కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt యోనా 1:1-4:11
  • యోనా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యోనా
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యోనా

యోనా

1 యెహోవా వాక్యం అమిత్తయి కుమారుడైన యోనా*+ దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 2 “లేచి, మహా నగరమైన నీనెవెకు+ వెళ్లి దానికి వ్యతిరేకంగా తీర్పును ప్రకటించు. ఎందుకంటే వాళ్ల చెడుతనం నా దృష్టికి వచ్చింది.”

3 కానీ యోనా యెహోవా నుండి దూరంగా తర్షీషుకు పారిపోవాలనుకున్నాడు; అతను యొప్పేకు వెళ్లాడు, అక్కడ అతనికి తర్షీషుకు వెళ్లే ఒక ఓడ కనిపించింది. అతను ప్రయాణం కోసం డబ్బులిచ్చి, తర్షీషుకు వెళ్లే ఓడ ఎక్కాడు. యెహోవాకు దూరంగా వెళ్లాలని అలా చేశాడు.

4 అప్పుడు యెహోవా సముద్రంలో పెద్దగాలి వీచేలా చేశాడు. దాంతో సముద్రంలో ఎంత భయంకరమైన తుఫాను వచ్చిందంటే, ఓడ దాదాపు బద్దలయ్యే పరిస్థితి వచ్చింది. 5 నావికులు చాలా భయపడిపోయి, వాళ్లలో ప్రతీ ఒక్కరు సహాయం కోసం వాళ్లవాళ్ల దేవుళ్లను వేడుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఓడను తేలిక చేయడానికి అందులోని సరుకుల్ని సముద్రంలోకి పడేయడం మొదలుపెట్టారు.+ అయితే యోనా ఓడ* అడుగుభాగానికి వెళ్లి, అక్కడ పడుకొని గాఢనిద్రలోకి జారుకున్నాడు. 6 ఓడ అధికారి యోనా దగ్గరికి వచ్చి, “నువ్వు నిద్రపోతున్నావేంటి? లే, నీ దేవుణ్ణి వేడుకో! బహుశా సత్యదేవుడు మన మీద కనికరం చూపిస్తాడేమో, అప్పుడు మనం చావకుండా ఉంటాం” అని అన్నాడు.+

7 తర్వాత వాళ్లు ఒకరితోఒకరు ఇలా అనుకున్నారు: “రండి, ఈ విపత్తు ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకోవడానికి చీట్లు* వేద్దాం.”+ వాళ్లు చీట్లు వేసినప్పుడు యోనా పేరున చీటి పడింది.+ 8 అప్పుడు వాళ్లు అతనితో ఇలా అన్నారు: “ఎవరి వల్ల ఈ విపత్తు మా మీదికి వచ్చిందో దయచేసి చెప్పు. నువ్వు ఏ పని చేస్తావు? ఎక్కడి నుండి వచ్చావు? నీది ఏ దేశం? నీ ప్రజలు ఎవరు?”

9 యోనా ఇలా చెప్పాడు: “నేను ఒక హెబ్రీయుణ్ణి. పరలోక దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు గలవాణ్ణి.* సముద్రాన్ని, భూమిని సృష్టించింది ఆయనే.”

10 తర్వాత యోనా తాను యెహోవా నుండి పారిపోతున్నానని చెప్పాడు. అది విన్నప్పుడు వాళ్లు ఇంకా భయపడి, “నువ్వు ఎందుకలా చేశావు?” అన్నారు. 11 అంతేకాదు, సముద్రంలో తుఫాను అంతకంతకు తీవ్రమౌతుండడంతో, “సముద్రం శాంతించాలంటే మేము నీకేం చేయాలి?” అని అతన్ని అడిగారు. 12 అప్పుడు యోనా ఇలా అన్నాడు: “నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. అప్పుడు సముద్రం శాంతిస్తుంది; నా వల్లే ఈ భయంకరమైన తుఫాను మీ మీదికి వచ్చిందని నాకు తెలుసు.” 13 అయితే, నావికులు చాలా కష్టపడి తెడ్లు వేస్తూ ఓడను ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ల వల్ల కాలేదు. ఎందుకంటే, తుఫాను అంతకంతకు ఎక్కువౌతోంది.

14 అప్పుడు వాళ్లు యెహోవాను ఇలా వేడుకున్నారు: “యెహోవా, దయచేసి ఈ మనిషి వల్ల మేము నశించిపోకుండా చూడు! యెహోవా, నిర్దోషిని చంపామనే నేరం* మా మీద మోపవద్దు, ఎందుకంటే ఇది నీ ఇష్టానుసారంగా జరుగుతోంది.” 15 తర్వాత వాళ్లు యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు; దాంతో సముద్రం నిమ్మళించింది. 16 అది చూసి వాళ్లు యెహోవాకు ఎంతో భయపడ్డారు.+ వాళ్లు యెహోవాకు ఒక బలి అర్పించి, మొక్కుబడులు చేసుకున్నారు.

17 అప్పుడు యెహోవా యోనాను మింగడానికి ఒక పెద్ద చేపను పంపించాడు. యోనా ఆ చేప కడుపులో మూడు పగళ్లు, మూడు రాత్రులు ఉన్నాడు.+

2 అప్పుడు యోనా చేప కడుపులో నుండి తన దేవుడైన యెహోవాకు ప్రార్థించాడు.+ 2 అతను ఇలా ప్రార్థించాడు:

“నేను బాధలో ఉండగా యెహోవాను వేడుకున్నాను, ఆయన నాకు జవాబిచ్చాడు.+

సహాయం కోసం నేను సమాధి* గర్భంలో* నుండి మొరపెట్టాను.+

నువ్వు నా స్వరం విన్నావు.

 3 నువ్వు నన్ను అగాధంలోకి, సముద్రగర్భంలోకి విసిరేసినప్పుడు

ప్రవాహాలు నన్ను చుట్టుముట్టాయి.+

నీ తరంగాలన్నీ, అలలన్నీ నన్ను ముంచెత్తాయి.+

 4 ‘నీ కళ్లముందు నుండి నేను వెలివేయబడ్డానే!

మళ్లీ నీ పవిత్ర ఆలయాన్ని చూసేదెలా?’ అని నేను అనుకున్నాను.

 5 నా ప్రాణం పోయేంతగా నీళ్లు నన్ను చుట్టుముట్టాయి;+

అగాధ జలాలు నన్ను కప్పేశాయి.

సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంది.

 6 పర్వతాల పునాదుల వరకు నేను మునిగిపోయాను.

భూమి శాశ్వతంగా నా మీద తలుపులు మూసేసింది.

అయితే యెహోవా, నా దేవా, సమాధిలో* నుండి నువ్వు నన్ను సజీవుడిగా పైకి తెచ్చావు.+

 7 నా ప్రాణం పోతుండగా నేను యెహోవాను గుర్తుచేసుకున్నాను.+

అప్పుడు నా ప్రార్థన నీ దగ్గరికి, నీ పవిత్ర ఆలయంలోకి చేరింది.+

 8 వ్యర్థమైన విగ్రహాల్ని పూజించేవాళ్లు తమ మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తున్న వ్యక్తిని విడిచిపెడతారు.*

 9 కానీ నేను మాత్రం నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను, నీకు బలి అర్పిస్తాను.

నేను ఏమి మొక్కుకున్నానో అది తీరుస్తాను.+

రక్షణ యెహోవా నుండే వస్తుంది.”+

10 అంతలో యెహోవా ఆ చేపకు ఆజ్ఞ ఇవ్వడంతో అది యోనాను ఒడ్డు మీద కక్కేసింది.

3 అప్పుడు యెహోవా వాక్యం రెండోసారి యోనా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:+ 2 “లేచి మహా నగరమైన నీనెవెకు+ వెళ్లి, నేను నీకు చెప్పే సందేశాన్ని దానికి ప్రకటించు.”

3 కాబట్టి యోనా లేచి యెహోవా మాటకు లోబడి నీనెవెకు+ వెళ్లాడు.+ నీనెవె చాలా పెద్ద నగరం,* కాలినడకన మూడురోజులు నడిచేంత పెద్దది. 4 యోనా నగరంలోకి ప్రవేశించి, ఒకరోజు నడిచేంత దూరం వెళ్లి, “ఇంకో 40 రోజుల్లో నీనెవె నాశనం చేయబడుతుంది” అని ప్రకటించడం మొదలుపెట్టాడు.

5 అప్పుడు నీనెవె ప్రజలు దేవుని మీద విశ్వాసం ఉంచారు.+ వాళ్లు ఉపవాసాన్ని ప్రకటించి, సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. 6 నీనెవె రాజుకు ఆ సందేశం చేరినప్పుడు అతను తన సింహాసనం మీద నుండి లేచి, రాజవస్త్రాన్ని తీసేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. 7 అంతేకాదు అతను నీనెవె అంతటా ఈ ప్రకటన జారీచేశాడు:

“రాజు, అతని అధికారులు ఆజ్ఞాపించేది ఏమిటంటే, ఏ మనిషి గానీ, జంతువు గానీ, పశువులు గానీ, గొర్రెలు-మేకలు గానీ అస్సలు ఏమీ తినకూడదు. ఎవ్వరూ ఆహారం తినకూడదు, నీళ్లు కూడా తాగకూడదు. 8 మనుషులు, జంతువులు అందరూ గోనెపట్ట కట్టుకోవాలి; వాళ్లు దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోవాలి. తమ చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి, హానికరమైన ప్రవర్తన మానేయాలి. 9 ఒకవేళ సత్యదేవుడు తాను చేయాలనుకుంటున్న దానిగురించి ఇంకోసారి ఆలోచించుకుని* తన కోపాగ్నిని చల్లార్చుకుంటాడేమో, అప్పుడు మనం నాశనమవకుండా ఉంటాం.”

10 వాళ్లు ఏమి చేశారో, వాళ్లు ఎలా తమ చెడు మార్గాల్ని విడిచిపెట్టారో+ సత్యదేవుడు చూసినప్పుడు ఆయన వాళ్ల మీదికి తీసుకొస్తానని చెప్పిన విపత్తు గురించి ఇంకోసారి ఆలోచించాడు.* ఆయన వాళ్ల మీదికి ఆ విపత్తును తీసుకురాలేదు.+

4 కానీ అది యోనాకు అస్సలు నచ్చలేదు, అతనికి విపరీతమైన కోపం వచ్చింది. 2 కాబట్టి అతను యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇలా జరుగుతుందని నా దేశంలో ఉన్నప్పుడే నాకు తెలుసు కదా. అందుకే నేను ముందే తర్షీషుకు పారిపోవాలని చూశాను;+ ఎందుకంటే నువ్వు కనికరం,* కరుణ గల దేవుడివని, ఓర్పును,* ఎంతో విశ్వసనీయ ప్రేమను చూపిస్తావని,+ మనసు మార్చుకుని విపత్తును తీసుకురావని నాకు తెలుసు. 3 యెహోవా, దయచేసి నా ప్రాణం తీసేయి. నేను బ్రతకడం కన్నా చావడం మేలు.”+

4 అప్పుడు యెహోవా ఇలా అడిగాడు: “నువ్వు అంతగా కోప్పడడం న్యాయమేనా?”

5 తర్వాత యోనా నగరం బయటికి వెళ్లి, నగరానికి తూర్పు వైపున కూర్చున్నాడు. అక్కడ తన కోసం ఒక పందిరి వేసుకుని, ఆ నగరానికి ఏమి జరుగుతుందో చూద్దామని ఆ పందిరి నీడలో కూర్చున్నాడు.+

6 అప్పుడు యెహోవా దేవుడు ఒక సొర చెట్టును* యోనాకు పైగా పెరిగేలా చేశాడు. అతని తలకు నీడనిచ్చి, అతని చికాకును తగ్గించడానికి అలా చేశాడు. యోనా ఆ సొర చెట్టును చూసి ఎంతో సంతోషించాడు.

7 అయితే మర్నాడు ఉదయం సత్యదేవుడు ఒక పురుగును పంపించాడు, అది సొర చెట్టును తొలచడంతో ఆ చెట్టు వాడిపోయింది. 8 ఎండ మొదలైనప్పుడు, దేవుడు తూర్పు నుండి వడగాలి కూడా వీచేలా చేశాడు. యోనా తలకు ఎండ బాగా తగిలి సొమ్మసిల్లిపోయాడు. చనిపోవాలని అతను అదేపనిగా కోరుకున్నాడు, “నేను బ్రతకడం కన్నా చావడం మేలు” అని అతను అనుకుంటూ ఉన్నాడు.+

9 దేవుడు యోనాను ఇలా అడిగాడు: “సొర చెట్టు విషయంలో నువ్వు అంతగా కోప్పడడం న్యాయమేనా?”+

దానికి అతను, “నేను కోప్పడడం న్యాయమే. నాకు చచ్చిపోవాలన్నంత కోపం వస్తోంది” అన్నాడు. 10 అయితే యెహోవా ఇలా అన్నాడు: “నువ్వు కష్టపడకుండా, పెంచకుండా, ఒక్క రాత్రిలో పెరిగి ఒక్క రాత్రిలో చచ్చిపోయిన సొర చెట్టు విషయంలోనే నువ్వు ఇంత బాధపడుతున్నావే. 11 మరి కనీసం మంచిచెడులు తెలియని* 1,20,000 కన్నా ఎక్కువమంది ప్రజలు, అలాగే వాళ్ల విస్తారమైన పశువులు ఉన్న నీనెవె మహా నగరం+ విషయంలో నేను బాధపడవద్దా?”+

“పావురం” అని అర్థం.

లేదా “అంతస్తులున్న ఓడ.”

పదకోశం చూడండి.

లేదా “ఆరాధించే వ్యక్తిని.”

అక్ష., “నిర్దోషి రక్తాన్ని.”

లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.

లేదా “లోతుల్లో.”

అక్ష., “గోతిలో.”

లేదా “తమ విశ్వసనీయతను విడిచిపెడతారు” అయ్యుంటుంది.

అక్ష., “దేవుని దృష్టికి గొప్ప నగరం.”

లేదా “మనసు మార్చుకుని.”

లేదా “మనసు మార్చుకున్నాడు.”

లేదా “దయ.”

లేదా “కోప్పడే విషయంలో నిదానిస్తావని.”

లేదా “ఆముదం చెట్టు” అయ్యుంటుంది.

లేదా “తమ కుడిచేతికి, ఎడమచేతికి తేడా తెలియని.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి