కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt పరమగీతము 1:1-8:14
  • పరమగీతం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరమగీతం
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పరమగీతం

పరమగీతం

1 సొలొమోను రాసిన పరమగీతం:*+

 2 “నీ పెదాలతో నన్ను ముద్దుపెట్టుకో,

నీ ప్రేమానురాగాలు ద్రాక్షారసం కన్నా మధురం.+

 3 నువ్వు రాసుకునే పరిమళ తైలం సువాసన గలది.+

నీ పేరు తలమీద పోసిన పరిమళ తైలం లాంటిది.+

అందుకే యువతులు నిన్ను ప్రేమిస్తున్నారు.

 4 రాజు తన అంతఃపురం గదుల్లోకి నన్ను తీసుకొచ్చాడు!

నన్ను నీతో తీసుకెళ్లు; మనం పరుగెత్తుకుంటూ వెళ్లిపోదాం.

ఇద్దరం కలిసి సంతోషిద్దాం, ఉల్లసిద్దాం.

ద్రాక్షారసం కన్నా మధురమైన నీ ప్రేమానురాగాల గురించి మాట్లాడుకుందాం.

అందుకే కదా వాళ్లు* నిన్ను ప్రేమించేది.

 5 యెరూషలేము కూతుళ్లారా,

నేను కేదారు డేరాల్లా+ నల్లగా ఉన్నా,

సొలొమోను డేరా తెరల్లా+ అందంగా ఉంటాను.

 6 నేను నల్లగా ఉన్నానని గుచ్చిగుచ్చి చూడకండి,

నేను ఎండవల్ల నల్లబడ్డాను.

నా సహోదరులకు నా మీద కోపం వచ్చింది;

వాళ్లు నన్ను ద్రాక్షతోటలకు కాపలాగా ఉంచారు,

దానివల్ల నా సొంత ద్రాక్షతోట బాగోగులు నేను చూసుకోలేకపోయాను.

 7 నా ప్రాణ ప్రియుడా,

నీ మందను ఎక్కడ మేపుతావో,+

మధ్యాహ్నం వాటిని ఎక్కడ పడుకోబెడతావో చెప్పు.

నీ సహచరుల మందల మధ్య ముసుగు* వేసుకున్నదానిలా నేను ఎందుకు ఉండాలి?”

 8 “అత్యంత సౌందర్యవతీ,

నీకు తెలీకపోతే, మందల అడుగుజాడలు చూసుకుంటూ వెళ్లు,

గొర్రెల కాపరుల డేరాల దగ్గర నీ మేకపిల్లల్ని మేపు.”

 9 “ప్రియసఖీ, నువ్వు ఫరో రథాల్ని లాగే ఆడ గుర్రంలా* ఉన్నావు.+

10 ఆభరణాల* మధ్య నీ చెక్కిళ్లు,

హారాలతో నీ మెడ ఎంత అందంగా ఉన్నాయి!

11 మేము నీకు బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు చేయిస్తాం.”

12 “రాజు తన బల్ల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు

నా పరిమళ తైలం+ గుబాళిస్తోంది.

13 నా ప్రియుడు, రాత్రంతా నా రొమ్ముల మీద ఉండి సువాసనలు వెదజల్లే బోళం+ సంచి లాంటివాడు.

14 నా ప్రియుడు ఏన్గెదీ+ ద్రాక్షతోటల మధ్య ఉన్న

గోరింట+ పూలగుత్తి లాంటివాడు.”

15 “నా ప్రియురాలా, నువ్వు ఎంత అందంగా ఉన్నావు!

నువ్వు సౌందర్యవతివి! నీ కళ్లు పావురం కళ్లలా ఉంటాయి.”+

16 “నా ప్రియుడా, నువ్వు అందగాడివి, మనోహరుడివి.+

పచ్చగడ్డే మన పాన్పు.

17 దేవదారు మ్రానులు మన ఇంటి* దూలాలు,

సరళవృక్షం* కర్రలు దాని వాసాలు.

2 “నేను షారోనులో* పూసే అడవి పువ్వు* లాంటిదాన్ని,

లోయల్లో పూసే లిల్లీ పువ్వు+ లాంటిదాన్ని.”

 2 “యువతుల మధ్య నా ప్రియురాలు

ముళ్ల మధ్య లిల్లీ పువ్వులా ఉంది.”

 3 “యువకుల మధ్య నా ప్రియుడు

అడవి చెట్ల మధ్య ఆపిల్‌ చెట్టులా ఉన్నాడు.

అతని నీడలో కూర్చోవాలని నేను తపిస్తున్నాను,

అతని పండ్లు నా నోటికి తియ్యగా ఉన్నాయి.

 4 అతను నన్ను విందు గృహానికి తీసుకొచ్చాడు,

నా మీద ప్రేమ పతాకం ఎత్తాడు.

 5 నేను విరహ వేదన పడుతున్నాను;

ఎండుద్రాక్ష రొట్టెలతో+ నన్ను తెప్పరిల్లజేయండి,

ఆపిల్‌ పండ్లతో నన్ను బలపర్చండి.

 6 అతని ఎడమచెయ్యి నా తల కింద ఉంది,

తన కుడిచేతితో అతను నన్ను హత్తుకున్నాడు.+

 7 యెరూషలేము కూతుళ్లారా,

కొండజింకల+ మీద, మైదానంలోని లేళ్ల మీద మీతో ఒట్టు వేయిస్తున్నాను:

ప్రేమ దానంతటదే నాలో మేల్కొనే వరకు మీరు దాన్ని లేపడానికి ప్రయత్నించకండి.+

 8 నా ప్రియుడు వస్తున్న శబ్దం వినిపిస్తోంది!

ఇదిగో! పర్వతాల్ని ఎక్కుతూ, కొండల మీద దూకుతూ అతను వస్తున్నాడు.

 9 నా ప్రియుడు కొండజింక లాంటివాడు, పడుచు దుప్పి లాంటివాడు.+

ఇదిగో, అతను మన గోడ వెనకే ఉన్నాడు,

కిటికీల గుండా, జాలీల గుండా చూస్తున్నాడు.

10 నా ప్రియుడు నాతో ఇలా అంటున్నాడు:

‘నా ప్రియసఖీ, లే,

నా అందాలరాశీ, నాతో వచ్చేయి.

11 ఇదిగో! చలికాలం* అయిపోయింది.

వర్షాలు ఆగిపోయాయి, ఇక రావు.

12 దేశమంతటా పూలు పూశాయి,+

కొమ్మలు కత్తిరించే సమయం వచ్చింది,+

మన దేశంలో గువ్వ పిల్లల పాటలు వినిపిస్తున్నాయి.+

13 అంజూర చెట్టుకు కాసిన తొలి అంజూర పండ్లు పక్వానికి వచ్చాయి;+

ద్రాక్షతీగలు పూత వేసి గుబాళిస్తున్నాయి.

నా ప్రియసఖీ, లే,

నా అందాలరాశీ, నాతో వచ్చేయి.

14 బండ సందుల్లో, కొండచరియ చాటైన స్థలాల్లో దాక్కునే నా పావురమా,+

వచ్చి నాకు కనిపించు, నీ స్వరం వినిపించు,+

నీ స్వరం మధురమైనది, నీ రూపం మనోహరమైనది.’ ”+

15 “మన ద్రాక్షతోటలు పూత వేశాయి,

కాబట్టి ద్రాక్షతోటల్ని పాడుచేసే నక్క పిల్లల్ని, గుంటనక్కల్ని పట్టుకో.”

16 “నా ప్రియుడు నాకు సొంతం, నేను అతనికి సొంతం.+

అతను లిల్లీ పూల దగ్గర గొర్రెలు కాస్తున్నాడు.+

17 పిల్లగాలులు వీచే లోపు, నీడలు కనుమరుగయ్యే లోపు,

నా ప్రియుడా, త్వరగా రా,

కొండజింకలా,+ పడుచు దుప్పిలా+ మన మధ్య ఉన్న పర్వతాల్ని* దాటుకుంటూ వచ్చేయి.

3 “రాత్రివేళ నేను పడుకుని నా ప్రాణ ప్రియుడి+ గురించి ఆలోచించాను.

నేను అతని కోసం వెదికాను, కానీ అతను కనిపించలేదు.+

 2 నేను ఇలా అనుకున్నాను:

‘నేను లేచి నగరమంతా తిరుగుతాను;

వీధుల్లో, సంతవీధుల్లో నా ప్రాణ ప్రియుడి కోసం వెదుకుతాను.’

నేను అతని కోసం వెదికాను, కానీ అతను కనిపించలేదు.

 3 నగరంలో గస్తీ తిరుగుతున్న కావలివాళ్లు నాకు ఎదురుపడ్డారు.+

‘మీరు నా ప్రాణ ప్రియుణ్ణి చూశారా?’ అని వాళ్లను అడిగాను.

 4 నేను వాళ్లను అలా దాటానో లేదో

నా ప్రాణ ప్రియుడు నాకు కనిపించాడు.

నేను అతన్ని వెళ్లనివ్వకుండా గట్టిగా పట్టుకుని,

మా అమ్మ ఇంట్లోకి,

నన్ను కన్న తల్లి గదిలోకి తీసుకొచ్చాను.+

 5 యెరూషలేము కూతుళ్లారా,

కొండజింకల మీద, మైదానంలోని లేళ్ల మీద మీతో ఒట్టు వేయిస్తున్నాను:

ప్రేమ దానంతటదే నాలో మేల్కొనే వరకు దాన్ని లేపడానికి ప్రయత్నించకండి.”+

 6 “పొగ స్తంభాల్లా ఎడారి* నుండి వస్తున్న అది ఏమిటి?

బోళంతో, సాంబ్రాణితో, వ్యాపారస్థులు అమ్మే పరిమళ చూర్ణాలన్నిటితో+

గుబాళిస్తూ వస్తున్న అది ఏమిటి?”

 7 “అది సొలొమోను పల్లకి!

ఇశ్రాయేలు శూరుల్లో అరవై మంది యోధులు+ దాని చుట్టూ ఉన్నారు,

 8 వాళ్లంతా ఖడ్గం ధరించివున్నారు,

వాళ్లు యుద్ధంలో రాటుదేలినవాళ్లు,

రాత్రివేళ కలిగే అపాయాల నుండి కాపాడడానికి

వాళ్లలో ప్రతీ ఒక్కరు ఖడ్గం ధరించివున్నారు.”

 9 “అది సొలొమోను రాజు లెబానోను చెట్ల మ్రానుతో+

తనకోసం చేయించుకున్న రాచపల్లకి.

10 దాని స్తంభాలు వెండివి,

దాని ఆధారాలు బంగారువి.

దాని ఆసనం ఊదారంగు ఉన్నితో చేయబడింది;

దాని లోపలి భాగాన్ని యెరూషలేము కూతుళ్లు ప్రేమతో అలంకరించారు.”

11 “సీయోను కూతుళ్లారా, వెళ్లి,

కిరీటం ధరించిన సొలొమోను రాజును చూడండి;

అది అతని పెళ్లి రోజున,

అతని హృదయం సంతోషంగా ఉన్న రోజున

వాళ్ల అమ్మ+ పెట్టిన పెళ్లి కిరీటం.”*

4 “నా ప్రియురాలా, నువ్వు ఎంత అందంగా ఉన్నావు!

నువ్వు సౌందర్యవతివి!

మేలిముసుగు వెనక నీ కళ్లు పావురం కళ్లలా ఉన్నాయి.

నీ కురులు గిలాదు కొండల మీదుగా కిందికి దూకుతున్న మేకల మందలా ఉన్నాయి.+

 2 నీ పళ్లు, అప్పుడే బొచ్చు కత్తిరించబడి, కడగబడి

పైకి వస్తున్న గొర్రెల మందలా ఉన్నాయి;

అవి ఒక్కటి కూడా తప్పిపోని కవల పిల్లల్లా ఉన్నాయి.

 3 నీ పెదాలు ముదురు ఎరుపు దారంలా ఉన్నాయి,

నీ మాటలు మనోహరంగా ఉన్నాయి.

మేలిముసుగు వెనక నీ చెంపలు దానిమ్మ ముక్కలా మెరిసిపోతున్నాయి.

 4 నీ మెడ,+ రాళ్ల వరుసలతో కట్టిన దావీదు గోపురంలా ఉంది,+

దానిమీద వెయ్యి డాళ్లు వేలాడుతున్నాయి,

అవన్నీ యోధుల డాళ్లే.*+

 5 నీ రెండు స్తనాలు రెండు జింకపిల్లల్లా,

లిల్లీ పువ్వుల మధ్య మేత మేస్తున్న

కొండజింక కవల పిల్లల్లా ఉన్నాయి.”+

 6 “పిల్లగాలులు వీచే లోపు, నీడలు కనుమరుగయ్యే లోపు

నేను బోళపు పర్వతం దగ్గరికి,

సాంబ్రాణి కొండ+ దగ్గరికి వెళ్తాను.”

 7 “నా ప్రియసఖీ, నువ్వు పరిపూర్ణ సౌందర్యవతివి,+

నీలో ఏ లోపం లేదు.

 8 నా వధువా, లెబానోను నుండి నాతో వచ్చేయి,

లెబానోను+ నుండి నాతో వచ్చేయి.

అమాన* శిఖరం నుండి,

శెనీరు శిఖరం నుండి, హెర్మోను+ శిఖరం నుండి,

సింహాల విశ్రాంతి స్థలాల నుండి, చిరుతపులుల పర్వతాల నుండి దిగిరా.

 9 నా ప్రేయసీ, నా పెళ్లికూతురా, నువ్వు నా మనసు దోచుకున్నావు.+

ఒకే చూపుతో, నీ హారంలోని ఒకే ఒక్క పూసతో నా మనసు దోచుకున్నావు.

10 నా ప్రేయసీ, నా పెళ్లికూతురా, నీ ప్రేమానురాగాలు ఎంత మధురమైనవి!+

అవి ద్రాక్షారసం కన్నా ఎంతో శ్రేష్ఠమైనవి,+

నీ పరిమళ తైలం సువాసన సుగంధ ద్రవ్యాల సువాసన+ కన్నా ఎంతో గొప్పది!

11 నా వధువా, నీ పెదాలు తేనెలొలుకుతున్నాయి.+

నీ నాలుక కింద పాలుతేనెలు ఉన్నాయి,+

నీ వస్త్రాల పరిమళం లెబానోను పరిమళంలా ఉంది.

12 నా ప్రేయసి, నా పెళ్లికూతురు చుట్టూ కంచె వేయబడిన తోటలా ఉంది,

ఆమె కంచె వేసిన తోట, మూయబడిన ఊట.

13 నీ కొమ్మలు* శ్రేష్ఠమైన పండ్లు గల దానిమ్మ తోట;*

అందులో గోరింట చెట్లు, జటామాంసి చెట్లు,

14 జటామాంసి,+ కుంకుమ పువ్వు, వస,*+ దాల్చిన చెక్క,+

అన్నిరకాల సాంబ్రాణి చెట్లు, బోళం, అగరు మొక్కలు,+

అతి శ్రేష్ఠమైన పరిమళ మొక్కలు+ ఉన్నాయి.

15 నువ్వు తోటలోని ఊట లాంటి దానివి,

మంచినీటి బావి లాంటి దానివి,

లెబానోను నీటి ప్రవాహాల+ లాంటి దానివి.

16 ఉత్తర గాలీ, మేలుకో;

దక్షిణ గాలీ, రా.

వచ్చి నా తోట మీద మృదువుగా వీచు.

దాని పరిమళం అంతటా వ్యాపింపజేయి.”

“నా ప్రియుడు తన తోటలోకి వచ్చి,

దాని శ్రేష్ఠమైన పండ్లు తినాలి.”

5 “నా ప్రేయసీ, నా పెళ్లికూతురా,

నేను నా తోటలోకి ప్రవేశించాను.+

నా బోళాన్ని, సుగంధ ద్రవ్యాన్ని+ సమకూర్చుకున్నాను.

నా తేనెపట్టును, తేనెను తిన్నాను;

నా ద్రాక్షారసాన్ని, పాలను తాగాను.”+

“ప్రియ స్నేహితుల్లారా, తినండి! తాగండి!

ప్రేమానురాగాల్లో మునిగితేలండి!”+

 2 “నేను నిద్రపోతున్నాను, కానీ నా హృదయం మేల్కొనే ఉంది.+

నా ప్రియుడు తలుపు తడుతున్న శబ్దం వినిపిస్తోంది!

‘నా ప్రేయసీ, నా ప్రియురాలా,

నా పావురమా, మచ్చలేనిదానా, తలుపు తీయి!

మంచు వల్ల నా తల,

రాత్రి తేమ వల్ల నా జుట్టు తడిసిపోయాయి.’+

 3 నేను నా పైవస్త్రం తీసేశాను.

దాన్ని మళ్లీ వేసుకోవాలా?

నా పాదాలు కడుక్కున్నాను.

వాటిని మళ్లీ మురికి చేసుకోవాలా?

 4 నా ప్రియుడు తలుపు రంధ్రంలో నుండి తన చెయ్యి తీసేశాడు,

నా హృదయం అతని కోసం తపించింది.

 5 నా ప్రియుడి కోసం తలుపు తీద్దామని నేను లేచాను;

నా చేతుల నుండి బోళం,

నా వేళ్ల నుండి బోళరసం కారి తలుపు గడియల మీద పడ్డాయి.

 6 నా ప్రియుడి కోసం నేను తలుపు తీశాను,

కానీ అతను అక్కడ లేడు, వెళ్లిపోయాడు.

అతను వెళ్లిపోయినప్పుడు నా ప్రాణం సొమ్మసిల్లింది.*

నేను అతని కోసం వెదికాను, కానీ అతను కనిపించలేదు.+

నేను అతన్ని పిలిచాను, కానీ అతను పలకలేదు.

 7 నగరంలో గస్తీ తిరుగుతున్న కావలివాళ్లు నాకు ఎదురుపడ్డారు.

వాళ్లు నన్ను కొట్టి గాయపర్చారు.

ప్రాకారపు కావలివాళ్లు నా ముసుగును లాగేసుకున్నారు.

 8 యెరూషలేము కూతుళ్లారా, మీతో ఒట్టు వేయిస్తున్నాను:

నా ప్రియుడు మీకు కనిపిస్తే,

నేను విరహ వేదన పడుతున్నానని అతనితో చెప్పండి.”

 9 “అత్యంత సౌందర్యవతీ!

మిగతావాళ్ల కన్నా నీ ప్రియుడి గొప్పేంటి?

నువ్వు మాతో ఇలా ఒట్టు వేయించడానికి

మిగతావాళ్ల కన్నా అతను ఎందులో గొప్ప?”

10 “నా ప్రియుడు అందగాడు, ఎర్రనివాడు;

పదివేల మందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తాడు.

11 అతని తల బంగారం, మేలిమి బంగారం.

అతని తలవెంట్రుకలు ఊగుతున్న ఖర్జూర మట్టల్లా,*

కాకి అంత నల్లగా ఉంటాయి.

12 అతని కళ్లు, నీటి ప్రవాహాల పక్కన ఉన్న పావురాల్లా,

పాలలో స్నానం చేసి, పొంగిపొర్లే నీటి మడుగు* పక్కన కూర్చున్న పావురాల్లా ఉన్నాయి.

13 అతని చెంపలు సుగంధ ద్రవ్యాల పరుపులు,+

సువాసన మొక్కల గుట్టలు;

అతని పెదాలు బోళరసం+ కారుతున్న లిల్లీ పూలు.

14 అతని చేతులు, లేతపచ్చ రాళ్లు పొదిగిన బంగారు కడ్డీలు.

అతని ఉదరం, నీలం రాళ్లు పొదిగిన నున్నటి దంతపు పలక.

15 అతని కాళ్లు, మేలిమి బంగారు దిమ్మల్లో నిలబెట్టిన చలువరాతి స్తంభాలు.

అతను లెబానోనులా అందంగా, దేవదారు చెట్లలా ఎత్తుగా ఉంటాడు.+

16 అతని నోరు* అతి మధురం,

అతను అన్నివిధాలా కోరదగినవాడు.+

యెరూషలేము కూతుళ్లారా, అతనే నా ప్రియుడు, అతనే నా చెలికాడు.”

6 “అత్యంత సౌందర్యవతీ,

నీ ప్రియుడు ఎక్కడికి వెళ్లాడు?

నీ ప్రియుడు ఎటువైపు వెళ్లాడు?

పద, కలిసి వెదుకుదాం.”

 2 “నా ప్రియుడు తన తోట దగ్గరికి,

సుగంధ ద్రవ్యాల మొక్కల దగ్గరికి వెళ్లాడు;

గొర్రెల్ని కాయడానికి,

లిల్లీ పూలను కోయడానికి అక్కడికి వెళ్లాడు.+

 3 నేను నా ప్రియుడికి సొంతం,

నా ప్రియుడు నాకు సొంతం.+

అతను లిల్లీ పూల దగ్గర గొర్రెలు కాస్తున్నాడు.”+

 4 “నా ప్రియసఖీ,+ నువ్వు తిర్సా*+ అంత అందమైనదానివి,

యెరూషలేము అంత మనోహరమైనదానివి,+

పతాకాలు ఎత్తిన సైన్యాలంత గంభీరమైనదానివి.+

 5 నన్ను అలా చూడకు,+

నీ చూపులు నన్ను కట్టిపడేస్తున్నాయి.

నీ కురులు గిలాదు కొండల మీదుగా కిందికి దూకుతున్న మేకల మందలా ఉన్నాయి.+

 6 నీ పళ్లు, కడగబడి పైకి వస్తున్న గొర్రెల మందలా ఉన్నాయి;

అవి ఒక్కటి కూడా తప్పిపోని కవల పిల్లల్లా ఉన్నాయి.

 7 మేలిముసుగు వెనక నీ చెంపలు* దానిమ్మ ముక్కలా మెరిసిపోతున్నాయి.

 8 60 మంది రాణులు,

80 మంది ఉపపత్నులు,

లెక్కలేనంతమంది యువతులు ఉన్నా,+

 9 మచ్చలేని నా పావురం ఒక్కతే.+

ఆమె తల్లికి ఆమె ఒక్కతే కూతురు.

ఆమెను కన్న తల్లికి ఆమె ముద్దు బిడ్డ.

యువతులు ఆమెను చూసి ధన్యురాలు* అంటారు;

రాణులు, ఉపపత్నులు ఆమెను పొగుడుతారు.

10 ‘అరుణోదయంలా ప్రకాశిస్తున్న* ఈమె ఎవరు?

నిండు చంద్రుడిలా అందంగా,

సూర్యకాంతిలా స్వచ్ఛంగా,

పతాకాలు ఎత్తిన సైన్యాల్లా గంభీరంగా ఉన్న ఈమె ఎవరు?’ ”+

11 “లోయలోని* కొత్త మొగ్గల్ని చూడడానికి,

ద్రాక్షతీగలు చిగురించాయో* లేదో,

దానిమ్మ చెట్లు మొగ్గ తొడిగాయో లేదో

తెలుసుకోవడానికి నేను పండ్ల చెట్ల* తోటకు+ వెళ్లాను.

12 నాకు తెలియకుండానే

నా కోరిక నా ప్రముఖుల* రథాల దగ్గరికి నన్ను తీసుకొచ్చింది.”

13 “షూలమ్మీతీ, తిరిగి రా, తిరిగి రా,

మేము మళ్లీ నిన్ను చూడగలిగేలా

తిరిగి రా, తిరిగి రా!”

“మీరు షూలమ్మీతీని ఎందుకు చూడాలనుకుంటున్నారు?”+

“ఆమె మహనయీము* నాట్యంలా ఉంది!”

7 “గొప్ప వ్యక్తిత్వం ఉన్న యువతీ,

పాదరక్షలు ధరించిన నీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!

నీ తొడల ఒంపులు కళాకారుడు మలిచిన ఆభరణాల్లా ఉన్నాయి.

 2 నీ నాభి గుండ్రటి గిన్నె.

దానిలో ద్రాక్షారసం* ఎప్పుడూ తక్కువ కాకూడదు.

నీ ఉదరం, లిల్లీ పూల మధ్య ఉన్న గోధుమ రాశిలా ఉంది.

 3 నీ రెండు స్తనాలు రెండు జింకపిల్లల్లా,

కొండజింక కవల పిల్లల్లా ఉన్నాయి.+

 4 నీ మెడ+ దంతపు గోపురంలా ఉంది.+

నీ కళ్లు,+ బాత్‌-రబ్బీము ద్వారం దగ్గరున్న

హెష్బోను+ మడుగుల్లా ఉన్నాయి.

నీ ముక్కు, దమస్కు వైపు చూసే

లెబానోను బురుజులా ఉంది.

 5 నీ తల కర్మెలు+ పర్వతంలా,

నీ కురులు+ ఊదారంగు ఉన్నిలా+ ఉన్నాయి.

పొడవుగా, అందంగా ఉన్న నీ శిరోజాలు రాజును కట్టిపడేశాయి.

 6 ప్రియసఖీ, నువ్వెంత అందంగా, ఆహ్లాదకరంగా ఉన్నావు!

నువ్వు నాకు అన్నిటికన్నా ఎక్కువ సంతోషం కలిగిస్తావు!

 7 నువ్వు ఖర్జూర చెట్టులా సొగసైనదానివి,

నీ స్తనాలు ఖర్జూర పండ్ల గుత్తుల్లా ఉన్నాయి.+

 8 నేను, ‘ఖర్జూర చెట్టు ఎక్కి,

గుత్తులున్న కొమ్మల్ని పట్టుకుంటాను’ అని అనుకున్నాను.

నీ స్తనాలు ద్రాక్ష గుత్తుల్లా,

నీ శ్వాస ఆపిల్‌ పండ్ల సువాసనలా ఉండాలి,

 9 నీ నోరు* శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా ఉండాలి.”

“అది నా ప్రియుడి పెదాల మీదుగా ప్రవహించి,

అతని గొంతులోకి మెల్లమెల్లగా దిగిపోవాలి.

10 నేను నా ప్రియుడికి సొంతం,+

అతను నా కోసం తపిస్తున్నాడు.

11 ప్రియుడా, రా,

మనం పొలాల దగ్గరికి వెళ్దాం;

గోరింట+ చెట్ల మధ్య విశ్రాంతి తీసుకుందాం.

12 మనం ఉదయాన్నే లేచి ద్రాక్షతోటల దగ్గరికి వెళ్లి,

ద్రాక్షతీగలు చిగురించాయో* లేదో,

మొగ్గలు విచ్చుకున్నాయో లేదో,+

దానిమ్మ చెట్లు పూతకొచ్చాయో లేదో చూద్దాం.+

నీ మీద నాకున్న ప్రేమను అక్కడ తెలియజేస్తాను.+

13 పుత్రదాత చెట్లు+ గుబాళిస్తున్నాయి;

మా గుమ్మం దగ్గర అన్నిరకాల శ్రేష్ఠమైన పండ్లు ఉన్నాయి.+

నా ప్రియుడా, అప్పుడే కోసిన పండ్లను, పాత పండ్లను

అన్నిటినీ నీ కోసం దాచి ఉంచాను.

8 “నువ్వు నా తల్లి పాలు తాగిన

నా సహోదరుడి లాంటి వాడివైతే ఎంత బాగుండు!

నువ్వు నాకు బయట కనిపించినప్పుడు, నేను నిన్ను ముద్దుపెట్టుకుంటాను,+

ఎవరూ నన్ను తప్పుగా చూడరు.

 2 నేనే స్వయంగా నిన్ను మా అమ్మ ఇంటికి,

నాకు ఉపదేశం ఇచ్చిన నా తల్లి ఇంటికి తీసుకెళ్తాను,+

మసాలాలు కలిపిన ద్రాక్షారసాన్ని,

తాజా దానిమ్మ రసాన్ని నీకు ఇస్తాను.

 3 అతని ఎడమచెయ్యి నా తల కింద ఉంటుంది,

తన కుడిచేతితో అతను నన్ను హత్తుకుంటాడు.+

 4 యెరూషలేము కూతుళ్లారా, నేను మీతో ఒట్టు వేయిస్తున్నాను:

ప్రేమ దానంతటదే నాలో మేల్కొనే వరకు దాన్ని లేపడానికి ప్రయత్నించకండి.”+

 5 “తన ప్రియుడి మీద వాలిపోయి

ఎడారి నుండి వస్తున్న ఈమె ఎవరు?”

“ఆపిల్‌ చెట్టు కింద నేను నిన్ను నిద్రలేపాను.

అక్కడ మీ అమ్మ నిన్ను కనడానికి ప్రసవవేదన పడింది.

నిన్ను కన్న తల్లి అక్కడ పురిటినొప్పులు పడింది.

 6 నన్ను నీ హృదయం మీద,

నీ బాహువు మీద ముద్రగా పెట్టుకో,

ఎందుకంటే ప్రేమ మరణం అంత బలమైనది,+

అది సమాధి* అంత పట్టుదలగా నమ్మకత్వాన్ని కోరుకుంటుంది.

దాని జ్వాలలు అగ్ని జ్వాలలు, అది యెహోవా* పుట్టించే జ్వాల.+

 7 ఉప్పొంగే జలాలు ప్రేమను ఆర్పలేవు,+

నదీ ప్రవాహాలు దాన్ని ముంచేయలేవు.+

ప్రేమ కోసం ఒక వ్యక్తి తన ఇంట్లోని సంపదంతా ఇచ్చినా

అది తిరస్కరించబడుతుంది.”*

 8 “మాకొక చిట్టి చెల్లెలు+ ఉంది,

ఆమెకు ఇంకా రొమ్ములు రాలేదు.

ఆమెకు పెళ్లి నిశ్చయమయ్యే రోజు

ఆమె కోసం మేము ఏం చేయాలి?”

 9 “ఆమె ఒక ప్రాకారం అయితే,

దానిమీద మేము వెండితో పిట్టగోడ కడతాం,

ఆమె ఒక తలుపు అయితే,

దేవదారు పలకతో దాన్ని మూసేస్తాం.”

10 “నేను ఒక ప్రాకారాన్ని,

నా రొమ్ములు బురుజుల లాంటివి.

కాబట్టి, అతని దృష్టిలో నేను

నెమ్మది పొందిన దానిలా ఉన్నాను.

11 బయల్‌-హామోనులో సొలొమోనుకు ఒక ద్రాక్షతోట ఉండేది.+

దాన్ని అతను కౌలుకిచ్చాడు.

దాని పంట కోసం వాళ్లలో ప్రతీ ఒక్కరు వెయ్యి వెండి రూకలు ఇచ్చేవాళ్లు.

12 సొలొమోనూ, నాకూ ఒక ద్రాక్షతోట ఉంది.

ఆ వెయ్యి వెండి రూకలు* నీ దగ్గరే ఉంచుకో,

రెండు వందల వెండి రూకలు దాన్ని సేద్యం చేసేవాళ్లకే ఉండనివ్వు.”

13 “తోటల్లో నివసించేదానా,+

సహచరులు నీ స్వరం వినాలని ఎదురుచూస్తున్నారు.

నన్ను కూడా విననివ్వు.”+

14 “నా ప్రియుడా, త్వరగా రా,

సుగంధ ద్రవ్యాలు పండే పర్వతాల మీదుగా

కొండజింకలా, పడుచు దుప్పిలా పరుగెత్తుకుంటూ రా.”+

లేదా “అత్యద్భుతమైన పాట.”

అంటే, యువతులు.

లేదా “దుఃఖ ముసుగు.”

లేదా “నా ఆడ గుర్రంలా.”

లేదా “కురుల” అయ్యుంటుంది.

లేదా “భవనం.”

అంటే, జూనిపర్‌ చెట్టు.

అక్ష., “తీర మైదానంలో.”

లేదా “కుంకుమ పువ్వు.”

లేదా “వర్షాకాలం.”

లేదా “బెతెరు పర్వతాల్ని.”

పదకోశం చూడండి.

లేదా “పూల కిరీటం.”

లేదా “గుండ్రటి డాళ్లే.”

లేదా “లెబానోను పర్వతశ్రేణికి ఎదురుగా ఉన్న పర్వతాలు.”

లేదా “చర్మం” అయ్యుంటుంది.

లేదా “పరదైసు.”

ఒక సువాసన మొక్క.

లేదా “అతను మాట్లాడినప్పుడు నా ప్రాణం నన్ను విడిచి వెళ్లింది” అయ్యుంటుంది.

లేదా “ఖర్జూర పండ్ల గుత్తుల్లా” అయ్యుంటుంది.

లేదా “ఊట అంచుల” అయ్యుంటుంది.

అక్ష., “అంగిలి.”

లేదా “ఆహ్లాదకరమైన నగరం.”

లేదా “కణతలు.”

లేదా “సంతోషవంతురాలు.”

అక్ష., “కిందికి చూస్తున్న.”

లేదా “వాగులోని.”

లేదా “పూతకొచ్చాయో.”

ఇశ్రాయేలులో జీడికాయల లాంటి కాయలు కాసే చెట్ల.

లేదా “ఇష్టపూర్వకంగా సేవచేసే నా ప్రజల.”

లేదా “రెండు గుంపుల.”

లేదా “కలిపిన ద్రాక్షారసం.”

అక్ష., “అంగిలి.”

లేదా “పూతకొచ్చాయో.”

లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

లేదా “అతను తిరస్కరించబడతాడు” అయ్యుంటుంది.

అక్ష., “ఆ వెయ్యి.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి