ ఉండడం, ఆమెతోపాటు వచ్చిన యూదులు ఏడుస్తూ ఉండడం చూసినప్పుడు యేసు లోలోపల మూలిగాడు, చాలా బాధపడ్డాడు. 34 ఆయన, “మీరు అతన్ని ఎక్కడ ఉంచారు?” అని అడిగాడు. అందుకు వాళ్లు, “ప్రభువా, వచ్చి చూడు” అన్నారు. 35 యేసు కన్నీళ్లు పెట్టుకున్నాడు.+ 36 అది చూసి యూదులు, “ఈయన అతన్ని ఎంతగా ప్రేమించాడో చూడండి” అని చెప్పుకున్నారు. 37 కానీ వాళ్లలో కొంతమంది, “గుడ్డివాడికి చూపు తెప్పించిన ఈయన+ అతన్ని చనిపోకుండా ఆపలేకపోయేవాడా?” అన్నారు.
38 అప్పుడు యేసు మళ్లీ లోలోపల మూలిగి, సమాధి* దగ్గరికి వచ్చాడు. నిజానికి అది ఒక గుహ. దానికి అడ్డంగా ఒక రాయి పెట్టబడి ఉంది. 39 యేసు, “ఆ రాయిని తీసేయండి” అని చెప్పాడు. చనిపోయిన వ్యక్తి సహోదరి మార్త యేసుతో, “ప్రభువా, అతను చనిపోయి నాలుగు రోజులైంది, ఇప్పటికి శరీరం వాసన వస్తుంటుంది” అని అంది. 40 అప్పుడు యేసు ఆమెతో, “నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని+ నేను నీకు చెప్పలేదా?” అన్నాడు. 41 దాంతో వాళ్లు ఆ రాయిని తీసేశారు. అప్పుడు యేసు ఆకాశం వైపు చూసి+ ఇలా అన్నాడు: “తండ్రీ, నువ్వు నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు. 42 నువ్వు నా ప్రార్థనను ఎప్పుడూ వింటావని నాకు తెలుసు; అయితే నా చుట్టూ ఉన్న ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మేలా+ వాళ్ల గురించే నేను ఈ మాట అన్నాను.” 43 ఆయన ఈ మాటలు అన్న తర్వాత, “లాజరూ, బయటికి రా!” అని బిగ్గరగా పిలిచాడు.+ 44 దాంతో చనిపోయిన వ్యక్తి బయటికి వచ్చాడు. అతని కాళ్లకు, చేతులకు వస్త్రాలు చుట్టివున్నాయి, అతని ముఖానికి గుడ్డ చుట్టివుంది. యేసు వాళ్లతో, “అతని కట్లు విప్పి, అతన్ని వెళ్లనివ్వండి” అన్నాడు.
45 కాబట్టి, మరియ దగ్గరికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసిన పనిని చూసి ఆయనమీద విశ్వాసం ఉంచారు.+ 46 కొంతమంది మాత్రం పరిసయ్యుల దగ్గరికి వెళ్లి యేసు చేసినదాని గురించి వాళ్లకు చెప్పారు. 47 అప్పుడు ముఖ్య యాజకులు, పరిసయ్యులు మహాసభను సమావేశపర్చి ఇలా అన్నారు: “మనం ఏంచేద్దాం? ఈ మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు.+ 48 ఆయన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఆయనమీద విశ్వాసం ఉంచుతారు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలాన్ని,* మన దేశాన్ని లాక్కుంటారు.” 49 వాళ్లలో ఆ సంవత్సరం ప్రధానయాజకుడిగా ఉన్న కయప+ కూడా ఉన్నాడు. అతను వాళ్లతో ఇలా అన్నాడు: “మీకు అసలేమీ తెలీదు, 50 దేశమంతా నాశనం కావడం కన్నా, అందరి కోసం ఒక మనిషి చనిపోవడం మీకు మంచిదని అనిపించట్లేదా?” 51 అతను తనంతట తాను ఈ మాట చెప్పలేదు గానీ, ఆ సంవత్సరం అతను ప్రధానయాజకుడిగా ఉన్నాడు కాబట్టి, యేసు తన ప్రజల కోసం చనిపోవాల్సి ఉందని ప్రవచించాడు. 52 తన ప్రజల కోసమే కాదు, చెదిరివున్న దేవుని పిల్లల్ని ఒకటిగా సమకూర్చడానికి కూడా ఆయన చనిపోవాల్సి ఉందని అతను ప్రవచించాడు. 53 ఆ రోజు నుండి వాళ్లు ఆయన్ని చంపడానికి కుట్ర పన్నుతూ ఉన్నారు.
54 అందుకే యేసు అప్పటినుండి యూదుల మధ్య బహిరంగంగా తిరగడం మానేశాడు. ఆయన అక్కడి నుండి ఎడారికి దగ్గర్లో ఉన్న ఎఫ్రాయిము+ అనే నగరానికి వెళ్లి, తన శిష్యులతో పాటు అక్కడే ఉన్నాడు. 55 యూదుల పస్కా పండుగ+ దగ్గరపడింది. కాబట్టి, దేశమంతటా ఉన్న చాలామంది ప్రజలు ఆచార ప్రకారం శుద్ధి చేసుకోవడానికి పస్కా పండుగకు ముందే యెరూషలేముకు వెళ్లారు. 56 వాళ్లు అక్కడ యేసు కోసం వెతుకుతూ, ఆలయంలో నిలబడి, “మీకు ఏమనిపిస్తుంది? ఆయన పండుగకు అసలు రాడా?” అని మాట్లాడుకున్నారు. 57 అయితే ముఖ్య యాజకులు, పరిసయ్యులు యేసును పట్టుకోవడం* కోసం, ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిస్తే చెప్పాలని ఆదేశాలు ఇచ్చారు.
12 పస్కా పండుగకు ఆరు రోజుల ముందు యేసు బేతనియకు వచ్చాడు, మృతుల్లో నుండి యేసు బ్రతికించిన లాజరు+ అక్కడే ఉన్నాడు. 2 వాళ్లు సాయంకాలం యేసు కోసం ఒక విందు ఏర్పాటు చేశారు. మార్త వాళ్లకు వడ్డిస్తూ ఉంది.+ అయితే, ఆయనతోపాటు భోజనం బల్ల దగ్గర కూర్చున్న వాళ్లలో లాజరు కూడా ఉన్నాడు. 3 అప్పుడు మరియ చాలా ఖరీదైన అసలుసిసలు జటామాంసి* పరిమళ తైలం దాదాపు 300 గ్రాములు* తీసుకొని, యేసు పాదాల మీద పోసి తన తలవెంట్రుకలతో వాటిని తుడిచింది. దాంతో ఆ ఇల్లంతా పరిమళ తైలం వాసనతో నిండిపోయింది.+ 4 కానీ ఆయన శిష్యుల్లో ఒకడు, ఆయనకు నమ్మకద్రోహం చేయబోతున్నవాడు అయిన ఇస్కరియోతు యూదా+ ఇలా అన్నాడు: 5 “ఈ పరిమళ తైలాన్ని 300 దేనారాలకు* అమ్మి ఎందుకు పేదవాళ్లకు ఇవ్వలేదు?” 6 అతను పేదవాళ్ల మీద శ్రద్ధతో అలా అనలేదు కానీ అతను ఒక దొంగ, డబ్బు పెట్టె అతని దగ్గరే ఉండేది, అతను దానిలో వేసిన డబ్బును దొంగతనం చేసేవాడు కాబట్టే అలా అన్నాడు. 7 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “ఆమెను ఏమనకండి. నన్ను సమాధి చేసే రోజు కోసం నా శరీరాన్ని సిద్ధం చేయడానికి ఆమెను ఈ ఆచారాన్ని చేయనివ్వండి.+ 8 పేదవాళ్లు ఎప్పుడూ మీతోనే ఉంటారు.+ కానీ నేను ఎప్పుడూ మీతో ఉండను.”+
9 ఈలోగా, యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకొని చాలామంది యూదులు అక్కడికి వచ్చారు. వాళ్లు యేసును, అలాగే మృతుల్లో నుండి ఆయన బ్రతికించిన లాజరును చూడడానికి వచ్చారు. 10 అప్పుడు ముఖ్య యాజకులు లాజరును కూడా చంపడానికి కుట్రపన్నారు. 11 ఎందుకంటే, అతని వల్లే చాలామంది యూదులు అక్కడికి వెళ్తున్నారు, యేసుమీద విశ్వాసం ఉంచుతున్నారు.
12 తర్వాతి రోజు, యేసు యెరూషలేముకు వస్తున్నాడని పండుగ కోసం వచ్చిన చాలామంది ప్రజలకు తెలిసింది. 13 అందుకే వాళ్లు ఖర్జూర మట్టలు తీసుకొని ఆయన్ని కలవడానికి వెళ్లారు. వాళ్లు, “దేవా, ఈయన్ని కాపాడు! యెహోవా* పేరున వస్తున్న ఈయన దీవించబడాలి!+ ఇశ్రాయేలు రాజు దీవించబడాలి!”+ అని కేకలు వేయడం మొదలుపెట్టారు. 14 యేసుకు ఒక చిన్న గాడిద కనిపించినప్పుడు, ఆయన దానిమీద కూర్చున్నాడు.+ ఎందుకంటే ఇలా రాయబడి ఉంది: 15 “సీయోను కూతురా, భయపడకు. ఇదిగో! నీ రాజు గాడిదపిల్ల మీద కూర్చొని వస్తున్నాడు.”+ 16 ఈ విషయాలు ఆయన శిష్యులకు మొదట్లో అర్థం కాలేదు. కానీ యేసు మహిమపర్చబడినప్పుడు,+ ఆయన గురించి రాయబడినట్టే ఆ విషయాలు జరిగాయని వాళ్లు గుర్తుచేసుకున్నారు.+
17 యేసు లాజరును సమాధి* నుండి బయటికి రమ్మని పిలవడం, అతన్ని మృతుల్లో నుండి బ్రతికించడం చూసిన ప్రజలు జరిగినదాని గురించి అందరికీ చెప్తూ ఉన్నారు.+ 18 ఆయన ఈ అద్భుతం చేశాడని వినడం వల్ల కూడా చాలామంది ఆయన్ని కలవడానికి వెళ్లారు. 19 అప్పుడు పరిసయ్యులు ఇలా మాట్లాడుకున్నారు: “చూస్తున్నారా, మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఇదిగో! లోకమంతా ఆయన వెంట వెళ్లింది.”+
20 ఆ పండుగలో ఆరాధించడానికి వచ్చినవాళ్లలో కొంతమంది గ్రీకువాళ్లు కూడా ఉన్నారు. 21 వాళ్లు గలిలయలోని బేత్సయిదాకు చెందిన ఫిలిప్పు దగ్గరికి వచ్చి,+ “అయ్యా, మేము యేసును చూడాలనుకుంటున్నాం” అని అడిగారు. 22 ఫిలిప్పు వెళ్లి అంద్రెయతో ఆ విషయం చెప్పాడు. తర్వాత వాళ్లిద్దరు వచ్చి యేసుకు చెప్పారు.
23 అయితే యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడు మహిమపర్చబడే సమయం వచ్చేసింది.+ 24 నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, గోధుమ గింజ నేలమీద పడి చనిపోకపోతే అది ఒక్క గింజగానే ఉండిపోతుంది; కానీ అది చనిపోతే+ ఎంతగానో ఫలిస్తుంది. 25 తన ప్రాణాన్ని ప్రేమించే వ్యక్తి దాన్ని కోల్పోతాడు,* కానీ ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించే* వ్యక్తి+ శాశ్వత జీవితం కోసం దాన్ని కాపాడుకుంటాడు.+ 26 ఎవరైనా నాకు సేవకుడిగా ఉండాలనుకుంటే అతను నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు.+ ఎవరైనా నాకు సేవచేస్తే తండ్రి అతన్ని ఘనపరుస్తాడు. 27 ఇప్పుడు నాకు ఆందోళనగా ఉంది,+ నేను ఏమనాలి? తండ్రీ, జరగబోయేదాని నుండి* నన్ను కాపాడు.+ అయినా, దీని కోసమే నేను వచ్చాను. 28 తండ్రీ, నీ పేరును మహిమపర్చు.” అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం+ ఇలా వినిపించింది: “నేను దాన్ని మహిమపర్చాను, మళ్లీ మహిమపరుస్తాను.”+
29 అక్కడ నిలబడి ఉన్న ప్రజలు అది విని, ఉరిమిందని అనడం మొదలుపెట్టారు. ఇంకొందరు, “దేవదూత ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు. 30 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “ఈ స్వరం వచ్చింది నా కోసం కాదు, మీ కోసమే. 31 ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతోంది. ఈ లోక పరిపాలకుడు+ బయటికి తోసేయబడతాడు.+ 32 అయితే నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు*+ అన్నిరకాల ప్రజల్ని నావైపుకు ఆకర్షించుకుంటాను.” 33 నిజానికి తాను ఏ విధంగా చనిపోబోతున్నాడో+ చెప్పడానికి ఆయన ఆ మాట అన్నాడు. 34 అప్పుడు ఆ ప్రజలు ఆయనతో, “క్రీస్తు ఎప్పటికీ ఉంటాడని మేము ధర్మశాస్త్రం నుండి విన్నాం.+ అలాంటప్పుడు మానవ కుమారుడు పైకి ఎత్తబడాలని నువ్వెలా చెప్తున్నావు?+ ఇంతకీ ఈ మానవ కుమారుడు ఎవరు?” అని అన్నారు. 35 కాబట్టి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ఇంక కొంతకాలమే వెలుగు మీ మధ్య ఉంటుంది. చీకటి మిమ్మల్ని కమ్ముకోకుండా ఉండేలా వెలుగు ఉండగానే దానిలో నడవండి; చీకట్లో నడిచే వ్యక్తికి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. 36 మీరు వెలుగు పుత్రులు అయ్యేలా+ వెలుగు ఉండగానే వెలుగు మీద విశ్వాసం చూపించండి.”
యేసు ఈ మాటలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయి వాళ్లకు కనిపించకుండా దాక్కున్నాడు. 37 ఆయన వాళ్ల ముందు చాలా అద్భుతాలు చేసినా, వాళ్లు ఆయనమీద విశ్వాసం ఉంచలేదు. 38 దానివల్ల యెషయా ప్రవక్త చెప్పిన ఈ మాట నెరవేరింది: “యెహోవా,* మేము మాట్లాడిన* దానిమీద ఎవరు విశ్వాసం ఉంచారు?+ యెహోవా* బాహువు ఎవరికి వెల్లడైంది?”+ 39 వాళ్లు నమ్మకపోవడానికి గల కారణాన్ని కూడా యెషయా ఇలా వివరించాడు: 40 “వాళ్లు కళ్లతో చూసి, హృదయంతో అర్థం చేసుకొని ఆయనవైపు తిరిగి ఆయన చేత బాగుచేయబడకుండా ఉండేలా ఆయన వాళ్ల కళ్లకు గుడ్డితనం కలిగించాడు, వాళ్ల హృదయాల్ని కఠినం చేశాడు.”+ 41 యెషయా ఆయన* మహిమను చూశాడు, కాబట్టి ఆయన గురించి ఆ మాటలు అన్నాడు.+ 42 నిజానికి యూదుల నాయకుల్లో కూడా చాలామంది ఆయనమీద విశ్వాసముంచారు,+ కానీ సమాజమందిరం నుండి వెలివేయబడతామేమో అని పరిసయ్యులకు భయపడి ఆ విషయాన్ని ఒప్పుకోలేదు.+ 43 ఎందుకంటే, వాళ్లు దేవుని ఆమోదం* కన్నా మనుషుల ఆమోదాన్నే ఎక్కువగా ఇష్టపడ్డారు.+
44 అయితే యేసు బిగ్గరగా ఇలా అన్నాడు: “నామీద విశ్వాసముంచే వ్యక్తి నామీదే కాదు, నన్ను పంపించిన వ్యక్తి మీద కూడా విశ్వాసం ఉంచుతున్నాడు;+ 45 నన్ను చూసే వ్యక్తి నన్ను పంపించిన వ్యక్తిని కూడా చూస్తున్నాడు.+ 46 నామీద విశ్వాసముంచే ఏ వ్యక్తీ చీకట్లో ఉండిపోకూడదని+ నేను లోకానికి వెలుగుగా వచ్చాను.+ 47 అయితే, ఎవరైనా నా మాటలు విని వాటిని పాటించకపోతే నేను అతనికి తీర్పుతీర్చను; ఎందుకంటే నేను లోకానికి తీర్పుతీర్చడానికి రాలేదు కానీ లోకాన్ని రక్షించడానికే వచ్చాను.+ 48 నన్ను గౌరవించని, నా మాటలు స్వీకరించని వాళ్లకు తీర్పు తీర్చేది ఒకటి ఉంది. నేను మాట్లాడిన మాటే చివరి రోజున వాళ్లకు తీర్పు తీరుస్తుంది. 49 నేను ఏదీ నా సొంతగా మాట్లాడలేదు. నేను ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపించిన తండ్రే నాకు ఆజ్ఞాపించాడు.+ 50 ఆయన ఆజ్ఞ శాశ్వత జీవితానికి నడిపిస్తుందని నాకు తెలుసు.+ కాబట్టి, నేను ఏం మాట్లాడినా తండ్రి నాకు చెప్పినట్టే మాట్లాడతాను.”+
13 తాను ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్లే సమయం వచ్చిందని+ యేసుకు పస్కా పండుగకు ముందే తెలుసు,+ ఆయన లోకంలో ఉన్న తనవాళ్లను ప్రేమించాడు, కాబట్టి చివరి వరకూ వాళ్లను ప్రేమిస్తూనే ఉన్నాడు.+ 2 వాళ్లు సాయంకాలం భోజనం చేస్తున్నారు, అప్పటికే అపవాది యేసును అప్పగించాలనే ఆలోచనను సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా హృదయంలో నాటాడు.+ 3 తండ్రి అన్నిటినీ తన చేతుల్లో పెట్టాడని, తాను దేవుని దగ్గర నుండి వచ్చానని, తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్నానని యేసుకు తెలుసు+ కాబట్టి, 4 ఆయన భోజనం బల్ల దగ్గర నుండి లేచి, తన పైవస్త్రాలు తీసి పక్కనపెట్టి, ఒక తువాలు తీసుకుని నడుముకు కట్టుకున్నాడు.+ 5 తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుతూ, నడుముకు కట్టుకున్న తువాలుతో తుడవడం మొదలుపెట్టాడు. 6 ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చినప్పుడు అతను, “ప్రభువా, నువ్వు నా పాదాలు కడుగుతావా?” అన్నాడు. 7 అందుకు యేసు, “నేను చేస్తున్నది నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమౌతుంది” అన్నాడు. 8 దానికి పేతురు, “నిన్ను ఎప్పటికీ నా పాదాలు కడగనివ్వను” అన్నాడు. అందుకు యేసు, “నేను నిన్ను కడగకపోతే+ నాతో నీకు వంతు లేదు” అన్నాడు. 9 అప్పుడు సీమోను పేతురు, “ప్రభువా, నా పాదాలు మాత్రమే కాదు నా చేతులు, తల కూడా కడుగు” అన్నాడు. 10 యేసు అతనితో, “స్నానం చేసిన వ్యక్తి శరీరమంతా శుభ్రంగా ఉంటుంది కాబట్టి అతను పాదాలు కడుక్కుంటే సరిపోతుంది. మీరు శుభ్రంగా ఉన్నారు, కానీ మీలో అందరూ శుభ్రంగా లేరు” అన్నాడు. 11 తనకు నమ్మకద్రోహం చేస్తున్న వ్యక్తి ఎవరో యేసుకు తెలుసు.+ అందుకే, “మీలో అందరూ శుభ్రంగా లేరు” అని అన్నాడు.
12 ఆయన వాళ్ల పాదాలు కడిగి, తన పైవస్త్రాలు వేసుకున్న తర్వాత మళ్లీ బల్ల దగ్గర కూర్చొని వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మీకు చేసింది మీకు అర్థమైందా? 13 మీరు నన్ను ‘బోధకుడు’ అని, ‘ప్రభువు’ అని పిలుస్తున్నారు. మీరు నన్ను అలా పిలవడం సరైనదే.+ 14 ప్రభువునూ బోధకుణ్ణీ అయిన నేను మీ పాదాలు కడిగానంటే,+ మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి.*+ 15 నేను మీకు చేసినట్టే మీరు కూడా చేయాలని మీకు ఆదర్శం ఉంచాను.+ 16 నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, దాసుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాదు; అదేవిధంగా, పంపబడిన వ్యక్తి తనను పంపించిన వ్యక్తి కన్నా గొప్పవాడు కాదు. 17 మీకు ఈ విషయాలు తెలుసు కాబట్టి, వీటిని చేస్తే మీరు సంతోషంగా ఉంటారు.+ 18 నేను మీ అందరి గురించి చెప్పట్లేదు; నేను ఎంచుకున్నవాళ్లు నాకు తెలుసు. అయితే, ‘నాతోపాటు భోజనం చేస్తూ వచ్చిన వ్యక్తి నాకు శత్రువు అయ్యాడు’*+ అనే లేఖనం నెరవేరాల్సి ఉంది.+ 19 అది జరిగినప్పుడు నేనే ఆయన్ని అని మీరు నమ్మేలా ముందుగానే మీకు చెప్తున్నాను.+ 20 నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, నేను పంపించే ఏ వ్యక్తినైనా చేర్చుకునేవాళ్లు నన్ను కూడా చేర్చుకుంటున్నారు;+ నన్ను చేర్చుకునేవాళ్లు నన్ను పంపించిన దేవుణ్ణి కూడా చేర్చుకుంటున్నారు.”
21 ఈ మాటలు చెప్పిన తర్వాత యేసు ఎంతో ఆవేదన చెందాడు. ఆయన, “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, మీలో ఒకతను నన్ను అప్పగిస్తాడు” అని స్పష్టంగా చెప్పాడు.+ 22 ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థంకాక శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.+ 23 వాళ్లలో యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు+ ఆయన పక్కనే* కూర్చొని ఉన్నాడు. 24 కాబట్టి సీమోను పేతురు, “ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పు” అని అతనికి సైగ చేశాడు. 25 అప్పుడు అతను వెనక్కి వాలి యేసు రొమ్మును ఆనుకొని, “ప్రభువా ఎవరతను?” అని అడిగాడు.+ 26 అందుకు యేసు, “నేను రొట్టె ముక్కను ముంచి ఎవరికి ఇస్తానో అతనే”+ అన్నాడు. కాబట్టి యేసు రొట్టెను ముంచి సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదాకు ఇచ్చాడు. 27 యూదా ఆ రొట్టె ముక్కను తీసుకున్నాక, సాతాను అతనిలో ప్రవేశించాడు.+ కాబట్టి యేసు అతనితో, “నువ్వు చేస్తున్నది ఇంకా త్వరగా చేయి” అన్నాడు. 28 అయితే, యేసు అతనితో ఎందుకలా అన్నాడో బల్ల దగ్గర కూర్చున్న వాళ్లెవ్వరికీ అర్థం కాలేదు. 29 యూదా దగ్గర డబ్బుల పెట్టె ఉంది కాబట్టి, పండుగ కోసం తమకు అవసరమైనవి కొనమనో, పేదవాళ్లకు ఏమైనా ఇవ్వమనో యేసు అతనికి చెప్తున్నాడని వాళ్లలో కొంతమంది అనుకున్నారు. 30 కాబట్టి అతను ఆ రొట్టె ముక్క తీసుకున్నాక వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయాడు. అది రాత్రిపూట.+
31 అతను బయటికి వెళ్లిపోయినప్పుడు యేసు ఇలా అన్నాడు: “ఇప్పుడు మానవ కుమారుడు మహిమపర్చబడుతున్నాడు. ఆయన ద్వారా దేవుడు మహిమపర్చబడుతున్నాడు. 32 దేవుడే స్వయంగా ఆయన్ని మహిమపరుస్తాడు,+ వెంటనే మహిమపరుస్తాడు. 33 చిన్నపిల్లలారా, నేను ఇంక కొంతకాలమే మీతోపాటు ఉంటాను. మీరు నా కోసం వెదుకుతారు; అయితే, ‘నేను వెళ్లే చోటికి మీరు రాలేరు’ అని యూదులతో చెప్పిన మాటే ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను. 34 నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి.+ 35 మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.”+
36 సీమోను పేతురు, “ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆయన్ని అడిగాడు. అందుకు యేసు, “నేను వెళ్తున్న చోటికి ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు కానీ తర్వాత వస్తావు” అన్నాడు. 37 అప్పుడు పేతురు యేసుతో, “ప్రభువా, నేను ఇప్పుడు నీ వెంట ఎందుకు రాలేను? నీ కోసం నా ప్రాణమైనా ఇస్తాను”+ అన్నాడు. 38 దానికి యేసు, “నా కోసం నీ ప్రాణం ఇస్తావా? నేను చాలా ఖచ్చితంగా నీతో చెప్తున్నాను, నేనెవరో తెలీదని నువ్వు మూడుసార్లు చెప్పే వరకు కోడి కూయనే కూయదు”+ అన్నాడు.
14 “ఆందోళన పడకండి.+ దేవుని మీద విశ్వాసం చూపించండి;+ నా మీద కూడా విశ్వాసం చూపించండి. 2 నా తండ్రి ఇంట్లో చాలా నివాసాలు ఉన్నాయి. లేకపోతే నేను మీకు ఈ మాట చెప్పేవాణ్ణి కాదు. ఎందుకంటే, నేను మీ కోసం స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను.+ 3 నేను వెళ్లి మీ కోసం స్థలం సిద్ధం చేశాక, మళ్లీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అప్పుడు నేను ఉన్న చోట మీరు కూడా ఉంటారు.+ 4 నేను వెళ్లే చోటికి మార్గం మీకు తెలుసు.”
5 అప్పుడు తోమా,+ “ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలీదు. మరి ఆ మార్గం ఎలా తెలుస్తుంది?” అని అడిగాడు.
6 అందుకు యేసు ఇలా అన్నాడు: “నేనే మార్గం,+ సత్యం,+ జీవం.+ నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు.+ 7 మీకు నేను తెలిస్తే, నా తండ్రి కూడా తెలిసినట్టే; ఈ క్షణం నుండి మీకు ఆయన తెలుసు, మీరు ఆయన్ని చూశారు.”+
8 అప్పుడు ఫిలిప్పు ఆయనతో, “ప్రభువా, మాకు తండ్రిని చూపించు, అది చాలు” అన్నాడు.
9 యేసు అతనితో ఇలా అన్నాడు: “ఫిలిప్పూ, నేను ఇంతకాలం మీతో ఉన్నా నువ్వు నన్ను తెలుసుకోలేదా? నన్ను చూసిన వ్యక్తి తండ్రిని కూడా చూశాడు.+ అయినాసరే ‘మాకు తండ్రిని చూపించు’ అని ఎందుకు అడుగుతున్నావు? 10 నేను తండ్రితో ఐక్యంగా ఉన్నానని, తండ్రి నాతో ఐక్యంగా ఉన్నాడని నువ్వు నమ్మట్లేదా?+ నేను మీతో చెప్పే విషయాలు నా అంతట నేనే చెప్పట్లేదు.+ కానీ నాతో ఐక్యంగా ఉన్న తండ్రే నా ద్వారా తన పనులు చేస్తున్నాడు. 11 నేను తండ్రితో ఐక్యంగా ఉన్నానని, తండ్రి నాతో ఐక్యంగా ఉన్నాడని నేను చెప్పిన మాట నమ్మండి; లేదా నా పనులు చూసైనా నమ్మండి. 12 నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, నామీద విశ్వాసం చూపించే వ్యక్తి కూడా నేను చేసే పనులు చేస్తాడు; అంతకన్నా గొప్ప పనులు కూడా చేస్తాడు,+ ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. 13 అంతేకాదు, నా పేరున మీరు ఏది అడిగినా నేను అది చేస్తాను, కుమారుడి ద్వారా తండ్రికి మహిమ వచ్చేలా నేను అలా చేస్తాను.+ 14 మీరు నా పేరున ఏమి అడిగినా నేను చేస్తాను.
15 “మీకు నా మీద ప్రేమ ఉంటే నా ఆజ్ఞలు పాటిస్తారు.+ 16 నేను తండ్రిని అడుగుతాను, మీతో ఎప్పటికీ ఉండేలా ఆయన మీకు ఇంకో సహాయకుణ్ణి* ఇస్తాడు.+ 17 అంటే సత్యాన్ని వెల్లడిచేసే పవిత్రశక్తిని+ మీకు ఇస్తాడు. లోకం దాన్ని పొందలేదు, ఎందుకంటే లోకం దాన్ని చూడట్లేదు, లోకానికి అది తెలీదు.+ కానీ మీకు అది తెలుసు, ఎందుకంటే అది మీలో ఉంది, మీతోనే ఉండిపోతుంది. 18 నేను మిమ్మల్ని అనాథలుగా వదిలేయను, మళ్లీ మీ దగ్గరికి వస్తాను.+ 19 కొంత సమయం తర్వాత లోకం ఇక ఎప్పుడూ నన్ను చూడదు. కానీ మీరు నన్ను చూస్తారు;+ ఎందుకంటే నేను జీవిస్తున్నాను, మీరు జీవిస్తారు. 20 నేను తండ్రితో ఐక్యంగా ఉన్నానని, మీరు నాతో ఐక్యంగా ఉన్నారని, నేను మీతో ఐక్యంగా ఉన్నానని ఆ రోజు మీరు తెలుసుకుంటారు.+ 21 నా ఆజ్ఞల్ని అంగీకరించి, వాటిని పాటించేవాళ్లు నన్ను ప్రేమిస్తున్నారు. నన్ను ప్రేమించేవాళ్లను నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా వాళ్లను ప్రేమించి, నన్ను నేను వాళ్లకు స్పష్టంగా చూపించుకుంటాను.”
22 ఇస్కరియోతు యూదా కాని ఇంకో యూదా+ యేసును ఇలా అడిగాడు: “ప్రభువా, నువ్వు లోకానికి కాకుండా మాకే నిన్ను నువ్వు ఎందుకు స్పష్టంగా చూపించుకోవాలని అనుకుంటున్నావు?”
23 అప్పుడు యేసు ఇలా అన్నాడు: “ఎవరైనా నన్ను ప్రేమిస్తే, అతను నా మాట ప్రకారం నడుచుకుంటాడు, నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు. మేము అతని దగ్గరికి వచ్చి అతనితో నివసిస్తాం.+ 24 నా మీద ప్రేమ లేనివాడు నా మాటల్ని పాటించడు. మీరు వింటున్న మాట నాది కాదు నన్ను పంపించిన తండ్రిదే.+
25 “నేను మీతో ఉన్నప్పుడే మీకు ఈ విషయాలు చెప్పాను. 26 అయితే తండ్రి నా పేరున పంపించే సహాయకుడు అంటే పవిత్రశక్తి అన్ని విషయాల్ని మీకు బోధిస్తాడు, నేను మీకు చెప్పిన విషయాలన్నిటినీ మీకు గుర్తుచేస్తాడు.+ 27 నేను మీకు శాంతిని ఇచ్చి వెళ్తున్నాను; నా శాంతినే మీకు ఇస్తున్నాను.+ నేను మీకు ఇచ్చే శాంతి, లోకం ఇచ్చే శాంతి లాంటిది కాదు. ఆందోళన పడకండి, భయపడకండి. 28 ‘నేను వెళ్తున్నాను, మళ్లీ మీ దగ్గరికి వస్తాను’ అని నేను మీతో చెప్పిన మాట విన్నారు కదా. మీకు నా మీద ప్రేమ ఉంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నానని మీరు సంతోషిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు.+ 29 అది జరిగినప్పుడు మీరు నమ్మాలని, అది ఇంకా జరగకముందే మీకు చెప్తున్నాను.+ 30 నేను మీతో ఇంక ఎక్కువగా మాట్లాడను; ఎందుకంటే ఈ లోక పరిపాలకుడు+ వస్తున్నాడు, అతనికి నా మీద ఎలాంటి పట్టూ లేదు.+ 31 అయితే నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకానికి తెలియాలని, తండ్రి నాకు ఆజ్ఞాపించినట్టే చేస్తున్నాను.+ లేవండి, ఇక్కడి నుండి వెళ్దాం.
15 “నేను నిజమైన ద్రాక్షచెట్టును, నా తండ్రి వ్యవసాయదారుడు. 2 నాలోని ఫలించని ప్రతీ తీగను ఆయన తెంచి పారేస్తాడు; అంతేకాదు ఫలించే ప్రతీ తీగ ఇంకా ఎక్కువగా ఫలించేలా దాన్ని శుభ్రం చేస్తాడు.+ 3 నేను మీతో అన్న మాటను బట్టి మీరు ఇప్పటికే శుభ్రంగా ఉన్నారు.+ 4 ఎప్పుడూ నాతో ఐక్యంగా ఉండండి, అప్పుడు నేను కూడా మీతో ఎప్పుడూ ఐక్యంగా ఉంటాను. ద్రాక్షచెట్టుకు అంటుకొని ఉంటే తప్ప తీగ దానంతటదే ఫలించలేదు. అలాగే మీరు కూడా నాతో ఐక్యంగా ఉంటే తప్ప ఫలించలేరు.+ 5 నేను ద్రాక్షచెట్టును, మీరు తీగలు. ఎవరైతే నాతో ఎప్పుడూ ఐక్యంగా ఉంటారో, ఎవరితోనైతే నేను ఎప్పుడూ ఐక్యంగా ఉంటానో అతను ఎక్కువగా ఫలిస్తాడు; నా నుండి వేరైపోయి మీరు అసలు ఏమీ చేయలేరు. 6 ఎప్పుడూ నాతో ఐక్యంగా ఉండని వ్యక్తి, బయట పారేయబడి ఎండిపోయిన తీగలా ఉంటాడు. ప్రజలు ఆ తీగల్ని పోగుచేసి మంటల్లో వేస్తారు, అవి కాలిపోతాయి. 7 మీరు ఎప్పుడూ నాతో ఐక్యంగా ఉంటే, అలాగే నా మాటలు ఎప్పుడూ మీలో ఉంటే మీకు ఇష్టమైనది ఏది అడిగినా దాన్ని పొందుతారు.+ 8 మీరు ఎక్కువగా ఫలిస్తూ నా శిష్యులని నిరూపించుకుంటే నా తండ్రికి మహిమ వస్తుంది.+ 9 తండ్రి నన్ను ప్రేమిస్తున్నట్టే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను; నా ప్రేమలో నిలిచి ఉండండి.* 10 నేను తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్టే, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలిచి ఉంటారు.
11 “నాకున్న సంతోషమే మీలో ఉండాలని, మీరు ఆ సంతోషాన్ని పూర్తిగా అనుభవించాలని ఈ విషయాలు మీకు చెప్పాను.+ 12 నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఇదే నా ఆజ్ఞ.+ 13 స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం కన్నా గొప్ప ప్రేమ లేదు.+ 14 నేను మీకు ఆజ్ఞాపిస్తున్న వాటిని చేస్తే మీరు నా స్నేహితులుగా ఉంటారు.+ 15 ఇప్పటినుండి నేను మిమ్మల్ని దాసులని పిలవను, ఎందుకంటే యజమాని ఏం చేస్తాడో దాసునికి తెలీదు. అయితే నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను, ఎందుకంటే నా తండ్రి దగ్గర విన్న వాటన్నిటినీ నేను మీకు తెలియజేశాను. 16 మీరు నన్ను ఎంచుకోలేదు. కానీ మీరు ఫలిస్తూ ఉండాలని, మీ ఫలం ఎప్పటికీ ఉండాలని నేనే మిమ్మల్ని ఎంచుకున్నాను. దానివల్ల, మీరు నా పేరున తండ్రిని ఏది అడిగినా ఆయన దాన్ని మీకు ఇస్తాడు.
17 “మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు ఈ విషయాలు ఆజ్ఞాపిస్తున్నాను.+ 18 లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, అది మీకన్నా ముందు నన్ను ద్వేషించిందని గుర్తుంచుకోండి.+ 19 మీరు లోకానికి చెందినవాళ్లయితే, మీరు తనవాళ్లు కాబట్టి లోకం మిమ్మల్ని ఇష్టపడుతుంది. కానీ మీరు లోకానికి చెందినవాళ్లు కాదు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఎంచుకున్నాను కాబట్టే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది.+ 20 దాసుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాడని నేను మీతో అన్న మాట గుర్తుపెట్టుకోండి. వాళ్లు నన్ను హింసించారంటే మిమ్మల్ని కూడా హింసిస్తారు;+ నా మాటలు పాటించారంటే మీ మాటలు కూడా పాటిస్తారు. 21 అయితే మీరు నా శిష్యులు కాబట్టి* వాళ్లు ఇవన్నీ మీకు చేస్తారు; ఎందుకంటే నన్ను పంపించిన వ్యక్తి వాళ్లకు తెలీదు.+ 22 నేను వచ్చి వాళ్లకు బోధించకపోయుంటే, వాళ్లమీద ఏ పాపం ఉండేదికాదు. అయితే ఇప్పుడు వాళ్లు తమ పాపానికి సాకులు చెప్పలేరు. 23 నన్ను ద్వేషించే వ్యక్తి నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు.+ 24 ఎవరూ చేయని అద్భుతాల్ని నేను వాళ్ల మధ్య చేసుండకపోతే వాళ్లమీద ఏ పాపం ఉండేది కాదు;+ కానీ ఇప్పుడు వాళ్లు నన్ను చూశారు, నన్నూ నా తండ్రినీ ద్వేషించారు. 25 ‘ఏ కారణం లేకుండా వాళ్లు నన్ను ద్వేషించారు’ అని వాళ్ల ధర్మశాస్త్రంలో రాయబడివున్న మాట నెరవేరడానికి అలా జరిగింది.+ 26 తండ్రి దగ్గర నుండి నేను మీకు ఒక సహాయకుణ్ణి, అంటే సత్యాన్ని వెల్లడిజేసే పవిత్రశక్తిని పంపిస్తాను;+ తండ్రి నుండి వచ్చే ఆ సహాయకుడు నా గురించి సాక్ష్యమిస్తాడు.+ 27 అలాగే మీరు మొదటినుండి నాతోపాటు ఉన్నారు కాబట్టి మీరు కూడా నా గురించి సాక్ష్యమివ్వాలి.+
16 “మీరు తడబడకూడదని ఈ విషయాలు మీకు చెప్పాను. 2 ప్రజలు మిమ్మల్ని సమాజమందిరం నుండి వెలివేస్తారు.+ నిజానికి, మిమ్మల్ని చంపే+ ప్రతీ ఒక్కరు తాను దేవునికి పవిత్రసేవ చేస్తున్నానని అనుకునే సమయం రాబోతుంది. 3 వాళ్లు తండ్రిని గానీ నన్ను గానీ తెలుసుకోలేదు కాబట్టి అలా చేస్తారు.+ 4 ఇవి జరిగే సమయం వచ్చినప్పుడు, నేను వీటి గురించి మీకు చెప్పానని మీరు గుర్తుచేసుకునేలా ఈ విషయాలు మీకు చెప్పాను.+
“మొదట్లో నేను ఈ విషయాలు మీకు చెప్పలేదు, ఎందుకంటే అప్పుడు నేను మీతో ఉన్నాను. 5 కానీ ఇప్పుడు, నన్ను పంపించిన ఆయన దగ్గరికి వెళ్తున్నాను;+ అయినాసరే మీలో ఎవ్వరూ, ‘నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని నన్ను అడగట్లేదు. 6 అయితే నేను ఈ విషయాలు మీకు చెప్పడం వల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. 7 అయినా, నేను చెప్తున్నది నిజం; నేను వెళ్లేది మీ మంచి కోసమే. ఎందుకంటే నేను వెళ్లకపోతే ఆ సహాయకుడు+ మీ దగ్గరికి రాడు; కానీ నేను వెళ్తే, ఆ సహాయకుణ్ణి మీ దగ్గరికి పంపిస్తాను. 8 ఆ సహాయకుడు వచ్చినప్పుడు పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకానికి ఒప్పింపజేసే రుజువుల్ని ఇస్తాడు: 9 లోకం నా మీద విశ్వాసం చూపించట్లేదు+ కాబట్టి ముందుగా పాపం గురించిన రుజువుల్ని;+ 10 నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, తర్వాత మీరు నన్ను చూడరు కాబట్టి నీతి గురించిన రుజువుల్ని; 11 ఈ లోక పరిపాలకునికి తీర్పు తీర్చబడింది+ కాబట్టి తీర్పు గురించిన రుజువుల్ని ఇస్తాడు.
12 “నేను మీకు చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు. 13 అయితే ఆ సహాయకుడు* వచ్చినప్పుడు అంటే సత్యాన్ని వెల్లడిజేసే పవిత్రశక్తి వచ్చినప్పుడు, మీరు సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకునేలా సహాయం చేస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆ సహాయకుడు తనంతట తాను ఏదీ మాట్లాడడు కానీ తాను విన్నవాటినే మాట్లాడతాడు; జరగబోయే విషయాల్ని మీకు ప్రకటిస్తాడు.+ 14 ఆ సహాయకుడు నన్ను మహిమపరుస్తాడు,+ ఎందుకంటే నా దగ్గర విన్న విషయాల్నే మీకు ప్రకటిస్తాడు.+ 15 నా తండ్రి దగ్గర ఉన్నవన్నీ నావే.+ అందుకే, నా దగ్గర విన్న విషయాల్నే ఆ సహాయకుడు మీకు ప్రకటిస్తాడని చెప్పాను. 16 కొంతకాలం తర్వాత మీరు ఇక నన్ను చూడరు,+ అయితే ఇంకొంతకాలం తర్వాత మీరు నన్ను చూస్తారు.”
17 అప్పుడు ఆయన శిష్యుల్లో కొంతమంది, “ఈయన, ‘కొంతకాలం తర్వాత మీరు ఇక నన్ను చూడరు, అయితే ఇంకొంతకాలం తర్వాత మీరు నన్ను చూస్తారు,’ ‘ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను’ అని ఎందుకు అంటున్నాడు?” అని చెప్పుకున్నారు. 18 వాళ్లు, “ ‘కొంతకాలం’ అని చెప్పడంలో ఈయన ఉద్దేశం ఏంటి? ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడో మనకు తెలియట్లేదే” అని అనుకున్నారు. 19 వాళ్లు తనను ఏదో అడగాలనుకుంటున్నారని తెలిసి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ ‘కొంతకాలం తర్వాత మీరు ఇక నన్ను చూడరు, అయితే ఇంకొంతకాలం తర్వాత మీరు నన్ను చూస్తారు’ అని నేను చెప్పినందుకు మీరు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారా? 20 నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను: మీరు ఏడుస్తారు, దుఃఖపడతారు కానీ లోకం మాత్రం సంతోషిస్తుంది; మీరు దుఃఖపడతారు కానీ మీ దుఃఖం సంతోషంగా మారుతుంది.+ 21 బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు స్త్రీ వేదన పడుతుంది. అయితే బిడ్డను కన్న తర్వాత, ఆ బిడ్డను చూసిన ఆనందంలో ఇక ఆ బాధను గుర్తుచేసుకోదు. 22 అలాగే మీరు కూడా ఇప్పుడు దుఃఖపడుతున్నారు; కానీ నేను మిమ్మల్ని మళ్లీ కలుస్తాను,* అప్పుడు మీ హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతాయి,+ మీ ఆనందాన్ని ఎవ్వరూ తీసేయలేరు. 23 ఆ రోజు మీరు నన్ను ఏ ప్రశ్నా అడగరు. మీరు నా పేరున తండ్రిని ఏది అడిగినా+ ఆయన దాన్ని మీకు ఇస్తాడని+ నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. 24 ఇప్పటివరకు మీరు నా పేరున ఏదీ అడగలేదు. అడగండి, మీరు దాన్ని పొందుతారు; అప్పుడు మీ సంతోషం సంపూర్ణం అవుతుంది.
25 “నేను ఉదాహరణల రూపంలో మీకు ఈ విషయాలు చెప్పాను. అయితే ఒక సమయం రాబోతుంది, అప్పుడు నేను ఇక ఉదాహరణల రూపంలో కాకుండా స్పష్టంగా తండ్రి గురించి మీకు చెప్తాను. 26 ఆ రోజు మీరు తండ్రిని నా పేరున వేడుకుంటారు; అయితే దానర్థం, నేను మీకోసం తండ్రిని వేడుకుంటానని కాదు. 27 స్వయంగా తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు;* ఎందుకంటే మీరు నన్ను ప్రేమించారు,*+ నేను దేవుని ప్రతినిధిగా వచ్చానని నమ్మారు.+ 28 నేను తండ్రి ప్రతినిధిగా లోకంలోకి వచ్చాను. ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.”+
29 ఆయన శిష్యులు ఇలా అన్నారు: “ఇదిగో! ఇప్పుడు నువ్వు ఉదాహరణలు ఉపయోగించకుండా స్పష్టంగా మాట్లాడుతున్నావు. 30 నీకు అన్ని విషయాలు తెలుసని, మాలో ఎవ్వరూ ఏ ప్రశ్నా నిన్ను అడగాల్సిన అవసరం లేదని ఇప్పుడు మాకు అర్థమైంది. నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చావని దీన్నిబట్టి మేము నమ్ముతున్నాం.” 31 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? 32 ఇదిగో! మీలో ప్రతీ ఒక్కరు తమతమ ఇళ్లకు పారిపోయి, నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతుంది.+ నిజానికి అది ఇప్పటికే వచ్చేసింది. అయితే నా తండ్రి నాతోపాటు ఉన్నాడు కాబట్టి నేను ఒంటరివాణ్ణి కాదు.+ 33 నా వల్ల మీరు శాంతి పొందాలని మీకు ఈ విషయాలు చెప్పాను.+ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయితే ధైర్యం తెచ్చుకోండి! నేను లోకాన్ని జయించాను.”+
17 యేసు ఈ మాటలు చెప్పాక, ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు: “తండ్రీ, సమయం వచ్చేసింది. నీ కుమారుడు నిన్ను మహిమపర్చేలా నీ కుమారుణ్ణి మహిమపర్చు. 2 ఎందుకంటే, నువ్వు మనుషులందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు.+ దానివల్ల, నువ్వు తనకు అప్పగించిన వాళ్లందరికీ ఆయన శాశ్వత జీవితాన్ని ఇవ్వగలుగుతాడు.+ 3 ఒకేఒక్క సత్యదేవుడివైన నిన్నూ,+ నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ+ తెలుసుకోవడమే శాశ్వత జీవితం. 4 చేయడానికి నువ్వు నాకు ఇచ్చిన పనిని పూర్తిచేసి+ భూమ్మీద నిన్ను మహిమపర్చాను.+ 5 కాబట్టి తండ్రీ, లోకం ఉనికిలోకి రాకముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండేదో అదే మహిమతో ఇప్పుడు నన్ను నీ దగ్గర మహిమపర్చు.+
6 “లోకంలో నుండి నువ్వు నాకు ఇచ్చిన మనుషులకు నీ పేరు వెల్లడిచేశాను.*+ వాళ్లు నీవాళ్లు, వాళ్లను నువ్వు నాకు ఇచ్చావు; వాళ్లు నీ వాక్యాన్ని పాటించారు. 7 నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీ నుండే వచ్చాయని వాళ్లిప్పుడు తెలుసుకున్నారు; 8 ఎందుకంటే నువ్వు నాకు చెప్పిన మాటల్ని నేను వాళ్లకు చెప్పినప్పుడు+ వాళ్లు వాటిని అంగీకరించి, నేను నీ ప్రతినిధిగా వచ్చానని నిజంగా తెలుసుకున్నారు. అంతేకాదు, నువ్వు నన్ను పంపావని వాళ్లు నమ్ముతున్నారు. 9 నేను వాళ్ల గురించి ప్రార్థిస్తున్నాను. నేను లోకం గురించి ప్రార్థించట్లేదు కానీ నువ్వు నాకు ఇచ్చినవాళ్ల గురించే ప్రార్థిస్తున్నాను, ఎందుకంటే వాళ్లు నీ వాళ్లు; 10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. నేను వాళ్ల మధ్య మహిమపర్చబడ్డాను.
11 “నేను ఇక లోకంలో ఉండను, కానీ వాళ్లు లోకంలో ఉన్నారు.+ నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడివైన తండ్రీ, నువ్వు నాకు ఇచ్చిన నీ సొంత పేరును బట్టి వాళ్లను కాపాడు.+ అప్పుడు, మనం ఐక్యంగా ఉన్నట్టే వాళ్లు కూడా ఐక్యంగా ఉంటారు. 12 నేను వాళ్లతో ఉన్నప్పుడు, నువ్వు నాకు ఇచ్చిన నీ సొంత పేరును బట్టి వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను.+ నేను వాళ్లను కాపాడాను. లేఖనం నెరవేరేలా,+ నాశనపుత్రుడు తప్ప+ వాళ్లలో ఏ ఒక్కరూ నాశనం కాలేదు.+ 13 కానీ ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా సంతోషాన్ని వాళ్లు పూర్తిగా అనుభవించేలా, నేను ఇంకా లోకంలో ఉన్నప్పుడే ఈ విషయాలు మాట్లాడుతున్నాను. 14 నేను వాళ్లకు నీ వాక్యాన్ని ఇచ్చాను, అయితే లోకం వాళ్లను ద్వేషించింది; ఎందుకంటే నేను లోకసంబంధిని* కానట్టే వాళ్లు కూడా లోకసంబంధులు కారు.+
15 “వాళ్లను లోకంలో నుండి తీసుకెళ్లిపొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ, దుష్టుని నుండి వాళ్లను కాపాడమని నీకు ప్రార్థిస్తున్నాను.+ 16 నేను లోకసంబంధిని కానట్టే+ వాళ్లు కూడా లోకసంబంధులు కారు.+ 17 సత్యంతో వాళ్లను పవిత్రపర్చు,*+ నీ వాక్యమే సత్యం.+ 18 నువ్వు నన్ను లోకంలోకి పంపించినట్టే, నేను కూడా వాళ్లను లోకంలోకి పంపించాను. 19 వాళ్లు సత్యం వల్ల పవిత్రులు అవ్వాలని వాళ్ల కోసం నన్ను నేను పవిత్రంగా ఉంచుకుంటున్నాను.
20 “నేను వాళ్ల కోసం మాత్రమే ప్రార్థించట్లేదు గానీ, వాళ్ల బోధ విని నా మీద విశ్వాసం ఉంచే వాళ్లందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. 21 వాళ్లందరూ ఐక్యంగా ఉండాలని;+ తండ్రీ, నువ్వు నాతో ఐక్యంగా ఉన్నట్టు,+ నేను నీతో ఐక్యంగా ఉన్నట్టు వాళ్లు కూడా మనతో ఐక్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అప్పుడు, నువ్వు నన్ను పంపించావని లోకం నమ్ముతుంది. 22 మనం ఐక్యంగా ఉన్నట్టు వాళ్లు కూడా ఐక్యంగా ఉండేలా,+ నువ్వు నాకు ఇచ్చిన మహిమను నేను వాళ్లకు ఇచ్చాను. 23 వాళ్లు సంపూర్ణంగా ఐక్యంగా ఉండేలా నేను వాళ్లతో ఐక్యంగా ఉన్నాను, నువ్వు నాతో ఐక్యంగా ఉన్నావు. అలా, నువ్వు నన్ను పంపించావనీ నన్ను ప్రేమించినట్టే వాళ్లను కూడా ప్రేమించావనీ లోకానికి తెలుస్తుంది. 24 తండ్రీ, నువ్వు నాకు ఇచ్చిన వీళ్లు, నేను ఉండే చోట నాతోపాటు ఉండాలని కోరుకుంటున్నాను.+ అప్పుడు, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వీళ్లు చూడగలుగుతారు. ఎందుకంటే ప్రపంచం పుట్టకముందే* నువ్వు నన్ను ప్రేమించావు. 25 నీతిమంతుడివైన తండ్రీ, నిజానికి లోకం నిన్ను తెలుసుకోకపోయినా,+ నాకు నువ్వు తెలుసు,+ నువ్వు నన్ను పంపించావని వీళ్లు తెలుసుకున్నారు. 26 నువ్వు నామీద చూపించిన ప్రేమను వీళ్లు ఇతరుల మీద చూపించేలా, నేను వీళ్లతో ఐక్యంగా ఉండేలా+ నీ పేరును వీళ్లకు తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను.”+
18 యేసు ఈ విషయాలు చెప్పాక, తన శిష్యులతో పాటు కిద్రోను లోయ*+ దాటి, తోట ఉన్న చోటికి వెళ్లాడు. యేసు, ఆయన శిష్యులు ఆ తోటలోకి వెళ్లారు.+ 2 యేసు తరచూ తన శిష్యులతో అక్కడికి వెళ్తుండేవాడు కాబట్టి ఆయన్ని అప్పగించబోయే యూదాకు కూడా ఆ చోటు తెలుసు. 3 కాబట్టి యూదా సైనికుల గుంపును, ముఖ్య యాజకులు-పరిసయ్యులు పంపించిన అధికారుల్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. వాళ్ల చేతుల్లో దివిటీలు, దీపాలు, ఆయుధాలు ఉన్నాయి.+ 4 తనకు జరగబోతున్నవన్నీ యేసుకు తెలుసు కాబట్టి ఆయన ముందుకు వచ్చి, “మీరు ఎవరి కోసం వెదుకుతున్నారు?” అని వాళ్లను అడిగాడు. 5 వాళ్లు, “నజరేయుడైన యేసు+ కోసం” అని అన్నారు. అప్పుడు యేసు వాళ్లతో, “నేనే ఆయన్ని” అని చెప్పాడు. ఆయన్ని అప్పగించబోతున్న యూదా కూడా వాళ్లతోపాటు నిలబడివున్నాడు.+
6 యేసు, “నేనే ఆయన్ని” అని చెప్పినప్పుడు వాళ్లు వెనక్కి తగ్గి, నేలమీద పడిపోయారు.+ 7 కాబట్టి ఆయన, “మీరు ఎవరి కోసం వెదుకుతున్నారు?” అని వాళ్లను మళ్లీ అడిగాడు. వాళ్లు, “నజరేయుడైన యేసు కోసం” అన్నారు. 8 అప్పుడు యేసు వాళ్లతో, “నేనే ఆయన్ని అని మీతో చెప్పాను కదా. మీరు వెదుకుతున్నది నా కోసమే అయితే వీళ్లను వెళ్లనివ్వండి” అన్నాడు. 9 “నువ్వు నాకు ఇచ్చిన వాళ్లలో ఏ ఒక్కర్నీ నేను పోగొట్టుకోలేదు”+ అని తాను చెప్పిన మాట నెరవేరడానికే ఆయన అలా చేశాడు.
10 సీమోను పేతురు దగ్గర ఒక కత్తి ఉంది. అతను ఆ కత్తి దూసి ప్రధానయాజకుని దాసుడి కుడిచెవి తెగనరికాడు.+ ఆ దాసుని పేరు మల్కు. 11 అయితే యేసు పేతురుతో, “ఆ కత్తిని ఒరలో పెట్టు.+ తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగవద్దా?”+ అని అన్నాడు.
12 అప్పుడు ఆ సైనికులు, సహస్రాధిపతి,* యూదుల అధికారులు యేసును పట్టుకుని బంధించారు. 13 వాళ్లు యేసును ముందుగా అన్న అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లారు, అతను ఆ సంవత్సరం ప్రధానయాజకుడిగా ఉన్న కయపకు+ మామ. 14 దేశమంతా నాశనం కావడం కన్నా, అందరి కోసం ఒక మనిషి చనిపోవడం మంచిదని అంతకుముందు యూదులకు సలహా ఇచ్చింది ఈ కయపే.+
15 సీమోను పేతురు, ఇంకో శిష్యుడు యేసు వెనక వెళ్తున్నారు.+ ఆ శిష్యుడు ప్రధానయాజకుడికి తెలుసు కాబట్టి అతను యేసుతోపాటు ప్రధానయాజకుడి ఇంటి ప్రాంగణం లోపలికి వెళ్లాడు. 16 కానీ పేతురు బయటే ద్వారం దగ్గర నిలబడివున్నాడు. దాంతో ప్రధానయాజకుడికి తెలిసిన ఆ శిష్యుడు బయటికి వచ్చి, అక్కడ కాపలా ఉన్న అమ్మాయితో మాట్లాడి పేతురును లోపలికి తీసుకొచ్చాడు. 17 అప్పుడు, కాపలా ఉన్న పనమ్మాయి పేతురును, “నువ్వూ ఈయన శిష్యుల్లో ఒకడివి కాదు కదా?” అని అడిగింది. దానికి పేతురు, “కాదు” అన్నాడు.+ 18 చలిగా ఉండడంతో దాసులు, అధికారులు చలిమంట వేసుకుని, దాని చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నారు. పేతురు కూడా వాళ్లతో నిలబడి చలి కాచుకుంటున్నాడు.
19 అప్పుడు ఆ ముఖ్య యాజకుడు* యేసును ఆయన శిష్యుల గురించి, ఆయన బోధ గురించి ప్రశ్నించాడు. 20 యేసు అతనికి ఇలా జవాబిచ్చాడు: “నేను ప్రజలందరి ముందు మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులందరూ వచ్చే సమాజమందిరాల్లో, ఆలయంలో బోధించాను.+ రహస్యంగా ఏదీ మాట్లాడలేదు. 21 మీరు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? నేను వాళ్లకు ఏమి చెప్పానో విన్నవాళ్లనే అడగండి. ఇదిగో! నేనేమి మాట్లాడానో వాళ్లకు తెలుసు.” 22 యేసు ఈ మాటలు అన్నప్పుడు, ఆయన దగ్గర నిలబడివున్న ఒక అధికారి యేసును చెంపమీద కొట్టి,+ “ముఖ్య యాజకుడితో ఇలాగేనా మాట్లాడేది?” అన్నాడు. 23 అప్పుడు యేసు అతనితో, “నేను ఏదైనా తప్పు మాట్లాడివుంటే, ఆ తప్పేంటో చెప్పు. కానీ నేను మాట్లాడింది సరిగ్గా ఉంటే నన్ను ఎందుకు కొడుతున్నావు?” అని అన్నాడు. 24 తర్వాత అన్న, బంధించబడివున్న యేసును ప్రధానయాజకుడైన కయప దగ్గరికి పంపించాడు.+
25 సీమోను పేతురు ఇంకా మంట దగ్గరే నిలబడి చలి కాచుకుంటున్నాడు. అక్కడున్న వాళ్లు అతన్ని, “నువ్వూ ఈయన శిష్యుల్లో ఒకడివి కాదా?” అని అడిగారు. దానికి పేతురు ఒప్పుకోలేదు, “నేను కాదు” అన్నాడు.+ 26 ప్రధానయాజకుడి దాసుల్లో, పేతురు ఎవరి చెవి నరికాడో అతని+ బంధువు కూడా ఉన్నాడు. అతను పేతురుతో, “నువ్వు ఆయనతోపాటు తోటలో ఉండడం నేను చూడలేదా?” అన్నాడు. 27 అయితే పేతురు మళ్లీ ఒప్పుకోలేదు, వెంటనే కోడి కూసింది.+
28 అప్పుడు వాళ్లు యేసును కయప ఇంటి నుండి అధిపతి భవనానికి తీసుకెళ్లారు.+ అప్పటికి తెల్లవారింది. అయితే యూదులు మాత్రం అధిపతి భవనం లోపలికి వెళ్లలేదు, ఎందుకంటే వాళ్లు పస్కా భోజనాన్ని తినగలిగేలా అపవిత్రులు కాకూడదని+ అనుకున్నారు. 29 కాబట్టి పిలాతు బయటికి వచ్చి, “ఇతని మీద మీరు మోపుతున్న నేరమేమిటి?” అని వాళ్లను అడిగాడు. 30 అప్పుడు వాళ్లు, “ఇతను తప్పు చేయకపోయుంటే* ఇతన్ని నీకు అప్పగించేవాళ్లం కాదు” అన్నారు. 31 దానికి పిలాతు వాళ్లతో, “ఇతన్ని తీసుకెళ్లి మీరే మీ చట్టప్రకారం తీర్పు తీర్చుకోండి” అన్నాడు. అప్పుడు యూదులు, “చట్టప్రకారం ఎవరికీ మరణశిక్ష వేసే అధికారం మాకు లేదు” అన్నారు.+ 32 తాను ఏ విధంగా చనిపోతాడో సూచించడానికి యేసు చెప్పిన మాట నెరవేరేలా ఇది జరిగింది.+
33 కాబట్టి పిలాతు మళ్లీ అధిపతి భవనంలోకి వెళ్లి, యేసును పిలిపించి, “నువ్వు యూదుల రాజువా?” అని అడిగాడు.+ 34 అప్పుడు యేసు, “నీ అంతట నువ్వే ఇలా అడుగుతున్నావా? లేక వేరేవాళ్లు నా గురించి చెప్పారా?” అని అడిగాడు. 35 దానికి పిలాతు, “నేనేమైనా యూదుడినా? నీ సొంత ప్రజలూ ముఖ్య యాజకులే నిన్ను నాకు అప్పగించారు. ఇంతకీ నువ్వు ఏంచేశావు?” అని అడిగాడు. 36 అప్పుడు యేసు ఇలా అన్నాడు:+ “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.+ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినదైతే, నేను యూదులకు అప్పగించబడకుండా నా సేవకులు పోరాడి ఉండేవాళ్లు.+ కానీ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.” 37 కాబట్టి పిలాతు యేసును, “అయితే నువ్వు రాజువా?” అని అడిగాడు. దానికి యేసు, “నేను రాజునని నువ్వే స్వయంగా అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను, అందుకే ఈ లోకంలోకి వచ్చాను.+ సత్యానికి లోబడే ప్రతీ ఒక్కరు నేను చెప్పేది వింటారు” అన్నాడు. 38 అప్పుడు పిలాతు, “సత్యం అంటే ఏమిటి?” అన్నాడు.
ఆ మాట అన్న తర్వాత పిలాతు మళ్లీ బయటికి వెళ్లి యూదులతో ఇలా అన్నాడు: “అతనిలో నాకు ఏ తప్పూ కనిపించలేదు.+ 39 అంతేకాదు, పస్కా పండుగప్పుడు మీకోసం నేను ఒకర్ని విడుదల చేసే ఆచారం మీకు ఉంది కదా.+ మరి మీకోసం యూదుల రాజును విడుదల చేయమంటారా?” 40 వాళ్లు, “ఇతన్ని వద్దు, బరబ్బను విడుదల చేయి” అని అరిచారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.+
19 తర్వాత పిలాతు యేసును తీసుకెళ్లి కొరడాలతో కొట్టించాడు.+ 2 సైనికులు ఒక ముళ్ల కిరీటం అల్లి యేసు తలమీద పెట్టారు, ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించారు.+ 3 వాళ్లు యేసు దగ్గరికి వస్తూ, “యూదుల రాజా, నమస్కారం!”* అంటూ ఉన్నారు. అంతేకాదు వాళ్లు ఆయన్ని చెంప మీద కొడుతూ ఉన్నారు.+ 4 పిలాతు మళ్లీ బయటికి వెళ్లి యూదులతో, “ఇదిగో! ఇతనిలో నాకు ఏ తప్పూ కనబడలేదని+ మీరు తెలుసుకోవడం కోసం నేను ఇతన్ని బయటికి తీసుకొస్తున్నాను” అన్నాడు. 5 అప్పుడు యేసు ముళ్ల కిరీటంతో, ఊదారంగు వస్త్రంతో బయటికి వచ్చాడు. పిలాతు వాళ్లతో, “ఇదిగో! ఈ మనిషి!” అన్నాడు. 6 అయితే ముఖ్య యాజకులు, అధికారులు యేసును చూసినప్పుడు, “అతనికి కొయ్యపై శిక్ష వేయండి! అతనికి కొయ్యపై శిక్ష వేయండి!”* అని అరిచారు.+ పిలాతు వాళ్లతో, “మీరే ఇతన్ని తీసుకెళ్లి మరణశిక్ష వేయండి,* నాకైతే ఇతనిలో ఏ తప్పూ కనిపించట్లేదు” అన్నాడు.+ 7 అప్పుడు యూదులు, “మాకో చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం అతను చనిపోవాలి,+ ఎందుకంటే అతను దేవుని కుమారుణ్ణని చెప్పుకున్నాడు” అన్నారు.+
8 వాళ్ల మాటలు విన్నప్పుడు పిలాతు ఇంకా ఎక్కువగా భయపడ్డాడు. 9 అతను మళ్లీ అధిపతి భవనంలోకి వెళ్లి యేసును, “నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?” అని అడిగాడు. అయితే యేసు అతనికి ఏమీ చెప్పలేదు.+ 10 దాంతో పిలాతు, “నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేసే అధికారం, నీకు మరణశిక్ష వేసే* అధికారం నాకు ఉందని నీకు తెలీదా?” అని యేసుతో అన్నాడు. 11 అప్పుడు యేసు, “పైనుండి ఇవ్వబడివుంటే తప్ప నా మీద నీకు అసలు ఎలాంటి అధికారమూ ఉండదు. అందుకే నన్ను నీకు అప్పగించిన మనిషి మీద ఇంకా ఎక్కువ పాపం ఉంది” అన్నాడు.
12 దాంతో పిలాతు ఏదోవిధంగా యేసును విడుదల చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ యూదులు, “అతన్ని విడుదల చేస్తే నువ్వు కైసరుకు స్నేహితుడివి కావు. తాను రాజునని చెప్పుకునే ప్రతీ వ్యక్తి కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే”* అని అరిచారు.+ 13 పిలాతు ఆ మాటలు విన్నాక యేసును బయటికి తీసుకొచ్చి, రాళ్లు పరిచిన స్థలంలో ఉన్న న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హీబ్రూ భాషలో ఆ స్థలాన్ని గబ్బతా అంటారు. 14 అది పస్కాకు* సిద్ధపడే రోజు,+ సమయం మధ్యాహ్నం దాదాపు 12 గంటలు.* అప్పుడు పిలాతు యూదులతో ఇలా అన్నాడు: “ఇదిగో! మీ రాజు!” 15 అయితే వాళ్లు, “అతన్ని చంపేయండి! అతన్ని చంపేయండి! అతనికి కొయ్యపై శిక్ష వేయండి!”* అని అరిచారు. అప్పుడు పిలాతు, “నేను మీ రాజుకు మరణశిక్ష వేయాలా?” అన్నాడు. అందుకు ముఖ్య యాజకులు, “కైసరు ఒక్కడే మా రాజు” అన్నారు. 16 అప్పుడు పిలాతు, కొయ్య మీద మరణశిక్ష వేయడానికి యేసును వాళ్లకు అప్పగించాడు.+
దాంతో వాళ్లు యేసును తీసుకెళ్లిపోయారు. 17 యేసే స్వయంగా హింసాకొయ్యను* మోసుకుంటూ, “కపాల స్థలం” అనబడిన చోటికి వెళ్లాడు.+ హీబ్రూ భాషలో దాన్ని గొల్గొతా అని పిలుస్తారు.+ 18 అక్కడ వాళ్లు ఆయన్ని మేకులతో కొయ్యకు దిగగొట్టి,+ ఇంకో ఇద్దరితోపాటు వేలాడదీశారు. ఒకర్ని ఆయన కుడిపక్కన, ఇంకొకర్ని ఆయన ఎడమపక్కన వేలాడదీశారు.+ 19 అంతేకాదు, పిలాతు ఒక పలక మీద “నజరేయుడైన యేసు యూదుల రాజు” అని రాయించి ఆ హింసాకొయ్యపై* పెట్టించాడు.+ 20 యేసును కొయ్యపై వేలాడదీసిన ఆ చోటు యెరూషలేముకు దగ్గర్లో ఉంది కాబట్టి చాలామంది యూదులు ఆ మాటలు చదివారు; అవి హీబ్రూ, లాటిన్, గ్రీకు భాషల్లో రాయబడ్డాయి. 21 అయితే యూదుల ముఖ్య యాజకులు పిలాతుతో ఇలా అన్నారు: “ ‘యూదుల రాజు’ అని రాయవద్దు, ‘నేను యూదుల రాజుని’ అని అతను చెప్పుకున్నాడు అన్నట్టు రాయి.” 22 దానికి పిలాతు, “నేను రాసిందేదో రాశాను” అన్నాడు.
23 సైనికులు యేసును మేకులతో కొయ్యకు దిగగొట్టిన తర్వాత, ఆయన పైవస్త్రాలు తీసుకుని ఒక్కో సైనికుడికి ఒక్కో భాగం వచ్చేలా వాటిని నాలుగు భాగాలు చేశారు. వాళ్లు ఆయన లోపలి వస్త్రాన్ని కూడా తీసుకున్నారు. అది కుట్టులేకుండా పైనుండి కిందివరకు నేయబడింది. 24 కాబట్టి వాళ్లు, “మనం దీన్ని చింపకుండా, చీట్లు* వేసి ఎవరికి వస్తుందో చూద్దాం” అని చెప్పుకున్నారు.+ “వాళ్లు నా వస్త్రాల్ని పంచుకున్నారు, నా వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నారు” అనే లేఖనం నెరవేరడానికి ఇలా జరిగింది.+ కాబట్టి ఆ సైనికులు నిజంగా లేఖనంలో ఉన్నట్టే చేశారు.
25 యేసు హింసాకొయ్య* దగ్గర ఆయన తల్లి,+ ఆమె సహోదరి; క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ+ నిలబడివున్నారు. 26 తన తల్లి, తాను ప్రేమించిన శిష్యుడు+ దగ్గర్లో నిలబడి ఉండడం చూసి యేసు తన తల్లితో, “అమ్మా, ఇదిగో! నీ కుమారుడు!” అన్నాడు. 27 తర్వాత ఆ శిష్యుడితో, “ఇదిగో! మీ అమ్మ!” అన్నాడు. కాబట్టి ఆమె తన ఇంట్లో ఉండేలా ఆ శిష్యుడు ఆ రోజే ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు.
28 ఆ తర్వాత యేసు అప్పటికి అంతా పూర్తయిందని తెలిసి, లేఖనం నెరవేర్చడం కోసం, “నాకు దాహంగా ఉంది”+ అన్నాడు. 29 అక్కడ పుల్లటి ద్రాక్షారసం నిండివున్న ఒక పాత్ర ఉంది. కాబట్టి అక్కడున్న వాళ్లు ఒక స్పాంజీని ఆ పుల్లటి ద్రాక్షారసంలో ముంచి, హిస్సోపు* కొమ్మకు తగిలించి ఆయన నోటికి అందించారు.+ 30 యేసు ఆ పుల్లటి ద్రాక్షారసాన్ని రుచి చూసిన తర్వాత, “అంతా పూర్తయింది!”+ అన్నాడు. అప్పుడు ఆయన తల వంచి, తుదిశ్వాస విడిచాడు.*+
31 అది సిద్ధపడే రోజు;+ విశ్రాంతి రోజున (అది గొప్ప విశ్రాంతి రోజు)+ మృతదేహాలు హింసాకొయ్యలకు వేలాడుతూ ఉండకూడదు+ కాబట్టి యూదులు పిలాతును వాళ్ల కాళ్లు విరగగొట్టించి వాళ్ల దేహాల్ని కిందికి దింపించమని అడిగారు. 32 అప్పుడు సైనికులు వచ్చి, యేసు పక్కన వేలాడదీయబడిన మొదటి వ్యక్తి కాళ్లు, రెండో వ్యక్తి కాళ్లు విరగగొట్టారు. 33 కానీ వాళ్లు యేసు దగ్గరికి వచ్చేసరికి ఆయన అప్పటికే చనిపోయి ఉండడంతో వాళ్లు ఆయన కాళ్లు విరగగొట్టలేదు. 34 అయితే ఒక సైనికుడు ఈటెతో ఆయన పక్కటెముకల్లో పొడిచాడు.+ వెంటనే రక్తం, నీళ్లు బయటికి వచ్చాయి. 35 దీన్ని చూసిన వ్యక్తి ఈ సాక్ష్యం ఇచ్చాడు, అతని సాక్ష్యం సత్యం. తాను చెప్తున్నది సత్యమని అతనికి తెలుసు, కాబట్టి మీరు కూడా నమ్మేలా అతను ఈ విషయాలు చెప్తున్నాడు.+ 36 నిజానికి, “ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరగగొట్టబడదు” అనే లేఖనం నెరవేరడానికి+ ఇవి జరిగాయి. 37 అలాగే, “వాళ్లు తాము పొడిచిన వ్యక్తి వైపు చూస్తారు” అని ఇంకో లేఖనం చెప్తుంది.+
38 ఇవి జరిగాక, అరిమతయియకు చెందిన యోసేపు యేసు శరీరాన్ని తీసుకెళ్లడానికి పిలాతును అనుమతి అడిగాడు. ఈ యోసేపు యేసు శిష్యుడు, కానీ యూదులకు భయపడి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.+ పిలాతు అనుమతి ఇవ్వడంతో అతను వచ్చి, యేసు శరీరాన్ని తీసుకెళ్లాడు.+ 39 అంతకుముందు రాత్రిపూట యేసు దగ్గరికి వచ్చిన నీకొదేము+ కూడా సుమారు 30 కిలోల* బోళం-అగరు మిశ్రమాన్ని* తీసుకొచ్చాడు.+ 40 కాబట్టి వాళ్లు యేసు శరీరాన్ని తీసుకుని, సమాధి చేసేముందు యూదుల ఆచారం ప్రకారం సుగంధ ద్రవ్యాలు ఉంచిన నారవస్త్రాలతో దాన్ని చుట్టారు.+ 41 యేసుకు మరణశిక్ష విధించిన* చోట ఒక తోట ఉంది, ఆ తోటలో ఒక కొత్త సమాధి*+ ఉంది. దానిలో అప్పటివరకు ఎవర్నీ పెట్టలేదు. 42 అది యూదుల సిద్ధపడే రోజు, పైగా ఆ సమాధి దగ్గర్లో ఉంది కాబట్టి వాళ్లు యేసును అందులో పెట్టారు.
20 వారం మొదటి రోజున* ఇంకా తెల్లవారకముందే మగ్దలేనే మరియ సమాధి* దగ్గరికి వచ్చింది.+ అయితే అప్పటికే సమాధికి* ఉన్న రాయి దొర్లించబడి ఉండడం ఆమె చూసింది.+ 2 దాంతో ఆమె పరుగెత్తుకుంటూ సీమోను పేతురు దగ్గరికి, యేసు ప్రేమించిన ఇంకో శిష్యుడి+ దగ్గరికి వచ్చి, “వాళ్లు ప్రభువును సమాధిలో నుండి తీసుకెళ్లిపోయారు,+ ఆయన్ని ఎక్కడ ఉంచారో మాకు తెలీదు” అని చెప్పింది.
3 అప్పుడు పేతురు, ఆ ఇంకో శిష్యుడు సమాధి దగ్గరికి బయల్దేరారు. 4 వాళ్లిద్దరూ కలిసి పరుగెత్తడం మొదలుపెట్టారు, ఆ ఇంకో శిష్యుడు పేతురుకన్నా వేగంగా పరుగెత్తి సమాధి దగ్గరికి ముందుగా చేరుకున్నాడు. 5 అతను లోపలికి వంగి చూసినప్పుడు, అక్కడ నారవస్త్రాలు పడివున్నాయి.+ అయితే అతను లోపలికి వెళ్లలేదు. 6 అతని వెనక సీమోను పేతురు కూడా వచ్చాడు. అతను సమాధిలోకి వెళ్లి, అక్కడ నారవస్త్రాలు పడివుండడం చూశాడు. 7 యేసు తలకు చుట్టబడిన నారవస్త్రం మిగతా నారవస్త్రాల దగ్గర లేదు. అది చుట్టబడి వేరే చోట ఉంది. 8 అప్పుడు సమాధి దగ్గరికి ముందుగా చేరుకున్న శిష్యుడు కూడా లోపలికి వెళ్లి, చూసి, నమ్మాడు. 9 ఆయన మృతుల్లో నుండి లేస్తాడనే లేఖనాన్ని+ వాళ్లు అప్పటికి ఇంకా అర్థంచేసుకోలేదు. 10 కాబట్టి శిష్యులు తమ ఇళ్లకు తిరిగెళ్లిపోయారు.
11 అయితే మరియ ఏడుస్తూ సమాధి బయటే నిలబడి ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసినప్పుడు, 12 యేసు శరీరం ఉంచబడిన చోట తెల్లని వస్త్రాలు వేసుకున్న ఇద్దరు దేవదూతలు+ ఆమెకు కనిపించారు. తలవైపు ఒక దూత, కాళ్లవైపు ఒక దూత కూర్చొని ఉన్నారు. 13 వాళ్లు ఆమెను, “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు. అప్పుడు ఆమె, “ఎవరో నా ప్రభువును తీసుకెళ్లిపోయారు, ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలీదు” అంది. 14 ఆ మాట అని ఆమె వెనక్కి తిరిగి చూసింది. అక్కడ యేసు నిలబడివున్నాడు, కానీ ఆయన యేసని ఆమె గుర్తుపట్టలేదు.+ 15 యేసు ఆమెను, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి కోసం వెదుకుతున్నావు?” అని అడిగాడు. ఆమె ఆయన్ని తోటమాలి అనుకుని, “అయ్యా, నువ్వు ఆయన్ని తీసుకెళ్లివుంటే ఆయన్ని ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ని తీసుకెళ్తాను” అంది. 16 అప్పుడు యేసు, “మరియా!” అన్నాడు. ఆమె వెనక్కి తిరిగి హీబ్రూ భాషలో, “రబ్బోనీ!” (అంటే “బోధకుడా!” అని అర్థం) అని పిలిచింది. 17 యేసు ఆమెతో ఇలా అన్నాడు: “నేనింకా తండ్రి దగ్గరికి వెళ్లలేదు కాబట్టి నన్ను అలాగే పట్టుకుని ఉండవద్దు. అయితే, నా సహోదరుల దగ్గరికి వెళ్లి,+ ‘నా తండ్రీ మీ తండ్రీ, నా దేవుడూ+ మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను’+ అని చెప్పు.” 18 మగ్దలేనే మరియ వెళ్లి, “నేను ప్రభువును చూశాను!” అని శిష్యులతో చెప్పింది. అంతేకాదు, యేసు తనకు ఏంచెప్పాడో వాళ్లకు తెలియజేసింది.+
19 వారం మొదటి రోజైన ఆ రోజు సాయంత్రం యేసు శిష్యులు ఒక ఇంట్లో కలుసుకున్నారు; వాళ్లు యూదులకు భయపడి తలుపులు గట్టిగా వేసుకున్నారు. అప్పుడు యేసు వచ్చి వాళ్ల మధ్యలో నిలబడి, “మీకు శాంతి కలగాలి”+ అన్నాడు. 20 ఆ మాట అన్న తర్వాత ఆయన తన చేతుల్ని, తన పక్కభాగాన్ని వాళ్లకు చూపించాడు.+ అప్పుడు శిష్యులు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు.+ 21 యేసు మళ్లీ వాళ్లతో, “మీకు శాంతి కలగాలి.+ తండ్రి నన్ను పంపించినట్టే+ నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను”+ అన్నాడు. 22 ఆ మాటలు అన్న తర్వాత యేసు వాళ్ల మీద ఊది ఇలా అన్నాడు: “పవిత్రశక్తిని పొందండి.+ 23 మీరు ఎవరి పాపాలనైనా క్షమిస్తే, వాళ్ల పాపాలు అప్పటికే క్షమించబడ్డాయి. మీరు ఎవరి పాపాలనైనా క్షమించకపోతే అవి అలాగే నిలిచివున్నాయి.”
24 యేసు వచ్చినప్పుడు పన్నెండుమందిలో ఒకడైన తోమా+ వాళ్లతోపాటు లేడు. అతనికి దిదుమ అనే పేరు కూడా ఉంది. 25 కాబట్టి మిగతా శిష్యులు అతనితో, “మేము ప్రభువును చూశాం!” అని చెప్పారు. అయితే తోమా వాళ్లతో, “నేను ఆయన చేతుల్లోని మేకుల గాయాల్ని చూసి, వాటిని నా వేలితో ముట్టుకుని, ఆయన పక్కభాగంలో నా చేతిని ఉంచితేనేగానీ+ నమ్మను” అన్నాడు.
26 ఎనిమిది రోజుల తర్వాత ఆయన శిష్యులు మళ్లీ ఇంట్లో కలుసుకున్నారు, అప్పుడు తోమా కూడా వాళ్లతో ఉన్నాడు. తలుపులు మూసివున్నా యేసు వచ్చి వాళ్ల మధ్య నిలబడి, “మీకు శాంతి కలగాలి”+ అన్నాడు. 27 తర్వాత ఆయన తోమాతో, “నీ వేలితో నా చేతుల్ని ముట్టుకో. నీ చేతిని నా పక్కభాగంలో ఉంచు. ఇక సందేహపడడం మాని, నమ్ము” అన్నాడు. 28 అప్పుడు తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు. 29 యేసు అతనితో, “నువ్వు నన్ను చూశావు కాబట్టి నమ్ముతున్నావా? చూడకుండానే నమ్మేవాళ్లు సంతోషంగా ఉంటారు” అన్నాడు.
30 నిజానికి యేసు, శిష్యుల ముందు ఇంకా చాలా అద్భుతాలు చేశాడు, కానీ అవి ఈ గ్రంథపు చుట్టలో రాయబడలేదు.+ 31 అయితే, యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మేలా, అలా నమ్మి ఆయన పేరు ద్వారా జీవం పొందేలా ఇవి రాయబడ్డాయి.+
21 ఆ తర్వాత యేసు తిబెరియ సముద్రం దగ్గర శిష్యులకు మళ్లీ కనిపించాడు.* ఆయన ఈ విధంగా కనిపించాడు:* 2 సీమోను పేతురు, తోమా (ఇతనికి దిదుమ అనే పేరు కూడా ఉంది),+ గలిలయలోని కానాకు చెందిన నతనయేలు,+ జెబెదయి కుమారులు,+ యేసు శిష్యుల్లో ఇంకో ఇద్దరు అంతా ఒక చోట ఉన్నారు. 3 అప్పుడు సీమోను పేతురు వాళ్లతో, “నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను” అన్నాడు. వాళ్లు, “మేము కూడా నీతో వస్తాం” అన్నారు. దాంతో వాళ్లు పడవలో బయల్దేరారు. కానీ ఆ రాత్రి వాళ్లకు అసలు చేపలే దొరకలేదు.+
4 తెల్లవారుతున్నప్పుడు యేసు సముద్రం ఒడ్డున నిలబడ్డాడు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.+ 5 అప్పుడు యేసు వాళ్లను, “పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా?”* అని అడిగాడు. వాళ్లు, “లేదు” అన్నారు. 6 అప్పుడు ఆయన, “పడవ కుడిపక్క వల వేయండి, మీకు కొన్ని చేపలు దొరుకుతాయి” అని వాళ్లకు చెప్పాడు. దాంతో వాళ్లు వల వేశారు, అయితే చాలా చేపలు పడడంతో వాళ్లు వలను లాగలేకపోయారు.+ 7 అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు+ పేతురుతో, “ఆయన ప్రభువే!” అని చెప్పాడు. ఆయన ప్రభువని విన్నప్పుడు, సీమోను పేతురు తన పైవస్త్రం వేసుకుని సముద్రంలోకి దూకాడు, ఎందుకంటే అప్పటివరకు అతను బట్టల్లేకుండా* ఉన్నాడు. 8 కానీ మిగతా శిష్యులు చేపలతో నిండిన వలను లాక్కుంటూ పడవలో వచ్చారు, ఎందుకంటే వాళ్లు ఒడ్డుకు దాదాపు 90 మీటర్ల* దూరంలోనే ఉన్నారు.
9 వాళ్లు ఒడ్డుకు చేరుకున్నప్పుడు, కాలుతున్న బొగ్గుల మీద ఉన్న చేపల్ని, రొట్టెను చూశారు. 10 యేసు వాళ్లతో, “మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకురండి” అన్నాడు. 11 కాబట్టి సీమోను పేతురు పడవ ఎక్కి, పెద్ద చేపలతో నిండివున్న ఆ వలను ఒడ్డుకు లాగాడు. అందులో 153 చేపలు ఉన్నాయి. అన్ని చేపలున్నా ఆ వల పిగిలిపోలేదు. 12 యేసు వాళ్లతో, “వచ్చి భోంచేయండి” అన్నాడు. అయితే శిష్యుల్లో ఎవరూ ఆయన్ని, “నువ్వు ఎవరు?” అని అడిగే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రభువని వాళ్లకు తెలుసు. 13 యేసు రొట్టెను తీసుకుని వాళ్లకు ఇచ్చాడు, అలాగే చేపల్ని కూడా ఇచ్చాడు. 14 యేసు మృతుల్లో నుండి లేపబడిన తర్వాత శిష్యులకు కనబడడం ఇది మూడోసారి.+
15 వాళ్లు భోజనం చేశాక యేసు సీమోను పేతురును, “యోహాను కుమారుడివైన సీమోనూ, నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. అందుకు పేతురు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అని ఆయనతో అన్నాడు. అప్పుడు యేసు పేతురుతో, “నా గొర్రెపిల్లల్ని మేపు”+ అని చెప్పాడు. 16 యేసు మళ్లీ రెండోసారి, “యోహాను కుమారుడివైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. అందుకు పేతురు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు పేతురుతో, “నా చిన్న గొర్రెల్ని కాయి”+ అన్నాడు. 17 యేసు మూడోసారి పేతురును, “యోహాను కుమారుడివైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. యేసు మూడోసారి, “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగేసరికి పేతురు చాలా బాధపడి, “ప్రభువా, నీకు అన్నీ తెలుసు; నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు పేతురుతో ఇలా అన్నాడు: “నా చిన్న గొర్రెల్ని మేపు.+ 18 నేను చాలా ఖచ్చితంగా నీతో చెప్తున్నాను, నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే బట్టలు వేసుకుని నీకు నచ్చిన చోటికి వెళ్లేవాడివి. కానీ నువ్వు ముసలివాడివి అయినప్పుడు నువ్వు చేతులు చాపుతావు, ఇంకెవరో నీకు బట్టలు వేసి నీకు నచ్చని చోటికి నిన్ను తీసుకెళ్తారు.” 19 పేతురు ఎలాంటి మరణం ద్వారా దేవునికి మహిమ తెస్తాడో సూచించడానికి యేసు ఆ మాట అన్నాడు. ఆ మాట అన్నాక యేసు పేతురుతో, “నన్ను అనుసరిస్తూ ఉండు”+ అని చెప్పాడు.
20 పేతురు వెనక్కి తిరిగి, యేసు ప్రేమించిన శిష్యుడు+ తమ వెనక రావడం చూశాడు. రాత్రి భోజనమప్పుడు యేసు రొమ్మును ఆనుకొని, “ప్రభువా, నిన్ను అప్పగించబోతున్నది ఎవరు?” అని అడిగింది అతనే. 21 అతన్ని చూసినప్పుడు పేతురు, “ప్రభువా, మరి ఇతని సంగతేంటి?” అని యేసును అడిగాడు. 22 అప్పుడు యేసు, “నేను వచ్చేంతవరకు అతను ఉండడం నాకిష్టమైతే నీకేంటి? నువ్వైతే నన్ను అనుసరిస్తూ ఉండు” అని పేతురుతో అన్నాడు. 23 కాబట్టి ఆ శిష్యుడు చావడు అనే మాట సహోదరుల్లో వ్యాపించింది. అయితే అతను చావడని యేసు అతనితో అనలేదు కానీ, “నేను వచ్చేంతవరకు అతను ఉండడం నాకిష్టమైతే నీకేంటి?” అని మాత్రమే అన్నాడు.
24 వీటి గురించి సాక్ష్యం ఇస్తున్నది, వీటిని రాసింది ఆ శిష్యుడే.+ అతని సాక్ష్యం సత్యమని మనకు తెలుసు.
25 నిజానికి యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ఒక్కోదాని గురించి వివరంగా రాస్తే, అలా రాసిన గ్రంథపు చుట్టల్ని పెట్టడానికి ఈ లోకం కూడా సరిపోదని నాకు అనిపిస్తుంది.+
లేదా “దేవునిలా ఉన్నాడు.”
లేదా “అపారదయతో.”
లేదా “తండ్రి రొమ్మున ఉన్న.” ఇది ప్రత్యేక అనుగ్రహం ఉన్న స్థానాన్ని సూచిస్తుంది.
అనుబంధం A5 చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “వ్యక్తి స్వరాన్ని.”
అక్ష., “ఈయన ఇశ్రాయేలుకు వెల్లడిచేయబడాలని.”
అక్ష., “దాదాపు పదో గంట అయింది.”
“కేఫా” లేదా “పేతురు” అంటే “రాయి” అని అర్థం.
ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం, ఆకాశాన్ని గానీ పరలోకాన్ని గానీ సూచిస్తుండవచ్చు.
యేసు తన గురించి చెప్పడానికే ఈ పదం వాడాడు. పదకోశం చూడండి.
అక్ష., “ఓ స్త్రీ, నాకేంటి? నీకేంటి?” ఏదైనా విషయంలో అభ్యంతరం తెలపడానికి ఈ నానుడి ఉపయోగిస్తారు. “స్త్రీ” అనడం గౌరవం లేకపోవడం కాదు.
బహుశా 22 లీటర్లతో సమానమైన బాత్ కొలతలు. అనుబంధం B14 చూడండి.
లేదా “సంతలా.”
అక్ష., “ఇంటి.”
లేదా “పైనుండి పుడితేనే” అయ్యుంటుంది.
లేదా “గద్దించబడతాయని.”
అక్ష., “తమ ముద్ర వేశారు.”
లేదా “కొలిచి.”
లేదా “ఊట; బుగ్గ.”
అక్ష., “దాదాపు ఆరో గంట.”
పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
అక్ష., “తెల్లబారి ఉన్నాయి.”
అక్ష., “ఏడో గంటకు.”
అక్ష., “ఎండిపోయినవాళ్లు.”
అనుబంధం A3 చూడండి.
లేదా “చాప; మంచం.”
లేదా “చాప; మంచం.”
లేదా “సబ్బాతు.”
లేదా “చాప; మంచం.”
లేదా “చాప; మంచం.”
లేదా “తండ్రికి కుమారుడి మీద అనురాగం ఉంది.”
లేదా “జీవ వరం తండ్రిలో ఉంది.” అక్ష., “తండ్రి తనలో జీవం కలిగివున్నాడు.”
అక్ష., “తనలో జీవం కలిగివుండే.”
లేదా “స్మారక సమాధుల్లో.”
లేదా “పునరుత్థానం అవుతారు.”
అంటే, లేఖనాలు.
అనుబంధం B14 చూడండి.
దాదాపు ఐదారు కిలోమీటర్లు. అక్ష., “దాదాపు 25 నుండి 30 స్టేడియా.” అనుబంధం B14 చూడండి.
లేదా “ఆకాశం.”
లేదా “పునరుత్థానం చేయాలన్నదే.”
అనుబంధం A5 చూడండి.
అక్ష., “మీలో జీవం ఉండదు.”
లేదా “ప్రజా సభలో” అయ్యుంటుంది.
పదకోశం చూడండి.
అపవాది కోసం ఉపయోగించబడిన గ్రీకు పదం, ఇతరుల మంచిపేరును పాడుచేసే వ్యక్తిని సూచిస్తుంది.
లేదా “పర్ణశాలల.”
అంటే, రబ్బీల పాఠశాలల్లో.
అక్ష., “రాతలు.”
పదకోశం చూడండి.
లేదా “విశ్రాంతి రోజున చేసిన.”
లేదా “నిజంగా ఉన్నాడు.”
లేదా “ప్రతినిధిగా.”
లేదా “బంధించడానికి.”
లేదా “బంధించాలని.”
ఎన్నో ముఖ్యమైన ప్రాచీన అధికారిక రాతప్రతుల్లో యోహాను 7:53–8:11 వచనాలు లేవు.
లేదా “ప్రమాణాల.”
అక్ష., “నా వాక్యంలో నిలిచివుంటేనే.”
లేదా “విడుదల.”
అక్ష., “లైంగిక పాపాల వల్ల పుట్టిన సంతానం.” గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
లేదా “ఐక్యంగా ఉన్నాం.”
లేదా “దేవునిలాంటి వాళ్లు.”
లేదా “స్మారక సమాధిలో.”
దాదాపు మూడు కిలోమీటర్లు. అక్ష., “దాదాపు 15 స్టేడియా.” అనుబంధం B14 చూడండి.
లేదా “పునరుత్థానమప్పుడు.”
అక్ష., “పునరుత్థానాన్ని, జీవాన్ని నేనే.”
లేదా “స్మారక సమాధి.”
లేదా “స్మారక సమాధి.”
అంటే, ఆలయాన్ని.
లేదా “బంధించడం.”
పదకోశం చూడండి.
అక్ష., “ఒక పౌండ్,” అంటే రోమా పౌండ్. అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
అనుబంధం A5 చూడండి.
లేదా “స్మారక సమాధి.”
అక్ష., “నాశనం చేసుకుంటాడు.”
లేదా “ప్రాణాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండే.”
అక్ష., “ఈ గంట నుండి.”
అంటే, కొయ్యకు వేలాడదీసినప్పుడు.
అనుబంధం A5 చూడండి.
అక్ష., “మా నుండి విన్న.”
అనుబంధం A5 చూడండి.
అంటే, క్రీస్తు.
అక్ష., “మహిమ.”
లేదా “మీకు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాల్సిన బాధ్యత ఉంది.”
అక్ష., “నా మీదికి తన మడిమె ఎత్తాడు.”
అక్ష., “రొమ్మున ఆనుకొని.”
లేదా “ఓదార్పునిచ్చేవాణ్ణి.”
లేదా “ఎప్పుడూ నా ప్రేమను పొందేవాళ్లుగా ఉండండి.”
అక్ష., “నా పేరు కారణంగా.”
పవిత్రశక్తిని ఒక వ్యక్తిలా వర్ణిస్తూ యేసు “సహాయకుడు” (గ్రీకులో పుంలింగ పదం) అనే పదం ఉపయోగించాడు. పవిత్రశక్తి అనేది వ్యక్తి కాదు శక్తి మాత్రమే. దీనికి గ్రీకు భాషలో నపుంసక లింగాన్ని ఉపయోగిస్తారు.
అక్ష., “చూస్తాను.”
లేదా “తండ్రికి మీమీద అనురాగం ఉంది.”
లేదా “మీకు నామీద అనురాగం ఉంది.”
లేదా “తెలియజేశాను.”
లేదా “లోకానికి చెందినవాణ్ణి.”
లేదా “ప్రత్యేకపర్చు.”
అక్ష., “(విత్తనం) పడకముందే,” అంటే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టకముందే.
లేదా “చలికాలంలో ప్రవహించే కిద్రోను వాగు.”
ఇతని కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.
అంటే, అన్న.
లేదా “నేరస్తుడు కాకపోతే.”
లేదా “జయం!”
లేదా “అతనికి కొయ్య శిక్ష వేసి చంపేయండి! అతనికి కొయ్య శిక్ష వేసి చంపేయండి!”
లేదా “కొయ్య శిక్ష వేసి చంపేయండి!”
లేదా “నీకు కొయ్య శిక్ష వేసి చంపే.”
లేదా “కైసరును వ్యతిరేకిస్తున్నట్టే.”
ఇక్కడ ‘పస్కా’ అనే పదం ఏడు రోజుల పులవని రొట్టెల పండుగతో కూడిన పస్కా వారాన్ని సూచిస్తోంది. లూకా 22:1తో పోల్చండి.
అక్ష., “దాదాపు ఆరో గంట.”
లేదా “అతనికి కొయ్య శిక్ష వేసి చంపేయండి!”
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
లేదా “ఊపిరి వదిలేశాడు.” పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
అక్ష., “వంద పౌండ్‌ల,” అంటే రోమా పౌండ్‌లు. అనుబంధం B14 చూడండి.
లేదా “మూటను” అయ్యుంటుంది.
లేదా “కొయ్య శిక్ష వేసి చంపిన.”
లేదా “స్మారక సమాధి.”
మత్తయి 28:1 అధస్సూచి చూడండి.
లేదా “స్మారక సమాధి.”
లేదా “స్మారక సమాధికి.”
లేదా “తనను తాను వెల్లడిచేసుకున్నాడు.”
లేదా “వెల్లడిచేసుకున్నాడు.”
లేదా “ఏమైనా చేపలు ఉన్నాయా?”
లేదా “చాలీచాలని బట్టలతో.”
అక్ష., “దాదాపు 200 మూరల.” అనుబంధం B14 చూడండి.