కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt ఎజ్రా 1:1-10:44
  • ఎజ్రా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎజ్రా
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఎజ్రా

ఎజ్రా

1 పారసీక* రాజైన కోరెషు+ పరిపాలన మొదటి సంవత్సరంలో, అతను తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేయించేలా యెహోవా అతని మనసును ప్రేరేపించాడు; యిర్మీయా ద్వారా యెహోవా చెప్పిన మాట+ నెరవేరడానికి అలా జరిగింది. పారసీక రాజైన కోరెషు ఆ ప్రకటనను ఇలా రాయించాడు:+

2 “పారసీక రాజైన కోరెషు చెప్పేదేమిటంటే, ‘పరలోక దేవుడైన యెహోవా భూమ్మీదున్న రాజ్యాలన్నిటినీ నాకు అప్పగించాడు.+ ఆయన యూదాలోని యెరూషలేములో తన కోసం ఒక మందిరం కట్టించమని నన్ను ఆదేశించాడు.+ 3 మీ మధ్య ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ల దేవుడు తోడుగా ఉండాలి. వాళ్లు యూదాలో ఉన్న యెరూషలేముకు వెళ్లి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరాన్ని తిరిగి కట్టాలి. ఆయనే సత్యదేవుడు. యెరూషలేములో ఆయన మందిరం ఉండేది.* 4 ఆయన ప్రజల్లో ఎవరైతే పరదేశుల్లా నివసిస్తున్నారో+ వాళ్లు ఏ ప్రాంతంలో ఉన్నాసరే, వాళ్ల పొరుగువాళ్లు వాళ్లకు వెండిని, బంగారాన్ని, వస్తువుల్ని, పశువుల్ని ఇచ్చి సహాయం చేయాలి, అలాగే యెరూషలేములోని సత్యదేవుని మందిరం కోసం స్వేచ్ఛార్పణను ఇవ్వాలి.’ ”+

5 అప్పుడు యూదా, బెన్యామీను పూర్వీకుల కుటుంబాల పెద్దలు, యాజకులు, లేవీయులు, సత్యదేవుడు ఎవరెవరి మనసును ప్రేరేపించాడో వాళ్లందరూ, యెరూషలేముకు వెళ్లి యెహోవా మందిరాన్ని తిరిగి కట్టడానికి సిద్ధమయ్యారు. 6 వాళ్ల పొరుగువాళ్లు వెండిబంగారు పాత్రలు, వస్తువులు, పశువులు, ఇతర విలువైన వస్తువులు ఇచ్చి వాళ్లకు సహాయం చేశారు,* అలాగే స్వేచ్ఛార్పణల్ని ఇచ్చారు.

7 నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకెళ్లి, తన దేవుని గుడిలో పెట్టించిన యెహోవా మందిరంలోని పాత్రల్ని కూడా కోరెషు రాజు బయటికి తెప్పించాడు.+ 8 పారసీక రాజైన కోరెషు తన కోశాధికారి మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించాడు, మిత్రిదాతు యూదా ప్రధానుడైన షేష్బజ్జరు* కోసం వాటి లెక్క రాశాడు.+

9 వాటి వివరాలు ఇవి: బుట్ట ఆకారంలో ఉన్న బంగారు పాత్రలు 30, బుట్ట ఆకారంలో ఉన్న వెండి పాత్రలు 1,000, వేరే పాత్రలు 29, 10 బంగారు గిన్నెలు చిన్నవి 30, వెండి గిన్నెలు చిన్నవి 410, వేరే పాత్రలు 1,000. 11 బంగారు, వెండి పాత్రలు మొత్తం కలిపి 5,400. చెరలో ఉన్నవాళ్లు+ బబులోను నుండి యెరూషలేముకు తీసుకురాబడినప్పుడు షేష్బజ్జరు వీటన్నిటినీ తీసుకొచ్చాడు.

2 చెరలో నుండి తిరిగొచ్చిన సంస్థాన ప్రజలు వీళ్లే.+ వీళ్లను బబులోను రాజైన నెబుకద్నెజరు చెరపట్టుకుపోయాడు,+ వాళ్లు ఆ తర్వాత యెరూషలేముకు, యూదాలోని తమతమ నగరాలకు తిరిగొచ్చారు.+ 2 వీళ్లు జెరుబ్బాబెలు,+ యేషూవ,*+ నెహెమ్యా, శెరాయా, రెయేలాయా, మొర్దెకై, బిల్షాను, మిస్పారు, బిగ్వయి, రెహూము, బయనాతో పాటు వచ్చారు.

ఆ ఇశ్రాయేలు పురుషుల సంఖ్య ఇది:+ 3 పరోషు వంశస్థులు 2,172 మంది; 4 షెఫట్య వంశస్థులు 372 మంది; 5 ఆరహు+ వంశస్థులు 775 మంది; 6 పహత్మోయాబు వంశంలో+ యేషూవ, యోవాబు వంశస్థులు 2,812 మంది; 7 ఏలాము వంశస్థులు+ 1,254 మంది; 8 జత్తూ వంశస్థులు+ 945 మంది; 9 జక్కయి వంశస్థులు 760 మంది; 10 బానీ వంశస్థులు 642 మంది; 11 బేబై వంశస్థులు 623 మంది; 12 అజ్గాదు వంశస్థులు 1,222 మంది; 13 అదొనీకాము వంశస్థులు 666 మంది; 14 బిగ్వయి వంశస్థులు 2,056 మంది; 15 ఆదీను వంశస్థులు 454 మంది; 16 హిజ్కియా కుటుంబానికి చెందిన అటేరు వంశస్థులు 98 మంది; 17 బెజయి వంశస్థులు 323 మంది; 18 యోరా వంశస్థులు 112 మంది; 19 హాషుము వంశస్థులు+ 223 మంది; 20 గిబ్బారు వంశస్థులు 95 మంది; 21 బేత్లెహేమువాళ్లు 123 మంది; 22 నెటోపావాళ్లు 56 మంది; 23 అనాతోతువాళ్లు+ 128 మంది; 24 అజ్మావెతువాళ్లు 42 మంది; 25 కిర్యత్యారీము, కెఫీరా, బెయేరోతు నగరాలవాళ్లు 743 మంది; 26 రామా,+ గెబా నగరాలవాళ్లు 621 మంది; 27 మిక్మషువాళ్లు 122 మంది; 28 బేతేలు, హాయి నగరాలవాళ్లు 223 మంది; 29 నెబోవాళ్లు+ 52 మంది; 30 మగ్బీషు వంశస్థులు 156 మంది; 31 ఇంకో ఏలాము వంశస్థులు 1,254 మంది; 32 హారీము వంశస్థులు 320 మంది; 33 లోదు, హాదీదు, ఓనో వంశస్థులు 725 మంది; 34 యెరికోవాళ్లు 345 మంది; 35 సెనాయా వంశస్థులు 3,630 మంది.

36 యాజకులు: యేషూవ+ కుటుంబానికి చెందిన యెదాయా+ వంశస్థులు 973 మంది; 37 ఇమ్మేరు వంశస్థులు+ 1,052 మంది; 38 పషూరు వంశస్థులు+ 1,247 మంది; 39 హారీము వంశస్థులు+ 1,017 మంది.

40 లేవీయులు:+ హోదవ్యా వంశంలో యేషూవ, కద్మీయేలు+ వంశస్థులు 74 మంది. 41 గాయకులు:+ ఆసాపు వంశస్థులు+ 128 మంది. 42 ద్వారపాలకులు:+ షల్లూము వంశస్థులు, అటేరు వంశస్థులు, టల్మోను+ వంశస్థులు, అక్కూబు+ వంశస్థులు, హటీటా వంశస్థులు, షోబయి వంశస్థులు; మొత్తం 139 మంది.

43 ఆలయ సేవకులు:*+ జీహా, హశూపా, టబ్బాయోతు వంశస్థులు, 44 కేరోసు, సీయహా, పాదోను వంశస్థులు, 45 లెబానా, హగాబా, అక్కూబు వంశస్థులు, 46 హాగాబు, షల్మయి, హానాను వంశస్థులు, 47 గిద్దేలు, గహరు, రెవాయా వంశస్థులు, 48 రెజీను, నెకోదా, గజ్జాము వంశస్థులు, 49 ఉజ్జా, పాసెయ, బేసాయి వంశస్థులు, 50 అస్నా, మెయోనీం, నెపూసీము వంశస్థులు, 51 బక్బూకు, హకూపా, హర్హూరు వంశస్థులు, 52 బజ్లుతు, మెహీదా, హర్షా వంశస్థులు, 53 బర్కోసు, సీసెరా, తెమహు వంశస్థులు, 54 నెజీయహు, హటీపా వంశస్థులు.

55 సొలొమోను సేవకుల వంశస్థులు: సొటయి, సోపెరెతు, పెరూదా వంశస్థులు,+ 56 యహలా, దర్కోను, గిద్దేలు వంశస్థులు, 57 షెఫట్య, హట్టీలు, పొకెరెతు హజెబాయీము, ఆమీ వంశస్థులు.

58 ఆలయ సేవకులు,* సొలొమోను సేవకుల వంశస్థులు మొత్తం 392 మంది.

59 తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు నుండి వచ్చినవాళ్లు తాము ఏ పూర్వీకుల కుటుంబానికి చెందినవాళ్లో రుజువు చేసుకోలేకపోయారు; వాళ్లు ఇశ్రాయేలీయులని నిరూపించుకోలేకపోయారు. వాళ్లు ఎవరంటే:+ 60 దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు; మొత్తం 652 మంది. 61 యాజకుల వంశస్థుల్లో: హబాయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు,+ బర్జిల్లయి వంశస్థులు. ఈ బర్జిల్లయి, గిలాదీయుడైన బర్జిల్లయి+ కూతుళ్లలో ఒకర్ని పెళ్లిచేసుకున్నాడు కాబట్టి అతనికి ఆ పేరు వచ్చింది. 62 వీళ్లు తమ వంశావళిని నిర్ధారించుకోవడానికి తమ కుటుంబాల పేర్లను గ్రంథాల్లో వెతికారు, కానీ అవి కనిపించలేదు. దాంతో వాళ్లు యాజకత్వానికి అనర్హులయ్యారు.*+ 63 ఊరీము, తుమ్మీము సహాయంతో సంప్రదించే+ ఒక యాజకుడు వచ్చేవరకు వాళ్లు అతి పవిత్రమైన వాటిని తినకూడదని+ అధిపతి* వాళ్లకు చెప్పాడు.

64 సమాజం మొత్తం 42,360 మంది.+ 65 వాళ్లతోపాటు 7,337 మంది దాసులు, దాసురాళ్లు; 200 మంది గాయనీ గాయకులు కూడా ఉన్నారు. 66 వాళ్ల దగ్గర 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు, 67 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి.

68 వాళ్లు యెరూషలేములోని యెహోవా మందిరానికి చేరుకున్నప్పుడు, పూర్వీకుల కుటుంబాల పెద్దల్లో కొంతమంది, సత్యదేవుని మందిరాన్ని దాని స్థలంలోనే+ తిరిగి కట్టడం* కోసం స్వేచ్ఛార్పణలు ఇచ్చారు.+ 69 తమకు ఉన్నంతలో వాళ్లు నిర్మాణానికి సంబంధించిన ఖజానాకు 61,000 బంగారు డ్రక్మాలను,* 5,000 వెండి మినాలను,*+ యాజకుల కోసం 100 పొడవాటి అంగీలను ఇచ్చారు. 70 యాజకులు, లేవీయులు, కొంతమంది ప్రజలు, గాయకులు, ద్వారపాలకులు, ఆలయ సేవకులు* తమ నగరాల్లో స్థిరపడ్డారు. మిగతా ఇశ్రాయేలీయులందరూ తమతమ నగరాల్లో స్థిరపడ్డారు.+

3 ఏడో నెల+ మొదలయ్యాక ఇశ్రాయేలీయులు* తమ నగరాల్లో ఉన్నారు; వాళ్లు ఒకే మనస్సుతో యెరూషలేములో సమావేశమయ్యారు. 2 యెహోజాదాకు కుమారుడైన యేషూవ,+ అతని తోటి యాజకులు, షయల్తీయేలు+ కుమారుడైన జెరుబ్బాబెలు,+ అతని సహోదరులు లేచి సత్యదేవుని సేవకుడైన మోషే ధర్మశాస్త్రంలో రాయబడినట్టు దహనబలులు అర్పించడానికి ఇశ్రాయేలు దేవుని బలిపీఠం కట్టారు.+

3 వాళ్లు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు భయపడినా,+ బలిపీఠాన్ని అది ఒకప్పుడు ఉన్న చోటనే నిలిపారు. వాళ్లు దాని మీద యెహోవాకు దహనబలులు అర్పించడం మొదలుపెట్టారు. ఉదయం, సాయంకాలం అర్పించాల్సిన దహనబలులు+ అర్పించడం మొదలుపెట్టారు. 4 అప్పుడు వాళ్లు ధర్మశాస్త్రంలో రాయబడినట్టు పర్ణశాలల* పండుగను జరుపుకున్నారు,+ లెక్క ప్రకారం ఒక్కోరోజు అర్పించాల్సిన దహనబలుల్ని,+ ఏ రోజుకు ఆ రోజు అర్పించారు. 5 ఆ తర్వాత వాళ్లు రోజూ అర్పించే దహనబలుల్ని,+ అమావాస్య రోజుల్లో అర్పించే అర్పణల్ని,+ యెహోవా ప్రతిష్ఠిత పండుగ కాలాలన్నిటిలో అర్పించే అర్పణల్ని+ అర్పించారు. ఇంకా యెహోవాకు ఇష్టపూర్వకంగా ఇచ్చిన వాళ్లందరి స్వేచ్ఛార్పణల్ని+ కూడా అర్పించారు. 6 ఏడో నెల+ మొదటి రోజు నుండి వాళ్లు యెహోవాకు దహనబలులు అర్పించడం మొదలుపెట్టారు. అయితే యెహోవా ఆలయ పునాది ఇంకా వేయబడలేదు.

7 వాళ్లు రాళ్లు కొట్టేవాళ్లకు,+ నైపుణ్యంగల పనివాళ్లకు+ డబ్బులిచ్చారు. అంతేకాదు, పారసీక రాజైన కోరెషు తమకు ఇచ్చిన అనుమతి ప్రకారం,+ లెబానోను నుండి యొప్పే వరకు సముద్రం మీదుగా దేవదారు మ్రానుల్ని తీసుకురావడానికి+ సీదోనీయులకు, తూరువాళ్లకు ఆహారాన్ని, పానీయాన్ని, నూనెను ఇచ్చారు.

8 వాళ్లు యెరూషలేములోని సత్యదేవుని మందిరానికి వచ్చిన తర్వాత రెండో సంవత్సరం, రెండో నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదాకు కుమారుడైన యేషూవ, వాళ్ల మిగతా సహోదరులు, యాజకులు, లేవీయులు, అలాగే చెర నుండి యెరూషలేముకు వచ్చిన వాళ్లందరూ+ పనిని మొదలుపెట్టారు; వాళ్లు యెహోవా మందిర పని మీద పర్యవేక్షకులుగా సేవచేయడానికి 20 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసున్న లేవీయుల్ని నియమించారు. 9 కాబట్టి యూదా కుమారులైన యేషూవ, కద్మీయేలు, యేషూవ కుమారులు, అతని సహోదరులు, కద్మీయేలు కుమారులు, అలాగే లేవీయులైన హేనాదాదు వంశస్థులు,+ వాళ్ల కుమారులు, వాళ్ల బంధువులు సత్యదేవుని మందిరంలో పనిచేసేవాళ్లను పర్యవేక్షించారు.

10 కట్టేవాళ్లు యెహోవా ఆలయ పునాదిని వేసినప్పుడు,+ ఆలయ వస్త్రాలు వేసుకున్న యాజకులు బాకాలు+ పట్టుకుని, లేవీయులైన ఆసాపు కుమారులు తాళాల్ని పట్టుకుని ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్దేశం ప్రకారం+ యెహోవాను స్తుతించడానికి లేచి నిలబడ్డారు. 11 వాళ్లు ఒకరి తర్వాత ఒకరు యెహోవాను స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వంతులవారీగా ఇలా పాడడం+ మొదలుపెట్టారు: “ఎందుకంటే, ఆయన మంచివాడు; ఇశ్రాయేలు మీద ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.”+ తర్వాత ప్రజలందరూ యెహోవా మందిర పునాది వేయబడినందుకు బిగ్గరగా యెహోవాను స్తుతించారు. 12 పాత మందిరాన్ని చూసిన వృద్ధులు,+ అంటే చాలామంది యాజకులు, లేవీయులు, పూర్వీకుల కుటుంబాల పెద్దలు ఆ మందిర పునాది వేయబడుతుండడం చూసినప్పుడు పెద్దగా ఏడ్చారు; అదే సమయంలో చాలామంది ఇతరులు సంతోషంతో గట్టిగా కేకలు వేశారు.+ 13 ప్రజలు చాలా గట్టిగా అరుస్తుండడంతో ఆ అరుపులు చాలా దూరం వరకు వినిపించాయి. కాబట్టి ఎవరు సంతోషంతో కేకలు వేస్తున్నారో, ఎవరు ఏడుస్తున్నారో ప్రజలకు అర్థం కాలేదు.

4 చెర నుండి తిరిగొచ్చినవాళ్లు+ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయాన్ని కడుతున్నారనే విషయం యూదుల, బెన్యామీనీయుల శత్రువులు+ విన్నప్పుడు, 2 వాళ్లు వెంటనే జెరుబ్బాబెలు దగ్గరికి, పూర్వీకుల కుటుంబాల పెద్దల దగ్గరికి వచ్చి, “మమ్మల్ని కూడా మీతో కలిసి కట్టనివ్వండి; మేమూ మీలాగే మీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం;+ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన అష్షూరు రాజైన ఏసర్హద్దోను+ కాలం నుండి మేము ఆయనకు బలులు అర్పిస్తూ ఉన్నాం” అని అన్నారు. 3 అయితే జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలు మిగతా పూర్వీకుల కుటుంబాల పెద్దలు, “మాతో కలిసి మా దేవుని కోసం మందిరాన్ని కట్టే హక్కు మీకు లేదు.+ పారసీక రాజైన కోరెషు మాకు ఆజ్ఞాపించినట్టు+ మేము మాత్రమే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరాన్ని కడతాం” అన్నారు.

4 అప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు యూదావాళ్ల ధైర్యాన్ని నీరుగారుస్తూ,* నిర్మాణ పని విషయంలో వాళ్లను నిరుత్సాహపరుస్తూ వచ్చారు.+ 5 వాళ్లు యూదా ప్రజల్ని వ్యతిరేకించడానికి, వాళ్ల ప్రణాళికల్ని చెడగొట్టడానికి సలహాదారులకు డబ్బులిచ్చారు.+ పారసీక రాజైన కోరెషు కాలమంతా అలాగే రాజైన దర్యావేషు+ పరిపాలన వరకు వాళ్లు అదేవిధంగా చేస్తూ వచ్చారు. 6 వాళ్లు అహష్వేరోషు పరిపాలన ఆరంభంలో యూదా, యెరూషలేము నివాసుల మీద నింద మోపుతూ ఒక లేఖ రాశారు. 7 అంతేకాదు, పారసీక రాజైన అర్తహషస్త కాలంలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు, అలాగే అతనితో ఉన్న మిగతా సహోద్యోగులు రాజైన అర్తహషస్తకు లేఖ రాశారు; వాళ్లు దాన్ని అరామిక్‌​లోకి+ అనువదించి అరామిక్‌ అక్షరాలతో రాశారు.*

8 * ప్రభుత్వ ముఖ్య అధికారైన రెహూము, శాస్త్రి అయిన షిమ్షయి యెరూషలేముకు వ్యతిరేకంగా అర్తహషస్త రాజుకు ఇలా లేఖ రాశారు: 9 (దీన్ని ప్రభుత్వ ముఖ్య అధికారైన రెహూము, శాస్త్రి అయిన షిమ్షయి, వాళ్లతో ఉన్న మిగతా సహోద్యోగులు, న్యాయమూర్తులు, కింది స్థాయి అధిపతులు, కార్యదర్శులు, ఎరెకు+ ప్రజలు, బబులోనీయులు, సూస+ నివాసులు, అంటే ఏలామీయులు,+ 10 అలాగే ఘనుడూ గౌరవనీయుడూ అయిన ఆస్నప్పరు చెరగా తీసుకెళ్లి, సమరయ నగరాల్లో+ నివసింపజేసిన మిగతా దేశాల ప్రజలు, నది అవతలి ప్రాంతంలోని* మిగతావాళ్లు రాశారు. 11 వాళ్లు అతనికి పంపిన లేఖ నకలు ఇది.)

“అర్తహషస్త రాజుకు, నది అవతలి ప్రాంతంలో ఉన్న మీ సేవకులు రాస్తున్న లేఖ: 12 మీ దగ్గర నుండి మా ప్రాంతానికి వచ్చిన యూదులు యెరూషలేముకు చేరుకున్నారని మీకు తెలియజేస్తున్నాం. వాళ్లు, తిరుగుబాటు చేసే దుష్ట నగరాన్ని మళ్లీ కడుతున్నారు. వాళ్లు ప్రాకారాల్ని కట్టడం పూర్తిచేస్తున్నారు,+ పునాదుల్ని బాగుచేస్తున్నారు. 13 ఈ నగరాన్ని తిరిగి కడితే, దీని ప్రాకారాలు పూర్తయితే, వాళ్లు మీకు పన్ను గానీ కప్పం గానీ+ సుంకం గానీ చెల్లించరని రాజైన మీరు తెలుసుకోవాలి. అది రాజుల ఖజానాలకు నష్టం కలిగిస్తుంది. 14 మేము రాజు* ఉప్పు తినేవాళ్లం కాబట్టి, రాజుకు నష్టం వాటిల్లుతుంటే చూస్తూ ఉండడం సరికాదు. అందుకే దీన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఈ లేఖ పంపిస్తున్నాం. 15 మీ పూర్వీకుల దస్తావేజుల్ని+ తనిఖీ చేయాలని అలా పంపిస్తున్నాం. ఆ దస్తావేజుల్ని తనిఖీ చేస్తే, ఈ నగరం తిరుగుబాటు చేసే నగరమని, అది రాజులకు, సంస్థానాలకు హానికరమైనదని, పూర్వకాలాల నుండి ఆ నగరంలో రాజద్రోహాన్ని పురికొల్పేవాళ్లు ఉన్నారని మీకు తెలుస్తుంది. అందుకే ఆ నగరం నాశనం చేయబడింది.+ 16 ఒకవేళ ఆ నగరం మళ్లీ కట్టబడితే, దాని ప్రాకారాలు పూర్తయితే, నది+ అవతలి ప్రాంతం మీద మీకు నియంత్రణ* ఉండదని రాజైన మీకు తెలియజేస్తున్నాం.”

17 అప్పుడు రాజు, ప్రభుత్వ ముఖ్య అధికారైన రెహూముకు, శాస్త్రి అయిన షిమ్షయికి, సమరయలోని వీళ్ల మిగతా సహోద్యోగులకు, నది అవతలి ప్రాంతంలో ఉన్న మిగతావాళ్లకు ఈ సందేశం పంపించాడు:

“మీకు క్షేమం కలగాలి! 18 మీరు మాకు పంపిన లేఖ నా ముందు స్పష్టంగా చదవబడింది.* 19 నా ఆజ్ఞ మేరకు దస్తావేజుల్ని తనిఖీ చేశారు. అందులో తేలిందేమిటంటే, పూర్వకాలం నుండి ఈ నగర ప్రజలు రాజుల మీద తిరగబడుతూ వచ్చారు. ఆ నగరంలో తిరుగుబాట్లు, విప్లవాలు చోటుచేసుకున్నాయి.+ 20 యెరూషలేమును పరిపాలించిన శక్తివంతమైన రాజులు నది అవతలి ప్రాంతాన్నంతా పరిపాలించారు. వాళ్లకు పన్ను, కప్పం, సుంకం చెల్లించబడేవి. 21 అయితే ఇప్పుడు నిర్మాణ పనిని ఆపేయమని ఆ మనుషులకు ఆజ్ఞ జారీ చేయండి. నేను ఆజ్ఞ జారీ చేసేంతవరకు ఆ నగరాన్ని మళ్లీ నిర్మించకూడదు. 22 ఈ విషయంలో అశ్రద్ధ చేయకుండా చర్య తీసుకోండి. అప్పుడు రాజుకు ఇంకా నష్టం కలగకుండా ఉంటుంది.”+

23 రాజైన అర్తహషస్త పంపిన అధికార పత్రం నకలు రెహూము, శాస్త్రి అయిన షిమ్షయి, వాళ్లతో ఉన్న మిగతా సహోద్యోగుల ముందు చదవబడింది; ఆ తర్వాత వాళ్లు వెంటనే యెరూషలేములోని యూదుల దగ్గరికి వెళ్లి బలవంతంగా వాళ్ల పనిని ఆపుజేయించారు. 24 అప్పుడు యెరూషలేములోని దేవుని మందిర పని ఆగిపోయింది; పారసీక రాజైన దర్యావేషు పరిపాలనలో రెండో సంవత్సరం వరకు అలాగే నిలిచిపోయింది.+

5 అప్పుడు ప్రవక్తలైన హగ్గయి,+ ఇద్దో+ మనవడైన జెకర్యా+ యూదులకు తోడుగా ఉన్న ఇశ్రాయేలు దేవుని పేరున యూదాలో, యెరూషలేములో ఉన్న యూదులకు ప్రవచించారు. 2 దాంతో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు,+ యెహోజాదాకు కుమారుడైన యేషూవ+ యెరూషలేములోని దేవుని మందిరాన్ని తిరిగి కట్టడం ప్రారంభించారు.+ దేవుని ప్రవక్తలు వాళ్లతో ఉండి వాళ్లకు సహాయం చేశారు.+ 3 ఆ సమయంలో నది అవతలి ప్రాంతానికి* అధిపతైన తత్తెనై, షెతర్బోజ్నయి, వాళ్ల సహోద్యోగులు వాళ్ల దగ్గరికి వచ్చి, “ఈ మందిరాన్ని కట్టమని, దీని నిర్మాణాన్ని పూర్తిచేయమని ఎవరు మీకు ఆజ్ఞ జారీ చేశారు?” అని అడిగారు. 4 ఆ తర్వాత వాళ్లు, “ఈ నిర్మాణ పని చేస్తున్న వాళ్ల పేర్లు ఏమిటి?” అని వాళ్లను అడిగారు. 5 కానీ దేవుని దృష్టి యూదుల పెద్దల మీద ఉంది,+ కాబట్టి దర్యావేషు దగ్గరికి ఒక నివేదిక పంపబడి, దానికి సంబంధించిన అధికార పత్రం వెనక్కి వచ్చేంతవరకు వాళ్లు ఆ పనిని ఆపుజేయించలేదు.

6 నది అవతలి ప్రాంతానికి అధిపతైన తత్తెనై, షెతర్బోజ్నయి, నది అవతలి ప్రాంతానికి కింది స్థాయి అధిపతులైన వాళ్ల సహోద్యోగులు దర్యావేషు రాజుకు పంపిన లేఖ నకలు ఇది; 7 వాళ్లు అతనికి పంపిన లేఖలో ఇలా రాశారు:

“దర్యావేషు రాజుకు:

“మీకు క్షేమం కలగాలి! 8 మేము యూదా సంస్థానంలోని మహాదేవుని మందిరం దగ్గరికి వెళ్లాం. అది పెద్దపెద్ద రాళ్లతో నిర్మించబడుతోంది. గోడల్లో దూలాల్ని అమరుస్తున్నారు. ప్రజలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వాళ్లు కష్టపడి పనిచేస్తూ పనిని ముందుకు తీసుకెళ్తున్నారని మీకు తెలియజేస్తున్నాం. 9 అప్పుడు మేము వాళ్ల పెద్దల్ని, ‘ఈ మందిరాన్ని కట్టమని, దీని నిర్మాణాన్ని పూర్తిచేయమని ఎవరు మీకు ఆజ్ఞ జారీ చేశారు?’ అని అడిగాం.+ 10 మీకు తెలియజేయడానికి మేము వాళ్ల పేర్లను కూడా అడిగాం. నాయకత్వం వహించేవాళ్ల పేర్లను మీకు రాయడానికి అలా అడిగాం.

11 “దానికి వాళ్లు ఇలా జవాబిచ్చారు: ‘మేము భూమ్యాకాశాల దేవుని సేవకులం. చాలా సంవత్సరాల క్రితం నిర్మించబడిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాం. ఒక గొప్ప ఇశ్రాయేలు రాజు దాన్ని కట్టించి పూర్తిచేశాడు.+ 12 అయితే, మా తండ్రులు పరలోక దేవునికి కోపం తెప్పించడం వల్ల+ ఆయన వాళ్లను బబులోను రాజూ కల్దీయుడూ అయిన నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు.+ అతను ఈ మందిరాన్ని పడగొట్టి,+ ప్రజల్ని బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు.+ 13 అయితే, కోరెషు బబులోనుకు రాజైన మొదటి సంవత్సరంలో, దేవుని మందిరాన్ని తిరిగి కట్టమనే ఆజ్ఞను కోరెషు రాజు జారీ చేశాడు.+ 14 అంతేకాదు, నెబుకద్నెజరు యెరూషలేములోని దేవుని ఆలయంలో నుండి తీసుకెళ్లి, బబులోను గుడిలో పెట్టిన వెండిబంగారు పాత్రల్ని కోరెషు రాజు బబులోను గుడిలో నుండి బయటికి తెప్పించాడు.+ అవి కోరెషు అధిపతిగా నియమించిన షేష్బజ్జరు*+ అనే వ్యక్తికి ఇవ్వబడ్డాయి. 15 కోరెషు షేష్బజ్జరుకు ఇలా చెప్పాడు: “ఈ పాత్రలు తీసుకొని వెళ్లి యెరూషలేములోని ఆలయంలో పెట్టు. దేవుని మందిరం అది ఒకప్పుడు ఉన్న స్థలంలోనే తిరిగి కట్టబడాలి.”+ 16 తర్వాత షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోని దేవుని మందిరానికి పునాదులు వేశాడు;+ అప్పటినుండి ఇప్పటివరకు అది నిర్మాణ దశలోనే ఉంది, ఇంకా పూర్తికాలేదు.’+

17 “రాజా, ఇప్పుడు మీ దృష్టికి సరైనదనిపిస్తే, కోరెషు రాజు యెరూషలేములోని దేవుని మందిరాన్ని తిరిగి కట్టమని ఆజ్ఞ జారీ చేశాడో లేదో తెలుసుకోవడానికి అక్కడ బబులోనులోని రాజు ఖజానాలో తనిఖీ చేయించండి;+ తర్వాత ఈ విషయంపై మీ నిర్ణయాన్ని మాకు తిరిగి పంపండి.”

6 కాబట్టి దర్యావేషు రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. దాంతో బబులోనులో విలువైన వస్తువుల్ని ఉంచే దస్తావేజుల భవనంలో వెదికారు. 2 అప్పుడు మాదీయ సంస్థానంలోని ఎగ్బతానాలో ఉన్న కోటలో ఒక గ్రంథపు చుట్ట దొరికింది. అందులో ఈ సందేశం రాసి ఉంది:

3 “రాజైన కోరెషు తన పరిపాలన మొదటి సంవత్సరంలో, యెరూషలేములోని దేవుని మందిరానికి సంబంధించి ఒక ఆజ్ఞ జారీ చేశాడు:+ ‘వాళ్లు బలులు అర్పించాల్సిన స్థలంగా మందిరాన్ని తిరిగి కట్టాలి. దాని పునాదుల్ని గట్టిగా వేయాలి; దాని ఎత్తు 60 మూరలు,* వెడల్పు 60 మూరలు ఉండాలి.+ 4 దాని గోడల్ని మూడు వరుసల పెద్ద రాళ్లతో, ఒక వరుస దూలాలతో కట్టాలి;+ ఖర్చులు రాజు ఖజానా నుండి చెల్లించాలి.+ 5 అంతేకాదు, నెబుకద్నెజరు యెరూషలేములోని దేవుని ఆలయంలో నుండి బబులోనుకు తీసుకొచ్చిన వెండిబంగారు పాత్రల్ని+ తిరిగిచ్చేయాలి. వాటిని యెరూషలేము ఆలయంలో వాటి స్థలంలో పెట్టాలి. దేవుని మందిరంలో వాటిని పెట్టాలి.’+

6 “కాబట్టి, నది అవతలి ప్రాంతానికి* అధిపతైన తత్తెనై, షెతర్బోజ్నయి, నది అవతలి ప్రాంతానికి కింది స్థాయి అధిపతులైన మీ సహోద్యోగులు+ ఆ స్థలానికి దూరంగా ఉండండి. 7 ఆ దేవుని మందిర పనిలో జోక్యం చేసుకోకండి. యూదుల అధిపతి, యూదుల పెద్దలు ఆ దేవుని మందిరాన్ని అది ఒకప్పుడు ఉన్న చోటే తిరిగి కడతారు. 8 అంతేకాదు, ఆ దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి యూదుల పెద్దల కోసం మీరు ఏమి చేయాలనే దాని గురించి ఈ ఆజ్ఞ జారీ చేస్తున్నాను: వాళ్ల పని ఆగకుండా జరిగేలా,+ ఖర్చులకు కావాల్సినవాటిని వెంటనే ఇస్తూ ఉండాలి. వాటిని రాజు ఖజానా నుండి,+ నది అవతలి ప్రాంతంలో వసూలు చేయబడిన పన్ను నుండి ఇవ్వాలి. 9 అవసరమైన ప్రతీదాన్ని, అంటే పరలోక దేవునికి దహనబలి అర్పించడానికి కావాల్సిన కోడెదూడలు,+ పొట్టేళ్లు,+ గొర్రెపిల్లలు,+ ఇంకా గోధుమలు,+ ఉప్పు,+ ద్రాక్షారసం,+ నూనె+ యెరూషలేములోని యాజకులు అడిగినవి ఏవైనా ప్రతీరోజు వాళ్లకు తప్పకుండా ఇస్తూ ఉండాలి. 10 అప్పుడు వాళ్లు క్రమంగా పరలోక దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉండగలుగుతారు; రాజు క్షేమం కోసం, అతని కుమారుల క్షేమం కోసం ప్రార్థన చేస్తారు.+ 11 నేను జారీ చేసే మరో ఆజ్ఞ ఏమిటంటే, ఎవరైనా ఈ శాసనాన్ని మీరితే అతని ఇంటి దూలం పీకేయబడుతుంది, అతను దానిమీద వేలాడదీయబడతాడు. ఆ వ్యక్తి తప్పు చేసినందువల్ల అతని ఇల్లు బహిరంగ మరుగుదొడ్డిగా* చేయబడుతుంది. 12 ఈ శాసనాన్ని మీరడానికి, యెరూషలేములోని ఆ దేవుని మందిరాన్ని నాశనం చేయడానికి ఏ రాజైనా, ప్రజలైనా చెయ్యి ఎత్తితే, తన పేరును అక్కడ ఉంచిన దేవుడు+ వాళ్లను నాశనం చేయాలి. దర్యావేషు అనే నేను ఈ ఆజ్ఞ జారీ చేస్తున్నాను. ఇది వెంటనే జరగాలి.”

13 అప్పుడు, నది అవతలి ప్రాంతానికి అధిపతైన తత్తెనై, షెతర్బోజ్నయి,+ వాళ్ల సహోద్యోగులు రాజైన దర్యావేషు ఆజ్ఞాపించినదంతా వెంటనే చేశారు. 14 హగ్గయి ప్రవక్త,+ ఇద్దో మనవడైన జెకర్యా+ ప్రవచిస్తూ ప్రోత్సహించడంతో యూదుల పెద్దలు నిర్మాణాన్ని కొనసాగించి, పనిని ముందుకు తీసుకెళ్లారు.+ వాళ్లు ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞ ప్రకారం,+ అలాగే కోరెషు,+ దర్యావేషు, పారసీక రాజైన అర్తహషస్త+ ఆజ్ఞ ప్రకారం నిర్మాణాన్ని పూర్తిచేశారు. 15 వాళ్లు రాజైన దర్యావేషు పరిపాలన ఆరో సంవత్సరంలో అదారు* నెల, మూడో రోజుకల్లా మందిరాన్ని పూర్తిచేశారు.

16 అప్పుడు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు,+ చెర నుండి తిరిగొచ్చిన మిగతావాళ్లు దేవుని మందిరాన్ని సంతోషంగా ప్రతిష్ఠించారు.* 17 వాళ్లు దేవుని మందిర ప్రతిష్ఠాపన కోసం 100 ఎద్దుల్ని, 200 పొట్టేళ్లను, 400 గొర్రెపిల్లల్ని అర్పించారు. అలాగే ఇశ్రాయేలీయులందరి కోసం, ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క ప్రకారం 12 మేకపోతుల్ని పాపపరిహారార్థ బలిగా అర్పించారు.+ 18 మోషే గ్రంథంలో రాసివున్న ప్రకారం,+ వాళ్లు యెరూషలేములోని దేవుని సేవ కోసం యాజకుల్ని, లేవీయుల్ని వాళ్లవాళ్ల విభాగాల చొప్పున+ నియమించారు.

19 చెర నుండి వచ్చినవాళ్లు మొదటి నెల+ 14వ రోజున పస్కాను జరుపుకున్నారు. 20 యాజకులు, లేవీయులు అనే తేడా లేకుండా వాళ్లు తమను తాము శుద్ధి చేసుకున్నారు.+ అలా వాళ్లందరూ శుద్ధులయ్యారు; వాళ్లు చెర నుండి తిరిగొచ్చిన వాళ్లందరి కోసం, తోటి యాజకుల కోసం, తమ కోసం పస్కా బలిని వధించారు. 21 అప్పుడు, చెర నుండి తిరిగొచ్చిన ఇశ్రాయేలీయులు, అలాగే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించడానికి దేశంలోని జనాల అపవిత్రత నుండి తమను తాము శుద్ధి చేసుకుని వాళ్లతో కలిసిన ప్రతీ ఒక్కరు తిన్నారు.+ 22 అంతేకాదు, వాళ్లు ఆనందంగా ఏడురోజులు పులవని రొట్టెల పండుగ+ కూడా చేసుకున్నారు. ఎందుకంటే, యెహోవా వాళ్లకు సంతోషాన్ని ఇచ్చాడు, అలాగే అష్షూరు రాజు హృదయాన్ని వాళ్లకు అనుకూలంగా ఉండేలా చేశాడు.+ దానివల్ల ఇశ్రాయేలు దేవుడైన సత్యదేవుని మందిర పని విషయంలో అతను వాళ్లకు సహాయం చేశాడు.*

7 ఈ సంగతులు జరిగిన తర్వాత, పారసీక రాజైన అర్తహషస్త పరిపాలనలో+ ఎజ్రా*+ తిరిగొచ్చాడు; అతను శెరాయా+ కుమారుడు, శెరాయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కీయా+ కుమారుడు, 2 హిల్కీయా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహీటూబు కుమారుడు, 3 అహీటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా+ మెరాయోతు కుమారుడు, 4 మెరాయోతు జెరహ్యా కుమారుడు, జెరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు, 5 బుక్కీ అబీషూవ కుమారుడు, అబీషూవ ఫీనెహాసు+ కుమారుడు, ఫీనెహాసు ఎలియాజరు+ కుమారుడు, ఎలియాజరు ముఖ్య యాజకుడైన అహరోను+ కుమారుడు. 6 ఈ ఎజ్రా బబులోను నుండి వచ్చాడు. ఇతను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇచ్చిన మోషే ధర్మశాస్త్రంలో ఆరితేరిన శాస్త్రి.*+ అతని దేవుడైన యెహోవా* అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతను కోరిన ప్రతీదాన్ని రాజు ఇచ్చాడు.

7 అర్తహషస్త పరిపాలన ఏడో సంవత్సరంలో కొంతమంది ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు,+ గాయకులు,+ ద్వారపాలకులు,+ ఆలయ సేవకులు*+ యెరూషలేముకు వెళ్లారు. 8 రాజు పరిపాలన ఏడో సంవత్సరం, ఐదో నెలలో ఎజ్రా యెరూషలేముకు వచ్చాడు. 9 అతని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు+ కాబట్టి అతను మొదటి నెల మొదటి రోజున బబులోను నుండి ప్రయాణం మొదలుపెట్టి, ఐదో నెల మొదటి రోజున యెరూషలేముకు చేరుకున్నాడు. 10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించడానికి, దాన్ని పాటించడానికి,+ అందులోని నియమాల్ని, తీర్పుల్ని ఇశ్రాయేలీయులకు బోధించడానికి+ తన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు.*

11 యాజకుడూ, శాస్త్రీ,* అలాగే యెహోవా ఆజ్ఞల్ని, ఇశ్రాయేలీయులకు ఆయన ఇచ్చిన నియమాల్ని అధ్యయనం చేయడంలో ప్రవీణుడూ* అయిన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన లేఖ నకలు ఇది:

12 * “రాజాధిరాజైన అర్తహషస్త,+ యాజకుడూ పరలోక దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రీ* అయిన ఎజ్రాకు రాసేదేమిటంటే: నీకు పరిపూర్ణ శాంతి కలగాలి! ఇప్పుడు 13 నా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్లో, వాళ్ల యాజకుల్లో, లేవీయుల్లో ఎవరైనా నీతో కలిసి యెరూషలేముకు వెళ్లాలనుకుంటే, వాళ్లు వెళ్లొచ్చని నేను ఒక ఆజ్ఞ జారీ చేశాను.+ 14 నీ దగ్గరున్న* మీ దేవుని ధర్మశాస్త్రాన్ని యూదా, యెరూషలేము ప్రజలు పాటిస్తున్నారో లేదో చూడడానికి రాజు, అతని ఏడుగురు సలహాదారులు నిన్ను పంపిస్తున్నారు; 15 అలాగే రాజు, అతని సలహాదారులు యెరూషలేములో నివాసముంటున్న ఇశ్రాయేలు దేవునికి స్వచ్ఛందంగా ఇచ్చిన వెండిబంగారాల్ని తీసుకెళ్లు; 16 బబులోను సంస్థానం అంతటా నీకు దొరికే వెండి, బంగారం అంతటితో పాటు, యెరూషలేములోని తమ దేవుని మందిరానికి ప్రజలు, యాజకులు స్వచ్ఛందంగా ఇచ్చే కానుక+ కూడా తీసుకెళ్లు. 17 నువ్వు ఆ డబ్బుతో ఎద్దుల్ని,+ పొట్టేళ్లను,+ గొర్రెపిల్లల్ని+ వాటితోపాటు అర్పించే ధాన్యార్పణల్ని,+ పానీయార్పణల్ని+ వెంటనే కొనాలి. నువ్వు వాటిని యెరూషలేములోని మీ దేవుని మందిర బలిపీఠం మీద అర్పించాలి.

18 “మిగిలిన వెండిబంగారాలతో మీ దేవుని ఇష్టప్రకారం నీకు, నీ సహోదరులకు ఏది మంచిదనిపిస్తే అది చేయవచ్చు. 19 నీ దేవుని మందిర సేవ కోసం నీకు ఇచ్చిన పాత్రలన్నిటినీ నువ్వు యెరూషలేములోని దేవుని ముందు ఉంచాలి.+ 20 నీ దేవుని మందిరానికి కావాల్సినవి ఇంకేవైనా నువ్వు ఇవ్వాల్సివస్తే వాటిని రాజు ఖజానాలో నుండి తీసుకో.+

21 “అర్తహషస్త రాజు అనే నేను నది అవతలి ప్రాంతంలో* ఉన్న కోశాధికారులందరికీ ఆజ్ఞాపించేదేమిటంటే, యాజకుడూ పరలోక దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రీ* అయిన ఎజ్రా+ మిమ్మల్ని అడిగేవన్నీ వెంటనే ఇవ్వాలి, 22 100 తలాంతుల* వరకు వెండిని, 100 కొర్‌ కొలతల* వరకు గోధుమల్ని, 100 బాత్‌ కొలతల* వరకు ద్రాక్షారసాన్ని,+ 100 బాత్‌ కొలతల వరకు నూనెను,+ విస్తారంగా ఉప్పును+ ఇవ్వాలి. 23 పరలోక దేవుడు ఆజ్ఞాపించిన ప్రతీది ఆయన మందిరం కోసం ఉత్సాహంగా చేయాలి.+ అప్పుడు రాజు రాజ్యం మీదికి, అతని కుమారుల మీదికి పరలోక దేవుని కోపం రాకుండా ఉంటుంది.+ 24 అంతేకాదు యాజకుల్లో, లేవీయుల్లో, సంగీతకారుల్లో,+ ద్వారపాలకుల్లో, ఆలయ సేవకుల్లో,*+ ఈ దేవుని మందిర పని చేసేవాళ్లలో ఎవ్వరి మీదా ఎలాంటి పన్ను గానీ కప్పం గానీ+ సుంకం గానీ విధించకూడదని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

25 “ఎజ్రా, నువ్వు నీ దేవుని నుండి పొందిన తెలివి ప్రకారం, నది అవతలి ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ, అంటే నీ దేవుని నియమాలు తెలిసిన వాళ్లందరికీ తీర్పు తీర్చడానికి వాళ్ల మీద నగర అధికారుల్ని,* న్యాయమూర్తుల్ని నియమించు; ఎవరికైనా ఆ నియమాలు తెలియకపోతే నువ్వు వాళ్లకు బోధించాలి.+ 26 నీ దేవుని ధర్మశాస్త్రాన్ని, రాజు చేసిన చట్టాన్ని పాటించని వాళ్లెవరికైనా వెంటనే తీర్పుతీర్చాలి; అంటే మరణశిక్ష గానీ దేశ బహిష్కరణ గానీ జరిమానా గానీ ఖైదు గానీ విధించాలి.”

27 యెరూషలేములోని యెహోవా మందిరాన్ని అందంగా తీర్చిదిద్దాలనే ఆలోచనను రాజు హృదయంలో పెట్టిన మన పూర్వీకుల దేవుడైన యెహోవా స్తుతించబడాలి!+ 28 ఆయన రాజు ఎదుట, అతని సలహాదారుల+ ఎదుట, అతని గొప్పగొప్ప అధిపతులందరి ఎదుట నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించాడు.+ నా దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను, నాతో పాటు రావడానికి ఇశ్రాయేలులోని నాయకుల్ని* సమకూర్చాను.

8 రాజైన అర్తహషస్త పరిపాలనలో బబులోను నుండి నాతోపాటు బయల్దేరిన పూర్వీకుల కుటుంబాల పెద్దల వంశావళి ఇదే:+ 2 ఫీనెహాసు+ కుమారుల్లో గెర్షోము, ఈతామారు+ కుమారుల్లో దానియేలు, దావీదు కుమారుల్లో హట్టూషు; 3 షెకన్యా కుమారుల్లో, పరోషు కుమారుల్లో జెకర్యా, అతనితోపాటు నమోదైన 150 మంది పురుషులు; 4 పహత్మోయాబు కుమారుల్లో+ జెరహ్యా కుమారుడైన ఎల్యోయేనై, అతనితోపాటు 200 మంది పురుషులు; 5 జత్తూ కుమారుల్లో+ యహజీయేలు కుమారుడైన షెకన్యా, అతనితోపాటు 300 మంది పురుషులు; 6 ఆదీను కుమారుల్లో+ యోనాతాను కుమారుడైన ఎబెదు, అతనితోపాటు 50 మంది పురుషులు; 7 ఏలాము కుమారుల్లో+ అతల్యా కుమారుడైన యెషాయా, అతనితోపాటు 70 మంది పురుషులు; 8 షెఫట్య కుమారుల్లో+ మిఖాయేలు కుమారుడైన జెబద్యా, అతనితోపాటు 80 మంది పురుషులు; 9 యోవాబు కుమారుల్లో యెహీయేలు కుమారుడైన ఓబద్యా, అతనితోపాటు 218 మంది పురుషులు; 10 బానీ కుమారుల్లో యోసిప్యా కుమారుడైన షెలోమీతు, అతనితోపాటు 160 మంది పురుషులు; 11 బేబై కుమారుల్లో+ బేబై కుమారుడైన జెకర్యా, అతనితోపాటు 28 మంది పురుషులు; 12 అజ్గాదు కుమారుల్లో+ హక్కాటాను కుమారుడైన యోహానాను, అతనితోపాటు 110 మంది పురుషులు; 13 అదొనీకాము కుమారుల్లో+ మిగిలినవాళ్లు; వాళ్ల పేర్లు: ఎలీపేలెటు, యెహీయేలు, షెమయా, వాళ్లతోపాటు 60 మంది పురుషులు; 14 బిగ్వయి కుమారుల్లో+ ఊతై, జబ్బూదు, వాళ్లతోపాటు 70 మంది పురుషులు.

15 నేను అహవా వైపు పారే నది దగ్గర వాళ్లను సమకూర్చాను.+ అక్కడ మేము మూడు రోజులు డేరాలు వేసుకొని ఉన్నాం. కానీ నేను ప్రజల్ని, యాజకుల్ని పరిశీలించినప్పుడు లేవీయుల్లో ఒక్కరు కూడా నాకు అక్కడ కనిపించలేదు. 16 అప్పుడు నేను నాయకులైన ఎలీయెజెరును, అరీయేలును, షెమయాను, ఎల్నాతానును, యారీబును, ఎల్నాతానును, నాతానును, జెకర్యాను, మెషుల్లామును, వాళ్లతోపాటు ఉపదేశకులైన యోయారీబును, ఎల్నాతానును పిలిపించాను. 17 నేను కాసిప్యా అనే ప్రాంతంలో ఉన్న నాయకుడైన ఇద్దో విషయంలో వాళ్లకు ఒక ఆజ్ఞ ఇచ్చాను. మన దేవుని మందిరం కోసం పరిచారకుల్ని తీసుకురమ్మని కాసిప్యాలో ఉన్న ఇద్దోకు, ఆలయ సేవకులైన* అతని సహోదరులకు చెప్పమన్నాను. 18 మన దేవుడు మాకు సహాయం చేశాడు కాబట్టి, వాళ్లు షేరేబ్యా అనే తెలివిగల* వ్యక్తిని తీసుకొచ్చారు. అతను మహలి+ కుమారుల్లో ఒకడు. మహలి ఇశ్రాయేలు కుమారుడైన లేవికి మనవడు. షేరేబ్యాతోపాటు+ అతని కుమారుల్ని, అతని సహోదరుల్ని మొత్తం 18 మంది పురుషుల్ని తీసుకొచ్చారు. 19 అలాగే హషబ్యాను, అతనితోపాటు మెరారీయుల్లో+ నుండి యెషాయాను, అతని సహోదరుల్ని, వాళ్ల కుమారుల్ని మొత్తం 20 మంది పురుషుల్ని తీసుకొచ్చారు. 20 వాళ్లతోపాటు, తమ పేర్లు నమోదు చేయబడిన 220 మంది ఆలయ సేవకులు* ఉన్నారు; దావీదు, అధిపతులు లేవీయులకు సహాయం చేయడానికి ఆ ఆలయ సేవకుల్ని ఇచ్చారు.

21 అప్పుడు నేను, మన దేవుని ముందు మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి, మా ప్రయాణం కోసం, మా కోసం, మా పిల్లల కోసం, మా వస్తువులన్నిటి కోసం ఆయన నిర్దేశం కోరడానికి ఉపవాసం ఉందామని అహవా నది దగ్గర ఒక ప్రకటన చేయించాను. 22 “మా దేవుడు తనను వెదికే వాళ్లందరికీ సహాయం చేస్తాడు.+ కానీ తనను విడిచిపెట్టే వాళ్లందరికీ వ్యతిరేకంగా ఆయన తన శక్తిని, కోపాన్ని చూపిస్తాడు”+ అని మేము రాజుతో అన్నాం కాబట్టి దారిలో శత్రువుల నుండి మమ్మల్ని కాపాడడానికి సైనికుల్ని, గుర్రపురౌతుల్ని ఇవ్వమని రాజును అడగడానికి నాకు సిగ్గేసింది. 23 అందుకే ఈ విషయం గురించి మేము ఉపవాసం ఉండి, మన దేవుణ్ణి వేడుకున్నాం. ఆయన మా మొర విన్నాడు.+

24 తర్వాత నేను యాజకుల ప్రధానుల్లో 12 మందిని, అంటే షేరేబ్యాను, హషబ్యాను,+ వాళ్లతోపాటు వాళ్ల పదిమంది సహోదరుల్ని ఎంచుకున్నాను. 25 రాజు, అతని సలహాదారులు, అతని అధిపతులు, ఆ ప్రాంతంలోని ఇశ్రాయేలీయులందరూ మన దేవుని మందిరం కోసం విరాళంగా ఇచ్చిన వెండిబంగారాల్ని, పాత్రల్ని తూచి వాళ్లకు అప్పగించాను.+ 26 అలా నేను 650 తలాంతుల* వెండిని, 2 తలాంతుల బరువున్న 100 వెండి పాత్రల్ని, 100 తలాంతుల బంగారాన్ని తూచి వాళ్ల చేతికి అప్పగించాను. 27 అందులో 1,000 డారిక్‌​ల* విలువగల 20 చిన్న బంగారు గిన్నెలు, ఎర్రగా మెరిసే 2 నాణ్యమైన రాగి పాత్రలు కూడా ఉన్నాయి. ఇవి బంగారమంత అమూల్యమైనవి.

28 నేను వాళ్లతో ఇలా అన్నాను: “మీరు యెహోవాకు ప్రతిష్ఠించబడినవాళ్లు;+ పాత్రలు కూడా ప్రతిష్ఠించబడినవి. వెండిబంగారాలు మీ పూర్వీకుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణ. 29 యెరూషలేములోని యెహోవా మందిర గదుల్లో* యాజకుల-లేవీయుల ప్రధానుల ముందు, ఇశ్రాయేలు పూర్వీకుల కుటుంబాల అధిపతుల ముందు మీరు వాటిని తూచే వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోండి.”+ 30 అప్పుడు యాజకులు, లేవీయులు యెరూషలేములోని మన దేవుని మందిరానికి తీసుకురావడం కోసం తమకు తూచి ఇచ్చిన వెండిబంగారాల్ని, పాత్రల్ని తీసుకున్నారు.

31 చివరికి మేము మొదటి నెల+ 12వ రోజున అహవా నది దగ్గర నుండి యెరూషలేముకు బయల్దేరాం.+ మన దేవుడు మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల్లో నుండి, దారిలో మాటువేసే వాళ్ల నుండి మమ్మల్ని కాపాడాడు. 32 మేము యెరూషలేముకు వచ్చి+ అక్కడ మూడు రోజులు ఉన్నాం. 33 నాలుగో రోజున మన దేవుని మందిరంలో మేము వెండిబంగారాల్ని, పాత్రల్ని తూచి+ యాజకుడైన ఊరియా కుమారుడు మెరేమోతుకు+ అప్పగించాం. ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు అతనితో ఉన్నాడు. వాళ్లతోపాటు లేవీయులైన యేషూవ కుమారుడు యోజాబాదు,+ బిన్నూయి+ కుమారుడు నోవద్యా ఉన్నారు. 34 అన్నిటినీ లెక్కపెట్టి, తూచి, వాటి మొత్తం బరువెంతో రాశారు. 35 చెర నుండి వచ్చినవాళ్లు, అంటే అంతకుముందు చెరలో ఉన్నవాళ్లు ఇశ్రాయేలు దేవునికి దహనబలులు అర్పించారు. ఇశ్రాయేలీయులందరి కోసం 12 ఎద్దుల్ని,+ 96 పొట్టేళ్లను,+ 77 మగ గొర్రెపిల్లల్ని, పాపపరిహారార్థ బలిగా 12 మేకపోతుల్ని+ అర్పించారు; ఇదంతా యెహోవాకు దహనబలి.+

36 తర్వాత మేము రాజు ఆదేశాల్ని+ రాజు ప్రాంత పాలకులకు,* నది+ అవతలి ప్రాంత* అధిపతులకు అందించాం. వాళ్లు ప్రజలకు, సత్యదేవుని మందిరానికి మద్దతు ఇచ్చారు.+

9 ఈ విషయాలు జరిగిన వెంటనే అధిపతులు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: “ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు, లేవీయులు చుట్టుపక్కల దేశాల ప్రజల నుండి, అంటే కనానీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, యెబూసీయుల, అమ్మోనీయుల, మోయాబీయుల, ఐగుప్తీయుల,+ అమోరీయుల+ నుండి, వాళ్ల అసహ్యమైన ఆచారాల నుండి తమను తాము వేరుపర్చుకోలేదు.+ 2 వాళ్లూ, వాళ్ల కుమారులూ ఆ దేశాల స్త్రీలలో కొంతమందిని పెళ్లి చేసుకున్నారు.+ ఇప్పుడు వాళ్లు, అంటే పవిత్రమైన ప్రజలు*+ చుట్టుపక్కల దేశాల ప్రజలతో కలిసిపోయారు.+ ఈ పాపంలో ముఖ్యమైన దోషులు అధిపతులు, ఉప పాలకులే.”

3 ఇది విన్న వెంటనే నేను నా వస్త్రాన్ని, చేతుల్లేని నిలువుటంగీని చింపుకుని, నా జుట్టును, గడ్డాన్ని పీక్కుని, దిగ్భ్రాంతికి లోనై కూర్చుండిపోయాను. 4 అప్పుడు ఇశ్రాయేలు దేవుని మాటల మీద భయభక్తులున్న వాళ్లందరూ చెర నుండి తిరిగొచ్చిన వాళ్ల పాపాన్ని బట్టి నా చుట్టూ చేరారు. సాయంకాల ధాన్యార్పణ+ అర్పించే సమయం వరకు నేను దిగ్భ్రాంతికి లోనై అలాగే కూర్చుండిపోయాను.

5 సాయంకాల ధాన్యార్పణ+ అర్పించే సమయంలో, చిరిగిపోయిన బట్టలతో బాధపడుతూ కూర్చున్న నేను ఆ చోటు నుండి లేచాను. నేను మోకాళ్లూని నా దేవుడైన యెహోవా వైపు చేతులు చాపి, 6 ఇలా అన్నాను: “నా దేవా, నీ వైపు ముఖం ఎత్తాలంటే నాకు సిగ్గుగా, ఇబ్బందిగా ఉంది. నా దేవా, మేము ఎన్నో పాపాలు చేశాం. మా అపరాధం ఆకాశాన్నంటింది.+ 7 మా పూర్వీకుల రోజుల నుండి నేటివరకు మేము ఎన్నో అపరాధాలు చేశాం;+ మా దోషాల్ని బట్టి నువ్వు మమ్మల్ని, మా రాజుల్ని, మా యాజకుల్ని వేరే దేశాల రాజుల చేతికి అప్పగించావు; మేము కత్తితో చంపబడ్డాం,+ చెరగా తీసుకెళ్లబడ్డాం,+ దోచుకోబడ్డాం,+ అవమానాలపాలయ్యాం. ఇప్పుడు మేము అదే పరిస్థితిలో ఉన్నాం.+ 8 కానీ మా దేవా, యెహోవా, నువ్వు మిగిలినవాళ్లను తిరిగిరానిచ్చి, నీ పవిత్ర స్థలంలో మాకు సురక్షితమైన స్థానాన్నిచ్చి ఇప్పుడు క్షణకాలం మా మీద అనుగ్రహం చూపించావు;+ మా దేవా, అలా నువ్వు మా కళ్లు ప్రకాశించేలా, మా దాసత్వంలో మేము కాస్త తేరుకునేలా చేశావు. 9 మేము దాసులమే+ అయినా, మా దేవుడివైన నువ్వు మమ్మల్ని మా దాసత్వంలో విడిచిపెట్టేయలేదు; మేము తేరుకుని మా దేవుని మందిరాన్ని తిరిగి కట్టేలా,+ దాని శిథిలాల్ని బాగుచేసేలా, అలాగే యూదా, యెరూషలేములో మాకు రక్షణ గోడ* ఉండేలా నువ్వు పారసీక రాజుల ముందు మామీద నీ విశ్వసనీయ ప్రేమ చూపించావు.+

10 “అయితే మా దేవా, ఇదంతా జరిగాక ఇప్పుడు మేము ఏమి అనగలం? మేము నీ ఆజ్ఞల్ని విడిచిపెట్టాం. 11 నువ్వు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా వాటిని ఇస్తూ ఇలా అన్నావు: ‘మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం, ఆ దేశాల ప్రజల అశుద్ధతను బట్టి, వాళ్ల అసహ్యమైన ఆచారాల్ని బట్టి అశుద్ధమైపోయింది. వాళ్లు దాన్ని ఈ చివర నుండి ఆ చివర వరకు తమ అపవిత్రతతో నింపేశారు.+ 12 కాబట్టి, మీ కూతుళ్లను వాళ్ల కుమారులకు ఇవ్వకండి. వాళ్ల కూతుళ్లను మీ కుమారుల కోసం తీసుకోకండి;+ వాళ్ల శాంతి కోసం, శ్రేయస్సు కోసం మీరు ఎప్పటికీ పాటుపడకూడదు.+ అప్పుడు మీరు బలంగా తయారై, దేశంలోని మంచివాటిని తిని, మీ కుమారులకు దాన్ని శాశ్వత ఆస్తిగా ఇవ్వగలుగుతారు.’ 13 మా చెడ్డపనుల్ని బట్టి, మా గొప్ప దోషాన్ని బట్టి ఇదంతా మాకు జరిగింది. కానీ మా దేవా, నువ్వైతే మా తప్పులకు తగినట్టు మమ్మల్ని శిక్షించలేదు,+ బదులుగా ఇక్కడున్న మమ్మల్ని తిరిగి రానిచ్చావు.+ 14 మేము మళ్లీ నీ ఆజ్ఞల్ని మీరి, ఈ అసహ్యమైన పనులు చేసే ప్రజలతో పెళ్లి సంబంధాలు+ కుదుర్చుకుంటామా? అలాచేస్తే, మాలో ఎవ్వరూ మిగలకుండా, తప్పించుకోకుండా మమ్మల్ని పూర్తిగా నాశనం చేసేంతగా నీకు కోపం రాదా? 15 ఇశ్రాయేలు దేవా, యెహోవా, నువ్వు నీతిమంతుడివి.+ అందుకే నేటివరకు మాలో కొందరు ఇంకా మిగిలివున్నారు. ఇప్పుడు మేము మా అపరాధంతో నీ ముందు ఉన్నాం. ఇంత జరిగిన తర్వాత నీ ముందు నిలబడే అర్హత మాలో ఎవ్వరికీ లేదు.”+

10 ఎజ్రా సత్యదేవుని మందిరం ముందు ప్రార్థిస్తూ,+ పాపాల్ని ఒప్పుకుంటూ, ఏడుస్తూ, సాష్టాంగపడుతుండగా, ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, పిల్లలు పెద్ద గుంపుగా అతని చుట్టూ చేరారు. ప్రజలు కూడా విపరీతంగా ఏడుస్తున్నారు. 2 అప్పుడు ఏలాము+ కుమారుల్లో ఒకడైన యెహీయేలు+ కుమారుడు షెకన్యా ఎజ్రాతో ఇలా అన్నాడు: “మేము చుట్టుపక్కల దేశాల స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవునికి నమ్మకద్రోహం చేశాం.+ అయినా ఇశ్రాయేలీయులకు ఇంకా ఆశ మిగిలేవుంది. 3 ఇప్పుడు మనం యెహోవా నిర్దేశం ప్రకారం, మన దేవుని ఆజ్ఞల పట్ల భయభక్తులున్న వాళ్ల నిర్దేశం ప్రకారం,+ ఈ భార్యలందర్నీ, వాళ్లకు పుట్టిన పిల్లల్ని పంపించేలా మన దేవునితో ఒక ఒప్పందం* చేసుకుందాం.+ మనం ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుందాం. 4 లే, ఈ బాధ్యత నీది; మేము నీకు మద్దతిస్తాం. ధైర్యంగా ఉండి చర్య తీసుకో.”

5 అప్పుడు ఎజ్రా లేచి, ఆ మాట ప్రకారం చేసేలా యాజకుల, లేవీయుల, ఇశ్రాయేలీయులందరి ప్రధానులతో ఒట్టు వేయించాడు.+ వాళ్లు ఒట్టేశారు. 6 తర్వాత ఎజ్రా సత్యదేవుని మందిరం ముందు నుండి లేచి, ఎల్యాషీబు కుమారుడైన యెహోహానాను గదిలోకి* వెళ్లాడు. ఎజ్రా అక్కడికి వెళ్లినా ఆహారం తినలేదు, నీళ్లు తాగలేదు. ఎందుకంటే చెర నుండి తిరిగొచ్చిన ప్రజల నమ్మకద్రోహాన్ని బట్టి అతను దుఃఖిస్తూనే ఉన్నాడు.+

7 తర్వాత వాళ్లు, చెర నుండి తిరిగొచ్చిన వాళ్లంతా యెరూషలేములో సమావేశమవ్వాలని యూదా అంతటా, అలాగే యెరూషలేములో ఒక ప్రకటన చేయించారు; 8 అధిపతుల, పెద్దల నిర్ణయం ప్రకారం ఎవరైనా మూడు రోజుల్లో రాకపోతే, ఆ వ్యక్తి వస్తువులన్నీ స్వాధీనం చేసుకోబడతాయి;* చెర నుండి తిరిగొచ్చినవాళ్ల సమాజం నుండి అతను వెలివేయబడతాడు.+ 9 కాబట్టి యూదా, బెన్యామీను పురుషులందరూ మూడు రోజుల్లో, అంటే తొమ్మిదో నెల, 20వ రోజున యెరూషలేములో సమావేశమయ్యారు. ప్రజలందరూ సత్యదేవుని మందిర ప్రాంగణంలో కూర్చున్నారు; పరిస్థితి ప్రాముఖ్యతను బట్టి, భారీ వర్షాన్ని బట్టి వాళ్లు వణికిపోతున్నారు.

10 అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వాళ్లతో ఇలా అన్నాడు: “విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకుని+ మీరు నమ్మకద్రోహం చేశారు. అలా మీరు ఇశ్రాయేలీయుల అపరాధాన్ని పెంచారు. 11 ఇప్పుడు మీ పూర్వీకుల దేవుడైన యెహోవా ముందు మీ పాపాన్ని ఒప్పుకుని, ఆయన ఇష్టప్రకారం నడుచుకోండి. చుట్టుపక్కల దేశాల ప్రజల నుండి, ఈ విదేశీ భార్యల నుండి మిమ్మల్ని మీరు వేరుపర్చుకోండి.”+ 12 దానికి అక్కడ సమావేశమైన వాళ్లందరూ బిగ్గరగా ఇలా జవాబిచ్చారు: “నువ్వు చెప్పినట్టు చేయడం మా బాధ్యత. 13 అయితే ప్రజలు చాలామంది ఉన్నారు, అంతేకాదు ఇది వర్షాకాలం. కాబట్టి బయట నిలబడివుండడం సాధ్యం కాదు. పైగా ఇది ఒకట్రెండు రోజుల్లో పూర్తయ్యే పని కాదు. ఎందుకంటే ఈ విషయంలో పాపం చేసినవాళ్లు మాలో చాలామంది ఉన్నారు. 14 కాబట్టి దయచేసి సమాజమంతటి తరఫున మా అధిపతుల్ని ప్రాతినిధ్యం వహించనివ్వండి;+ ఈ విషయంలో మా దేవుని తీవ్రమైన కోపం మా మీద నుండి తొలగిపోయేలా, మా నగరాల్లో విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్లందరూ ఆయా నగరాల పెద్దలతో, న్యాయమూర్తులతో పాటు ఫలానా సమయానికి రావాలి.”

15 అయితే అశాహేలు కుమారుడైన యోనాతాను, తిక్వా కుమారుడైన యహజ్యా దీనికి అభ్యంతరం చెప్పారు. లేవీయులైన మెషుల్లాము, షబ్బెతై+ వాళ్లకు మద్దతు ఇచ్చారు. 16 కానీ చెర నుండి తిరిగొచ్చినవాళ్లు మాత్రం ముందు నిర్ణయించబడినట్టే చేశారు; యాజకుడైన ఎజ్రా, అలాగే పేర్లు నమోదు చేయబడిన పూర్వీకుల కుటుంబాల పెద్దలందరూ విషయాన్ని పరిశీలించడానికి పదో నెల, మొదటి రోజున వేరుగా సమావేశమయ్యారు; 17 వాళ్లు, మొదటి నెల మొదటి రోజుకల్లా విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్న పురుషులందరి సంగతి పరిశీలించారు. 18 యాజకుల కుమారుల్లో కొంతమంది విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్నట్టు తేలింది.+ వాళ్లెవరంటే: యేషూవ+ కుమారుల్లో యెహోజాదాకు కుమారుడు, అతని సహోదరులైన మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా. 19 అయితే వాళ్లు తమ భార్యల్ని పంపించేస్తామని మాటిచ్చారు. వాళ్లు అపరాధులు కాబట్టి తమ అపరాధం కోసం మంద నుండి ఒక పొట్టేలును అర్పిస్తారు.+

20 పాపం చేసిన మిగతావాళ్లు ఎవరంటే: ఇమ్మేరు+ కుమారుల్లో హనానీ, జెబద్యా; 21 హారీము+ కుమారుల్లో మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా. 22 పషూరు కుమారుల్లో+ ఎల్యోయేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎలాశా. 23 లేవీయుల్లో: యోజాబాదు, షిమీ, కెలాయా (అంటే కెలిథా), పెతహయా, యూదా, ఎలీయెజెరు; 24 గాయకుల్లో: ఎల్యాషీబు, ద్వారపాలకుల్లో షల్లూము, తెలెము, ఊరి.

25 ఇశ్రాయేలీయుల్లో: పరోషు కుమారుల్లో+ రమ్యా, యిజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియాజరు, మల్కీయా, బెనాయా; 26 ఏలాము కుమారుల్లో+ మత్తన్యా, జెకర్యా, యెహీయేలు,+ అబ్దీ, యెరేమోతు, ఏలీయా; 27 జత్తూ కుమారుల్లో+ ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా; 28 బేబై కుమారుల్లో+ యెహోహానాను, హనన్యా, జబ్బయి, అత్లాయి; 29 బానీ కుమారుల్లో మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షెయాలు, యెరేమోతు; 30 పహత్మోయాబు కుమారుల్లో+ అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే; 31 హారీము కుమారుల్లో+ ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా,+ షెమయా, షిమ్యోను, 32 బెన్యామీను, మల్లూకు, షెమర్యా; 33 హాషుము+ కుమారుల్లో మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీపేలెటు, యెరేమై, మనష్షే, షిమీ; 34 బానీ కుమారుల్లో మాదై, అమ్రాము, ఊయేలు, 35 బెనాయా, బేదయా, కెలూహు, 36 వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు, 37 మత్తన్యా, మత్తెనై, యహశావు; 38 బిన్నూయి కుమారుల్లో షిమీ, 39 షెలెమ్యా, నాతాను, అదాయా, 40 మక్నద్బయి, షాషయి, షారాయి, 41 అజరేలు, షెలెమ్యా, షెమర్యా, 42 షల్లూము, అమర్యా, యోసేపు; 43 నెబో కుమారుల్లో యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా. 44 వీళ్లందరూ విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్నవాళ్లు;+ వీళ్లు తమ భార్యల్ని వాళ్ల పిల్లలతో సహా పంపించేశారు.+

లేదా “పర్షియా.”

లేదా “ఆయన యెరూషలేములో ఉన్నాడు” అయ్యుంటుంది.

అక్ష., “వాళ్ల చేతుల్ని బలపర్చారు.”

ఎజ్రా 2:2; 3:8లో ఉన్న జెరుబ్బాబెలు ఇతనే కావచ్చు.

హగ్గయి 1:1; జెకర్యా 3:1లో ఉన్న “యెహోషువ” ఇతనే.

లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”

లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”

లేదా “అపవిత్రులు అవ్వడంవల్ల యాజకత్వం నుండి తొలగించబడ్డారు.”

లేదా “తిర్షాతా,” సంస్థాన అధిపతికి ఉపయోగించే ఒక పారసీక బిరుదు.

లేదా “నిలబెట్టడం.”

8.4 గ్రాముల పారసీక బంగారు డారిక్‌తో సమానమని భావించబడుతోంది. ఇది గ్రీకు లేఖనాల్లో ఉన్న డ్రక్మా కాదు. అనుబంధం B14 చూడండి.

హీబ్రూ లేఖనాల్లో ఒక మినా 570 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”

అక్ష., “ఇశ్రాయేలు కుమారులు.”

లేదా “తాత్కాలిక ఆశ్రయాల.”

అక్ష., “చేతుల్ని బలహీనపరుస్తూ.”

లేదా “అది అరామిక్‌​లో రాయబడి, తర్వాత అనువదించబడింది” అయ్యుంటుంది.

ఎజ్రా 4:8 నుండి 6:18 వరకు మొదట్లో అరామిక్‌​లో రాయబడింది.

ఇది యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న ప్రాంతాల్ని సూచిస్తుంది.

లేదా “రాజభవనం.”

లేదా “ప్రాంతంలో మీకు భాగం.”

లేదా “అనువదించబడి చదవబడింది” అయ్యుంటుంది.

ఇది యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న ప్రాంతాల్ని సూచిస్తుంది.

ఎజ్రా 2:2; 3:8లో ఉన్న జెరుబ్బాబెలు ఇతనే కావచ్చు.

దాదాపు 26.7 మీటర్లు (87.6 అడుగులు). అనుబంధం B14 చూడండి.

ఇది యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న ప్రాంతాల్ని సూచిస్తుంది.

లేదా “చెత్త కుప్పగా; పెంట కుప్పగా” అయ్యుంటుంది.

అనుబంధం B15 చూడండి.

లేదా “సమర్పించారు.”

అక్ష., “వాళ్ల చేతుల్ని బలపర్చాడు.”

“సహాయం” అని అర్థం.

లేదా “నకలు రాసే వ్యక్తి.”

అక్ష., “యెహోవా చెయ్యి.”

లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”

లేదా “తన హృదయంలో తీర్మానించుకున్నాడు.”

లేదా “నకలు రాసే వ్యక్తీ.”

లేదా “నకలు రాసే వ్యక్తీ.”

ఎజ్రా 7:12 నుండి 7:26 వరకు మొదట్లో అరామిక్‌​లో రాయబడింది.

లేదా “నకలు రాసే వ్యక్తీ.”

అక్ష., “నీ చేతిలో ఉన్న.”

ఇది యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న ప్రాంతాల్ని సూచిస్తుంది.

లేదా “నకలు రాసే వ్యక్తీ.”

అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.

అప్పట్లో ఒక కొర్‌ 220 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.

అప్పట్లో ఒక బాత్‌ 22 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.

లేదా “నెతీనీయుల్లో.” అక్ష., “ఇవ్వబడినవాళ్లలో.”

పదకోశం చూడండి.

అక్ష., “పెద్దల్ని.”

లేదా “నెతీనీయులైన.” అక్ష., “ఇవ్వబడినవాళ్లయిన.”

లేదా “బుద్ధిగల.”

లేదా “నెతీనీయులు.” అక్ష., “ఇవ్వబడినవాళ్లు.”

అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.

డారిక్‌ ఒక పారసీక బంగారు నాణెం. అనుబంధం B14 చూడండి.

లేదా “భోజనశాలల్లో.”

మూలపాఠంలో, “రాజ్య సంరక్షకులు” అనే అర్థం ఉన్న పారసీక బిరుదును ఉపయోగించారు. ఇక్కడ అది పారసీక సామ్రాజ్యంలోని సంస్థాన అధిపతుల్ని సూచిస్తుంది.

ఇది యూఫ్రటీసు నదికి పడమటి వైపున్న ప్రాంతాల్ని సూచిస్తుంది.

అక్ష., “పవిత్రమైన విత్తనం.”

లేదా “రాతి గోడ.”

లేదా “నిబంధన.”

లేదా “భోజనశాలలోకి.”

లేదా “నిషేధించబడతాయి.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి